విధిబలీయమైనది బాబయ్యా

ఉదయాన్నే లేచా .

పళ్లుతొముకొని రోడ్డుమీద పడ్డా.

అలాకాళ్లీడ్చుకొంటూ పోయి షాపు వాకిట్లో ఆగా.

కళ్లు ఎగరేసాడు 250గ్రా. ఇండెంట్ పెట్టాను.

మరీ తక్కువేమో అన్నాడు. 300గ్రా. చేశా. ఉదయానే సావుబేరం అని నసుగుతూ సర్లే అని సర్దుకొన్నాడు.

కుర్చీలో కూలబడ్డా. కొంచెం సేపటికి నిద్రపట్టేసింది. కొంచెం సుఖంగా అనిపించింది.

సడెన్‌గా కళ్లు తెరిచిచూసేసరికే ఘోరం జరిగిపోయింది.
దిక్కుమాలినోడు 300 తీస్కోమంటే అరకిలో తీసుకొన్నాడు.
వచ్చే వారంలో ఇద్దరి పెళ్లిళ్ళు ఉన్నాయి. వెళ్ల్లాలా? వద్దా? ఒకవేళ వెళ్లినా అక్కడ వీడియోవాడి కళ్లలో పడకూడదు.


విధిబలీయమైనది బాబయ్యా విధిబలీయమైనది

జలము-ద్రవ్యరాశి

యజుర్వేదంలో చెప్పబడిన ప్రకారం:
ఆకాశాత్పతితంతోయం యధాగచ్ఛతి సాగరం
సర్వదేవనమస్కారహ కేశవం ప్రతిగచ్చతి

దీనిభావం: అకాశమ్నుంచి వర్షించే ప్రతినీటిచుక్క ఎలాగైతే వివిధమార్గాలగుండా ప్రయాణించి చివరికి సాగరాన్ని చేరుతుందో మనం ఏరూపాన్ని ధ్యానంచేస్తూ నమస్కరించినా అది ఆకేశవునికే చెందుతుంది.

భూమిపైన వర్షించేనీరు మేఘాలు సాగరానమునుంచి స్వీకరిస్తుంది. ఆనీటిలో కొంతభాగం నదుల ఉపరితలంలో ప్రవహిస్తే, మరికొంతభాగం అంతర్వాహినిగా తనగమనాన్ని కొనసాగిస్తుంది. ఇంకొంతభాగం భూగర్భంలో నిలువ ఉన్నప్పటికీ ఆస్థితి శాశ్వతంకాదు. కొంతకాలానికి నెమ్మదిగా భూగర్భంగుండా సాగరాన్ని చేరుకోవలసిందే. ఉపరితలంలో ఉన్ననీటిలో కొంతభాగం ఆవిరైనప్పటికీ అది తిరిగి ద్రవీభవించి కిందైనా పడాలి లేదా మేఘాలలో ఐనా కలవాలి. అంటే భూమిపై ఆవరించి ఉన్న వాతావరణాన్ని ఒక వ్యవస్థ పరిగణిస్తే అందులో ఉన్న నీటిపరిమాణం స్థిరం.

ద్రవ్యనిత్యత్వ నియమము:

ఒకవ్యవస్థలోని ద్రవ్యరాశి, అందులో చోటుచేసుకొనే చర్యలతో నిమిత్తంలేకుండా, స్థిరము. దానిని ఒకస్థానమునుంచి మరొకస్థానికి, ఒకరూపమునుంచి మరొకరూపానికి మార్చగలమే కానీ నాశనంచేయటంకానీ సృష్టించటంకానీ చెయ్యలేము. కానీ ఈనియమాన్ని నిర్వచించినప్పుడు కొంతమంది శాస్త్రవేత్తలు, ముఖ్యంగా సాపేక్షసిద్ధాంతంపై, క్వాంటంసిద్ధాంతంపై పరిశొధనచేసేవారు, వ్యతిరేకించారు. ద్రవ్యరాశి -పదార్ధం మద్య కొంత సంఘర్షణ చోటుచేసుకొంది. ఎలక్ట్రాన్ వంటి భారరహిత పదార్ధాలు వ్యవస్థకు శక్తితోపాటు కొంత ద్రవ్యరాశిని కూడ అందజేస్తాయి అన్నది వీళ్లవాదన. ఈవివాదానికి కారణం వాళ్లు ద్రవ్య్రాశిని శక్తిని విడివిడిగా, పరస్పరం ఎలాంటి సంబంధంలేని రాశులుగా పరిగణించారు.

ఈసమస్యను పైన చెప్పిన శ్లోకంలోని రెండవ వాక్యం పూర్తిచేస్తుంది. అంటే నమస్కారం అనేది శక్తికి ప్రతిరూపంగా భావించి, ద్రవ్యరాశితోపాటుగా శక్తికిగల సంబంధాన్ని వివరించారు.

ఆత్మ-శక్తి

అలవాటు ప్రకారం ఈరోజు కూడలిలో ఉన్న టపాలను చూస్తున్నాను. అందులో ఒకటి కొంత ఇబ్బంది పెట్టింది. వాళ్లను వ్యక్తిగతంగా ప్రశ్నించే హక్కునాకు లేదు. ఎందుకంటే అదివాళ్ల బ్లాగు. పూర్తిగా వాళ్లకు సొంతం. అక్కడ అనవసరమైన వ్యాఖ్యలు రాయటం వాళ్లతో వ్యక్తిగతంగా ఘర్షణకు దారితీస్తుంది అని భావించి అక్కడ రాయలేదు. ఇది నాబ్లాగు కాబట్టి నా అభిప్రాయాలను రాస్తున్నాను.

భగవద్గీత

అధ్యాయం 2: సాంఖ్యయోగము 22వ శ్లోకం

వాసాంసి జీర్ణాని యథా విహాయనవాణి గృహ్ణాతి నరోపరాణి

తథా శరీరాణి విహాయ జీర్ణా న్యన్యాని సమ్యాతి నవాని దేహి


అధ్యాయం 2: సాంఖ్యయోగము 23వ శ్లోకం

నైనం ఛిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః

న చైనం క్లేదయంత్యాపోన శోషయతి మారుతః

పైరెండింటి అర్ధాలు చాలా మందికి తెలుసు. క్లుప్తంగా చెప్పాలంటే " ఆత్మను సృష్టించలేము. నాశనము చెయ్యలేము. అది ఒక రూపమును వదిలి మరొక రూపమునకు మారుతూ ఉంటుంది."


ఆధునిక శాస్త్రాలను అనుసరించి:


శక్తినిత్యత్వ నియమము:

ఒక వ్యవస్థలోని శక్థి స్థిరం.దానిని సృష్టించలేము. నాశనము చేయలేము. అది ఒక రూపము నుంచి మరొక రూపానికి మారుతూ ఉంటుంది.

పైరెంటిలోని సారూప్యతను అర్థం చేసుకొనేందుకు పెద్దగా కష్టంకాదు అనుకొంటా.

ఏమతం గుడ్డిగా తనధర్మాన్ని పాటించండి అని చెప్పదు. సైన్సులో ఎంత తర్కం ఉందొ దానిలో అంతకుమించిన ధర్మ సూక్ష్మాలు ఉంటాయి. దాన్ని అర్ధం చేసుకోలేకపొతే మనలోపమే. అందుకు మతాన్ని తక్కువచేయటం ఎందుకు? ఇప్పుడు మనం సైన్సు అని పిలుచుకుంటూ చదువుకొంటున్న సైన్సు పుట్టి మహా అయితే 800 సంవత్సరాలు. మరి అంతకుముందు మనిషి జీవితంలో ఉన్నతమైన ప్రమాణాలులేవా ?

చెల్లెలి స్నేహం- అమ్మమ్మ నొప్పులు

మా ఇంట్లోంచి కెవ్వుమని కేక వినిపిస్తే పక్కింటోళ్లు కారణమేందో ఊహించడానికి పెద్దసమయం తీసుకోరు. తొంభైశాతం దానికి కారణం మాచెల్లి ఏపామునో తేలునో చూసుంటుంది. అదేంటోగాని పాకేజంతువులేవైనా తనని వెతుక్కొంటూ వచ్చేవి. నల్లకీచో తేలో కనీసం నెలకొకసారైనా పలకరించకపోతే మనకి వారంరోజులు కూడలిపక్క రాకపోతే ఎంత బాధపడుతామో అంతకంటే ఎక్కువ విలపిస్తాయి. పరుపుమడతల్లొనో, రోలువెనకాలో, టాయిలెట్లలోనొ హెల్లొ అనకపోతే దిగులుపడేవి. అదేంటొ మాకు ఎవ్వరికీ కనిపించమన్నా కనిపించవు.
ఒకసారి అమ్మ ఇంట్లోంచి సందులోకి వెళ్తుంటే వెనకాలే వెళ్లింది. ఉన్నట్టుండి కెవ్వ్.అమ్మకు కనిపించలేదు గానీ ఇదిమాత్రం తోకను చూసేసింది. ఈమద్యే పెల్లైంది. అత్తారింటికివెళ్లిన వారానికి అడ్రస్ వెతుక్కొంటూ వచ్చేసింది ఒకపిల్లపాము. వాళ్లకి కొత్తకదా పాపం బాగ గాబరాపడ్డారు. వెంటనే వాళ్లమామగారు "అమ్మాయీ ప్రతినెలా కాలాస్త్రికివెళ్లి పూజచెస్కొనిరా " అన్నాడు. ఇలా ఎందుకో కొంతమందిపై వాటికి అలా ప్రేమ- అభిమానం- ఆప్యాయత తన్నుకొస్తుంటాయి. ఈమద్య ఇక్కడ వర్షాలు మొదలయ్యాయి. తొలకర్లు పడేప్పుడు కలుగులో ఉక్కపోత భరించలేక బయటకి వస్తుంటాయి. ఇక్కడ కొంచెం ఎక్కువగా వస్తుంటాయి. రెగ్యులర్గా వాకింగ్ చేసే పాములు, షాపింగ్ చేసే పాముల్ని చూస్తున్నా ఇక్కడ. మూడురోజులుగా ఒకపిల్లపాము మాదగ్గరికి సాయంత్రం 7పైన వస్తుంది. పచ్చ పచ్చగా దానిపై ముక్కుపొడిరంగు టాటూలు వేస్కొని భలేముద్దొస్తోంది బుజ్జిముండ. మా వివేక్‌గాడు దానికి 'చింటూ' అనిపేరుకూడా పెట్టేశాడు.

మా అమ్మమ్మ గురించి రాయాలి అంటే నేనువేరే బ్లాగు తెరిచి రోజుకో టపారాసినా రామానందసాగర్ సీరియళ్లలా సంవత్సరాల తరబడి సాగుతుంది. దాదాపు 8వతరగతి వరకు అమ్మమ్మదగ్గరే ఉన్నాను. చిన్నప్పటినుంచి తాతదగ్గరే చదువుకొన్నాను కాబట్టి తాతబడి-అమ్మమ్మ ఇళ్లు. నేను పుట్టకముందు ఆమెకి ఆరోగ్యంబాలేక చాలాకాలం అవస్థలు పడింది. తరువాత కోలుకొంది. అంతాబానే ఉంటుందికానీ మందులుమింగేది కాదు. "డాక్టరు వేస్కోమన్నాడు" అని తాత అంటే "వాడా ఆవెధవ హస్తవాసి మంచిదికాదు. నాకు ఎమిబాలేదో వాడిమొహం వాడికేమి తెలుసు." అనేది. ఎక్కువ వాదిస్తే "అసలువాడు నిజం డాక్టరుకాదు. వాడు దొంగసర్టిఫికేట్లతో వైద్యం చేస్తున్నాడు. ఏదో ఒకరోజు పోలీసులు వాడిని కటకటాల్లో(చిన్నప్పుడు ఈపదం నాకు అర్ధం అయ్యేదికాదు.) తోస్తారు" అని శపించేది. తరువాత కొంతకాలానికి మాఊరికి ప్రసన్నకుమార్ (ఈనకి 6వేళ్లు ఉండేవి ఒకచేతికి. ఆరేళ్లడాక్టరు అనిపిలిచేవాళ్లు. కొంతకాలానికి ఆర్.ఎల్ డాక్టరుగా మారిపోయింది.) అనే ఆయన వచ్చాడు. మాఊరి జనార్ధనరెడ్డి ముఖ్యమంత్రి కావటంతో ఆయన్ని ప్రత్యేకంగా పిలిపించారు మాఊరికి. ఇప్పుడు నింస్‌లో ఉన్నారు. ఇక ఆమెకి మందులు వేసుకోక తప్పేదికాదు. కొంతకాలానికి మందులషాపు మీద మొదలుఎట్టింది. "డాక్టరు మంచిమందులు రాస్తున్నాడు గాని వాడు వేరేమందులు ఇస్తున్నాడు. అవినకిలీవి. ఆడాక్టరు చేతిరాత అర్ధంకాదు వీడు ఇచ్చేవి నిజం మందులో కాదో చూద్దామంటె. కాబట్టి నేనువేస్కోను." మందులువేస్కుంటుందోలేదో చూస్తారని వాటిని ఎక్కడోదాచిపెట్టి వేస్కున్నానేది.
ఇంతజరుగుతున్నా ఒకటి మాత్రం ఒక్కరోజు మిస్సైనా ఒప్పుకోదు. ప్రతిరోజూ ఊరిప్రజలు ఆమె ఆరోగ్యంగురించి కొంచెంసేపు మాట్లడి అయ్యో సుశీలమ్మా నీకుకాకపోతే ఇన్నిబాధలు. ఎలాభరిస్తున్నావమ్మా అంటూ ఆదరించి పోవాలి. ఎవడైనా కొంతకాలం రాలేదంటే తరువాత చిక్కినప్పుడు అయిపోయాడే. నేను ఎప్పుడైనా ఆమెదగ్గరికి వెళ్లి మాట్లాడకపోతే అమ్మ దగ్గర "వాడిని నేను ఎలా చూసుకొన్నాను. ఎలా సాకాను. ఇదానాకు మిగిలింది." అంటూ పాపం అమ్మ బుక్కైపోయేది.
ఇంతమందిలో చెంచయ్య అనే వ్యక్తి ఉండేవాడూ. " అమ్మా! ఈఊరినిండా ఇంత మంది ముదనష్టపు ముండాకొడుకులు ఉంటె ఆదిక్కుమాలిన జబ్బులు నీకేరావాలా. అన్నపూర్ణమ్మ తల్లిలాంటివి నీకేందమ్మా ఇన్ని కష్టాలు. అయ్యో! ఇంకెందుకు నేపోతా. కొంచేం నెయ్యి ఉంటే పెట్టుతల్లీ." ఈమెదగ్గర్నించి అలాంటివి వసూలుచేస్కోవటం ఎంతకష్టమో అందరికీ తెలుసు. అప్పటిదాకా పరవసించి వింటున్నామెకాస్తా అటుతిరిగి ఏదొ పనిచేస్తున్నట్టు నటించేది. "అమ్మగారి మనసు నాకు తెలుసు. ఆచేతితో ఎంతమంది అన్నదానం చేసిందో నేనెలా మర్చిపోగలనూ...." ఇలా మొత్తానికి నెయ్యితో మొదలుపెట్టి పచ్చడి, సాంబారు అలా అలా గిన్నెనింపుకు వెళ్లేవాడూ. నాకు తెలిసి మా అమ్మమ్మదగ్గర తీసుకెళ్లేసత్తా ఇతనికి ఒక్కడికే ఉంది. పాపం మాట్లాడుతూనే మారామమందిరం వాకిట్లోనే చనిపోయాడు. ఈవిషయం ఇక్కడ టపా పెట్టానని తెలిస్తే ఇంట్లోవాళ్ళు ఎగరేసి ఎగరేసి తంతారు.

గంగమ్మ చెలికత్తె 'సోన్ '

మనం చిన్నప్పుడు అనేకనదులగురించి, దాని మీద కట్టిన ఆనకట్టలగురించి చదువుకొన్నాం. మనకు బాగా పరిచయముండే నదులు గంగ, యమున, గోదావరి, కృష్ణ, పెన్న, కావేరి మొదలైనవి. నాబ్లాగు చూసేవాళ్లకి స్వర్ణముఖి అనేనదిగురించి కూడా కొద్దిగా అవగాహన ఏర్పడి ఉంటుంది. ఇక ఆనకట్టల విషయానికివస్తే ముందు గుర్తొచ్చేవి నాగర్జునసాగర్, శ్రీశైలం, మైసూరుదగ్గర కావేరిడాం( బృందావన్ గార్డెన్స్ దీనికిందే ఉండేది.), ప్రకాశం బారేజి, ధవళేస్వరం. ఇప్పుడు జలయజ్ఞం పుణ్యమా అని భవిష్యత్తులో మరికొన్ని మనరాష్ట్రంలొ మరిన్ని ఆనకట్టలూ భవిష్యత్తులో చూస్తాం. ఇప్పుడు మీకు ఒకనదిని, దానిపై ఉన్న ఒక ఆనకట్ట గురించి చెప్పాలి అనుకొంటున్నాను.

ఆనదిపేరు 'సోన్ '. ఈనది ఛత్తీస్‌గడ్‌లో జన్మిస్తుంది.దీని జన్మస్థానం నర్మదానది జన్మస్థానికి(అమరకంటక్) దగ్గర్లోనే. నాకు నర్మదానది, సోన్ నది దాయాదులు అనిపిస్తాయి. ఎందుకంటే ఇవిరెండు ఒకేప్రాంతంలో పడేవర్షపాతాన్ని పంచుకొంటాయి. అంటే నర్మదా పర్వతసానువుల్లోని వర్షపు నీరు అవిపడ్డ ప్రాంతంలొని వాలును అనుసరించి నర్మదానదిలోగాని, సోన్ నదిలోగాని కలుస్తాయి. అలా అక్కడి వర్షాన్ని పంచుకొంటాయి అన్నమాట. అలా జన్మించిన రెండునదుల్లో నర్మద పశ్చిమంగా ప్రవహిస్తే, సోన్ నది కొంతదూరం నర్మదకు సమాంతరంగా కొద్దిగా ఉత్తరపుదిక్కులో ప్రవహిస్తుంది. కైమూర్ పర్వతశ్రేణులు చెరుకొనేసరికే ఉన్నట్టుండి తనగమ్యం తెలిసిదానిలా దిశనుమార్చుకొని, ఈశాన్యదిశలో తనగమనాన్ని కొనసాగిస్తుంది. అక్కడినుంచి ఉత్తరప్రదేశ్ మీదుగా బీహార్లోకి ప్రవేశించి, పాట్నాదగ్గర గంగానదిలో కలుస్తింది. అంటే ఇది గంగకు ఉపనది అన్నమాట. ఇప్పుడు అర్ధమైందికదా సోన్ తనగమనాన్ని ఎందుకు మార్చుకుందో. అలా దానిపుట్టుకకు పాట్నాదగ్గర సార్థకత లభించింది.

గంగానదికి ఉన్న అతిముఖ్యమైన ఉపనదులు సోన్, గండకి, గోమతి మొదలైనవి. వీటిలో గంగకు దక్షిణ భాగంనుంచి నుంచి కలిసే నదుల్లో అతిపెద్దది సోన్. ఈనది మొత్తం 784కిలోమీటర్లు అంటే 487మైళ్లు( ఐ కిలోమీటర్లు తిరగేస్తే మైళ్లు వచ్చింది. భలేభలే. గుర్తుంచుకోండి.) ప్రవహిస్తుంది. భౌగోళికంగా చెప్పాలంటే, దిగువ సోన్ లోయ నర్మదాలోయకు కొనసాగింపు ఐతే, కైముర్ శ్రేణులు వింధ్యశ్రేణులకు పొడిగింపు. మొదటకొంతదూరం, అంటే ఉత్తరప్రదేశ్లోకి ప్రవేశించక ముందు, దీనివాలు మాములునదులకంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఋతుపవనాల సమయంలో బాగా ఉధృతంగా ప్రవహిస్తే, మిగిలిన సమయాల్లొ అక్కడక్కడా నిలువనీళ్లు కనిపిస్తాయి. ఈప్రాంతంలో భౌగోళికంగా కొన్ని బలహీనమైన ప్రాంతాలు ఉండటం వల్ల( వీటిని సాంకేతికంగా ఫాల్ట్ అంటారు.) ,వాలువల్ల ప్రవాహవేగం ఎక్కువయ్యి , గతంలో భూమి విపరీతంగా కోతకు గురయ్యి చాలా సార్లు తన గమనాన్ని మార్చుకొంది. తరువాత వాలు తగ్గి వేగం మందగించటంతో లోతు తగ్గి, బాగా విశాలంగా అవుతుంది.

దేరి అనే ప్రాంతం( పాట్న దగ్గర,బీహార్) వద్ద దాదాపు 5కి.మి. వెడల్పు ఉంటుంది. కానీ మునకప్రాంతం మాత్రం 3-4కి.మి. మాత్రమే. ఈనదికి దేరి వద్ద ఆనకట్ట 1873లో ఈస్ట్ ఇండియా కంపెనీవాళ్లు నిర్మించారు. దేశంలోని అత్యంత పురాతన నీటిపారుదల వ్యవస్థల్లో ఇది ఒకటి. మనకు స్వాతంత్ర్యం వచ్చిన తరువాత, ప్రభుత్వంవాళ్లు 1960లో దేరికి ఎగువన ఇంద్రపురి అనే ప్రాంతంలో ఒక బారేజి నిర్మించి, దానిని ఆనకట్ట కాలువలకు ఒక ఎగువస్థాయి పారుదల వ్యవస్థ ద్వారా అనుసంధానం చేశారు.
దేరి ఆనకట్టను( దీనిని దిగువ సోన్ నీటిపారుదల వ్యవస్థ అంటారు.) రబీసాగుకు మాత్రమే రూపొందించారు. కాని తదనంతరం సేద్యంలో వచ్చిన మార్పులతో ఖరీఫ్‌కు నీటిని అందచేయాల్సి వచ్చింది. లేనిపక్షంలో సన్నకారు రైతులు సేద్యానికి దూరమయ్యి సమాజంలో ఆర్ధిక సమతూకం దెబ్బతినే పరిస్థితి తలెత్తింది. ఇంద్రపురి బారేజిని నిర్మించి, దాన్ని దేరి అన్నకట్టకు అనుసంధానం చెయ్యల్సిందిగా నిపుణులు సూచించారు. అందుకు అనుగుణంగా రెండవ ప్రాజెక్టును నిర్మించారు. కొత్త వ్యవస్థను పాతవ్యవస్థకు కలిపేచోట కొన్ని చిన్నతరహా జలవిద్యుత్తు కేంద్రాలను నెలకొల్పారు.

మరొక బహుళార్ధకసాధక ప్రాజెక్టు మద్యప్రదేశ్లోని షాదోల్ జిల్లాలో అంతర్రాష్ట్ర జలఒప్పందాలను అనుసరించి మద్యప్రదేశ్, ఊతరప్రదేశ్ మరియు బీహార్ రాష్ట్ర్రాలు నిర్మించాయి. 7వ శతాబ్దానికి చెందిన గొప్పశాస్త్రజ్ఞుడు బాణభట్టు ఈప్రాంతానికి చెందినవాడు కావటంతో బాణ్ సాగర్ అనిపేరు పెట్టారు.( కనీసం ఒకప్రాజెక్టుకైనా ఇలాంటివాళ్లను గుర్తుంచుకొన్నందుకు సంతోషిద్దాం.) 1956లో కేంద్రజలవనరుల సంఘం(ఇది డేశంలో జలవనరులు, నీటిపారుదల ప్ర్రజెక్టులకు అత్యున్నతవిభాగం. అన్నిముఖ్యమైన, జాతీయస్థాయి ప్రాజెక్టులను ఇది పర్యవేక్షిస్తుంది. మిగిలిన వాటికి అవసరమైన సూచనలు ఇస్తుంది.) సోన్ నదికి ఉపనదైన బాణనది కలిసేచోట 'డింబప్రాజెక్టూ అనే పేరుతొ ప్రతిపాదించారు. ఐతె 1973 వరకు ఆప్రతిపాదనలు ముందుకు సాగలేదు. 1973లో కుదిరిన అంతర్రాష్ట్ర ఒప్పందం ప్రకారం ముందుగా పేర్కొన్న చోటకాక దానికి 30కి.మీ. దిగువన ఉన్న దేవభూమివద్ద నిర్మించ తలపెట్టారు. 1978లో 91.3కోట్లుగా ప్రతిపాదించిన వ్యయం 1998నాటికి 1054.96కోట్లకు పెరిగింది. చివరికి 2006లో పూర్తిచేశారు. అలా 1978లో మొరార్జీదేశాయ్ ప్రధానిగా టెంకాయకొట్టిన దానికి వాజపేయి మాజీప్రధాని హోదాలో 2006లో గేట్లు ఎత్తారు.
ఈడాం ఎత్తు 67మీటర్లు, పొడవు 1020మీటర్లు. 4జిల్లాలలోని 336గ్రామాలు ముంపుకు గురయ్యాయి. ఖర్చు మ.ప్ర., యుపి, బీహార్లు 2:1:1 నిష్పత్తిలో పంచుకొన్నాయి. దీనిద్వారా మద్యప్రదేశ్‌లో 2,490చదరపు కిమీ., యుపీలో 1500చదరపు కిమీ., బీహార్లో 940కిమీ సాగులోకి వచ్చాయి. మద్యప్రదేశ్‌కు 425మెగావాట్ల విద్యుత్తు లభిస్తుంది.

పాట్నా దగ్గర క్విల్వార్ అనేచోట రోడ్ కం రైలుబ్రిడ్జ్ (రాజమండ్రి దగ్గర గోదావరిపై కట్టినట్లు) నిర్మించారు. ఐతె గోదావరి బ్రిడ్జికి దీనికి తేడా ఏమిటంటే, దీనిలో పైన రైలుమార్గం, కింద రోడ్డుమార్గం ఉంటుంది. దీనికి ఉన్న ముఖ్యమైన ఉపనదులు రిహాంద్, కోయెల్. ఇవి ఉత్తరప్రదేశ్లో కలుస్తాయి. రిహాంద్- సోన్‌లో కలిసే చోట ఒక బహుళార్ధక సాధక నిర్మాణం ఉంది. ఉత్తరప్రదేశ్లో అలహాబాదు బెనారస్(కాశీ)మద్య మీర్జాపూర్ అనే ఊరు ఉంది. అది ఒక జిల్లాకు ముఖ్యపట్టణం. గతంలో ఇది ఆసియాలోకెల్లా అతిపెద్దజిల్లా. దీనికి సరిహద్దులో మద్యప్రదేశ్, బిహార్ ఉండేవి. ఐతె ఇటీవల ఛత్తీస్గడ్, ఝార్కండ్ ఏర్పడటంతో, ఇది 4 రాష్ట్రాలకు సరిహద్దు జిల్లా అయ్యింది. పాలనాపరమైన ఇబ్బందులు తలెత్తడంతో రేండుముక్కలు చేశారు. సంబంధం లేకుండా ఈసోది ఎందుకు చెబుతున్నాను అనుకొంటున్నారా. అలా ఏర్పడ్డ కొత్తజిల్లాకి ముఖ్యపట్టణం రాబర్ట్స్ గంజ్, ఆకొత్తజిల్లా పేరు సోనభద్ర.

గృహప్రవేశం

పైన పేరుచూసి జయసుధ చక్రాలకుర్చీలో, లెజెండ్ మోహన్‌బాబు దాన్నితోసుకుంటూ "దారిచూపిన దేవతా" అంటూ పాడేస్కోకండి. ఇంతకీ విషయం ఏమిటంటే ఒకవారంక్రితం మా మానవవనరుల విభాగంనుంచి ఒకలేఖ. దానిసారాంశం "వచ్చేనెలలో కొత్తబాచ్ అంటే ఈసంవత్సరంలో చేరినోళ్లు ట్రైనింగ్‌కోసం వస్తున్నారు. ఇప్పటిదాకా మీసేవలో తరించాము. ఇక మీవారసులకి సేవచేస్కొనే అవకాశం ఇవ్వండి. 17వతేదీలోపు ట్రైనీహాస్టలు ఖాళీచేసి క్వార్టర్లలోకి మారిపోండి" అని. ఈరోజువెళ్లి అక్కడ ఖాళీగా ఉండే ఇళ్లుచూస్కొని నచ్చిన నంబర్లను రాసేసి వచ్చాం. పర్లేదు బానే ఉన్నాయి. అన్ని వసతులూ చూస్తూ సరిలేనివి నోట్ చెస్కుంటున్నాం. అదిచూపిస్తే సరిచేసి ఇస్తారు. అలా చూస్తూ ఉన్నట్టుండి అంతా కలియచూశాను. కెవ్వ్..ఇక్కడ నెట్‌సౌకర్యంలేదు. అడిగితే మేము ఇవ్వం. మీరు బీ.ఎస్.ఎన్.ఎల్.కి వెళ్లండి అని సెలవిచ్చాడు. అక్కడవాళ్లని అడిగితే ముందుఫోన్‌కి అర్జీపెట్టండి. తరువాత బ్రాడ్‌బాండ్ అని సెలవిచ్చాడు. కనీసం 20రోజులు పడుతుందని నా అనుమానం. మరి ఇన్నిరోజులు నాచేతి దూల అణుచుకోవటం ఎలా?

చుక్కలు

నేను ఈ కంపెనీలో చేరకముందు ఏన్.ఐ.టీ. త్రిచిలో ఏం.టెక్. చేశాను. దాదాపు అన్ని ఐ.ఐ.టీ., ఏన్.ఐ.టీ.ల్లానే మాకాంపస్‌లో కూడా తెలుగువాళ్లం ఎక్కువ. ఎంత అంటే కొన్ని స్పెషలైజేషన్‌లలో 16మందిలో 12-13మంది మనవాళ్లే ఉండే వాళ్లం. మొదటి సంవత్సరం అందరం ఒకే హాస్టల్, బెరిల్ అని, రూంకి ఇద్దరు షేర్‌చేసుకొంటారు . ఆకాంపస్‌లో హాస్టళ్లపేర్లు అన్నీ నవరత్నాలు అన్నమాట, అంటే డైమండ్, జేడ్, అలా అన్నమాట. రెండొసంవత్సరం బ్రాంచిలనుబట్టి హొస్టళ్లు ఉంటాయి, కానీ సింగిల్‌రూంలు. మేము సఫైర్ అంటే నీలమణిలో ఉన్నాం. ఐతే పేరుకే సింగిల్‌రూంలు కానీ అందరం ఎప్పుడూ ఎదో ఒకరూంలోనే ఉండేవాళ్లం, మామూలేకదా. విభాగాడి రూంలో సిస్టం ఉందికాబట్టి అందరికీ అదే కామన్‌రూం.

తమిళనాడు వాతావరణం గురించి చెప్పనక్ఖర్లేదు అనుకొంటా. అక్కడ ఋతుచక్రం అంటూ ఎమీ ఉండదు. ఆచక్రం మద్యలో ఇరుసు ఇరుక్కుపోయి ఎప్పుడో చాలా శతాబ్ధాల క్రితం ఆగిపోయింది. మన ఖర్మకొద్దీ ఆగినప్పుడు అది గ్రీష్మఋతువు. "పాపం అరవోడు" అనుకొంటా అప్పుడప్పుడు. నాకు మా ఇంట్లో నవంబరు వరకు వాకిట్లోనే టేబుల్‌ఫాన్ పెట్టుకొని నిద్రపోవటం అలవాటు. అలాంటిది అక్కడ మిద్దెపైకివెళ్లి పడుకొందాం అనుకొన్నా ఎప్పుడూ వాయిదాపడేది. మొదటి సంవత్సరంలో హాస్టల్ వార్డన్ని అడిగితె "వాండాసామీ. కంట్రొల్ సెయ్యడం రొంబాకష్టం." అని అప్పుడె సాంబరు తాగాడు అనుకొంటా త్రేపుకొంటూ రూంలోకి వెళ్లిపోయాడు.

రెండొ సంవత్సరంలో మెట్లు పైకి వెళ్లిచూశా. ద్వారములు తెరిచియే ఉన్నవి. కాదుకాదు అసలు ద్వారములు లేనేలేవు. పైకివెళ్లి చూసి అహా! ఎమినా భాగ్యము అని అనుకొంటే మిగతా వాళ్లు కదిలితే కదా. అందరూ ఇళ్లదగ్గర మిద్దెపైకి వెళ్లేవాళ్లే. యెదవలు నా ప్రాణనికి ఎక్కడ దొరికారురా అనుకొంటూ నేను ఒక్కడినే వెళ్లి పడుకొన్నా. ఇంతలో ఒక పెద్దగుడ్లగూబ నాకు ఎదురుగా ఉంది. మొదటిసారి దాన్ని అంతదగ్గరగా చూడడం. దాదాపు నా మోకాలు ఎత్తుంది. దాన్ని చూసి గుండె హడల్. అసలుదాన్ని ఎప్పుడు చూశానో ఎంతసేపు చూశానో కూడా గుర్తులేదు. దాని ఆకారం మెదడులోకి సంకేతాలు వెళ్లిన తరువాత తేరుకొని చూస్తే నారూంలో పడుకొని ఉన్నా. అంటే దాన్ని చూసిన వెంటనే అసంకల్పిత ప్రతీకారచర్య అని అంటారు తెలుసా అలాంటిది జరిగింది అన్నమాట. ఆప్రతయ్నాన్ని విరమించుకొని ఇక నారాత ఇంతే అనుకొని కిందే సెటిల్ అయిపోయా.

కొన్ని నెలలకి అందరికీ ఉద్యోగాలు వచ్చాయి. పార్టీలు చేసుకొనేందుకు అదేమంచి స్పాట్ అయింది. అప్పుడె నాబుర్రలో ఒకస్పార్క్ వచ్చింది. ఎలాగు నాకు మందు, మాంసం రాతలేదు కాబట్టి నాకు తెచ్చే పనీరో, మంచూరియనో గబగబా లాగించేసి నాపడకను అక్కడకే తెచ్చి వేసుకొన్నా. అదేంటి బావా అన్నారు మావాళ్లు. ఇకనుంచి నా పడక ఇక్కడే అని ప్రకటించేసరికి వాళ్లు ముందు మందుపని పడదాం తరువాత అలోచిద్దాం అనుకొన్నారు. నాకోటా ఒక కూల్డ్రింక్ ఇచ్చేసారు. వాళ్లు కూర్చుని బీర్ వేస్తుంటే నేను విష్ణుమూర్తి పోజులో స్ప్రైట్. అలా మొత్తానికి అందరినీ డాబామీదకి తెచ్చేశా.ఇక ఫిబ్రవరినుంచి దాదాపు జూన్ మద్యవరకు ఎంతహాయిగా గడిచిపోయింది అంటే అస్సలు ప్రాజెక్ట్ గురించిగానీ మరేటెన్షన్‌గానీ వచ్చేదికాదు మనసులోకి.

ఇక్కడ మాగుంపుసభ్యులు ఎవరు అంటే నేను, విభాగాడు, ప్రాజెక్ట్ పవన్, సిగరెట్ సురేష్, మధుభాయ్, అరవింద్ ( వీడు ఎం.బీ.ఏ. ఐనా మతో ఉంటాడు. చిన్న ప్రాబ్లెం ఏమిటంటే వీళ్లు బేసిగ్గా తమిళియన్ అయ్యరు. తరువాత కర్ణాటకలో సెటిల్ అయ్యి, అనంతపుర్ మీదుగా హైదరాబద్ వచ్చేశారు. అప్పుడప్పుడు వాడు ఏభాషలో మాట్లాడాలొ కూడా కన్‌ఫ్యూజ్ అవుతుంటాడు.ఇక ఐ.పీ.ఎల్ అప్పుడు ఐతే ఏ టీంకి చప్పట్లుకొట్టాలో అర్ధంకాలేదు. వీదికి క్లారిటీ వచ్చేప్పటికి అదికూడా ఐపోయింది.) ఇంకో అరవింద్ ఉన్నాడు. వీడిది కర్ణాటక. అయినా తెలుగుబాగా వచ్చు. ఇక పక్కహాస్టళ్లనుంచి వచ్చే ప్రత్యేక ఆహ్వానితుడు మునికుమార్. వీడిదికూడా కర్ణాటాక, కానీ ఆంధ్రనుంచి వలస వెళ్లిపోయారు. చివర్లో ఒక డేంజర్ అపాయం. పేరు జనార్ధన్. వీడువస్తే అందరం నిద్రపోతాం అది డిఫాల్ట్. మా దుప్పట్లకు ప్రోగ్రాం అలా సెట్‌చేశాం.

ఇలా హాయిగా (అంటే జనార్ధన్ రానప్పుడు) రోజులు గడిచిపోతున్నాయి. చిరంజీవికొత్త పార్టీపెట్టినా, బాలకృష్ణ సినిమా వచ్చినా, కే.సీ.ఆర్. రాజీనామాచేసినా, కరుణానిధి కళ్లజోడు మార్చినా, జయలలిత డైటింగ్ చేస్తునా అన్ని విషయాలు అక్కడే. అందులో స్టైపెండ్ వచ్చిన వారంలో డిస్కషన్లు ఉధృతంగా సాగేవి. ఎవడైనా ఆరోజు గైడ్ తిడితె అక్కడికి వచ్చి మాదగ్గర గోడు వెళ్లబోసుకొనేవారు. ఎదవలు అప్పుడుకూడా వాళ్లకి మావాళ్లే మందుపోయాలి పాపం.
ఒకరోజు మాకు మాట్లాడేందుకు ఏవిషయం దొరకలేదు. అందరూ పడుకొన్నారు కానీ నిద్రరావట్లేదు. నేను చెవులో ఇయర్ఫోన్ పెట్టుకొంటున్నా పాటలు విందామని సెట్ చేసుకుంటున్నా. ఇంతలో పవన్‌గాడికి ఒక డౌట్ వచ్చింది. "బావా! చచ్చిపోయినోళ్లు పైన చుక్కలు అవుతారా?" అని. అవుతారేమోరా నాకు పెద్దగా ఐడియాలేదు అని చెప్పా. వెంటనే మునిగాడు "బావా! ఆపైన ఒకటిబాగా మెరుస్తుందే అది మా అవ్వ." అని ఒక పెద్దచుక్కని చూపెట్టాడు. ఒక్కసారిగా అందరికీ నిద్రమత్తు వదిలింది. ఆచుక్కను చూడడం గట్టిగా నవ్వుకోవడం. ఇలా ఒక అరగంట సాగింది. తరువాతరోజు రెండు పెద్దచుక్కలు పక్కపక్కనే ఉన్నాయి. వెంటనే పవన్‌గాడు "బావ! మునిగాడి తాతకూడ చుక్కల్లో కలిసిపోయాడు. వాళ్లవ్వ పక్కకి వెళ్లిపోయాడు." అని అన్నాడు. అందరం నవ్వుతూ ఉన్నాం గానీ వీడుమాత్రం ఏదో అలోచిస్తూ ఉన్నాడు. కొంచెం సేపటితర్వాత "బావా! మాతాత ఇంకా బతికే ఉన్నాడు" అంటూనే ఆరెండోచుక్కకేసి సీరియస్‌గా చూస్తున్నాడు. అప్పుడు వాడు ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్ నాకు ఇంకాగుర్తే. ఇలాంటివి చాలా జరిగాయి. గుర్తొచ్చినప్పుడు ఒక్కొక్కటి రాస్తుంటా.

బెత్తం


బెత్తం... ఈ పదం కనిపించటంతోనే బాల్యస్మృతులు గుర్తొచ్చి టపా చదివేందుకు కూడా భయపడి ఉంటారు. ఎందుకంటే ఈపదం రాయాలంటే నా చెయ్యికూడ వణికింది. పార్లమెంటులో అందరూ పోటా గురించి టాడా గురించి మాట్లాడే వాళ్లే కాని దీనిగురించి మాట్లాడాలి అంటే వాళ్లకికూడా భయమే. ఎవరి గతం వాళ్లది కదా.
సంవత్సరం సరిగా గుర్తులేదు కానీ డల్‌హౌసీ( ఇతనికి లార్డ్ అని మనం ఇప్పుడు పెట్టనవసరం లేదు అనుకొంటా.) అనే పెద్దాయన దేశంలోకి దిగాడు. ఇక్కడ చదువు ఆయనకి, అంటే మహారాణి గారికి, సరిపడలేదు. అంతే రాత్రికి రాత్రి సంస్కరించాడు మన విద్యావ్యవస్థని. భారతవిద్యార్థి అప్పటిదాకా రుచిచూడని నాలుగుగొడల ప్రపంచంలొ ఇరుక్కొని సర్దుకు పోయాడు. అప్పటి సమాజానికి ఇంతకంటే ముఖ్యమైన సమస్యలు మరేవో కనిపించాయి. దాంతో ఇతనిని పట్టించుకొనే నాథుడేలేదు. ఒకరిద్దరు కలుగచేసుకొన్నా ప్రయోజనం శూన్యం. దొరలకు మన అవసరం కేవలం గుమాస్తా నౌకరీలకే కాబట్టి ఆ (కు)సంస్కరణలు అందుకు అనుకూలంగానే జరిగాయి. సిలబస్ అంటూ నాలుగు పుస్తకాలిచ్చి "అది చదివి పరీక్ష రాసెయ్. గట్టెక్కితే వచ్చి రాణీగారి సేవలోతరించు" అంటూ తమ ఉదాత్తహృదయాన్ని చాటుకొన్నాడు.
అప్పుడు వచ్చింది ఒక భూతం. దానిపేరు బెత్తం. గురువుకి శిష్యుడికి మద్యలో నిలుచొంది. అప్పటిదాకా భారత విద్యావ్యవస్థకు గురుశిష్యుల మద్య మరొకరు రావచ్చు అని తెలీదు. వచ్చింది గుట్టుగా లేదు. రొజుకో గజంలెక్కన వాళ్లమద్య దూరాన్ని పెంచేసింది. అయ్యవారు ఆయన ధోరణిలో ఎదో చెబుతుం టాదు. పాపం వీడి పరిస్థితి ఎవరికి చెప్పుకొంటాడు. ఎప్పుడైనా ఒక సందేహం వస్తే అయ్యవారికన్నా ముందు ఇదే ఉరిమేది. దాంతో కొంతకాలానికి వీడి గొంతు పూడిపోయింది. అలా వాడిలోని తర్కానికి, భావప్రకటనకు చెల్లుచీటీ ఇచ్చేశాడు. ఇదిరాక మునుపు మనవిధ్యావ్యవస్థ మచ్చలేనిది అనికాదు కానీ, ఈసంస్కరణతో ఒరిగిన ప్రయోజనం ఏమీలేదు. అగ్రవర్ణాలవారు ఆంగ్లం నేర్చుకొని కొంతమంది విదేశాలకు వెళ్తే, మరికొంత మంది ఇక్కడున్న కొద్దిపాటి ఉన్నత ఉద్యోగాలను సంపాదించారు. మద్యతరగతి వాళ్లు గుమస్తా ఉద్యోగంలో ఎంతో అద్భుతంగా ఒదిగిపోయారు. ఇక మూడొవర్గానికి ఈవ్యవస్థ కూడా చెయ్యిచ్చింది.ఈవ్యవస్థ రాకమునుపు సర్కారుకొలువు కోసం ఎంతమంది ఎదురుచూసేవారు? సమాజంలో సింహభాగం వ్యవసాయం చేసేవాళ్లే. కొత్తగా వచ్చిన వ్యవస్థలో అందుకు ఏమైన ప్రాధాన్యతను ఇచ్చారా? ఆధునిక వ్యవసాయ పద్ధతులను బోధించారా? మరి ఈవ్యవస్థ ఎవరికోసం? వీళ్లు స్వయంఉపాధితో బతికేవాళ్లే. కానీ ఇదివచ్చిన తరువాత ప్రజల ఆలోచనాతీరుని ఎంతగా ప్రభావితం చేసిందో ఒక్కసారి అలోచిస్తే మీకే తెలుస్తుంది.
తమాషా ఏమిటంటే ఈ వ్యవస్థలో చదవలేక ఐన్‌స్టీన్ వంటివాళ్లు పెద్దయ్యాక మన విద్యావ్యవస్థని, అందులోని ఉన్నతవిలువల్ని పొగిడితే మనకు మాత్రం అందులోంచి ఇందులోకి వలస రావల్సిన అగత్యం ఎర్పడింది. అంతటి గొప్పవాళ్ల చేత ఈచదువులు మాకొద్దు బాబొయ్ అనిపించిన ఘనత దాని సొంతం. ఇందులో పరిస్థితులకు అనుగుణంగా సర్దుకొని బతికే వాడికి సర్టిఫికేట్లు వస్తాయి. ఉద్యోగాలు ఉంటాయి. కానీ అలాటి వాళ్లు ఎంత మంది. నూటికి 80 మందికి సరిపడని విధానంలో మనం బోధిస్తున్నాం. అంత మందికి అర్ధం కాకున్నా అది వాళ్లతప్పే కాని బలవంతంగా రుద్దినవాళ్లకి ఏ బాధ్యతా లేదు. ఆ మార్కులు వచ్చిన వాళ్లలోకూడా అందులో పూర్తి స్థాయి పట్టు ఉండేవారు నూటికి ఒకరోఇద్దరో. అయినా ఇదే గొప్పచదువు. ఇలా చదివిన వాడే చదువరి. అప్పటిదాకా విదేశీవిద్యార్ధులకు చదువులతల్లి ఒడిలాఉన్న భరతఖండం, తన బిడ్డలకే జ్ఞానాన్ని పంచలేని స్థితికి వచ్చింది. ఉన్నతచదువులకోసం విదేశాలకు వెళ్లాల్సిన అగత్యం.

ఈ బెత్తం విషయానికి వస్తే ఇది రాకమునుపు కూడా కొన్ని శిక్షలు ఉండేవి. కాని అవి పిల్లవాడిని సంస్కరించేందుకు వీలుపడేలా ఉండేవి. వరుస హత్యలు చేసిన వాడికి, తీవ్రవాదులకు క్షమాభిక్ష ఉంటుంది. కానీ దీనికి అది తెలియదు. అంతే దాన్ని చూసిన ప్రతిసారి తనలోని సందేహాలను చిదిమేసుకొన్నాడు. రోజూ అయ్యవారు రావటం, పాఠాలు వల్లెవేయించటం, యేడాదికి ఒకసారి పరీక్ష. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ, మనలో ప్రతి ఒక్కరం చిన్నప్పుడు ఎక్కాలు బట్టీకొట్టీన వాళ్లమే. రోజూ ఎక్కాలు గుడ్డిగా చదివిందే చదివిపిస్తారు గాని అసలు అవి ఎలా వచ్చాయో అందులో లాజిక్ ఎమిటో ఎంత మంది నేర్పుతారు.ఇలాంటివి ఎన్నో. ఒకరోజు ఎదో తప్పు చేస్తాడు. అందుకు వాడిని సరిదిద్దేందుకు నాలుగు దెబ్బలు వెయ్యటం తప్ప వేరేదారి కనిపించదు. అయ్యవారికి వాడిమీద పగ ఉండదు. కాని ఆదెబ్బలు తిన్నతరువాత వాడికి మళ్లీ బడికివెళ్లాలి అనిపించదు. ఇంట్లో చదువుకొన్నవాళ్లు ఉంటే నయానో భయానో పంపుతారు. మరి మిగిలినవారి పరిస్థితి? ఇది మీకు చిన్న విషయంగా అనిపించినా “చిన్నప్పుడు బడి ఎందుకు మానేశావ్?” అని ఎవరినైన అడిగితే ఎక్కువ సార్లు వచ్చే సమాధానం ఇలాంటిదే. కాకపోతే ఒక్కొక్కరు ఒక్కోవిధంగా చెప్తారు.

ఇక్కడ ఇంకో సమస్య వచ్చింది. ఈమద్యకాలంలో అంటే పెద్దపాలేరుగారు సంస్కరణలని పెట్టిన తరువాత ఇక్కడి ఇతరవ్యవస్థలు పూర్తిగా మార్చేశారు.ఎలాగంటే , అలా చదివితేనే ఉద్యోగాలు, బతుకు తెరువు. ఇక చచ్చినట్టు చదివిచావాలి. కొంతమంది మేధావులు గళంవిప్పారు. వ్యవస్థని మార్చాలి అన్నారు. కానీ వాళ్లది మళ్లీ అరణ్యరోదనే అయింది. ఎదోతెలియక తప్పుజరిగితే మారుస్తారు గానీ ఉద్దెశ్యపూర్వకంగా చేసేదానికి ఎవరుమాత్రం ఏమిచెయ్యగలరు?

అర్థరాత్రి స్వాతంత్ర్యం. ఇక నారాత మారుతుంది అని అనందంతో వీధిలోకి వచ్చి గెంతులేశాడు. మువ్వన్నెలఝండా పట్టుకొని ఆకాశంలో తేలిపోతూ ఏవేవో పిచ్చికలలు కన్నాడు. మరి అది వచ్చింది అర్ధరాత్రి కదా.తెల్లారేసరికి పరిస్థితి యధాతథం. రాత్రి పట్టుకొన్న ఝండాకర్రే ఉదయానికి మళ్లీ బెత్తం అయి కూర్చుంది. ఇప్పుడువంతు ఛాందసులది. ఒకరేమో మతవిద్య అనారు. మరొకరు మా చదువుల్ని అందరూ చదివేస్తారు అన్నారు. మొత్తానికి ఎవరి అవసరాలు వాళ్లవి. బేతాళుడు మళ్లీ చెట్టు ఎక్కేశాడు. ఇంతలో మరో విడ్డూరం కొన్నేళ్లతరువాత జరిగింది. ఎవడైతే మనకు దీన్ని అంటగట్టాడొ వాడే ఆ దొరగాడే” మీ ప్రమాణాలు పెరగాలి అన్నాడు. మీ ఊర్లో పంతుల్లేంటి బెత్తాలు వాడుతున్నారు?” అన్నాడు. దెబ్బకి మతిపోయింది మనవాళ్లకి. మేము డబ్బులిస్తాం బాగుచేసుకోండి అన్నాడు. దొరవారు ధర్మాత్ములు అంటూ పళ్లు ఇకిలించారు. అప్పుడెప్పుడొ అప్పెప్, తరువాత డిపెప్, ఐన వాళ్లు ఇచ్చింది మిగిలిపోతూనే ఉంది. ఫ్లిప్ అన్నారు, ఫ్లప్ అన్నారు. ఇవికూడ చెట్టెక్కాయి. ఇప్పుడు లెవ్ అని కొత్తది. పాపం వాడి పరిస్థితి అలానే ఉంది కానీ ఇక్కడ అందరి జేబులు నిండి పొర్లుతున్నాయి. ఈ బెత్తం మాత్రం పోవట్లేదు. ప్రాక్టికల్గా అలోచిస్తే అదిపోవటం కుదిరేపనికాదు. కనీసం మరో ప్రత్యామ్నాయం చూడని పక్షంలో అక్షరాస్యతను 95శాతానికి పెంచటం వంటి లక్ష్యాలు సాధించటం అయ్యేదేనా అని.

నెమలికన్ను అలిగింది

ఎందుకో తెలీదు ఇప్పటిదాకా మనల్ని అలరించిన నెమలికన్ను ఒక్కసారిగా అలకచెట్టు ఎక్కి కూర్చుంది. అదీ వంశీగారితో ఫోనుకలిపాక గోపి గోపిక గోదావరిపై టపా వేసి మనల్ని ఊరించి, ఇప్పుడు అందర్నీ గుమ్మం దగ్గరే ఆపేస్తూంది. మరి ఈ అలక ఎందుకో ఏమిటో ఎవరిమీదో తెలియటం లేదు. ముందు నామీద అనుకొన్నా. తరవాత తెలిసింది అందరి మీదా అని. అయ్యా! మురళిగారు ఇక్కడ మీ టపాని చదివేందుకు మేము ఎదురుచూస్తున్నాం. త్వరగా ఆ సెట్టింగులు మార్చి మాకు వీసా ఇవ్వండి. ఉంగరంలేని శ్రీదేవిలా ఉంది మా పరిస్థితి.

నిరీక్షణ

ఎప్పుడో చిన్నప్పుడు చూశాను. రెండుజడలు వేస్కొని ముద్దుగా వెళ్తుంటే నాకోసమే పుట్టింది అని ఫిక్స్ అయిపోయా. భలేముద్దుగా మాట్లాడేది. తనను చూసిన వాళ్లకి కూడా అదే అభిప్రాయం. వాళ్లక్కని కూడా చూశా. ఆమె కూడ చాలా బావుండేది. అదేంటో ఇద్దరూ భలే చలాకీగా ఉండేవాళ్లు. నాకు మాత్రం ఆ అమ్మాయి మాట్లాడినా, పాటపాడినా నాకోసం చేసినట్లే ఉండేది. కొంతకాలానికి ఆరిందలా ముదిమాటలు కొంచం అదనపు వ్యవహారాలు వెయ్యడం మొదలుపెట్టింది. నాకు అస్సలు నచ్చదు ఇలాంటివి. కానీ చూసేవాళ్లు మరీ చనువివ్వటంతో ఇలా తయారయ్యిందిలే అని సర్దుకొన్నా. రానురాను ఇలాంటివి ఎక్కువ అయిపోయాయి. నాకు బాగా ఇబ్బందిగా అనిపించేది. కానీ ఎమి చేస్తాం వాళ్ల అమ్మానాన్నలు కూడ అలా ఉండాలని కోరుకొంటున్నారు. నేను తనవంక చూడడం తగ్గించేశా. నెమ్మదిగా తను కనిపించినా పెద్దగా ఉత్సాహం రావట్లేదు మునుపటిలా. అప్పుడు అర్థం కాలేదు కానీ చాలా రోజుల తరువాత అర్ధం ఐంది తను నా మనసు దోచుకొంది అని. తరువాత కొంతకాలానికి తను, వాళ్లక్క కూడా కనిపించడం మానేశారు. వాళ్లనాన్నకి ట్రాన్స్‌ఫర్ అయ్యింది ఏమో అనుకొన్నా. అందరూ కొంతకాలానికి మర్చిపోయారు. నాకు మాత్రం అప్పుడప్పుడూ గుర్తొచ్చేది. ఎవర్ని అయినా అడిగితే నవ్వేవాళ్లు కాని చెప్పేందుకు వాళ్లదగ్గర కూడా ఏ సమాచారం లేదు అనుకొంటా. అలానే కొంతకాలం గడిచింది. నేను నాచదువుల్లో ఆటల్లో మునిగిపోయాను. ఎప్పుడైనా గుర్తొచ్చి అమ్మను అడిగితే సీరియస్ అయ్యేది. ఎందుకంటే అమ్మకి కూడా ఆ అమ్మాయి వేసిన వేషాలు నచ్చేవికావు. ఇలా కొన్నేళ్లు గడిచాయి. సడన్‌గా ఒకరోజు తాంబరం(చెన్నై) రైల్వెస్టేషన్‌లొ కనిపించింది. ఆ అమ్మాయికాదు. వాళ్లక్క. పక్కన ఉండే ఫ్రెండ్ చెప్పేదాకా గుర్తుపట్టలేక పోయాను. వాళ్లగురించితెలిసినా ఎందుకు చెప్పలేదు అని వాడిని తిట్టాను. నువ్వంత సీరియస్ అనుకోలేదు మామా అన్నాడు. మాట్లాడదాం అనుకొంటే కొంచెంబిజీగా కనిపించింది. మెడిసిన్ చేస్తుంది అనుకొంటా చేతిలో స్టెతస్కోపు ఉంది. కొంతకాలానికి ఆమెకూడా కనిపించటంలేదు. తరువాత ఇంకోఫ్రెండు చెప్పాడు వాళ్లక్కకి పెళ్లి అయిపోయింది అని. కాని తనగురించి మాత్రం తెలియదట. అనవసరంగా మర్చిపోయిన దాన్ని గుర్తుతెచ్చుకొని ఇప్పుడు మదనపడుతున్నాను. కొంతకాలానికి ఇంకో టెన్షన్ మొదలైంది. వాళ్లక్కకి పెళ్లిచేసేస్తే ఇక తనకు ఎక్కువ సమయంతీస్కోరుగా ఇంట్లో వాళ్లు. అలా అలోచిస్తూ ఉంటే ఒకరోజు దేవుడు కరుణించాడు. నా ఫ్రెండ్ ఆర్కుట్ ప్రొఫైల్‌లో ఎవరో ఒక అమ్మాయి చాలా బావుంది. ఎక్కడొ చూసినట్టు అనిపిస్తోంది. కానీ గుర్తుకు రావట్లేడు. ఆ... మీకు అర్ధం ఐపోయింది అని నాకు తెలుసులేండి. ఆ అమ్మాయే అని కింద పేరు చూసినపుడే అర్ధం ఐంది. కానీ ఎందుకైనా మంచిది అని మావాడిని అడిగా అవును అన్నాడు. అంతే "ఆకాశంలో ఒక తార నాకోసమొచ్చింది ఈవేళ ... ఝుం ఝుం ఝుం ... " చిన్నప్పుడూ వాళ్లక్కకి అద్దలు ఉండేవి. నేను చెన్నైలో చూసినప్పుడు ఆమె వాడట్లేదు. తన చిన్నప్పుడు కళ్లజోడు లేదుకానీ ఇప్పుడుమాత్రం వేస్కోనుంది.

చాలారోజుల తరువాత ఈరోజే చూశాను షామిలిపాప ఫోటో. ఓయ్ సినిమా గురించి విన్నాను గానీ ఫోటోలు గానీ వీడియోగానీ చూడలేదు ఇంతకాలం. ఈరోజే ఒక ఫ్రెండ్ ఆల్బంలో పెట్టాడు. అబ్బా! ఎంతబావుందో.

పోరాటం

అబ్బా! ఇదీ పోరాటం అంటే. ఎన్నికలకి సంవత్సరం ముందు నుంచి మొదలెట్టెశారు పోరాటాన్నీ. కొంతకాలం ముఖ్యమంత్రి మీద.అది మామూలే అనుకొన్నా. గతంలో ఈయన చేసిన మాగొప్పపనుల్ని మర్చిపొయాడు అనుకొంటా. మారవయ్యా 'బాబూ' అంటే మారాడు. కాని తనకి ఇష్టంవచ్చినట్లే గాని పార్టీకి జనాలకి అవసరమైనట్లుగాదు. అప్పటిదాకా జరిపిన పోరాటాన్ని ఇతర పార్టీలపై మొదలెట్టాడు. మీరు ఎదవలు అంటే మీరు ఎదవన్నర ఎదవలు అంటూ అబ్బో అప్పట్లో రాష్ట్రం దద్ధరిల్లింది. మొత్తానికి అందరం ఎదవలమేనండొయ్ అంటూ పళ్లికిలించుకొంటూ కనిపించారు. తీరాచూస్తే అదొక మహాపొత్తు. పొత్తులో మళ్లీ పోరాటం. సీట్లకి. ఎవరికి ఎంతబలంకాదు ఎవడైతే అక్కడ డబ్బుపోస్తాడు అని. ఒక సోఫాలొ నలుగురుకూర్చున్నారు. అది సరిపోక అందరూ సర్దుకొంటున్నారు. కాని ఎవరికీ పక్క వాళ్ల చొక్కామడతైనా తగలటం ఇష్టంలేదు. కానీ మళ్లీ పళ్లికిలించారు. ఇక పోరాటం ఐపొయిందిలే అనుకొంటే మళ్లీమొదలు. మొన్నామద్యదాకా అంతాకొట్టుకొంటూ ఇప్పుడు పొత్తు అంటే ఉన్నపళంగా పోరాటస్పూర్తి ఆగిపోదు కదా. మళ్లీ ప్రచారాల్లొ పోరాటం.(ఇంకా పొత్తు ఉందట!) ఫలితాలు వచ్చేశాయ్. మళ్లీపోరాటం. నీవల్ల అంటే నీయబ్బ నీవల్లే అంటూ. ఆయన బాధ ఏంటి అంటే ఎవరో పార్టీలు పెట్టారంట అందుకు ఈనకి కుర్చీ మిస్‌కొట్టేసింది. మళ్లీపోరాటం. ఈసారి ఎన్నికలకమీషన్ మీద. ఒకప్పుడు నావల్లే దెశంలొ కంప్యూటర్లు ఉన్నాయ్ అంటూ అమెరికా దొరల దగ్గర చెప్పి జబ్బలు చరుచుకొన్నయనకి ఇప్పుడు పేపరుమీద గుద్దితెనే ఓటు అంటున్నాడు. ఈ.వీ.యంలో ఈన చెప్పినవి సాధ్యం ఐతె 2004లో జరిగింది ఏందట? ఇంకనైనా ఊరుకొంటాడులే అనుకొంటే ఇంతలో మిగిలిన పార్టీలని మీరు నన్ను ఎందుకు కుర్చీ ఎక్కనివ్వలేదు అని దెప్పిపొడుపులు. ఇంతలొ నల్లప్రసన్న రెడ్డి(మా పక్కూరే) మారు 'బాబూ' అని మళ్లీ. అరెరే! పోరాటం మొదటికి వచ్చిందే అనుకొన్నా. అమెరికాపొయ్యాడంట. కోడలుపిల్ల దగ్గరికి వియ్యంకుడితొ కలిసి. ఇక్కడ ఎండలు ఎక్కువ కదా. చంద్రగిరిలో ఉంటే ఎండాకాలం మదనపల్లి పొయ్యుండేవాడు. హైదరాబాదులో ఉన్నప్పుడు కనీసం అంతదూరం పోకపోతే పీనాసోడు అంటారు కదా. ప్రిస్టేజి.అందులో తొడలు కొట్టె వంశానికి అల్లుడు కం వియ్యంకుడు కం మామ కదా. కోడలుపిల్ల డిగ్రీకూడ చేతికి వచ్చేసింది, ఆమె చేతివంటతిని కొంచెం చల్లబడి వస్తాడులే అనుకొన్నా. ఐనా ఆపట్లేదు పోరాటం. ఎంతైనా సీమనెత్తురు కదా. ఈసారి పోరాడడానికి ఎవరూ దొరకట్లేదు. ఎప్పుడో మామకి పీ.ఏ.గా పనిచేసినాయన గుర్తొచ్చాడు సడన్‌గా. అంతే మళ్ళీ పోరాటం. నువ్వుకూడా ఎదవవే అని చెప్పాడు. పాపం ఈన పొత్తుపెట్టుకొని కొట్టుకొనేరకం కాదు. ఆలాంటొడైతే ఆ మామతోనో లేక ఈనతోనో పెత్తుపెట్టుకొని ఒకేసమస్తరంలో డబలు ప్రమోషను కొట్టి హాయిగా కాలుమీదకాలు ఏస్కొని దర్జా అనుభవించుండేవాడు. ఐనా మా పోరాటం మాదే.

ఇంతకీ నేను చెప్పాలి అనుకొనేది ఎమిటంటే అసలు ఈసారి ప్రతిపక్షంలో ఉన్నవాళ్లని ఎవరైనా ప్రజలు, ముఖ్యంగా మద్యతరగతి వాళ్లు నమ్మగలారా? దీనికి అనేక కారణాలు. ప్రతిపక్షాల్లో మొదట చంద్రబాబు విషయానికివస్తే గత ఐదేళ్లుగా పూర్తివిఫలం. ఎన్నిసార్లు రెడ్డిగారితొ మాచ్‌ఫిక్స్ చేశాడో అందరూ చూశారు. ఇక చిరంజీవికి అసెంబ్లీలో ఎక్కడకూర్చోవాలోకూడా అర్ధంకాక తికమక. ఆయన ఇంటిసమస్యలు, ఒంటిసమస్యలు ఆయనవి. పాపం మనల్ని చూసే తీరిక ఏది. మరీ ఎదైనా చెప్పుకోవాలంటే బామ్మర్దికి టపాకొట్టాలి. కమ్యూనిస్ట్ సోదరులు ఒకడు సుత్తి ఇంకొకడు కొడవలి ఎత్తుకొని సింద్ధాంతాలపై సిద్ధాంతాలతో సిద్ధాంతాల కొరకు పోరాటం ఇంకా సాగుతూనే ఉంది. మిగతా పార్టీలగురించి రాస్తే మీరు ఈ కిటికీ మూసేస్తారు. మిగిలింది ఒక్కడు. అవును ఆ ఒక్కడే. నా మట్టుకు నాకు వచ్చే ఐదేళ్లలో ప్రతిపక్షమైనా ప్రజలపక్షమైనా ఒక్కడే. నేను గానీ ఒక ఈల గానీ వేశానంటే...

సమరశంఖం

మొదటిసారి చదివేవారు ఇక్కడ నొక్కితే ఈటపాని ఆస్వాదించగలరు

ఇంక్విలాబ్ జిందాబాద్” టపాని వేసి నా లాప్‌టాప్‌కి గొళ్ళెంపెట్టి వెళ్ళి పోయాను. ఒకగంట తరువాత కూడలికి వచ్చాను. హాచ్చీరం! పైనుంచి కిందదాకా పాకేస్తున్నారు పాకుడుబ్లాగర్లు.అన్నీ "జిందాబాద్" టపాలే. ఆదెబ్బకి కూడలిపేజీతొ బాటూ నా బ్లాగులో ఉన్న బొత్తం కూడా ఎర్రగా మారింది. అందులోని బాణంగుర్తులు మాదెబ్బకి వణికి తలోదిక్కుకి లగ్గెత్తాయి. అంతే అంతవరకు మామూలుగా ఉన్న పాకుడువాళ్ళకి ఒక్కసారిగా కదనోత్సాహం. కొండని ఢీకొట్టేందుకు సిద్దం ఐపోయారు. ఇప్పటిదాకా అసంఘటితరంగంలొ ఉన్నమేము కలిసి పోరాడేందుకు నిర్ణయించుకున్నాం. అదెంటో నేను అడక్కుండానే అందరూ నన్ను నాయకుడిని చేసేశారు.( ఇది నిజం)సరే మన మొదటి సమావెశం ఎక్కడ? "హైదరాబాదు, విశాఖ, బెజవాడ, తిరుపతి లాటివివద్దు. అక్కడ సీనియర్‌బ్లాగర్లు ఎక్కువ. మనకు కొంచెం ఇబ్బందులు వస్తా"యని చెప్పాడు ఒకడు.అంతే నాలోనాయకుడు వెంటనె వాడిని కార్యదర్శినిచేసెయ్ అని చెప్పాడు.ఇంకొకడు "అన్నా ఎక్కడొ ఎందుకు మీ ఊర్లోనె స్వర్ణముఖిలొ పెట్టెయ్ అందులో నీళ్లు ఉండవ్ ఎప్పుడూ ఇసకే అని చెప్పవుగా" అని ఆశగా ఎదురుచూశాడు. నేనేదొ ఒకసారి నాటపాలొ అలారాసుకుంటె ఇప్పుడు అందరిముందూ దాన్నిచెప్ప్తావా. వీడు భవిష్యత్తులొ నీకు అసమ్మతిని పెడతాడు జాగ్రత్త అనిచెప్పాడు అంతర్నాయకుడు.అందరూ నన్ను అన్నా అనిపిలుస్తుంటే తెలీని సంతోషం.నాకు నేను ఇల్లేరమ్మలో సుశీలలా పొంగిపోయాను. ఇంతకీ మనసంఘం పేరు ఎమిపెట్టాలి అని అనుకొంటున్నాం. ఎవడో ఇంతలొ "పాకుడురాజ్యం(బ్లాగేలక్ష్యం- పోస్టేమార్గం)". "వద్దన్నా ఆథీము అచ్చిరాలేదు". ఇంకొకడు"ఆఖిల భారత.." అని ఏదొ చెబితే ఇంకొకడు "అదెలా నేను ఉండేది యుఎస్‌లో, వీడు యుకేలో".మరొకడు"విశ్వ బ్లాగరు..". దానికి "మతతత్వం అని పొరబడుతారన్నా". చిర్రెత్తుకొచ్చింది. "ఏరా మీ బ్లాగులకేమో బరువైన, భావుకత ఉట్టిపడేలా ఒక్కొక్కరు విశ్వనాథగారి రేంజ్‌లొ పెట్టుకొని ఇక్కడమాత్రం పేరడీలు చేస్తారా? పాకుడు బ్లాగర్ల సంఘం. అంతే ఎక్కువ వద్దు. ముందుపని చూడండి" అన్నాను. సరే మరి మాఊర్లొనే మొదటి సమావేశం. ప్రోగ్రాం మీకు మెయిల్ చేస్తా. వచ్చేప్పుడు నేప్కీన్లు, నీళ్లసీసాలలాంటివి మర్చిపోవద్దు. ఇంకా ఏమేమి అవసరమో ఇప్పటికే ఎవరో సీనియర్ రాసేసుంటారు వెతకండి అని చెప్పా.మసక వెలుతురు. ఇసుకతిన్నెలు.( ఇంతకంటే ఎక్కువ వర్ణిస్తే మరీ రొమాంటగ్గా ఉండి అసలు టాపిక్ డైవర్ట్ అవుతుంది అందికే రాయట్లేదు.) దూరంగా లాంతర్లు ఎత్తుకొని వరుసలో పాకుతున్నారు. ఆ లాంతర్లు ఎప్పుడో 'అక్షరదీపం' అప్పుడు ఇచ్చినవి అనుకొంటా. సమావేశం మొదలైంది. పది కమిటీలు వేసేశాం. ఒక వారం రోజులు పాలపీకలు నోట్లో వెస్కోని అన్ని కమిటీలు పనిచేసాయి.కుర్రెదవలం. ఎవడికమిటీలోనిపని వాడు చెయ్కుండా పక్కనోళ్లని గిల్లేటోళ్లే. "ఏరా! మీపని ఎంతవరకు "వచ్చింది అంటే "వాడునాబలపం తీస్కొన్నాడు, వీడునాపలక మీదా "ఏదోపోశాడు అని చెప్పేటోళ్లే. అమ్మాయిలు ఎవరూలేరు కాబట్టి సరిపొయింది అనుకొంటే ఒకడొచ్చి కూడలి చూపెట్టాడు. అంతా 'జిందాబాద్‌లు' ఉన్నాయి. ఒక్కటితప్ప. ఎవడో మా ఏట్లో మనసుపారేసుకొన్నాడు. వాడి ప్రేమలేఖ ఒకటపా వేసేశాడు. వీళ్లందిరినీ ఎలాగోలా సర్దిచెప్పి పనిపూర్తిచేసి రిపోర్టుతో వచ్చేసరికి నా పరిస్థితి శ్రీదేవి పెళ్ళికి పెద్దరికం ఒప్పుకొన్న రావుగోపాలరావులా అయ్యింది.(అసలు దానిపై ఒక టపా పెట్టాల.)
ముందు చర్చించిన విషయం వర్గీకరణ. ఇప్పటిదాకా మాకుమేము 'పాకెటోల్లం' అని పిలుచుకోవటమే గాని ఇది అధికారికంగా ధృవీకరించలేదు.1. పాకుడు బ్లాగర్లు- 30కంటే తక్కువ టపాలు వేసినోళ్లు. వీళ్లకి అన్నీ ఫ్రీ..ఫ్రీ..ఫ్రీ. వీళ్లు ఎమి రాసినా అందరూ "అబ్బో! అద్భుతం!" అంటూ పొగడాలి. ఏమైనా అచ్చుతప్పులున్నా కామెంటులో రాయకూడదు. ఎవరైనా వీధిలొ కనిపిస్తే వీళ్లగురించే చెప్పాలి. వీళ్లకు ఎప్పుడైనా టపా వెయ్యటానికి ఎమీ దొరక్కపొతే మీరే ఎదైన విషయానికి లింకులు పంపాలి. అంటె వీళ్లది రాజవాసం అన్నమాట.2. దోగాడే బ్లాగర్లు- 30-60 టపాలు వేసినోళ్లు. వీళ్లకి పర్లేదు అప్పుడప్పుడూ "శభాష్" అంటూ, ఎమైనా విషయం కావాలంటే ఎక్కడుందో రిఫరెన్సు ఇస్తే చాలు. అచ్చుతప్పుల్ని మాత్రం క్షమించనక్కర్లేదు. అయితే దానికి మరీ కఠినంగా చెప్పకూడదు.3.నడిచే బ్లాగర్లు- 60-100టపాలు వేసినోళ్లు. వీళ్లకి మాత్రం కొంచెం బంధాలు పెంచాలి. ఆవేశం పెరిగి అప్పుడప్పుడూ వీధిలోకి పరిగెత్తేస్తారు. వీళ్లు పాకుడుబ్లాగర్లని తమ సొంతతమ్ముళ్లలాగా భావించాలి. ఎవరైనా ఎమైనా ఇస్తే వాళ్లకికూడా పంచాలి.4. సీనియర్ బ్లాగర్లు- 100కుపైన టపాలు వేసినోళ్లు. వీళ్లు ఎవరు ఏదీడిగినా కాదు,లేదు అనకూడదు.
అప్పుడుపూరించాం సమరశంకాల్ని.మాకు శంకువు ఊదటంరాదుగా అందుకే మొన్న కనుపూరు జాతర్లో కొనుక్కొన్న బూరల్ని ఊదాం. ఇవేమా డిమాండ్లు.
 • మీరు పాకేటొళ్లని ఇంట్లొ ఉండె పసిబిడ్డల్లా చూస్కోవాలి. రోజూ కనీసం ముగ్గురు పాకేటోళ్లని పొగడాలి.

 • మీరు ఎదైనా కొత్తవిషయం మీద రాయాలి అనుకొంటే ముందుగా పా.బా.సం. దగ్గర చూపించాలి. ఇదిమేము రాయలేము అనుకోంటే అప్పుడు మీ ఇష్టం.

 • సినిమాలమీద ఎదైనా రాస్కోండి కాని అవి ఏమిస్సమ్మొ, గుండమ్మకథో ఐతే పర్లేదు. కొత్తసినిమాల మీద పూర్తిహక్కులు మావే. మద్యలొ వచ్చిన సోభన్‌బాబు, కృష్ణలైతే ఒకసారి చూసిచెప్తాం.

 • క్రీడలగురించి మీఇష్టం. ఐతె మీరు సీ.కే.నాయుడు, ధ్యాన్‌చంద్, పటౌడీ గురించి ఐతే సరే. టీ20, ఐ.పీ.ఎల్ పూర్తిగా మావే.

 • ఆడసీనియర్లు మీ స్త్రీవాద బ్లాగుల్లో మాగురించి గొప్పగా రాయాలి. (అప్పుడే కొత్తగా వచ్చే ఆడబ్లాగర్లు మాబ్లాగులు చూస్తారు.) అలాగే అప్పుడప్పుడూ బ్రహ్మచారులు ఒండుకోగల్గిన కూరల్ని గురించి రాయాలి.
  ఇంకా మా పా.బా.సంలో ఆడబ్లాగర్లు చేరలేదు. వాళ్లు చేరిన తరువాత, సినీనటి రోజాకుగాని, రావులమ్మకు గాని అభిమాని కాదు అని నిర్ణయించుకొంటే(ఎందుకంటే ఇది తెలుగు బ్లాగర్లకు మత్రమె. వాళ్లువస్తే సంస్కృతం పెరుగుతుంది.) ఆడసీనియర్లకు నిబంధనలు చెప్తాం.

ఇప్పుడు కూడలికికొన్ని మార్గదర్శకాలు.


 • కూడలి హోంపేజిపై మాకు ప్రత్యేక స్థలం కేటాయించాలి. అది కష్టం అనుకొంటె మామూలు వరుసలోనే ఉంచి మా టపాలనెత్తిపై కొత్తది అని మెరుస్తూ(యు.పి.ఎస్.సి. వెబ్‌సైట్లొల) కనిపించాలి. కనీసం 50 మంది చూసేదాకా పట్టీనుంచి తీయకూడదు.

 • మాకు కామెంట్లురాయని సీనియర్లపై క్రమశిక్షణాచర్యలు తీస్కోవాలి.

 • మా ధృవీకరణ లేకుండ మీరు సీనియర్ల టపాలు చూపించకూడదు.

ఇంతలో మా సెగట్రీ వచ్చి "మరీ అంత కఠినంగా చెప్పొద్దు అన్నా. రేపోమాపో మనమూ సీనియర్లమి అవుతాం." అన్నాడు. "అప్పుడు రాజ్యాంగసవరణ తెచ్చి ఈసదుపాయాల్ని సీనీయర్లకు మార్చొచ్చులేరా యెదవా. మరీ అవసరం ఐతే అప్పుడు సీనియర్లకు వీటో అధికారం కల్పించుకొందాం." అని చెప్పా.దూరంగా కాగడాలు. బోయీలు పల్లకీలని మోసుకుంటూ వస్తున్నారు. అందులో అల్లసాని పెద్దన, శ్రీనాధుడు లాంటి గెటప్పులో సీనియర్లు. దెబ్బకి మా నాప్కీన్లు తడిసిపోయాయి.
ధగ్గునలేచి చూస్కుంటే రూంలో పడకపై ఉన్నాను. అంతా కల. అప్పుడే అబ్రకదబ్ర 'గడియారం' గుర్తొచ్చింది. ఏమో కలనిజం అవుతుందేమో అని ఆశగా లాప్‌టాప్ తెరిచాను. ప్చ్చ్. ఆ కూడలిలొ పెట్టిన టపా ఎప్పటిలాగే జర్రున జారుకుంటూ వెళ్లిపోయింది. సర్లే వాతలు చూద్దాం ఎవడైనా పెట్టాడేమోనని. ఒకరిద్దరు పెట్టారు గాని జిందాబాద్ అనలేదు. నెమ్మదిగా కూడలిలో ఎరుపురంగు పోయింది. కొంచంసేపు శాంతంగ ఆలోచిస్తే అనిపించింది "నిజమేమనది ప్రజాస్వామ్యదేశం. ఇక్కడ పార్టీలుపెట్టి ఎమైనా చెయ్యొచ్చుగాని సంఘాలు పెడితే సుద్దదండగ." బ్లాగులు తెరిచిచూస్తే మాకు సీనియర్లనుంచి కొన్ని ప్రశంసలు, సలహాలు. మరదే మనమంటే. కొత్తతరానికి చేయూతనివ్వడం మన రక్తంలోనే ఉంది. దీనికి ఏ విప్లవాలు, సమరాలు అవసరంలేదు.

పిచ్చోళ్ళు

మోన్న మాఅమ్మ ఫోను. ఏ పెళ్లిసంబంధమో అనుకొన్నా. కాదు. హమ్మయ్య కొంచం ప్రాణం లేచొచ్చింది. కొంచం సేపటికీ "అసలు అక్కడ ఎలా ఉంటున్నావురాఆఆఆ" అని పెద్దాదీర్ఘం మాయాసలో. "అసలే నీనోరు నిద్దట్లోకూడా గుట్టుగుండదు.(అంటే కొంచెం కలవరింతలు ఎక్కువ.చిన్నప్పుడు ఐతె నిద్దట్లో ఎవడో క్యాచ్ పట్టలేదని పక్కన నిద్రపొతున్న మా అత్తకొడుకుని ఎగిసితన్నాను. తరువాత అమ్మాయిలు కలలోకి రావటం మొదలైన తరువాత కలలు ఎక్కువై కలవరింతలు తగ్గాయి.) అక్కడ ఎవరైనా తగిలారా?" అని అడిగింది. మనకు ఎక్కడకు పోయినా ఎవడో ఒకడు తగుల్తారని తెలుసు. ఎంతైనా తల్లిగుండె. "పాత ఫ్రెండ్స్ అప్పుడప్పుడు తగులుతున్నారు మా చాటింగ్లో" అనిచెప్పా. ( చాటింగ్ అంటే అమ్మకి తెలుసు. పాప(చెల్లి) బావను అందులొంచే రెండునెలలు కంట్రొల్ చెసింది.అందుకే నాకు పెళ్ళి ఇప్పట్లో మంచిది కాదు అని అనుకొన్నా. చూశారా మన ఇంట్లోనే మనకు ఎందరొ జీవితానికి సరిపడా గురువులు ఉంటారు.) "మరీ నీ విశ్వరూపం చూపేవు మళ్ళీ పింగరు" అని జాగ్రత్త చెప్పింది. ఐనా మన సంగతి తెలిసి వాళ్ళూ పింగటం ఎప్పుడో ఆపేశారు అని తెలియదు.పిచ్చి అమ్మ.(దీన్ని చదివే అమ్మలు క్షమించేశారుపో!)

తరవాతరోజు అశోకుడు ( వీడు చెట్లు నాటించలేదు కాని చిన్నప్పుడు కుక్కల్ని పెంచేవాడు) "ఎమిరా అసలు కాల్ చెయ్టం మానెసావే". వాడిదీ అదే దిగులు. పాపం ఒకవారమునుంచి చెయ్యాలి అనుకొవటం కాని బిల్లుకు జడిసి వాయిదావెయ్యటం. అదీ వాడి పరిస్తితి. అసలే చైతుగాడు మనుషులు దొరక్క ఆకలిమీద ఉంటాడు ఇప్పుడు కదిలిస్తే బిల్లు కట్టేందుకు ఉన్నసెల్లు తాకట్టూపెట్టాలి అని వాడిభయం. ఐనా ఒక ఫొన్ చేసి కుశలప్రశ్నలడిగి అసలు విషయాలకి వచ్చేసరికే హలో..హలో అంటూ ఫొన్ పెట్టేసాడు. వాడిది చిన్నారి స్నేహం. పిచ్చి స్నేహం.

మరోకరోజు గిరి గాడు, శాన్ గాడు "బుద్దిలెకుండా అంత దూరంలొ ఉండే ప్లాంట్ పోస్టింగు అడిగి మరీతీస్కున్నావ్ అనుభవించు... " అంటూనె హేడ్ సెట్ కొన్న తరువాత స్కైపుకొ, జీటాకుకో కలుపుదాం అని పెట్టేశారు. వీళ్ళది మనతొ ఋణాణుబంధం.కాబట్టి ఎక్కడున్నా వదలరు.

"హలో బావా!" అంటూ విభాగాడు. దొరికాడురా ఒకడు అనుకొంటె "మన మధుభాయిపెళ్ళి " అని చెప్పి ఆ షాకునుంచి తేరుకొనేలోపే పెట్టేశాడు.( షాకు ఎందుకు అంటే ఆయన పెళ్ళిప్రయత్నాలు వాజపేయి ప్రధానిగా ఉన్నప్పుడు స్వర్ణచతుర్భుజికిముందు కొట్టారు టెంకాయి.)అన్నట్లు చెప్పడం మరిచా నా బీటెక్ ఫ్రెండ్స్ అందరూ సుబ్బూ అని,ఎంటెక్ ఫ్రెండ్స్ అందరూ నన్ను బావా అని పిలుస్తారు.

చంద్రా గాడిని గోకితె "సుబ్బూ అప్రైసల్ టైం. మనసుబాలేదు" అన్నాడు. (ఇప్పుడు మీకందరికీ ఒక ప్రశ్న ఈ చంద్రా ఎవడు? జవాబు చెప్పి నా శిష్యకోటిలో మొదిటివారయ్యే అవకాశం దక్కించుకోండి.) మరికొంతమందీ అంతే. బయటిపరిస్థితి బాలేదు కదా!ఐనా అందరిలొనూ ఒకే .ఆలోచన అసలు వీడు( అంటే నేను) ఎలాఉంటున్నాడా అని? అమ్మతో సహా ఎవరూ అన్నం ఎలాఉంది అని అడిగిన వాళ్ళే లేరు. వాళ్ళా ఆలోచన అంతా నా వాగుడు గురించే.
హ్హి హ్హి హ్హి హ్హీ పిచ్చొళ్ళు నేను ఇంతకాలం ఎలాగుట్టుగా ఉంటాను. మిమ్మల్ని గోకటంలేదూ?

సింగీతమ్ శ్రీనివాసరావు

ఈరోజు తృష్ణ గారి టపా చూసిన తరువాత ఆయన గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు రాస్తే ఇదిచూసిన వాళ్ళకి తెలియనివి ఎమైనా తెలుస్తాయి కదా అని టపా వేస్తున్నాను.

 • రామచంద్రరావు, శకుంతలాబయి ఆయన తల్లిదంద్రులు.
 • సొంతూరు ఉదయగిరి, నెల్లూరు జిల్లా
 • పుట్టింది సెప్టెంబరు 21, 1920లలో అనుకొంటా!
 • హైస్కూలు వరకు గూడూరులొ చదివి తరువాత ఇంటర్మీడియట్ నెల్లూరు వీ.ఆర్. కాలెజీలొ.డిగ్రీ చెన్నపట్నంలొని ప్రఖ్యాత ప్రెసిడెన్సీ కాలేజీ( ఇప్పటికీ అది సైన్సు & ఆర్ట్సు లొ దేశంలోనె టొప్ 3)
 • భార్యపేరు లక్ష్మీకళ్యాణి వారికి ఇద్దరు కూతుళ్ళు
 • వారి మాతృభాష కన్నడం .( మధ్వులు అనుకొంటా)
  వాళ్ళ అమ్మగారికి సంగీతంలో చాలాప్రవేశం ఉండేదట. ఆమె వయోలిన్ చాలాబాగా వాయించేవారట. చిన్నప్పుడు సింగీతం గారికి కూడా నేర్పిచ్చి గొప్పగాయకుడిని గాని, లేక ఎదైనా వాద్యమైనా నేర్పిద్దామని ప్రయత్నించినా కుదరలేదు.నాకు ఇష్టంలేదని చెప్పాడట. తరువాత మద్రాసు గాలిసోకి సినీరంగంలోకి వచ్చారు.
 • మొదటి సినిమా: నీతి-నిజాయితీ(కాంచన )
 • తెలుగులో ముఖ్యమైనవి: తరం మారింది, పంతులమ్మ, మయూరి(9 నందులు) , బృందావనం, ఆదిత్య 369( ఎన్ని నందులొ తెలియదు) , భైరవద్వీపం( 11 నందులు)
 • కన్నడలొ ముఖ్యమైనవి : సంస్కార( రాష్ట్రపతి అవార్డ్), హాలుజేను(175రొజులు రాజకుమార్), భాగ్యద లక్ష్మి బారమ్మ,ఆనంద్,
 • తమిళంలొ ముఖ్యమైనవి: దిక్కెట్ర పార్వతి, రాజపార్వై,అపూర్వ సోదరగళ్( విచిత్ర సహొదరులు), మైఖేల్ మదన కామరాజన్ ( మైఖేల్ మదన కామరాజు) మగలిర్మత్తుం
 • పుష్పక్( పుష్పక విమానం), లిటిల్ జాన్, సన్ ఆఫ్ అల్లాద్దిన్( అంతర్జాతీయ బాలలచిత్రోత్సవం 2003) ,ప్రార్థన( 30 శ్లోకాల ఆల్బం పిలలు పాడారు)
 • మొత్తంసినిమాలు యాభైకి పైమాటే
 • పుష్పకవిమానం ప్రపంచంలొనే 100 ఉత్తమచిత్రాల్లొ ఒకటి భారతదెశంలొ టాప్ 25 లొ ఒకటి.(జెంటిల్మాన్ మగజైన్)
 • (మైఖేల్ మదనకామరాజులో మొదట ఒకాయన "కధచెబుతా ...కధచెబుతా" అంటూ బయోస్కోప్ ఎత్తుకొని ,పంచె కట్టులో వస్తాడే ఆయనే సింగీతమ్. కొన్ని సినిమాల్లో అతిధిగా కనిపించాడు.
  సింగీతంగారు తన చిత్రానికి స్క్రీన్ ప్లేను స్వయంగా రాసుకుంటారట
  ఆనిమెషన్ సినిమాకొసం 3నెలల్లొ 3డి ఆనిమేషన్ నెర్చుకొన్నారట.
  కమల్ ఫేవరెట్ డైరెక్టర్లలొ బెస్ట్
  తెలుగులోహీరోలు కొంచం నసగాళ్ళు అని ఫీలింగ్.ఇక్కడ రాజకీయాలకు అంటీ ముట్టనట్లు ఉంటారు.
  బాలు, కమల్, ఇళయరాజా ఇండస్త్రీలొ ఫ్రెండ్స్
  ఆయనగురించి తెలుగువాళ్ళకంటే కన్నడిగులకు,తమిళులకు ఎక్కువ తెలుసు. కొంతమందితొ ఈయన పేరుచెబితే ఎవరు అన్నారు. ఆయన సినిమాలు, ఇంకొంత ఉపొద్ఘాతం చెబితె ఓహో ఆయనా అన్నారు.
 • కొసమెరుపు: బాలకృష్ణకే అంతపెద్దహిట్లు ఇచ్చాడు అంటే ఇక సింగీతం స్టామినా చూస్కొండి.

మీదగ్గర వేరే సమాచారం ఏమైనా ఉన్నా, లేక నేను వేసిన టపాలో ఏమైనా తప్పులున్నా తెలుపగలరు.

ఇంక్విలాబ్ జిందాబాద్

అసలే కొత్తప్రాంతం, దానికితోడు పనివత్తిడి. తెలిసినవాళ్ళో, తెలుగువాళ్ళో ఉంటే వసపిట్టడుగా ఉండే నేను ఇక్కడ ఆంజనేయులు తోడులేని అమృతరావులా ఐపోయాను. సెటైర్లులేవు, పంచ్లులేవు. ఇలాకొంతకాలం ఉంటే, సన్యాసినో సన్నాసినో ఐపోయే పరిస్థితి. ఒక ఆదివారం ఈనాడు చదివితే ఎందుకో ఒక బ్లాగుపెడితేపోలా? అనిపించింది. అలా ఏనుగు వెలగపండు మింగిన శుభాముహూర్తాన ఇందులో అడుగుపెట్టాను. కొంచం అక్కడా ఇక్కడా కెలికితే కూడలి, నెమలికన్ను, నవతరంగం మొ చూసేసాను. నాలో ఉత్సాహం కట్టలుతెంచుకుంది. నేనూ ఒక బ్లాగుకు కర్చీఫ్ వేసి (ఇంకా పేరు గట్రా అనుకోలేదు.) అలా నాలుగురోడ్ల కూడలికి వెళ్ళి దారిన పొయ్యే బ్లాగయ్యలను గోకాను. బాగా నచ్చిన ఒకటి రెంటికి వాఖ్యానాలు చేసి నేనుసైతం( చీ వెధవపలక "సైతం" అని కొడితే "సైతాన్" అని వచ్చింది.) అనుకుంటూ బయటకి వచ్చేశాను. తరువాతరోజు ఇక చెయ్యి, బుర్రా ఊరుకుంటాయా. సరే మొదటి రోజు శాసనసభ సమావేశల్లాగా వందనాలు సమర్పించి ఈపూటకి చాలులే అని బయటకి వచ్చేశాను. ముచ్చటగా మూడోరోజు కూడలికి వెళ్తే తెలిసింది అసలు పరిస్థితి. ఏదైనా ఒక విషయం గురించిరాద్దామ్ అంటే అప్పటికే 3 టపాలు వాటికి 36 వ్యాఖ్యానాలు. అప్పుడు అర్ధమైంది ఇక్కడ ఏదో జరుగుతోంది అని. అలా అన్నీ కెలికితే తెలిసిన సంగతి ఏంటి అంటే ఇక్కడ కెలకని విషయంలేదు.
నాలాగా ఇప్పుడే పాకే పాకుడుబ్లాగర్లు ఐతే కనీసం ఒక 10 విషయాలు అనుకొని తీరాతెరిచిచూస్తే అప్పటికే ఒక ఇరవైమంది బ్లాగేసి తాంబూలాలిచ్చేసాం తన్నుకుచావండి అని వెళ్ళిపోయుంటారు. టపారాసే ఉత్సాహం నీరుగారి ఇక మనసు ఒప్పుకోక ఒకవ్యాఖ్యానం వాగి వెళ్ళిపోవాలి. అప్పుడు పుట్టుకొచ్చింది విప్లవాగ్ని. నాలో ఒక ఎర్రసైన్యం నారాయణమూర్తి, నిప్పురవ్వ బాలకృష్ణ, మాదాల రంగారావు ఒకరి తరువాత ఒకరు పరకాయప్రవేశం చేశారు. అగ్నిపర్వతం కృష్ణ అగ్గిపెట్టెకోసం ఎదురుచూస్తున్నాడు. ప్రతిఘటన విజయశాంతి కూడా వస్తుందేమోనని భయపడ్డాను. రాలేదు బతికిపోయా. నా చొక్కా ఎర్రగా మారింది. ఆరంగు రిఫ్లెక్ట్అయ్యి నాబ్లాగుకూడా ఎర్రబడింది. ఇంతలో అమ్మనుంచి పిలుపు. అంటే మా అమ్మగాదు. అమ్మలగన్నయమ్మ పక్కనే ఉన్న యుట్యూబ్ కిటికీలో పూని “ఒరేయ్! ఇకడ జరిగే అన్యాయం ఆపరా” అని పలికింది.


అయ్యా! సీనియర్లూ ఇదేమన్నా భావ్యమా మీకు. ఏదో గ్రహభూమి అన్నారు సరే. శాస్త్ర విజ్ఞానం అన్నారు సరే. అవి ఎలాగూ మేము రాయం... రాయలేం. మాకంటూ కొన్ని వదలరా? భూమిని సరే తొవ్వుకోపోయి తర్వాత తరాలకు లేకుండా చేస్తున్నాం. ఇక్కడ కూడా మాకు రాయడానికి ఏమీమిగల్చకపోతే ఏమీ చెయ్యాలి మేము. ఇక ఏ ఘనా, కాంగో, ఇతీయోపీయోల భాషల్ని నేర్చుకుని అక్కడ రాస్కోవాలి. మరీ దారుణంగా చేతులు ఎలాకడుక్కోవాలి అన్నదానిపై 20 మార్కుల వ్యాసప్రశ్నకి సమాధానం రాశాడు ఒకతను.(దయచేసి తప్పుగా అనుకోవద్దు సర్. ఏదో కొంత బాధ అంతే :))

మొత్తంమీరే రాసేశారు. బ్లాగు మొదలుపెట్టటానికి ఇప్పటికీ తేడా ఎంతో తెలుసా..? రాయటం. చిన్నచిన్నపోస్టులు కూడా వేయలేకపోతున్నాం మీవల్ల. టపా మీరే రాస్తారు. మీరు రాసిందే కారెక్ట్ అని ఒప్పిస్తారు. మాకు ఎలా ఉంటుందో తెలుసా? దాన్ని డెలిట్ చేసిపడేయ్యాలి అనిపిస్తుంది. చివరికి కామెంట్ ఎలా రాయాలో కూడా మీరే చెప్తే ఇక్కడ మౌస్, కీబోర్డు కదలట్లేదు సార్. చిన్నప్పుడుస్కూల్లో చేరితే సైన్సు బాగా నచ్చింది. సరే సైంటిస్ట్ అయ్యి ఏదైనా సాధిద్దాం అనుకొన్నా. కానీ అప్పటికే చాలా కనుగొనేశారు. ఇంకా కనుక్కొనివీ నాకూ అర్ధం కాలేదు. సర్లే ఒక్కసారేకదా అని పట్టించుకోలేదు. ఇప్పటికీ నాకు ఏదీ మిగల్చకుండా అంతా ముందువాళ్లే కానిచ్చేస్తే ఎలా?

డ్రింక్సు బ్రేకులో టవలు, నీళ్ళు మోసుకెళ్లే పిల్లక్రికెటర్లా ఎన్నాళ్లు మేము కామెంట్స్ రాసుకుంటూ గడపాలి? ఎవ్వరికీ కనిపించదు, దూరంగా ఉంటుంది అని ప్లూటో గురించి దానిమీద జీవంతాలూకు గుర్తుల్‌ని తడుముదాం అనుకొంటె అప్పటికే ఎవరో గొకేసి పీకేసి రక్కెసి ఉంటారు. (మనవాళ్ళు అంత దూరం వెళ్ళినందుకు ఆనందంగా ఉన్నా) ఇక మాకు ఏమీ మిగిలింది? మీకంటే ఇంజినియరింగ్ సీనియర్లే నయం. రాగింగ్ చేసినా డ్రాయింగ్ ఎలానో నేర్పేవారు. బట్టలుతికించినా పుస్తకాలు ఇచ్చేవారు. ఒకవిషయం అనుకోని మొదలు పెట్టేసారికే చుక్కలు కనిపిస్తున్నాయి. తరువాత అసలు పలక మీద రాసేసరికి తలప్రాణంతోకమీదకి కాదు దాని తోకమీదకి వచ్చేస్తోంది. దీని దుంపతెగా..! నేను ఏదోరాస్తే ఇంకేదో చూపిస్తోంది. పుట్టి పలక పట్టినప్పటి నుంచి ఎరుగను ఇన్ని ముద్రారాక్షసాలు. దీన్ని నమ్ముకొని ఎవడైనా ప్రేమలేఖలురాస్తే వాడు ఇంట్లో వాజపేయి, వావిలాల (ఆడవాళ్ళు ఐతే జయలలిత, మమత) లాంటి ఆజన్మబ్రహ్మచారుల ఫోటోలు పెట్టుకోవచ్చు. ఇంత కష్టపడి రాసిపోస్ట్ చేసి ఒక అరగంటో గంటన్నారో కూడలిని రెఫ్రెష్ చేసి చేసి చూస్తే చివరికి తలుక్కున మెరుస్తుంది. (ఈ ఒక్కక్షణం మాత్రం కొంచంతృప్తి.) సరే ఉందిలే అలా టీ తాగివద్దాం ఎవరైనా కెలుకుతారేమోనని వెళ్ళివచ్చేసరికి అదిమాయం. జారుడుబల్ల మీద పిల్లాడీలా దేక్కుంటూ కిందకి వెళ్ళిపోతుంది. నేనుపోనని ఉగ్గబట్టి ఏడ్చినా లాభంలేదు. ముక్కుచీదుకుంటూ వీధినపడాలి.

అందుకే ఇక్కడ ఇంకా పాకుతూ ఉన్న మా జూనియర్ బ్లాగర్లు అంతా దీనిమీద సమైక్యంగా పోరాడాలి అని నేను పిలుపు ఇస్తున్నాను. హితులారా ఇక్కడ గర్ఝించింది ఒక పసిహృదయం. ఏకంకండి. మనకోసం 2MBPS వేగంతో కదులుతున్నాయి సర్వర్నాధ రధచక్రాలు. నేను ఇక్కడ ఈంక్వీలాబ్ అంటాను మీరు మీ బ్లాగుల్లో జిందాబాద్ అని టపా పెట్టండి. జూనియర్ డాక్టర్ల సమ్మెకంటే ఉధృతంగా సాగాలి మన పోరాటం. మనకు ప్రత్యేక కూడలి కేటాయించే దాకా ఆగదూ... ఆగదూ..ఆగదు బ్లాగాభిషేకం.
ఇప్పటికే ఈ విషయంపై కూడా ఎవరైనపెద్దలు రాసి ఉంటే ( నా ఖర్మకొద్దీ) మీ మద్దతు కోరుకుంటున్నాం. మీరు మా ఉద్యమానికి జయశంకర్. KCR మాత్రం నేనే. మేమంతా విడివిడిగా కొన్ని నిర్ణయాలుతీసుకొని సమైక్యంగా మాడిమాండ్లను ప్రకటిస్తాం. ఇంక్విలాబ్ జిందాబాద్

గమనిక:- ఇది ఎవరినీ నొప్పించదు అని భావిస్తున్నాను. ఇబ్బందిపెడితే చెప్పండి తీసేసెందుకు ఎలాంటి అభ్యంతరము లేదు