గీతాసారం
ఈభూమిని కొందరు పుణ్యభూమి అంటే మరికొందరు కర్మభూమి అంటారు. ఇంకొందరు ధర్మభూమి అంటారు. శాస్త్రాలకు పురిటిగడ్డగా కొనియాడుతారు. ఈగడ్డపై ధర్మానికి శాస్త్రం పుట్టింది, అర్థానికి శాస్త్రం పుట్టింది, మోక్షానికి శాస్త్రం పుట్టింది, కామానికి శాస్త్రం పుట్టింది. అద్భుతమైన వైద్యశాస్త్ర గ్రంధాన్ని చేతికిచ్చి చదువుకో అంటే రోగికి వ్యాధి నయంకాదు. నిపుణుడైన వైద్యుని పర్యవేక్షణే మార్గం. అలానే శాస్త్రాలు అరిగించుకుని పరమపథం చేరేలా మార్గదర్శనం చెయ్యడానికి పురుషోత్తముని గొంతునుంచి ఉద్భవించిన అమృతకలశం ఈభూమిని పునీతంచేసింది.

ఈసారి అమృతంకోసం సాగరాన్ని కాక విజయుని సహస్రారాన్ని వేదికగా చేసుకున్నాడు. అతనిమనసులో యుద్ధబీతి అనే హాలాహలం ఉద్భవించే వరకు వేచిచూశాడు. కాకపోతే ఒకచిన్నతేడా. మొదటిసారి అమృతభాండం ప్రాణంభయంతో పొందింది కాబట్టి పంచడంలో పక్షపాతం అవసరమైంది. కానీ ఇప్పుడు ఉద్భవించింది తనబిడ్డలకు మార్గాన్ని చూపేందుకు. కాబట్టి సమానంగా పంచాడు. ఈకలశం చేసే హితం కేవలం హిందువులకో, ఉపఖండవాసులకో, లేక మనుషులకో కాదు. సమస్థ చరాచరసృష్టికి.


యుగాలుమారినా తన స్వయంప్రకాశంలో చిటికెడైనా తరుగులేకుండా చీకటిని పారద్రోలేందుకు అనుష్టుప్ రూపంలో వెలుగుతూనేఉంది. ఎలాంటి గందరగోళం సృష్టించకుండా, పాటించాల్సిన ధర్మాన్ని- నడవవల్సిన మార్గాన్ని అతితక్కువ నిడవిలో తెలియజేస్తూ ఋజుమార్గంలో నడుస్తూ నడిపిస్తూ ఉంది.


ఆకలశంలోంచి కొన్నిచుక్కలు మనగొంతులో పోసేందుకు ఎందరోమహానుభావులు కృషిగావించారు. ఇటీవలికాలంలో శ్రీశ్రీశ్రీ విద్యా ప్రకాశానందగిరిస్వామి గారు దివ్యక్షేత్రం శ్రీకాళహస్తి కేంద్రంగా నెలకొల్పిన శుకబ్రహ్మాశ్రమం ద్వారా మానవాళికి గీతాసారాన్ని అందించారు.

గీతా సారం:

* ఏమి జరిగిందో, అది బాగా జరిగింది.
* ఏమి జరుగుతోందో, అది బాగా జరుగుతోంది.
* ఏమి జరగబోతోందో, అది కూడా బాగానే జరగబోతోంది.
* నీది ఏది పోయింది, ఎందుకు నీవు బాధ పడుతున్నావు?
* నీవు ఏమి తెచ్చావని,
* అది పోయిందని బాధ పడుతున్నావు?
* నీవు ఏమి సృష్టించావని అది నష్టపోయిందనడానికి?
* నీవు ఏమి తీసుకున్నావో, ఇక్కడ నుంచే తీసుకున్నావు.
* నీవు ఏమి ఇచ్చావో, ఇక్కడనే ఇచ్చావు.
* ఈవేళ ఏది నీదో, అది న్నిన్న ఎవరిదో మరెవరిదో అయిపోతుంది.
* పరివర్తన సంసారం యొక్క నియమం

కర్మణ్యే వాధికారస్తే మాఫలేషు కదాచన
మాకర్మఫలహేతుర్భూః మాతే సంగోస్త్వకర్మణి

ఈరోజు మద్యాహ్నం తృష్ణక్క 'గీతాసారం' మెయిల్ చేసేంతవరకు ఈరోజు గీతాజయంతి అన్నసంగతి గుర్తులేదు. ఈసందర్భంగా టపారాసేందుకు కుదరట్లేదని, తన తరపున నన్నుపెట్టమని చెప్పిమ్ది. ఇప్పటికి తీరింది టపారాసేందుకు. ఈటపా స్వర్ణముఖిలో పబ్లిష్ అయినప్పటికీ తృష్ణ టపాగా భావించగలరు.

శ్రీమద్రమారమణ గోవిందో హారి!

శబరి ఎంగిలి ఆరాముడు ఒక్కసారి తింటే మారాముడుమాత్రం మాఎంగిలి ప్రతివారం తినేవాడు.
మాతాతకి (అమ్మనాన్న) ఆయన తండ్రిద్వారా రామమందిరంలో అర్చకత్వం లభించింది. దాంట్లో నాచిన్నప్పుడు ప్రతిశనివారం భజన అనే బృహత్తరకార్యక్రమం జరిగేది. ఆభజనకి మాతాత, వెంకట్రామశెట్టీ (హార్మోనియం), సుబ్బులుశెట్టి (మృదంగం), ఇంకా బ్యాంకు మస్తానయ్య, పాలశివయ్య, చెంచయ్య ఇలా ప్రత్యేక ఆహ్వానితులు. అక్కడ తాళాలు ( అంటే గొళ్లెంపెట్టేవి కాదు. అదొక వాద్యం) వాయించాలంటే సీనియారిటీ ఉండాలి. మనలాంటి పిల్లబ్యాచీకి దొరకవు. వాటిపక్క "ఆ..!" అంటూ చూసుకుంటూ చేతులతోనే కొట్టుకునేవాళ్లం.మరోవిషయం ఏవిటంటే పాడేవాళ్లకి కొన్నిపాటలపై పేటేంటుహక్కులు ఉంటాయి. వాటిని వారికే సొంతమైన హావభావాలను చూపిస్తూ, గమకాలను ఇరికిస్తూ, కొన్నిలైన్లను మళ్లీమళ్లీ పాడుతూ అంటే రామదాసు కీర్తనల్లో "యెవడబ్బా సొమ్మని రామచంద్రా!" అని తిట్టి తరువాత సముదాయించడం, "ఉన్నావా? అసలున్నావా?.. " అని ఆయన ఉనికినే ప్రశ్నించడంలాంటివి. వాటిని వేరేవాళ్లెవరైనా పాడితే మనోభావాలు దెబ్బతింటాయి. కొన్నిసార్లు ఈతగాదాలు తీర్చేందుకు అయోద్యనుంచి అయ్యవారే దిగివచ్చేలా సాగేవి.

అన్నిపాటల్లోకి మనకు బాగా నచ్చేది "పవమాన సుతుడుపట్టు పాదారవిందమునకు నీనామరూపమునకు నిత్యజయమంగళం...సాకేతపురనివాస ..ప్రహ్లాదనారదాది భక్తూలు పొగడుచున్న నీనామరూపమునకు నిత్యజయమంగళం." ఎందుకంటే ఈమంగళంపాడితే తర్వాత ప్రసాదాలే. మరి భజన అన్నపదం వింటే బ్యాక్‌గ్రౌండ్‌లో ప్రసాదం అనే పదం వినపడుతుంది కదా.

శనివారం సాయంత్రం దాన్ని తయారుచేసే పని అమ్మమ్మది. మొదట్లో అలసందులు ఉడికించేది. భలే ఉండేవి. కానీ తర్వాత గుగ్గిళ్లకి మెనూ మార్చేశారు. ఆరాముడేమో ఏదిపెట్టినా ఫీలవ్వడు. కానీ *తోకలేని*వాడిని నాబాధ ఎవ్వడికి చెప్పుకోను. రాత్రి ఎనిమిదికి మొదలవ్వుతుంది భజన. ఈప్రసాదం మాత్రం ఆరోగంటకల్లా పూర్తయి "వారాయ్..!" అని పిలుస్తూ ఉంటుంది. తాతేమో దానిపక్క చూసినా ఒప్పుకోడు. కానీ హోమ్‌మినిష్టర్ మాత్రం రాజ్యాంగ సవరణలు పెడుతుంది. ఆయనకాదనడు. లేడు. అంటే ఇక హోంరూల్ వచ్చేస్తుంది.

ఇక్కడ అమ్మమ్మగురించి కొద్దిగా వివరించడానికి ప్రయత్నిస్తా. (చిన్న ప్రయత్నం మాత్రమే.) భారతదేశంలో పిల్లలహక్కుల గురించి పోరాడేవాళ్లు, వాళ్లగురించి రాసేవాళ్లు ఈవిడని పట్టించుకోలేదు అనిపిస్తుంది నాకు. పిల్లలకు పెద్దలకు తేడా చూపకుండా అందరికీ చిక్కటి కాఫీనే ఇస్తుంది. ఈఒక్కటి చాలనుకుంటా మీకు. ఆమె ఉద్దేశ్యంలో పిల్లాడు పదోఏడు వచ్చేవరకు చదువులు, పలక-బలపం, హోంవర్కు ఇలాటివి ఆలోచించకూడదు. అప్పటివరకు కడుపునిండా పాలుతాగి. కంటినిండా నిద్రపొయ్యి రోజులో ఇంకా గంటో అరగంటో మిగిలితే ఊరిమీద ఊరేగాలి. ఇలా పదేళ్లు గడిపిన తర్వాత ఇకచాలు అని పిల్లవాడు స్వచ్చందంగా ఒప్పుకుంటే అప్పుడు బడికి పంపాలి. ఒకవేళవాడు కాదుకూడదు అంటే వాడు ఒప్పుకునేంత వరకు బలవంత పెట్టకూడదు. బాలకార్మికవ్యవస్థనైనా ఒప్పుకుంటుంది కానీ బాలవిధ్యావ్యవస్థను ఉపేక్షించలేదు.
ఇలాంటి మహామనీషి నేను అలా ప్రసాదం (సారీ అప్పుడది నైవేద్యం. పూజయినాకే ప్రసాదంగా మారుతుంది.) వంక చూస్తుంటే తట్టుకోగలదా. తాత అలా బయటికి వెళ్ళడంతోటే నాకోగిన్నెలో పోసి "తొందరగా కానీరా." అనేసి వెళ్లిపోయేది తలుపు దగ్గరికి. ఆసమయానికి నాఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్లకీ ఓపిడికెడు.
అలా అలా వారాలు దొర్లిపోతుంటే ఒకబలహీన సమయంలో తాత కంటపడింది ఈదృశ్యం. " సాయంత్రం అనంగా నేను చేస్తే రాత్రి ఎనిమిది దాకా మొదలు పెట్టరు. ఆతర్వాత ఒకటిన్నరగంటకి మీభజనలు పూర్తయితే అప్పటిదాకా అలమటించాలా పిలకాయలు. వీళ్లని పస్తుంచి ఆయనకి పెట్టమన్నాడా ఆరాముడు. (పాపం తాతకి రాముడితో డైరెక్టు కాంటాక్ట్స్ లేవు. ఆయన అభిప్రాయం కనుక్కుందాం అంటే.) మీరూ మీభజనలూ. దానికి మళ్లీప్రసాదాలూ. అవి తాక్కూడదని పిల్లలకి పస్తులూ.... " ఇలా ఇంకా ఏవేవో న్యాయపరమైన, ధర్మసకంటం కలిగింఛే ప్రశ్నలు వదిలేసరికే తాత మ్యూట్ బటను నొక్కేశాడు.

ఇక కార్తీకమాసం వస్తే మొదలయ్యే సీజను అక్కడినుంచి స్వాములు ఇరుముడికట్టుకుని బస్సెక్కేదాకా ఉంటుంది. మొదట్లో ఈభజనలుకూడా మామందిరంలోనే జరిగేవి. తర్వాత హౌస్‌ఫుల్‌ కావడంతో అలఘనాథస్వామిగుడి కళ్యాణమండపానికి మారింది. ఇక్కడ పాట మారింది. "సత్యముజ్యోతిగ వెలుగునయా.." మొదలవడంతోనే త్రిశూలం సినిమాలో "సుప్రభాతం..సుప్రభాతం" అని కృష్ణంరాజు పాడడంతోనే గోడలుదూకుతూ పరిగెత్తే పిల్లల్లా వచ్చేవాళ్లం. తర్వాత శరణాలు, స్వాములకి భిక్ష. వెంటనే మనకు టిఫిను( మాపిన్నికొడుకు దాన్ని అలానే పిలిచేవాడు.) ఇక్కడ మరో అట్రాక్షన్ పాటలు. సినిమా అలా రిలీజయ్యిందోలేదో దానికి రీమిక్సుకొట్టి మద్యలో అక్కడక్కడా శరణాలు ఇరికిచ్చి వాళ్లుచేసే విన్యాసాలు అసలుపాటను మరిపించేస్తాయి. ఈసారి మగధీర, జోష్ రీమిక్సులు ఎలా ఉన్నాయో? ఎమో?

అమృతభాండం

"రేయ్ ఎక్కడున్నావహే. నేను రైలుదిగి అరగంట."
"వస్తూన్నా ఉండరా."
---------
"ఎక్కడ ఎక్కడ"
"నీ ఎదురుగానేరా"
"నువ్వుకాదహే. పొట్లాలు."

వాడి బాగ్‌లోంచి బట్టలు బయటికి దొర్లబోసి
అడుగున ఉన్న నగిషీలు చెక్కిన చెక్కపెట్టె
దానికొక తాటికాయంత తాళం
తాళంవేసి గొళ్ళెం మరిచారు.
తెరిస్తే

ఆపక్కనే పిల్ట్రీ భాండం.

"పిల్ట్రీ కొత్తది తెమ్మన్నా గదరా."
"తాత దగ్గరున్న పిల్ట్రీ పంపుతున్నా. కొత్తది తెచ్చేందుకు టైమ్ దొరకలేదు" అని చెప్పిందిరా అమ్మ.
"సుసంపన్నమైన బహువిధమైన మాతాత వారసత్వ సంపద నాకు గర్వకారణం." అని చెప్పేసి దాన్ని చేతిలోకి తీసుకుంటే కెవ్వ్

కిందకలక్టరు కన్నా పైన చిల్లులగిన్నె ఒక మిల్లీమీతరు పెద్దది.

పళ్లుబిగబట్టి గట్టిగా ఒత్తితే క్లెమోర్‌మైన్‌లా ఎగిరింది.

"పైగిన్నెని గట్టిగా ఒత్తము. దాన్ని నీపై ఉంచనిస్తే చాలు" అని కిందదాంతో శాంతి ఒప్పందం కుదుర్చుకుని తెల్లజెండా ఎగరేశా.

"ఇంతకీ పొయ్యెక్కడరా నీయబ్బా? పాలు, డికాక్షను కాచేదెలా?"

"పద పక్కీదిలోనే యుటెన్సిల్‌షాపుంది."

"కుంపటి, బొగ్గులు, కిరసనాయిలు, అగ్గిపెట్టె.." అనుకుంటూ అన్నీ పట్టుకొచ్చాం.

ఇక
నే రాయనక్ఖర్లేదు. కింద దృశ్యమాలిక.
ఇదంతా చేసేసి అలిసిపోయింది నేననుకుంటే డికాక్షన్‌లో వేలేశారన్నమాటే.
మనకు పాకశాస్త్రంలో ప్రావీణ్యం గురించి అన్నప్రాశనరోజే చెప్పాగదా.


పైనకనిపించేది అశోక్ అని మనబాల్యమిత్రుడు.
అలావాడు కాఫీకాస్తుంటే నేను బ్యాక్‌గ్రౌండ్‌లో
"స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం..."
"ఆనాటి ఆస్నేహమానందగీతం.."
"సింగారాలపైరుల్లోనా బంగారాలే.."
"చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో.."
ఇలాటివి పెట్టాను. మద్యలో "ముస్తాఫా ముస్తాఫా " అందామంటే అందులో వినీత్, అబ్బాస్‌లకి వచ్చిన సమస్యలు మాఇద్దరి మద్యనా రాలేదు కాబట్టి విరమించుకున్నా.ఇలా కాఫీగ్లాసు పక్కనెట్టుకుని టపాలకి వ్యాఖ్యలు రాసుకుంటూ ఈజీవితం సాగిపోతే...
మొత్తానికి చలిపులిపంజా దెబ్బకి మనకొక పెయిన్‌కిల్లర్ దొరికింది.

కాఫీ గురించి నాకు (నాకుమాత్రమే తెలిసిన నిజాలు)

హంస పాలు-నీళ్లు కలిపి ఇస్తే పాలు తాగి నీల్లని వదిలేస్తుంది. అదే కాఫీ ఇస్తే?

డికాక్షను తాగి పాలు వదిలేస్తుంది.

కురుక్షేత్రంమద్యలో కృష్ణుడు గొంతుబొంగురుబోయేలా అరిచీ అరిచీ గీతను చెప్పినా అర్జునుడూ, కపిరాజు తప్ప ఇంకెవ్వరూ వినలేదు. ఎందుకని?

అదేసమయానికి ద్వారకనుంచి పాలెత్తుకొచ్చి కాఫీ కాయటం మొదలెట్టారు యాదవులు. గీత కావాలంటే ఘంటసాల కాసెట్టుకొని ఎన్నిసార్లయినా వినొచ్చులే అని అటెల్లి పోయారంతా. అర్జునుడు పాపం నీల్‌డౌన్ పొజిషన్‌లో ఉండేసరికే తప్పించుకోలేక పోయాడు. కపిరాజు మాత్రం ఝెండాకి అటుపక్క దాపెట్టేశాడు. అంతా విష్ణుమాయ.

ఎన్నితలలు కొట్టినా ఉపయోగం లేకపోతే అప్పుడు విభీషణుడు వచ్చి" రామా! మాయన్న పెద్దపిల్ట్రీ పొట్టలో పెట్టుకోనున్నాడు దాన్ని గురిచూసికొట్టు." అన్నాడట.