సింగ్రౌలి సినుకులు

ఈరోజు మద్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చాను. ఎందుకో కూడలి చూడాలి అనిపిస్తే తెరిచాను. నెమలికన్ను మేఘం కోసం ఎదురు చూస్తోంది. ఎప్పుడు మెరుపు మెరుస్తుందా బ్లాగులో పురివిప్పి ఎప్పుడు నాట్యం చేద్దామా అన్న ఉత్సాహం చూసి మనసు ఉండబట్టలేక ఒక వ్యాఖ్యానం రాసి ఆఫీస్కి వెళ్ళాను.

ఆయనకి ఐతే ఏదో సర్ది చెప్పాను గాని ఇక్కడ స్వర్ణముఖి పరిస్థితి అంతే. నేను ఉండే ప్రాంతం ఎండాకాలానికి బాగా ప్రసిద్ధి. ఎంత అంటే ఎండల మీద ఇక్కడ వాళ్ళకి పేటెంట్లు గట్రా ఏమన్నా ఉందా అనిపిస్తుంది. ఒక పక్క బోడిగుండు వేసుకుని కొండలు, మరోపక్క బొగ్గుగనులు. ఇక నేను ఎక్కువ వర్ణించలేను మా ఊరిని.( అంటే నా సొంత ఊరు అనుకొనేరు. అది స్వర్గం. నేను చెప్పేది ఇప్పు పనిచేస్తున్న ఊరి గురించి.) ఇక్కడ ఏడాదికి 3 కాలాలు. మొదటిది ఎండాకాలం, రెండోది గ్రీష్మఋతువు, మరి మూడోది వేసవికాలం.

ఈ ఎండలతో మామూలుమనషులకైతే పెద్దగా ఇబ్బంది లేదు కానీ నాకో సమస్య వచ్చి పడింది. అసలే మన బుర్ర పాదరసం.(..!!!???) అదే అసలు సమస్య. ఈ రసం బయట వేడికి వ్యాకొచించి( ఇంటర్ ఫిజిక్సు చదివే ఉంటారు. ద్రవాలవ్యాకొచమ్ గురించి కొంచం అవగాహన ఉంది కదా? నాకైతే బాగా ఉంది. మా ఫిజిక్స్ సారు ఉష్ణం( Heat) పాఠాన్ని 5నెలలు చెప్పాడుమరి. ఆయన బాగా చెప్తాడు అనుకొన్నామ్ మొదట. శ్రీలక్ష్మి ఆబ్బజబ్బదబ్బ లాగా ఆయనికి అదొక్కటే వచ్చు అని తెలిసెసరికి కొంచం టైమ్పట్టిందిమాకు. ఆయన ఇప్పటికీ అదే చెప్తూ ఉంటాడు.( ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూవస్ వాక్యం) .కాదు.. కాదు... ఆయన ఎప్పటికీ అదే చెప్తాడు( ప్రెసెంట్ సింపల్ అంటే నిత్యసత్యం.) ఆ పాఠంచెప్పీచెప్పీ ఆయన నల్లగా మారిపోయాడేమో అనుకోని మీరు కాలేజీరోజుల్లో ఫోటో ఏదైనా ఉంటే చూపిస్తారా అని అడిగాం. ఎందుకు అంటే మీరు ఈవయసులొనె ఇలా ఉన్నారంటే?.. అన్నాం. ఒక నవ్వు నవ్వాడు కానీ ఫోటో చూపెట్టలేదు.)

దీనివల్ల అసలే అంతంత మాత్రం ఐన జ్ఞాపకశక్తిని ఈ శక్తినగర్ ఎండలు ఎక్కడ హరిస్తాయో ఆలోచిస్తూ కూర్చున్నాను. ఇంతలో ఏదో మార్పు. తెలీని సుఖం. ముక్కుకు ఒకరకమైన వాసన. దీన్ని అనుభవించి చాలా రోజులైంది. అదేంటి అని చుట్టూచూస్తే.... హాయ్ మబ్బులు. వర్షం కోసం జనాలు వరుణయాగాలు, కప్పల పెళ్ళిళ్ళు, ఈ మద్య అలహాబాదులో రకరకాల పూజలు చేశారట పిల్లలు, ఆడవాళ్ళు. వార్తల్లో, పేపర్లో చూశాను. వాళ్ళంతా అంత అవస్తలు పడుతుంటే ఒక టపా చదివాను, దానికి కామెంట్ రాశాను, ఆఫీసులో కూర్చిని ఒక 30 నిముషాలు ఆలోచించాను అంతే ఇంతలో వచ్చేసింది. అప్పుడప్పుడు అనుకుంటా ఒరేయ్ చైతుగా నువ్వు మామూలోడివి కాదురా కారణ జన్ముడివి అని. అదే మళ్లీ నిజం అయింది. మీరు ఎవరికీ చెప్పొద్దు ఇది దైవరహస్యాలు. ఇలాంటివి చెబితే జనాలు నన్ను కాదు ముందు మిమ్మల్ని తరుముకుంటారు.

అప్పటికీ సమయం 3:30. ఈరోజు ప్రహ్లాదుడు (పేరు విని పదేళ్ళ బాలాకూమారుడు అనుకొనేరు. వశిష్టుడు అంత వయసు ఆయనది.) పదవీ విరమణ మహోత్సవం. చాలా ఏళ్ల క్రితం మాతాతకి తరువాత హైస్కూల్లో మా అయ్యవార్లకి, పదవీ విరమణ మహోత్సవం జరిగితే వెళ్ళాను. తరువాత ఇదే. నేను ఈ ఆఫీసులో చేరింది ఈమద్యే ఐనా ఆయన అంటే కొద్దికాలంలోనే గౌరవం ఏర్పడింది. అది వయసు వల్లనో? లేక ఆయన పనితీరువల్లనో చెప్పలేను. ఆయన సుమారు 30 ఏళ్లుగా అంటే సుమారు మా ప్లాంట్ పునాదిరాయి వేసినప్పటినుంచి ఉన్నాడు ఇక్కడ. ఈ గాలి పీల్చి( అందులో మా గొట్టం వదిలే పొగ కలిసిపోయి), ఇక్కడవాళ్ళతో కలిసి బతికి, ఇక్కడ జరిగే ప్రతి వేడుకలో పాలుపంచుకొంటూ ఉన్నవాడు ఉన్నపళమ్గా ఈ టౌన్‌షిప్ నుంచి బయటకు వెళ్ళాలంటే నాకె ఎందుకో మనసు ఒకరకంగా అనిపించింది. ఐతే ఆయన పిల్లలు కొంత స్థిరపడ్డారు అని తెలిసి కొంచం స్థిమితపడ్డాను.

అందరూ ఆయనతో గల అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. దాదాపు ప్రతి ఒక్కరూ ఇక్కడ చేరేటప్పుడు ఆయన సహాయం తీసుకొన్నవారట. అందరూ వచ్చే డబ్బుని ఎలా దాచుకోవాలో సలహాలు ఇచ్చారు.( ఆయనకు ఇలాంటి విషయాలపై పెద్దగా అవగాహన లేదని అందరి అభిప్రాయం. ఇప్పటి దాకా మావాళ్లే సలహాలు ఇచ్చేవాళ్ళట.) చివర్లో ఆయనకి ఇచ్చిన ఒక ప్రశంసాపత్రాన్ని, పతకాన్ని తడిమి చూసుకున్నాడు. ఆయనను మాట్లాడమన్నారు. ఇలాంటివి అలవాటు లేకపోవటంతో కొంచం ఇబ్బందిపడ్డాడు. కొంచం బొంగురుపోయిన గొంతుతో ఆయన మాట్లాడిన దాంట్లో ఒక సంతృప్తి కనిపించింది నాకు. లక్షలు సంపాదిస్తున్నా రాత్రికి రాత్రి కంపెనీ మారిపోయే మన తరానికి( క్షమించాలి) ఆయన మాటలు ఒక కనువిప్పు. నిజానికి ఆయన సంపాదించింది అంతాపెద్దమొత్తం కాదు. ఒక సగటు మద్యతరగతి జీవితం ఆయనది. అందరం మా భవిష్యత్తుగురించి మాట్లాడుకుంటూ బయటకు వచ్చాం.


అబ్బా అసలు విషయం మార్చిపోయా...ఇందాక కనిపించిన మబ్బులు కరిగాయి. సమయం చూస్తే 5:00. ఇంకా అరగంట ఉండాలి. మొదటిసారి కురుస్తున్న చినుకులు ఎంతసేపు ఉంటాయో తెలియదు. ఆగిపోతే? అమ్మో... అమంగళం ప్రతిహతమ్ అవుగాక! అని చెప్పి గట్టిగా చెవులూ కళ్ళూ మూసుకున్నాను. ముక్కుకూడా మూస్కుంటే మేఘాలపైకి వెళ్ళిపోతానని ఆ ప్రయత్నం విరమించా. ఇక్కడినుంచి నేరుగా శక్తినగర్ రైల్వేస్టేషన్కి వెళ్తే ఏ త్రిష తెలుగులోనో లేక శ్రియా తమిళంలోనో ( మనం ఆమధ్య ఆదేశంలో కొంతకాలం వెలగపెట్టాం కాబట్టి ఆపాట కొద్దోగొప్పో అర్ధం అవుతుంది. అయినా పాట ఎవరికికావలి?) నువ్వొస్తానంటే నేనొద్దంటానా అంటూ ఎదురైతే? మనకు అంత అదృష్టం కూడానా? గుట్టుగా ఇంటికి పోరా పుడింగి అనుకొనిబయల్దేరా.


రూంకి వచ్చేదాకా వాన పడుతూనే ఉంది. వావ్...! నేను కారణాజన్ముడిని అని మళ్లీ నీరూపించబడ్డాను( పాస్సివ్ వాయిస్). మరో రొమ్యాంటిక్ సమయం తోడులేక ఒంటరిగా గడిపేస్తున్నందుకు నిరాశ అలుముకుంది. ఇంతలో నాలోని ఆశావాది నిద్రలేచాడు(అంటే వాడు ఆఫీస్సమయంలో నిద్రలేవడు.) సంగీతప్రియుడికి ఒంటరితనం లేదురా ఢింబకా...! అని వీపుమీద చరిచాడు. కొంచం నోప్పేసినా మంచిసలహా ఇచ్చాడు అని ఊరుకున్నా. లాప్‌టాప్ ఆన్చేసి ఎప్పుడో చంద్రబాబు ముఖ్యమంత్రికాక ముందు, వైయస్ వచ్చిన తరువాత సినిమావాళ్లు తీసిన కొన్ని వానపాటలు తీశారు. సీజను రాలేదని ఒకమూల ఉన్నాయి. ఆ పాటలపట్టీని మొదలుపెట్టాను.

ర్యాండమ్ సెట్టింగులు పెట్టడంతో మొదటి పాట ఏది వస్తుందోనని కొంచం ఆతృత, కొంత భయం. మరి సీజను ఓపెనింగ్ కదా. ఊప్స్..."చినుకు చినుకు అందెలతో చిటపటచిరు సవ్వడితో..."చీ నీయబ్బా అనితిట్టుకొని ఈసారి అలా కాదు అని నేనే ఒక పాటపెడదాం అని "చిటపటచినుకులు పడుతూ ఉంటే" అని ఉంటే నొక్కాను. కొంచంసేపు నిశ్శబ్ధం, ఉత్కంఠ. మళ్లీ అమంగళం. ఇది రీమిక్స్ బాపతు. అసలు దీన్ని డౌన్‌లోడ్ చెయ్యటమే తప్పు దాన్ని మళ్లీ ఈ పట్టీలో కలిపినందుకు నన్ను నేనే ఎవరినీతిట్టనంత బూతులు తిట్టుకుని శాశ్వతంగా చెరిపేసా. తరువాద్ది ఏదైనాసరే అని కళ్ళు మూస్కోని నొక్కెశా. ఎక్కడ నుంచి వచ్చిందో తెలీదు " పాడు జీవితము యవ్వనం మూడునాళ్ల ముచ్చటలోయి..." ఈ సారి మాట్లాడేందుకు ఏమీలేదు. గుట్టుగా కుర్చీలో కూలబడ్డాను.

అసలు ఇంతటి వైపరీత్యాలు ఎందుకు జరుగుతున్నాయో అర్ఢంకాక ఆలోచిస్తుంటే ధమాల్..ధమాల్ అని శబ్దం. అదేదో సినిమాలోలా ముందు మెరుపు వస్తుంది...తరువాత పిడుగు పడుతుంది. వర్షాలే అలవాటుతప్పింది ఇక ఇవేం గుర్తు ఉంటాయి. ఒకటి అంటే సరే. సగటున నిముషానికీ 2. అలా ఒక పావుగంట. ఆఫీసునుంచి నిద్రలో సరాసరి ఏ కార్గిలో, ఆఫ్ఘనిస్తానో చేరలేదుకదా అని చుట్టూ చూసుకున్నా. హమ్మయ్య నారూమే.

అప్పుడు లీలగా ఒక సంఘటన గుర్తొచ్చింది. మీరు కూడా నాతొ కూడా టార్టఇస్ చుట్ట ఉంటే అది లేదంటే మీ కారు స్టేప్నీని తిప్పుకోండి. ఇక్కడకు వచ్చిన కొత్తల్లో చెన్నైలో ప్రతివీధికి వినాయకుడిగుడిలాగా ఇక్కడ ప్రతి చోటా ఒక పొడవాటి టవర్ దానిపైన పిడుగుపట్టుపరికరం. ఎందుకో సందేహం వేసి మాసార్ని అడిగాను. ఆయన అదోలా నవ్వాడు. ఆనవ్వు వైయస్ నవ్వా? చంద్రబాబునవ్వా? అన్నది మొదలుపెడితే ఆమద్య సద్దుమణిగిన గొడవ మళ్లీమొదటికీ వస్తుంది. అంతపనివద్దులె అని గమ్ముగా ఉన్నాను. ఇప్పుడు దీనిని చూస్తే " ఆ రోజుం మా సారు చిరునవ్వు చూసి అనుకున్నా ఏదో నవ్వనీ ఈరోజే నాకు తేలింది ఆ నవ్వు దాగుంది మెరుపని ఎదఝల్లున అదిరింది పిడుగని" అని పాడుకొన్నాను. అలా ఒక 15 నిముషాలు దేవతలు రాక్షసులతో జరిగిన టీ20 మాచ్లో సూపర్ఓవరు చివరి బంతికి సిక్స్ కొట్టిగెలిచినట్లు వరుణుడు ఒక టెన్థౌసండ్ వాలా పేల్చివెళ్ళి పోయాడు.

ఒక 5 నిముషాలు నిశ్శబ్ధం. తలుపు తెరిచి చూస్తే వావ్. అది ఇక్కడ నేను రాయలేను. తమాషా ఏమిటంటే దేన్ని చూసి నెన్ను ఈ టపారాద్దాం అనుకొన్నానో అదే రాయలేక పోతున్నాను. కొండల్‌పైనుంచి సన్నగా ధారలు. పైన కిరీటం పెట్టుకొన్నట్లు మేఘాలు. ఇంతలో వచ్చేశారు పిల్లలు వీధుల్లోకి. ఇక నేను చెప్పనక్ఖరలేదు అనుకొంటా.

మనమా చాణక్యుడికి నివాళులు అర్పించేది?మౌనమే నీ బాస ఓ మూగ మనసా..... ఎవరు సంస్కరణలు చెప్పినా, ఎంత పొగిడినా, ఎంత తిట్టుకొన్నా చలించని తత్వం ఆయన సొంతం. భాషపై పట్టు ఉన్నా దానికి ప్రాంతీయాభిమానాల కుళ్ళు, భాషాద్వేషాల కంపు అంటుకోని మహోన్నత వ్యక్తిత్వం. నాలుకతో సరస్వతీదేవి 17 అవతారలను ఉపాశించిన ఘనాపాటీ ఐనా ప్రగల్భాలకు ఆమడ దూరం. ఏ శాఖను చేపట్టినా అందులో తనదైన ముద్రను వేసి మనసుల్ని గెలుచుకోగల సమర్ధత. పార్టీకిగాని, ప్రభుత్వానికిగాని తానెప్పుడూ విధేయుడనే అని పలికే నమ్రత...ఇలా రాసుకుంటే పోతే ఆయన గురించి రాసేందుకు నా మిడిమిడి జ్ఞానం సరిపోదేమొ. పాములపర్తి వెంకట నరసింహారావు... ఒక కవి, ఒక రచయిత, ఒక ధీశాలి, ఒక నాయకుడు, ఒక కార్యదక్షుడు. ఆయన పదవుల కోసం ఎప్పుడూ వెంపర్లాడలేదు అని నేను చెప్పను. ఎందుకంటే ఎవరైనా ఒక రంగంలో తన సామర్ధ్యాన్ని నిరూపించుకుంటే సహజంగానే అందులో ఉన్నత స్థానానికి వెళ్ళాలి అనుకుంటారు. అందుకు పీవీ మినహాయింపు కాదు. ఐతే అందుకోసం ఏ స్థాయికైన దిగజారే వారితో పోలిస్తే ఆయన గొప్పతనం కనిపిస్తుంది. రాష్ట్రంలోగాని, కేంద్రంలోగాని, పార్టీలో గానీ ఆయన పొందిన పదవులు ముళ్ళకిరీటాలే గాని పూలపాన్పులు కాదు. ముఖ్యమంత్రి అయ్యేనాటికి వేర్పాటువాద ఉద్యమాలు, విదేశాంగమంత్రి హోదాలో అలీన విధాన బాధ్యతలు, ప్రధానిగా స్వర్ణభారత స్వతంత్రచరిత్రలో మేలిమలుపుగా చెప్పబడే ఆర్ధిక సంస్కరణలు, భద్రతా సమితిలో శాశ్వత సభ్యత్వం కోసం దౌత్యపరమైన విజయాలు, సిటీబిటీ బిల్లుకి వ్యతిరేకంగా అలీనరాజ్యాలను సంఘటిత పరచటం, ఇక పార్టీలో ఆయన ఉన్నత స్థాయి చేరేసరికే కాంగ్రెస్ పై ప్రజలలో సన్నగిల్లుతున్న గౌరవం. దేశమంతటా అధికారమే పరమావధిగా పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన ప్రాంతీయ పార్టీలు. జాతీయ పార్టీగా దేశసమాఖ్య వ్యవస్థను రక్షించాల్సిన పరిస్థితి. అంతవరకు పార్లమెంటరీ వ్యవస్థ రుచిచూడనిసంకీర్ణ రాజకీయాలు, బేరాలు, పొత్తులు, బెదిరింపులు. దేశ ప్రజాస్వామ్య వ్యవస్థనే అపహాస్యం చేసే పరిస్థితి. ఆర్ధికంగా ప్రపంచదేశాల మద్య తరచూ వెకీలింపులూ, వ్యంగ్యపు వ్యాఖ్యానాలు. ఇన్ని సమస్యల్లో మతతత్వపు పార్టీలు( అది బీజేపీ ఐనా మరే మైనార్టీ మతపు వాళ్ళదైనా) బలపడి లౌకిక వాదాన్ని ప్రశ్నిస్తున్నాయి. ఆయన తరువాత ఎందరో సంకీర్ణాలతో ప్రధానులయ్యారు. కానీ అందరూ ఎవరో ఒకరి చేతిలో కీలుబొమ్మలే. స్థిరమైన నిర్ణయాలతో తానుకోరుకున్న అభివృధ్ధికి పునాదులు వేయటంలో సఫలం అయ్యారా? ఇవన్నీ ఆయనలోని ఒక పార్శ్వమ్. ఈయనలోని లోపలి మనిషి అసలు మనీషి ఎవరు? ఒక కవి. ఏ భాషలోనైనా ఆశువుగా స్పందించే సున్నిత హృదయం. మొదటి సారి ఈయన గురించి తిరుపతి వచ్చినపుడు విన్నాను. టీవీలో చూశాను. ప్రదానిగాఒక తెలుగువాడు మాట్లాడుతుంటే అందరికీ ఒకరకమైన ఉద్వేగం. అది నన్ను కూడా తాకింది. తిరుపతిలో దూరదర్శన్ కేంద్రం(ఇప్పుడు సప్తగిరి) ప్రారంభోత్సవానికి వచ్చారు. నిజంగా ఆయన మాట్లాడుతుంటే ఒక రాజకీయ నాయకుడిగా అనిపించలేదు. ఆ ఉపన్యాసం ఎంతో సందర్భోచితంగా, సూటిగా, అనవసరమైన ఆర్భాటాలు లేకుండా సాగింది. చిన్నప్పటి రేడియోగురిచి ఎంతో చమత్కారంగా మాట్లాడుతూనే గతకొన్ని దశాబ్దాలుగా ప్రపంచంలో సమాచార విప్లవం గురించి భవిష్యత్తులో దేశం చేదించాల్సిన లక్షాలను, అందులో మన పాత్రను అద్భుతంగా ఆవిష్కరించారు. తరువాత ఆయనకు 17 భాషలు తెలుసు అంటే నొరెల్లబెట్టాను. విశ్వనాథ వారి వెయ్యిపడగలులాంటి తెలుగు సాహిత్యాలని, రచనల్ని అనేక భాషల్లోకి తర్జుమా చేసి తెలుగుపదంలోని గంభీర్యాన్ని, ఉన్నతవిలువల్ని, మకరందాన్ని రుచిచూపాడు. ఇంతాచేస్తే ఆయనకు మిగిలింది ఏమిటి? ఏ సమయంలో నైనా ఆయన ప్రతిభకు తగ్గ పురస్కారం లభించిందా? పైగా అనవసరపు వివాదాలు. కుళ్ళు రాజకీయాలకు,స్వార్థాప్రయోజనాలకు బలి అయ్యారు.ఏ పార్టీ కోసం, అధిష్టానం కోసం ఆన్నెళ్ళు కష్ట పడ్డాడో అదే పార్టీ ఆయనకు అన్యాయం చేసింది. 1996 తరువాత ఆయనకి ఎలాంటి ప్రాధాన్యతా ఇవ్వకుండా తిరిగి కుటుంబ పాలనలో ముంచేశారు కొంగ్రెస్స్‌ని. దాదాపు 13 ఏళ్లుగా ఒక్కసారీ సరైన మెజారిటీ లేకుండా, ఉత్తరప్రదేశ్, బీహార్ లాంటి రాష్ట్రాల్లో అస్తిత్వాన్ని కోల్పోయే స్థితికి తీసుకొచ్చారు. ఒకానొక సమయంలో అధికారంకోసం వర్తమాన రాజకీయాలలో దిగజారుతున్న విలువలపై ఆయనలో కమ్ముకున్న నైరాశ్యమ్ ఆయన రాసిన లోపలి మనిషి( ద ఇన్సైడర్) లోని ఒక వ్యాఖ్యలో కనిపిస్తుంది." అధికారం వేశ్యల స్థనాల వలె విటుల చేతిలో నలిగి పోతుంది." ఈ ఒక్కమాట చాలు ఆయన వ్యధను వర్ణించేందుకు. ఎమర్జెన్సీకాలం కాంగ్రెస్ చరిత్రలో ఒక మచ్చ. అలాంటి సమయంలో కూడా ఈయన మీద ఎలాంటి ఆరోపాణలు రాలేదు. ఇది ఒక్కటి చాలు ఆయన వ్యక్తిత్వం గురిచి చెప్పడానికి.జగదీష్ టైట్లర్ లాంటి వాళ్ళకు రక్షణగా నిలబడిన వాళ్ళు ఈయనకు ఎందుకు మద్దతునివ్వ లేదు. అంటే నా ఉద్దేశ్యం ఆయన తప్పు చేసినా సమర్ధించాలని కాదు. ఆయన ప్రమేయం లేదు అని న్యాయస్థానంచెప్పిన తరువాత కూడా ఆయనకి గౌరవం లభించలేదు. న్యాయస్థానంలో తీర్పు కాంగ్రెస్ వల్ల జరిగింది అంటే నమ్మను. ఆయన మరణించిన తరువాత గూడా ఆయనను గౌరవించని వాళ్ళు అప్పుడు ఆయనకి ఏదో సహాయం చేసి ఉంటారు అని ఎలా అనుకోగలం? ఇలాంటి మేధావి ఇక్కడ కాకుండా ఏ తమిళదేశంలోనో, మహారాష్ట్రాలోనో, బెంగాల్‌లోనో, యూపీలొనో పుట్టి ఉంటే ఇలా జరిగి ఉండేదా? నేను 8వ తరగతి చదివేటప్పుడు ఆయన మీద ఒక పాఠం ఉండేది. దానిని తరువాత సిలబస్ నుంచి తీసేసారు. మళ్లీ పెట్టలేదు. అదే బీహార్, యూపీలో ఇంకా ఉంది, అంతే కాదు ఆయన రచనలపై యూనివర్సిటీలలో చర్చలు జరుగుతున్నాయి.( నేను BHUలోచూశాను.) మనకి కనీసం ఆ మాత్రం గుర్తులేడా ఆయన. నిన్నటి నుంచి చూస్తున్నాను కూడలిలో ఎవరైనాఆయన మీద వ్యాసం రాస్తారేమోనని.అసలు మనకు ఆయనకు నివాళి అర్పించే హక్కు ఉందా?

ఈనాడు.. గతం! వర్తమానం..! భవిష్యత్తు...???

మనం ఎన్నో పత్రికల్ని, తెలుగు వెబ్ సైట్లను, ఇంకా ఎన్నో తెలుగు వ్యాసాలను, కార్యక్రమాలను వివిధ మాధ్యమాల ద్వారా చూస్తున్నాం, చదువుతున్నాం. ఇందులో ఈనాడు పత్రిక అన్నా ఈటీవీ అన్నా ఒక ప్రత్యేక పాత్ర. అందులో ముఖ్యమైంది వారి భాష. ఈరోజు మనం బ్లాగులో వాడే అనేక పదప్రయోగాల్ని ఎంతోముందు మొదలు పెట్టి విజయవంతం అయింది ఈనాడు. ఇప్పటికీ ఎన్నో పత్రికలు, టీవీలు వారి కార్యక్రమాల్లో వాడే భాషను ఈనాడు నుంచి అప్పుడప్పుడు అరువుకు తెచ్చుకుంటారు అన్నది బహిరంగ రహస్యం. వార్తల హెడ్డింగ్లో వారు ఇచ్చే పంచ్లైన్ దెబ్బ తరచూ ప్రభుత్వానికి తగిలేది. పోకిరిలో షిండే చెప్పే " లారీ ఢీ..ముగ్గురు ఢా..!" తరహా హెడ్డింగ్ లను ప్రవేశ పెట్టింది ఇదే. అప్పటి వరకు సంప్రదాయ తరాహాలో సాగుతున్న తెలుగు జర్నలిజాన్ని కొత్త పుంతలు తొక్కించింది ఈనాడు. ఈనాడుకు మరో ప్రత్యేక ఆకర్షణ శ్రీధర్ కార్టూన్లు. నా చిన్నప్పుడు మా అమ్మ రోజు పేపర్ చదవటం మంచి అలవాటు అని చెప్పడంతో మొదలు పెట్టాను. మొదట్లో స్పోర్ట్స్ పేజీతో మొదలుపెట్టే వాడిని. ముందు రోజు చూసిన మాచ్‌ని మళ్లీ చదివే వాడిని. దానిలో విశ్లేషణను నేను చూసిన మ్యాచ్తో పోల్చుకొనే వాడిని. మనకు నచ్చిన షాట్ లేదా ఇన్సిడెంట్ గురించి అందులో ప్రస్తావిస్తే చాలా ఉత్సాహంగా ఉండేది. పేపర్ ముందు పేజీలోని ముఖ్యమైన వార్తలని చదువు, తరువాతే మిగతావీ అని మా నాన్న చెప్పాడు. అక్కడ శ్రీధర్ కార్టూన్లు, శీర్షికలు ఎంతో బాగా నచ్చేవి. అలా రోజు ఉదయం 30 నిముషాలు పేపర్ చదవటం అలవాటైంది. నాకు తెలుగులో మాట్లాడటం, విశ్లేషించటం ఈనాడు వల్ల, ఆంగ్లంలో ఆ పని క్రికెట్ కామెంటరీ వల్ల అలవాటు అయ్యాయి. ఆదివారం ప్రత్యేక అనుబంధంలో కవరు పేజీ కధనాలు ఎంతో బావుంటాయి. ఎన్నో విషయాలపై నాకు అవగాహన వాటివల్లే వచ్చింది.ఆదివారం ప్రత్యేక అనుబంధం,జిల్లా అనుబంధాలు, వసుంధర లాంటివి మొదలు పెట్టింది ఈనాడేనట. అప్పట్లో దాన్ని ఒక ఖరీదైన పొరబాటుగా భావించారు విమర్శకులు. కానీ ఈ ప్రయోగం వాణిజ్యపరంగా ఎంతో పెద్ద విజయం. ఈ టీవీ ప్రారంభించిన తరువాత వ్యాఖ్యాతలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి వాళ్ళ సామర్ధ్యాన్ని ఇనుమడింప చేశారు. ప్రగతి, కల్యాణి లాంటి వాళ్ళు తరువాత వేరే ఛానెళ్లకు మారినా వాళ్ళ ఉచ్చారణలో ఖచ్చితంగా ఈనాడు గొంతు వినిపిస్తుంది. ప్రతిభగలిగిన తెలుగు వారికి ఉదా:- పీవీ,వేణుగోపాల రావు, లక్ష్మణ్, హంపి, హరికృష్ణ, గోపీచంద్,రాయుడు, అజహర్ వంటి వాళ్ళకి నైతిక మద్దతు ఇచ్చింది. అలాంటి ఈనాడు ఈమధ్య మసక బారుతోంది. పోటీ ప్రపంచంలో పత్రికా రంగానికి ఎలాంటి మినహాయింపు లేదు. ఇటీవలి కాలంలో కొత్తగా వచ్చిన పత్రికలు, ఛానళ్లు దీని స్తానాన్ని ఆక్రమిస్తున్నాయి. పోటీ అనేది ఈనాడుకు కొత్త కాదు. ఆది పుట్టిన సమయంలోనే ఉదయం, ఆంధ్రజ్యోతి, ఆంధ్రభూమి వంటి పత్రికలు ఉండేవి. వాటికి ధీటుగా నిలిచిన గతం దాని సొంతం. మధ్యలో వచ్చిన వార్తతో కూడా పోరాడింది. కానీ ఇప్పుడు దానికి ఉన్న ప్రధాన సమస్యల్లో ఒకటి నాయకత్వంలో కొత్త రక్తం. రామోజీ రావు ఇన్నేళ్ల పోరాటంలో ఇప్పుడు అలసట, వయోభారం కనిపిస్తున్నాయి. ఇంతకాలం ఆయన సంపాదించుకున్న స్నేహితుల కన్నా రాజకీయ పక్షపాతంతో ఏర్పరచుకున్న శత్రువులే ఎక్కువ. పైగా ఇప్పుడు వాళ్ళే బలవంతులు. అధికారంలో ఉన్నవారు. వారితో ఒంటరి పోరాటం చేయాల్సిన పరిష్ఠితి ఆయనది. ఇది ఈనాడు చేసుకున్న స్వయం కృతాపరాధమే. కొన్నిసార్లు అనవసరంగా వాళ్లపై అభాండాలు వేసి ఉన్నవీ లేనివీ కల్పించి రాశారు. మరొక పార్టీకి, దాని అధినేతకు అతిశయోక్తులతో పొగిడి, ప్రజలకు ఈనాడుపై విశ్వాసం సన్నగిల్లే లా చేసుకున్నారు. తన కలంలోని పదునును దుర్వినియోగం చేసుకున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయ చిత్రపటం మారింది. పదవిలో ఉన్నవారు ఈనాడుకు వ్యతిరేకంగా వచ్చే ఏ చిన్న అవకాశాన్ని వదులుకొనే ఆలోచనలో లేరు. ఈ స్థితి బహుశా ఆయన ఊహించి ఉండకపోవచ్చు. లేకుంటే గతంలో వారిపై ఆ స్థాయిలో దాడి చేసేవారు కాదేమో. ఇప్పుడు ఆయనకు తోడు నిలిచి పోరాడాగల్గిన వారసులు లేరు.ఉన్నా వారు అజాగళస్థన్యము వంటి వాళ్లే. అందువల్లే ఇటీవలి ఎన్నికల తరువాత దాని పంధాలో మార్పు అనిపిస్తోంది. రాజీ మార్గమే మేలు అన్న భావన వాళ్ళు రాసే వార్తలు, వాటి శీర్షికలలో అనిపిస్తోంది. ఐతే ఈనాడుకు తెలుగుపై, తెలుగు వారిపై ఉన్న అభిమానం నిస్సందేహంగా మెచ్చుకోదగినదే. ఐతే అది ఎప్పుడూ హద్దుల్లోనే ఉన్నది. ప్రాంతీయ విద్వేషాల్ని, భాషా బేధాల్ని రెచ్చగొట్టలేదు. గతంలో ఎదుర్కొన్న క్లిష్ట పరిస్థితుల్లో ప్రజలు వారికి మద్దతు తెలిపారు. కానీ ఇటీవల కొన్ని దాడులు జరిగినప్పుడు ప్రజలు అంతగా స్పందించలేదు. కారణం ప్రజల్లో ఈనాడుపై అభిప్రాయం సన్నగిల్లటమే. కొన్ని సందర్భాల్లో అది ఒక బాధ్యతాయుతమైన పత్రికలా కాక తనకి ఉన్న ఇతర సంస్థల వ్యాపారమే పరమావధిగా ఫక్తు కార్పొరేట్ సంస్థలా వ్యవహరించటమే. ఏ ఫలాన్ని ఆశించి అది అలా వ్యవహరించింది అన్నది బహిరంగ రహస్యం. కొత్తరక్తం చేరి, నైతిక విలువల్ని పెంచుకుని కాల పరీక్షకు తట్తుకొని ఈనాడు నిలబడుతుందో? లేదో?

ఆరో గ్లాసు

మీరు సరిగానే చదివారు. అది క్లాసు కాదు గ్లాసు. ఇక అసలు విషయానికి వస్తే...
నేను ఇప్పుడు NTPC లో ఉద్యోగం చేస్తున్నాను. ఈ ఉద్యోగ పర్వంలో భాగంగా నాకు ట్రాన్స్ఫర్ ఐంది. నోయిడా నుంచి ఒక్క సారిగా ఉత్తరప్రదేశ్- మధ్యప్రదేశ్ బోర్డర్లో సింగ్రోలి అని ఉంది అది మా మొదటి ప్లాంట్. అక్కాడ ఒక కొత్త యూనిట్ కట్టాలి అంటే పంపారు నన్ను. ఇక్కడ నాతొ పాటు మరో 20 మంది ట్రైనీలు ఉన్నారు. అందరం బ్రహ్మచారులమే. ఒక్కడు తప్ప. సుధీర్ అని వాళ్ల ఊరు ఇక్కడికి దగ్గర. దాంతో వాళ్ల ఆవిడని, ౩ నెలల బిడ్డని తీసుకొని క్వార్టర్స్లో దిగాడు. మేమంతా బ్యాచిలర్ హాస్టల్లో ఉంటాం. వాడిది ఆపరేషన్ డిపార్టుమెంటు నాది సివిల్ ఇంజనీరింగ్ డిపార్టుమెంటు. వాళ్ళ డిపార్టుమెంటులో మొత్తం ఎనిమిది మంది ఉంటారు. ఒక రోజు సాయంత్రం నేను వచ్చేసరికి మాంచి డిస్కషన్లో ఉన్నారు. విషయం నాకు చాలాసేపు చెప్పలేదు. తరువాత తెసింది ఏమిటంటే వాడు టీ పార్టీకి పిలిచాడు. కాకపొతే చిన్న కండిషన్ . ఐదుమందే రావాలి. ఎందుకంటే వాడి ఇంట్లో ఐదు గ్లాసులు, ఐదు ప్లేట్లు మాత్రమె ఉన్నాయ్. ఒకడు సెలవు మీద ఇంటికి వెళ్ళాడు. మిగిలింది ఆరు. ఎవరు వెళ్ళాలి. ఇంకా ఒకడు ఆఫీసు నుంచి రాలేదు. వాడికి చెప్పకుండా వెళ్ళలేరు. ఇలా మాట్లాడుతూ ఉంటే ఇంతలొ వాడు వచ్చాడు. వాళ్ళలో ఒకడు రాయబారం నేను జరుపుతా అన్నట్లు ముందుకు వచ్చి చెప్పు విషయాన్ని. కనిశ్క్( వచ్చిన వాడు) ఒక్కసారిగా తల పైకి ఎత్తో ఆకసంలోకి చూస్తూ ఏదో ఆలోచించాడు.
సీన్ కత్తిరిస్తే వాడు కూడా టీ తాగాడు సుధీర్ వాళ్ల ఇంట్లో. ఎలా అంటే ఏముంది సింపుల్ వాడి రూంలో నుంచి గ్లాస్ తీస్కొచ్చి నేనూ వస్తా అన్నాడు. వాడ్ని చూసి అందరామ్ ఒక్కసారిగా నవ్వుకున్నాం. వాడు మాత్రం తన సమయస్ఫూర్తికి ఏదో తెనాలి రామక్రిష్నుడిలా పోజ్ ఇచి బయల్దేరాడు. అక్కడి వరకు మేము చాల నవ్వేసాం. కాని అసలు కామెడీ ముందు ఉంది అని ఊహించలేక పోయాం. అలా బయల్దేరి మా హాస్టల్ నుంచి సుధీర్ ఇంటికి దాదాపు అరమెయిలు ఉంటుంది. అదీ టౌన్ షిప్లో. అందరూ తెలిసిన వాళ్ళే. మాకు పై ఆఫీసర్లు. వీడు ఒలింపిక్ జ్యోతి పట్టుకున్న అథ్లెట్ లాగ ఊరేగింపుచేస్కుంటూ వెళ్ళాడు. దారిలో ప్రతి ఒక్కరు వాడిని చూసి(వాళ్లు చూడక పోయినా మా వాళ్లు చేసే సైగలతో గుర్తుపట్టేస్తున్నారు.)దేనితో వాడికి ఆవేశం పెరిగి బాడిలాంగ్వేజ్ మార్చేశాడు.నన్ను పిలవక పాయిన వాళ్ల వెనకాల వెళ్లాను. వీణ్ణి చూద్దామని. రాను రాను వీడు బారిష్టరు పార్వతీశంలా, మై ఫైనాన్సియల్ కెరీర్లో వాడిలా మారిపోయాడు. మేకపోతు గాంభీర్యం ప్రదర్శించాడు. తరువాత కొంత సేపటికి మావాడికి సిగ్గు ఎక్కువైంది. కొంచం మెలికలు తిరుగుతూ వివిధ భంగిమల్లో నడవటం మొదలుపెట్టాడు. మమ్మల్ని దాన్ని పట్టుకోమని బతిమాలాడు, బెదిరించాడు. కాని మేము అంత కామెడీని ఎలా వడుల్తాం. చివరికి మానుంచి వాడికి సహాయ నిరాకరణ ఎదురైంది. అలానే చివరికి వాళ్ల ఇంటికి చేరుకున్నారు.
తరువాత రోజు ఆఫీసులో అందరూ వీడిని చూడటం వెంటనే గుసగుసలు. పాపం అనుకుంటున్నాం. ఇంతలో ఇంకో ఫోన్ కాల్. ఈసారి మేఇంటనన్స్ డిపార్ట్‌మెంట్ హెడ్ పిలుపు. అందరూ సాయంత్రం మా ఇంటికి రావాలోయ్. మా అబ్బాయికి ఇంజినియరింగ్ డిస్టింక్షన్ వచ్చింది. టీ పార్టీ. అలాగే ఆ ఆపరేషన్స్ వాళ్ళని కూడా పిలవండి. అంతే అందరం వాడి పక్క చూశాం. వాడేమో సీరీయస్గా మానిటర్లో తలపెట్టి నాకు ఈ రోజు ఈవ్నింగ్ షిఫ్ట్ ఉంది అన్నాడు. మాకు అసలు నవ్వు ఆగలేదు. పాపం వాడు తరువాత వారం రోజులు మాతో కలిసి టీ తాగలేదు.

స్వర్ణముఖిస్వర్ణముఖి ... తూర్పు కనుమల్లో శ్రీనివాసుని పాదాల దగ్గర పుట్టి మా ఊరి మీదుగా సముద్రం లో కలిసే నది ఇది. అసలు జాతి,సంస్కృతి, చరిత్ర ఇలాంటి పదాలు ఎప్పుడు విన్నా అంతర్లీనంగా ప్రతి విషయం ఏదో ఒక నదితో విడదీయరాని బంధాన్ని ఏర్పరచుకుంటాయి. దీనికి మా స్వర్ణముఖి కూడా ఏ మాత్రం మినహాయింపు కాదు. దీని ఒడ్డున మహారాజ్యాలు ఉండక పోవచ్చు, చరిత్రకు ఎరుపును అద్దే యుద్ధాలు జరుగక పోవచ్చు కాని ఈ ప్రాంత ప్రజల జీవనయానానికి ఇది ఒక మూగ సాక్షి

పురాణాల ప్రకారం చూస్తే విష్ణుమూర్తి పై అలిగిన లక్ష్మీదేవి వైకుంటం వదిలి పుట్టినిల్లు ఐన సముద్రంలోకి వెళ్ళిపోయింది. తరువాత నారాయణుడు శ్రీనివాసునిగా అవతరించారని ఆయన పద్మావతిని పెళ్లి చేస్కున్నారని తెలిసి ఆయనను కలిసేందుకు వెళ్ళిన దారిలో బంగారం రాశులుగా ఆమె వెళ్ళిన బాట వెంబడి పడ్డాయి. తరువాత శ్రీవారు పాషాణం అవడం తరువాతి కదా అందరికీ తెలిసిందే.శ్రీవారు లక్షీ సమేతుడై శేషాచలంపై ఉండటంతో బోసిపోయింది. అక్కడ వారిద్దరూ విహరించే క్రీడాద్రి ఇక్కడికే వచ్చింది. అలా అది భూమికి చేరేటప్పుడు దానిపైన జలపాతాలు నదిగా లక్ష్మిదేవి సముద్రం నుంచి వచ్చిన దారిలోనే ప్రవహించాయి. బంగారు రాశులునదిలో ఇసుక బంగారుచాయలో మారిందని అంటారు. చంద్రగిరి కొండల్లో చిన్న సెలయేళ్లుగా ఉండే స్వర్ణముఖి తిరుపతి దాటేసరికి ఒక నదిగా రూపాంతరం చెందుతుంది. దీని ఒడ్డున ఉన్నముఖ్యమైన ప్రదేశాలు
ఏర్పేడు ఆశ్రమం- ఇది మలయాళ స్వామి వారిచే ప్రారంభించబడింది. ఇక్కడ ఎన్నో తరాలుగా వేదాధ్యయనం చేస్తున్నారు. దీని నాకు పెద్ద సమాచారం లేదు. దొరికితే భవిష్యత్తులో టపా వేస్తాను.
శ్రీకాళహస్తి- దీని గురించి తెలియని వారు ఉండరు. దక్షిణ భారతదేశంలోని సుప్రసిద్ధ శైవక్షేత్రాల్లో ఇది ఒకటి. దీని గురించి ఇక్కడ రాయటం మొదలైతే ఈ టపా స్వర్ణముఖి గురించా లేక కాళహస్తి గురించా అని మీకు అనుమానం వస్తుంది.అందుకే ఇక్కడ మీకు లింక్ ఇస్తున్నాను. http://www.srikalahasti.org/

తరువాత నాయుడుపేట, మా ఊరు వాకాడు మీదుగా ప్రవహించి పామంజి అనే ఊరి దగ్గర సాగరంతో సంగమిస్తుంది మా స్వర్ణముఖి. తంజావూరు దగ్గర కావేరి పై ఆనకట్ట కట్టిన తరువాత ధవళేస్వరం వెళుతూ కాటన్ దొర ఇక్కడకి రాత్రి పూట వచ్చి ఉంటాడు. అందుకే మా నదిని గమనించలేదు. లేకుంటే ఆ ఆనకట్ట ఇక్కడే ఉండి ఉండేది. అలా అని ఊరుకోలేము కదా. అందుకే ౨ ఏళ్ళ క్రితం మా ఊరిదగ్గర ఒక బారేజి కట్టారు ప్రభుత్వం వాళ్లు. ఇక నదిలో ఎప్పుడూ నీళ్లు ఉంటాయి అని కలలు కన్నారు మా ఊరి వాళ్లు.కాని అది బారేజి కదా అందులో నీళ్లు తక్కువ వుంటాయి. ఆనకట్ట ఐతే రిజర్వాయర్ లో నీళ్లు ఎక్కువ ఉంటాయి. ఆ సంగతి వాళ్ళకి తెలియదు మరి. ఎన్నో ఏళ్ళ కల మా ఊరి నాయకుడి కారణంగా తీరింది. మా ఊరిలో దాని ఒడ్డున శివాలయం, చెన్నకేశవ స్వామీ ఆలయం ( ఈ మద్యనే కట్టారు) ఉన్నాయి. చెన్నకేశవ స్వామీ ఆలయం తో నాపెద్దగా అనుబంధం లేదు గాని శివాలయం మాత్రం మా ఊరి యూత్ కి చాటింగ్ హబ్. నాకు తెలిసిన ఫ్రెండ్స్ లో చాల మందికి పరీక్షలకి చదువుకోవాలంటే ఇదే బెస్ట్ ప్లేస్.వారిలో ఒకతను ఈ మద్యనే తన బ్లాగ్ లో ఆ గుడి ఫోటోలు పెట్టాడు. http://kolanukudurusiva.blogspot.com/2009/02/sri-nageswara-swami-templevakadu.html. ఈ ఫోటోల్లో గుడి అంత బాగా ఉంది అంటే అందులో నూటికి నూరు శాతం నా స్నేహితుల వల్లే. నిజం చెప్పాలంటే అందులో నా భాగం చాలా తక్కువ. వాళ్లు ప్రతి శివరాత్రికి ఎంతో కష్టపడి శుభ్రం చేస్తారు.
ఈ నదిలో మాకు దానిలోని నీళ్ళకంటే ఇసుకతోనే ఎంతో బంధం. కారణం చాలా చిన్నది... అందులో నీళ్లు కొన్ని వారాలు మాత్రమే ఉంటుంది. మా చిన్నప్పుడు కనీసం మార్చ్ వరకు ఉండేవి నీళ్లు. మా అమ్మ వాళ్లు చిన్నప్పుడు అందులో మాఘ స్నానాలు కూడా చేసే వారట. ఒక్కసారి వరద వస్తే బావులన్నే నిండి పోతాయి. మళ్ళీ వరద వచ్చేవరకు నీళ్లు సరిపోతాయి. చిన్నప్పుడు అది నాకు చాలా ఆశ్చర్యం వేసే విషయం. తరువాత అర్ధం ఐంది ఏమిటంటే కింద ఇసుక చాల లోటు వరకు సుమారు ౪౦ మీటర్ల వరకు ఉంది. వరదనీళ్లు అందులో నిలువ ఉండి ఏడాది మొత్తం బావులకి నీళ్లు ఇస్తాయి.ఇప్పుడు నీటి ప్రవాహం తగ్గింది. కారణం ఏంటి అని ఆలోచిస్తే తెలిసింది చిత్తూరు జిల్లలో చాల చోట్ల ఈ నదిలోకి కలిసే వాగులకు చెక్ డాంలు కట్టారు. అందువల్ల మాకు వచ్చే ఒండ్రు, నీళ్లు తగ్గిపోయాయి. కళ్యాణి డాం అని తిరుపతి దగ్గర మరొక డాం ఉంది. తుఫాను వస్తే దాని గేట్లు ఎత్తేస్తారు. అప్పుడు ఆ వరద నీళ్ళతో గోదారిలా అని పిస్తుంది మాకు. అలాగే ఇంకొంత కాలం నీళ్లు ఉంటే బావున్ను అనిపిస్తుంది మాకు.ఆ వారం రోజులు నీళ్ళమట్టం చూస్కోవడం మా చుట్టూపక్కల గ్రామాల్లో ఒక సంబరం మరి మళ్ళీ చూడాలంటే మరో సంవత్సరం ఆగాలి కదా.
ఇక పొతే ఇసుక.. అటు తెలుపు ఇటు పసుపూ కాని ఒక అందమైన చాయ ఆ ఇసుక సొంతం.కట్టుబడికి ,కాంక్రీట్ పనికీ చెన్నై కి కూడా పంపుతారు. మా ఊరి ఇసుకకి ఇంత డిమాండ్ ఉందంటే కొంచం గర్వంగా ఉన్నా ఇలా తవ్వుకుంటూ పొతే కొంత కాలానికి మనకు ఏమీ మిగలదు ఏమో అనిపిస్తుంది నాకు. మా చిన్నప్పుడు బంధువుల పిల్లలం దాదాపు ౧౫ మందిమి ఉంటాం. వాళ్లు ఏప్రిల్ ౨౪ ఇక్కడికి వస్తే జూన్ ౧౨ వరకు ఉండేవాళ్లు. అందరికి సాయంత్రం ఐతే ఓకటే ఆనందం ఏట్లోకి వెళ్లి ఇసుకలో ఆడుకోవచ్చు. అలా ఇంజనీరింగ్ పూర్తీ అయ్యేవరకు దాదాపు ప్రతి ఎండాకాలం అక్కడ గడిపాం. కుదిరితే ఫొటోస్ టప చేస్తాను.
స్వర్ణముఖి గురించి ఎన్నో రాయాలి అనుకున్నాను. కాని ఇక్కడ పదిశాతం మించి రాయలేక పోతున్నాను. అయినా ఇది నేను నాకోసం రాసుకొనే స్థలం కాబట్టి ఎప్పుడైనా రాసుకోవచ్చు అనే ఆనందం తో ముగిస్తున్నాను. మొదటి టపా లోనే మా స్వర్ణముఖిని గురించి రాయాలి అనుకున్నాను. కాని ఇప్పుడు రాయడం చాలా ఆనందంగా ఉంది.

శుక్లాంబరధరం విష్ణుమ్

చాలాకాలంగా ఒక బ్లాగుని మొదలు పెట్టాలి అన్న ఆలోచన ఈ రోజు సింగ్రౌలీ లో ఒంటరి తనం వల్ల ఆచరణ సాద్యం అయింది. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను, చదువు చెప్పిన గురువును, ఆదిగురువు శంకరాచార్యులను తలచుకుంటూ ఈ పని మొదలుపెడుతున్నాను. మాది నెల్లూరు దగ్గర వాకాడు, స్వర్ణముఖి నది ఒడ్డున ఉంది. అందుకే నేను నా బ్లాగుకి ఆ పేరు పెట్టుకున్నాను.