నిరీక్షణ

సాయంసమయం సంధ్యారాగం పాడుతోంది. మొహాన ఎరుపద్దుకున్న సూరీడు జారిపోతూ పెట్టిన ముద్దుకి వీడ్కోలు చెబుతున్న ఆకాశం బుగ్గలు ఎరుపెక్కి కెంజాయ అలుముకుంటూ ఉంది. వడివడిగా పడుతున్న అడుగులు విరహాన్ని తట్టుకోలేని గుండెకి సర్దిచెప్పుకుంటోంది. పొన్నచెట్టుకింద ఎదురుచూస్తూ నిల్చున్న నువ్వు రెప్పవాల్చిన క్షణంలో కనిపించి అంతలో మాయమైపోతున్నావు. నిన్నందుకోవాలన్న తపనలో ఉఛ్వాసనిశ్వాసాలకు తేడాలేకుండా చాతీ ఎగిసిపడుతోంది. ఎంతదూరం నీకోసం పరిగెత్తానో వెనక్కితిరిగి చూసుకునేందుకు కూడా మనస్కరించడంలేదు.

ఎక్కడ ఉన్నావో కూడా తెలీని నీకోసం ఎదుటే ఉన్నట్టు ఊహించుకుని తపనపడిపోతున్న మనస్సుకి ఎలాచెప్తే అర్థంచేసుకుంటుందో తెలియక సతమతమయ్యే క్షణంలో నాబాధ ఎవరికి అర్థమయ్యేను? నీకుతప్ప. అసలా బాధలో ఉండే ఆనందం ఎంత తృప్తినిస్తుందో ఎవరికి తెలిసేను? నాకుతప్ప. ఆకలయికలో కలిగే పరవశపు అనుభూతులెవరు పొందేరు?మనం తప్ప. ఆదృశ్యాన్ని కళ్లముందు సాక్షాత్కరింపజేసుకున్న తక్షణం లాగివదిలినబాణంలా ఒక్కసారిగా ఒళ్ళువిరుచుకుని ముందుగు వందరెట్లవేగంతో, వెయ్యిరెట్ల విశ్వాసంతో నీవైపుసాగే నాకు బలమెక్కడిది? నమ్మకమెక్కడిది? అని అడుగుతున్న లోకానికి నువ్వున్న దిక్కువైపు చూపినప్పుడు వాటిగొంతుమూగబోయిన క్షణం నేను ఈప్రపంచాన్ని గెలిచేరోజు ఎంతోదూరంలో ఉండబోదన్న వాస్తవం అర్థమైంది.

ఒక్కక్షణం..నాకళ్లను నేనేనమ్మలేని ఒక్కక్షణం. గుండెబరువు దిగిపోయింది. ఇంతకాలం మనసుతో వేళాకోళం చేస్తున్న మస్తిష్కం ఓటమినొప్పుకుంది. వెళ్తూవెళ్తూ చివరిగా కొండలతో పరాచికాలాడుతున్న సూర్యుడు మనవైపే కళ్లప్పగించి చూస్తున్నాడు. ఒకవైపు నువ్వు. మరోవైపు ఇంతకాలం నీరూపాన్ని ఊహించుకుంటూ ఊసులాడుకున్న సంధ్య. మద్యన నేను. ఇన్నేళ్ళుగా నేపంచుకున్న మాటలన్నీ నీతో పూసగుచ్చినట్టు చెప్పిన తనకి కళ్ళతోనే కృతజ్ఞతలు చెప్పుకున్నా. ఒక్కక్షణం నాలో పొంగిన ఆవేశాన్ని అణూచుకోలేక నీపైకి ఉరికిన ఉరుకులో 'నాది‌' అన్న అహమే తప్ప మరేంలేదన్నది మనకు మాత్రమే తెలిసిన సత్యం. అలా బిగుసుకున్న మనిద్దరి మద్యనా ఊపిరాడని సంధ్య ఇకనావల్ల కాదంటూ విదిలించుకుని సిగ్గుతో మొహాన్నిదాచుకుంటూ చీకటిలోకి వెళ్ళిపోయింది.

నీతో చెప్పుకోవాలనుకున్న ఎన్నోసంగతులు గుర్తుకురాక, గుర్తొచ్చినవాటిని చెప్పడానికి భాషచాలక మూగవాడినైన క్షణంలో వినిపించిన నీగుండెచప్పుడు నన్ను ఉక్కిరిబిక్కిరి చేసేసింది. కళ్లను గుండెపై ఆన్చినప్పుడు నీకనురెప్పలు పదులసంఖ్యలో దింపిన మన్మధబాణాలు నన్ను అచేతనుణ్ణి చేశాయి. మన్మధుడి అమ్ములపొదిలో ఐదుబాణాలైతే నీదగ్గర అంతకన్నా పదునైనఆయుధాలు ఎక్కడినుంచి వచ్చాయి? రతీదేవి ఇచ్చిందా? లేక నువ్వే రతీదేవివా? అంతమెత్తటి చురకత్తులకి నాగుండెని కోసేంత పదునుందని ఊహించలేకపోయాను. ఆక్షణంలో హృదయంపైన నీకళ్ళు పులిమిన కాటుకమరక పుట్టుమచ్చలా ఎప్పటికీ నిలిచిపోవాలని కోరుకున్న క్షణంలో అనిపించింది "నీకళ్ళలో కాటుకనైపోతే?" అవును. అంతకన్నా ఆనందమేముంది? నాకంతకన్నా హోదా ఏముంది? నీకోసం నేనుచెయ్యగలిగింది అంతకన్నా ఏముంది?

అరచేతుల్తో నీముఖాన్ని పట్టుకుని నెమ్మదిగా పైకెత్తుతున్నాను. నీకళ్ళు కనిపించిన క్షణంలో కాటుకనైపోదామని తపిస్తున్నాను. అలా నీకళ్ళు చూసిన క్షణంలో ఈసృష్టిలోనే అత్యంత అపురూపమైన దృశ్యాన్ని చూశాను. నీకంటి చివర సన్నగా మెరుస్తూ, గురుత్వబలాన్ని ధిక్కరిస్తూ, ఉబికివస్తున్న ఉద్వేగాన్ని ఆపుకుంటూ, నేను నీతోడున్నానన్న దర్పాన్ని ప్రదర్శిస్తూ ఒక్కనీటిచుక్క. ఆల్చిప్పలో ముత్యాలుగా మారామని మురిసిపోతున్న కోట్లకొద్దీ నీటిచుక్కలకి ఆక్షణంలో అవికోల్పోయిన రాచపదవి ఎంతగొప్పదో అర్థమైంది. నేనిప్పుడూ కోహినూర్ అన్నభావాన్ని ప్రదర్శిస్తున్న ఆరాచబిందువును నెమ్మదిగా తీసుకుని నాకళ్ళలో వేసుకున్నా. అలానీకళ్లలోకే చూసుకుంటూ ఉండగా పెదవులు ముడిపడ్డక్షణంలో, నాఉచ్వాసానికి నీనిశ్వాసం నీఉచ్వాసానికి నానిశ్వాసం తోడైనిలిచి ఇద్దరిశ్వాస ఒకటైనప్పుడు కల్గినతృప్తి అమ్మపాలు తాగినప్పుడు అనుభవించానేమో?

కాటుకమరక. నీటిచుక్క. ఈజన్మకి లభించిన అపురూప బహుమతులని తనివితీరా ఆస్వాదిస్తూ తన్మయత్వంలో మూసినకళ్లను ఎప్పుడు తెరిచానో తెలీదు. చుట్టూ చీకటి. నీతోగడిపిన క్షణాలన్నీ నీకళ్లను చూసేందుకే సరిపోయింది. అంతలో మాయమైపోయావు. మరునాడు నీవదనాన్ని, శరీరాన్ని వర్ణించమని అడిగితే తనుకూడా కళ్లను తప్పమరేమీ చూడలేదని సంధ్యచెప్పింది. దిక్కులు పిక్కటిల్లేలా అరుద్దామన్నా ఒంట్లో ఆవహిమ్చిన నిస్సత్తువ ఆప్రయత్నాన్ని విరమింపజేసింది
.
ఎక్కడున్నావో? నాదగ్గరికి ఎప్పుడొస్తావో? తెలీని నీతో చెప్పాలనుకున్న మాటలు సంధ్యతో పంచుకుంటూన్నా.
నాకు దూరంగా ఎన్నాళ్ళుంటావు? మనిద్దరం కలిసి నడవాల్సిన దూరాలు, జవాబు చెప్పాల్సిన ప్రశ్నలు, ఎదిరించాల్సిన పరిమితులు, చేదించాల్సిన లక్ష్యాలు మనకోసం ఎదురుచూస్తున్నాయి. నువ్వు నాపక్కనుండు. ప్రపంచమంతా ఇన్నేళ్ళనుంచి నమ్ముతూ వస్తున్న సిద్ధాంతాల్ని అభూతకల్పనలని. కాలాన్ని స్థంబింపజేచే శక్తి మనిషికుందని నిరూపిస్తా. శిశరాన్ని వసంతంగా మార్చడమెలానో చేసిచూపిస్తా. మనసు మస్తిష్కానికన్నా బలమైనదని ప్రకటిస్తా. నమ్మకానికి మించిన బలం, ఎదురుచూపులకు మించిన ఆనందం లేదని ప్రపంచానికి చాటిచెపుతా. ఇంకా ఎందుకీ దాగుడుమూతలు. వచ్చి నాఅరచేతుల్లో నీముఖాన్ని దాచేసుకో. నీకంటికాటుకను గుండెలపై దిద్దేసుకో.