అబ్బబ్బబ్బబ్బా ..పండగంటే ఇదీ. అసలే పాడుతాతీయగా. మిగిలింది చివరి ఆరేడుగురు. అంటే పోటీదారుల్లో 'క్రీమ్'. ఏపాటపాడినా శ్రవణానందమే. ఇక 'మణి' (బాలుని ఇంట్లో అలానే పిలుస్తారట.) వ్యాఖ్యానం చెప్పనక్కర్లేదు. ఇవన్నీ ఒకెత్తు ఐతే ఈవారం న్యాయనిర్ణేతలు. బాపు-రమణ. పచ్చటి గున్నమావిచెట్టుకొమ్మలపై కోతికొమ్మచ్చి ఆడుతుంటే, వాళ్ళతోకల్ని పట్టుకుని ఊగుతూ పరవశించాం. ఈమద్యనే చెట్టుదిగారు. ఇంతలో ఇలా కళ్లముందు.
పాడుతాతీయగా రెండోధారావాహికం గురించి కొన్నిచేదునిజాలు చెప్పాలి. దశాబ్దమున్నర క్రితం మొదలైన పాడుతాతీయగాతో పోలిస్తే కొంచెంసందడి తక్కువగానే ఉంది. న్యాయనిర్ణేతలుగా మహదేవన్, పుహళేంది, బాలమురళికృష్ణ... ఇప్పటికిప్పుడు గుర్తురాని పేర్లెన్నో. అలాంటిది ఈమద్యన వస్తున్న 'అ'న్యాయనిర్ణేతల్ని చూస్తే కోపంనషాళానికి అంటేది. పరుచూరిగాళ్ళ 'అన్నగారిభజన' చూస్తుంటే టీవీబద్దలు కొట్టాలనిపించేది. తెలుగుసినిమా ఆత్మను చంపేసి అంపశయ్యపై పండబెట్టినోళ్ళు వాళ్ళ అనుభవాల్నినిస్సిగ్గుగా వర్ణిస్తుంటె, నిర్వేదంతో భరించడం మనవంతైంది. ఇలాంటోళ్లని కూర్చోపెట్టెబదులు ఈబాలసుబ్రహ్మణ్యమే మార్కులెయ్యొచ్చుగా అనుకునెవాణ్ణి. నామాట విన్నడేమో ఆర్పీగాడొచ్చినప్పుడు ఆయనే మార్కులేసుకున్నాడు. రెండువారాలు క్రిష్ వచ్చాడుట. చూళ్ళేకపోయా. ఇంతలో అనుకోని ఈవరం. బాధవెనుక సుఖము సమకూరుధరలోన అని శతకకారుడు ఊరకే అనలేదుమరి.
ఈమద్య అమ్మ నాదగ్గరికి వస్తూ కోతి-(ఇం)కోతి కొమ్మచ్చులను తీసుకొచ్చింది. స్వాతిలో మొదలయినప్పుడు తిరుచిరాపల్లిలో ఉన్నాను. అక్కడ సెంట్రల్ బస్‌స్టేషన్ దగ్గర దొరికేది. అక్కడికెళ్ళి తీసుకొచ్చి అది చదివి అరవోళ్ళకిస్తే మిగతాపేజీల్లోని బొమ్మల్ని చూసుకుంటూ హాయిగా నిద్రపోయేవాళ్ళు. ఆతర్వాత వయా నోయిడా శక్తినగర్‌కొచ్చి పడేసరికే అన్నివారాలు కవర్ చెయ్యలేకపోయా. ఆకొరత హాసం పబ్లికేషన్స్ పుణ్యమాని తీరింది. నెల్లూరు రెడ్డిగారు, మాఊరిరెడ్డిగారికి వియ్యంకుడు 'శాంతాబయోటిక్స్' వరప్రసాదరెడ్డికి వందనాలు. చెట్టుదిగి రెండురోజులుకూడా కాలేదు, అన్నీమనసులో పచ్చిగా పచ్చగా ఉన్నాయి.
ఇక ఈవారం విశేషాలకొస్తే రాధాకళ్యాణం సినిమా పాటతో మొదలుపెట్టారు.
మొదటిపాట "శ్రీరస్తు శుభమస్తు" పాడింది అమ్మఫేవరెట్ గీత. ఎలాంటి ఎక్స్‌ప్రెషన్స్ లేకుండా పాడటం చూస్తే జానకి గుర్తొస్తుందట అమ్మకి.
తర్వాత "రాయినైనా కాకపోతిని" గోరంతదీపం-కొండంతభావం. పాడింది నాఫేవరెట్ సబీహ. నర్తనశాలలో "జననీ శివకామిని" పాడినప్పుడు మొదటిసారి విన్నాను. తర్వాత "అల్లాయే దిగివచ్చి.. నవ్వెరా నాకింక రంజాను పండుగ" పాడినప్పటి నుంచి నామార్కులన్నీ కడప బూబమ్మకే.
లిప్సిక "అలా మండిపడకే జాబిలీ.." ఇప్పటిదాకా వినలేదు ఈపాట. ఈఅమ్మాయిని చూస్తే "ఆంధ్రా శ్రియాగోషల్" అనిపిస్తుంది. రాజన్‌గారొచ్చిన వారం రాజన్-నాగేంద్ర కాంబినేషన్ పాటలు పాడాలి అన్నారు. నామనసులో ఓపాట ఉంది.ఎవరుపాడతారో గానీ లాల్ సలామ్ చెప్పాలనుకున్నా. 'లాల్ సలామ్' వినిపించిందేమో ఈఖమ్మం అమ్మాయికి వెంటనే "మానసవీణా మధుగీతం.." అందుకుంది. ఈపాట ఒకకాంపిటీషన్లో పాడాలంటే ధమ్ముండాలి. ఆర్టిఫిషియల్ ఎఫెక్ట్స్ అన్నీ ఆలవోకగా పాడెయటం చూస్తే గొంతులో ఎన్నితంత్రులున్నాయా అనిపిస్తుంది. షకలకబేబిపాటని కేకకెవ్వు పెటించింది.
కార్తీక్ గాడి దోస్తీ పాట సంగీతం బాపు-రమణ పద్దతిలో లేకపోయినా (చిరుకి ఎలాఉండాలో నర్సాపురం డైరెక్టరుకి తెలుసుగా.) భావంమాత్రం వాళ్లదోస్తీలానే ఉంది. ఈమతిమరుపు మంగబాబు అలవాటు ప్రకారం మళ్ళీ రెండొచరణాన్ని చెగోడీల్లా నమిలేశాడు.
తర్వాత అనంతపురం రాజేష్ "నీవుంటే వేరేకనులెందుకు" మొదలెట్టాడు. వీడుపాడాడంటే నాకు ఒకయాంగిల్లో ఎస్పీబీ ఇంకోయాంగిల్లో పీఎస్పీబీ(కన్నడంకూడా వచ్చట) కనిపిస్తారు. ప్రైజుసంగతి పక్కనపెడితే ప్రొఫెషనల్గా ఎదిగే లక్షణాలు పుష్కలం. దేవుడిచ్చిన గొంతు ఒకవరం.
ఇక గుంటూరమ్మాయి మల్లిక రాంబటుచేత మళ్ళీకోతికొమ్మచ్చి. విన్నంతలోనే కట్టిపడేసే ప్రత్యేకలక్షణాలేవీ లేకపోయినా పెర్ఫార్మెన్స్‌లో కన్సిస్టెన్సీ బావుంటుంది. చూస్తున్నంత సేపు మాలీపిది గుర్తొస్తుంది.
ఇక మౌనిమ (జగదాంబ) సంపూర్ణరామాయణంలో శబరిపాట. ఆగొంతులో ఉండాల్సిన వ..ణ్‌ణు..కు లేదనిపించింది. ఈపిల్ల మిగతావాళ్లకంటే కొంచెంతేడా. చూపులోనే పెళుసుమోత్తనం కనిపిస్తుంది. కాంపిటీషన్ ఎక్సామ్స్ బాగారాస్తుందనుకుంటా. పాటకన్నా నవ్వుబావుంటుంది. (ఇడ్లీకన్నా చట్నీబావుంటుంది.) ఫేస్‌గ్లామర్‌తో గుడ్‌విల్‌మార్క్స్ కొట్టేస్తుంది.
చివరగా శ్రీకాకుళం సాగర్ "శివశివశంకర.." మొదలెట్టాడు. ఈపాట వినగానే చిన్నప్పటి భజనే గుర్తొస్తుంది. "మారేడు నీవని ఏరేరితేనా మారేడు దళములు నీపూజకు" వాహ్! అంతే. పాటంటే ఇంతే. తనగొంతుతో పాడటం ఈఅబ్బాయిలో నాకు బాగానచ్చేది .
అలా అలా చూస్తున్నంతలోనే కోతికొమ్మచి పూర్తయ్యింది. మళ్ళీఇంకోవారంకూడా వీళ్ళేనన్న ఆనందంతో ఇంకోతికొమ్మచ్చి చూసేందుకు ఎదురుచూడాలి.
కోతికొమ్మచ్చి చదివేందుకు తీరికలేదని పవాసాంద్రులకోసం ఎంపీత్ర్రీలు వదిలారట. ప్రోగ్రాం మద్యలో తెలిసింది. దాన్ని చదువుతూ చేతిలో కాఫీగ్లాసునే పట్టుకోవడానికే సర్కస్‌ఫీట్లు చేశాను. ఇక డ్రైవింగ్‌చేస్తూ వింటే స్టీరింగ్‌కంట్రోల్ చెయ్యడం బ్రహ్మతరంకూడా కాదు.
ఇంకో ముఖ్యమైనవిషయం- ప్రకటనల సమయంలో ఒకకొత్తటీవీషో ప్రమో వచ్చింది. చూడగానే ఎందుకో ఎడమకన్ను కొట్టుకుంది. కొంపతీసి 'బాబు'దే అయితే మళ్ళీతెలుగుప్రేక్షకుడికి బాడ్‌టైం మొదలయ్యింది. మనబ్లాగర్లలో కొంతమంది అరివీరఫాన్లున్నారు. వాళ్ళు చూసి కూడలికొచ్చి విశేషాలు వివరిస్తారు. అప్పటిదాకా ఈటీవీ మాటీవీ కాదనుకోవడమే.
అస్సలు ఏమి తెలియని నా వంటి వారికోసం మరింత వివరం అందించవలసింది. ఈ ప్రోగ్రాం ఈ టీవీ లో వస్తుందా? ఆ పేర్లన్ని పాటలు పాడిన వారివా? కోతి కొమ్మచ్చి చూడటమేమిటీ మధ్యలో ? అర్ధం కాలేదు? అంటే ఈ పాటలు వింటూ ఆ పుస్తకం చదివేరా అంత చిన్న పుస్తకం కాదు కదా అది???
ReplyDeleteఈ మద్య మీరు చెప్పినట్లు క్వాలిటి తగ్గిందని చూడటము మానేసాను . బాపు , రమణలున్నారని నిన్న నేనూ చూసాను ఈ ప్రోగ్రాం . పిల్లలు బాగా పాడారు .
ReplyDelete"బాధవెనుక సుఖము సమకూరుధరలోన అని శతకకారుడు ఊరకే అనలేదుమరి."బాగానే వుంది.........సాధనమున పనులు సమకూరు ధరలోన అని విన్నట్టు గుర్తు... ఏది ఎమైనా మళ్ళా కేక పెట్తించావ్....--Siva Kumar.Kolanukuduru...
ReplyDelete@భావన: ఆలస్యంగా జవాబిస్తున్నందుకు క్షమించాలి. ఈటీవీలో వస్తుంది.మీరు AP7AM వంటి సైట్లలో చూడొచ్చు. కోతికొమ్మచ్చి పుస్తకాన్ని ఈమద్యనే పూర్తిచేశాను. ప్రోగ్రాంమద్యలో కూడా ఆపుస్తకం గురించి కొంతచర్చ జరిగింది.
ReplyDelete@మాలాకుమార్: ఇకపై వచ్చేభాగాలు పోటీదారులకి చాలాముఖ్యం కాబట్టి మంచివాళ్ళనే తీసుకొస్తారనుకుంటున్నా.ధన్యవాదాలు
@శివన్న: ఇదికూడా చిన్న కొ.కొ.:)
@ రాయబోయే అజ్ఞాతగారు: కనీసం పేరైనా రాయొచ్చుగదా :)
ReplyDelete