నకిలీ

వాఖ్య- నిజజీవితంలో మనమేదైనా మాట్లాడినప్పుడు ఇది ఎదురైతే రగిలిపోతాం. కానీ బ్లాగుల్లో పరిస్థితి పూర్తిగా విరుద్ధం. టపారాశాక అరగంటకొకసారి పేజీతెరిచి కొత్తవ్యాఖ్యలేమైనా వచ్చాయా అని చూసుకోను రోజంతా గడిచిపోతుంది. ఇక్కడ వ్యాఖ్యలే ఇంధనం. రోజూ వచ్చేదానికన్నా రెండుమూడు వ్యాఖ్యలెక్కువొచ్చినా తక్కువొచ్చినా బహుశా ఆరోజంతా చుట్టుపక్కల పరిసరాలతో సంబంధబాంధవ్యాలు తెగిపోతాయనుకుంటా. కొత్తబ్లాగు కనిపిస్తే బ్లాగు గురించేకాక, సదరుబ్లాగరు గురించికూడా ఓ అవగాహన కల్పించేదీ వ్యాఖ్యలే. అంతేకాదు ఆబ్లాగరుకి బ్లాగ్మిత్రులెవరు? వ్యక్తిత్వం ఎలాంటిది అన్న సున్నిత విషయాలు వ్యాఖ్యలు చెప్పకనే చెబుతాయి. ఒకరకంగా చెప్పాలంటే బ్లాగుకి టీఆర్‌పీ రేటింగులు నిర్ణయించేది వ్యాఖ్యలే. వీటిగురించి విపరీతంగా ఆలోచించేసి ఆరోగ్యాన్ని చెడగొట్టుకునే బ్లాగర్లూ ఉన్నారు.కొన్నివిషయాల గురించి రాసినప్పుడు వ్యాఖ్యలరూపంలో జరిగే చర్చలు మంచిసమాచారాన్ని అందజేస్తాయి. మాలాంటి కుర్రబ్లాగర్లు ఎవరైనా కొంతకాలం తర్వాత చూసినప్పుడు అక్కడి చర్చ ఎంతోఉపయోగకరంగా కనిపిస్తుంది.

పోయినవారం "ఏరా కూడలి ఎలాఉంది?" అని నాబ్లాగ్మిత్రుడిని అడిగితే లింకులు పంపాడు. వాటిని చూశాక కూడలి రగులుతుందని అర్థం అయ్యింది. ఇదిమామూలే కదా? అనుకుందామంటే రగులుతున్న విషయం ఆసక్తికరంగా కనిపించి ఇంకొన్నిలింకులు తెరిచి చూశా. విషయాన్ని క్లుప్తంగా చెప్పాలంటే 'ఫోర్జరీ వ్యాఖ్యలు'.

ఎలా జరిగాయి? ఎవరుచేశారు? ఇలాంటివి నాకు తెలీదు. కానీ జరిగింది మాత్రం ఖచ్చితంగా ఖండించాల్సిందే. కానీ వారంరోజులుగా నాకు ఖండించేందుకు వీలుచిక్కలా. అందుకే ఇప్పుడు ఖండిస్తున్నా. ఇప్పటిదాకా వ్యాఖ్యల్లో మనంచూసిన అత్యంత అనాగరికచర్య అజ్ఞాతరూపంలో వచ్చి తిట్టడం. కానీ ఇది అస్సలు ఊహించని పరిణామం. నామిత్రుడు విషయం చెప్పకుండా ఒకలింకు పంపాడు. అక్కడి వ్యాఖ్యను చూసి నమ్మలేక పోయాను. ఏంటిబాబూ ఇలారాశాడు కామెంటు అనుకుని జుట్టుపట్టుకున్నా. ఆతర్వాత పంపినలింకు చూశాక అర్థం అయ్యింది. ఆఒక్కబ్లాగరునేకాక ఇంకొంతమంది పేరుమోసిన బ్లాగర్లుకూడా ఈ-పేర్ల కుట్రలో బాధితులు అని తెలిసింది. ఇక్కడ జరిగింది ఏమాత్రం సమర్థించకూడదు. నాకు తెలిసీ ఎవరూ సమర్థించలేదనుకుంటా. ఈపని చేసినవాడికి పిరికిపంద, మానసికరోగి లాంటిపదాలు సరిపడవు.

ఇలాంటివి జరిగిన వెంటనే అనుమానితుల జాబితా ఒకటి తయారుచేసుకుని ఉంటారు ఎవరికివాళ్ళు. ఈజాబితాకి మూలం గతంలో తమని కెలికిన బ్లాగర్లు. ఈవిషయంలో నా అభిప్రాయం- మనజాబితాలేవీ కరెక్టుకాదు. ఎందుకంటే పిల్లచేష్టలు, వెకిలివేషాలు వేస్తారు అనుకుని మనం అనుమానిమ్చేవాళ్ళంతా గతంలో తమపేరుమీదే చేశారు అవన్నీ. మరి ఇలా వేరేవాళ్ళపేర్లు పెట్టుకుని చెయ్యాల్సిన అవసరంలేదు. కాలేజీపిల్లలతో ఇంకొకజాబితా ఉంది. వాళ్ళేదో వాళ్ల ఆనందాన్ని పంచుకోవటం తప్ప ఇంత కుట్రలు పన్నడానికి ఇళ్ళల్లో డైలీసీరియళ్లు చూడరు. కాబట్టి అయ్యా సీనియర్ బ్లాగర్లూ కొద్దిగా ఓపికవహించండి. అనవసరంగా ఆవేశపడి నిందించొద్దు. ఇక్కడ జరుగుతున్న దాన్ని ఎవరూ సమర్థించడంలేదు.

కానికాలం

త్రేతాయుగంలో పడ్డకష్టాలు చాలవన్నట్టు సీతమ్మకి కలికాలం కానికాలంగా దాపురించింది. ఏతల్లి పాదధూళితో పునీతమైన భూమిపై పుట్టి ప్రజలు చల్లగా బతికారో, బతుకుతున్నారో, బతుకుతారో ఆతల్లికే మకిలి అంటగట్టాలని చూస్తున్నారు. ఏతల్లి చల్లటిచూపుతో చేసినపాతకాలన్నీ క్షణకాలంలో నశిస్తాయో ఆతల్లిపైనే కామపుచూపులు కమ్ముకుంటున్న పాషాణకాలమిది. దశకంఠుడు సైతం ఆనిప్పుకణాన్ని తాకేందుకు భయడితే ఈకలిసేవకునికి ఆభయంకూడా లేదు.

జరుగుతున్నవి చూస్తుంటే ఎమ్మెస్ రామారవు సుందరకాండలో హనుమంతుడు సీతమ్మ పడుతున్న కష్టాలు చూసి బాధపడుతూ అనేమాటలు గుర్తొచ్చాయి. ఆభాగం కింద పెడుతున్నా.

పువ్వులునిండిన పొలమునందునా
నాగేటిచాలున జననమందినా
జనకమహారాజు కూతురైనా
దశరథనరపాలు కోడాలైనా
సీతాలక్ష్మికి కాదుసమానము
త్రైలోక్యరాజ్య లక్ష్మీసహితము
అంతటిమాతకా కానికాలమని
మారుతివగచే సీతనుకనుగొని

శత్రుతాపకరుడు మహాశూరుడు
సౌమిత్రికీ పూజ్యురాలైన
అశ్రితజన సంరక్షుడైన
శ్రీరఘురాముని ప్రియసతియైన
పతిసన్నిథియే సుఖమనియెంచి
పదునాల్గేండ్లు వనమునకేగిన
అంతటిమాతకా కానికాలమని
మారుతివగచే సీతనుకనుగొని

బంగరుమేని కాంతులుమెరయ
మందస్మితముఖ పద్మమువిరియా
హంసతూళికా తల్పమందునా
రామునికూడి సుఖింపగతగినా
పురుషోత్తముని పావనచరితుని
శ్రీరఘురాముని ప్రియసతుయైనా
అంతటిమాతకా కానికాలమని
మారుతివగచే సీతనుకనుగొని

ఏమిటిలోకం

ఎంఎఫ్ హుస్సేన్ అనేపేరు ఇంటర్లో ఉన్నప్పుడు మాధురి 'గజగామిని‌' అప్పుడు విన్నా. ఆతర్వాత అడపాదడపా మీడియాలో చూశాను. వయసులో పెద్దాయన, చేతిలో పనితనం ఉన్నతను వగైరా వగైరాలతో మంచివ్యక్తి అని చిన్న‌అభిప్రాయం.
హిందూదేవతల్ని, భారతమాతను నగ్నంగా గీశాడు అని విన్నాను కానీ వాటిని చూసేందుకు అవకాశంలేదు. చూడాలనీ అనుకోలేదు. మొన్నామద్యన మళ్ళీగొడవ మొదలవ్వడం ఆతర్వాత ఒకమిత్రుడు ఆచిత్రరాజాలను పంపడంతో వాటిని చూసి అందులోని ఉన్నతప్రమాణాలను అర్థంచేసుకోలేని నాలోని అర్భకుడు తలపట్టుక్కూచున్నాడు. నేనేమీ పెయింటింగ్‌లను కొని ఇంట్లోపెట్టుకునే కళాపోషకుణ్ణికాదు. కనీసం ఆర్ట్ ఎగ్జిబిషన్లకు ఎగేసుకుపోయే కళాపిపాసినికాదు. అంతెందుకు మాంచిపెయింటింగ్లను డౌన్లోడ్ చేసుకుని డెస్క్‌టాప్ పైన పెట్టుకునేంత తృష్ణ నాలోలేదు. అయినా మనిషన్నాక కొద్దోగొప్పో ఆలోచించగలుగుతాడు. వాటికి అనుగుణంగా కొన్నినిర్ణయాలకు రాగలుగుతాడు. నేనిక్కడ రాస్తున్నవికూడా అలాంటి ఆలోచనలకు టపారూపమే.

మహేష్‌గారి బ్లాగులో మద్యాహ్నం కామెంట్ రాసినప్పుడు ఆయనిచ్చిన సమాధానం చదివాక నాకొచ్చిన అనుమానాలు.(ఇవి ఆయనపై విమర్శకోసం కాదు. కొంతసేపటిక్రితమే మాఇద్దరి మద్యనా చర్చజరిగింది. వాదనలు చెయ్యడం బాగోదుగనుక అక్కడ రాయలేక నాబ్లాగులో రాసుకుంటున్నా. మహేష్‌గారు తప్పుగా అర్థం చేసుకోవద్దు.) రాజారవివర్మకు ముందు ఇక్కడదేవతల్ని బట్టలతో ఎవరూచూడలేదు అంటున్నారు మరి బట్టలుకట్టకుండా ఏమూలవిరాట్టుకైనా పూజలుచెయ్యడం చూశారా?  గుడిపైన బొమ్మల్ని చూద్దాం. అక్కడ నగ్నంగా కనిపించేవి దేవతలుకాదు. దేవతల బొమ్మలు గోపురంముఖాల మద్యభాగంలో ఉంటాయి. అంచున నందీశ్వరుడు, సింహం వగైరావగైరా ఉంటాయి. మద్యలో వివిధభంగిమలలో ఉండేవి దేవతలుకాదు. మనుషులు లేక గంధర్వుల్లాంటి ఊర్థ్వలోకంలోనివారు. (ఇదినాఅభిప్రాయమే) ఇంకోవిషయం- ఆబొమ్మలలోని దేవతలకు బట్టలు ఉంటాయి. కానీ అవిచూసిన వెంటనే కనిపించవు. వాటి అంచులకు వేసిన డిజైన్లు, కుచ్చిళ్ళు వంటివి చూస్తే అర్థం అవుతుంది. అందుకే చనుమొనలు, జననాంగాలు వంటివి చూపరు.

సరె అప్పట్లో అలానే ఉన్నారని అనుకుందాం. మరి ఇప్పుడు అలావెయ్యాల్సిన అవసరం ఏమొచ్చింది? బట్టలు నెయ్యడం రాకముందు సమాజమంతా దిశమొలలే. ఇప్పుడూ అలానే తిరగొచ్చా?

బట్టలవిషయాన్ని పక్కనపెడదాం. మరి రావణుని తొడపైన సీతమ్మ కూర్చోవడం ఏమిటీ? మాయవేషంలో వచ్చి లంకకు అపహరించుకుపొయ్యేప్పుడుకూడా ఆతల్లిని నేరుగా తాకకుండా ఆమె సొమ్మసిల్లిపడిపోయిన ప్రాంతాన్ని నేలతోసహా పెకలించి తీసుకెళ్ళాడు. ఆతర్వాత అశొకవనంలోకూడా తనంతట తానుగా ఒప్పుకుంటేనే తాకుతానని చెప్పాడు. ఈరెండు వాల్మీకిరామాయణంలో చెప్పినవే. మరి దీనికేమి చెప్తాడు?

మరి ఇతరచిత్రాల్లో ఆయనగీసిన దృశ్యాలను ఏరకంగా అర్థంచేసుకోవాలో? దుర్గాదేవితో పులి వగైరా వగైరా. వీటిగురించి చదువుకున్నోడేకాదు నిరక్షరాస్యుడైనాసరే ఊహించుకునేందుకే ఏవగించుకుంటాడు. స్త్రీల స్వాభిమానం గురించి, స్వావలంబన గురించిమాట్లాడే ఫెమినిస్టులకు ఇక్కడ శక్తిస్వరూపిణి అయిన స్త్రీకి జరిగిన అవమానం పట్టలేదా? దుర్గామాత ఈసమాజంలో స్త్రీశక్తికి ప్రతీకగా చూస్తారా? లేక ఒకహిందూదేవత కాబట్టి మనమంతా సెక్యులర్లం అని తలతిప్పుకుపోతారా?

ఆయనకు ఊహాలోకంలో కనిపిమ్చినవంతా గీసుకొమ్మను. కానీ ఆతర్వాత తనిచేసినపనికి ఎవరైనా బాథపడుతారేమో అని ఒక్కసారి ఆలోచించల్సిన బాద్యత కళాకారుడిగా, వృద్ధుడిగా కాదు కనీసం మనిషిగా పాటించాల్సిన కనీసధర్మం. ఆఆలోచనలేనివ్యక్తి, చేసినతప్పుకు పశ్చాత్తపం చెందనివాడు ఈసమాజంలో ఉంటేఎంత? పోతేఎంత? కళ అనేది మనషి వికాసానికి , సమాజానికి మార్గంచూపడానికి పాటుపడ్దప్పుడే దాని ఉనికి అర్థం. నీద్వారా రూపుదిద్దుకున్నవి ఎవరిని బాగు పరుస్తాయి? తల్లిలోనూ, చెల్లిలోనూ నగ్నత్వం చూడ్డంగాక ఒరిగేదేముంది? అయ్యా హుస్సేన్గారు (లేక ఆయన తరపున వకాల్తాపుచ్చుకున్నవాళ్ళూ) ఆచిత్రాలను ఏభావంతో గీశారో చెప్పికాస్త పుణ్యకట్టుకో(ండి). నాకింకా జ్ఞానదంతం మొలవలా. వచ్చిమొలిపించండి. ఆనొప్పిభరిస్తా.

గీసేప్పుడు సరే ఏదోఆవేశంలో జరిగిపోయింది. మరిదాన్ని ప్రదర్శించేటప్పుడు ఆలోచించాలా?వద్దా? మరి వద్దని నువ్వనుకున్నప్పుడు మేమెందుకు నీగురించి ఆలోచించాలి? ఇక్కడ జరుగుతున్న ఇంకోతమాషా- ఆయన్ని సమర్థించేవాళ్ళంతా సమాజంలో కుళ్ళును తీసేసేవాళ్ళు. వ్యతిరేకించేవాళ్ళంతా హిందూమతసంస్థల కార్యకర్తలు. మరినాలాంటి సామాన్యుడిగోడు ఎవడికిపట్టింది? ఇదిమామనసును గాయపరిచింది అన్నామంటే మేమేదో మతసంస్థకి కార్యకర్తలం.
పోనీ ఆతర్వాతైనా తననిబద్ధతను నిరూపిమ్చుకున్నాడా? దేశంవదిలి వెళ్ళిపోయాడు. దీన్నిమించిన కేసులు నడుస్తున్నాయి ఇక్కడ. వాళ్ళెవరూ వదిలిపోలేదే? ఆతర్వాత ఇంకెక్కడొ పౌరుడిగా మారుతున్నావు. పోనీ ఆదేశమేమైనా పద్ధతైనదా? కళాకారుడికి అన్నింటికన్నా ముఖ్యమైనది భావప్రకటనస్వేచ్చ. అది పుష్కలంగా లభించే ఎన్నోదేశాలుండగా మచ్చుకైనా కనిపించని దేశాన్ని ఎంచుకున్నావు. ఇక్కడ నీవ్యక్తిత్వం ఏమిటో తెలియట్లేదా?

హిందువుకానీవాడు, ఆధర్మాన్ని ఒక్కరోజైనాపాటించనివాడు, కనీసం దానిగురించి తెలుసుకోవాలన్న ఆలోచనలేనివాడికి (ఇప్పుడు గీసింది హిందూదేవతల గురించి కాబట్టి. ఇది ఏసిద్ధ్హాంతానికైనా, మతానికైనా వర్తిస్తుంది. ఆయాకమ్యూనిటీల్లో భాగంగా లేనివాడికి, ఆచరించనివాడికి దానిగురిమ్చి విమర్శించెహక్కు ఉండదు.) ఇలాంటి బొమ్మలుగీసే నైతికహక్కు ఎక్కడిది? నీబోటోడు దేశాన్నొదిలి వెళ్ళిపోయినంత మాత్రాన ఇక్కడ రంగులు ఎండిపోవు, కుంచెలు విరిగిపోవు, కళాకారుల సృజనాత్మకత ఇగిరిపోదు.
నేను గమనించిన ఇంకోవిషయం- హుస్సేన్ గారి(డి) పెయింటింగ్స్ మనకు దొరకాలంటే లక్షలుపొయ్యాలి. కొన్ని శాంపిల్స్ ఇంటర్నెట్‌లో ఉన్నా వాటి నాసిరకంవి. మరి ఈచిత్రాలుమాత్రం ఉచితంగా విచ్చలవిడిగా దొరుకుతున్నాయి. పైరసీ విషయంలో ఎన్నోజాగ్రత్తలు తీసుకునే ఆయన వీటినెందుకు ఇలావదిలాడొ?

ఏది ధర్మం

ఈ టపారాయడానికి రెండుమూడూరోజులు ఆలోచించా. కారణం చదివాక మీకే తెలుస్తుంది.జరగబోయే దాడులకు మానసికంగా సిద్ధపడి ప్రచురిస్తున్నా. 

కూడలిలో ఓవారం రోజులు తిరిగాడంటే నిక్కరేసుకోని పిల్లోడిక్కూడా అర్థం అయ్యే పిల్లవిషయం ఏమిటంటే- ఇక్కడ గుంపులున్నాయి. అవును గుంపులున్నాయి. ఈవిషయం అర్థం కావడానికి నాకో వారంపదిరోజులు పటింది. "అబ్బా! ఏమిటిది" అనుకునేవాణ్ణి. కానీ తర్వాత ఆలోచిస్తే ఇదేమీ తప్పుకాదు అనిపించింది. ఎందుకంటారా? ఏబ్లాగును చూసినా రెండుమూడుటపాలు చదివామంటే సదరుబ్లాగరు అభిరుచి, ఆసక్తి, అసలాబ్లాగు ఎందుకు తెరిచాడు లాంటి విషయాలన్నీ తెలిసిపోతాయి. ఓయాభైటపాలు చదివినా అసలురాసేవాడు మనిషేనా? అసలేమి చెప్పలనుకుంటున్నాడు? అనిపించే బ్లాగులూ ఉన్నాయి. అదివేరేసంగతి. అలా పదిపదిహేను చూసేప్పుడు మన అభిరుచికో, నమ్మకానికో, సిద్ధాంతానికో పోలిక ఉండేబ్లాగు కనపడడం, వ్యాఖ్యరాయడం జరుగుతుంది. ఆతర్వాత పరిచయాలు క్రమంగా స్నేహితులుగా చేస్తాయి. ఇలా స్నేహాలు కాస్తా గుంపులుగా ఎదుగుతాయి.

ఇక్కడదాకా వ్యవహారం చిరునవ్వులతో, హాయిహాయిగా చాలాహుందాగా నడుస్తుంది. మరిసమస్య ఎక్కడ అంటే- కూడలిమొత్తం మనగుంపుకు అనుగుణంగానే టపాలు వెయ్యాలి అనే హుకుం.అలారాయని బ్లాగర్లపై ఫత్వా. ఇక్కడ మొదలయ్యే రావణకాష్టాలేవీ ఇంతవరకూ ఆరలేదు. కొంతకాలం మందగించినా అవన్నీ నివురుగప్పిన నిప్పులే.

ఒకవ్యక్తి చదువుకుని కనీసం ఒకడిగ్రీపట్టా అయినా పుచ్చుకున్నాక, కొద్దోగొప్పో లోకాన్ని చూశాక, తనకంటూ కొన్నీఅలోచనలు, అభిప్రాయాలు ఏర్పడ్డాక, రాయాలనిపించి అందుకు ఒకవేదికను వెతుక్కునే సమయంలో లభించే అవకాశమే బ్లాగు. దీన్నిబట్టి మనకు అర్థం అయ్యేదేమిటయ్యా అంటే - మనఆలోచనలతో సారూప్యత ఉన్నవాళ్లతో సహవాసం చెయ్యగలమేగానీ ఎవర్నో మన ఆలోచనలతో, సిద్ధాంతాలతో, తలాతోకాలేని వాదులాటలతో మార్చెయ్యాలి అనుకోవడం పొరబాటేకాదు అజ్ఞానమే అవుతుంది. తన‌అనుభవాలతో దేవుణ్ణి నమ్మేవ్యక్తితో ఎంతవాదించినా అతనికి పరమాత్మ ఉనికి కనిపిస్తొ ఉంటుంది. అలాగే పస్తులతో కాలాన్ని ఈడ్చినవాడికి దేవుడికన్నా ముందు ఆకలే కనిపిస్తుంది. ఇది మనంకనుక్కోలేనంత చిదంబరరహస్యం ఏమీకాదు.


కానీ సమస్య ఏమిటంటే- మనసిద్ధాంతాలపై మనకున్న నమ్మకంలో వెయ్యోవంతు గౌరవం ఎదుటివాళ్ళ నమ్మకాలపై ఉండదు. తనురాసేది కొందరిని ఇబ్బందిపెడుతుందని తనకు తెలుసు.వాళ్ళు రాసింది చూసినవాళ్ళు అనుకున్న బ్లాగుగురించి కాకపోవచ్చు.  ఎవరైనా ప్రశ్నిస్తే నేనన్నది ఒకరిని ఉద్దేశించికాదు అనొచ్చు. కానీ టపాశీర్షికలో-బ్లాగుస్వాములు అన్నారు అంటే అది తోటిబ్లాగరు గురించేకదా?  కూడలిలో ఉన్నబ్లాగులు లాగితంతే ఐదొందలు. అందులో భక్తిబ్లాగులు పదిపదిహేను. మహాఅయితే ఇరవై. ఇందులో తరచుగా రాసేబ్లాగర్లు పదిమంది. అంటే ఆబ్లాగు శీర్షిక ఈపదిమందిలొ ఎవరినో ఉద్దేశించి అన్నదేకదా? ఆపదిమంది బ్లాగుల్ని చూద్దాం.


ఇప్పుడు ఆటపాలో ఉన్న విషయం టూకీగా- పరీక్షలప్పుడు పూజలు. ఈవిషయంపై రాసిందెవరో చూసేందుకు మనమేమీ షెర్లాక్‌హోమ్స్ కానక్కర్లా. వారాంతంలో ఓసారి కూడలితెరిచినా ఈరకమైన టపారాసే బ్లాగరెవరోమనకు తెలుస్తుంది. సరే ఆయన్నికాదనుకుందాం. మరి ఆపదిమందిలో ఎవర్నో? లేదా భక్తిబ్లాగులగుంపునో లేక అందులో ఒక‌ఉపగుంపునో. ఇలాంటి దాడి భావప్రకటనకు వ్యతిరేకంకాదా?

 నాకు తెలీక అడుగుతా? ఎదుటివాడి మంచికోసం మనం ఐదునిముషాలు అలోచించడం నేరమా? అదితప్పని ఏసిద్ధాంతం చెప్పిందో? పరీక్షలకు వెళ్ళె పిల్లలకు వయసులోపెద్దాయనగా అలాకోరడంలో తప్పేమిటో? పోనీ ఎదుటోడికే చెప్పిఊరుకున్నాడా? ఆయనకూడా వీలైనంతలొ ఆచరిస్తున్నాడుగా? తనూఅచరించిందే చెప్తునాడుగా? అక్కడ పిల్లలకేమి చెప్పాడు? పరీక్షలప్పుడు ధైర్యంగా ఉండేందుకు పరిష్కారం ఇచ్చాడు. అందులో సమాజాన్ని చెడగొట్టేంత విషం ఏముందో? మీకోసం పూజచేస్తా అన్నాడు. వాళ్లమంచికోసం ఆలోచించడం తప్పా? అందుకేమీ ఆయన డబ్బుతీసుకోవట్లేదే? అంటే మనసమాజంలో పెద్దలు పిల్లల మంచికోరడం, పిల్లలు పెద్దలకు నమస్కారం చెయ్యడంవంటివి అభిజాత్యానికి నిదర్శనమా? తాయెత్తులు కట్టేది స్వామీజీలేకాదు పకీర్లు, ఇతరమతాల్లోని సాధువులుకూడా అన్నసంగతి వాళ్ళకి ఎందుకుతెలీదో?


ఇలాదాడులుచేసే బ్లాగర్లకు సమాజంలోని కొన్నిసమస్యలే, వాటిలోని తమకుకావల్సిన పార్శ్వాలే కనిపిస్తాయని, వాటిపైనే రాస్తారని, పోనీతనబ్లాగులో చర్చలకు సరైనదిశలో స్పందించరని చెప్పేహక్కు నాకులేదు. ఎందుకంటె అవి వాళ్ళబ్లాగులు. వాళ్లవాళ్ల ఇష్టానుసారం, వారు స్పందించగలిగే అంశాలపైనే వాళ్ళురాస్తారు. వాళ్ళబ్లాగులు ఇలానే ఉండాలి అనే హక్కు నాకులేదు. మరివాళ్ళూ మిగిలినబ్లాగుల గురించి అలానే అనుకోవలన్నదిమాత్రం తోటిబ్లాగరుగా నాకోరిక.

 వారంరోజులుగా ఇంతమంది స్వామీజీలను అరెస్టు చేస్తుంటే సగటుహిందువు సమర్థించాడేతప్ప నిరశనలు, రాస్తారోకోలు చెయ్యలేదు. నిజస్వరూపాలు బయటపడ్డాక ఆఆశ్రమాలపై దాడిచేసినవారిలో ఆస్తికులు, దైవచింతనలో గడిపేవారు, మద్యతరగతి హిందువులు( ఈమాట ఎందుకువాడుతున్నాను అంటే వీళ్లదృష్టిలో దొంగస్వాములు హిందూమతంలోనే ఉంటారు.) ఉన్నారు. ఇలాంటిసంఘటన మరేమతపెద్ద విషయంలో జరిగినా వీడియోలు బయటికిరావు. వచ్చినా మీడియాకి అంతదమ్ములేదు. అసలింతమందిని అరెస్టుచేసే అవకాశమే ఉండదు.

చివరగా ఒక్కమాట- మనదేశంలో ప్రజాస్వామ్యం ఏర్పడ్డాక ఎన్నోసార్లు మోసగాళ్ళు తప్పించుకున్నారు. హత్యలుచేసినవాళ్ళు రాజ్యాన్నేలుతున్నారు. కులంగజ్జితో కుంచించుకుపోతున్నాం. ప్రజలకు తమఓటు ఎంతవిలువైనదో తెలీని స్థితిలో ఓటేస్తున్నారు. స్వార్థప్రయోజనాలకోసం అసమర్థులను ఎన్నుకుంటున్నారు. పాలితులు-పాలకులు ఎవరికి వీలైనస్థాయిలో వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. మరి ఈతప్పు ప్రజాస్వామ్యానిదా? ప్రజలదా? ఇక్కడ హైందవంపై జరుగుతున్నది కూడా అలాంటిదే. కొందరివ్యక్తులు స్వార్థంకోసం కాషాయాన్ని తొడుక్కుని అరాచకాలు చేస్తుంటే ఆమకిలి హైందవానికి అంటుకుంటుంది. కానీ ఇదితాత్కాలికం. కారణం నాధర్మం అజరామరం. స్వయంప్రకాశం. ధర్మోరక్షతి రక్షితః