జీర్ణించుకోలేని నిజం

  ఓనెలక్రితం అమ్మతో కూడా రామేశ్వరం వెళ్ళాను. ఇంతకు ముందు రెండుసార్లు అక్కడికి వెళ్ళాను. తిరుచ్చిలో చదివేటప్పుడు సెమిస్టెర్ రిజల్ట్స్ వచ్చినప్పుడు ఓసారి క్లాస్‌మేట్స్‌ అందరంకలిసి మరోసారి ఫ్రెండ్‌తో కలిసివెళ్ళాను. రెండోసారి అక్కడున్నప్పుడే అమ్మఫోన్ చేసి పాపకి వచ్చిన సంబంధం గురించిచెప్పింది. అంతకుముందే కాశీనుంచి తీసుకొచ్చిన గంగాజలంతో రామనాథేశ్వరునికి అభిషేకం చేసొచ్చాను. అందువల్ల ఈయాత్ర బాగా సెంటిమెంట్ అయ్యింది.

దీవిలో ముఖ్యమైన ప్రాంతాలు బాగానే పరిచయం ఉండటంతో తిరిగేందుకు పెద్దగా ఇబ్బందనిపించలేదు. కొత్తగా వెళ్ళినవాళ్ళకి కూడా అక్కడేమీ ఇబ్బంది ఉండదనుకోండి. అక్కడికెళ్ళిన వాళ్ళు ఎవరైనా చేసేపని ముందు తీర్థాల్లో స్నానంచేసి దర్శనం చేసుకొచ్చి, బయట టిఫిన్ గట్రా పూర్తిచేశాక ఓఆటోవాడితో బేరం కుదుర్చుకుని దీవిలోని ముఖ్యమైన ప్రాంతాల్లో తిరగటం.

మొదటి రెండుసార్లు వెళ్ళింది స్టూడేంట్స్‌గా. దాంతో ప్రతిదీ బడ్జెట్టే. ఆటోవాడు మూడోందలు అంటే "అన్నా! స్టూడేంట్స్ అన్నా. కుంజేం కమ్మి పణ్ణీంగే అన్నా." ఇలా ప్రతిదీ బేరమాడటమే. చివరికి కొబ్బరిబొండాల్లో కూడా. కొబ్బరిబొండాలోడితో మావాడొకడైతే "అన్నా! కావాలంటే నీళ్ళు తక్కుంవుండే కాయిచ్చి డబ్బులు తక్కువ తీసుకో," అన్నాడు. భోజనాల హోటల్లో సంగతైతేసరేసరి. వాడు నిజంగా వీళ్ళు స్టూడేంట్సేనా? అని అనుమానించేదాకా వెళ్ళిపోయాడు. తిరుగుప్రయాణం మధురై వరకు పాసింజెర్లో. ఇది ప్లాన్ చేసింది మాత్రంనేనే! బస్సులో వెళ్ళేకన్నా ఇందులో అయితే కొంచెం ఎంజాయ్ చెయ్యొచ్చని. లెక్కలేశాక (తమిళ్నాడులో బస్సుచార్జీ ఎంత చవకైనా మరీ పాసింజరుకన్నా తక్కువుండదుగా) ఆర్థికవిషయాలు చూసుకునే బృందసభ్యుడు టెక్నోఎకనమికల్ క్లియరెన్స్ ఇచ్చేశాడు. మళ్ళీ రెండున్నరేళ్ళ తర్వాత ఉద్యోగంలో కుదురుకున్నాక, కొంత ఆర్థికస్థితి మెరుగయ్యాక, అమ్మతో రావడం ఏదోతెలీని తృప్తి, ఆనందం. కిందటి రెండుసార్లకంటే ఈసారే బాగాజరిగిందనిపిమ్చింది.

ఉదయాన్నే దర్శనం చేసేసుకున్నాక బయటికొచ్చి ఆటోవాడితో బేరంమాట్లాడా. ఉదయాన్నే రైల్వేస్టేషన్ నుంచి వచ్చింది ఈఆటోలోనే. అప్పుడే వాడు మమ్మల్ని రిజర్వ్ చేసుకున్నాడు. బేరం అంటే ఏదో అనుకునేరు. మనకంత సీన్లేదు. నాకు బేరంరాదు. అమ్మకి భాషరాదు. అదీ సంగతి. ఏఏ ప్రదేశాలో లిస్టు చెప్పా.

ఆదీవిలో చూడాల్సినవన్నీ ఒక్కోటీ ఒక్కోమూల ఉంటాయి. దక్షిణాన చివర్లో రామసేతువు. అక్కడేమీ కనిపిచదు. దానికి ముందు విభీషణుడికి పట్టాభిషేకం జరిగినప్రాంతం. ఉత్తరాన రామపాదం. పశ్చిమంగా పంచముఖ ఆంజనేయస్వామిగుడి, ఇంకొన్నిగుళ్ళు. ఇంకా చివరికి వస్తే పాంబన్ రైల్వేవంతెన. ఇది మాతృభూమికి రామేశ్వరద్వీపానికి పేగుబంధం. తూర్పునేముంది అనడగొద్దు. అటైపు సముద్రం (అగ్నితీర్థం). అన్నింటికీ మద్యలో రామనాథస్వామిగుడి.

ఓవైపు అన్నేళ్ళబాధనుంచి తనకుకలిగిన విముక్తికి జనకీమాత ప్రతిష్టించిన శివలింగం ఇక్కడి స్త్రీ ఆత్మగౌరవానికి, జాతివీరత్వానికి ప్రతీక ఐతే మరోవైపు ఒకమామూలుఇల్లు ఆధునికభారత సాంకేతిక దాశ్యసంకెళ్ళను తెంచి, గగనవీధుల్లో దేశపతాకను ఎగరేసిన చారిత్రకఘట్టాలకు సూచిక. రామేశ్వరం పేరువినడంతోనే గుర్తొచ్చేపదాలు సీతారాములు, వానరకోటి, రామనాథేశ్వరుడు, సేతువు, లంక, సైకతలింగం, రామాయణం, తీర్థాలు, రావణుడు, పాంబన్ .... కానీ వర్తమానకాలంలో ఆద్వీపంపేరు వినడంతోనే గుర్తొచ్చే ఒకేఒకపదం 'కలాం'.

ఈద్వీపపు ఇసుకతిన్నెల్లో బాల్యాన్నిగడిపి, శ్రీహరికోటదీవి ఇసుకతిన్నెల్లోంచి తన అగ్నిగవాక్షాలతో రాకెట్లెగరేసి, దేశానికే ప్రధమపౌరునిగా "కలాం మాప్రధమపౌరుడు" అని నూరుకోట్లగొంతులు సగర్వంగా చెప్పేలా జాతికి దిశానిర్దేశం చేసిన మహనీయుడు. వర్తమానంలో ఈయనకు సాటిరాగల స్పూర్తిప్రదాత ప్రపంచంలోనే ఎవరూలేరు.
ఆయన ఇల్లు గుడికి పశ్చిమంగా ఆలయప్రధానర్చకుడు పక్షిలక్ష్మణశాస్త్రిగారి ఇంటికి వెనుకరోడ్డులో వెళ్ళి కుడివైపున ఉన్న ఒకసందులోకి వెళ్ళాలి. ఇంతకుముందు వెళ్ళినప్పుడు "ఈసందులోనే కలాంఇల్లు" అని ఆటొవాడు చెప్పి లోపలికి తిప్పాక ఇంటిముందు ఆగిచూసేదాకా ఎంత‌ఆరాటపడ్దామో మాటల్లో చెప్పలేను.

అక్కడ నీలిరంగుఇల్లు, వాకిట్లో గ్రిల్స్, దానిపైన ఇనుపచువ్వలను అక్షరాలుగా మలిచి "HOUSE OF KALAM" అని రాసుంది. అలహాబాదులో భరద్వాజమహర్షి ఆశ్రమం ఎదురుగా ఓపెద్దభవనం ఉంది. దాని ఆవరణలోనే మరోభవనం. రెండూ ఇప్పుడు జాతికి అంకితం చేయబడ్దాయి. ఒకటి ఆనందభవన్, మరోటి స్వరాజ్యభవన్. కొన్నిదశాబ్దాలక్రితం ఈజాతి భవష్యత్తును దిశానిర్దేశంచేసే ఎన్నో మార్గదర్శకసూత్రాలను, సిద్ధాంతాలను రూపొందించిన యజ్జ్ఞవాటిక అది. అణువణువునా దేశభక్తిని ఇముడ్చుకున్న మహనీయుల పాదధూళితో పావనమైన దేవాలయం. వాటికి ఏమాత్రం తీసిపోని మరోభవనం నాకళ్ళముందు కనిపిమ్చింది. మాదగ్గర కెమెరాలేదు. సెల్‌తోనే ఆఇంటిముందు ఫోటోలు దిగాం. "మనలాంటి ఓటెక్నోక్రాట్ రాష్ట్రపతి అయ్యాడురా (ఇలాంటప్పుడు ఏదోరకంగా వరసకలిపెయ్యకపోతే మనసునిలవదు.) ఇప్పుడు కెమెరా లేకపోతేనేం భవిష్యత్తులో పెద్దకెమెరాతో వచ్చి ఫోటోలు తీద్దాం. దానికెక్కువ సమయంపటదులే" అనుకుని పక్కనే ఆయన బంధువుల షాపులో శంఖులు, ముత్యాలు వగైరా అమ్ముతారు. అక్కడికెళ్ళాం. అక్కడ మనకీ ఆయనకి బేరంకుదరక శంఖు కొనకుండానే వచ్చేశాననుకోండి. అదివేరే విషయం.

అమ్మతో కలిసి విభీషణుడి పట్టాభిషేకం చేసిన స్థలం చూసుకుని తిరిగొస్తుండగా ఆటోవాడితో "కలామ్ ఇంటికి తీసుకెళ్ళు." అన్నాను. అతనేదో తమిళంలో చెప్పాడు. సరిగా వినబళ్ళేదు. అమ్మకి వీలైనంత త్వరగా ఆఇల్లు చూపించి, దానిముందు ఫోటో తీసుకోవాలి అన్నది నాఆరాటం. సహజమే కదా. ఇప్పటికీ నాదగ్గర కెమెరాలేదు. ఫ్రెండ్ కెమెరా తీసుకొచ్చా. సరిగ్గా ఆసందుకు దగ్గరగా వచ్చాం. "అమ్మా! ఈసందులోనే." అని చెప్పా. అంతలో ఆటోవాడు దాన్ని దాటుకుని వెళ్తున్నాడు. "అన్నా! మున్నాడి కలాం వీడు." అని చెప్తునా వాడు నేరుగా వెళ్తున్నాడు. వాడివీపు తట్టి "కలాం వీడు. కలాం వీడు." అని చెప్పాక. "ఇందాకే చెప్పాకదా సార్?" అంటూ వెనక్కి తిప్పి ఇంటిముందుకి తీసుకొచ్చి ఆపాడు.
అప్పుడర్థమైంది అంతకుముదేమిచెప్పాడో. కలాం ఇల్లుకూల్చేశారు. ఆఇల్లు ఉండాల్సిన చోట పెద్దపెద్దతడికలు పెట్టున్నారు. దిగిచూస్తే పిల్లర్లకోసం పునాదులు తొవ్వేసున్నారు.


 ఎందుకో గుండెలోతుల్లోంచి బాధ తన్నుకొచ్చింది. లోపల్నుంచి తన్నుకొచ్చిన ఆవేశాన్నంతా అమ్మమీద చూపించా. "కనీసం పెళ్ళాంపిల్లలు కూడా లేరు. ఉన్న ఇంటినికూల్చి పాలెస్‌కట్టి ఎవడికిస్తాడంట." ఈదేశంలోని కోటలకి, భవనాలకి, చారిత్రక ప్రదేశాలకి ఏమాత్రం తీసిపోని ఒకఇల్లు. దేశం గర్వపడే విజయాలు సాధించిన ఒకదార్శనికుడు తనస్వార్జితంతో కట్టుకున్న ఇల్లు. ద్వీపాన్ని దర్శించే ప్రతియాత్రికుడు ఒకఫోటోతీసుకోవాలనిపించే ఒకచిన్న పర్యాటకప్రదేశం. ఈదేశప్రజలకి ఆమాటకొస్తే ప్రపంచంలోని ప్రతిమనిషికి స్పూర్తినిచ్చే చారిత్రక కట్టడం. ఇకకళ్ళముందు లేదన్న నిజం జీర్ణీంచుకోవడానికి నాలుగైదు నిముషాలు పట్టింది. ఇకపై ఆఇంటిని చూడాలంటే Indomitable Spirit(ఎవరికీ తలవంచకు)వంటి పుస్తకాల్లోనో, పత్రికల్లో వచ్చినఫోటోల్లోనో చూసుకోవాలి.
మిగతాప్రాంతాలు తిరగబుద్దికాలేదు. ఆసమయంలో కలామ్ నాముందున్నా "ఈఇంటిని కూల్చే హక్కునీకెవరిచ్చారు?" అని అడుగుంటానేమో. అదీ ఆయనమీద గౌరవంతో పుట్టుకొచ్చిన ఆవేశమే. ఇన్నేళ్ళలో ఈఒక్కవిషయంలో నాకూ ఆయనకీ మద్యన అభిప్రాయబేధాలొచ్చాయి. (ఎత్తుభారం. నేనొప్పుకుంటే ఎంత? లేకుంటే ఎంత?) ఇంటిని కూల్చేసినంత మాత్రాన ఆయనిచ్చిన స్పూర్తి తగ్గదు. కానీ మనసులోతెలీని లోటు. ఇన్నిరోజుల తర్వాత మీతో చెప్పుకోవాలనిపించి....

8 comments:

  1. హ హ హ మీ కోపం బాగుంది , కానీ వాళ్ళ అన్నయ్య వాళ్ళ అన్నయ్య కుటుంబం అదే ఇంట్లో ఉంటారనుకుంటాను , ఆ వైపు నుంచి ఆలోచించండి వాళ్లకు అన్ని సౌకర్యాలతో ఉన్న ఇంటిని ఇవ్వాలి అనుకోవటం అంత దుర్మార్గం కాదేమో :)
    నేను కలాం గారు ఆయన బాల్యం గురించి రాసినది చదివి
    రామేశ్వరం చూడటానికి వెళ్ళినప్పుడు చాల ఊహించుకున్నాను, చూసినాక నీరసం వచ్చింది ఊరి చుట్టూ ప్లాస్టిక్ కవర్ల గుట్టలమయం అంత అందమైన దీవి లాంటి ప్రదేశాన్ని ఆధునికత పేరుతో నాశనం పట్టించడం చూస్తె బాధేస్తుంది , కాని ఏమి చేయలేం కదా అక్కడ జనాలు కూడా బతకాలి గా .

    ReplyDelete
  2. మా పెళ్ళైన కొత్తల్లో నాన్నగారు ఒక పుట్టినరోజు గిఫ్ట్ గా నాకు "వింగ్స్ ఆఫ్ ఫైర్" పుస్తకం, దానితో పాటూ ఇంగ్లీషులో ఉన్న సంక్షిప్త ఆడియో కేసెట్ కొరియర్లో పంపారు.(ఆంగ్లంలో చదివింది గిరీష్ కర్నాడ్ అనుకుంటా) నాకు చాలా ఇష్టమైన పుస్తకాల్లో ఒకటి. శ్రావ్యగారు చెప్పిన పాయింట్ ఆలోచించాల్సినదే.
    ఇక్కడ అప్రస్తుతమైనా కాకినాడలో మా ఇల్లు అమ్మేసిన తరువాత ఎందుకో ఆ ఊరు వెళ్ళినప్పుడు కూల్చేసిన ఆ ఇంటి శిధిలాలు చూసినప్పుడు నాకు ఇలాంటి బాధే కలిగింది. కానీ అమ్మేసాకా ఇంక మా అధికారమేమిటి? అనుకున్నా..!

    ReplyDelete
  3. @ శ్రావ్య: వాళ్ల అన్నయ్యకి కావాలంటే వేరేచోట కట్టించుండాల్సింది.అక్కడ కొత్తగా స్థలం కొనడం పెద్దసమస్య కాదనుకుంటా. కూల్చాక ఆస్థలాన్నిచూశా. దాదాపు ఎనభై అంకణాలుంటుంది. మొత్తం కట్టుబడే.
    దాదాపు రామేశ్వరం వెళ్ళిన ప్రతిఒక్కరూ ఆఇంటిముందు ఫొటో తీయించుకునేంత ప్రాచుర్యం పొందిందన్న సంగతి వాళ్ళందరికీ తెలుసు. ఆయన బంధువులైనా ఆవిషయాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్న్యాలు ఆలోచించుంటే బావుడేదేమో. (ఆలోచించారేమో?)
    మీరు చూసినప్పటితో పోలిస్తే ఇప్పటి రామేశ్వరం చాలామారింది. చాలాబావుంది. కాలుష్యం తగ్గింది.
    @ తృష్ణక్క: ముందే చెప్పాకదక్కా. ఆఇల్లు ఏదో అమ్మకానికి కొనుగోలుకి ఉపయోగపడే స్తిరాస్థికాదు.

    ReplyDelete
  4. "కనీసం పెళ్ళాంపిల్లలు కూడా లేరు. ఉన్న ఇంటినికూల్చి పాలెస్‌కట్టి ఎవడికిస్తాడంట" objectanabl comnt.

    ReplyDelete
  5. @ అజ్ఞాత: నాకూ అబ్జెక్షనబుల్ వాక్యమే. కానీ ఆక్షణంలో నేనన్న మాటని దాచిపెట్టదలుచుకోలేదు. ఆవేశంలో అనేశాక నాకూ ఇబ్బందనిపించింది.

    ReplyDelete
  6. రామేశ్వరాన్ని కళ్ళకి కట్టారండీ.. ఇంటి విషయంలో మీ ఆవేదనలో నూటికి నూరుపాళ్ళూ అర్ధవంతమైనదే.. అది కేవలం ఒక మామూలు కట్టడం మాత్రమే కాదు, ఆయన మరో ప్రత్యామ్నాయం చూపించలేని స్థితిలోనూ లేరు..

    ReplyDelete
  7. Good one as usual...!!Siva Kumar.K

    ReplyDelete