నిరీక్షణ

సాయంసమయం సంధ్యారాగం పాడుతోంది. మొహాన ఎరుపద్దుకున్న సూరీడు జారిపోతూ పెట్టిన ముద్దుకి వీడ్కోలు చెబుతున్న ఆకాశం బుగ్గలు ఎరుపెక్కి కెంజాయ అలుముకుంటూ ఉంది. వడివడిగా పడుతున్న అడుగులు విరహాన్ని తట్టుకోలేని గుండెకి సర్దిచెప్పుకుంటోంది. పొన్నచెట్టుకింద ఎదురుచూస్తూ నిల్చున్న నువ్వు రెప్పవాల్చిన క్షణంలో కనిపించి అంతలో మాయమైపోతున్నావు. నిన్నందుకోవాలన్న తపనలో ఉఛ్వాసనిశ్వాసాలకు తేడాలేకుండా చాతీ ఎగిసిపడుతోంది. ఎంతదూరం నీకోసం పరిగెత్తానో వెనక్కితిరిగి చూసుకునేందుకు కూడా మనస్కరించడంలేదు.

ఎక్కడ ఉన్నావో కూడా తెలీని నీకోసం ఎదుటే ఉన్నట్టు ఊహించుకుని తపనపడిపోతున్న మనస్సుకి ఎలాచెప్తే అర్థంచేసుకుంటుందో తెలియక సతమతమయ్యే క్షణంలో నాబాధ ఎవరికి అర్థమయ్యేను? నీకుతప్ప. అసలా బాధలో ఉండే ఆనందం ఎంత తృప్తినిస్తుందో ఎవరికి తెలిసేను? నాకుతప్ప. ఆకలయికలో కలిగే పరవశపు అనుభూతులెవరు పొందేరు?మనం తప్ప. ఆదృశ్యాన్ని కళ్లముందు సాక్షాత్కరింపజేసుకున్న తక్షణం లాగివదిలినబాణంలా ఒక్కసారిగా ఒళ్ళువిరుచుకుని ముందుగు వందరెట్లవేగంతో, వెయ్యిరెట్ల విశ్వాసంతో నీవైపుసాగే నాకు బలమెక్కడిది? నమ్మకమెక్కడిది? అని అడుగుతున్న లోకానికి నువ్వున్న దిక్కువైపు చూపినప్పుడు వాటిగొంతుమూగబోయిన క్షణం నేను ఈప్రపంచాన్ని గెలిచేరోజు ఎంతోదూరంలో ఉండబోదన్న వాస్తవం అర్థమైంది.

ఒక్కక్షణం..నాకళ్లను నేనేనమ్మలేని ఒక్కక్షణం. గుండెబరువు దిగిపోయింది. ఇంతకాలం మనసుతో వేళాకోళం చేస్తున్న మస్తిష్కం ఓటమినొప్పుకుంది. వెళ్తూవెళ్తూ చివరిగా కొండలతో పరాచికాలాడుతున్న సూర్యుడు మనవైపే కళ్లప్పగించి చూస్తున్నాడు. ఒకవైపు నువ్వు. మరోవైపు ఇంతకాలం నీరూపాన్ని ఊహించుకుంటూ ఊసులాడుకున్న సంధ్య. మద్యన నేను. ఇన్నేళ్ళుగా నేపంచుకున్న మాటలన్నీ నీతో పూసగుచ్చినట్టు చెప్పిన తనకి కళ్ళతోనే కృతజ్ఞతలు చెప్పుకున్నా. ఒక్కక్షణం నాలో పొంగిన ఆవేశాన్ని అణూచుకోలేక నీపైకి ఉరికిన ఉరుకులో 'నాది‌' అన్న అహమే తప్ప మరేంలేదన్నది మనకు మాత్రమే తెలిసిన సత్యం. అలా బిగుసుకున్న మనిద్దరి మద్యనా ఊపిరాడని సంధ్య ఇకనావల్ల కాదంటూ విదిలించుకుని సిగ్గుతో మొహాన్నిదాచుకుంటూ చీకటిలోకి వెళ్ళిపోయింది.

నీతో చెప్పుకోవాలనుకున్న ఎన్నోసంగతులు గుర్తుకురాక, గుర్తొచ్చినవాటిని చెప్పడానికి భాషచాలక మూగవాడినైన క్షణంలో వినిపించిన నీగుండెచప్పుడు నన్ను ఉక్కిరిబిక్కిరి చేసేసింది. కళ్లను గుండెపై ఆన్చినప్పుడు నీకనురెప్పలు పదులసంఖ్యలో దింపిన మన్మధబాణాలు నన్ను అచేతనుణ్ణి చేశాయి. మన్మధుడి అమ్ములపొదిలో ఐదుబాణాలైతే నీదగ్గర అంతకన్నా పదునైనఆయుధాలు ఎక్కడినుంచి వచ్చాయి? రతీదేవి ఇచ్చిందా? లేక నువ్వే రతీదేవివా? అంతమెత్తటి చురకత్తులకి నాగుండెని కోసేంత పదునుందని ఊహించలేకపోయాను. ఆక్షణంలో హృదయంపైన నీకళ్ళు పులిమిన కాటుకమరక పుట్టుమచ్చలా ఎప్పటికీ నిలిచిపోవాలని కోరుకున్న క్షణంలో అనిపించింది "నీకళ్ళలో కాటుకనైపోతే?" అవును. అంతకన్నా ఆనందమేముంది? నాకంతకన్నా హోదా ఏముంది? నీకోసం నేనుచెయ్యగలిగింది అంతకన్నా ఏముంది?

అరచేతుల్తో నీముఖాన్ని పట్టుకుని నెమ్మదిగా పైకెత్తుతున్నాను. నీకళ్ళు కనిపించిన క్షణంలో కాటుకనైపోదామని తపిస్తున్నాను. అలా నీకళ్ళు చూసిన క్షణంలో ఈసృష్టిలోనే అత్యంత అపురూపమైన దృశ్యాన్ని చూశాను. నీకంటి చివర సన్నగా మెరుస్తూ, గురుత్వబలాన్ని ధిక్కరిస్తూ, ఉబికివస్తున్న ఉద్వేగాన్ని ఆపుకుంటూ, నేను నీతోడున్నానన్న దర్పాన్ని ప్రదర్శిస్తూ ఒక్కనీటిచుక్క. ఆల్చిప్పలో ముత్యాలుగా మారామని మురిసిపోతున్న కోట్లకొద్దీ నీటిచుక్కలకి ఆక్షణంలో అవికోల్పోయిన రాచపదవి ఎంతగొప్పదో అర్థమైంది. నేనిప్పుడూ కోహినూర్ అన్నభావాన్ని ప్రదర్శిస్తున్న ఆరాచబిందువును నెమ్మదిగా తీసుకుని నాకళ్ళలో వేసుకున్నా. అలానీకళ్లలోకే చూసుకుంటూ ఉండగా పెదవులు ముడిపడ్డక్షణంలో, నాఉచ్వాసానికి నీనిశ్వాసం నీఉచ్వాసానికి నానిశ్వాసం తోడైనిలిచి ఇద్దరిశ్వాస ఒకటైనప్పుడు కల్గినతృప్తి అమ్మపాలు తాగినప్పుడు అనుభవించానేమో?

కాటుకమరక. నీటిచుక్క. ఈజన్మకి లభించిన అపురూప బహుమతులని తనివితీరా ఆస్వాదిస్తూ తన్మయత్వంలో మూసినకళ్లను ఎప్పుడు తెరిచానో తెలీదు. చుట్టూ చీకటి. నీతోగడిపిన క్షణాలన్నీ నీకళ్లను చూసేందుకే సరిపోయింది. అంతలో మాయమైపోయావు. మరునాడు నీవదనాన్ని, శరీరాన్ని వర్ణించమని అడిగితే తనుకూడా కళ్లను తప్పమరేమీ చూడలేదని సంధ్యచెప్పింది. దిక్కులు పిక్కటిల్లేలా అరుద్దామన్నా ఒంట్లో ఆవహిమ్చిన నిస్సత్తువ ఆప్రయత్నాన్ని విరమింపజేసింది
.
ఎక్కడున్నావో? నాదగ్గరికి ఎప్పుడొస్తావో? తెలీని నీతో చెప్పాలనుకున్న మాటలు సంధ్యతో పంచుకుంటూన్నా.
నాకు దూరంగా ఎన్నాళ్ళుంటావు? మనిద్దరం కలిసి నడవాల్సిన దూరాలు, జవాబు చెప్పాల్సిన ప్రశ్నలు, ఎదిరించాల్సిన పరిమితులు, చేదించాల్సిన లక్ష్యాలు మనకోసం ఎదురుచూస్తున్నాయి. నువ్వు నాపక్కనుండు. ప్రపంచమంతా ఇన్నేళ్ళనుంచి నమ్ముతూ వస్తున్న సిద్ధాంతాల్ని అభూతకల్పనలని. కాలాన్ని స్థంబింపజేచే శక్తి మనిషికుందని నిరూపిస్తా. శిశరాన్ని వసంతంగా మార్చడమెలానో చేసిచూపిస్తా. మనసు మస్తిష్కానికన్నా బలమైనదని ప్రకటిస్తా. నమ్మకానికి మించిన బలం, ఎదురుచూపులకు మించిన ఆనందం లేదని ప్రపంచానికి చాటిచెపుతా. ఇంకా ఎందుకీ దాగుడుమూతలు. వచ్చి నాఅరచేతుల్లో నీముఖాన్ని దాచేసుకో. నీకంటికాటుకను గుండెలపై దిద్దేసుకో.

శరత్‌ చంద్రికోత్సవం


వినాయక చవితిరోజు సాయంత్రం తర్వాత పండగ ఏవిటా అని డౌటొచ్చి కేలెండర్ చూస్తే దసరా అని కనిపించింది. దాన్ని చూడ్డంతోనే గుర్తొచ్చిన మరొకపండగ మనసులో ఉత్సాహాన్ని నింపింది. చూస్తుండగానే రోజులలా దొర్లుకుంటూ దుర్గాష్టమి వాకిటనిలబడ్డాయి. మూడురోజులు టౌన్షిప్లో కాళీపూజ,  రామలీల, మేళాలతో గడిచిపోయింది. ఇక ఏకాదశిరోజునుంచి కౌంట్‌డౌన్ మొదలెట్టి 4,3,2,1 అనుకుంటూ పున్నమికి చేరుకున్నా.


సంవత్సరంలో వచ్చే డజను పున్నముల్లో ఇదినాకు ప్రత్యేకం. విజయదశమి తర్వాతవచ్చే పున్నమిరోజు రాత్రి మాశివాలయంలో శరత్‌చంద్రికోత్సవం జరుగుతుంది. పదిహేనేళ్ళక్రితం ఉస్తాద్ బిస్మిల్లాఖాన్ షెహనాయ్‌తో మొదలయిన ఈకార్యక్రమానికి అప్పట్లో పేరేమి పెట్టలేదట. అలా మూడేళ్ళు గడిచాక నిర్వహణాబృందానికి శక్తి సంగీతకళా పరిషత్ అన్నపేరు, జరిగేఉత్సవానికి  శరత్‌చంద్రికోత్సవం అన్నపేరు నిర్ణయించారు. అప్పట్నుంచి క్రమంతప్పకుండా ప్రతియేడూ నిర్వహిస్తున్నారు. ఏటేటా అభిమానులు పెరుగుతున్నారు.గతేడాది ఎలాజరిగిందో రాశాను. అప్పటిలానే ఈసారీ మూడువారాల వరకు రాయడానికి కుదర్లేదు. అప్పట్లానే ఈసారీ ఓఅరగంట ఆలశ్యంగా వెళ్ళాను. ఆరాత్రిలాగానే ఈసారీ అదే ఆనందం, అనుభూతి సొంతం చేసుకున్నాను.

ఇక ఈసారి కార్యక్రమాల విషయాల్లోకి వెళ్తే-
ప్రముఖ సంతూర్ విద్వాంసుడు పండిట్ శివకుమార్ శర్మవంటి పెద్దతలకాయల డేట్లు కుదరకపోవటంతో నిర్వాహకుడు సత్యనారాయణ పాండేగారు ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్న కళాకారులని తీసుకొచ్చారు.
 

గౌహతీవాసుడయిన విద్యుత్‌మిశ్రా వయోలిన్, డిల్లీవాసి సుధీర్‌పాండే తబలా జుగల్బందీతో కార్యక్రమం మొదలయ్యింది. దాదాపు గంటన్నర సాగిన ఈకార్యక్రమంలో చివరి పదినిముషాలు మాత్రమే చూడగలిగాను.

హిందుస్తానీగాయని కల్పనా ఝుకార్కర్- సంతోష్‌మిశ్రా (సారంగి), పుండలీక భగవత్ (తబలా) మరియు భయ్యన్‌జీ (హార్మోనియం) బృందంతో భాగేశ్వరీరాగంలో కచ్చేరీని మొదలుపెట్టింది. తరువాత కళావతిరాగంలో కృష్ణున్ని స్మరిస్తూ సాగినకీర్తన ఓపదిహేను నిమషాలు సాగింది. (గమనిక: పాడేముందు ఆవిడ రాగాలపేర్లు, సంగతులు వగైరా చెప్పింది కాబట్టే నేనురాయగల్గుతున్నా. అంతకు మించి మనకు సీన్ లేదు.) ఈకీర్తన చివరికి వచ్చేసరికే మనసు జరుగుతున్న కచ్చేరితో శృతికలిపింది.అప్పటిదాకా ఉన్న చిన్నచిన్న అలజడులు దూరమయ్యాయి. 

ఆతర్వాత తుమరీ అనే ప్రక్రియలో 'కొమలియా మన్‌కర్ పుకార్‌'అనే కీర్తన పాడింది. సంగీతానికన్నా సాహిత్యానికి పెద్దపీట వెయ్యటం ఈప్రక్రియకున్న ప్రత్యేక లక్షణం. ఆతర్వాత ఝూలా అనేపద్దతిలో ఇంకోకీర్తనపాడేటప్పుడు మనసు ఉరకలేసింది. బాలాజీపంచరత్నాల్లో 'ఎంతమాత్రమున..' కీర్తన విన్నప్పుడు కలిగే ఒకఊపు అప్పుడు కలిగింది. అయ్యాక దాదాపు పదినిముషాలు చప్పట్లేచప్పట్లు. చివరగా నిర్గుణి భజన్ 'బోలా మన్‌ జానే అమర్ మేరే కాయా' ఆలపించింది.

చివరగా ఆరాత్రికే హైలెట్‌గా నిలిచిపోయిన భాగం కథక్ నృత్యప్రదర్శన. సంగీతకచేరీలకు వెళ్ళిన అనుభవమైతే ఉందికానీ కూచిపూడిగానీ భరతనాట్యం ఎప్పుడూ చూడలేదు. శాంభవీశుక్లా అనే అమ్మాయి దాదాపు రెండున్నరగంటలపాటు అలసట లేకుండా చేసిన నాట్యం అద్భుతం. వాళ్లమ్మ కవితాశుక్లా కూడా కథక్ నృత్యకారిణట. గురువు ఫతేసింగ్‌ గంగానీ, అమ్మ కవితాశుక్లా,  ధర్మనాథ్ మిశ్రా మరియు సంతోష్‌మిశ్రాలు తాళం అందించారు.  శంకర్ అతిప్రచండకర్.. అంటూ నటరాజుని స్తుతిస్తూ మొదలుపెట్టింది. 


తరువాత విద్యనేర్పిన ముగ్గురు గురువులను స్మరిస్తూ తీన్‌తాళ్ చేసినప్పుడు గోగ్రహణం జరిగినప్పుడు అర్జునుడు నమస్కారబాణాలు వదలడం గుర్తొచ్చింది. ఆతర్వాత ఉఠాన్ ప్రదర్శించింది.  సృష్టిలోని పంచభూత తత్వాలను నాట్యంలోని వివిధఅంశాలతో పోలుస్తూ చేసిన అంశం సూపర్...హైలైట్. 
పండిట్ కిషన్‌మహరాజ్  గణేష, దుర్గా, శివులపై రచించిన శ్లోకాలకు నృత్యరూపకం చాలానచ్చింది. తర్వాత తనుస్వయంగా రూపొందించుకున్న ఒకతాళపద్దతిని ప్రదర్శించింది. "శ్యామ్‌రాధాసంగ్ .." అంటూ రాధాకృష్ణుల సరససల్లాపాలు ఓపదినిముషాలు చక్కిలిగింతలు పెట్టాయి. ఆగీతంమాత్రం 'చందనచర్చిత..' థీంలో ఉంది. శాంభవీ ప్రదర్శన చూసిన ప్రతిఒక్కరికీ ఆమెకు నాట్యంపట్ల ఉన్న గౌరవం, అంకితభావం ముప్పిరిగొల్పాయి. భవిష్యత్తులో గొప్పనర్తకి అవుతుందని దాదాపూ ప్రతిఒక్కరూ అనుకున్నారు. ఏదో పెర్ఫార్మెన్స్ ఇచ్చాను అన్నట్టుగా కాకుండా కథక్‌లోని చిన్నచిన్నసంగతులు, భంగిమలు, తాళగతులు కొద్దికొద్దిగా వివరిస్తూ సాగిన ప్రదర్శన నిజంగా అద్భుతం. ఇకపై నేనుచూసే నాట్యప్రదర్శనల్లోనూ దీన్ని బెంచ్‌మార్క్‌లాగా పోల్చుకుని నిర్ణయానికొస్తానేమో!

ఉత్తరాదికచేరీలకు గతంలో ఒకసాంప్రదాయం ఉండేదట. ప్రతికచేరీ చివర్లో భైరవిరాగంలో ముగుస్తుంది. ఆచివరి ప్రదర్శనలో ఆరోజు వచ్చిన కళాకారులంతా పాల్గొనాలి. భైరవిరాగంలో ఉంటుంది అన్నవిషయంతప్ప మరేసమాచారం ఉండదు. అక్కడికక్కడే ఏకీర్తనపాడాలి అన్నది నిర్ణయించుకుని అంతాకలిసి బృందంగా ఆలపిస్తూ, వాద్యబృందం వాయిస్తూఉంటే నాట్యం చెయ్యాలి. రానురాను చివరిదాకా ఉండే అలవాటు కళాకారుల్లో మాయమవటం, ఏదైనా ఇవ్వండి నేనుసిద్ధం అనిచెప్పగల్గే ఆత్మవిశ్వాసం లోపించటంతో నెమ్మదిగా కనుమరుగైపోయింది.ఈవిషయాన్ని ప్రస్తావిస్తూ పాండేగారు ఈరోజు ఆసాంప్రదాయాన్ని తిరిగి బతికించాలని కోరటమూ, అందుకు అందరూ అంగీకరించటం క్షణాల్లో జరిగిపోయింది.





చివరగా తులసీదాసు విరచితం "భజమను భజమను రామచరణ సుఖదాయి.."అనే భజనగీతాన్ని సమిష్టిగా ప్రదర్శించాక, జైపూర్ పద్దతిలో నూటొక్క చక్కర్లుకొట్టడంతోఉత్సవం ముగిసింది.

ఏదో నేనివనన్నీ విశ్లేషిస్తాననికాదు. అంతమంచి కార్యక్రమం ఒకటి జరిగినప్పుడు, చూసొచ్చి నలుగురితో పంచుకోవడంలో ఆనందాన్ని అనుభవిద్దామని అంతే.

భలేమంచి చౌకబేరము

అమ్మలారా! అయ్యలారా! భూమికవతల ఉన్న క్రౌంచద్వీపవాసులారా!
మీద్వీపంలో(ద్వీపకల్పంలో) మాశాసనసభలో గవర్నరుసందేశానికి ధన్యవాదాలు తెలిపినట్లు బంధుమిత్రులకి ధన్యవాదాలు తెలిపే జాతర మాగొప్పగా జరగతాదంట. ఆపక్కరోజునే కాళసుక్రోరం వస్తాదంట. ఆరోజు నాబోటి ఉత్తమజాతి మానవులకి వాయనాలు గట్రా ఏర్పాటుచేస్తే చానాపుణ్యమని మొన్నమద్దెన స్కాందపురాణం చదవతాఉంటే తెలిసింది. ఈవాయనాన్ని బ్రహ్మచారులకి, అందులోనూ బ్రహ్మచారిబ్లాగర్లకి, మళ్లీవాళ్లలో ఏనదిపేరునో బ్లాగుకి పెట్టుకున్నవారికి వాయనాలిస్తే ఎఫెక్టు ఇన్‌స్టెంటంట. ఇంతపెద్దరహస్యాన్ని ఓపెన్చేసేస్తే అంతా నాకువాయనాలిచ్చి స్వర్గానికి గ్రీన్‌కార్డ్ తీసుకుంటారని ఈకత వినాయకచవితికతలో, సత్తెనారాయణసామివ్రతంకతలో చెప్పలేదంట.

కాబట్టి మీకంతా చెప్పొచ్చేదేందంటే-
మీరంతా పిల్లాజెల్లాతో కలిసి రాత్రంతా జాగారంచేసి, తెల్లవారుఝామున వైకుంఠఏకాదశిరోజు ద్వారదర్శనం భక్తుల్లాగా వాల్‌మార్ట్ వాకిట్లో నిలబడి హరినామస్మరణగావిస్తూ, వీలైతే తలుపుతీయనన్న జయవిజయుల్ని ఉరిమిచూసి (ఈపని మనలేడీస్‌కి అప్పగించండి.) చేతికిచిక్కిందంతా జవురుకొచ్చేయండి.

ఆతర్వాత మీమీబుట్టల్ని నావాకిట్లోపెడితే పుణ్యం ట్రక్కుల్లో లభిస్తాది. అంతేకాదు లచ్చిందేవి మీసాలరీ అకౌంట్లని, డీమాట్లని ప్రయారిటీ ఆర్డర్లో ముందుకునెడుతుంది. గ్రహాలు అనుకూలించిన క్షణంలో వరదగోదారిలా పోటెత్తిస్తాది. సరస్పద్దేవి మీబ్లాగుల్లో కామెంట్లు విచ్చలవిడిగా కురిపిస్తాది. భలేమంచి చౌకబేరము..ఇది సమయము మించిన దొరకదు ఎన్నారై బ్లాగర్లార...

సింహాసనం చిత్రరాజం

కొద్దిరోజుల క్రితం సింహాసనం చిత్రాన్ని చూడడం, చూసిన తన్మయత్వంలో చిందులెయ్యటం జరిగింది. అప్పట్లో బజ్‌లో రన్నింగ్ కామెంట్రీ పెట్టాను. దాన్నికాపీపేస్ట్ కొట్టి టపాచేశా. అదీ కిందమేటరు  

701MB, 11 Seeds, 12 Peers
1D5H, Avge 6.8kbps

'సింహాసనం' చిత్రరాజం దిగుమతి అయ్యింది.
రాత్రికి సెకండ్‌షో "ఝుం ఝుం ఝుం ఝుం తననా ఝుం"Edit
3 people liked this - Bhaskar Ramaraju, Chandrasekhar Thimmavajjala and Ravi Theja
Bhaskar Ramaraju - :): ఆకాశంలో ఒకతార.....Aug 13DeleteUndo deleteReport spamNot spam
Subrahmanya Chaithanya Mamidipudi - విక్రమసింహుడు (కృష్ణ): కుట్ర. కుటిలసామంతుల కుట్ర. దశార్ణ సింహాసనాన్ని కబళించేందుకు పన్నిన పన్నాగం. అలకనందాదేవి పట్టాభిషేకాన్ని నిరోధించే ప్రయత్నంలో ప్రధమఘట్టం ఈమకుటాపహరణం. మనం అప్రమత్తులమై ఉండాలి. ఈ తిరుగుబాటును ఆదిలోనే అంతంచెయ్యాలి.
సైనికుడు: నరనరాలలో రాజభక్తిని నింపిన దశార్ణ సేనావాహినిపై కత్తిగట్ట సాహసించిన ఆసామంతులు ఎవరు నాయకా?
విక్రమసింహుడు: ఉన్నాడు ఒక అల్పాయుష్కుడు. కరికాల భైరవుడు. తనసంస్థాన ప్రజలనే కాల్చుకుతినే ఆకలుషాత్ముడికి రాజ్యాధిపతి కావాలన్న ఆశే కానీ ఈసువిశాలదేశాన్ని సుభిక్షంగా పరిపాలిమ్చగల శక్తిసామర్థ్యాలు లేవు. కానీ వాడీమద్యకాలంలో తనసంస్థానంలోని సైనికులసంఖ్య పెంచడమేకాక కొందరు చిన్నచిన్నసామంతుల తోడ్పాటునుకూడా సంపాదించగలిగాడు. ఆసామంతులను, కిరీటపు దొంగలను, అవంతీరాజ్యంలో అలజడులు సృష్టిస్తున్న బంధిపోట్లను- అందరినీ ఒకేశక్తి నడిపిస్తుందని నాసందేహం.ఆ మూలశక్తి ఏదో, రాజనీతిలో రాటుదేలిన ఆవ్యక్తి అవంతీ నివాసుడో, దశార్ణ కాపురస్తుడో ఏకొంతైనా సమాచారాం తెలుసుకుంటేగానీ కిరీటాన్ని సాధించడం సాధ్యంకాదు.
ఇంకో సైనికుడు: మరిప్పుడు మనకర్తవ్యం?
విక్రమసింహుడు: ఆవిషసర్పాలు పడగలు ఎత్తకముందే వాటినడుములు విరగ్గొట్టాలి. దశార్ణరాజవంశాన్ని అంతరింపజేయడానికి ప్రయత్నిస్తున్న రాజద్రోహులను తుదముట్టించి, తలకుపన్ను, చెట్టుకుపన్ను, పుట్టకుపన్నులతో విసిగివేసారిన అంవతీప్రజలకు విముక్తికల్పించి, ఉభయరాజ్యాలప్రజలు శాంతిసౌభాగ్యాలతో వర్థిల్లేటట్లు చెయ్యడమే మనకర్తవ్యం.దశార్ణరాజ్యంలో ధర్మపాలనను నిలబెట్టడం, అవంతీరాజ్యంలో అధర్మపాలనను అరికట్టటమే మన ఈఅజ్ఞాతవాసపులక్ష్యం. ఆలక్ష్యసాధనకోసమే మహావీరులైన మీరందరూ సర్వసుఖాలను త్యజించి నాతోపాటు ఇక్కడ ఉన్నారు.
Subrahmanya Chaithanya Mamidipudi - మందాకిని ఎంట్రీ. వహ్వా! నీయవ్వనం...
Subrahmanya Chaithanya Mamidipudi - కిరీటం పోయిందని కాంతారావు మంచమెక్కేశాడు. జయప్రద పట్టాభిషేకం చెయ్యించమని కృష్ణ లెటర్ రాసేశాడు. జయప్రదమళ్ళీమళ్ళీ మనసుపారేసుకుంటూ ఉంది
Subrahmanya Chaithanya Mamidipudi - అండర్‌గ్రౌండ్లో సత్యనారాయణ, ప్రభాకర్రెడ్డి స్కెచ్ వేస్తున్నారు
Subrahmanya Chaithanya Mamidipudi - కృష్ణ కౌంటర్ ప్లాన్ చేస్తున్నాడు
Subrahmanya Chaithanya Mamidipudi - కృష్ణబ్యాచీ మొత్తం గెరిల్లాయుద్ధం చేస్తున్నారు. చెట్లమీదనుమ్చి బాణాలు, నీళ్ళకిందనుంచి బాణాలు. ఒకటి ఏసాక రెండోది ఎక్కడ్నుంచి వచ్చిందో అర్థంకావట్లా. ఎవడిదగ్గరా తూణీరం లేదు
Subrahmanya Chaithanya Mamidipudi - సూపర్‌స్టార్ డ్రాగన్‌బొమ్మచూసి భయపడి తేరుకుని యుద్ధంచేసి కిరీటం సంపాదించాడు
Subrahmanya Chaithanya Mamidipudi - పట్టాభిషేకానికి మద్యలో సామంతరాజు "అబ్జెక్షన్ యువరానర్" అన్నాడు. ఇప్పుడు బ్లైండ్ ఫైటింగ్EditAug 13DeleteUndo deleteReport spamNot spam
Subrahmanya Chaithanya Mamidipudi - ఫైటింగ్లో గెలిచిన కృష్ణ 400kV line తాకినంత ఎక్జైట్మెంట్లో ఉన్నాడు. జయప్రద స్పీచ్ ఇస్తూ ఉంది. కైకాల "ఐహర్టెడ్!" అంటున్నాడు
Bhaskar Ramaraju - పాట??లేదా??
Subrahmanya Chaithanya Mamidipudi - వావ్! జెయప్రద తనను తాను అర్పించుకునేందుకు పెట్టెలో వచ్చేసింది.
Subrahmanya Chaithanya Mamidipudi - ఇక్కడే... ఆ ఇక్కడె... అవును ఇప్పుడే... ఎనిమిదన్నర నిముషాల నిడవిగల గానం....ఝుం తన ఝుం...హే హే హేహెహ్హె..ఆఆఆఅ...లాలాలల్లాఆఅ....ఆకాశంలో ఒకతార...
Bhaskar Ramaraju - ఆకాశంలో ఒక తార నాకోసమొచ్చింది ఈ వేళ...కృష్ణా స్టెప్పులు...మనసులో గిర్రున తిరుతున్యాయి
Subrahmanya Chaithanya Mamidipudi - రెడ్డికొడుకు మందాకిని వెంటపడ్డాడు. రక్కడంతోనే చనిపోయాడు. మైగాడ్! ఆమె విషకన్య అన్నసంగతి తెలిసిపోయింది.
Subrahmanya Chaithanya Mamidipudi - మందాకిని సూసైడ్ అటేంప్ట్. కొడుకు పోయాడని రెడ్డికూడా సూసైడ్ అటేంప్ట్. కైకాల బ్రెయిన్ వాష్. చిన్నరహస్యం
Subrahmanya Chaithanya Mamidipudi - కృష్ణ ఫైట్.చూడాల్సిందే. నేరాయలేను.
Subrahmanya Chaithanya Mamidipudi - విక్రమసింహుడు-ఆదిత్యవర్థనుడూ (డబల్ యాక్షన్) కలుసుకున్నారు
padmanabha rao tadepalli - "కృష్ణ ఫైట్.చూడాల్సిందే. నేరాయలేను."...
Subrahmanya Chaithanya Mamidipudi - మాంచి ఫ్లోలో ఉన్నప్పుడు నెట్ డిస్కనెక్ట్ అయ్యింది.ప్చ్
Subrahmanya Chaithanya Mamidipudi - గిరిబాబుని రాజుగా చేసేందుకు కైకాల గేంప్లే చేస్తున్నాడు. ఇంతలో డూప్లికేట్ ఆదిత్యవర్ధనుడూ(విక్రమసింహుడు) వచ్చేశాడు.
Subrahmanya Chaithanya Mamidipudi - కత్తులు మంటల్లోపెట్టి ఓట్టేసుకున్నారు కృష్ణ-జెయప్రద. పాలనాసంస్కరణలు యాట యాట
Subrahmanya Chaithanya Mamidipudi - రాథ టచ్లో తేడాకనిపెట్టేసింది. ప్రాణానికి ప్రాణమైన జెయప్రద అనుమానించడంతో కృష్ణ హర్ట్ అయ్యాడు. నిజం చెప్పాడు
Subrahmanya Chaithanya Mamidipudi - జాతరలో పోతురాజు కత్తిపట్టుకున్నట్టు కృష్ణ రాజదండం పట్టుకు తిరుగుతున్నాడు.
Subrahmanya Chaithanya Mamidipudi - గబ్బర్‌సింగ్ బాదంపప్పు కామెడీ.దీన్ని జీడిపప్పుకి చెప్పాలి
Subrahmanya Chaithanya Mamidipudi - కైకాల మళ్ళీస్కెచ్ వేస్తున్నాడు.
Subrahmanya Chaithanya Mamidipudi - విషకన్యను(మందాకినీ) కృష్ణమీదకి వదిలారు. వావ్! మందాకినీ అమృతకన్యగామారిపోయింది. కృష్ణ ఔటాఫ్ డేంజర్
Subrahmanya Chaithanya Mamidipudi - కృష్ణమీద అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. కృష్ణ టైం టూబాడ్. అప్పటికే ఒరిజినల్ రాజు వచ్చేసినా అతన్ని డూప్లికేట్ అనుకుంటున్నారు.ఉరిశిక్ష వేశారు.
Subrahmanya Chaithanya Mamidipudi - దశార్ణసైన్యం, విక్రమసింహుడి బలగం కలిసి అటాక్ చేస్తున్నాయి. కృష్ణకత్తికి నాలుగైదుపక్కల పదునుంది.
Subrahmanya Chaithanya Mamidipudi - కృష్ణ గుర్రం సైన్‌వేవ్‌లాగా దానిపైన కృష్ణ కొసైన్‌వేవ్‌లాగా ఎగురుతున్నారు. మొత్తానికి కోటలోపలికి వచ్చేశాడు.
Subrahmanya Chaithanya Mamidipudi - *పతాక సన్నివేశం*గబ్బర్‌సింగ్, కపాలకోటుడు అప్రూవర్లుగా మారిపోయారు. కైకాల పద్మవ్యూహంలో చిక్కుకున్నాడు. పెద్దఫైట్. కైకాల, గిరిబాబు అండ్ కో మటాష్.
Subrahmanya Chaithanya Mamidipudi - శుభంకార్డు పడేముందు మళ్ళీ మరొక్కసారి "ఝుం తనా ఝుం తననా తననా...ఆకాశంలో ఒకతార.." ఏసేస్కుని తెరదించెయ్యడమే. మేకింగ్ ఆఫ్ సింహాసనం ఎక్కడైనా దొరికితే బావుండు

అర్థాంగి

నాన్న నాలుగో తరగతిలో ఉన్నప్పుడే పెళ్ళైపోయింది. బాల్యవివాహం! ఆపెళ్ళికి పెద్దకూడా ఆయన అన్నగారే. ఆయన పిల్లని చూపిస్తే నచ్చేసింది అన్నాడంట. ముహూర్తం, వేదిక అన్నీ ఆపెద్దే నిర్ణయించేశాడు. సమిధలు తెచ్చేసి, హోమం వేసి మొత్తానికి అందరికళ్ళూగప్పి అగ్నిసాక్షిగా మొదటిభార్యను చేతిలోకి తీస్కున్నాడు. నాతిచరామి అన్నపదాన్ని జీవితాంతం మర్చిపోకుండా పాటించాడు. పెళ్ళికి ముందే అమ్మకి కూడా పెద్దభార్య సంగతి తెలుసనుకుంటా.(గ్యారంటీ ఇవ్వలేను.) కానీ సర్దుకుపోయింది.

పెదమ్మ అమ్మలాగా సాదాసీదా కాదు. బాగా కాస్ట్లీ. మెయింటినెన్స్ ఖర్చు భీభత్సంగా ఉండేది. ఆవిషయంలో మాత్రం అమ్మకి ఆవిడకి తగవుపడేది. కానీ పట్టపురాణిహోదాలో ఆవిడమాటే చెల్లుబాటయ్యేది. ఇల్లంతా చెత్తపడెస్తే పాపం అమ్మ రోజుకు మూడునాలుగుసార్లు శుభ్రం చేసేది. అయినా చెత్త ఏదోఒకమూల ఉండాల్సిందే. బయటకూడా నాన్నపేరు చెబితే ఆపెద్దమ్మే గుర్తొస్తుంది అందరికీ. నాన్న ఎక్కడికివెళ్తే అక్కడికి వేలుపట్టుకుని వెళ్తూనే ఉండేది. అది మావలకి, తాతకి, మిగతాబంధువులకి కొంచెం బాధనిపించినా నాన్నంటే భయంవల్ల, భయం అటే అలాంటిలాంటి భయంకాదు. టెర్రర్..టెర్రిఫిగ్గా భయపడేవాళ్ళు. కొడుకైనందున నేను భయపడ్డా అర్థముందికానీ ఆయనకోపానికి వాళ్ళమ్మ కూడా భయపడేది. నీఇష్టం నాయనా అంటూ వెళ్ళిపోయేది. తర్వాత మదర్ సెంటిమెంట్లు గట్రా మామూలేననుకో! నేను బజారుకెళ్తే నారాయణశెట్టికూడా ఆవిడ గురించే అడిగేవాడు.ఆయనకు ఆవిడ తెలుసుగానీ ఎప్పుడూ మాట్లాడిందిలేదు.
ఏమాటకామాటే చెప్పుకోవాలేగానీ కొన్నివిషయాల్లో ఆయన్ని అందరికన్నా ఎక్కువే అర్థం చేసుకుంది. సగటు మనిషిలా నాన్నకూడా ఆస్తిక-నాస్తికవాదాల మద్యన ఊగిసలాడే ఆలోచనల్లనే తనమొహానికికూడా కాషాయం- ఎరుపుమద్యన ఒకరకమైన షేడ్లో మేకప్ చేసుకునేది. చీకట్లో ఆయనవెళ్ళేప్పుడు దారిచూపించేంత కాకపోయినా ఎదురొచ్చేవాళ్ళు నాన్నని గుద్దకుండా కాపాడేది. మనసుబాలేకున్నా,మరీ ఆనందంగా ఉన్నా నాన్నెప్పుడూ తనతోనే పంచుకుంటాడని కొంచెంబలుపు చూపించేది. రోజులు గడిచేకొద్దీ వాళ్ళ అనుబంధం బాగాపెరిగిపోయింది. ఆయనరక్తంలోకి చేరి చివరికి గుండెల్లో గూడుకట్టుకుంది.
చివరికి నాన్నతోబాటే సతీసహగమనం చేసింది. తనుమెట్టినింటికి వస్తూవస్తూ మంధరలాంటి దాసీని తీసుకొచ్చింది. అదిప్పుడు సన్యాసుల్లో కలిసిపోయి దేవుడిదగ్గర దీపం, అగరొతులు వెలిగిస్తూ జీవితాన్ని సాగదీస్తోంది. అమ్మకి మాత్రం అప్పుడప్పుడూ చిన్నభయం. నేనూ ఎవరినైనా పెళ్ళి చేస్కున్నానేమోనని. నేను అమ్మకొడుకునని తనకి తెలుసనుకో.

జీర్ణించుకోలేని నిజం

  ఓనెలక్రితం అమ్మతో కూడా రామేశ్వరం వెళ్ళాను. ఇంతకు ముందు రెండుసార్లు అక్కడికి వెళ్ళాను. తిరుచ్చిలో చదివేటప్పుడు సెమిస్టెర్ రిజల్ట్స్ వచ్చినప్పుడు ఓసారి క్లాస్‌మేట్స్‌ అందరంకలిసి మరోసారి ఫ్రెండ్‌తో కలిసివెళ్ళాను. రెండోసారి అక్కడున్నప్పుడే అమ్మఫోన్ చేసి పాపకి వచ్చిన సంబంధం గురించిచెప్పింది. అంతకుముందే కాశీనుంచి తీసుకొచ్చిన గంగాజలంతో రామనాథేశ్వరునికి అభిషేకం చేసొచ్చాను. అందువల్ల ఈయాత్ర బాగా సెంటిమెంట్ అయ్యింది.

దీవిలో ముఖ్యమైన ప్రాంతాలు బాగానే పరిచయం ఉండటంతో తిరిగేందుకు పెద్దగా ఇబ్బందనిపించలేదు. కొత్తగా వెళ్ళినవాళ్ళకి కూడా అక్కడేమీ ఇబ్బంది ఉండదనుకోండి. అక్కడికెళ్ళిన వాళ్ళు ఎవరైనా చేసేపని ముందు తీర్థాల్లో స్నానంచేసి దర్శనం చేసుకొచ్చి, బయట టిఫిన్ గట్రా పూర్తిచేశాక ఓఆటోవాడితో బేరం కుదుర్చుకుని దీవిలోని ముఖ్యమైన ప్రాంతాల్లో తిరగటం.

మొదటి రెండుసార్లు వెళ్ళింది స్టూడేంట్స్‌గా. దాంతో ప్రతిదీ బడ్జెట్టే. ఆటోవాడు మూడోందలు అంటే "అన్నా! స్టూడేంట్స్ అన్నా. కుంజేం కమ్మి పణ్ణీంగే అన్నా." ఇలా ప్రతిదీ బేరమాడటమే. చివరికి కొబ్బరిబొండాల్లో కూడా. కొబ్బరిబొండాలోడితో మావాడొకడైతే "అన్నా! కావాలంటే నీళ్ళు తక్కుంవుండే కాయిచ్చి డబ్బులు తక్కువ తీసుకో," అన్నాడు. భోజనాల హోటల్లో సంగతైతేసరేసరి. వాడు నిజంగా వీళ్ళు స్టూడేంట్సేనా? అని అనుమానించేదాకా వెళ్ళిపోయాడు. తిరుగుప్రయాణం మధురై వరకు పాసింజెర్లో. ఇది ప్లాన్ చేసింది మాత్రంనేనే! బస్సులో వెళ్ళేకన్నా ఇందులో అయితే కొంచెం ఎంజాయ్ చెయ్యొచ్చని. లెక్కలేశాక (తమిళ్నాడులో బస్సుచార్జీ ఎంత చవకైనా మరీ పాసింజరుకన్నా తక్కువుండదుగా) ఆర్థికవిషయాలు చూసుకునే బృందసభ్యుడు టెక్నోఎకనమికల్ క్లియరెన్స్ ఇచ్చేశాడు. మళ్ళీ రెండున్నరేళ్ళ తర్వాత ఉద్యోగంలో కుదురుకున్నాక, కొంత ఆర్థికస్థితి మెరుగయ్యాక, అమ్మతో రావడం ఏదోతెలీని తృప్తి, ఆనందం. కిందటి రెండుసార్లకంటే ఈసారే బాగాజరిగిందనిపిమ్చింది.

ఉదయాన్నే దర్శనం చేసేసుకున్నాక బయటికొచ్చి ఆటోవాడితో బేరంమాట్లాడా. ఉదయాన్నే రైల్వేస్టేషన్ నుంచి వచ్చింది ఈఆటోలోనే. అప్పుడే వాడు మమ్మల్ని రిజర్వ్ చేసుకున్నాడు. బేరం అంటే ఏదో అనుకునేరు. మనకంత సీన్లేదు. నాకు బేరంరాదు. అమ్మకి భాషరాదు. అదీ సంగతి. ఏఏ ప్రదేశాలో లిస్టు చెప్పా.

ఆదీవిలో చూడాల్సినవన్నీ ఒక్కోటీ ఒక్కోమూల ఉంటాయి. దక్షిణాన చివర్లో రామసేతువు. అక్కడేమీ కనిపిచదు. దానికి ముందు విభీషణుడికి పట్టాభిషేకం జరిగినప్రాంతం. ఉత్తరాన రామపాదం. పశ్చిమంగా పంచముఖ ఆంజనేయస్వామిగుడి, ఇంకొన్నిగుళ్ళు. ఇంకా చివరికి వస్తే పాంబన్ రైల్వేవంతెన. ఇది మాతృభూమికి రామేశ్వరద్వీపానికి పేగుబంధం. తూర్పునేముంది అనడగొద్దు. అటైపు సముద్రం (అగ్నితీర్థం). అన్నింటికీ మద్యలో రామనాథస్వామిగుడి.

ఓవైపు అన్నేళ్ళబాధనుంచి తనకుకలిగిన విముక్తికి జనకీమాత ప్రతిష్టించిన శివలింగం ఇక్కడి స్త్రీ ఆత్మగౌరవానికి, జాతివీరత్వానికి ప్రతీక ఐతే మరోవైపు ఒకమామూలుఇల్లు ఆధునికభారత సాంకేతిక దాశ్యసంకెళ్ళను తెంచి, గగనవీధుల్లో దేశపతాకను ఎగరేసిన చారిత్రకఘట్టాలకు సూచిక. రామేశ్వరం పేరువినడంతోనే గుర్తొచ్చేపదాలు సీతారాములు, వానరకోటి, రామనాథేశ్వరుడు, సేతువు, లంక, సైకతలింగం, రామాయణం, తీర్థాలు, రావణుడు, పాంబన్ .... కానీ వర్తమానకాలంలో ఆద్వీపంపేరు వినడంతోనే గుర్తొచ్చే ఒకేఒకపదం 'కలాం'.

ఈద్వీపపు ఇసుకతిన్నెల్లో బాల్యాన్నిగడిపి, శ్రీహరికోటదీవి ఇసుకతిన్నెల్లోంచి తన అగ్నిగవాక్షాలతో రాకెట్లెగరేసి, దేశానికే ప్రధమపౌరునిగా "కలాం మాప్రధమపౌరుడు" అని నూరుకోట్లగొంతులు సగర్వంగా చెప్పేలా జాతికి దిశానిర్దేశం చేసిన మహనీయుడు. వర్తమానంలో ఈయనకు సాటిరాగల స్పూర్తిప్రదాత ప్రపంచంలోనే ఎవరూలేరు.
ఆయన ఇల్లు గుడికి పశ్చిమంగా ఆలయప్రధానర్చకుడు పక్షిలక్ష్మణశాస్త్రిగారి ఇంటికి వెనుకరోడ్డులో వెళ్ళి కుడివైపున ఉన్న ఒకసందులోకి వెళ్ళాలి. ఇంతకుముందు వెళ్ళినప్పుడు "ఈసందులోనే కలాంఇల్లు" అని ఆటొవాడు చెప్పి లోపలికి తిప్పాక ఇంటిముందు ఆగిచూసేదాకా ఎంత‌ఆరాటపడ్దామో మాటల్లో చెప్పలేను.

అక్కడ నీలిరంగుఇల్లు, వాకిట్లో గ్రిల్స్, దానిపైన ఇనుపచువ్వలను అక్షరాలుగా మలిచి "HOUSE OF KALAM" అని రాసుంది. అలహాబాదులో భరద్వాజమహర్షి ఆశ్రమం ఎదురుగా ఓపెద్దభవనం ఉంది. దాని ఆవరణలోనే మరోభవనం. రెండూ ఇప్పుడు జాతికి అంకితం చేయబడ్దాయి. ఒకటి ఆనందభవన్, మరోటి స్వరాజ్యభవన్. కొన్నిదశాబ్దాలక్రితం ఈజాతి భవష్యత్తును దిశానిర్దేశంచేసే ఎన్నో మార్గదర్శకసూత్రాలను, సిద్ధాంతాలను రూపొందించిన యజ్జ్ఞవాటిక అది. అణువణువునా దేశభక్తిని ఇముడ్చుకున్న మహనీయుల పాదధూళితో పావనమైన దేవాలయం. వాటికి ఏమాత్రం తీసిపోని మరోభవనం నాకళ్ళముందు కనిపిమ్చింది. మాదగ్గర కెమెరాలేదు. సెల్‌తోనే ఆఇంటిముందు ఫోటోలు దిగాం. "మనలాంటి ఓటెక్నోక్రాట్ రాష్ట్రపతి అయ్యాడురా (ఇలాంటప్పుడు ఏదోరకంగా వరసకలిపెయ్యకపోతే మనసునిలవదు.) ఇప్పుడు కెమెరా లేకపోతేనేం భవిష్యత్తులో పెద్దకెమెరాతో వచ్చి ఫోటోలు తీద్దాం. దానికెక్కువ సమయంపటదులే" అనుకుని పక్కనే ఆయన బంధువుల షాపులో శంఖులు, ముత్యాలు వగైరా అమ్ముతారు. అక్కడికెళ్ళాం. అక్కడ మనకీ ఆయనకి బేరంకుదరక శంఖు కొనకుండానే వచ్చేశాననుకోండి. అదివేరే విషయం.

అమ్మతో కలిసి విభీషణుడి పట్టాభిషేకం చేసిన స్థలం చూసుకుని తిరిగొస్తుండగా ఆటోవాడితో "కలామ్ ఇంటికి తీసుకెళ్ళు." అన్నాను. అతనేదో తమిళంలో చెప్పాడు. సరిగా వినబళ్ళేదు. అమ్మకి వీలైనంత త్వరగా ఆఇల్లు చూపించి, దానిముందు ఫోటో తీసుకోవాలి అన్నది నాఆరాటం. సహజమే కదా. ఇప్పటికీ నాదగ్గర కెమెరాలేదు. ఫ్రెండ్ కెమెరా తీసుకొచ్చా. సరిగ్గా ఆసందుకు దగ్గరగా వచ్చాం. "అమ్మా! ఈసందులోనే." అని చెప్పా. అంతలో ఆటోవాడు దాన్ని దాటుకుని వెళ్తున్నాడు. "అన్నా! మున్నాడి కలాం వీడు." అని చెప్తునా వాడు నేరుగా వెళ్తున్నాడు. వాడివీపు తట్టి "కలాం వీడు. కలాం వీడు." అని చెప్పాక. "ఇందాకే చెప్పాకదా సార్?" అంటూ వెనక్కి తిప్పి ఇంటిముందుకి తీసుకొచ్చి ఆపాడు.
అప్పుడర్థమైంది అంతకుముదేమిచెప్పాడో. కలాం ఇల్లుకూల్చేశారు. ఆఇల్లు ఉండాల్సిన చోట పెద్దపెద్దతడికలు పెట్టున్నారు. దిగిచూస్తే పిల్లర్లకోసం పునాదులు తొవ్వేసున్నారు.


 ఎందుకో గుండెలోతుల్లోంచి బాధ తన్నుకొచ్చింది. లోపల్నుంచి తన్నుకొచ్చిన ఆవేశాన్నంతా అమ్మమీద చూపించా. "కనీసం పెళ్ళాంపిల్లలు కూడా లేరు. ఉన్న ఇంటినికూల్చి పాలెస్‌కట్టి ఎవడికిస్తాడంట." ఈదేశంలోని కోటలకి, భవనాలకి, చారిత్రక ప్రదేశాలకి ఏమాత్రం తీసిపోని ఒకఇల్లు. దేశం గర్వపడే విజయాలు సాధించిన ఒకదార్శనికుడు తనస్వార్జితంతో కట్టుకున్న ఇల్లు. ద్వీపాన్ని దర్శించే ప్రతియాత్రికుడు ఒకఫోటోతీసుకోవాలనిపించే ఒకచిన్న పర్యాటకప్రదేశం. ఈదేశప్రజలకి ఆమాటకొస్తే ప్రపంచంలోని ప్రతిమనిషికి స్పూర్తినిచ్చే చారిత్రక కట్టడం. ఇకకళ్ళముందు లేదన్న నిజం జీర్ణీంచుకోవడానికి నాలుగైదు నిముషాలు పట్టింది. ఇకపై ఆఇంటిని చూడాలంటే Indomitable Spirit(ఎవరికీ తలవంచకు)వంటి పుస్తకాల్లోనో, పత్రికల్లో వచ్చినఫోటోల్లోనో చూసుకోవాలి.
మిగతాప్రాంతాలు తిరగబుద్దికాలేదు. ఆసమయంలో కలామ్ నాముందున్నా "ఈఇంటిని కూల్చే హక్కునీకెవరిచ్చారు?" అని అడుగుంటానేమో. అదీ ఆయనమీద గౌరవంతో పుట్టుకొచ్చిన ఆవేశమే. ఇన్నేళ్ళలో ఈఒక్కవిషయంలో నాకూ ఆయనకీ మద్యన అభిప్రాయబేధాలొచ్చాయి. (ఎత్తుభారం. నేనొప్పుకుంటే ఎంత? లేకుంటే ఎంత?) ఇంటిని కూల్చేసినంత మాత్రాన ఆయనిచ్చిన స్పూర్తి తగ్గదు. కానీ మనసులోతెలీని లోటు. ఇన్నిరోజుల తర్వాత మీతో చెప్పుకోవాలనిపించి....

ఎందుకిలా? !!!

తీరికలేనంతగా బిజీనా? అంటే కాదు. మనసేమైనా బాలేదా? అంటే అలాంటివి ఎలా ఉంటాయో మనకస్సలు టచ్‌లేదు. పోనీ ఏమైనా ఇబ్బందులా? అంటే ఉన్నవన్నీ మామూలే. కొన్నిసమస్యలు నెలలుగా మరికొన్ని ఏళ్ళకేళ్ళు అలానే పడున్నాయి. అస్సలు ఎందుకిలా?!!! అంటే సమాధానంలేదు.

ఎమైందో తెలీదు. ఈమద్య బ్లాగులో టపాలు పెట్టేసంగతి దేవుడెరుగు కనీసం దాన్ని తెరిచి చూసేందుకు రెండుమూడురోజులు పడుతుంది. అలాగని మోజు తగ్గిందా? అంటే నాబ్లాగు నాకెప్పుడూ గొప్పే. రాయడానికి విషయాలు లేవా? అంటే ఇప్పటికిప్పుడు ఓరెండు సెకన్లు కళ్ళు మూసుకుంటే డజనుకు తక్కువలేవు. అయినా ఎందుకిలా?!!! అంటే పిచ్చిచూపులతో దిక్కులుచూస్తూ నిలబడతా.

చివరిటపా పాడుతాతీయగా మీద రాశాను. రాసి రెండునెలలైంది. అదిరాశాక ఓనెలపాటు బాగా బిజీగా ఉన్నాను. ఆసమయంలో రాయటం కష్టమే. ఆతర్వాత ఇంటికెళ్ళా. బాగా రిలాక్సయ్యి తిరిగొచ్చా. ఆతర్వాత రాయడానికి తగినంత తీరుబడి చాలినన్ని విషయాలు ఉన్నాయి. అయినా ఎందుకో కీబోర్డు కదలట్లేదు.

నాబ్లాగులో రాసే సంగతి దేవుడెరుగు. నేను రెగ్యులర్గా చదివేది ఓ ఆరేడు బ్లాగులు. మిగతావి ఫ్రెండెవడైనా లింకుచూడు బాబూ అని పంపితే చూస్తా. వాటిల్లోనూ వ్యాఖ్యలు రాసి రెండుమూడునెలలవుతుంది. ఎప్పుడైనా బ్లాగుచూడాలని బాగా అనిపిస్తే పాతటపాలని ఓసారితిరగేసి "శభాష్ బిడ్డా!" అనుకుని మూసేస్తున్నా కానీ ఇంకోటిరాద్దాం అన్న ధ్యాసేలేకుండా పోయింది. ఎప్పుడొ రాసిన టపాని ఒకదాన్ని మళ్ళీచదివి మనసుని రిఫ్రెష్ చేసుకోవడంలో చాలా ఆనందం ఉంటుంది. జవహర్లాల్ అన్నట్టు "నేను గతంలో రాసినదేదైనా కొంతకాలం తర్వాత చదివితే అది నేను రాసిందిగాకాక నాలాంటి భావలున్న మరోవ్యక్తి నాతో తనఆలోచనలను పంచుకుంటున్నట్టుంటుంది.". ప్రతిఒక్కబ్లాగరు ఆమాటకొస్తే ప్రతిఒక్కమనిషీ ఏదోఒకసందర్భంలో తనకుతాను చేసుకున్నే సింహావలోకనం ద్వారా ఎంతోకొంత ఉత్సాహాన్ని, ఉద్వేగాన్ని కొన్నిసందర్భాల్లో పశ్చాత్తాపాన్ని పొందుతూ ఉంటాడు.
మద్యలో గూగులమ్మ ఇంకోకిటికీ తెరిచింది. 'బజ్' అని పిలకాయలంతా అక్కడె కాపుకాస్తున్నారు. టీ20 వచ్చి వన్‌డేలని మింగేసినట్టు, ముమైత్ వచ్చి సిల్క్‌ని మరిపిమ్చినట్టు ఈబజ్జొచ్చి బ్లాగుల్ని బజ్జోపెట్టింది. ఆరువాక్యాల్లో చెప్పేదాన్ని అరవాక్యంతో తెగ్గొడితే ఆతర్వాత కామెంట్లు ఆంజనేయుడి తోకే. ఈమోజు బాగానే దెబ్బకొట్టినట్టుంది. కూడలిలో ట్రాఫిక్ బాగా తగ్గింది.

కానీ ఎంతకాలం పాతటపాలతో, బజ్జులతో గడుపుతాం? అందుకనే మీతో నాకు నెలకొన్న నిశ్శబ్ధాన్ని ఎలాగోలా ఛేదించి మళ్ళీరాయటం మొదలుపెట్టాలని ధృడంగా నిర్ణయించుకున్నా. మనం రాయకపోతే ఎవడికి నష్టం? కానీ రాస్తేనేగా నాకు తృప్తి. ఇకరాద్దామంటే ఇదే మంచివిషయం అని నాబాధను మీతో వెళ్ళగక్కుకొన్నా. ఇకపై తరచుగా మీఅందరినీ గోకేందుకు యత్నిస్తా.

విన్నానుకమ్మగా

అబ్బబ్బబ్బబ్బా ..పండగంటే ఇదీ. అసలే పాడుతాతీయగా. మిగిలింది చివరి ఆరేడుగురు. అంటే పోటీదారుల్లో 'క్రీమ్'. ఏపాటపాడినా శ్రవణానందమే. ఇక 'మణి‌' (బాలుని ఇంట్లో అలానే పిలుస్తారట.) వ్యాఖ్యానం చెప్పనక్కర్లేదు. ఇవన్నీ ఒకెత్తు ఐతే ఈవారం న్యాయనిర్ణేతలు. బాపు-రమణ. పచ్చటి గున్నమావిచెట్టుకొమ్మలపై కోతికొమ్మచ్చి ఆడుతుంటే, వాళ్ళతోకల్ని పట్టుకుని ఊగుతూ పరవశించాం. ఈమద్యనే చెట్టుదిగారు. ఇంతలో ఇలా కళ్లముందు.

పాడుతాతీయగా రెండోధారావాహికం గురించి కొన్నిచేదునిజాలు చెప్పాలి. దశాబ్దమున్నర క్రితం మొదలైన పాడుతాతీయగాతో పోలిస్తే కొంచెంసందడి తక్కువగానే ఉంది. న్యాయనిర్ణేతలుగా మహదేవన్, పుహళేంది, బాలమురళికృష్ణ... ఇప్పటికిప్పుడు గుర్తురాని పేర్లెన్నో. అలాంటిది ఈమద్యన వస్తున్న 'అ'న్యాయనిర్ణేతల్ని చూస్తే కోపంనషాళానికి అంటేది. పరుచూరిగాళ్ళ 'అన్నగారిభజన' చూస్తుంటే టీవీబద్దలు కొట్టాలనిపించేది. తెలుగుసినిమా ఆత్మను చంపేసి అంపశయ్యపై పండబెట్టినోళ్ళు వాళ్ళ అనుభవాల్నినిస్సిగ్గుగా వర్ణిస్తుంటె, నిర్వేదంతో భరించడం మనవంతైంది. ఇలాంటోళ్లని కూర్చోపెట్టెబదులు ఈబాలసుబ్రహ్మణ్యమే మార్కులెయ్యొచ్చుగా అనుకునెవాణ్ణి. నామాట విన్నడేమో ఆర్పీగాడొచ్చినప్పుడు ఆయనే మార్కులేసుకున్నాడు. రెండువారాలు క్రిష్ వచ్చాడుట. చూళ్ళేకపోయా. ఇంతలో అనుకోని ఈవరం. బాధవెనుక సుఖము సమకూరుధరలోన అని శతకకారుడు ఊరకే అనలేదుమరి.

ఈమద్య అమ్మ నాదగ్గరికి వస్తూ కోతి-(ఇం)కోతి కొమ్మచ్చులను తీసుకొచ్చింది. స్వాతిలో మొదలయినప్పుడు తిరుచిరాపల్లిలో ఉన్నాను. అక్కడ సెంట్రల్ బస్‌స్టేషన్ దగ్గర దొరికేది. అక్కడికెళ్ళి తీసుకొచ్చి అది చదివి అరవోళ్ళకిస్తే మిగతాపేజీల్లోని బొమ్మల్ని చూసుకుంటూ హాయిగా నిద్రపోయేవాళ్ళు. ఆతర్వాత వయా నోయిడా శక్తినగర్‌కొచ్చి పడేసరికే అన్నివారాలు కవర్ చెయ్యలేకపోయా. ఆకొరత హాసం పబ్లికేషన్స్ పుణ్యమాని తీరింది. నెల్లూరు రెడ్డిగారు, మాఊరిరెడ్డిగారికి వియ్యంకుడు 'శాంతాబయోటిక్స్' వరప్రసాదరెడ్డికి వందనాలు. చెట్టుదిగి రెండురోజులుకూడా కాలేదు, అన్నీమనసులో పచ్చిగా పచ్చగా ఉన్నాయి.

ఇక ఈవారం విశేషాలకొస్తే రాధాకళ్యాణం సినిమా పాటతో మొదలుపెట్టారు.
మొదటిపాట "శ్రీరస్తు శుభమస్తు" పాడింది అమ్మఫేవరెట్ గీత. ఎలాంటి ఎక్స్‌ప్రెషన్స్ లేకుండా పాడటం చూస్తే జానకి గుర్తొస్తుందట అమ్మకి.
తర్వాత "రాయినైనా కాకపోతిని" గోరంతదీపం-కొండంతభావం. పాడింది నాఫేవరెట్ సబీహ. నర్తనశాలలో "జననీ శివకామిని" పాడినప్పుడు మొదటిసారి విన్నాను. తర్వాత "అల్లాయే దిగివచ్చి.. నవ్వెరా నాకింక రంజాను పండుగ" పాడినప్పటి నుంచి నామార్కులన్నీ కడప బూబమ్మకే.
లిప్సిక "అలా మండిపడకే జాబిలీ.." ఇప్పటిదాకా వినలేదు ఈపాట. ఈఅమ్మాయిని చూస్తే "ఆంధ్రా శ్రియాగోషల్" అనిపిస్తుంది. రాజన్‌గారొచ్చిన వారం రాజన్-నాగేంద్ర కాంబినేషన్ పాటలు పాడాలి అన్నారు. నామనసులో ఓపాట ఉంది.ఎవరుపాడతారో గానీ లాల్ సలామ్ చెప్పాలనుకున్నా. 'లాల్ సలామ్' వినిపించిందేమో ఈఖమ్మం అమ్మాయికి వెంటనే "మానసవీణా మధుగీతం.." అందుకుంది. ఈపాట ఒకకాంపిటీషన్లో పాడాలంటే ధమ్ముండాలి. ఆర్టిఫిషియల్ ఎఫెక్ట్స్ అన్నీ ఆలవోకగా పాడెయటం చూస్తే గొంతులో ఎన్నితంత్రులున్నాయా అనిపిస్తుంది. షకలకబేబిపాటని కేకకెవ్వు పెటించింది.
కార్తీక్ గాడి దోస్తీ పాట సంగీతం బాపు-రమణ పద్దతిలో లేకపోయినా (చిరుకి ఎలాఉండాలో నర్సాపురం డైరెక్టరుకి తెలుసుగా.) భావంమాత్రం వాళ్లదోస్తీలానే ఉంది. ఈమతిమరుపు మంగబాబు అలవాటు ప్రకారం మళ్ళీ రెండొచరణాన్ని చెగోడీల్లా నమిలేశాడు.
తర్వాత అనంతపురం రాజేష్ "నీవుంటే వేరేకనులెందుకు" మొదలెట్టాడు. వీడుపాడాడంటే నాకు ఒకయాంగిల్లో ఎస్పీబీ ఇంకోయాంగిల్లో పీఎస్పీబీ(కన్నడంకూడా వచ్చట) కనిపిస్తారు. ప్రైజుసంగతి పక్కనపెడితే ప్రొఫెషనల్గా ఎదిగే లక్షణాలు పుష్కలం. దేవుడిచ్చిన గొంతు ఒకవరం.
ఇక గుంటూరమ్మాయి మల్లిక రాంబటుచేత మళ్ళీకోతికొమ్మచ్చి. విన్నంతలోనే కట్టిపడేసే ప్రత్యేకలక్షణాలేవీ లేకపోయినా పెర్ఫార్మెన్స్‌లో కన్సిస్టెన్సీ బావుంటుంది. చూస్తున్నంత సేపు మాలీపిది గుర్తొస్తుంది.
ఇక మౌనిమ (జగదాంబ) సంపూర్ణరామాయణంలో శబరిపాట. ఆగొంతులో ఉండాల్సిన వ..ణ్‌ణు..కు లేదనిపించింది. ఈపిల్ల మిగతావాళ్లకంటే కొంచెంతేడా. చూపులోనే పెళుసుమోత్తనం కనిపిస్తుంది. కాంపిటీషన్ ఎక్సామ్స్ బాగారాస్తుందనుకుంటా. పాటకన్నా నవ్వుబావుంటుంది. (ఇడ్లీకన్నా చట్నీబావుంటుంది.) ఫేస్‌గ్లామర్‌తో గుడ్‌విల్‌మార్క్స్ కొట్టేస్తుంది.
చివరగా శ్రీకాకుళం సాగర్ "శివశివశంకర.." మొదలెట్టాడు. ఈపాట వినగానే చిన్నప్పటి భజనే గుర్తొస్తుంది. "మారేడు నీవని ఏరేరితేనా మారేడు దళములు నీపూజకు" వాహ్! అంతే. పాటంటే ఇంతే. తనగొంతుతో పాడటం ఈఅబ్బాయిలో నాకు బాగానచ్చేది .
అలా అలా చూస్తున్నంతలోనే కోతికొమ్మచి పూర్తయ్యింది. మళ్ళీఇంకోవారంకూడా వీళ్ళేనన్న ఆనందంతో ఇంకోతికొమ్మచ్చి చూసేందుకు ఎదురుచూడాలి.
కోతికొమ్మచ్చి చదివేందుకు తీరికలేదని పవాసాంద్రులకోసం ఎంపీత్ర్రీలు వదిలారట. ప్రోగ్రాం మద్యలో తెలిసింది. దాన్ని చదువుతూ చేతిలో కాఫీగ్లాసునే పట్టుకోవడానికే సర్కస్‌ఫీట్లు చేశాను. ఇక డ్రైవింగ్‌చేస్తూ వింటే స్టీరింగ్‌కంట్రోల్ చెయ్యడం బ్రహ్మతరంకూడా కాదు.
ఇంకో ముఖ్యమైనవిషయం- ప్రకటనల సమయంలో ఒకకొత్తటీవీషో ప్రమో వచ్చింది. చూడగానే ఎందుకో ఎడమకన్ను కొట్టుకుంది. కొంపతీసి 'బాబు‌'దే అయితే మళ్ళీతెలుగుప్రేక్షకుడికి బాడ్‌టైం మొదలయ్యింది. మనబ్లాగర్లలో కొంతమంది అరివీరఫాన్లున్నారు. వాళ్ళు చూసి కూడలికొచ్చి విశేషాలు వివరిస్తారు. అప్పటిదాకా ఈటీవీ మాటీవీ కాదనుకోవడమే.

జ్వరం తగ్గింది

ఈమద్య నెలరోజులుగా డెంగూ, చికున్‌గున్యాలను మించిన జ్వరం ఒకటి ప్రపంచం మొత్తం వ్యాపించింది. మొదట్లో మనదేశంలో అంతప్రభావం చూపదనుకున్నా. ఇక్కడ మనోళ్లకి మరోజ్వరం ఉంది. కొత్తజ్వరం సీజన్ మొదలయినప్పుడొచ్చి అయిపోగానే తగ్గిపోతుంది. కానీ మనకున్న జ్వరం (అన్నట్టు ఈజ్వరం నాకూ ఉంది. స్కూల్లో ఉన్నప్పుడొచ్చింది. ఇన్నేళ్ళయినా తగ్గలా.) అంతతుగ్గా తగ్గదు.

నాఅంచనాలను తారుమారు చేస్తూ నెమ్మదిగా ఇక్కడా బలపడింది. రోగులకేసులు బానే నమోదయ్యాయని మీడీయాగణాంకాలూ చెప్పసాగాయి. ఈజ్వరాన్ని అదుపులోకి తెచ్చేపని వైద్యఆరోగ్యశాఖ చేతిలో ఉండకపోవడం మరోవిడ్డూరం. నాకు మొదట్నుంచీ ఇమ్యునిటీ ఎక్కువ. ఇంటర్ చదివేప్పుడు హాస్టల్లో అందరికీ కోడినక్క(చికెన్‌ఫాక్స్), చెన్నపట్నపుకన్ను(మెడ్రాస్‌ఐ) వచ్చినా నాజోలికి రాలేకపోయాయి. అందులో పాతజ్వరం కొంచెంబలంగా ఉంటే కొత్తజ్వరం పెద్దగా ఎఫక్టు ఇవ్వదుట.

నిన్నరాత్రి ఇస్పాను కప్పు ఎగరేసుకుపోవడంతో ఇకమనకు జ్వరంతగ్గొచ్చు. కానీ ఆదేశపోళ్లకి మరోరెండుమూడేళ్ళు తగ్గడం కష్టమే. ఫుట్‌బాల్ ఫీవర్ అనీ నెలరోజుల్నుంచి ప్రపంచంమీద పడి విచ్చలవిడిగా డాన్సేసింది. మామూలుగా కొత్తరోగమొస్తే డాక్టర్లకి, మందులషాపులోళ్లకి పండగ. కానీ ఈరోగంమాత్రం వ్యాపారవర్గాలకు, మీడియాకి పండగజేస్కోమంది. ఈరోగమొచ్చినోళ్ల ప్రవర్తన దాదాపూ నాబోటి క్రికెట్‌ పిచ్చోడిలానే ఉంటుంది. కాకపోతే చిన్నచిన్నతేడాలు. అన్నింటికన్నా ముఖ్యమైనది- “”నేను చిన్నప్పుట్నుంచి ఫుట్‌బాల్ మేచెస్ వాచ్ చేస్తుంటా. మానాన్న(లేదా తాత, బాబాయ్ వగైరా) చెప్పేవాడురా క్రికెట్ ఓసుత్తిగేమ్ అని.”” ఇలా ఉంటుంది వీళ్ళ యవ్వారం. లాటిన్‌కంట్రీస్, యూరోపియన్స్, అమెరికన్స్... అంటూ వీరసుత్తి ఓవైపు. అరగంటకోసారి ఆక్టోపస్ జ్యోస్యం నెట్లోవెతుక్కుంటూ మదనపడిపోతుంటారు. నోరుతెరిస్తే (మొన్నటిదాకా సచిన్, యువీ, సెహ్వాగ్ తప్ప ఇవేవీ తెలీనోడు.) మెస్సి, ముల్లర్ అంటూ మరోపక్క వాయింపు. ఒరేయ్!నీకు భైచుంగ్ భుటియా తెలుసా? అనడిగితే ఎవురూఊఊ? అనడుతారు.అదీ విషయం.

మొత్తానికీ ఈరోగాన్ని మనదేశంలో విజయవంతంగా వ్యాపింపచేసినందుకు మీడియావాళ్ల తెలివికి జోహార్లు. అబ్బయ్యల్లారా! మీకు ఆఆట నచ్చేస్తే చూసేస్కుని, మందేస్కుని చిందేస్కోండి. మద్యలో క్రికెట్ గురించెందుకు చెప్పు? నాకుమాత్రం నాక్రికెట్ గొప్ప. మేరాక్రికెట్ మహాన్. క్రికెట్ ఏదో నేలబారు ఆటయినట్టు అక్కడికేదో ఫుట్‌బాల్ మాత్రం పిచ్చక్లాస్ అయినట్టు విశ్లేషణలు చిరాకుపుట్టిస్తాయి.

ఎంతఇమ్యూనిటీ ఉన్నా ఇంతపెద్దజ్వరమ్ ఎఫెక్టు మినిమమ్ ఉంటుంది కదా. చిన్నచిన్న తుమ్ములు, దగ్గులు వచ్చాయి. మనోళ్లు ఎలానూ ఆడరుకాబట్టి ఎవరోఒకరికి మద్దతు ఇవ్వకపోతే థ్రిల్ ఉండదుగా. ఎవరెవరు ఆడతారో పట్టీచూశా. పాకిస్థానూ ఆడదట. మనసుకొంచెం స్థిమితపడింది. ఇంతలో ఐక్యరాజ్యసమితి, భారతదేశం విదేశాంగ విథానం వగైరాలు గుర్తొచ్చి రష్యాకే నామద్దతు అని ప్రకటించా. ఊహూ అదీ ఆడదు అన్నారు. ఏవిటీ రష్యా అంతదేశం, ఒలింపిక్సులో డజన్లకొద్దీ పతకాలని గెలిచేసే దేశమే ఆడదంటే మనం ఆడట్లేదని అంత'ఇది‌' కానవసరంలేదని నిశ్చయిమ్చుకున్నా.
మొన్న మూడోస్థానం కోసం జరిగిన మాచ్ చూద్దామని కూర్చున్నా.చుట్టూ వ్యాధిముదిరిన రోగులు. "కామెంట్రీ ఎవర్రా? బాయ్‌కాటా?గవాస్కరా?" ఇది నామొదటిప్రశ్న. "ఇందులో కామెంట్రీ ఉంటుందికానీ అంత ఇంపార్టెంట్ కాదు." అన్నాడొక రోగి. బూఊఊఊ మంటూ బూరలు. ఊదుతూనే ఉన్నారు. ఆగోలలో కామెంట్రీ వినిపిస్తేగా. అదేక్రికెట్తయితే కళ్ళుమూసుకుని కామెంట్రీవిన్నా మాచ్ అర్థమైపోతుంది.

ఇంతలో రెఫరీ ఝెండాచూపాడు. అది అటు పసుపూ ఇటు ఎరుపూకాకుండా రెండూకలిసి చెస్‌బోర్డులా ఉంది. అదేంట్రా? అని అడితే ఆఫ్‌సైడ్ అన్నాడు. "అదేంటి ఆఫ్సైడు, ఆన్సైడుకి సిగ్నల్సు? మాక్రికెట్లో ఇలాంటివేమీ ఉండవు. ఎటైనా కొట్టుకోవచ్చు." అన్నా. ఒకడి చొక్కామీద ఫ్రెడరిక్ అని ఉంది. వాడు జర్మనీవాడు. ఉరుగ్వేజట్టులో వాల్టేర్ అని ఇంకోడున్నాడు. ఆహా 'వోల్టేర్ అండ్ ఫ్రెడరిక్ దిగ్రేట్' ఇద్దరూ ఆడుతారా? అనడిగా. ఎవడో ముల్లర్ గాడుట గోల్ కొట్టాడు. అబ్బో మాక్స్‌ముల్లర్ కూడా ఫుట్‌బాల్ ఆడుతాడా? వాడిని ఫుట్‌బాల్ని కొట్టినట్టు కొట్టాలి అనుకుంటుంటే మావాడు "వాడీపేరు మాక్స్‌ముల్లర్‌కాదురా. థామస్‌ముల్లర్‌" అని చెప్పడంతో ఆలోచన విరమించా. ఇంతలో చిన్నడౌటొచ్చి వాడిపక్క తిరిగా. అప్పటికే నాతో విసిగిపోయాడు. మామూలుగా జ్వరమొచ్చినోడికి సహనం తక్కువకదా. (పేషేంట్స్‌కి పేషెన్స్ తక్కువ.) కానీ చూసేటీవీ నాది. కాబట్టి భరించక తప్పదు. "ఒరేయ్ గ్రీస్ ఆడుతుందా?" అని అడిగా. ఏం అన్నాడు. "ఏంలేదుబే గ్రీస్ టీంలో అయితే ఆర్కిమెడీస్, సోక్రటీస్, హెరిడేటస్, పైథాగరస్‌లను చూడొచ్చని" అన్నా. "నిన్ను తీస్కెళ్ళి శ్రీలంకటీంలో పడేస్తా. అక్కడైతే రావణుడు, కుంభకర్ణుడూ, ఇంద్రజిత్తూ ఉంటారు.” అన్నాడు. ఇంతలో మాచ్ ముగిసింది. నేననుకున్నట్టే జర్మనీ గెలిచింది. నేను మొదట్నుంచి జర్మనీ గెలవాలనుకున్నా. కనీసం ఇదిగెలిచాకయినా ఆనోరులేని ఆక్టోపస్‌ని చంపాలన్న ఆలోచన మారుతుందని. మావాడు వెళ్తూవెళ్తూ "ఆదివారం రాత్రి ఫైనల్. నువ్వు రూంలో ఉండొద్దు. తాళాలిచ్చి ఎక్కడికైనా వెళ్ళిపో." అన్నాడు.

ముందే చెప్పాగా టీవీ నాదని. దాంతో ఫైనల్కి వాడువేరేటీవీని వెతుక్కుని వెళ్ళిపోయాడు. మరో ఇద్దరుముగ్గురొచ్చారు ఫైనల్ చూసేందుకు. నాకూ కొంచెంజిల పుట్టింది. ఎంతైనా ఫైనల్ కదా.  ప్రారంభోత్సవంలో ఎటుచూసిన కనిపిమ్చిన నల్లమొహాలు ఈసారి మాయమయ్యాయి. ఇప్పుడంతా తెల్లపిల్లలే. వార్నీ ఇన్నిరోజులూ సూక్తువల్లిస్తూ వ్యాపారంచేసి ఇప్పుడేమో ఇలా. ఒకపక్క ఇస్పాను మరోపక్క ఆరెంజ్‌ఆర్మీ. ఫైనల్ కొంచెం చిరాకేసింది. వీళ్ళాఫైనలిస్టులు అనిపించింది. హాలెండువాళ్ళు గోల్స్ కోసంకాక యెల్లోకార్డులకోసం ఆడుతున్నారు. ఏదో అనుకున్నా కానీ ఫైనల్ అంత థ్రిల్లింగా లేదు. మూడోస్థానంకోసం జరిగిందే చాలాబెటర్ అనిపించింది. టీవీకట్టేసి పడుకున్నా. ఉదయం లేచిచూస్తే స్పెయిన్ గెల్చిందట. ఏదో ఫైనల్‌కి చేరారు. ఒకగోల్ కొట్టారు. కాబట్టి గెలిచారు. అంతేతప్ప 'విజేత‌' అనిపిమ్చలా. అంతా మనమంచికే జరిగింది. మాచ్ మరీఇంటరెస్టింగా ఉంటే నాక్రికెట్‌కి ద్రోహం చేసెయ్యను. మరోసారి గాట్టిగా మేరా క్రికెట్ మహాన్.

ద్వైతాద్వైతసంగమం 'తుంగభద్ర'

కావేరీ తుంగభద్రాచ కృష్ణవేణీచ గౌతమీ
భాగీరథీతి విఖ్యాతాః పంచగంగాః ప్రకీర్తితాః

పశ్చిమకనుమల్లో పుట్టిన రెండునదులు తమగమనంతోపాటూ కాలగమనంలో పుట్టుకొచ్చిన రెండు ఉన్నతమైన వైదికధర్మాలను మోసుకొచ్చి, తమకలయికతో మరోగొప్పనదికి జీవం పోశాయి.వరాహపర్వతాల్లో అద్వైతధర్మానికి నదీరూపంగా భావించే తుంగానది, అదేప్రాంతానికి దక్షిణభాగంలో ద్వైతధర్మానికి ప్రతీకైన భద్రానది ఉద్భవిస్తాయి. కొండల్లోంచి పరుగులుపెడుతూ, జలపాతాల్లా కిందకి దుముకుతూ, మెలికలు తిరుగుతూ తుంగానది 147km మరియు భద్రానది 171km దూరం ప్రయాణించాక, శివమొగ్గ దగ్గర్లోని కూడలి దగ్గర కలిసి తుంగభద్రకు జీవంపోస్తాయి. ఇక్కడినుంచి దక్కనుపీఠభూమిలో ప్రవహిస్తూ కర్ణాటకలోని శివమొగ్గ, ఉత్తరకన్నడ, చిత్రదుర్గం, బళ్ళారి అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలుజిల్లాల్లో 531km ప్రవహించి కృష్ణమ్మ ఒడిలోకి చేరుకుంటూంది. అటుపై శ్రీశైలంమల్లన్న కాళ్ళుకడిగాక హంసలదీవి వరకు సాగేదారి తెలిసిందే. పశ్చిమకనుమల్లో మొదల్లయే ప్రవాహం ఆపై పీఠభూమిలోని కఠినశిలలపై సాగడంతో కొంచెంవేగం ఎక్కువగా ఉంటుంది. తుంగభద్రలో మొసళ్ళు ఎక్కువని తెనాలిరామకృష్ణుడు చెప్పినట్టు గుర్తు.  


నిజానికి తుంగభద్ర అనేది కేవలం 530km ప్రవహించి మరోనదిలో కలిసిపోయే ఒక ఉపనది. కానీ ఈనది ప్రాముఖ్యత పురాణాల్లోను, మద్యయుగచరిత్రలోనే కాదు, ఆధునికభారతావని సాధించిన పురోగతిలోనూ ఒకవిశిష్టస్థానం ఉంది. ద్వైతాద్వైతధర్మాలవంటి వైదికసిద్ధాంతాలను, ముష్కరమూకలకు తలొగ్గకుండా సుఖశాంతులతో పాలించిన సామ్రాజ్యాన్ని, సాగునీటి ప్రాజెక్టులద్వారా సస్యశ్యామలమైన వ్యవసాయక్షేత్రాల్ని, ఖనిజాల్ని వెలికితీసే పారిశ్రామలను తన ఒడిలోదాచుకుంది తుంగభద్ర.

పురాణాల్లో ఈనదిని పంపానదిగాను, దీని పరీవాహకప్రాంతాన్ని కిష్కింధగాను పేర్కొన్నారు. శృంగేరీలో ఆదిశంకరాచార్యునిచే నెలకొల్పిన దక్షిణామ్నాయ శ్రీశారదాపీఠం తుంగానది ఒడ్డున వెలసిన క్షేత్రాల్లో ప్రముఖమైనది. తుంగాపానం-గంగాస్నానం అని పెద్దలు చెప్పారంటె ఈనది ప్రాముఖ్యతను అర్థం చేసుకోవచ్చు. ఆదిశంకరుడు తనశిష్యబృందంతోబాటుగా ఈప్రాంతంలో వెళ్తుండగా ప్రసవవేదనను అనుభవిస్తున్న కప్పకు నాగుపాము తనపడగను రక్షణగాఉంచి సేవచేయడం చూచి, అక్కడ దక్షిణామ్నాయపీఠం నెలకొల్పారు. తూర్పున పురుషోత్తమపురంలోను, పశ్చిమాన ద్వారకలోను అలాగే ఉత్తరాన బదరీనాథ్ దగ్గరి జ్యోతిర్మఠ్‌లోను పీఠాలను నెలకొల్పారు. ఈపీఠం కృష్ణయజుర్వేదానికి రక్షకునిగా వ్యవహరిస్తుంది. శారదాదేవి ఆలయం, విద్యాశంకరుని ఆలయం శృంగేరిలోని మరికొన్ని ముఖ్యమైనస్థలాలు. భద్రానది ఒడ్డున ఉన్న శైవారామాలు కన్నడరాజ్యంలోని వీరశైవధర్మానికి చిరునామా.

తుంగభద్రానది ఒడ్డున  మనరాష్ట్రంలోని మంత్రాలయం ఎంతోపవిత్రమైనది. ఇక్కడ మద్వధర్మాన్ని ఆచరించే గురురాఘవేంద్రమఠం ప్రాముఖ్యత తెలిసిందే. దక్షిణకాశీగా పేరొందిన మహబూబ్‌నగర్‌జిల్లాలోని ఆలంపూర్ ఈనదితీరంలోని మరొకముఖ్యస్థలం. ఇక్కడి జోగులాంబ, చాళుక్యులకాలంనాటి నవబ్రహ్మమందిరాలు ప్రముఖక్షేత్రాలు. అన్నిటికన్నా ముఖ్యమైనది ఈప్రాంతలో తెలుగు కన్నడిగుల మద్యనున్న స్నేహం. తేటతెనుగు-కస్తూరికన్నడలు పాలునీళ్లలా కలిసి శతాబ్దాలుగా సహజీవనం సాగిస్తున్నారు. కన్నడరాజులు తెలుగుకు చేసినసేవ, అలానే తెలుగువాళ్ళు కన్నడిగులతో పెంచుకున్న బంధం ఒకపరిణితిచెందిన సాంస్కృతికబంధాన్ని నెలకొల్పాయి.


ఈనదిఒడ్డున నిర్మితమైన పట్టణాల్లో అత్యంతముఖ్యమైంది హంపి. ఒకవైపు తుంగభద్ర మరోవైపు ఎత్తైనకొండలతో ఈప్రాంతం శత్రుదుర్భేధ్యంగా ఉండెది. విషసర్పాలవంటి పొరుగురాజ్యలనుంచి ప్రజలను కాపాడుతూ, కళలకు కాణాచిగా పేరొంది, పరిపాలన అన్నపదానికే నిర్వచనం చెప్పిన విజయనగరసామ్రాజ్యపు సాంస్కృతికరాజధానిగా ప్రపంచవారసత్వ సంపదల్లో తలమానికమైన నగరం ఇది. విజయనగరసామ్రాజ్యంకన్నా పురాతనమైనది ఈపట్టణం. ఇక్కడి ఆలయాల్లో విజయనగరశిల్పకళేకాక దానికిముందున్న హొయశాలశైలికూడా కలిసిఉంటుందని నిపుణుల అభిప్రాయం. విరూపాక్షుణిఅలయం ఇక్కడ చూచితీరాల్సిన స్థలం. దానితోపాటుగా పదులసంఖ్యలో ఉండే పర్యాటకస్థలాల్ని చూశాక ఎవడైనా ఈదేశసంస్కృతిని, ఈమట్టిలో పుట్టినశాస్త్రాలను అపహాస్యంచేస్తే ఈడ్చుకుంటూవచ్చి వీటిని చూపెట్టాలని నాస్నేహితుడు అంటుంటాడు.
కర్ణాటక అంటేనే మనకు గుర్తొచ్చేవి ప్రాజెక్టులు. ఈనది అంతర్రాష్ట్రనదికావటంతో రాష్ట్రపతిఉత్తర్వులను అనుసరించి తుంగభద్రబోర్డును నెలకొల్పారు.తుంగభద్రప్రాజెక్టుకు సంబంధించిన జలవిద్యుదుత్పత్తి, సాగునీటిసరపరాను ఈబోర్దూ నియంత్రిస్తుంది. తుంగానదిపైన శివమొగ్గవద్ద, భద్రనదిపైన లక్కవల్లివద్ద ప్రాజెక్టులను నిర్మించారు. బళ్ళారిజిల్లాలోని హోస్పేట్ వద్ద తుంగభద్రనదిపై ఆనకట్ట నిర్మించారు. కర్నూలు దగ్గర్లోని సుంకేసులవద్ద కాటన్‌దొర నిర్మించిన ఆనకట్ట ఒకటి ఉండేదట. దానిస్థానంలో ఇటీవల ఆనకట్టను కట్టి, దానికి మాజీముఖ్యమంత్రి కోట్లవిజయభాస్కరరెడ్డి పేరుపెట్టారు. వీటన్నిటినీ మించి రాయలకాలంనాటీ చెరువులు, సాగునీటిసౌకర్యాలు ఇక్కడ వ్యవసాయానికి ఎంతగానో ఉపయోగపడూతాయి. మట్టికోసుకుపోకుండా రాయలకాలంలో కట్టించిన కొన్నిరాతికట్టడాలు ఇప్పటికీ చెక్కుచెదరలేదు.

ఈనది ప్రవహించే ప్రాంతాల్లో ఖనిజవనరులు పుష్కలంగా ఉన్నాయి. ఇనుము, మాంగనీసువంటి గనులేకాక, గ్రానైట్‌క్వారీలు ఈప్రాంతంలో అధికం. వీటివల్ల జరుగుతున్న పారిశ్రామికాభివృద్ధికన్నా కాలుష్యం, అవినీతి ఎక్కువవడం అనేకవివాదాలకు దారితీస్తుంది. నీటిపారుదల సౌకర్యాలు పుష్కలంగా ఉన్నా వాటిమరమ్మతులు సరిగా జరపకపోవడంతో అనేకజలశయాలతోపాటు రాయలకాలంనాటి చెరువుల సామర్థ్యంసైతం ఏటికేడు తగ్గిపోతుంది. ఇటీవలికాలంలో ఇక్కడ నెలకొల్పుతున్న కర్మాగారాలు, వాటికి అనుబంధంగా నిర్మిస్తున్న రహదారులవల్ల ఇక్కడి జీవవైవిధ్యం దెబ్బతింటుంది. కొన్ని అరుదైనవానరజాతులు నశిస్తున్నాయి.
ఇలా రెండు విశిష్టవైదికధర్మాలనుంచి ఉద్భవించి,తనువెళ్ళేదారిని సస్యశ్యామలం చేస్తూ  పంచగంగల్లో ఒకటిగా స్థానం సంపాదించుకున్న తుంగభద్రనది దాని ఒడ్డున వెలసినక్షేత్రాలకు, నిర్మించిన రాజ్యాలకు, విరాజిల్లిన కళలకు, ఆనీళ్ళతో గొంతుతడుపుకుంతున్న ప్రజలకు మాతృసమానురాలు.


నకిలీ

వాఖ్య- నిజజీవితంలో మనమేదైనా మాట్లాడినప్పుడు ఇది ఎదురైతే రగిలిపోతాం. కానీ బ్లాగుల్లో పరిస్థితి పూర్తిగా విరుద్ధం. టపారాశాక అరగంటకొకసారి పేజీతెరిచి కొత్తవ్యాఖ్యలేమైనా వచ్చాయా అని చూసుకోను రోజంతా గడిచిపోతుంది. ఇక్కడ వ్యాఖ్యలే ఇంధనం. రోజూ వచ్చేదానికన్నా రెండుమూడు వ్యాఖ్యలెక్కువొచ్చినా తక్కువొచ్చినా బహుశా ఆరోజంతా చుట్టుపక్కల పరిసరాలతో సంబంధబాంధవ్యాలు తెగిపోతాయనుకుంటా. కొత్తబ్లాగు కనిపిస్తే బ్లాగు గురించేకాక, సదరుబ్లాగరు గురించికూడా ఓ అవగాహన కల్పించేదీ వ్యాఖ్యలే. అంతేకాదు ఆబ్లాగరుకి బ్లాగ్మిత్రులెవరు? వ్యక్తిత్వం ఎలాంటిది అన్న సున్నిత విషయాలు వ్యాఖ్యలు చెప్పకనే చెబుతాయి. ఒకరకంగా చెప్పాలంటే బ్లాగుకి టీఆర్‌పీ రేటింగులు నిర్ణయించేది వ్యాఖ్యలే. వీటిగురించి విపరీతంగా ఆలోచించేసి ఆరోగ్యాన్ని చెడగొట్టుకునే బ్లాగర్లూ ఉన్నారు.కొన్నివిషయాల గురించి రాసినప్పుడు వ్యాఖ్యలరూపంలో జరిగే చర్చలు మంచిసమాచారాన్ని అందజేస్తాయి. మాలాంటి కుర్రబ్లాగర్లు ఎవరైనా కొంతకాలం తర్వాత చూసినప్పుడు అక్కడి చర్చ ఎంతోఉపయోగకరంగా కనిపిస్తుంది.

పోయినవారం "ఏరా కూడలి ఎలాఉంది?" అని నాబ్లాగ్మిత్రుడిని అడిగితే లింకులు పంపాడు. వాటిని చూశాక కూడలి రగులుతుందని అర్థం అయ్యింది. ఇదిమామూలే కదా? అనుకుందామంటే రగులుతున్న విషయం ఆసక్తికరంగా కనిపించి ఇంకొన్నిలింకులు తెరిచి చూశా. విషయాన్ని క్లుప్తంగా చెప్పాలంటే 'ఫోర్జరీ వ్యాఖ్యలు'.

ఎలా జరిగాయి? ఎవరుచేశారు? ఇలాంటివి నాకు తెలీదు. కానీ జరిగింది మాత్రం ఖచ్చితంగా ఖండించాల్సిందే. కానీ వారంరోజులుగా నాకు ఖండించేందుకు వీలుచిక్కలా. అందుకే ఇప్పుడు ఖండిస్తున్నా. ఇప్పటిదాకా వ్యాఖ్యల్లో మనంచూసిన అత్యంత అనాగరికచర్య అజ్ఞాతరూపంలో వచ్చి తిట్టడం. కానీ ఇది అస్సలు ఊహించని పరిణామం. నామిత్రుడు విషయం చెప్పకుండా ఒకలింకు పంపాడు. అక్కడి వ్యాఖ్యను చూసి నమ్మలేక పోయాను. ఏంటిబాబూ ఇలారాశాడు కామెంటు అనుకుని జుట్టుపట్టుకున్నా. ఆతర్వాత పంపినలింకు చూశాక అర్థం అయ్యింది. ఆఒక్కబ్లాగరునేకాక ఇంకొంతమంది పేరుమోసిన బ్లాగర్లుకూడా ఈ-పేర్ల కుట్రలో బాధితులు అని తెలిసింది. ఇక్కడ జరిగింది ఏమాత్రం సమర్థించకూడదు. నాకు తెలిసీ ఎవరూ సమర్థించలేదనుకుంటా. ఈపని చేసినవాడికి పిరికిపంద, మానసికరోగి లాంటిపదాలు సరిపడవు.

ఇలాంటివి జరిగిన వెంటనే అనుమానితుల జాబితా ఒకటి తయారుచేసుకుని ఉంటారు ఎవరికివాళ్ళు. ఈజాబితాకి మూలం గతంలో తమని కెలికిన బ్లాగర్లు. ఈవిషయంలో నా అభిప్రాయం- మనజాబితాలేవీ కరెక్టుకాదు. ఎందుకంటే పిల్లచేష్టలు, వెకిలివేషాలు వేస్తారు అనుకుని మనం అనుమానిమ్చేవాళ్ళంతా గతంలో తమపేరుమీదే చేశారు అవన్నీ. మరి ఇలా వేరేవాళ్ళపేర్లు పెట్టుకుని చెయ్యాల్సిన అవసరంలేదు. కాలేజీపిల్లలతో ఇంకొకజాబితా ఉంది. వాళ్ళేదో వాళ్ల ఆనందాన్ని పంచుకోవటం తప్ప ఇంత కుట్రలు పన్నడానికి ఇళ్ళల్లో డైలీసీరియళ్లు చూడరు. కాబట్టి అయ్యా సీనియర్ బ్లాగర్లూ కొద్దిగా ఓపికవహించండి. అనవసరంగా ఆవేశపడి నిందించొద్దు. ఇక్కడ జరుగుతున్న దాన్ని ఎవరూ సమర్థించడంలేదు.

కానికాలం

త్రేతాయుగంలో పడ్డకష్టాలు చాలవన్నట్టు సీతమ్మకి కలికాలం కానికాలంగా దాపురించింది. ఏతల్లి పాదధూళితో పునీతమైన భూమిపై పుట్టి ప్రజలు చల్లగా బతికారో, బతుకుతున్నారో, బతుకుతారో ఆతల్లికే మకిలి అంటగట్టాలని చూస్తున్నారు. ఏతల్లి చల్లటిచూపుతో చేసినపాతకాలన్నీ క్షణకాలంలో నశిస్తాయో ఆతల్లిపైనే కామపుచూపులు కమ్ముకుంటున్న పాషాణకాలమిది. దశకంఠుడు సైతం ఆనిప్పుకణాన్ని తాకేందుకు భయడితే ఈకలిసేవకునికి ఆభయంకూడా లేదు.

జరుగుతున్నవి చూస్తుంటే ఎమ్మెస్ రామారవు సుందరకాండలో హనుమంతుడు సీతమ్మ పడుతున్న కష్టాలు చూసి బాధపడుతూ అనేమాటలు గుర్తొచ్చాయి. ఆభాగం కింద పెడుతున్నా.

పువ్వులునిండిన పొలమునందునా
నాగేటిచాలున జననమందినా
జనకమహారాజు కూతురైనా
దశరథనరపాలు కోడాలైనా
సీతాలక్ష్మికి కాదుసమానము
త్రైలోక్యరాజ్య లక్ష్మీసహితము
అంతటిమాతకా కానికాలమని
మారుతివగచే సీతనుకనుగొని

శత్రుతాపకరుడు మహాశూరుడు
సౌమిత్రికీ పూజ్యురాలైన
అశ్రితజన సంరక్షుడైన
శ్రీరఘురాముని ప్రియసతియైన
పతిసన్నిథియే సుఖమనియెంచి
పదునాల్గేండ్లు వనమునకేగిన
అంతటిమాతకా కానికాలమని
మారుతివగచే సీతనుకనుగొని

బంగరుమేని కాంతులుమెరయ
మందస్మితముఖ పద్మమువిరియా
హంసతూళికా తల్పమందునా
రామునికూడి సుఖింపగతగినా
పురుషోత్తముని పావనచరితుని
శ్రీరఘురాముని ప్రియసతుయైనా
అంతటిమాతకా కానికాలమని
మారుతివగచే సీతనుకనుగొని

ఏమిటిలోకం

ఎంఎఫ్ హుస్సేన్ అనేపేరు ఇంటర్లో ఉన్నప్పుడు మాధురి 'గజగామిని‌' అప్పుడు విన్నా. ఆతర్వాత అడపాదడపా మీడియాలో చూశాను. వయసులో పెద్దాయన, చేతిలో పనితనం ఉన్నతను వగైరా వగైరాలతో మంచివ్యక్తి అని చిన్న‌అభిప్రాయం.
హిందూదేవతల్ని, భారతమాతను నగ్నంగా గీశాడు అని విన్నాను కానీ వాటిని చూసేందుకు అవకాశంలేదు. చూడాలనీ అనుకోలేదు. మొన్నామద్యన మళ్ళీగొడవ మొదలవ్వడం ఆతర్వాత ఒకమిత్రుడు ఆచిత్రరాజాలను పంపడంతో వాటిని చూసి అందులోని ఉన్నతప్రమాణాలను అర్థంచేసుకోలేని నాలోని అర్భకుడు తలపట్టుక్కూచున్నాడు. నేనేమీ పెయింటింగ్‌లను కొని ఇంట్లోపెట్టుకునే కళాపోషకుణ్ణికాదు. కనీసం ఆర్ట్ ఎగ్జిబిషన్లకు ఎగేసుకుపోయే కళాపిపాసినికాదు. అంతెందుకు మాంచిపెయింటింగ్లను డౌన్లోడ్ చేసుకుని డెస్క్‌టాప్ పైన పెట్టుకునేంత తృష్ణ నాలోలేదు. అయినా మనిషన్నాక కొద్దోగొప్పో ఆలోచించగలుగుతాడు. వాటికి అనుగుణంగా కొన్నినిర్ణయాలకు రాగలుగుతాడు. నేనిక్కడ రాస్తున్నవికూడా అలాంటి ఆలోచనలకు టపారూపమే.

మహేష్‌గారి బ్లాగులో మద్యాహ్నం కామెంట్ రాసినప్పుడు ఆయనిచ్చిన సమాధానం చదివాక నాకొచ్చిన అనుమానాలు.(ఇవి ఆయనపై విమర్శకోసం కాదు. కొంతసేపటిక్రితమే మాఇద్దరి మద్యనా చర్చజరిగింది. వాదనలు చెయ్యడం బాగోదుగనుక అక్కడ రాయలేక నాబ్లాగులో రాసుకుంటున్నా. మహేష్‌గారు తప్పుగా అర్థం చేసుకోవద్దు.) రాజారవివర్మకు ముందు ఇక్కడదేవతల్ని బట్టలతో ఎవరూచూడలేదు అంటున్నారు మరి బట్టలుకట్టకుండా ఏమూలవిరాట్టుకైనా పూజలుచెయ్యడం చూశారా?  గుడిపైన బొమ్మల్ని చూద్దాం. అక్కడ నగ్నంగా కనిపించేవి దేవతలుకాదు. దేవతల బొమ్మలు గోపురంముఖాల మద్యభాగంలో ఉంటాయి. అంచున నందీశ్వరుడు, సింహం వగైరావగైరా ఉంటాయి. మద్యలో వివిధభంగిమలలో ఉండేవి దేవతలుకాదు. మనుషులు లేక గంధర్వుల్లాంటి ఊర్థ్వలోకంలోనివారు. (ఇదినాఅభిప్రాయమే) ఇంకోవిషయం- ఆబొమ్మలలోని దేవతలకు బట్టలు ఉంటాయి. కానీ అవిచూసిన వెంటనే కనిపించవు. వాటి అంచులకు వేసిన డిజైన్లు, కుచ్చిళ్ళు వంటివి చూస్తే అర్థం అవుతుంది. అందుకే చనుమొనలు, జననాంగాలు వంటివి చూపరు.

సరె అప్పట్లో అలానే ఉన్నారని అనుకుందాం. మరి ఇప్పుడు అలావెయ్యాల్సిన అవసరం ఏమొచ్చింది? బట్టలు నెయ్యడం రాకముందు సమాజమంతా దిశమొలలే. ఇప్పుడూ అలానే తిరగొచ్చా?

బట్టలవిషయాన్ని పక్కనపెడదాం. మరి రావణుని తొడపైన సీతమ్మ కూర్చోవడం ఏమిటీ? మాయవేషంలో వచ్చి లంకకు అపహరించుకుపొయ్యేప్పుడుకూడా ఆతల్లిని నేరుగా తాకకుండా ఆమె సొమ్మసిల్లిపడిపోయిన ప్రాంతాన్ని నేలతోసహా పెకలించి తీసుకెళ్ళాడు. ఆతర్వాత అశొకవనంలోకూడా తనంతట తానుగా ఒప్పుకుంటేనే తాకుతానని చెప్పాడు. ఈరెండు వాల్మీకిరామాయణంలో చెప్పినవే. మరి దీనికేమి చెప్తాడు?

మరి ఇతరచిత్రాల్లో ఆయనగీసిన దృశ్యాలను ఏరకంగా అర్థంచేసుకోవాలో? దుర్గాదేవితో పులి వగైరా వగైరా. వీటిగురించి చదువుకున్నోడేకాదు నిరక్షరాస్యుడైనాసరే ఊహించుకునేందుకే ఏవగించుకుంటాడు. స్త్రీల స్వాభిమానం గురించి, స్వావలంబన గురించిమాట్లాడే ఫెమినిస్టులకు ఇక్కడ శక్తిస్వరూపిణి అయిన స్త్రీకి జరిగిన అవమానం పట్టలేదా? దుర్గామాత ఈసమాజంలో స్త్రీశక్తికి ప్రతీకగా చూస్తారా? లేక ఒకహిందూదేవత కాబట్టి మనమంతా సెక్యులర్లం అని తలతిప్పుకుపోతారా?

ఆయనకు ఊహాలోకంలో కనిపిమ్చినవంతా గీసుకొమ్మను. కానీ ఆతర్వాత తనిచేసినపనికి ఎవరైనా బాథపడుతారేమో అని ఒక్కసారి ఆలోచించల్సిన బాద్యత కళాకారుడిగా, వృద్ధుడిగా కాదు కనీసం మనిషిగా పాటించాల్సిన కనీసధర్మం. ఆఆలోచనలేనివ్యక్తి, చేసినతప్పుకు పశ్చాత్తపం చెందనివాడు ఈసమాజంలో ఉంటేఎంత? పోతేఎంత? కళ అనేది మనషి వికాసానికి , సమాజానికి మార్గంచూపడానికి పాటుపడ్దప్పుడే దాని ఉనికి అర్థం. నీద్వారా రూపుదిద్దుకున్నవి ఎవరిని బాగు పరుస్తాయి? తల్లిలోనూ, చెల్లిలోనూ నగ్నత్వం చూడ్డంగాక ఒరిగేదేముంది? అయ్యా హుస్సేన్గారు (లేక ఆయన తరపున వకాల్తాపుచ్చుకున్నవాళ్ళూ) ఆచిత్రాలను ఏభావంతో గీశారో చెప్పికాస్త పుణ్యకట్టుకో(ండి). నాకింకా జ్ఞానదంతం మొలవలా. వచ్చిమొలిపించండి. ఆనొప్పిభరిస్తా.

గీసేప్పుడు సరే ఏదోఆవేశంలో జరిగిపోయింది. మరిదాన్ని ప్రదర్శించేటప్పుడు ఆలోచించాలా?వద్దా? మరి వద్దని నువ్వనుకున్నప్పుడు మేమెందుకు నీగురించి ఆలోచించాలి? ఇక్కడ జరుగుతున్న ఇంకోతమాషా- ఆయన్ని సమర్థించేవాళ్ళంతా సమాజంలో కుళ్ళును తీసేసేవాళ్ళు. వ్యతిరేకించేవాళ్ళంతా హిందూమతసంస్థల కార్యకర్తలు. మరినాలాంటి సామాన్యుడిగోడు ఎవడికిపట్టింది? ఇదిమామనసును గాయపరిచింది అన్నామంటే మేమేదో మతసంస్థకి కార్యకర్తలం.
పోనీ ఆతర్వాతైనా తననిబద్ధతను నిరూపిమ్చుకున్నాడా? దేశంవదిలి వెళ్ళిపోయాడు. దీన్నిమించిన కేసులు నడుస్తున్నాయి ఇక్కడ. వాళ్ళెవరూ వదిలిపోలేదే? ఆతర్వాత ఇంకెక్కడొ పౌరుడిగా మారుతున్నావు. పోనీ ఆదేశమేమైనా పద్ధతైనదా? కళాకారుడికి అన్నింటికన్నా ముఖ్యమైనది భావప్రకటనస్వేచ్చ. అది పుష్కలంగా లభించే ఎన్నోదేశాలుండగా మచ్చుకైనా కనిపించని దేశాన్ని ఎంచుకున్నావు. ఇక్కడ నీవ్యక్తిత్వం ఏమిటో తెలియట్లేదా?

హిందువుకానీవాడు, ఆధర్మాన్ని ఒక్కరోజైనాపాటించనివాడు, కనీసం దానిగురించి తెలుసుకోవాలన్న ఆలోచనలేనివాడికి (ఇప్పుడు గీసింది హిందూదేవతల గురించి కాబట్టి. ఇది ఏసిద్ధ్హాంతానికైనా, మతానికైనా వర్తిస్తుంది. ఆయాకమ్యూనిటీల్లో భాగంగా లేనివాడికి, ఆచరించనివాడికి దానిగురిమ్చి విమర్శించెహక్కు ఉండదు.) ఇలాంటి బొమ్మలుగీసే నైతికహక్కు ఎక్కడిది? నీబోటోడు దేశాన్నొదిలి వెళ్ళిపోయినంత మాత్రాన ఇక్కడ రంగులు ఎండిపోవు, కుంచెలు విరిగిపోవు, కళాకారుల సృజనాత్మకత ఇగిరిపోదు.
నేను గమనించిన ఇంకోవిషయం- హుస్సేన్ గారి(డి) పెయింటింగ్స్ మనకు దొరకాలంటే లక్షలుపొయ్యాలి. కొన్ని శాంపిల్స్ ఇంటర్నెట్‌లో ఉన్నా వాటి నాసిరకంవి. మరి ఈచిత్రాలుమాత్రం ఉచితంగా విచ్చలవిడిగా దొరుకుతున్నాయి. పైరసీ విషయంలో ఎన్నోజాగ్రత్తలు తీసుకునే ఆయన వీటినెందుకు ఇలావదిలాడొ?

ఏది ధర్మం

ఈ టపారాయడానికి రెండుమూడూరోజులు ఆలోచించా. కారణం చదివాక మీకే తెలుస్తుంది.జరగబోయే దాడులకు మానసికంగా సిద్ధపడి ప్రచురిస్తున్నా. 

కూడలిలో ఓవారం రోజులు తిరిగాడంటే నిక్కరేసుకోని పిల్లోడిక్కూడా అర్థం అయ్యే పిల్లవిషయం ఏమిటంటే- ఇక్కడ గుంపులున్నాయి. అవును గుంపులున్నాయి. ఈవిషయం అర్థం కావడానికి నాకో వారంపదిరోజులు పటింది. "అబ్బా! ఏమిటిది" అనుకునేవాణ్ణి. కానీ తర్వాత ఆలోచిస్తే ఇదేమీ తప్పుకాదు అనిపించింది. ఎందుకంటారా? ఏబ్లాగును చూసినా రెండుమూడుటపాలు చదివామంటే సదరుబ్లాగరు అభిరుచి, ఆసక్తి, అసలాబ్లాగు ఎందుకు తెరిచాడు లాంటి విషయాలన్నీ తెలిసిపోతాయి. ఓయాభైటపాలు చదివినా అసలురాసేవాడు మనిషేనా? అసలేమి చెప్పలనుకుంటున్నాడు? అనిపించే బ్లాగులూ ఉన్నాయి. అదివేరేసంగతి. అలా పదిపదిహేను చూసేప్పుడు మన అభిరుచికో, నమ్మకానికో, సిద్ధాంతానికో పోలిక ఉండేబ్లాగు కనపడడం, వ్యాఖ్యరాయడం జరుగుతుంది. ఆతర్వాత పరిచయాలు క్రమంగా స్నేహితులుగా చేస్తాయి. ఇలా స్నేహాలు కాస్తా గుంపులుగా ఎదుగుతాయి.

ఇక్కడదాకా వ్యవహారం చిరునవ్వులతో, హాయిహాయిగా చాలాహుందాగా నడుస్తుంది. మరిసమస్య ఎక్కడ అంటే- కూడలిమొత్తం మనగుంపుకు అనుగుణంగానే టపాలు వెయ్యాలి అనే హుకుం.అలారాయని బ్లాగర్లపై ఫత్వా. ఇక్కడ మొదలయ్యే రావణకాష్టాలేవీ ఇంతవరకూ ఆరలేదు. కొంతకాలం మందగించినా అవన్నీ నివురుగప్పిన నిప్పులే.

ఒకవ్యక్తి చదువుకుని కనీసం ఒకడిగ్రీపట్టా అయినా పుచ్చుకున్నాక, కొద్దోగొప్పో లోకాన్ని చూశాక, తనకంటూ కొన్నీఅలోచనలు, అభిప్రాయాలు ఏర్పడ్డాక, రాయాలనిపించి అందుకు ఒకవేదికను వెతుక్కునే సమయంలో లభించే అవకాశమే బ్లాగు. దీన్నిబట్టి మనకు అర్థం అయ్యేదేమిటయ్యా అంటే - మనఆలోచనలతో సారూప్యత ఉన్నవాళ్లతో సహవాసం చెయ్యగలమేగానీ ఎవర్నో మన ఆలోచనలతో, సిద్ధాంతాలతో, తలాతోకాలేని వాదులాటలతో మార్చెయ్యాలి అనుకోవడం పొరబాటేకాదు అజ్ఞానమే అవుతుంది. తన‌అనుభవాలతో దేవుణ్ణి నమ్మేవ్యక్తితో ఎంతవాదించినా అతనికి పరమాత్మ ఉనికి కనిపిస్తొ ఉంటుంది. అలాగే పస్తులతో కాలాన్ని ఈడ్చినవాడికి దేవుడికన్నా ముందు ఆకలే కనిపిస్తుంది. ఇది మనంకనుక్కోలేనంత చిదంబరరహస్యం ఏమీకాదు.


కానీ సమస్య ఏమిటంటే- మనసిద్ధాంతాలపై మనకున్న నమ్మకంలో వెయ్యోవంతు గౌరవం ఎదుటివాళ్ళ నమ్మకాలపై ఉండదు. తనురాసేది కొందరిని ఇబ్బందిపెడుతుందని తనకు తెలుసు.వాళ్ళు రాసింది చూసినవాళ్ళు అనుకున్న బ్లాగుగురించి కాకపోవచ్చు.  ఎవరైనా ప్రశ్నిస్తే నేనన్నది ఒకరిని ఉద్దేశించికాదు అనొచ్చు. కానీ టపాశీర్షికలో-బ్లాగుస్వాములు అన్నారు అంటే అది తోటిబ్లాగరు గురించేకదా?  కూడలిలో ఉన్నబ్లాగులు లాగితంతే ఐదొందలు. అందులో భక్తిబ్లాగులు పదిపదిహేను. మహాఅయితే ఇరవై. ఇందులో తరచుగా రాసేబ్లాగర్లు పదిమంది. అంటే ఆబ్లాగు శీర్షిక ఈపదిమందిలొ ఎవరినో ఉద్దేశించి అన్నదేకదా? ఆపదిమంది బ్లాగుల్ని చూద్దాం.


ఇప్పుడు ఆటపాలో ఉన్న విషయం టూకీగా- పరీక్షలప్పుడు పూజలు. ఈవిషయంపై రాసిందెవరో చూసేందుకు మనమేమీ షెర్లాక్‌హోమ్స్ కానక్కర్లా. వారాంతంలో ఓసారి కూడలితెరిచినా ఈరకమైన టపారాసే బ్లాగరెవరోమనకు తెలుస్తుంది. సరే ఆయన్నికాదనుకుందాం. మరి ఆపదిమందిలో ఎవర్నో? లేదా భక్తిబ్లాగులగుంపునో లేక అందులో ఒక‌ఉపగుంపునో. ఇలాంటి దాడి భావప్రకటనకు వ్యతిరేకంకాదా?

 నాకు తెలీక అడుగుతా? ఎదుటివాడి మంచికోసం మనం ఐదునిముషాలు అలోచించడం నేరమా? అదితప్పని ఏసిద్ధాంతం చెప్పిందో? పరీక్షలకు వెళ్ళె పిల్లలకు వయసులోపెద్దాయనగా అలాకోరడంలో తప్పేమిటో? పోనీ ఎదుటోడికే చెప్పిఊరుకున్నాడా? ఆయనకూడా వీలైనంతలొ ఆచరిస్తున్నాడుగా? తనూఅచరించిందే చెప్తునాడుగా? అక్కడ పిల్లలకేమి చెప్పాడు? పరీక్షలప్పుడు ధైర్యంగా ఉండేందుకు పరిష్కారం ఇచ్చాడు. అందులో సమాజాన్ని చెడగొట్టేంత విషం ఏముందో? మీకోసం పూజచేస్తా అన్నాడు. వాళ్లమంచికోసం ఆలోచించడం తప్పా? అందుకేమీ ఆయన డబ్బుతీసుకోవట్లేదే? అంటే మనసమాజంలో పెద్దలు పిల్లల మంచికోరడం, పిల్లలు పెద్దలకు నమస్కారం చెయ్యడంవంటివి అభిజాత్యానికి నిదర్శనమా? తాయెత్తులు కట్టేది స్వామీజీలేకాదు పకీర్లు, ఇతరమతాల్లోని సాధువులుకూడా అన్నసంగతి వాళ్ళకి ఎందుకుతెలీదో?


ఇలాదాడులుచేసే బ్లాగర్లకు సమాజంలోని కొన్నిసమస్యలే, వాటిలోని తమకుకావల్సిన పార్శ్వాలే కనిపిస్తాయని, వాటిపైనే రాస్తారని, పోనీతనబ్లాగులో చర్చలకు సరైనదిశలో స్పందించరని చెప్పేహక్కు నాకులేదు. ఎందుకంటె అవి వాళ్ళబ్లాగులు. వాళ్లవాళ్ల ఇష్టానుసారం, వారు స్పందించగలిగే అంశాలపైనే వాళ్ళురాస్తారు. వాళ్ళబ్లాగులు ఇలానే ఉండాలి అనే హక్కు నాకులేదు. మరివాళ్ళూ మిగిలినబ్లాగుల గురించి అలానే అనుకోవలన్నదిమాత్రం తోటిబ్లాగరుగా నాకోరిక.

 వారంరోజులుగా ఇంతమంది స్వామీజీలను అరెస్టు చేస్తుంటే సగటుహిందువు సమర్థించాడేతప్ప నిరశనలు, రాస్తారోకోలు చెయ్యలేదు. నిజస్వరూపాలు బయటపడ్డాక ఆఆశ్రమాలపై దాడిచేసినవారిలో ఆస్తికులు, దైవచింతనలో గడిపేవారు, మద్యతరగతి హిందువులు( ఈమాట ఎందుకువాడుతున్నాను అంటే వీళ్లదృష్టిలో దొంగస్వాములు హిందూమతంలోనే ఉంటారు.) ఉన్నారు. ఇలాంటిసంఘటన మరేమతపెద్ద విషయంలో జరిగినా వీడియోలు బయటికిరావు. వచ్చినా మీడియాకి అంతదమ్ములేదు. అసలింతమందిని అరెస్టుచేసే అవకాశమే ఉండదు.

చివరగా ఒక్కమాట- మనదేశంలో ప్రజాస్వామ్యం ఏర్పడ్డాక ఎన్నోసార్లు మోసగాళ్ళు తప్పించుకున్నారు. హత్యలుచేసినవాళ్ళు రాజ్యాన్నేలుతున్నారు. కులంగజ్జితో కుంచించుకుపోతున్నాం. ప్రజలకు తమఓటు ఎంతవిలువైనదో తెలీని స్థితిలో ఓటేస్తున్నారు. స్వార్థప్రయోజనాలకోసం అసమర్థులను ఎన్నుకుంటున్నారు. పాలితులు-పాలకులు ఎవరికి వీలైనస్థాయిలో వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. మరి ఈతప్పు ప్రజాస్వామ్యానిదా? ప్రజలదా? ఇక్కడ హైందవంపై జరుగుతున్నది కూడా అలాంటిదే. కొందరివ్యక్తులు స్వార్థంకోసం కాషాయాన్ని తొడుక్కుని అరాచకాలు చేస్తుంటే ఆమకిలి హైందవానికి అంటుకుంటుంది. కానీ ఇదితాత్కాలికం. కారణం నాధర్మం అజరామరం. స్వయంప్రకాశం. ధర్మోరక్షతి రక్షితః

సైన్సుకోసం ఒక్కరోజు

శతాబ్దాల బానిసత్వం. కరువుకాటకాలతో నిత్యంపోరాటం. మూఢనమ్మకాల వలలో చిక్కుకున్న సమాజం. అదేసమయంలో ప్రాశ్చాత్యదేశాల్లో సాంప్రదాయక సిద్ధాంతాలను బుట్టదాఖలుచేస్తూ అభివృద్ధిచెందిన ఆధునికసైన్సు. ఆసిద్ధాంతాలకు రూపం ఇచ్చే సాంకేతిక సమాజం. వీటన్నిటినీ మించి పారిశ్రామికవిప్లవ ఫలితాలు. ఇవన్నీ వెరసి సాంప్రదాయకశాస్త్రాలకు పుట్టినిల్లయిన భారతావనికి- సైన్సుల్యాబులకు పర్యాయపదంగా మారిన ప్రాశ్చాత్యదేశాలకు మద్య ఒక అగాధాన్ని సృష్టించాయి.

భారతీయులది రాజకీయబానిసత్వమే తప్ప శాస్త్ర‌అద్యయనంలోనూ, జ్ఞానసముపార్జనలోనూ కాదని నిరూపిస్తూ అగాధాన్ని పూడ్చేందుకు ఉదయించిన జ్ఞానజ్యోతి 'సీవీరామన్‌'.

తమిళ్నాడులోని తిరుచ్చిరాపల్లిలో కావేరిఒడ్డున జన్మించి, గంగఒడ్డున కలకత్తాలో ఐ.ఏ.సీ.ఎస్‌.లో పరిశోథనలు చేసి నోబెల్ పురస్కారాన్ని అందుకొన్న ఈమహనీయుని పేరు వినని భారతీయవిద్యార్థి ఉండడనుకుంటా. చిన్నతనంలోనే విశాఖకు వలసవచ్చారు. తండ్రి గణిత ఉపాద్యాయుడు కావటంతో చిన్నప్పటినుంచి ఇంట్లోవాతావరణం సైన్సుపై ఆసక్తి కలిగించింది. ఆపై మద్రాసు ప్రెసిడెన్సీకళాశాలలో బీఎస్సీలో బంగారుపతకం, ఎమ్మెస్సీలో డిస్టింక్షను సాథించాక ఆర్థికశాఖలో అసిస్టెంట్ అకౌంటెంట్ జెనరల్‌గా చేరారు.

కొద్దికాలానికే దాన్నివదిలేసి కలకత్తా విశ్వవిద్యాలయంలో పలిత్‌ప్రొఫెస్సరుగా చేరారు. అదేసమయంలో ఇండియన్ అసోసియేషన్ ఫర్ ద కల్టివేషన్ ఆఫ్ సైన్స్ (IACS)లో తనపరిశొధనలను కొనసాగించారు. ఈసమయం తనజీవితంలోకెల్లా అత్యుత్తమమైనదిగా, తనపరిశొధనలకు అక్కడివిద్యార్థులు ఇచ్చిన తోడ్పాటు వెలకట్టలేనిదా రామన్ అభిప్రాయపడేవారు.
ఎనభైరెండేళ్ళక్రితం, ఫిబ్రవరి 28, 1928, ఈరోజు ప్రపంచ శాస్త్రసాంకేతిక సమాజం అవాక్కయి భారతావనివైపు చూసినరోజు. ప్రాశ్చాత్యులకు మనమేమి చెయ్యగలమో చేసిచూపించినరోజు. వలసపాలనకింద నలిగిపోతున్న ముప్పైకోట్లమంది ఉపఖండవాసులు గర్వంగా తలెత్తి నిలిచినరోజు. అన్నేళ్ళకృషి ఫలితంగా పురుడుపోసుకున్న 'రామన్ ఎఫెక్ట్‌' ను ప్రపంచానికి అందించినరోజు.

Rs.35/- దాటని ప్రయోగం, ఒకటిన్నరపేజీల నిడవిగల వ్యాసం, అందులోని విశ్లేషణనుంచి ఉద్భవించిన ఒకవాక్యం-" కాంతి ఒకపదార్థం ద్వారా ప్రసారించి వికిరణం చెందినపుడు, కాంతి పౌనఃపున్యంలో మార్పు అదిప్రసరించే మాద్యమంలోని అణూవుల మద్యఉన్న అణుబంధంపై ఆథారాపడి ఉంటుంది." ఆధునిక శాస్త్రసమాజానికి దిక్సూచిలా దిశానిర్దేశం చేసింది. అభినవ బృహస్పతిగా పేరొందిన ఐన్‌స్టీన్ ప్రతిపాదించిన క్వాంటంసిద్ధాంతంలోని అనుమానాలను ఇదిపటాపంచలు చేసింది. రెండుసార్లు ఊరించి చేజారిన భౌతికశాస్త్ర నోబెల్ పురస్కారం ఎట్టకేలకు 1930లో వరించింది. భౌతికశాస్త్రరంగంలో నోబెల్ అందుకున్న మొదటి ఆసియావాసి మరియు శ్వేతేతరుడు రామన్.
ఈయన సిద్ధాంతాన్ని
  • @ అధిక పౌనఃపున్యంగల ఫోనాన్, మాగ్నాన్, ఉత్తేజితస్థితిలోని ఎలక్ట్రాన్లను అద్యయనం చెయ్యడాని
  • @ వాతావరణం అద్యయనానికి
  • @ దహనచర్యలను విశ్లేషించడానికి
  • @ అయాన్ల శక్తిస్థాయిలను కొలిచేందుకు, మొదలైన రంగాల్లో ఉపయోగిస్తారు.
ఆపై కొంతకాలం బెంగుళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్(IISC)కు డైరెక్టరుగా పనిచేశాక ఒకరసాయన కర్మాగారాన్ని నెలకొల్పారు. అటుపై స్వతంత్రభారతావనికి మొదటి జాతీయ ప్రొఫెసరుగా సేవలందించారు.
కొళ్ళాయి బదులుగా తలపాగా ధరించి, చేతికర్రకు బదులుగా కటకాలను ఊతంగా చేసుకుని, భగవద్గీతకు బదులుగా భౌతికశాస్త్రవిజ్ఞానాన్ని పట్టుకుని శాస్త్రసాకేంతికరంగాల్లో భారతావని దాశ్యశృంఖలాలను ఛేదించేందుకు కాంతిసత్యాగ్రహాన్ని జరిపిన 'సైన్సుగాంధీ' సీవీరామన్. ఆయన చేసిన పరిశోధనలు సమాజ అభ్యున్నతికే తప్ప అణూబాంబుల తయారీకో, అసాంఘీకచర్యలకో ఊతమివ్వలేదు. ఏదేశమేగినా తన సంప్రదాయాలను, అలవాట్లను పాటించడంలో ఏమాత్రం రాజీపడలేదు. రాణిగారివిందులో మధువు ముట్టనని తనమాట నెగ్గించుకున్నారు.
రామన్ ఎఫెక్ట్ తర్వాత ఆయన చేసిన పరిశొధనల్లో ముఖ్యమైనవి -
  • @ సంగీతవాయిద్యాల్లో ధ్వనితరంగాల స్వభావాలు, హరాత్మక ప్రకంపనలు
  • @ తీగల్లోని తిర్యక్‌ప్రకంపనలు
  • @ కాంతి తరంగాలు అతిధ్వనుల మద్య సంబంధాలు
  •  @ స్పటికాలలో స్పెక్ట్రోస్కోపీ అద్యయనంద్వారా స్పటిక గతిశాస్త్రంలో(Crystal Dynamics) ప్రాథమికాంశాలపై విశ్లేషణ
  • @ ధూళికణాలలో కాంతిప్రసారం
  • @ మానవదృష్టికి సంబంధించిన అంశాలు
రామన్ ఎఫెక్ట్ ప్రతిపాదించిన రోజును డిపారర్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలోని జాతీయ శాస్త్రసాంకేతిక సమాచార పరిషత్తు(NCTSC) 1986లో జాతీయ సైన్సు దినంగా(NSD) ప్రతిపాదించింది. అప్పటినుంచి ప్రతియేడు ఈసందర్భాన్ని పురస్కరించుకుని దేశంలో సైన్సుపట్ల అవగాహనపెంచే పలుకార్యక్రమాలను చేపడుతుంది. సీనియర్ శాస్త్రవేత్తలచే సెమినార్లు, యువశాస్త్రవేత్తలు, సైన్సు విద్యార్థులకు పోటీలు, ఎక్జిబిషన్లు వంటివి ఏర్పాటుచేస్తారు. సైన్సురంగాల్లో విశేషంగా కృషిచేసిన శాస్త్రవేత్తలకు పురస్కారాలు ఇస్తారు.
ఈఏడు ఆపురస్కారాలకు ఎంపికచేసిన వారు-
  • @ డీడీఓఝా, ఈయన శాస్త్రసాంకేతిక రంగాలకు చెందిన అనేక అంశాలపై పుస్తకాలు రచించారు.
  • @ రామదురై, ఈయన తమిళ వార్తాపత్రికల్లో సైన్సు సంబంధించిన వ్యాసాలు రాస్తారు. కొన్నిపుస్తకాలను కూడా రచించారు
  • @ ఈశాన్యరాష్ట్రాల్లోని స్కూలుపిల్లల్లో సైన్సుపట్ల ఆసక్తిపెంచే కార్యక్రమాలు చేపట్టినందుకు తకేలంబం రబీంద్రోసింగ్ గారికి
  • @ పత్రికామాద్యమంలో సైన్సు ప్రగతికి చేసిన కృషికిగాను దినేష్‌చంద్ర శర్మగారికి
  • @ ఎలక్ట్రానిక్‌ మాద్యమంలోసైన్సువ్యాప్తికి చేసిన కృషికి మానస్‌ప్రతిమ్ దాస్ గారికి
సైన్సుదినోత్సవం సందర్భంగా ఇస్రో, డీఆర్డీఓ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు ఈరోజు ప్రజలందరినీ ఎలాంటిముదస్తు అనుమతీలేకుండానే సందర్శించేందుకు అనుమతిస్తారు. అలాంటి సంస్థలకు మీరెవరైనా దగ్గర్లో ఉంటే మీస్నేహితులతోగానీ, పిల్లలతోగానీ వెళ్ళేందుకు ప్రయత్నించండి. కనీసం ఒకచిన్నక్విజ్ కార్యక్రమం వంటిదాన్ని నిర్వహిచండి.