రిహాంద్

గతంలో నేను సోన్‌నది గురించిరాశాను. రిహాంద్ అనే చిన్ననది, సోన్‌నదికి ఉపనది, గురించి రాద్దాం అనుకున్నా. మొదలుపెట్టాక ముందు సోన్ గురించి చెప్తేకదా ఇది తెలిసేది అని విషయాన్ని అటుపక్కకు తిప్పాను.

ఇక రిహాంద్ విషయానికి వస్తే అది చత్తీస్‌ఘడ్‌లోని సర్గుజా అనేప్రాంతంలో పుడుతుంది. వింధ్యపర్వతసానువుల్లోని మణిపాల్ పీఠభూమి దగ్గర సముద్రమట్టానికి సుమారు 1100మీటర్ల ఎత్తున దీనిజన్మస్థానం ఉంది. అక్కడి నుంచి ఉత్తరదిశగా సోనభద్రజిల్లాగుండా ఉత్తరప్రదేశ్‌లో ప్రవేశించి, చోపన్‌దగ్గర సోన్‌నదిలో కలుస్తుంది. సోన్‌నదిరంగు ఆప్రాంతపు మట్టిరంగులో కలిసిపోయి ఉంటుంది. అందువల్ల ఉపగ్రహచిత్రాలద్వారా దానిమార్గాన్ని గుర్తించడం కష్టం. రిహాంద్‌ నీలిరంగులో, కృష్ణవేణికి డూప్ అన్నమాట, ఉండటంతో ముందుదీన్ని గుర్తించి, ఆతోకతో సోన్‌దగ్గరకి చేరుతారు. దీనికి మహన్, మోర్ని, గగర్, గల్ఫుల్లా మొదలైన పిల్లనదులు ఉన్నాయి.

కేవలం 160కిమీ ప్రవహించి మరోనదిలోకలిసిపోయేనది రిహాంద్. ఇలాంటి నదులు మనదేశంలో కోకొల్లలు. అయినా దానికంటూ ఒకగుర్తింపు దక్కింది అంటే దానివెనుక ఒకమహనీయుని కృషి ఉంది. ఆమహనీయుడు ఎవరంటె అభినవ విశ్వకర్మ, ఆధునికభారత నిర్మాతల్లో ముందువరుసలో నిలబడే ఇంజనీరు మోక్షగుండం విశ్వేశ్వరయ్య.


అతితక్కువ దూరంలోనే అంటే కొన్నిపదుల కిలోమీటర్లలోనే ఈనది సుమారు 750మీటర్లు కిందకి దూకుతుంది. ప్రవాహమార్గం పూర్తిగా కొండల్లోని ఇరుకైన సందుల్లో, ఋతుపవనాల సమయంలో పెద్దపెద్దబండలను సైతం దొర్లించేవేగంతో గమనం ఈనదికి వరం. ఒక జలవిద్యుత్తుప్రాజెక్టు రూపుదిద్దుకునేందుకు దోహదపడింది. సోన్‌నదిలో కలిసేచొటుకి 45కిమీ ముందు పీపరి-రేణుకూట్ అనే గ్రామాలదగ్గర రిహాంద్ బహుళార్థసాథక ప్రాజెక్టు 1966లో రూపుదిద్దుకుంది.934మీ పొడవు, 91మీ ఎత్తు ఉన్న ఈకాంక్రీటుడ్యాం గురుత్వసిద్థాంతాన్ని ఉపయోగించి రూపొందించారు.


నీటిని నిలువ ఉంచడంద్వారా కలిగే ఒత్తిడి డాంవెనుక భాగంపై పడుతుంది. దానివల్ల డాం ముందుకుజరగడమో, లేక దొర్లిపడిపోవడమో జరుగుతుంది. ఈబలాన్ని ఎదుర్కునేందుకు డాంలో వాడి పదర్థపుభారం ఉపయోగపడుతుంది. ఈసూత్రంద్వారా నిర్మించే డాంలను గ్రావిటీడాం అంటారు. నాగార్జునసాగర్‌డాం కట్టేసమయంలో మొదటసిమెంటుకాంక్రీటును ఉపయోగించాలి అనుకున్నారు. అయితే స్థానికంగా లభించే నల్లరాయిని పరీక్షించగా అది నిర్మాణానికి ఉపయోగించవచ్చు అని ధృవీకరించారు. ఆతరువాత డిజైన్‌లలో చేసిన మార్పుల కారణంగా చాలాఖర్చు తగ్గిందట.


ఈడాంకట్టండం ద్వారా ఏర్పడిన జలాశయానికి ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు గోవింద్‌వల్లభ్‌పంత్ పేరిట జీబీపంత్ జలాశయం అని పేరుపెట్టారు. 10625 మిలియన్ల ఘనపుమీటర్ల సామర్థ్యంగల ఈజలాశయంలోకి 13344చదరపు కిమీ ప్రాంతంలో పడ్డ వర్షపునీరు చేరుతుంది. 466చదరపు కిమీ వైశాల్యంలో విస్తరించి ఉన్న ఈజలాశయం మనదేశంలోని మానవనిర్మితజలాశయాల్లో అతిపెద్దది. అంతర్జాతీయ సాంకేతికప్రమాణాలు అందుకోగల అతికొద్ది భారతీయ కంపెనీల్లో ఒకటి అయిన హిందుస్థాన్ కన్‌స్ట్రక్షన్ కంపెనీ ఈనిర్మాణాన్ని అతితక్కువ వ్యవథిలో పూర్తిచేసింది. ఇటీవల ముంబాయిలోని బాంద్రా లింక్‌బ్రిడ్జిని కట్టిందికూడా వీళ్లే.
ఒక్కొక్కటి 50మెగావాట్ల సామర్థ్యంగల ఆరుయూనిట్ల ద్వారా 300మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి జరుగుతోంది. దీనివల్ల ఈప్రాంతంలో అనేక పరిశ్రమలు స్థాపించారు. ప్రత్యక్షంగా రెండులక్షల హెక్టార్లకు, పరోక్షంగా ఐదులక్షల హెక్తార్లకు సాగునీరు లభిస్తుంది. ఈనిర్మాణంద్వారా వరదనియంత్రణ వ్యవస్థ అభివృద్ధి చెయ్యగలిగారు. ఈప్రాంతంలో బొగ్గుగనులు విస్తారంగా ఉండటంతో థర్మల్‌విద్యుత్తుప్లాంటులు జలాశయంనీటిని ఉపయోగించుకుని తమ ఉత్పత్తిని కొనసాగిస్తున్నాయి. ఈఒక్కప్రాంతంలోనే దాదాపు 15000మెగావాట్ల విద్యుదుత్పత్తి జరుగుతోంది. ఈజలాశయం ఒడ్డునే ఎన్‌టీపీసీ తనమొదటిప్లాంటును 1977లో మొదలుపెట్టింది. ఇప్పుడు జలాశయానికి మూడు వైపులా మూడుప్లాంటులలో ఉత్పత్తిని కొనసాగిస్తుంది. రిహాంద్‌నది సోన్‌లో కలిసేముందు మరొకచిన్న ఆనకట్ట ఓబ్రావద్ద ఉంది.
పాత వందరూపాయలనోటుపైన ఒక ప్రాజెక్టుబొమ్మ ఉండేది గుర్తుందా? చాలాకాలం అది నాగార్జునసాగర్ అనుకొనేవాడిని. ఈమద్యనే తెలిసింది అది రిహాంద్‌ప్రాజెక్టుది అని.

కొత్తనేను

అది 2007 సంవత్సరం జూలై. రెండో సెమిస్టరు తర్వాత చెయ్యాల్సిన సమ్మర్ ఇంటర్న్ షిప్ పూర్తిచేసి ఒకవారం ఇంటిదగ్గర ఉండి తిరిగి హాస్టలు చేరా. గోవింద్‌గాడు వచ్చి "ప్లేస్‌మెంట్ ఎక్సామ్ రిజల్ట్ వందిరిచి. నీయుం,శశికళాఉం టాపర్స్. ఒరు ఆయిరం మట్టుం పోదుం" అని సొల్లి వెళ్ల్లాడు. ఆడబ్బు చలానా కట్టి ఆరశీదు ప్లేస్‌మెంట్‌సెల్‌లో ఇచ్చి వ్చచ్చేశాం.

"మొదటి కంపెనీ టీసీఎస్ బావా" అని విభాగాడు. "సర్లేరా నేనెలాగు వాటికి కూర్చోనుగా.ఎల్ అండ్ టీ . ఎప్పుడు." అని అడిగా. "కొంచెం టైమ్ పడుతుంది" అని చెప్పాడు. సాయంత్రంవచ్చి" బావా! అది ఎప్పుడు వస్తుందో తెలియదు. నువ్వు ఇంతవరకూ అగర్వాలు పుస్తకం అట్టకూడా చూడలేదు. అసలు ఆప్టి, రీజనింగ్ ఎలా ఉంటుందో చూద్దాం." అన్నాడు. ఇంతలో హరిగాడు వచ్చి "దాని తర్వాత సీ.టీ.ఎస్ వెంటనే ఐ.బీ.ఎమ్." అన్నాడు. మళ్లీవిభాగాడు " ఒకసారి చూద్దాం బావా. నేను కూడా ప్రిపేర్ కాలేదు" అన్నాడు. వాడుకూడా ఇంటర్న్ షిప్ కోసం డిల్లీ వెళ్ళొచ్చాడు. వాళ్లక్లాస్‌కి రెప్ కావడంతో ముందుగావచ్చి ప్లేస్‌మెంట్ చూస్కోవాల్సి వచ్చింది. సర్లేరా చూద్దాం అన్నాను.

రాత్రి పడుకునే ముందు ఆలోచనలు..." నాకు అసలు సాఫ్ట్వేర్ అంటేనే పడదు. ఎందుకో నామైండ్‌సెట్‌కి కుదరదు అనిపించింది. కొన్ని అలా ఫిక్స్ ఐపోతా. తర్వాత నన్నుమార్చాలంటే కష్టమే. 2000 డిసంబరు 08 కౌన్సిలింగ్‌లో సివిల్ సీటు వచ్చినప్పుడే అనుకున్నా ఇక జీవితానికి నేను సివిల్ ఇంజనీరుని అని. మానాన్న ఐతే ఎంసెట్ అప్లికేషన్ నింపేరోజే అన్నాడు నువ్వు సివిల్. అంతేరా అది నిర్ణయం ఐపోయింది అని. అమ్మకి మాత్రం నేను సాఫ్ట్వేర్ ఇంజనీరు అవ్వాలి అని. ఇంట్లో త్రాసు ఎప్పుడూ నాన్నపక్కే తూగుతుంది. నాకు ఉద్యోగం వచ్చి ఆమాట ఇంట్లోచెప్తే. ఈమాట రెండునెలల క్రితం అయ్యుంటే బావుండేది. కానీ ఈరోజు పరిస్థితివేరే. నాకు ఒక ఉద్యోగం వచ్చింది అని చెప్తే ఇంట్లో ఎగిరిగంతేసేయ్యరు. కానీ ఈమాట అమ్మకి కొంత ఊరట." మొత్తానికి దానికి కూర్చుందాం అని నిర్ణయించుకుని విభాగాడికి చెప్పా.

ఇద్దరం కలిసి ప్లేస్‌మెంట్ వెబ్‌పేజ్‌లో రిజిస్టర్ చేస్కుని వచ్చాం. హరిగాడిని అడిగితే "లేదుబావా" అన్నాడు. సరే ఆరోజుకైనా త్వరగా లేవాలిగా. ఏడుకల్లా లేచి, స్నానం- సంద్యలు పూర్తిచేస్కుని ఫార్మల్ తొడుక్కుంటుంటే ఎవడొ మనల్ని ఫాలో అవుతున్న ఫీలింగ్. తిరిగి చూస్తే అరుణ్ గాడు. ముసిముసి నవ్వులు. "ఇప్పం నాన్ ఒరు సీరియస్ కారెక్టర్‌. ఎణ్ కిట్టా కామెడీ వేండా తంబీ" అన్నా. అయినా మారలేదు. సరే ఒక పదినిముషాలు కామెడీలు వేసి తిరిగి సీరియస్‌గా మెస్‌కి వెళ్తే అక్కడా సేమ్‌సీన్. అరగంట కామెడీ తర్వాత మళ్లీ సీరియస్.

ఇప్పుడు బార్న్‌హాల్‌లో పీపీటీ ఏస్తున్నారు అంటే జెమినీ సర్కస్ చూసే ప్రేక్షకుల్లా వెళ్తున్నారు జనాలు. కూర్చునేవాళ్లు, కూర్చోనివాళ్లు అన్నతేడా లేదు. బల్క్ కంపెనీ, అందునా టీసీఎస్. వీటన్నిటి మించి సీజన్ ఓపెనింగ్. అక్కడి నుంచి ప్లేస్‌మెంట్‌సెల్‌కెళ్లి మానంబరు తీస్కుని నోటీస్‌బోర్డ్‌లో చూస్తే నాకు పదకొండుకనుకుంటాఆన్‌‌లైన్ ఎక్జాం. సరేనని బుహారిలో చాయ్ తాగి అలా నలుగుర్నీ కెలికి (ఒక్కోడు అగర్వాల్ పుస్తకాన్ని తెగరుబ్బి- తెగతాగినారు.) వచ్చి కూలబడ్డా.

పరీక్షరాసి భోజనానికి వెళ్తే ఒక్కొక్కరి మొహంలో ఒక్కొక్క హావభావం. కొంతమంది స్థితప్రజ్ఞులు( మేకపోతులు), ఇంకొంతమంది నిగర్వులు( కనిపిచ్చినోడినల్లా ఈప్రశ్నకేమి జవాబు ఆప్రశ్నకేమి జవాబు అని తినేస్తున్నారు), మరికొంతమంది భోళాశంకరులు( నాపరీక్ష బాల్చీ తన్నేసింది అని ఏడుస్తున్నారు). ఇక ఎగ్జిట్‌పోల్ నివేదికలు, గతేడాది గణాంకాలతో కుస్తీపట్టేవాళ్లు. మిగతాకాంపస్సుల్లో అనుభవాలను ప్రసారంచేసేవాళ్లు. అబ్బో జాతర.

మొత్తానికి ఫలితాలు వచ్చాయి. మద్యాహ్నం గుంపుచర్చలు. దానికి వెళ్లొచ్చి, విభాగాడితోబాటు కొంచెంసేపు జననాడిని , జ్యూసు కడుపులో పోస్కుని ఫలితాలు కోసం వెళ్తుంటే సేఫ్టీగాడు ఎదురొచ్చి " నువ్వు క్లియర్ అయ్యిపోయావు బావా. విభాగాడిపేరు నాకు గుర్తులేదు." నీయబ్బా అనీట్టుకుంటూ పరిగెత్తాం. హమ్మయ్య వాడిపేరు కూడా ఉంది. ఇక ఇంటికి ఒకకాల్ చేసి విషయం చెప్తే ఊహించినట్లే "హ్మ్. సరేరా."

సాయంత్రం బనానాలీఫ్‌లో హరి, కొండి, రాకీతో విందు. ఇక మనసు ఊరుకోదుగా. అప్పటికే స్టైపండు పండింది. అమ్మకి ఒకచీర తీస్కుని పదకొండుకి బస్సెక్కేశా. ఐదుకి కోయంబేడు ఎనిమిదిన్నరకి ఇంట్లో." అలా నాజీవితానికి మొదటిఉద్యోగం వచ్చింది. ఇక మూడొసెంలో పూర్తిగా ఉద్యోగం అన్న ఆలోచనేలేదు.
మమ్మల్నిచూసి హరికూడా మనసు మార్చుకుని సీటీఎస్‌కి కూర్చున్నాడు. ఉద్యోగం వచ్చిన తరువా వాళ్లనాన్నకి ఫోన్‌చేసి "నాన్నా! నాకు ఉద్యోగం వచ్చింది. నీచిన్నకొడుకు గురించి నువ్వుదిగులుపడాల్సిన అవసరంలేదు. ఇక ఎవరొచ్చి ప్రశ్నించినా నీదగ్గర జవాబుంది." నేను జీవితంలో మర్చిపోలేని మాటలివి.

నాలుగోసెం మొదలైంది. నేను కోర్‌కంపెనీలకు కూర్చుంటా ఆంటే కొన్ని శక్తులు అడ్డుపడాయ్. నిజానికి ఇవే నన్నుగతంలో ప్రభావితం చేశాయ్.ఇప్పుడూ వాటిగురించి అనవసరం. అప్పటికే అన్ని ముఖ్యమైనవి అయిపోయాయి. ఇక మిగిలింది రెండు మూడు. వీళ్ళు ఉన్నవన్నీ వృధాచేసి ఇప్పుడు నాపుట్టి ముంచేశారు. ఇక ఆఫ్‌కాంపస్‌కి వెళ్లాలి అని డిసైడ్ అయ్యా. అందరూ వద్దుబావా రిస్క్.నిజమే కానీ తప్పదు.

ఇక ప్రతిబుధవారం హిందూలో ఆపర్చునిటీస్, నౌకరీ, మాన్‌స్టర్. మొదట జిందాల్. విజయవంతంగా నింగికెగసి భూకక్ష్యకి చేరింది. తర్వాత చూస్తే పీఎస్.యూల్లో వర్క్ ప్రొఫైల్, పాకేజీ బావుంది. చర్చిస్తే అన్నింటికన్నా అవే ఉత్తమమైనది. ఐఐటీల్లో, ఎన్ఐటీల్లో చదివేవాళ్లు ఎక్కువ వాటిలోనే ఉంటారు అని తెలిసింది. మొదటిది హెచ్‌పీసీఎల్. డుమ్మాకొట్టింది. తర్వాత ఎన్‌టీపీసీ. విజయం. కానీ నాకు ఇష్టమైనది బీ.హెచ్.ఈ.ఎల్. నాన్న చాలాసార్లు అనేవాడు.కానీ కుదర్లేదు.

ఇంతలో విభాగాడు ఫోను. బావా ఎల్ అండ్ టీవాడు నిన్ను- నన్ను పిలుస్తున్నాడు. వాకే అదికూడా విజయం. దాంట్లోనే ఉండిపోదాం అనుకున్నా. ఐ.ఓ.సీ.ఎల్, ఓ.ఎన్.జీ.సీ ల నుంచి పిలుపు. కానీ అంతగా పట్టించుకోలేదు. ఇంతలో కొన్ని‌అంశాలు ప్రభావితం చేశాయి. ఇక పీ.ఎస్.యూకి వెళ్లాలి అనిమనసు. ఎలా అనుకున్న సమయంలో ఇంటికి పోస్టు అందులో ఎన్.టీ.పీ.సీ నుంచి లేఖ. వెళ్లి కంపెనీలో చెప్పేశా. మావాడు ఇంటర్వ్యూ అవ్వకముందే ఎందుకు చెప్పావు అని నస. కానీ ఖచ్చితంగా వస్తుందని నాకనిపిచ్చేసింది. ఎక్కడిదో ఆధైర్యం తెలియదు.

పీజే‌ఎన్ పిలిచి దాని రిజల్టువచ్చేదాకా నీకు పని అప్పగించలేమ్ అన్నాడు. సరే అని వచ్చేశా. ఇంటికి వేళ్లలేదు. ఫలితాలు రావల్సిన దానికన్నా ఒకవారం ఆలస్యం ఐంది. కొద్దిగా దిగులు. తిరువళ్ళూరు వెళ్లి చాలా ఏళ్లైంది అని గిరిగాడితో చెప్పి అక్కడికి బయల్దేరా. వాడూవస్తా అన్నాడు. మద్యలో వెంకటెసూ.ముగ్గురం కలిసి వెళ్లి వీరరాఘవస్వామి దర్శనం చేస్కుని మల్లిగాడి రూంకి వెళ్లాం. పిల్లిలాగా చప్పుడు చెయ్యకుండా నెట్ ఓపన్ చేసి చూశా. ఏనుగెక్కి మెరీనాబీచ్ వరకు ఊరేగా. వెంటనే అమ్మకి, అశోక్‌కి ఫోన్. దాంతో ఐ.ఓ.సీ.ఎల్, ఓ.ఎన్.జీ.సీ. పట్టించుకోలేదు.

విభాగాడినుంచి ఫోను. బావా ఈనెల 29 స్నాతకోత్సవం. అందరం కలుద్దాం. దానికోసం బయల్దేరుతుంటే అప్పుడే ఇంటినుంచి అమ్మఫోన్. ఒక శుభవార్త. పాపని చూసెళ్లిన వాళ్లు అమ్మాయి నచ్చింది అన్నారు.
అందరం కలిసి ఎగ్మూరులో రైలెక్కాలి. మనకు చేజింగ్‌ లేకపోతే మనసొప్పుకోదుగా. అందుకే మద్యలో అక్కడా ఇక్కడా పెత్తనాలు చేసి వచ్చేసరికే టైమ్ అయిపోయింది. ఇక అక్కడికి వెళ్తే కష్టం అని గిండీనుంచి నేరుగా తాంబరం చేరాను. ఎవ్వరూ భోజనంచెయ్యలేదంటే రైలొచ్చేసరికే టిఫిన్లు కట్టిచ్చిపెట్టా. తెల్లవారేసరికే కాంపస్‌లో.

బార్న్‌హాల్‌లో ఫంక్షను. గౌను, ఇతర సరంజామా తీస్కుని అక్కడికి వెళ్లాం. అందరికీ అక్కడే ప్రకటించా. వెలగాల్సిన బల్బులు వెలిగాయి. మాడాల్సిన బల్బులు మాడి చెత్తబుట్టలో పడ్డాయి.చివరికి నాపాకేజే క్లాసులో టాప్ అందులో కోర్.
సెప్టెంబరు తొమ్మిది వైద్యపరీక్షలు. ముందు నోయిడాలో పవరు మానేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్‌లో నమోదుచేస్కొని అక్కడి నుంచి బదర్‌పూరు ప్లాంట్‌లోని ఆసుపత్రిలో పరీక్షలు. ఈప్రామ్తం నాకు ముందుగానే తెలుసు. ఆమద్యలో ఒక కంపెనీ చెప్పటం మర్చిపోయా. ఎయిర్ ఫ్లూయిడ్ అని ఒక కంపెనీ ఇంటర్వ్యూకి వచ్చా. కాకపోతే మొద సంవత్సరం జీతం చాలాతక్కువ అనేసరికే నేను రెండొసంవత్సరంలోనే చేరుతాలే అనిచెప్పి వచ్చేశా. అదీగాక ఎల్ అండ్ టీ వాళ్ల డిల్లీ ఆఫీసు ఇక్కడే ఉంది. ఇక పద్నాలుగో తేదీ సర్టిఫికేట్ల తనిఖీ.
16 సెప్టంబరు 2008 మామిడిపూడి సుబ్రహ్మణ్య చైతన్య నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ ( భారత ప్రభుత్వ రంగ సంస్థ) అనే నవరత్నలో కార్యనిర్వాహక శిక్షితుడుగా (ఎక్జిక్యూటివ్ ట్రైనీ) చేరాడు. నిన్నటికి ఒక సంవత్సరం.
ఎన్నోకొత్త విషయాలు నచ్చేవి (గుర్తుంచుకొని ఆచరిద్దాం అనుకొనేవి)- నచ్చనివి (అప్పుడే మర్చిపోయేందుకు యత్నించినవి), ఎంతోమంది కొత్తమనుషులు నచ్చినవాళ్లు (ఫోను నంబరు అడిగి తీస్కున్నా)- నచ్చనివాళ్లు( కనిపిస్తే ఒకనవ్వు), కొత్తప్రదేశాలు నచ్చినవి - నచ్చనివి, కొత్తపద్ధతులు నచ్చినవి (సరేచూద్దాం అనుకున్నా) - నచ్చనివి(వదిలేద్దామ్ అనుకున్నా) కొత్తకొత్తవి ఇంకెన్నో . మొత్తానికి కొత్తగా నాకునేను. ఇంటీకివెళ్తే చుట్టాల్లో కొత్తనేను. ఫోన్ చేస్తే స్నేహితులకి కొత్తనేను.
--
M.S.Chaithanya
101082
ET08 Civil
NTPC Singrauli
Shaktinagar
Sonabhadra UP 231222

అన్నప్రాశన

పుట్టినప్పటి నుంచి అమ్మ, అమ్మమ్మల దగ్గర. దాదాపూ ఎనిమిదో తరగతి దాకా అమ్మమ్మ దగ్గరే. ముందే చెప్పాకదా అమ్మమ్మ ఇల్లు- తాత బడి అని. ఇక ఊర్లోనే పిన్ని, అత్త, చిన్నమామ మొదలైన స్టాండ్‌బై ఆప్షన్లు. ఎప్పుడైనా అమ్మ ఊర్లో లేదంటె, ఎప్పుడో ఎలక్షను డ్యూటీమీద తప్ప ఆమె ఊరిని వదలదు, ఇన్ని ఇళ్లమద్య పెద్దగా లోటు తెలిసేదికాదు.

ఆమెచేతి ముద్దతింటూ అలాఅలా పెరిగి పెద్దైపోయా. మొదటిసారి ఇంటరు చదివేసి అల్లూరి సీతారామరాజులాగా దేశాకాలమాన పరిస్థితులు తెలుసుకుందామని నెల్లూరులో హాస్టల్లో చేరా. అక్కడ సత్రంభోజనం మఠంనిద్ర. మళ్లీ ఇంజనీరింగుకి ఊళ్లోనే. ఉదయాన్నే అన్నంబాక్సు పట్టుకుని జరుగుమల్లి-కొత్తపాళెం బస్సెక్కితే సాయంత్రం కాఫీకి కర్రీస్ మల్లాం. తరువాత కాన్‌పూర్లో, త్రిచీలో ఇంటరుకి డిటో. అక్కడి నుంచి పురుషుడను అని నిరూపించుకునేందుకు నోయిడా మీదుగా వారణాసిలో ఉద్యోగం. ఎక్కడికి వెళ్లినా మనకు తోడు నలుడు భీముడు వాళ్ల ఆర్కుట్ కమ్యూనిటీలోంచి ఎవరో ఒకడిని పంపుతూనే ఉన్నారు.


అసలు ఈకథ అంతా ఎందుకు అంటే... ఇన్ని సౌకర్యాల మద్య మనకు కాపసాశ్త్రంలో( దాని స్పెల్లింగుకూడా సరిగా రాదు) అదీ పారిస్థితి. వంటలో నాకొచ్చిందల్లా అమ్మ ఎప్పుడైన కుక్కర్‌లో అన్నీ పడేసి, వైయిట్ పెట్టి "ఒరెయ్ మూడు విజిల్లు సరేనా " అంటే కరక్టుగా లెక్కపెట్టి ఆపెయ్యటం.

వండడంలో కే.జీ దాటక పోయినా తినడంలో మాత్రం పీ.జీ. ఎవరు ఏది వండినా తప్పులెంచకుండా గిన్నెని ఖాళీచేసి కడుపునింపెయ్యగం. ఈవిషయంలో మామ్మకి నేనొక గుడ్‌బోయ్.

ఇక బ్లాగు లోకంలోకి వచ్చేసరికే నలభీములు, సునీతగారు ఎట్సెట్రా ఒక్కొక్క వంటా వర్ణిస్తుంటే చదివి కడుపునింపుకుంటున్నాను. ఈమద్య తృష్ణగారు కూడా పొయ్యిరాజేశారు. ఇంతలో మొన్న పాప ఆన్‌లైన్‌లో చిన్న షాకు. "అన్నా! (అదెప్పుడూ అలా పిలవదు. అలా ఊహించుకుంటుంటా. అందుకే ఆ ఆశ్చర్యార్ధకం.) నేనుకూడా బ్లాగు మొదలెట్టా. స్రవంతివటిల్లు అని."

అప్పుడనిపించింది ఇక్కడ ఏదో లెక్కతప్పుతోంది అని. తినేవాళ్లంతా వంటగాళ్లు కానక్ఖర్లేదు. కానీ వండేవాళ్ల్లంతా తినేవాళ్లే. అంటే తినేవాళ్లు యూనివర్సల్ సెట్ అయితే వండేవాళ్లు అందులో ఒక సబ్‌సెట్. వండేవాళ్లు ఎక్కువై తినేవాళ్లు తగ్గితే సమతుల్యం దెబ్బతింటుంది అందుకే ఈరోజు నుంచి వీలు చిక్కినప్పుడల్లా ఒక్కొక్క పదార్ధాన్ని ఎలా తినాలో రాయాలని డిసైడ్ అయిపోయా.
ఈరోజు అన్నప్రాశన( కాబట్టి ఆవకాయను పెట్టట్లేదు.)

  1. ముందు వేడివేడిగా ఆవిర్లువచ్చేప్పుడు(ఉఫూ ఉఫూ మంటూ ఊదుకుంటూ అయినా) అన్నాన్ని ప్లేటులో వేసుకోండి.
  2. కొద్దిగా వెన్నముద్దనిగానీ నెయ్యిని గానీ దాంట్లో వెయ్యండి. ఆవేడికే కరిగి అంతా కలిసిపోవాలి.
  3. ఇప్పుడు కొద్దిగా ఉప్పువెయ్యండి.అన్నం మరీ ముద్దగాకుండా పొడిపొడిగా కలపండి.
  4. వేడితగ్గి గోరువెచ్చగా అయినప్పుడు ముద్దలు చేస్కుని ప్లేటులో పెట్టుకోండి.
ఇప్పుడు అమ్మ లేదా అమ్మామ్మ లేదా నానమ్మ దగ్గర కూర్చోండి.
ఇప్పుడు మనకి ముద్దలు కలిపే ఓపిక వాళ్లకి ఉండదు కాబట్టే ఆరెడీమేడ్ ముద్దల సెట్టింగ్ అన్నమాట.
ఒక్కక్కొక్కటీ తీసుకుంటూ ఇది అమ్మముద్ద, ఇది నాన్నముద్ద, ఇది స్వర్ణముఖిముద్ద, ఇది నెమలికన్నుముద్ద అలాఅలా ఖాళీచేసేయ్యండి.
ఇంతకీ అమ్మావాళ్లను ఎందుకు పిలవమన్నట్టు అంటే పూర్తయ్యిన తరువాత కొంగుతో మూతి తుడుచుకోవాలిగా.
ఇప్పుడు అసలు డ్యూటీ.
పరుపుమీద ఎల్లకిలా పడుకుని పైన గిరగిరా తిరుగుతున్న తెల్లటి క్రాంప్టన్& గ్రీవ్స్ ఫాన్ వంకచూస్తూ నిద్దర్లోకి జారుకోవడం.

గురుభ్యోన్నమః

ఈ ప్రపంచంలో తల్లి తండ్రీ లేనివాడు మనకు ఎలాగైతే దొరకడో( వాళ్లెవరో తెలియనివాళ్లుంటారు గానీ లేనివారు ఉండరు.) గురువులేని వాడు దొరకడు. తల్లిదండ్రులు ఎవరికైనా మానవరూపాల్లోనే కనిపిస్తారు. కానీ గురువు మాత్రం అందరికీ ఆరూపంలే ఉండాలి అనిలేదు. ఎక్కువ మందికి లభించేది ఆరూపంలోనే అయినా కొందరికి ఈప్రకృతే గురువు. మరికొందరికి వాళ్ల అనుభవాలే గురువై పాఠాలు నేర్పితే ఇంకొందరికి స్వప్నదర్శనాలు. అతను త్రిగుణాత్మకుడు. సర్వధర్మాలకు, సర్వదేవతలకు, సర్వతీర్ధాలకు మూలం గురుపాదంగా భావించే భారత సంస్కృతి ఆయన గొప్పతనాన్ని ఎంతోఉన్నతంగా నిర్వచించింది.

మనిషి పుట్టిన తరువాత కొంతకాలానికి తల్లిదండ్రులను వదిలి విద్యకోసం ఆపై భుక్తికోసం దూరంగా ఉంటాడు. పెళ్లయి గృహస్థు, అటుపై వానప్రస్థం. లేదా అన్నీ త్యజించి సన్యాసిగా మారవచ్చు. మనిషిదేనినైనా త్యజించవచ్చుగానీ గురుపాదాన్ని మాత్రం కడవరకు స్మరించాలి. అంటే మనజీవితంలో మిగిలిన బంధాలన్నీ తాత్కాలికం. ఒక్క గురుపథం తప్ప.

గురువు నిర్వచనానికి విగ్రహరూపంగా, ఆస్థానానికి అలంకారంగా నిలిచినవాళ్లు మన పురాణాల్లోను, చరిత్రలోను ఎందరో మహానుభావులు. అలానే గురువు సూచించిన మార్గాన్ని పాటించి పునీతులైన మహనీయులు కోకొల్లలు. గురుశిష్యపరంపరకు ఆది మహదేవుడు. ఆయన ద్వారా విష్ణువు, బ్రహ్మ, శక్తి, పరాశరుడు, వ్యాసుడు అలానే శంకరభగవత్పాదులు మొదలైన వారు. వీరిద్వారా వ్యవస్థీకృతమైన గురుశిష్య పరంపర అత్యున్నతం, గంగాజలం, హిమశిఖరం, మహాసముద్రం. మనజాతికి జీవకొమ్మ.

ఆధునిక భారతంలో వారికి ప్రతిరూపంగా నిలిచిన వారిలో అగ్రగణ్యుడు రాధాకృష్ణన్. ఒక ఉపాధ్యాయుడు ప్రధమపౌరునిగా ఎదిగిన పరిణామం ప్రతివ్యక్తికి స్పూర్తిమంతం. విలువలతో కూడిన జీవితం, తర్కంతోనిండిన ఆలోచనలు, దూరదృష్టితో తీసుకొనే నిర్ణయాలు భావితరాలకు ఆయనను ఒక స్పూర్తిప్రదాతను చేశాయి. దేశంలోని ప్రతి ఉపాధ్యాయుడు తనవృత్తిని (బతకలేని బడిపంతులు అని హేళనచేసినా సరే) గర్వంగా చెప్పుకునేలా చేశాయి.
ఆర్ధశాస్త్రంలో పట్టాపుచ్చుకుందామన్న కోరిక. కావలసిన పుస్తకాలు కొనలేనిపేదరికం. విధి తత్వశాస్త్రంవైపు నడిపింది. దూరపు బందువు దగ్గర ఉన్న ఆపుస్తకాలే చదవాల్సి వచ్చింది. తరువాత కొంతకాలం బందరులో, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పనిచేసి తత్వవేత్తలకు పుట్టినిల్లైన బెంగాలుకి వెళ్ళారు. కలకత్తాలో ఉత్తరాది అహంభావుల మద్య తన విజ్ఞానాన్నే పెట్టుబడిగా తన సామర్ధ్యాన్ని నిరూపించుకున్నారు.

"మీవంటి మేధావి ఇక్కడకాక మాదేశంలో కనుక చదివి ఉంటే.." అన్న ఒక దొరగారికి "నిజమైన భారతీయుడు అక్కడికి విద్యను దానం చేయడానికి వస్తాడేగానీ బిచ్చమెత్తుకునేందుకు కాదు." అని చెప్పిన ఆయన తరువాతి కాలంలో ఆక్సుఫర్డుకి బోధకునిగా వెళ్లి తనమాటని నిలబెట్టుకున్నాడు. మదనమోహనమళవ్యా తన మానసపుత్రిక అయిన బెనారస్ హిందూవిశ్వవిద్యాలయానికి రూపమిచ్చేందుకు సహాయం కోరడంతో వయోభారాన్ని లెక్కచేయకుండా కలకత్తా విశ్వవిద్యాలయంలో పనిచేస్తూనే వారాంతాల్లో కాశీకి వెళ్ళి అక్కడి బాద్యతలను నెరవేర్చాడు.

స్వాతంత్ర్యానంతరం ఇక్కడి వ్యవస్థలను పునరుద్ధరించడానికి, ముఖ్యంగా విద్యావ్యవస్థ, ఆయన చేసినకృషి మరువలేనిది. ఆయన సూచనలను చాలాభాగం అమలుచేసినప్పటికీ కొన్నింటిని కేవలం రాజకీయ ప్రయోజనాలకోసం పక్కనబెట్టారు. అందులో ముఖ్యమైనది వేదగణితం. దానిలోని అంశాలను పాఠ్యాంశాలుగా పెట్టండి. లేని పక్షంలో ఆవిజ్ఞానం మరుగున పడిపోతుంది. తద్వారా జరిగేనష్టం కేవలం హిందువులకో, భారతీయులకో కాదు సమస్త మానవాళికి. అంటూ ఆయన చేసిన సూచన అరణ్యరోదన అయింది. ఇప్పుడు కొన్ని దశాబ్దాల తరువాత ఈతరానికి దాని మూలాలు లేకుండా పోయాయి. అయినా ఎవరికీ ఆనష్టం పట్టదు.

గురుశిష్యసంబంధాలను మెరుగుపరిచే గురుకుల వ్యవస్థను పునరిద్ధరించండి అన్నారు. అప్పటి ఆర్ధికస్థితి ప్రభుత్వానికి అనుకూలించలేదు. తరువాత కొంతకాలానికి మొదలుపెట్టినా ఆరంభశూరత్వమే అయింది. మతప్రాదికనదేశ విభజనను వ్యతిరేకించిన మేధావులను ఏకంచేసి ఆయన కొనసాగించిన ప్రయత్నాలు దురదృష్టవశాత్తూ సఫలంకాలేదు.
తన తల్లిదండ్రులనుంచి నేర్చుకొని జీవితాంతం ఆచరించిన భారతీయజీవన విధానం ప్రతి వ్యక్తికీ శిరోధార్యం. ఆయన జీవితంలో అనేకప్రాంతాలవారిని, మతధర్మాలను అనుసరించేవారిని, అనేక జాతీయులను కలిశారు. ఎక్కడా తనాచరించే ధర్మంలో ఎదుటివారు వేలుపెట్టి చూపలేని విధంగా జీవించారు. తత్వశాస్త్రంలో ఆయన రచించిన గ్రంధాలు మణిపూసలు. ప్రాశ్చాత్య ప్రపంచాన్ని భారతావనివైపు చూచేలాచేశాయి. భారతీయ తత్వశాస్త్రం ఆయన రచించిన గ్రంధాలలో ఉన్నతమైనది. భారతీయ సంస్కృతికి, అందులోని ఔన్నత్యానికి నిజమైన ప్రతినిధి భారతరత్న సర్వేపల్లి రాధాకృష్ణన్.

ఒకప్రశ్న

" అధ్యక్షా!" ఈమాట ఎవరు అన్నా వెంటనే గుర్తొచ్చే పేరది. కాకపోతే ఇప్పటిదాకా సరదాగా ఇకపై కొంతబరువుగా. శాసనసభలో స్పీకర్‌కి కొంతసమయం పడుతుంది సర్దుకొనేందుకు. ఇకపై తాము విమర్శలను సంధించాల్సిన వ్యక్తి వేరొకరు అంటే విపక్షనాయకులకీ ఈఇబ్బంది తప్పదనుకొంటా. ప్రజలు, అభిమానులు, కార్యకర్తల సంగతి సరేసరి. మీడియాకి కొద్దిగా మినహాయింపు.

నిన్న మద్యాహ్నం వరకు తెలియదునాకు. 3పైన అమ్మఫోన్ చేసి హెలికాప్టర్ దారితప్పిందనిచెప్పింది. అదేమీకాదులేమా అనిచెప్పాను. దారితప్పితే సమాచారం ఎలా తెలుస్తుంది, దాన్ని ఎలా నియంత్రిస్తారు వివరించేసరికే ఆమె కొంచెం కుదుటపడింది. అంతలో ఫ్రెండ్ ఒకడు ఫోన్ చేసి కొంచెం వివరంగా చెప్పాడు.
సాయంత్రం ఇంటికి వచ్చిచూస్తే ఇంకా గాలింపు అన్నారు. ఎదో అలజడి మనసులో.మళ్ళీ అమ్మఫోను. ఆయనభార్య గుర్తొస్తే మాత్రం అయనకేమీ కాకూడదు అనికొరుకుంటోంది మనసు. చాలా మంచావిడ. తానునమ్మిన దేవుడిని ఎప్పుడూ మరవలేదు. అంత పెద్దింటికోడలైనా, భర్త ముఖ్యమంత్రైనా ఎప్పుడూ అహంభావం చూడలేదు ఆమెకళ్లలో. రాత్రంతా ఫోన్లు. అధికారులకి కునుకులేదు. మీడియా వేడివేడి వ్యాపారాలతో బిజీ. నాయకులు వంతులేస్కొని శోకాలు( గ్లిజరిన్ లేకుండా). ఎవరి లెక్కలు వాళ్లవి. సీటుకోసం రాత్రి ఎన్ని సిట్టింగులు జరిగాయో? ఒక కాళరాత్రి అలా దొల్లుకొంటూ పోయింది.

సూర్యుడితోగూడ మనసుల్లో ఆశ చిగురించింది. ఎమైనా తెలిసిందా అని నిద్రకళ్లతోనే టీవీలముందు. ఒక్క ప్రకటన ఆశలన్నింటినీ చిదిమేసింది. ఎక్కడో మనసులో వెలితి, ఏదోకోల్పోయామన్న బాధ, గుండెబరువు ఎంతో తెలిసొచ్చిన క్షణాలు. విన్న తరువాతకూడా కళ్లుమూస్కొంటే సాక్షాత్కారం అవుతున్న చిరునవ్వు. మొత్తం ఐదుమంది అన్నారు. ఇద్దరు పైలెట్లు. వాళ్లు శిక్షణాసమయంలోనే వీటికి సిద్ధపడతారు. సెక్యూరిటీ ఆఫీసరు ఒకరు. ఈయన వృత్తికూడా అలాంటిదే. వై. ఎస్. తన ఫాక్షనిస్ట్ అనుభవాలతో మనసు సిద్ధపడిపోయి ఉంటుంది. ఇక మిగిలింది సుబ్రహ్మణ్యం. పాపం ఆయన ఊహించనిది. ఒక కార్యదర్శిగా ముఖ్యమంత్రితోకూడా హెలికాప్టరు ఎక్కుతున్నాం అనేది హోదాగా ఊహించుకొనే వృత్తి.

ఇంతలో మళ్లీ మొదలయ్యాయి వీధినాటకాలు. మీడియా నాలుగు సినిమా పాటలతో, ఎస్సెమ్మెస్‌లతో శవం మీద చిల్లర ఏరుకుంటుంది. నాయకులు శోకాలు ఢిల్లీకి వినిపించాయి. సీటుకావలనేవారు గుట్టుగా బేరాలు. మనకు అంతలేదులే అనుకొనేవాళ్లు "జగన్" (కనీసం మంత్రిపదవైనా దక్కుతుందని.) ఆమాద్మీ మాత్రం తమ నాయకుడిని తలుస్తూ కళ్ళొత్తుకుంటున్నాడు. ఇప్పుడు ఆయన పైన వచ్చిన విమర్శలేవీ గుర్తులేవు, తానేపార్టీయోకూడా మరిచాడు, మొన్న ఓటు ఎవరికివేశాడొ ఆలోచించాల్సిన అవసరం లేదనుకొన్నాడు.

రాజరెడ్డివాళ్ల అబ్బాయి, డాక్టరు రాజయ్య, ఎమ్మెల్యే రాజశేఖరరెడ్డి, కడప ఎంపీ వై. ఎస్., ప్రతిపక్షనాయకుడు వై. ఎస్., ముఖ్యమంత్రి ఎదుగూరి సందింటి రాజశేఖర్ రెడ్డి వీటిని ఉత్సాహంగా పలికిన నాలుక ఇప్పుడు ఆపేరు ముందు వేరొకటి పెట్టాలి అంటే తడబడుతోంది. ఆమహాతల్లి ని బొట్టులేకుండా చూడాలంటే ఆఊరోళ్లకి ఎంత ఇబ్బందో?
ఎక్కడైనా అల్లర్లు లెస్తాయేమో (ఎవరైనా లేపుతారేమో.) అధికారుల్లో అలజడి. ఇంత ఉద్రిక్త పరిస్థితుల్లోనూ శాంతిభద్రతలను అదుపులో ఉంచిన యంత్రాగం నిజంగా అభినందనీయులు. ఎదైనా తప్పుజరిగితేనే వీళ్లు గుర్తొస్తారు మనకు. ఇలా చక్కబెట్టినప్పుడు ఎవరూ పట్టించుకోరు.

ఆఊరికోసం (ఈరోజుల్లో కనీసం సొంత ఊరి గురించి ఆలోచించేవాళ్లు ఎంత మంది.), దానిబాగు కోసం ఎన్నికలలు కన్నాడో. ఆయనకి మునుపు ఆప్రాంతాన్ని పట్టించుకొన్న నాధుడేలేడు. ఇక భవిష్యత్తుకూడా అంతేనేమో.
పార్టీవిషయానికి వస్తే, నేనుగెలిపిస్తా అని పలకగల్గిన ఖలేజా ఎవరికి ఉంది? 2014లో రాహుల్ ప్రధాని అవ్వాలంటే ఆంధ్ర ఎంతముఖ్యమో తెలిసిందే. మరి అప్పటికి ఎవరిపై ఆధారపడాలి? మొన్న ఎలక్షన్లలో వై.ఎస్.ని చూసి ఎంతమంది ఓటేశారు? సోనియాని, రాహుల్‌ని చూసి ఎంతమంది ఓటెశారు?

ప్రభుత్వంవిషయంలో పరిస్థితి ఇంకా దారుణం. అంతపెద్ద ప్రణాళికలు, ప్రాజెక్టులు, పధకాలు నిర్వహించాలంటే మాటలుకాదు. అన్నింటికంటే ప్రధానమైంది ప్రాజెక్టుల్లో అవినీతి. ఇప్పటిదాకా ఇచ్చిన మామూళ్లు చెల్లవు. దందాలు మళ్లీ మొదటికి వస్తాయి. చాలవరకు ప్రాజెక్టులు ఆలస్యం అవడానికి కారణం అదే. ఒకరొచ్చి మొదలు పెడతారు. పర్సంటేజీలు లెక్కేసుకొని పంచేసుకొంటారు. ఇంతలో ప్రభుత్వం మారటం. మళ్లీ బేతాళుడు చెట్టెక్కడం. ఇదంతా సర్దాలి, ఆరోపణల్ని కోర్టుల్లో, శాసనసభలో ఎదుర్కోవాలి. ఇంతదాకా కుక్కిన పేనుల్లా ఉన్న అసమ్మతి ఇక బుసలుకొడుతుంది. అధిష్టానం దగ్గర మాటనెగ్గించుకోగల పట్టు ఎవరిదగ్గర ఉంది?

కాలం తనపంధా కొనసాగిస్తుంది. తనదైన శైలిలో జవాబు చెప్తుంది. ఇప్పుడుమాత్రం తనమౌనరూపాన్ని నిశిరాత్రిలాగా భరించి, రేపటిసూర్యుడికోసం ఎదురుచూడాలి. ఐతే కుటుంబపెద్దగా ఆయనలేమిని అందరికంటే ఎక్కువ అనుభవించేది భార్యాబిడ్డలే. ఆకాలందగ్గర జవాబు దొరకనిప్రశ్న వాళ్లదగ్గర ఒకటి ఉంది.