శబరి ఎంగిలి ఆరాముడు ఒక్కసారి తింటే మారాముడుమాత్రం మాఎంగిలి ప్రతివారం తినేవాడు.
మాతాతకి (అమ్మనాన్న) ఆయన తండ్రిద్వారా రామమందిరంలో అర్చకత్వం లభించింది. దాంట్లో నాచిన్నప్పుడు ప్రతిశనివారం భజన అనే బృహత్తరకార్యక్రమం జరిగేది. ఆభజనకి మాతాత, వెంకట్రామశెట్టీ (హార్మోనియం), సుబ్బులుశెట్టి (మృదంగం), ఇంకా బ్యాంకు మస్తానయ్య, పాలశివయ్య, చెంచయ్య ఇలా ప్రత్యేక ఆహ్వానితులు. అక్కడ తాళాలు ( అంటే గొళ్లెంపెట్టేవి కాదు. అదొక వాద్యం) వాయించాలంటే సీనియారిటీ ఉండాలి. మనలాంటి పిల్లబ్యాచీకి దొరకవు. వాటిపక్క "ఆ..!" అంటూ చూసుకుంటూ చేతులతోనే కొట్టుకునేవాళ్లం.మరోవిషయం ఏవిటంటే పాడేవాళ్లకి కొన్నిపాటలపై పేటేంటుహక్కులు ఉంటాయి. వాటిని వారికే సొంతమైన హావభావాలను చూపిస్తూ, గమకాలను ఇరికిస్తూ, కొన్నిలైన్లను మళ్లీమళ్లీ పాడుతూ అంటే రామదాసు కీర్తనల్లో "యెవడబ్బా సొమ్మని రామచంద్రా!" అని తిట్టి తరువాత సముదాయించడం, "ఉన్నావా? అసలున్నావా?.. " అని ఆయన ఉనికినే ప్రశ్నించడంలాంటివి. వాటిని వేరేవాళ్లెవరైనా పాడితే మనోభావాలు దెబ్బతింటాయి. కొన్నిసార్లు ఈతగాదాలు తీర్చేందుకు అయోద్యనుంచి అయ్యవారే దిగివచ్చేలా సాగేవి.
అన్నిపాటల్లోకి మనకు బాగా నచ్చేది "పవమాన సుతుడుపట్టు పాదారవిందమునకు నీనామరూపమునకు నిత్యజయమంగళం...సాకేతపురనివాస ..ప్రహ్లాదనారదాది భక్తూలు పొగడుచున్న నీనామరూపమునకు నిత్యజయమంగళం." ఎందుకంటే ఈమంగళంపాడితే తర్వాత ప్రసాదాలే. మరి భజన అన్నపదం వింటే బ్యాక్‌గ్రౌండ్‌లో ప్రసాదం అనే పదం వినపడుతుంది కదా.
శనివారం సాయంత్రం దాన్ని తయారుచేసే పని అమ్మమ్మది. మొదట్లో అలసందులు ఉడికించేది. భలే ఉండేవి. కానీ తర్వాత గుగ్గిళ్లకి మెనూ మార్చేశారు. ఆరాముడేమో ఏదిపెట్టినా ఫీలవ్వడు. కానీ *తోకలేని*వాడిని నాబాధ ఎవ్వడికి చెప్పుకోను. రాత్రి ఎనిమిదికి మొదలవ్వుతుంది భజన. ఈప్రసాదం మాత్రం ఆరోగంటకల్లా పూర్తయి "వారాయ్..!" అని పిలుస్తూ ఉంటుంది. తాతేమో దానిపక్క చూసినా ఒప్పుకోడు. కానీ హోమ్‌మినిష్టర్ మాత్రం రాజ్యాంగ సవరణలు పెడుతుంది. ఆయనకాదనడు. లేడు. అంటే ఇక హోంరూల్ వచ్చేస్తుంది.
ఇక్కడ అమ్మమ్మగురించి కొద్దిగా వివరించడానికి ప్రయత్నిస్తా. (చిన్న ప్రయత్నం మాత్రమే.) భారతదేశంలో పిల్లలహక్కుల గురించి పోరాడేవాళ్లు, వాళ్లగురించి రాసేవాళ్లు ఈవిడని పట్టించుకోలేదు అనిపిస్తుంది నాకు. పిల్లలకు పెద్దలకు తేడా చూపకుండా అందరికీ చిక్కటి కాఫీనే ఇస్తుంది. ఈఒక్కటి చాలనుకుంటా మీకు. ఆమె ఉద్దేశ్యంలో పిల్లాడు పదోఏడు వచ్చేవరకు చదువులు, పలక-బలపం, హోంవర్కు ఇలాటివి ఆలోచించకూడదు. అప్పటివరకు కడుపునిండా పాలుతాగి. కంటినిండా నిద్రపొయ్యి రోజులో ఇంకా గంటో అరగంటో మిగిలితే ఊరిమీద ఊరేగాలి. ఇలా పదేళ్లు గడిపిన తర్వాత ఇకచాలు అని పిల్లవాడు స్వచ్చందంగా ఒప్పుకుంటే అప్పుడు బడికి పంపాలి. ఒకవేళవాడు కాదుకూడదు అంటే వాడు ఒప్పుకునేంత వరకు బలవంత పెట్టకూడదు. బాలకార్మికవ్యవస్థనైనా ఒప్పుకుంటుంది కానీ బాలవిధ్యావ్యవస్థను ఉపేక్షించలేదు.
ఇలాంటి మహామనీషి నేను అలా ప్రసాదం (సారీ అప్పుడది నైవేద్యం. పూజయినాకే ప్రసాదంగా మారుతుంది.) వంక చూస్తుంటే తట్టుకోగలదా. తాత అలా బయటికి వెళ్ళడంతోటే నాకోగిన్నెలో పోసి "తొందరగా కానీరా." అనేసి వెళ్లిపోయేది తలుపు దగ్గరికి. ఆసమయానికి నాఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్లకీ ఓపిడికెడు.
అలా అలా వారాలు దొర్లిపోతుంటే ఒకబలహీన సమయంలో తాత కంటపడింది ఈదృశ్యం. " సాయంత్రం అనంగా నేను చేస్తే రాత్రి ఎనిమిది దాకా మొదలు పెట్టరు. ఆతర్వాత ఒకటిన్నరగంటకి మీభజనలు పూర్తయితే అప్పటిదాకా అలమటించాలా పిలకాయలు. వీళ్లని పస్తుంచి ఆయనకి పెట్టమన్నాడా ఆరాముడు. (పాపం తాతకి రాముడితో డైరెక్టు కాంటాక్ట్స్ లేవు. ఆయన అభిప్రాయం కనుక్కుందాం అంటే.) మీరూ మీభజనలూ. దానికి మళ్లీప్రసాదాలూ. అవి తాక్కూడదని పిల్లలకి పస్తులూ.... " ఇలా ఇంకా ఏవేవో న్యాయపరమైన, ధర్మసకంటం కలిగింఛే ప్రశ్నలు వదిలేసరికే తాత మ్యూట్ బటను నొక్కేశాడు.
ఇక కార్తీకమాసం వస్తే మొదలయ్యే సీజను అక్కడినుంచి స్వాములు ఇరుముడికట్టుకుని బస్సెక్కేదాకా ఉంటుంది. మొదట్లో ఈభజనలుకూడా మామందిరంలోనే జరిగేవి. తర్వాత హౌస్‌ఫుల్ కావడంతో అలఘనాథస్వామిగుడి కళ్యాణమండపానికి మారింది. ఇక్కడ పాట మారింది. "సత్యముజ్యోతిగ వెలుగునయా.." మొదలవడంతోనే త్రిశూలం సినిమాలో "సుప్రభాతం..సుప్రభాతం" అని కృష్ణంరాజు పాడడంతోనే గోడలుదూకుతూ పరిగెత్తే పిల్లల్లా వచ్చేవాళ్లం. తర్వాత శరణాలు, స్వాములకి భిక్ష. వెంటనే మనకు టిఫిను( మాపిన్నికొడుకు దాన్ని అలానే పిలిచేవాడు.) ఇక్కడ మరో అట్రాక్షన్ పాటలు. సినిమా అలా రిలీజయ్యిందోలేదో దానికి రీమిక్సుకొట్టి మద్యలో అక్కడక్కడా శరణాలు ఇరికిచ్చి వాళ్లుచేసే విన్యాసాలు అసలుపాటను మరిపించేస్తాయి. ఈసారి మగధీర, జోష్ రీమిక్సులు ఎలా ఉన్నాయో? ఎమో?
సోదరా! చిన్ననాటి స్మృతులు గుర్తుకు తెచ్చావు. నా చిన్నప్పుడు, బెజవాడ శైలజ ధియేటర్ ఓనరు, మా ఇంటి ఎదురుకుండా, ప్రతీ సంవత్సరం కార్తీక మాసంలో, అయ్యప స్వామి భజన పెట్టేవాడు. అందులో కూడా, సినిమా పాటలు రీమిక్స్ పెట్టి పాడేవాళ్ళు. భజన తరువాత, బిక్ష కోసం మేము ముందరే భోజనం చేసేసి ఎదురుచూసేవాళ్ళం.(రాత్రి రెండో రౌండ్ అన్నమాట!). అలానే మెహెర్ బాబా భజనల్లో కూడా, ప్రసాదాలు, బాగా చేసేవాళ్ళు.
ReplyDeleteమీ అమ్మమ్మగారికి జై!
ReplyDeleteప్రసాదాలు భోజనం చెసేవారన్నమాట. హన్నా!! తప్పుకాదుట్రా అబ్బిగా??
ReplyDelete"వీళ్లని పస్తుంచి ఆయనకి పెట్టమన్నాడా ఆరాముడు." same to same డవిలాగులు మా అమ్మమ్మ నుండి కూడా వచ్చేవి.
ReplyDeleteశ్రీరమణ గారి కథ చదివినట్టుంది..బావున్నాయ్ మీ జ్ఞాపకాలు
ReplyDeleteబాగుంది. బాగుంది.
ReplyDeleteఈ పాలెప్పుడన్నా మీ ఇంటో భజనా గట్టా పెడితే మమ్మల్నికూడా తోడు తీసుకెళ్లాల. అందరం కలిసి ఆరగిద్దాం
అమ్మమ్మకి జై జై లు. :):)
బావున్నాయ్ మీ జ్ఞాపకాలు.
ReplyDeleteమీ అమ్మమ్మగారెంత గొప్ప మనిషండీ... యెంత అదృష్టవంతులు మీరు?? అన్నట్టు మా చిన్నప్పుడు నేనూ భజనళ్లాల్లాను.. తాళాలు వాయించాను.. మామూలుగా అయితే పిల్లల చేతికి రావు కానీ నేను కొంచం స్పెషల్ కదా మరి... అప్పట్లో ప్రసాదం అంటే నానబెట్టిన అటుకులు, కొబ్బరి, బెల్లం.. పెద్ద ఎట్రాక్షన్ ఉండేది కాదు కానీ మధ్యలో టీ ఇచ్చేవాళ్ళు (మా ఊళ్ళో భజన కనీసం మూడు గంటలు!!) అది మాత్రం భలేగా ఉండేది.. నన్ను ఎక్కడితో తీసుకుపోయారు మీరు..
ReplyDeleteమీ అమ్మమ్మగారు జిందాబాద్!
ReplyDeleteముందుగా మాఅమ్మమ్మకి 'జై'కొట్టినోళ్లందరికీ నేనుకూడా 'జై'.
ReplyDelete@ గణేష్, రాణీ, అజ్ఞాత, ఉమాశంకర్, సునీత, కొత్తపాళీ: ధన్యవాదాలు
@ భాస్కరన్న: ఇందులో తర్కానికి తావులేదు. ముందు ఆత్మారాముడు ఆతర్వాతనే అయోధ్యారాముడు.
@ విశ్వప్రేమికుడు: తప్పకుండా. భజనకుముందు టపారాస్తాను. వచ్చేద్దురుకానీ. కానీ ప్రసాదం మాత్రం భజన తర్వాతే.
@ మురళి: మరే నాసుడి గురించి ఇంతకుముందే చెప్పాకదా. నాకూ ఇచ్చేవారండీ తాళాలు. కానీ ఎవరైనా లేటుగా వచ్చినోళ్లు తీస్కునేసేవారు. మొదట్లో దాదాపుగా మూడుగంటలు ఉండేది. ఏడుకి మొదలయ్యి పదిదాకా. అందుకే అమ్మమ్మకి త్వరగా తయారుచెయ్యటం అలవాటైంది. తర్వాత 'బిజినెస్‌అవర్స్' తగ్గించారు.
ఇక ఆలశ్యందేనికి అక్కడే ఉండి ఓటపా పెడితే దాని అక్షరాలు పట్టుకుని పాక్కుంటూ మేమూ అక్కడికి వచ్చేస్తాం.
చాలా బాగా రాసావు. నీకు ప్రసాదాల మీద అంత ఆసక్తి ఎందుకో ఇప్పిడర్ధమైంది. రాస్తు ఉండు...
ReplyDeleteసినిమా పాటల బాణీలతో చేసే భక్తి పాటలు నాకస్సలు ఇష్టం ఉండవు. ఆ పాటలు వింటూంటే భక్తి కన్నా సినిమా లిరిక్కే గుర్తువస్తుంది.
ur taking me into my childhood..keep posting..n thanks to grand maa
ReplyDelete