శరత్‌ చంద్రికోత్సవం


వినాయక చవితిరోజు సాయంత్రం తర్వాత పండగ ఏవిటా అని డౌటొచ్చి కేలెండర్ చూస్తే దసరా అని కనిపించింది. దాన్ని చూడ్డంతోనే గుర్తొచ్చిన మరొకపండగ మనసులో ఉత్సాహాన్ని నింపింది. చూస్తుండగానే రోజులలా దొర్లుకుంటూ దుర్గాష్టమి వాకిటనిలబడ్డాయి. మూడురోజులు టౌన్షిప్లో కాళీపూజ,  రామలీల, మేళాలతో గడిచిపోయింది. ఇక ఏకాదశిరోజునుంచి కౌంట్‌డౌన్ మొదలెట్టి 4,3,2,1 అనుకుంటూ పున్నమికి చేరుకున్నా.


సంవత్సరంలో వచ్చే డజను పున్నముల్లో ఇదినాకు ప్రత్యేకం. విజయదశమి తర్వాతవచ్చే పున్నమిరోజు రాత్రి మాశివాలయంలో శరత్‌చంద్రికోత్సవం జరుగుతుంది. పదిహేనేళ్ళక్రితం ఉస్తాద్ బిస్మిల్లాఖాన్ షెహనాయ్‌తో మొదలయిన ఈకార్యక్రమానికి అప్పట్లో పేరేమి పెట్టలేదట. అలా మూడేళ్ళు గడిచాక నిర్వహణాబృందానికి శక్తి సంగీతకళా పరిషత్ అన్నపేరు, జరిగేఉత్సవానికి  శరత్‌చంద్రికోత్సవం అన్నపేరు నిర్ణయించారు. అప్పట్నుంచి క్రమంతప్పకుండా ప్రతియేడూ నిర్వహిస్తున్నారు. ఏటేటా అభిమానులు పెరుగుతున్నారు.గతేడాది ఎలాజరిగిందో రాశాను. అప్పటిలానే ఈసారీ మూడువారాల వరకు రాయడానికి కుదర్లేదు. అప్పట్లానే ఈసారీ ఓఅరగంట ఆలశ్యంగా వెళ్ళాను. ఆరాత్రిలాగానే ఈసారీ అదే ఆనందం, అనుభూతి సొంతం చేసుకున్నాను.

ఇక ఈసారి కార్యక్రమాల విషయాల్లోకి వెళ్తే-
ప్రముఖ సంతూర్ విద్వాంసుడు పండిట్ శివకుమార్ శర్మవంటి పెద్దతలకాయల డేట్లు కుదరకపోవటంతో నిర్వాహకుడు సత్యనారాయణ పాండేగారు ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్న కళాకారులని తీసుకొచ్చారు.
 

గౌహతీవాసుడయిన విద్యుత్‌మిశ్రా వయోలిన్, డిల్లీవాసి సుధీర్‌పాండే తబలా జుగల్బందీతో కార్యక్రమం మొదలయ్యింది. దాదాపు గంటన్నర సాగిన ఈకార్యక్రమంలో చివరి పదినిముషాలు మాత్రమే చూడగలిగాను.

హిందుస్తానీగాయని కల్పనా ఝుకార్కర్- సంతోష్‌మిశ్రా (సారంగి), పుండలీక భగవత్ (తబలా) మరియు భయ్యన్‌జీ (హార్మోనియం) బృందంతో భాగేశ్వరీరాగంలో కచ్చేరీని మొదలుపెట్టింది. తరువాత కళావతిరాగంలో కృష్ణున్ని స్మరిస్తూ సాగినకీర్తన ఓపదిహేను నిమషాలు సాగింది. (గమనిక: పాడేముందు ఆవిడ రాగాలపేర్లు, సంగతులు వగైరా చెప్పింది కాబట్టే నేనురాయగల్గుతున్నా. అంతకు మించి మనకు సీన్ లేదు.) ఈకీర్తన చివరికి వచ్చేసరికే మనసు జరుగుతున్న కచ్చేరితో శృతికలిపింది.అప్పటిదాకా ఉన్న చిన్నచిన్న అలజడులు దూరమయ్యాయి. 

ఆతర్వాత తుమరీ అనే ప్రక్రియలో 'కొమలియా మన్‌కర్ పుకార్‌'అనే కీర్తన పాడింది. సంగీతానికన్నా సాహిత్యానికి పెద్దపీట వెయ్యటం ఈప్రక్రియకున్న ప్రత్యేక లక్షణం. ఆతర్వాత ఝూలా అనేపద్దతిలో ఇంకోకీర్తనపాడేటప్పుడు మనసు ఉరకలేసింది. బాలాజీపంచరత్నాల్లో 'ఎంతమాత్రమున..' కీర్తన విన్నప్పుడు కలిగే ఒకఊపు అప్పుడు కలిగింది. అయ్యాక దాదాపు పదినిముషాలు చప్పట్లేచప్పట్లు. చివరగా నిర్గుణి భజన్ 'బోలా మన్‌ జానే అమర్ మేరే కాయా' ఆలపించింది.

చివరగా ఆరాత్రికే హైలెట్‌గా నిలిచిపోయిన భాగం కథక్ నృత్యప్రదర్శన. సంగీతకచేరీలకు వెళ్ళిన అనుభవమైతే ఉందికానీ కూచిపూడిగానీ భరతనాట్యం ఎప్పుడూ చూడలేదు. శాంభవీశుక్లా అనే అమ్మాయి దాదాపు రెండున్నరగంటలపాటు అలసట లేకుండా చేసిన నాట్యం అద్భుతం. వాళ్లమ్మ కవితాశుక్లా కూడా కథక్ నృత్యకారిణట. గురువు ఫతేసింగ్‌ గంగానీ, అమ్మ కవితాశుక్లా,  ధర్మనాథ్ మిశ్రా మరియు సంతోష్‌మిశ్రాలు తాళం అందించారు.  శంకర్ అతిప్రచండకర్.. అంటూ నటరాజుని స్తుతిస్తూ మొదలుపెట్టింది. 


తరువాత విద్యనేర్పిన ముగ్గురు గురువులను స్మరిస్తూ తీన్‌తాళ్ చేసినప్పుడు గోగ్రహణం జరిగినప్పుడు అర్జునుడు నమస్కారబాణాలు వదలడం గుర్తొచ్చింది. ఆతర్వాత ఉఠాన్ ప్రదర్శించింది.  సృష్టిలోని పంచభూత తత్వాలను నాట్యంలోని వివిధఅంశాలతో పోలుస్తూ చేసిన అంశం సూపర్...హైలైట్. 
పండిట్ కిషన్‌మహరాజ్  గణేష, దుర్గా, శివులపై రచించిన శ్లోకాలకు నృత్యరూపకం చాలానచ్చింది. తర్వాత తనుస్వయంగా రూపొందించుకున్న ఒకతాళపద్దతిని ప్రదర్శించింది. "శ్యామ్‌రాధాసంగ్ .." అంటూ రాధాకృష్ణుల సరససల్లాపాలు ఓపదినిముషాలు చక్కిలిగింతలు పెట్టాయి. ఆగీతంమాత్రం 'చందనచర్చిత..' థీంలో ఉంది. శాంభవీ ప్రదర్శన చూసిన ప్రతిఒక్కరికీ ఆమెకు నాట్యంపట్ల ఉన్న గౌరవం, అంకితభావం ముప్పిరిగొల్పాయి. భవిష్యత్తులో గొప్పనర్తకి అవుతుందని దాదాపూ ప్రతిఒక్కరూ అనుకున్నారు. ఏదో పెర్ఫార్మెన్స్ ఇచ్చాను అన్నట్టుగా కాకుండా కథక్‌లోని చిన్నచిన్నసంగతులు, భంగిమలు, తాళగతులు కొద్దికొద్దిగా వివరిస్తూ సాగిన ప్రదర్శన నిజంగా అద్భుతం. ఇకపై నేనుచూసే నాట్యప్రదర్శనల్లోనూ దీన్ని బెంచ్‌మార్క్‌లాగా పోల్చుకుని నిర్ణయానికొస్తానేమో!

ఉత్తరాదికచేరీలకు గతంలో ఒకసాంప్రదాయం ఉండేదట. ప్రతికచేరీ చివర్లో భైరవిరాగంలో ముగుస్తుంది. ఆచివరి ప్రదర్శనలో ఆరోజు వచ్చిన కళాకారులంతా పాల్గొనాలి. భైరవిరాగంలో ఉంటుంది అన్నవిషయంతప్ప మరేసమాచారం ఉండదు. అక్కడికక్కడే ఏకీర్తనపాడాలి అన్నది నిర్ణయించుకుని అంతాకలిసి బృందంగా ఆలపిస్తూ, వాద్యబృందం వాయిస్తూఉంటే నాట్యం చెయ్యాలి. రానురాను చివరిదాకా ఉండే అలవాటు కళాకారుల్లో మాయమవటం, ఏదైనా ఇవ్వండి నేనుసిద్ధం అనిచెప్పగల్గే ఆత్మవిశ్వాసం లోపించటంతో నెమ్మదిగా కనుమరుగైపోయింది.ఈవిషయాన్ని ప్రస్తావిస్తూ పాండేగారు ఈరోజు ఆసాంప్రదాయాన్ని తిరిగి బతికించాలని కోరటమూ, అందుకు అందరూ అంగీకరించటం క్షణాల్లో జరిగిపోయింది.

చివరగా తులసీదాసు విరచితం "భజమను భజమను రామచరణ సుఖదాయి.."అనే భజనగీతాన్ని సమిష్టిగా ప్రదర్శించాక, జైపూర్ పద్దతిలో నూటొక్క చక్కర్లుకొట్టడంతోఉత్సవం ముగిసింది.

ఏదో నేనివనన్నీ విశ్లేషిస్తాననికాదు. అంతమంచి కార్యక్రమం ఒకటి జరిగినప్పుడు, చూసొచ్చి నలుగురితో పంచుకోవడంలో ఆనందాన్ని అనుభవిద్దామని అంతే.

12 comments:

 1. U R Blessed ....!!! Cheers---Siva Kumar.K

  ReplyDelete
 2. చూస్వాదించాల్సిందే...! :)

  ReplyDelete
 3. చాలా సంతోషం చైతన్య. అదృష్టవంతుడివి.

  ReplyDelete
 4. గతేడాది టపా మరో సారి చూసినప్పుడు ముఖ్యంగా నేను గమనించింది ఏమిటంటే రాయడంలోని పరిణతి.. ఇలాగే కొనసాగించండి, ఆస్వాదిన్చాదాన్నీ, ఇలా పంచుకోడాన్నీ కూడా..

  ReplyDelete
 5. లేట్గా అయినా రాసావు మొత్తానికి. very nice. నెట్ కనక్షన్ వచ్చాకా చదువుతా తీరిగా..

  ReplyDelete
 6. గణేష్, శివన్న, గీతాచార్య, కొత్తపాళి, మురళి: థాంకులే థాంకులు

  తృష్ణక్క: నీకు మొత్తం చదివాకే థాంకు. అప్పటిదాకా స్టాండ్‌బైలో పెడుతున్నా.

  ReplyDelete
 7. బోల్డు సార్లు గుర్తుచేసి, అడగ్గా అడగ్గా అలాగలాగే అంటూ మొత్తానికి రాసావు. నీ కష్టానికి ఫలితం దక్కింది. (వీడియో కోసం పడ్డ పాట్లూ..:)) బాగుంది టపా. సంగీతం పట్ల ఆసక్తి ఉండటమే కాదు అలాంటి కార్యక్రమాలు చూడ(గలగ)టం కూడా అదృష్టమే.

  "పాడేముందు ఆవిడ రాగాలపేర్లు..." అదే నేను అనుకున్నా...:)nice information..good post.

  ReplyDelete
 8. నీ మంచి అభిరుచి ని తెలుపుతుంది.సాంప్రదాయాలు,సంస్కృతులు
  లేకుంటే మనం టి.వి.లు,సిస్టం లు వదిలి బయటకు కూడా వేల్లమేమో

  ReplyDelete
 9. ప్రోగ్రాం చాలా బాగుంది . మీరు కూడా బాగా వ్రాశారు . చిన్న వయసు లో నే ఇలాంటి కార్యక్రమాలని చూసి ఆనందించిన మీ ఇంటరెస్ట్ మెచ్చుకోతగ్గది . గుడ్ .

  ReplyDelete
 10. @శశికళ: ఎట్టిపరిస్థితుల్లోనూ కదలం
  @మాలాకుమార్: ధన్యవాదాలండి

  ReplyDelete
 11. ఎంత చక్కటి పండుగ. ఎంత సంతోషం. మాక్కూడా ఆ తృప్తి కలిగించిన మీకు కృతజ్ఞతలు. మీకు అభినందనలు.

  ReplyDelete