అహో అమ్మా! ఒహో చెల్లీ!!


నేను భూమ్మీద పడ్డాక చాలాయేళ్ళు దీక్షగా సాగించిన కార్యం ఏదైనా ఉందా అంటే చెంపకింద చెయ్యేసుకుని రెప్పవాల్చకుండా తదేకంగా ఆలోచిస్తూ ఉండడం. అలా చేస్తూ ఉంటే చూసేవాళ్ళంతా వీడో అరిస్టాటిల్ అన్నట్టు ఫీలవుతున్నప్పుడు మాంచికిక్ ఉండేది. అలా ఆలోచించగా చించగా ఓరోజు ఓగొప్ప ఆలోచన వచ్చింది. ఆఆలోచన ఏమిటయ్యా అంటే దయచేసి హృద్రోగులు ఇకమీదట చదవొద్దు ప్లీజ్) రోజూ నిద్రలేవడంతోనే అమ్మానాన్నల పాదాలకు దణ్ణం పెట్టాలి. అసలు దీనికి మూలం ఏమిటంటే మాఅమ్మని కథచెప్పమ్మా అన్నప్పుడల్లా శ్రావణకుమారుడికథ మొదలుబెట్టి కావడిలో కూర్చునేసేది. 'ఈఆలోచన ఎలా వచ్చిందిరా!' అని నన్నునేను ప్రశ్నించుకుంటే ఛాతీ విశాలమైంది. రోమాలు నిక్కపొడుచుకున్నాయి. పాతగోరింటాకులో శొభన్‌బాబులాగా, కొత్త ఛత్రపతిలో ప్రభాస్‌లాగా ఫీలయ్యాను. ఓరెండుమూడు నిమషాలైనాక సిగ్గు ముంచుకొచ్చేసింది. అలా అలా నెమ్మదిగా హాల్లోకి వెళ్తే అమ్మ కూరలు తరుగుతూ ఉంది. 'వామ్మో! ఇప్పుడు చెబితే పాపం ఎమోషన్లో చెయ్యి తెగ్గోసుకుంటుంది.' అనుకుని బయటే కూర్చున్నా. కాసేపటికి బాగాధైర్యం తెచ్చుకుని ఊపిరి గాట్టిగా పీల్చి వదిలి, బాబా రామ్‌దేవ్ తెలీకపోయినా ఆయన భంగిమలు ఓరెండుమూడు వేసేసి నెమ్మదిగా అమ్మదగ్గరికి వెళ్ళాను.
"ఏరా! ఏమైంది" అని అడిగింది.
"అమ్మా! రేపట్నుంచి ఓపని చేస్తానుమా." అన్నాను.
"?" అంది. (అనుకోవాలి)
"రేపట్నుంచి నిద్రలేవడంతోనే నీకూ, ఒకవేళ నాన్న ఉంటే నాన్నకి కాళ్ళకి దండంపెడతానమ్మా."
"!!!!????" (ఆఎక్స్‌ప్రెషన్ని పూర్తిగా వ్యక్తీకరించే సింబల్స్ కీబోర్డులో లేవు.)

ఏదో ఆక్షణం అలా అనేశానేగానీ సాయంత్రానికి వాటితాలుకు జ్ఞాపకాలన్నీ మెదడు అడ్రస్‌తెలీని ఏదోచోట దాచిపెట్టేసింది. తర్వాతరోజు తెల్లవారింది. మనం మొద్దునిద్రనుంచి దిగడంతోనే అక్కడికి పరిగెత్తుకెళ్ళే అలవాటు. ఆతొందర్లో రెండుమూడురోజులు లేచిన గంటకో గంటన్నరకో గుర్తొచ్చేది. తెగఫీలవుతూ "అమ్మా! మర్చిపోయానే. రేపణ్ణుంచి. సరేనా." అనేసి గోడమీద 'దణ్ణం రేపు‌' అని రాసిపెట్టుకున్నా.

అలా వారమయ్యాక "అమ్మా! నాకు గుర్తుండడం లేదు. నువ్వే గుర్తుచెయ్యవా." అనడిగా. మనమీద ఎక్స్‌పెక్టేషన్స్ ఆలెవల్లో ఉన్నాయో ఏమో? పాపం "నువ్వు నిద్రలేచే సరికే ఎదురుగా నిలబడి నాకు దణ్ణంపెట్టరా ప్లీజ్ అని నీయెదురుగా నిలబడాలా?" అని కోపంగా అడిగేసరికే నీకు దణ్ణం పెట్టడం కష్టంగానీ నాకు అన్నం పెట్టు అన్నా.

పాండురంగ మహాత్మ్యం క్లయిమాక్స్‌లో  "అమ్మా! అని పిలిచినా ఆలకించవేవమ్మా?" విన్నప్పుడల్లా పడీపడీ నవ్వుకునే జ్ఞాపకం ఇది.
*****
అందరూ రాఖీ... రాఖీ... అంటూ తెగగొడవ చేసేస్తున్నప్పుడల్లా నాకు ఓ విషయం విపరీతంగా నవ్వు తెప్పిస్తుంది. అవి నేను నిక్కర్లకి పాంట్లకి మద్యన ఒకసంధికాలంలో ఊగిసలాడుతున్నరోజులు. అప్పుడే రాఖీ అన్నదొకటి ఉంటుందని దాన్ని అన్నలకు కడతారని తెలిసింది. సరే మరి 'అన్న' డెసిగ్నేషన్ మనకూడా ఉంది కాబట్టి మనంకూడా కట్టించుకోవచ్చు అనుకుని ఆముచ్చట చెల్లితో చెప్పాను. "సరేరా కడతాను. కానీ దానికి నువ్వునాకు డబ్బులు ఇవ్వాలి అంట. ఈఆటలో ఆరూల్ కూడా ఉందంట." అని చెప్పింది. భాషా సినిమాలో రజనీ ఓపెద్దకుర్చీలో కూర్చుని చేతిమీదముద్దులు పెట్టించుకున్నట్టు నేను రాఖీలు కట్టించుకున్నట్టు కలలు కంటున్న నాకు ( అదెంత పీడకలో ఆవయసులో తెలియలేదు.) ఈసంగతి తెలియడంతోనే నిక్కర్లకి ఉన్న చిల్లుజేబులు గుర్తొచ్చాయి. మై డాడ్ ఈజ్ ఎన్ ఏటీఎం అనుకుంటూ నాన్న దగ్గరికి వెళ్ళాను. వెంటనే ఇచ్చేశాడు.

చెల్లెలు పెద్దభూచక్రం సైజుది కొనుక్కొస్తుంది అనుకుంటే మేకగడ్డం షేపులో ఉన్నది తీసుకొచ్చింది. 'చెల్లెళ్ళన్నాక రకరకాలుగా ఉంటారు.మనమేసర్దుకుపోవాలి. సర్లే ఈసారికి ఇలాకానిద్దాం.' అనుకుని ఎదురుగా నిలబడ్డా. ఏవిటొ ఈజీవితానికి ఎప్పుడూ అలవాటులేని సిగ్గొకటి మొహంమీద తాండవిస్తుంది. ఒకభంగిమలో నిలబడి మెలికలు తిరిగిపోతున్నా. బహుశా శునకానందం అంటే ఇదేనేమో. చెయ్యిముందుకి చాచి కట్టమన్నాను. అది సీరియస్గా కడుతుంది. రెండు మూడు నిముషాలైనా అది కుస్తీపడుతుంది తప్ప కట్టడం పూర్తికావట్లేదు. నాకు కొద్దిగా విసుగొచ్చింది. అది ఇంకా ఆలశ్యం చేస్తోంది. ఎప్పుడెప్పుడు కడుతుందా వీధిలోకెళ్ళి ప్రదర్శన మొదలెడదామా అన్న ఆరాటం క్షణక్షణం పెరిగిపోతోంది. ఇంకోపక్క చెయ్యి గుంజుతోంది. "అబ్బా! త్వరగా కానివ్వవే." అంటున్నాను. ఇంతలో ఏదోజరిగింది. దానిచూపు కడుతున్న రాఖీనుంచి ఎక్కడికో మళ్ళింది. పిచ్చ ఇరిటెషన్  రేగి ఒక్కటిపీకాను. నాకు తెలిసి భూమ్మీద రాఖీకడుతున్న చెల్లెల్ని కొట్టిన యెదవ నాడాషుగాడిని నేనే అనుకుంటా. అది కెవ్వుమంది. ఓపదినిముషాలు గింజుకోవడం, వాదులాడుకోవడం, కొట్టుకోవడం వగైరాలన్నీ అయిపోయాక మానాన్న దగ్గరికి పిలిచి ఒక్కటి పీకాడు. దెబ్బకి టూత్స్ బ్రేక్స్. "రాఖీకి డబ్బులు నాజేబులోంచే, తిరిగి నువ్విచ్చే మామూలూ నాదగ్గర్నుంచే. పోనీ ఇంతాచేసి ఏమైనా ఆనందమా అంటే మీమొహాలకి అదీలేదు. అంతదానికి నాకెందుకురా డబ్బులు బొక్క. నాకు ఇంకో కింగ్ పాకెట్ వస్తుందికదా." అనేసి ఇక మీదట రాఖీకి బడ్జెట్ ఉందదని చెప్పేశాడు.  అయినా తర్వాత ఒకట్రెండు సార్లు అదికట్టడమూ ఐదునిముషాల్లోనే పుటుక్కున తెగిపోవడమూ జరిగిపోయేవి.

నిన్న చెల్లిఫోన్ చేసి ఓపదిహేనునిమషాలు అలాఅలా నెమరేసుకుని పడీపడీ నవ్వుకున్నాం. కొట్టినా కొట్టించుకున్నా మాఇద్దరి మద్యనే. ఏమంటార్?

విరహవేదన

పుట్టాక పాతికేళ్ళు వచ్చేదాకా నిన్నుచూడలేదు. మొదటిసారి నిన్ను చూసినప్పుడు కలిగిన ఉద్వేగం దాదాపూ ప్రతిఒక్కరి జీవితంలో కలిగేదే. లోకం తెలిశాక ప్రతి ఒక్కరికీ ఎదురయ్యే నిరీక్షణే. కాకపోతే ఎదురొచ్చాక ఎవరికి వాళ్ళకి అదొక ప్రత్యేకమైన క్షణం. అది ఫలానా అని చెప్పగలిగే స్థితిలో కొద్దిమంది ఉంటారు. కానీ వాళ్ళు ఎంత విడమరచినా పదోవంతుకూడా ఉండదు.

నాజీవితానికొక గౌరవం, నామీద నాకు నమ్మకం వచ్చిందంటే అది నువ్వు నాపక్క నిలబడ్డాకనే. నిన్ను అలా అరచేతిలోకి తీసుకుని ఎప్పటికీ ఉంచేసుకొవాలని నేను పడే తపన నీకుకూడా తెలుసు. నువ్వు ముద్దుగా బొద్దుగా రెండుచేతులా సరిపోయేంతగా ఉంటే చూడాలని కలలుగనే నాకు ఎప్పుడూ నిరాశే. డైటింగులు, జీరోసైజులంటూ బక్కచిక్కిన నిన్నుచూస్తే నీమీదకన్నా నామీద జాలేస్తూ ఉంటుంది. సరే అలాగైనా నిన్ను ఏలుకుందాం, కలకాలం దాచుకుందా అనుకుంటే నువ్వేమో వేళ్ళసందుల్లోంచి జారిపోతావు.

తాతకి, నాన్నకి, మావలకి కూడా ఆవయసులో ఎదురైన అనుభవమే ఇది. అప్పుడప్పుడూ వాళ్ళజ్ఞాపకాలను తడిమిచూసుకుంటుంటే వినేవాడిని. నాకు అర్థమయ్యేంత వయసు రాలేదని అనుకునేవాళ్ళు. అదినిజమేననుకో. కాకపోతే నువ్వు జీవితానికి చాలా ముఖ్యమైన దానివని మాత్రం అర్థమయ్యింది. అప్పట్లో నీగురించి ఎన్నోఫాంటసీలు ... రంగురంగుల్లో ఈస్ట్‌మన్ కలర్లో, టెక్నికలర్లో, డిజిటల్ ఎఫక్ట్స్‌తో అబ్బబ్బా... ఆరంగులే వేరు. కానీ మొదటిసారి నువ్వు నాదగ్గరకి వచ్చిన క్షణం అర్థం అయ్యింది నువ్వు నేను ఊహించుకున్న దానికన్నా భిన్నమైన దానివని. కొన్ని ఎంతోగొప్పగా, మరికొన్ని అసహనం కలిగించేవిగా, ఇంకొన్ని చిత్రవిచిత్రంగా... నీమీదనేకాదు ఈప్రపంచం మీద నాకున్న కొన్ని అభిప్రాయాల్ని క్షణాల్లో తుడిచేసి నన్ను మార్చేసిన ఘనత నీదే.

ఇంతకముందు విన్నదానికి, ఊహించుకున్నదానికి భిన్నంగా ఎదురొచ్చి నిల్చున్న నిన్ను చూస్తే ఒక్కసారి నన్నునేను అద్దంలో చూసుకున్నట్టు అనిపించింది. పెద్దోళ్ళు వయసులో ఉన్నప్పుడు మొదటిసారి చూసేటప్పుడు ఎదురెదురుగా చూస్కునే వాళ్ళంట. వాళ్ళపెద్దవాళ్లకీ చూపించి సంబరపడే వాళ్ళంట. రోజులు మారిపోయాయి. లోకం మారిపోతుంది. బంధాలూ మారుతాయి. అంతే. మనం వద్దన్నా..ఒప్పుకోకున్నా మనమూ మారతాం. కాకపోతే మారామన్నది తెలుసుకునేదానికి సమయం పడుతుంది. మన విషయంలోనూ అదేజరిగింది. నిన్ను ఎదురుగా చూడలేక, అరచేతుల్లోకి తీసుకుని ముద్దాడలేక తెరమీద ఉన్న నిన్ను తడుముకుని మురిసిపోయినప్పుడు తెలిసొచ్చింది జీవితం ఎంతయాంత్రికమైపోయిందో.

ఎప్పుడూ ఒంటరిగానే వచ్చేదానివి అప్పుడప్పుడూ చెలికత్తెలని, తోబుట్టువుల్ని వెంటబెట్టుకొస్తావు. అదేవిటొ నీమీద ఉన్న మమకారంవల్లనో, వాళ్ళతో ఉన్న బంధుత్వం వల్లనో నాకు ఇరుకైనట్టుగా గానీ ఇబ్బందిగాగానీ అనిపించదు. కానీ వాళ్ళు నన్నొదిలి వెళ్ళేటప్పుడు కూడా బాధకలగడం ఒకింత నవ్వొచ్చే విషయం.


నాకున్న ఒకేఒక్క కోరిక నువ్వు నాదగ్గరే కలకాలం ఉండిపోవాలి. కానీ నువ్వేమో నాచేతుల్లో కరిగిపోతావు, వేళ్ళసందుల్లోంచి జారిపోతావు, నామీద అలిగి వెళ్ళిపోతావు. వెళ్ళొద్దని నీచెయ్యిపట్టుకుని బ్రతిమాలితే "నిన్ను ఉద్ధరించడానికే...నిన్ను సుఖపెట్టడానికే..నిన్ను సంతోషపెట్టడానికే..." అంటూన్న నిన్నుచూస్తే నాలోని స్వార్థం వెయ్యిపడగలతో బుసకొడుతుంది. నువ్వు ఎక్కడికీ వెళ్ళకుండానే నాకు అన్నీ జరిగిపోవాలని శతవిధాలా ప్రయత్నించినా ఒకవెర్రినవ్వు నవ్వేసి నీపని నువ్వు చేసుకుంటానంటావు. వెళ్ళిపోయావని తెలిశాక కలిగేబాధ అనుభవించేవాడికొక్కడికే తెలుసు. "ఎక్కడికెళూతుందిరా? మళ్ళీ వస్తాదిలే" అని మనసుకు నచ్చజెప్పటం,నామాట విని తల ఊపెయ్యటం నాకూ మనసుకూ అలవాటైపోయింది. అలా రోజుల తరబడి, వారాల తరబడి ఎదురుచూస్తే వరదబాధితులకోసం హెలికాప్టర్ వచ్చినట్టు ఒక్కసారి చెయ్యూపి వెళ్ళిపోతావు. ఇనప్పెట్టెలో బంధించి నాదగ్గరే ఉంచుకోవాలని నాకున్నా నిన్ను విశాలప్రపంచంలోకి షికారు చెయ్యించాలనుకునే సూచీల బలం ముందు చేతగాని వాణ్ణవుతాను. ఆక్షణం నువ్వు చూసేచూపుకి తలదించుకుని నిలబడటం కన్నా ఏమీచెయ్యలేను.

నెలల్లోకెల్లా ఉత్తమమైన నెల ఫిబ్రవరి. దీనికి ఇరవైఎనిమిదింపావు రోజులే ఉంటాయి. మిగతా నెలకంటె జీతండబ్బులు రెండురోజులు ముందేపడిపోతుంది. మరో ఐదురోజుల్లో మనఒళ్ళో వాలిపోయే నెచ్చెలి ఇచ్చే వెచ్చటికౌగిలికోసం ఎదురుచూస్తూ మరో నాలుగు ఒంటరిరాత్రులు సాగదీయాలి. ఈసారైనా ఎక్కడికీ పోనీకుండా కట్టిపడేద్దామంటే ఆదయపుపన్ను వాళ్ళు సేవింగ్స్ అడుగుతున్నారు. దాచిపెట్టుకోవడం సేవింగ్ కాదుట! వీళ్ళకి అర్థమయ్యేలా చెప్పేదెలా? బేతాళుడు మళ్ళీ ఎక్కేస్తాడు.