మేరునగ తప్పిదం- 4. 1959


చైనా మరింత దురుసుగా ప్రవర్తించసాగింది. 1959 ఆగష్టులో సరిహద్దు వెంబడి మూడు చోట్ల జరిగిన దాడులు సమస్య తీవ్రతను దాచిపెట్టలేనిస్థాయికి తీసుకెళ్ళాయి. రెండుదేశాల మద్య చర్చలు జరిపగలిగే వాతావరణం పూర్తిగా తొలిగిపోయింది. నెహ్రూ పార్లమెంటులో దాడుల గురించి అలానే  అక్సాయ్ చిన్ ప్రాంతంలో నిర్మించిన రహదారిని గురించి, దాన్ని తనిఖీ చెయ్యడానికి వెళ్ళిన భారత అధికారులను నిర్బంధించడం గురించి ప్రస్తావిస్తూ సైనిక సన్నాహల విషయంలో వైఫల్యం చెందామని అంగీకరించాడు. భారత భూభాగంలో చైనాసైన్యం కాంపు ఏర్పాటు చేసుకుంది అని ప్రకటించడంతో సభ ఆందోళన చెందింది. సరిహద్దు పరిస్థితులపై ప్రధాని ప్రకటన చెయ్యాలని పట్టుపట్టడంతో నెహ్రూ కొన్నికఠోరవాస్తవాలు విపులంగా చెప్పాల్సి వచ్చింది. సరిహద్దు వెంబడి చైనా మూడుచోట్ల దాడులకు పాల్పడింది. అవి ఖెంజమెన్, లోగ్జు మరియు అక్సాయ్ చిన్.

ఖెంజమెన్ అనేది థాగ్ల అనే ప్రాంతంలో ఉంది. భారత్ అక్కడ ఉన్న పర్వత శిఖరాన్ని సరిహద్దుగా పేర్కొంటే, చైనా అక్కడినుంచి రెండుమైళ్ళ లోప్ల ఉన్న బ్రిడ్జిని సరిహద్దుగా చూపించసాగింది. అక్కడి దాడిని గురించి సభకు వివరిస్తూ నెహ్రూ, "ఆగష్టు 7న 200మంది చైనీయులు సరిహద్దు దాటి లోపలికి ప్రవేశించారు. మన సైన్యం వారిని వెనక్కి వెళ్ళమని కోరగా వాళ్ళు వినలేదు. మనసైన్యాన్ని బ్రిడ్జివరకు తోసేసారు. మన సంఖ్య చాలా తక్కువగా ఉన్నది. అక్కడ కాల్పులేవీ జరగలేదు. తరువాత చైనీయులు పూర్తి ప్రాంతాన్ని మనకు వదిలేసి వెళ్ళిపోయారు. మనవాళ్ళు తిరిగి యధాస్థానానికి వచ్చేశారు. చైనీయులు మళ్ళీవచ్చి వెనక్కి వెళ్ళాలని, భారత పతకాన్ని దించెయ్యాలని ఆదేశించారు. అయితే సైనికులు వాళ్ళ మాటలను వినలేదు. చైనీయులు బలప్రయోగం చెయ్యబోగా ఫలించలేదు. ఆ తరువాత ఇంకేమీ జరుగలేదు." అన్నాడు.

రెండవ సంఘటన లొంగ్జులో జరిగింది. దాని గురించి ప్రస్తావిస్తూ " 25న చైనా సైన్యం సుబంసిరి ప్రాంతంలో గీత దాటి వచ్చి మన బలగాలపై కాల్పులకు పాల్పడింది. చైనీయులతో పోలిస్తే మనబలం చాలా తక్కువగా ఉంది. లొంగ్జు ప్రాంతం నుంచి సమీప సైనిక పోస్టు అయిన లిమెకింగ్‌కు చేరేందుకు ఐదురోజులు పడుతుంది. లిమెకింగ్ నుంచి రోడ్డుకి 12రోజులు పడుతుంది. అంటే ఘటనా స్థలాన్ని చేరుకునేందుకు కనీసం మూడు వారాలు కావాలి. దీనిని బట్టి సమాచారం, రవాణా, సైనికచర్యలవంటివి ఎంతకష్టమో సభ్యులు అర్థం చేసుకోగలరు. 26న చైనీయులు మరోసారి దాడిచేసి మనవాళ్ళని నిర్బంధించారు. ఇరుపక్షాలూ కాల్పులు జరిగినప్పటికీ ఎవరూ చనిపోలేదు. మాకు సమాచారం అందడంతోనే చైనాప్రభుత్వానికి మా అభ్యంతరాలను తెలియజేశాం."

ఈశాన్య సరిహద్దును పూర్తిగా సైన్యానికి అప్పగించినట్లు నెహ్రూ సభలో ప్రకటిఁచాడు. అస్సాం రైఫిల్స్ ఈవ్యవహారాన్ని చూసుకుంటుందని తెలియజేశాడు. వారు అక్కడీ పరిస్థితి నియంత్రిస్తారని అవసరమైతే ఇతరబలగాలను కూడా అక్కడకు పంపుతామని చెప్పాడు.

ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సిన విషయాలు- నెహ్రూ తన సహజ శైలికి విరుద్ధంగా సభలో చిన్నచిన్న వివరణలు ఇచ్చుకోవడం. సభ్యులకు నచ్చచెప్పేందుకు ప్రయత్నించడం. బహుశా ఇది నాయకులను, అధికారులను కలవరపెట్టి ఉండొచ్చు. సరిహద్దు భద్రతకు సన్నాహాలు చేస్తున్నామని నెహ్రూ చెప్పాక, ఏరకమైన సన్నాహాలు చేస్తున్నారు? అని సభ్యులుగానీ మీడియాగానీ అడగకపోవడం విడ్డూరం. అప్పటి పరిస్థితులకు అవసరమైనంత అదనపు వనరులు రక్షణశాఖ దగ్గరైతే లేదు. కొత్తగా సైనికుల నియామకం చెయ్యటేదు. సామాగ్రిని కొనుగోలు చేసే ప్రతిపాదనలేవీ చెయ్యలేదు. మరి అదనపు బలగాలు ఎక్కడి నుంచి వస్తాయి? మొట్టమొదటిసారిగా ప్రధాని సరిహద్దు రక్షణ గురించి మాట్లాడాక కూడా దీర్ఘకాలిక లక్ష్యాలేవీ పెట్టుకోలేదు. సమస్యతీవ్రతను అధ్యయనం చెయ్యలేదు. 1962 వరకు జరిగిన ప్రతిఒక్కదాడినీ చెదురుమదురు ఘటనలుగా కొట్తిపడేస్తూ వచ్చాడు. ఘటనలను పూర్తిస్థాయి అధ్యయనం చేసి జాతీయ భద్రతా విధానాన్ని తయారు చెయ్యకపోవడం ఆసమయంలో భారత్ చేసిన అతిపెద్దతప్పు.

సెప్టెంబరులో లడాఖ్, ఈశాన్య సరిహద్దు ప్రాంతాల్లో సుమారు యాభైవేల చదరపుమైళ్ళ ప్రాంతాన్ని చైనా ఆక్రమించుకుని తమభూభాగంగా ప్రకటించింది. అయితే 1961 వరకు భారత్ కనీస చర్యలు చేపట్టకపోవడం విడ్డూరం. దీన్నికూడా చెదురుమదురు ఘటనలుగానే భావించి ఉండవచ్చు. ఇదేమీ పెద్దవిషయంకాదనీ, విపరీతాలకేమీ దారితీయదనీ నెహ్రూ చెప్పుకొచ్చాడు. ఒక సందర్భంలో "అది బంజరుభూమి. అక్కడ గడ్డిపోచకూడా మొలవదు." అని పేర్కొనడం దేశవ్యాప్త నిరసనలకు తావిచ్చింది. నెహ్రూ ప్రతిష్ట మసకబారింది. అప్పటివరకూ నాయకుల, మేధావుల నుంచి విమర్శలనెదుర్కొన్న నెహ్రూ తనని దైవాంశసంభూతునిగా భావించి పూజించే సగటుమనిషినుంచి కూడా విమర్శలనెదుర్కోవాల్సి వచ్చింది. సభా సమయమంతా ఈఅంశంతోనే వృధాగా సాగిపోతోంది. అసమ్మతికి, ప్రతిపక్షాలకు నెహ్రూమీద దాడి చెయ్యడానికి సువర్ణావకాశం లభించడంతో సరిహద్దు సమస్య రాజకీయరంగు పులుముకుంది. ఇంతటి విషమ పరిస్థితుల్లోనూ ప్రజలకు నెహ్రూ తప్ప మరొక ప్రత్యామ్నాయం దొరకకపోవడం పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో మిక్కిలి శోచనీయం.

నమ్మదగ్గ మనుషులు పెద్దగా దొరకక పోవటంతో నెహ్రూ తన అభీష్టానుసారంగా నిర్ణయాలు తీసుకోసాగారు. దాంతో ప్రతిదానికి చర్చలద్వారా సానుకూల పరిష్కారాన్ని కనుగొనడమే భారత విధానమైంది. దీనిక్కూడా విపక్షాలనుంచి విమర్శలెదురవడంతో సరిహద్దు రక్షణకు చర్యలు మొదలుపెట్టారు. అయితే ఇవి దేశ అవసరాలను తీర్చేస్థాయిలో చేపట్టలేకపోయాం. సరిహద్దు ప్రాంతాలన్నీ సుదూరంగా ఉండటం, అక్కడికి రవాణాసౌకర్యాలను మెరుగుపరచక పోవడంతో వస్తురవాణా పూర్తిగా హెలికాప్టర్లమీద ఆధారపడి జరపాల్సి వచ్చింది. అయితే హెలికాప్టర్లను అన్నికాలాల్లోనూ వినియోగించలేకపోవడం, పైనుంచి జారవిడిచిన వస్తువుల్లో ఎక్కువభాగం వృధాగా పోవడం సైన్యానికి పెద్ద సమస్యగా మారింది. సరిహద్దును సైన్యానికి అప్పగించాక చేపట్టాల్సిన ఇతరపనులు, సైనిక వనరులు పెంచడం వంటివి జరగకపోవడంతో ఆకార్యక్రమం పెద్దగా ఏమీ సాధించలేకపోయింది. చైనా తనసైన్యానికి అత్యాధునిక ఆయుధాలు, సౌకర్యాలు కల్పించి పెద్దసంఖ్యలో బలగాల్ని మోహరించినా వారిని సరిహద్దు కాపలాదారులుగానే పేర్కొనింది. మనంమాత్రం ఎలాంటి సౌకర్యాలుగానీ, ఆయుధసామాగ్రికానీ ఇవ్వకుండానే ఓడజనుమందిని కాపలాకు పెట్టి సైన్యం అని పిలిచాం.

అక్టోబరులో హవిల్దార్ కరం సింగ్ నేతృత్వంలోని పోలీసుబృందమ్ మీద చైనీయులు దాడి చేశారు. 9మంది చనిపోగా 10మందిని నిర్బంధించారు. ప్రతిసారీ భారతసైన్యానికే ఎదురుదెబ్బలు తగులుతూ రావడంతో ఈఘటని విపరీతమైన ప్రజాగ్రహానికి కారణమైంది. ఇక చర్చలకు ఆస్కారంలేదనీ, యుధ్ధానికి సమయం దగ్గర పడుతుందనీ ప్రతి ఒక్కరికీ అర్థమయ్యింది.

ఇంతలో రక్షణశాఖలో పెద్ద దుమారం లేచింది. రక్షణమంత్రి కృష్ణమీనన్‌కు ఆర్మీచీఫ్ జనరల్ తిమ్మయ్యకు మద్య విబేధాలు తారాస్థాయికి చేరాయి. తిమ్మయ్య చాలాక్రితమే చైనాతో పొంచి ఉన్న ముప్పుని వివరిస్తూ సైన్యానికి కావల్సిన అదనపు వనరుల్ని కోరాడు. ఈసమయంలో మీనన్ కొంచెం దురుసుగా ప్రవర్తించడంతో నిబద్ధత కలిగిన అధికారిగా తిమ్మయ్య మనస్తాపానికి గురయ్యాడు. ఆయన జనరల్ అయ్యేందుకు ముందే సైన్యం వద్ద వనరులు తగినంతలేవని భావించి చైనాసరిహద్దు రక్షణ నిమిత్తం మరింత బలోపేతం చెయ్యాలని భావించాడు. అయితే ఆయన సూచనలేవీ అమలుకాకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో తిమ్మయ్య తనరాజీనామాను సమర్పించాడు. ప్రజాస్వామయ వ్యవస్థలో సర్వీసులో ఉన్న సైనిక అధికారికి ఇతకన్నా చెయ్యగలిగింది ఏమీలేదు. కీలక సమయంలో ఈదుమారం దేశాన్ని కలవరపరిచింది. మద్యలో నెహ్రూ కలుగజేసుకుని రాజీనామానైతే ఉపసంహరింపజేశాడుగానీ తిమ్మయ్యకు లభించాల్సినంత నైతికమద్దతు లభించలేదు.



తిమ్మయ్య గురించి కొన్నివిషయాలు క్లుప్తంగా- ఈయనది కర్ణాటకలోని కుడిగి జిల్లా. ఫీల్డ్ మార్షల్ కరియప్పకు దగ్గరి బంధువు. బంధువుల్లో చాలామంది సైన్యంలో పనిచేస్తుండటంతో చిన్నప్పటినుంచీ సైన్యంలో చేరటమే ఆశయంగా పెరిగాడు. సైన్యంలో చేరాక అత్యంత ప్రతిభావంతుడిగా గుర్తింపు పొందాడు. రెండవ ప్రపంచ యుద్ధంలో దళానికి కమాండర్గా నాయకత్వం వహించిన ఒకేఒక భారతీయుడీయన. బ్రిటిష్ ప్రభుత్వం నుంచి అవార్డు కూడా తీసుకున్నాడు. దేశవిభజన అనంతరం తెలెత్తిన ఉద్రిక్తత అల్లర్లకు దారితీసినప్పుడు పంజాబ్ ప్రాంతంలో చేసిన కృషికి ఇరువర్గాలనుంచి ప్రశంసలందుకున్నాడు. తరువాత కాశ్మీరులోయలో అనేక విజయాలకు నాయకత్వం వహించాడు. అక్కడి నుంచి రక్షణశాఖ ప్రధానకార్యాలయానికి బదిలీ అయ్యాడు. సర్వీసుమొత్తం నిజాయితీకి, నిబద్దతకు, క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచిన ఈయనంటే సైన్యంలో అందరికీ ఎంతో గౌరవం ఉండేది. సైన్యంలో ఉన్నన్నాళ్ళూ ఎవరిమీదా దురుసుగా వ్యవహరించిన సందర్భాలు లేవు. సహచరులంతా టిమ్మీ అని ముద్దుగా పిలుచుకునేవాళ్ళు. ఉత్తరాదివాళ్ళ ఆధిపత్యం ఎక్కువగా ఉండే సైన్యంలో దక్షిణాదివాడైనా అందరి గౌరవానికీ పాత్రుడయ్యాడు. ఇంతటి ఉన్నత విలువలు, ప్రతిభాపాటవాలు,  దేశభక్తి ఉన్నవ్యక్తి ఆర్మీచీఫ్ అయినరోజు భారతసైన్యం పులకించిపోయింది. సహజంగా ఇంతటి ఉన్నతస్థాయిలో ఎవరైనా రిటైర్ అయితే వాళ్ళకి తగుహోదా కల్పిస్తూ ఏదేశానికైనా రాయబారిగానో, సలహాదారుగానో నియమిస్తారు. కానీ ఈయనకి అలాంటివేమీ దక్కలేదు. కొన్నేళ్ళ తర్వాత ఐరాస సైప్రస్లో శాంతిని పునరుద్దరించేందుకు అక్కడికి పంపగా గుండేపోటుతో మరణించారు.

దేశం యుద్ధం వాకిట్లో నిలుచునే సమయానికి తగిన సన్నద్ధత లేదు. అంగబలం ఆర్థికబలం లేదు. కష్టకాలంలో తోడొచ్చే మిత్రులెవరూ లేరు. చైనా వాదనలకు సమానంగా ప్రవాదనలు వినిపించే అంశాలు లేవు. అదే సమయంలో మేజర్ జనరల్ బీ.ఎం. కౌల్ ను పదోన్నతిని కల్పిస్తూ రక్షణశాఖ డిల్లీకి బదిలీ చేసింది. ఈయన మీనన్కు సన్నిహితుడవడం ఇక్కడ కీలకమైన విషయం.

మేరునగ తప్పిదం- 3. మిత్రబేధం

చైనాతో స్నేహం, దౌత్యసంబంధాలు, అంతర్జాతీయ సమాజం వంటి అంశాలకు స్థాయికి మించి ప్రాముఖ్యత ఇవ్వడంతో భారతదేశ భద్రత గాలిలో దీపం చందంగా తయారయ్యింది. ఏరోజు సమస్యను ఆరోజు చూసుకోవడం, చెదురుమదురు ఘటనలంటూ సర్దిపుచ్చేసుకోవడం తప్ప భద్రతాపరమైన అంశాల్లో దీర్ఘకాలిక లక్ష్యాలేవీ భారత్ నిర్దేశించుకోలేదు. గతచరిత్ర నేర్పిన పాఠాలు నేర్చుకోకుండా భారత్ తన సరిహద్దును రక్షించుకోవడం అనే మౌలికధర్మాన్ని మరోసారి ఇతరుల దయాదాక్షిణ్యాలకు వదిలేసింది. కొంచెం ఘాటుగా ఉన్నా ఇది నిష్టుర సత్యం. ఐరాస మద్యవర్తిత్వం కాశ్మీరు సమస్యను తీర్చకపోగా మరింత జటిలం చెయ్యడంతో నెహ్రూకు ఇంటిపోరు పెరుగుతూ వచ్చింది. దాయాది నుంచి తరచుగా ఎదురైన సమస్యలను సైన్యం సమర్థవంతంగా అణిచివెయ్యగలిగినా అమెరికా నుంచి దానికి లభిస్తున్న సహాయం ప్రమాదఘంటికలు మోగించసాగింది.

1956నుంచి చైనా నెమ్మదిగా తన నిజస్వరూపాన్ని బయటపెట్టడం ప్రారంభించింది. లఢాఖ్, ఈశాన్య సరిహద్దులను తమవిగా ప్రకటించుకుంటూ చర్చలకు పిలుపునిచ్చింది. భారతభూభాగాలను చైనాలో అంతర్భాగంగా చూపెడుతూ కొన్ని మ్యాపులను విడుదల చేసింది. భారత్ దానికి అభ్యంతరం వ్యక్తం చెయ్యడంతో అవి పాతమ్యాపులని, త్వరలో సవరించి కొత్తవి విడుదల చేస్తామని చెప్పింది. అక్సాయ్ చిన్ ప్రాంతంలో నిర్మించిన రహదారి విషయం చైనా మాద్యమాల ద్వారా బహిర్గతమవ్వడంతో హిందీచీనీ భాయీభాయీ యుగానికి శుభంకార్డు పడింది అని చెప్పవచ్చు. ఆతర్వాత జరిగిన చర్చలు భారత్‌కు చెప్పుకోదగ్గ లాభాలేవీ కలిగించలేకపోయినా చైనా మాత్రం పాతసంధిపేరు చెప్పి వాణిజ్యపరమైన లాభాలు ఆర్జించుకుంటూ వచ్చింది.

చైనా నమ్మదగిన దేశంకాదు అన్న సంగతి నెహ్రూకు నెమ్మదిగా బోధపడసాగింది. కానీ దురదృష్టవశాత్తూ అప్పటికే దాదాపు ఒకదశాబ్దం వృధాగా గడిచిపోయింది. నెహ్రూ దగ్గర రెండు దారులున్నాయి. ఒకటి- అభివృద్ధి పధకాలు, పారిశ్రామికీకరణ ఆపేసి ఉన్నపళంగా రక్షణకు నిధులు మళ్ళించడం. కానీ ఇందులో చాలా సమస్యలున్నాయి. అందులో ముఖ్యమైంది సైనికదళాలకు డబ్బుతోబాటు తగినంత సమయం కావాలి. మన సైన్యంలో సింహభాగం మైదానాల్లో, ఎడారుల్లో యుద్ధంచెయ్యడానికి ( పాకిస్థాన్ సరిహద్దు) తర్పీదు పొంది ఉన్నారు. సైనికసామాగ్రి కూడా అందుకు అనుగుణంగా తయారు చెయ్యబడిందే. కానీ చైనా సరిహద్దు పూర్తిగా పర్వతాల మయం. అందులోనూ హిమాలయాలు.

మరొక ముఖ్యమైన సమస్య- ఉన్నపళంగా అంతసామాగ్రిని సరపరా చేసే దేశమేది? మనకు సామాగ్రిని సరపరా చేసే బ్రిటన్, అమెరికాలకి అప్పటికే పెద్దమొత్తంలో బాకీ పడున్నాం. అందునా అంతర్యుద్ధ పరిస్థితుల దృష్ట్యా ఏదేశమూ ఇంతపెద్దమొత్తంలో సరపరా చెయ్యడానికి ముందుకురాదు. అప్పటికే పాకిస్థాన్ అమెరికా పంచన చేరి లాభపడుతుండగా మనం అలీనవిధానంద్వారా, ఆఫ్రోఏషియన్ కూటమిని నెలకొల్పడంద్వారా ప్రాశ్కాత్య వ్యతిరేకులమన్న ముద్రను ఆపాదించుకున్నాం. అమెరికా తనసామంతరాజ్య విరోధికి ఎంతవరకూ సహాయం చేస్తుందనేది అనుమానమే. ఫ్రాన్స్, స్వీడన్ వంటి దేశాలు యుద్ధసామాగ్రి సరపరాల వ్యాపారంలా చేస్తున్నా వాటినుంచి కొనుగోలుచేసేంత నిల్వలు మనదగ్గర అప్పట్లో లేవు. కాశ్మీరు సమస్య తేలేవరకూ ప్రాశ్చాత్య దేశాలనుంచి ఇలాంటిసహాయాల్ని పొందలేని స్థితిలో భారత్ ఇరుక్కుపోయింది. అదేసమయంలో రష్యా తన వీటోను ఉపయోగించి మరీ ఐరాసలో మనకు మద్దతునిచ్చింది. సాంకేతిక సహకారాలు, ఎగుమతులు వగైరా, వీటన్నింటినీ మించి సోషలిస్ట్ భావజాలం కారణంగా ప్రాశ్చాత్య దేశాలకు భారత్ మరింత దూరమయ్యింది. పోనీ రష్యానుంచే సైనికసహాయాన్ని పొందుదామా అంటే తనసోదరదేశమైన చైనాతో యుధ్ధానికి అది సహాయం చేస్తుందని ఎలా అనుకోగలం?


వీటన్నింటినీ మించి- అప్పటికే అంతర్జాతీయ సమాజంలో శాంతివచనాలను వల్లిస్తున్న భారత్ (అంటే నెహ్రూ) ఉన్నపళంగా సైనికచర్యలకు ఆస్కారమిచ్చేలా ప్రవర్తిస్తే ఇంతకాలం కాపాడుకుంటూ వస్తున్న ప్రతిష్ట మసకబారిపోతుంది.  స్వతంత్ర్యం వచ్చిన దశాబ్ధానికే ఏకూటమికీ చెందని, పెద్దగా సైనికబలంలేని, స్వయంసమృద్ధిని సాధించని భారత్ ముందు సైనికసామాగ్రి ఆధునికీకరణ అన్నదానికి ఆస్కారమే లేకుండా పోయింది.

కాబట్టి సరిహద్దు భద్రత అన్న విషయంలో భారత్ ముందున్న దారల్లా చైనాతో సత్సంబంధాలు జరపడం. కాశ్మీరు విషయాన్ని అమెరికా చేతుల్లో పెట్టడం. రక్షణరంగంలో దుబారా చేసేకన్నా పారిశ్రామికీకరణకు నిధులు కల్పించడం ఉత్తమమన్న భావాన్నే నెహ్రూ ప్రతిసందంర్భంలోనూ బలంగా ప్రకటిస్తూ వచ్చాడు. అయితే ఇక్కడ మనం గమినించాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే- మన సరిహద్దుల్లో సమస్య తలెత్తిన రెండుదేశాలు ప్రపంచంలో రెండు వెరేవేరు కూటములకు చెందినవి. అగ్రరాజ్యాల దీర్ఘకాలిక లక్ష్యాలను నెరవేర్చేవి. అందునా రెండు సరిహద్దుల్లో ఒకటి మైదానం. మరొకటి మహాపర్వతం. కాబట్టి ఎట్టిపరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చెయ్యకూడని అంశం- సరిహద్దు భద్రత. పార్లమెంటులో ఈఅంశంమీద చర్చ జరిగినప్పుడల్లా నెహ్రూ తన అభివృద్ధికార్యక్రమాలకు విఘాతం కలుగకూడదన్న ఆలోచనతో జాతికి ఈవిషయంలో ఎలాంటి దిగులూ వద్దని 
పదేపదే హామీ ఇస్తూ వచ్చాడు.

జాతీయ భద్రతా విధానాన్ని రూపొందించిండంలో భారత్ తడబడుతూ ఉంటే చైనా ఇదే అదునుగా చొరబాట్లను ప్రోత్సహించడం మొదలుపెట్టింది. చర్చలు జరిగే సమయంలో చైనా ప్రతినిథులు కొంతదురుసుగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. భారత ప్రతినిథులు లేవనెత్తే అంశాలకు సరైన సమాధానాలు కూడా ఇవ్వకపోగా వాటిని వలసపాలకులు ఆసియామీద తమసైనికబలంద్వారా రుద్దినవిగా కొట్టిపారేశారు. ఆసమయంలో ఉన్నతస్థాయి రక్షణ నిపుణుల కమిటీ ఒకటి 
భారత్‌ను సందర్శించింది. ఆసందర్భంగా వారికి ప్రతి ఒక్కటీ ఎలాంటి దాపరికమూ లేకుండా చూపించాల్సిందిగా  భారతప్రభుత్వం సైన్యాన్ని ఆదేశించింది. వాళ్ళు అంతా చూసుకుని వెళ్ళారు.

10 మార్చి 1959న టిబెట్లో చెలరేగిన అల్లర్లు కీలకమైన మలుపులకు కారణంగా నిలిచాయి. ల్హాసాలో చైనా సైన్యానికీ టిబెటన్లకూ మద్య ఘర్షణ మొదలైంది. ఇది చైనా అంతర్గత సమస్యగా నెహ్రూ పార్లమెంటునుద్దేశించిన ప్రసంగంలో పేర్కొన్నాడు. ఘర్షణలు తీవ్రస్థాయికి చేరడం, సైన్యానిది పైచెయ్యి అవడంతో దలైలామా మరోసారి టిబెట్ను విడిచిపెట్టాల్సి వచ్చింది. ఏప్రిల్ 3న దలైలామాకు భారత్ ఆశ్రయం ఇచ్చినట్టుగా నెహ్రూ స్పశ్టం చెయ్యడంతో చైనాతో సంబంధాలకు దారులు పూర్తిగా మూసుకుపొయ్యాయి.


టిబెట్ నుంచి భారత్ వస్తున్న దలైలామాబృందం. కర్టసీ: http://www.guardian.co.uk


దలైలామాకు ఉన్న ప్రతిష్ట దృష్ట్యా భారత్ ఆయనకు తగిన సౌకర్యాలు కల్పించింది. ఊహించని ఈపరిణామం 
భారత్‌ను సందిగ్ధంలో పడేసింది. చైనాతో సంబంధాలపై దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందని నెహ్రూ బహిరంగంగా చెప్పాడు. చైనా భారత్ మీద దాడి చెయ్యడానికి ఇదే కారణమైతే ఆయుద్ధంలో నాదేశం ఓడిపోయినా దానికి నేను గర్విస్తాను. బలవంతుడైన వాడు తనకి నచ్చిన వాడికెవడికైనా ఆశ్రయమివ్వగలడు. కానీ పెద్దగా బలంలేని, అందులోనూ దీనివల్ల ఒకబలమైన శత్రువును ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిసీ అందుకు ఒప్పుకున్నందుకు భారతీయులుగా మనందరం గర్వించాలి. ఈగడ్డమీద పుట్టిన ధర్మాన్ని కాపాడుకోవల్సిన భారతీయులుగా మన బాద్యత. ఈప్రాంతంలో బౌద్ధధర్మం బలంగా ఉన్న దేశాలు తమకుతాముగా ముందువాల్సిందిపోయి డ్రాగన్ను చూసి భయపడ్డాయి. దలైలామాకూడా భారతే తనకు రక్షణనివ్వగల ప్రాంతంగా భావించి వచ్చాడు. ఆనమ్మకాన్ని ఎన్నిసమస్యలెదురైనా ఇన్నేళ్ళుగా నిలబెట్టుకుంటూ వచ్చాం. యుద్ధంలో గెలుపోటములను బట్టే బలాబలాల్ని బేరీజు వేసే ప్రపంచానికి ఇలా వ్యవహరించేందుకు ఎంతటి మనోస్థైర్యం కావాలో అర్థం కాకపోవచ్చు. టిబెటన్లకు మాత్రం అర్థమయ్యింది.

అప్పట్నుంచీ చైనా నెమ్మదిగా తన సైనిక సామర్థ్యాన్ని, సరిహద్దువెంబడి కార్యకలాపాల్ని పెంచుకుంటూ పోగా భారత్ మాత్రం కనీస చర్యలు చేపట్టకపోవడం ఆత్మహత్యా సదృశం. సమస్య రోజురోజుకీ పెద్దదవుతూ వస్తున్నప్పుడు కనీస చర్యలు చేపట్టి జాతి గౌరవాన్ని కాపాడుకోవడం అన్నది ఏప్రభుత్వమైనా నిర్వర్తించాల్సిన కనీసధర్మం. మూడేళ్ళలో చైనా ప్రణాళిక ప్రకారం సరిహద్దు వెంబడి పనులు చక్కబెట్టుకుంటూ పోతుంటే భారత్ కనీసం రోడ్లను కూడా మెరుగుపరచుకోలేదు. రక్షణపరంగా ఇదొక ఘోరతప్పిందం.

మేరునగ తప్పిదం - 2. హిందీ చీనీ భాయీ భాయీ

చైనీయులు టిబెట్ మీద నెమ్మదిగా పట్టు సంపాదించడం మొదలుపెట్టారు. 9 సెప్టెంబర్ 1951, చైనా బలగాలు టిబెట్ రాజధాని ల్హాసాలోకి ప్రవేశించాయి. వాళ్ళు చెయ్యాలనుకున్న పనులన్నీ దలైలామా చేత చెయ్యించుకున్నారు. రాజకీయక్షేత్రంలో  నెమ్మదిగా మార్పులు చెయ్యడం మెదలుపెట్టారు. సైనికావసరాలకు అనుగుణంగా రోడ్లు, విమానాశ్రయాలు, సమచార వ్యవస్థలను మెరుగుపరుచుకున్నారు. వాటన్నింటినీ సైనికావసారలకు సరిపోయేంత సామర్థ్యంతో నిర్మించారు. ఇందులో భాగంగా వారు తలపెట్టిన ఔటర్ రింగ్ రోడ్డు కొంతభాగం భారత భూభాగమైన అక్సాయ్ చిన్ గుండా వెళ్ళాల్సి రావడంతో దాన్ని ఆక్రమించుకున్నారు. 

ఇటువైపు భారత్ పరిస్థితి పూర్తిగా తలకిందులుగా ఉంది. సైనిక సామర్థ్యం సంగతి దేవుడెరుగు కనీసం రహదారి నిర్మించారన్న సమాచారంకూడా భారత ప్రభుత్వానికి అందలేదు. తీరా విషయం తెలిశాక కొన్ని బృందాలను పంపితే వాటిని చైనా నిర్బంధించినా అడిగే నాథుడే కరువయ్యాడు. దీని గురించి పార్లమెంటుకు ఎందుకు సమాచారమివ్వలేదు అని అడుగిన ప్రశ్నకు జవాబిస్తూ నెహ్రూ " దానిగురించే చర్చించే సందర్భం రాలేదు." అని చెప్పాడు.

1953కల్లా టిబెట్లోని అన్ని ముఖ్యమైన పట్టణాల్లో చైనాప్రభుత్వం తన సైనికావసారలకనుగుణంగా మౌలికవసతులను నెలకొల్పింది. 1954లో
మెక్‌మహాన్‌రేఖ వెంబడి ఒక రహదారి, దాన్ని దేశంలోని మిగతాప్రాంతాలకు కలుపుతూ మరికొన్నిదార్లను పూర్తి చేసింది. వందలకొద్దీ యువటిబెటన్లను చైనాకు తీసుకెళ్ళి కఠోరశిక్శణను ఇప్పించి వార్ని టిబెట్లోని ముఖ్యమైన శాఖల్లో నియమించింది. వారంతా శిక్షణపూర్తయ్యేసరికే కరడుగట్టిన కమ్యూనిష్టులుగా మార్చేసింది. భారత్ నుంచి సహాయం అలానే మిగతావ్యవహారలన్నీ చక్కబెట్టుకునేందుకు సమయం కావాలి కాబట్టి సరిహద్దు  వ్యవహారాలను కదిలించలేదు. వ్యూహాత్మకంగా హిందీ చీనీ భాయీ భాయీ అనే పల్లవి అందుకుంది. ఇద్దరి మద్యనా ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరచుకోవడం, పర్యటనలు, సాంస్కృతిక కార్యక్రమాలు వగైరాలతో కాలం వెళ్ళబుచ్చారు.

ఆసమయంలో 
భారత్‌కు ఒకవైపు కాశ్మీర్ అంశం పీటముడి వేసుకుని గింజుకుంటోంది. మరోవైపు నెహ్రూ తన మానసపుత్రిక అయిన పంచవర్షప్రణాళికను ప్రకటించి దాన్ని అమలుపరచడంలో నిమగ్నమయ్యాడు. దేశమంతా దీనిమీద ఎన్నోఆశలు పెట్టుకుని ఫలితాలను బేరీజు వేసుకుంటోంది. టిబెట్ లో వర్తకవాణిజ్యాలు, ఇతర సంబంధాల మీద చైనా భారత్ లు ఒప్పందాన్ని చేసుకున్నాయి. దీని పీఠికలో పొందుపరిచిన ఐదు సూత్రాలు పంచశీల సూత్రాలుగా ప్రాచుర్యం పొందాయి. అవి 1. పరస్పర గౌరవం 2. ఒకరి మీద మరొకరు దాడి చెయ్యకుండటం. 3. ఒకరి అంతర్గత వ్యవహారాల్లో మరొకరు తలదూర్చకుండటం. 4. సమలాభం 5. స్నేహపూర్వక సంబంధాలు కలిగి ఉండటం




ఈ ఒప్పందం ద్వారా చైనాకు జరిగిన మేలులో పదోవంతు కూడా మనకు దక్కలేదు. చైనీయులు మాటిచ్చిన సత్ప్రవర్తనకు ప్రతిగా మనం 
టిబెట్‌ను పళ్ళెంలో పెట్టి సమర్పించుకున్నాం. టిబెట్‌ను చైనాలో అంతర్భాగంగా ఒప్పుకున్నందుకు సమానమైనదేదీ భారత్ అడగలేదు. దీనివల్ల బ్రిటీష్ వాళ్ళ ద్వారా మనకు సంక్రమించిన టిబెట్ వ్యవహారలపై అధికారం, అక్కడి సమాచార వ్యవస్థ, సైనిక కార్యకలాపాల వంటి కీలకమైన హక్కులు చైనాకు తేరగా ధారపోశాం. ఈ ఒప్పందాన్ని సమర్థించుకుంటూ నెహ్రూ తన ప్రకటనలో చైనా పట్ల తనకున్న నమ్మకాన్ని ప్రస్పుటంగా తెలియజేశాడు. ఈచర్యల ద్వారా చైనా భారత్ల మద్య సంబంధాలు బలపడతాయని ప్రగాడంగా విశ్వసించాడు. నెహ్రూ బతికున్నంత వరకూ చైనాతో యుధ్దంరాదు అన్న నినాదం దేశమంతా బయలుదేరింది. అన్నిప్రభుత్వ శాఖల్లోనూ, ప్రభుత్వ విధానాల్లోనూ, ప్రజల మాటతీరులోనూ ఈవిశ్వాసం కొట్టొచ్చినట్టు కనిపించింది. రెండు దేశాల మద్యన సంబంధాలు ఒకవ్యక్తి చుట్టూ తిరిగితే ఎంత ప్రమాదకరమో బహుశా భారతీయులకు అప్పుడు తెలిసుండకపోవచ్చు. నెహ్రూ మరణాన్ని జయించిన వాడేమీ కాదు. ఒక దార్శనికునిగా, రాజనీతిజ్ఞునిగా ఆయన శక్తియుక్తుల మీద ఎంతనమ్మకమున్నా దేశభవిష్యత్తును ప్రభావితం చేసే కీలక అంశాల్లో పార్లమెంటు, కేబినెట్ వారివారి అస్థిత్వాన్ని నిలుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దురదృష్టవశాత్తూ ఆయన బతికుండగానే యుధ్దం వచ్చింది. "చరిత్రలో ఎన్నడూ భారత్ చైనాల మద్య యుద్దం రాలేదు. ఇకపై రాబోదు" అని ప్రకటించడం ద్వారా చైనా అనేక అంతర్జాతీయ అంశాల్లో భారత్‌ను వ్యూహాత్మకంగా వాడుకుంది. అలీన దేశాల నాయకునిగా, శాంతికాముక దేశంగా భారత్‌కు అంతర్జాతీయ సమాజంలో ఉన్న మంచిపేరును చైనా తన అవసరాలకనుగుణంగా ఉపయోగించుకుంది.

భారత్ చేసిన మరొక వ్యూహాత్మక తప్పిదం- పంచశీల సమయంలో టిబెట్- 
భారత్‌ల మద్య సరిహద్దును చర్చించకపోవడం. అసలు టిబెట్ ఎక్కడ వరకు ఉందో చెప్పకుండానే టిబెట్‌ను చైనాకు ఇవ్వడం ఘోరమైన తప్పిదం. చైనా 1954లో భారత భూభాగాన్ని ఆక్రమించుకున్నప్పుడు చౌ ఎన్ లై ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఇంకా సరిహద్దు ఏర్పాటు చేసుకోలేదు అని చెప్పడం ద్వారా హెచ్చరించినా భారత్ బుర్రకి ఎక్కలేదు. తర్వాత నెహ్రూను చైనా ప్రభుత్వం ఆహ్వానించి రాజలాంచనాలతో సత్కరించింది. నెహ్రూ పూర్తిగా సంతుష్టుడయ్యి డిల్లీ తిరిగొచ్చాక చైనాతో యుధ్ధంరాదు అని చెప్పడంతో చైనా తనవ్యూహాన్ని పక్కాగా అమలు పరచినట్టయ్యింది.

1952లో జనరల్ కుశ్వంత్
సింగ్‌ను దేశ ఉత్తర సరిహద్దుల పరిస్థితిపైనా, చైనాతో మనకున్న ముప్పుపైనా నివేదికను ఇవ్వవలసిందిగా ప్రభుత్వం ఆదేశించింది. అయితే ఆయన సమర్పించిన సుదీర్ఘ నివేదిక అటకెక్కింది. ఆయన సూచించినవేవీ అవసరంలేదని కాబినెట్ ఏకగ్రీవంగా తేల్చేసింది. కానీ ఆతర్వాత కనీసం రోడ్లు, సమాచార వ్యవస్థ, ఇంటిలిజెన్స్ వంటివి కూడా అభివృద్ధి చెయ్యకపోవడం ఘోరతప్పిదం.

దేశవిభజన తదనంతర పరిస్థితులు, పాక్ అమెరికా పంచన చేరటం ద్వారా మారిన సమీకరణాలు, అంతర్యుద్ధం ఇత్యాది కారణాల వల్ల భారత రక్షణ వ్యవస్థ పూర్తిగా పాకిస్థాన్ పక్కనుంచి ఉన్న ప్రమాదాన్ని చూసుకుంటూ చైనాసమస్యను చిన్నచూపు చూసాయి. అమెరికా నుంచి పెద్ద ఎత్తున సైనికసహాయం అందటం ద్వారా పాకిస్థాన్ రక్షణ శక్తి ఇబ్బడిముబ్బడీగా పెరిగే ప్రమాదం పొంచుకొచ్చింది. భారత్ దీనికి అభ్యంతరం వ్యక్తం చేసినా అమెరికా మాటివ్వడంతో మరోసారి మనదేశభద్రతను మరొకరి చేతుల్లో పెట్టి వాళ్ళనోటిమాటతో తిరిగొచ్చాం.
అయితే 1965లో యుధ్ధం వచ్చినప్పుడు పాకిస్థాన్ అమెరికా సమకూర్చిన ఆయుధాలతో దాడి చేస్తుంటే అమెరికా కట్టడి చెయ్యకపోవడం గమనార్హం.

మారిన సమీకరణాలను తనకు అనుకూలంగా మలచుకునేందుకు రష్యా 
భారత్‌కు సహాయం చేస్తానని ముందుకొచ్చినా నెహ్రూ దాన్ని నిరాకరించడం ద్వారా అలీన విధానానికి మనసా వాచా కర్మణా తానెంత కట్టుబడి ఉన్నాడో చెప్పడం భారతీయుల మనసుల్లోనూ, అంతర్జాతీయ సమాజంలోనూ ఆయన మీద అపారమైన గౌరవభావం పెంపొందేలా చేసింది.

ఈరకంగా 1950-55 మద్యకాలంలో చైనా గుట్టుగా తనసామర్థ్యాన్ని పెంచుకుంటూ 
భారత్‌కు జోలపాడి నిద్రపుచ్చింది.

మేరునగ తప్పిదం- 1. టిబెట్ వివాదం

ప్రంపంచంలో తలెత్తే ప్రతిఒక్క వివాదం వెనుకా ఒక చరిత్ర ఉన్నట్టే టిబెట్ వివాదానికీ ఒకచరిత్ర నిజానికీ పెద్ద చరిత్రే ఉంది. బౌద్ధామారాలకి నెలవైన టిబెట్ భారతదేశంతో ఎన్నోశతాబ్దాలుగా స్నేహపూర్వక సంబంధాలున్నాయి. మత, సాంఘీక, సాంస్కృతిక, వాణిజ్య, మేథోపరమైన అంశాలెన్నో రెండుదేశాల మద్యనా సౌబ్రాతృత్వ వాతావరణాన్ని నెలకొల్పాయి. బౌద్ధధర్మం, హిమాలయాలు, సాధుజన సందోహం రెండింటి మద్యనా వారధులుగా నిలిచాయి. ఈబంధం ఎంతలా పెనవేసుకుపోయిందంటే రెంటిమద్యలో నిర్ధిష్టమైన సరిహద్దును ఏర్పాటు చేసుకోవాలన్న ఆలోచనే ఎవ్వరికీ రాలేదు. ఆ అవసరమే లేదనుకున్నారు. దురదృష్టవశాత్తూ అదే మన కొంపముంచింది.

బౌద్ధమతంలో ప్రధానంగా ఉన్నవి రెండు శాఖలు. ఒకటి హీనయానం మరొకటి మహాయానం. టిబెట్లో ఈరెండూకాక వజ్రయానం అనే మరొకశాఖ ఉంది. వీరికి గురువులుగా లామాలు ఉంటారు. వీరందరికీ పెద్దగా అత్యున్నత పదవిలో దలైలామా ఉటాడు. మిగతాదేశాల్లోలాగాటిబెట్‌లో మతాధిపతిగా ఒకరు, దేశాధిపతిగా మరొకరు ఉండరు. మతాధిపతి అయినా దలైలామానే ప్రభుత్వాధినేతగా పాలనా వ్యవహారాలు చూసుకుంటాడు.  1720లో మొదటిసారిగా చైనా బలగాలు టిబెట్టులోకి ప్రవేశించాయి. ప్రంపంచానికి తెలిసిన చరిత్ర ప్రకారం చూస్తే, పద్దెనిమిదో శతాబ్ధం వరకూ టిబెట్ స్వతంత్రంగానే ఉన్నది. టిబెటన్లు మంగోలులతో కలిసి కూటమిగా ఏర్పడి చైనామీదకి దాడిచెయ్యడానికి ప్రయత్నిస్తున్నాయి అన్నది చైనా కూపిన సాకు.
అయితే 1792 వరకు చైనాకి టిబెట్టుమీద గుత్తాధిపత్యం లభించలేదు. 1792లో చైనా మొదటిసారి అంబన్ అనేహోదాలో తన ప్రతినిధిని నియమించి అతని ద్వారా వ్యవహారాలన్నీ నడపడం మొదలుపెట్టింది. కానీ కొన్నిసంవత్సరాలకే చైనా బలహీన మవ్వడంతో తదుపరి దలైలామాను చైనాకి తెలియజేయకుండానే ఎన్నుకోవడం ద్వారా స్వతంత్రాన్ని ప్రకటించుకున్నట్టయ్యింది.

1904లో దలైలామా రష్యన్లతో చేతులు కలపవచ్చునన్న సందేహంతో లార్డ్ కర్జన్ దలైలామా చేత బలవంతంగా ఆంగ్లో టిబెటన్ ఒప్పందాల మీద సంతకాలు చెయ్యించాడు. తద్వారా టిబెట్ వాణిజ్యరంగంమీదా, విదేశాంగ విధానాలమీద ఆంగ్లేయులకు పట్టు చిక్కింది. టిబెట్ సార్వభౌమత్వాన్ని గుర్తించాల్సిందిగా కర్జన్ బ్రిటిశ్ ప్రభుత్వానికి సూచన చేశాడు. అయితే రవి అస్తమించని సామ్రాజ్యాన్ని పాలిస్తున్న బ్రిటిష్ వారికి బలహీన చైనా పెద్దసమస్యగా కనిపించలేదు.


1910లో చైనా పాలకులు హఠాత్తుగా టిబెట్ మీద దాడి చేసి, దలైలామాను దేశంనుంచి వెళ్ళగొట్టారు. ఆయన భారత్ లో తలదాచుకున్నాడు. అయితే వెనువెంటనే చైనాలో విప్లవం రావటం, మాన్చువంశస్థుల పాలన అంతం కావడంతో 1912లొ దలైలామా తిరిగి అధికారాన్ని కైవసం చేసుకున్నాడు.  అడపాదడపా చైనీయులు దాడి చేసినా ఆంగ్లేయులు తమ వాణిజ్య, సైనిక అవసరాల నిమిత్తం టిబెట్ను కాపాడుతూ వచ్చారు.


1913లో టిబెటన్లు స్వతంత్రాన్ని ప్రకటించుకున్నారు. టిబెట్, చైనా మరియు బ్రిటన్ల మద్య త్రైపాక్షిక చర్చలు సిమ్లాలో జరిగాయి. ఆ ఒప్పందంలో ముఖ్యమైన విషయం- టిబెట్నుఅంతర టిబెట్, బాహ్యటిబెట్లుగా రెండు ప్రాంతాలుగా విభజించారు. భారతదేశంతో సరిహద్దు ఉన్నటువంటి వెలుపలి భాగంనుంచి చైనా పూర్తిగా వైదొలగాలి. ఈప్రాంతం పూర్తిగా స్వయంప్రతిపత్తిని కలిగి ఉండాలి. అయితే చైనా రెండుభాగాలమద్యనా ఒప్పందంలో నిర్దేశించిన సరిహద్దును ఒప్పుకోలేదు. ఒప్పదంమీద సంతకం చెయ్యడానికి నిరాకరించింది. అలాగే టిబెట్కు పొరుగునున్న భారత్, బర్మా, భూటాన్ దేశాలతో సరిహద్దుకూడా పేర్కొన్నారు. ఈసరిహద్దే తదనంతరం మెక్ మహోన్ రేఖగా ప్రాచుర్యం పొందింది. ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే- చైనా ఒప్పందంలో పేర్కొన్న అంతర్గత సరిహద్దుల పట్ల అభ్యంతరం తెలియజేసిందిగానీ టిబెట్టుకు దాని పొరుగుదేశాల మద్యనున్న సరిహద్దు గురించి కాదు. కానీ సరిహద్దు వివాదం మొదలయ్యాక తనసలు దాన్ని గుర్తించనని, ఆనాటి ఒప్పందంలో తన సంతకాలు లేవు కాబట్టి అవి చెల్లవని స్పష్టం చేసింది!!!


ఈఒప్పందం తర్వాత టిబెట్ పూర్తి స్వతంత్రంగా వ్యవహరించింది. రెండవ ప్రపంచయుద్ధంలో చైనా పాల్గొనగా ఇది పూర్తిగా తటస్థవైఖరిని అవలంబించడంద్వారా ఆవిషయాన్ని ప్రపంచానికి స్పష్టంచేసింది. ఈవిషయాలన్నీ గమనిస్తే మనకు అర్థం అయ్యేదేమంటే- చైనాకు బలం ఉన్నప్పుడు యుద్ధంకేసి గెలవడం తప్ప టిబెట్ మీద దానికి ఎలాంటి పట్టూ లేదు. టిబెట్ స్వాతంత్ర్యం అన్నది చైనా బలాబలాలమీద ఆధారపడి ఉన్నది. కొద్దికాలం మినహాయిస్తే టిబెట్ మీద చైనాకు పూర్తిస్థాయి పట్టు ఎన్నడూ లేదు.  1912 నుంచి 1950 వరకు టిబెట్ పూర్తిస్థాయి స్వయంప్రతిపత్తిని అనుభవించింది. టిబెట్ స్వాతంత్ర్యం అన్న విషయానికి బ్రిటిష్ పాలకులు చాలాప్రాముఖ్యతను ఇచ్చారు. అందుకు ముఖ్యమైన కారణం ఈప్రాంతం కమ్యూనిష్ట్ చైనాకు భారత్‌కూ మద్యన ఒక తటస్థప్రాంతంగా అభివృద్ధిచెయ్యడంద్వారా రక్షణపరమైన సమస్యలు చాలావరకూ తగ్గించుకోవచ్చు. 




అయితే 1950లో చైనా టిబెట్ను దురాక్రమించుకోవడం ద్వారా రెంటిమద్యనున్న తటస్థవేదిక మాయం అయ్యింది. 25 అక్టోబర్ 1950న "టిబెట్ ప్రజలకు స్వేచ్చను ప్రసాదించడానికి, అవిభాజ్య చైనాను నెలకొల్పడానికి, వలసపాలనను పూర్తిగా నిరోధించడానికి, సరిహద్దు ప్రాంతాలను కాపాడుకోవడానికి టిబెట్ను చైనాలో విలీనం చేసుకుంటున్నాం." అని కమ్యూనిష్ట్ చైనా ప్రకటించడం ద్వారా ఒకబలమైన శత్రువు మనపెరటి తలుపు దగ్గర వచ్చి నిలబడ్డాడు. ఇది 
భారత్‌కు అత్యంతప్రతికూలాంశం. ఈచర్యతో ఉత్తర, ఈశాన్య సరిహద్ద్దు ప్రాంతాల్లో రాజకీయ సమతాస్థితి దెబ్బతింది. ( ప్రస్తుతం నేపాల్లో కమ్యూనిష్టులు బలపడటం భవిష్యత్తులో మరో ఉపద్రవానికి కారణం కావచ్చు) ఉత్తరాన కొన్నియుగాలుగా పెట్టని కోటలుగా ఉన్న హిమాలయలే నేడు ఒక బలమైన శత్రువుకు సైనిక స్థావరంగా మారే ప్రమాదం సంభవించింది.

రానున్న ఉపద్రవాన్ని ముందుగానే ఊహించిన పటేల్ మహాశయుడు తన మరణానికి నెలరోజులముందు ప్రధానికి ఒక సుదీర్ఘమైన లేఖను రాశాడు. అందులో టిబెట్‌నుచైనా ఆక్రమించడం దేశరక్షణకు ఎంతపెద్దముప్పో సవివరంగా తెలియజేశాడు. ఆయన అందులో అనుమానించినవన్నీకాలక్రమంలో నిజమయ్యాయి. కానీ దురదృష్టవశాత్తూ పటేల్ నిష్కృమణతో దేశరాజకీయాలు ఏకదృవమయ్యాయి. భారత ప్రభుత్వం మొక్కుబడిగా సంభ్రమాశ్చర్యాలను, ప్రగాడ సంతాపాన్ని తెలియజేసింది.

రానున్నది ఎంతగడ్డుకాలమో కొద్దిమందికి తప్ప దేశంలో ఎవరికీ పట్టలేదు. సగటు మానవుడు కొత్తగా వచ్చిన స్వాతంత్ర్యాన్నిచూసుకుంటూ మురిసిపోతున్నాడు. మేథావులంతా కొత్తగా తయారైన రాజ్యాంగాన్ని పరిశోధిస్తున్నారు. అధికారగణమంతా జవహర్ను అంతర్జాతీయ సమాజంలో ధృవతారగా చూపే పనిలోనూ, విదేశాంగశాఖ ఆయన పర్యటనల ఏర్పాట్లలోనూ, ఉపన్యాసాలు తయారు చెయ్యడంలోనూ తలమునకలై ఉన్నారు. 
జయప్రకాష్ నారాయణ్, ఎన్.జీ. రంగా వంటివారు పార్లమెంటులో మనవైఖరిని విమర్శించినా పెద్దగా ఒరిగిందేమీలేదు.

చైనీయులతో సామరస్యంగా సమస్యను పరిష్కరించుకోవడానికే మొగ్గుచూపుతూ హిందూ చీనీ భాయీభాయి అనే నినాదాన్ని తెరపైకి తీసుకొచ్చింది. ఆసమయంలో బలవంతుడు బలవంతుణ్ణే గౌరవిస్తాడు. అతనితోనే స్నేహంచేస్తాడు అన్న మౌలిక విషయాన్ని మనం మర్చిపోయామనుకుంటా. బలమైన చైనా చాలా ప్రమాదకారి. రాజ్యకాంక్షతో విస్తరణ చెయ్యడం దాని నైజం. జరిగిన పరిణామాలతో దానికి బలం, వనరులనేగాక కాంక్షను రెచ్చగొట్టగలిగిన అనేక అంశాలు అనుకూలమయ్యాయి.

నిజానికి సమస్య తీవ్రతను బేరీజు వేసుకున్నాక, టిబెట్ను చైనా కబంధహస్తాల నుంచి కాపాడటానికి మనం దౌత్యపరంగానూ, న్యాయపరంగానూ చెయ్యగలిగిన ప్రయత్నాలన్నీ చేసుండాల్సింది. మనదేశరక్షణావసరాల దృష్ట్యా మనం తప్పక చెయ్యాల్సిన పని అది. జవహర్ అప్పటికే అంతర్జాతీయ సమాజంలో కూడగట్టుకున్న ప్రతిష్టను ఇందుకు వినియోగించాల్సింది. తద్వారా ఒకబలహీన దేశానికి చేయూత నందించిన వాడిగాను, తన దేశప్రయోజనాలను కాపాడుకున్న నాయకుడిగాను ఎంతోపేరొచ్చుండేది. మహాభారతం ఉద్యోగపర్వంలో చెప్పినట్టు పెద్దలు, విజ్ణులైనవారు జరుగుతున్న చెడును నివారించకుంటే దానికి వాళ్ళూ బలైపోతారు. భారతదేశానికి ఈవిషయంలో జరిగిందిదే. వేలసంవత్సరాల చరిత్ర,, సంస్కృతి, ధర్మంపట్ల నమ్మకం కలిగిన జాతిగా మనం కళ్ళముందు జరిగిన దారుణాన్ని నిలువరించలేకపోయాం. నిలువరించేంత బలం లేకపోయినా కనీసం అంతర్జాతీయ సమాజానికి తెలియజెప్పే పనైనా చెయ్యాల్సిన విద్యుక్తధర్మం మనపట్ల ఉంది. కానీ దురదృష్టవశాత్తూ ఐక్యరాజ్యసమితిలో జరిగిన చర్చకు మద్దతిచ్చి టిబెట్ విముక్తికి సహాయపడాల్సిందిపోయి మనమే చర్చను వ్యతిరేకించాం. ఈసమస్యను టిబెట్ చైనాలు చర్చల ద్వారా పరిష్కరించుకుంటాయి అని చెప్పడం ద్వారా మనమే ప్రపంచంనోరు నొక్కేశాం. జరుగుతున్న పరిణామాలతో అందరికన్నా ఎక్కువగా ప్రభావితమయ్యే మనమే చర్చను వద్దనడంతో మిగతాదేశాలకు దీన్నిపట్టించుకొనవలసిన అవసరం కనిపించలేదు.

అలా టిబెట్ సమస్యను భారత్ పరిష్కరించేసింది. అది చైనాలో అంతర్భాగంగా అప్రతిహతంగా కొనసాగుతోంది. ప్రస్తుత ఆర్థిక, రాజకీయ పరిస్థితులను బట్టి చూస్తే ఇప్పట్లో టిబెట్కు స్వేచ్చా స్వాతంత్ర్యాలు లభించే అవకాశాలు కనుచూపుమేరలో లేవు. డ్రాగన్ మనపక్కలోనే బుసలుకొడుతూ రోజురోజుకీ బలపడుతుంది. సైనిక సామర్థ్యాన్ని వందలరెట్లు పెంచుకుంటోంది. మరొకవైపున కాశ్మీర్ రగులుతూనే ఉంది. నేపాల్ కమ్యూనిష్టుల పరమవడంతో ఉత్తరసరిహద్దు పూర్తిగా రావణకాష్టంగా మారింది. ఏహిమాలయాలను చూసుకుంటూ పెట్టనికోటలంటూ మురిసిపోయామో అవేపర్వతాలు శత్రువుల సైనికస్థావరాలుగా, శిక్షణాశిబిరాలుగా, ఆయుధాగారాలుగా మారిపోతే చేష్టలుడిగి చూస్తున్నాం. దేశబడ్జెట్లో సింహభాగం సరిహద్దు రక్శణకే ఖర్చవుతోంది. దేశశ్రేయస్సు దృష్ట్యా రక్శణవ్యయాన్ని విపరీతంగా కుదించేందుకు మొగ్గుచూపినందుకుగాను తదనంతరం ఒకవైపు మనభూభాగాన్ని కోల్పోగా, మరోవైపు రక్షణవ్యయం అంతకంతకు పెరిగింది. ఖర్చయితే అవుతుందిగానీ సమస్యలకు ఒక శాశ్వత పరిష్కారం అయితే దొరకట్లేదు.

మేరునగ తప్పిదం

వేలకొద్ది సంవత్సరాల చరిత్ర కలిగిన ఒకజాతి తనఅస్థిత్వాన్ని కోల్పోయి, శతాబ్ధాలపాటు బానిసత్వంలో మగ్గిన తరువాత,  ప్రపంచం నివ్వెరపోయేలా అహింసని ఆయుధంగా మలచుకుని, విషసర్పాల నడుములు విరగ్గొట్టి, తనఝెండాని రెపరెపలాడించింది. సంబరాలు మిన్నంటిన మరుక్షణమే బాలారిష్టాలు మొదలయ్యాయి. అతుకులబొంతని కాశ్మీరీ తివాచీలా మార్చేబాద్యతని పటేల్ మహాశయుడు భుజాన వేసుకుని అద్భుతాన్ని ఆవిష్కరించాడు. సర్వజనామోదమైన రాజ్యాంగాన్ని అంబేద్కర్ ప్రసాదించాడు. ప్రధమ భారత పధానిగా నెహ్రూ దూరదృష్టితో ప్రవేశపెట్టిన అనేక పధకాలు, అమలుచేసిన విధాన నిర్ణయాలు, స్థాపించిన సంస్థలు, పరిశ్రమలు ఇతర అంతర్జాతీయ విషయాలు ప్రజలకు మునుపెన్నడూ అనుభవంలేని ప్రజాస్వామ్యం అనే కొత్తవ్యవస్థ పైన గురికుదిరేలా చేశాయి.

నెమ్మదిగా ఒక్కొక ఫలితం కళ్ళముందు కనబడటం మొదలవ్వటంతో నిన్నగాక మొన్న మేల్కొన్న జాతి అంతలోనే మగత నిద్రలోకి జారుకుంది. పక్కలోనే నిప్పులుగక్కే డ్రాగన్ ఉన్నాడన్న నిజాన్ని విస్మరించి, అడపాదడపా తగిలిన ఎదురుదెబ్బలకి పెయిన్ కిల్లర్లతో సరిపెట్టి మగత నిద్రలోకి జారుకుంది. ఫలితం- ఓ తెల్లవారుఝామున ఆడ్రాగన్ భూతం విరుచుకు పడింది. తెల్లారేసరికి వందలకొద్దీ సైనికులు ( చలికి, అన్నం దొరక్క, గాయాలకి చనిపోకుండా మిగిలినవాళ్ళు) దేశంకోసం ప్రాణాలర్పించారు. ఇంకొంతమంది యుద్ధఖైదీలుగా శత్రువుల చేతికి చిక్కారు. వందల చదరపు కిలోమీటర్ల ప్రాంతం వాళ్ళ హస్తగతమైంది.బలవంతుడు వికటాట్టహాసం చేశాడు. 



ఇంత జరుగుతున్నా రాజధానికి కనీస సమాచారం లేదు. గాలివార్తలు, పుకార్లు తప్ప ప్రభుత్వం తరపునుఁచి నిర్ధిష్టమైన సమాచారం లేదు. అడపాదడపా ప్రకటనలు వెలువడినా అవి జాతిని నిలువునా మోసం చేసి దారితప్పించేవే తప్ప సరిహద్దులోని పరిస్థితిని యథాతథంగా తెలిపేవి ఒక్కటీలేవు. మనసరిహద్దులో ఏమి జరుగుతుందో సామాన్యుడికి తెలియదు. అయినా ఒకధైర్యం. ఒక నమ్మకం అతనిని నడిపించాయి. అతనికున్న ధైర్యమెల్లా సైనికుడి మీదే. నిజానికి ఆసైనికుడొక్కడే ఇతని నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. దానికోసం ప్రాణాల్ని పణంగా పెట్టాడు. కానీ అతని త్యాగమూ బూడిదలో పోసిన పన్నీరైంది.
ఇతని చేతిలో అరకొర ఆయుధాలు. శత్రువు చేతిలోనేమో అత్యాధునిక ఆటోమేటిక్ రైఫిల్లు. ఇటు మాసిన కేన్వాస్ షూస్ అటు తేలికపాటి సైనికబూట్లు. పన్నెండువేల అడుగుల ఎత్తులో మామూలు నూలు దుస్తులతో మనవాడు. ప్రత్యేకమైన పాలిస్టర్ యూనిఫార్మ్లో శత్రువు. చివరికి బలమే నెగ్గింది.

ఆక్షణం వరకు పోటాపోటీగా యుద్ధనిర్వాహక బాద్యతలకోసం కొట్టుకున్న అధికారగణం ఒక్కసారిగా తప్పించుకు పారిపోను దారులు చూసుకోసాగారు. దేశంలోని అత్యున్నత వ్యవస్థలు, అధికార కేంద్రాలనుంచి క్షేత్రస్థాయిలోని ఉద్యోగుల వరకూ అన్నిచోట్లా వ్యవస్థ కుప్పకూలింది. అన్నిస్థాయిల్లోనూ, అన్నివిభాగాల్లోనూ మొత్తం వ్యవస్థనే అస్థిరపరిచేంత ఒక్కమాటలో చెప్పాలంటే మేరునగమంత పెద్దతప్పిదం మనదేశ రక్షణకు పెట్టనికోటల్లా భావించే హిమాలయాల సాక్షిగా జరిగింది.

పజల మనసుల్లో దైవాంశసంభూతునిగా ఆదరణ పొందిన జవహర్ ప్రతిష్ట ఒక్కసారిగా అథఃపాతాళానికి జారిపోయింది. ఒక్కసారిగా అలజడి. ఆందోళన. ప్రజలు ఎవ్వరినీ విశ్వసించలేని పరిస్థితి. అయినా నపటేల్ నిర్యాణంతో ెహ్రూకి ప్రత్యామ్నన్యాయం లేకపోవడం దేశానికి మరొక సంక్షోభం. ఏ ప్రగతిపేరు చెప్పి సైనికావసారలకు డబ్బులేదన్నారో ఆప్రగతే పూర్తిగా కుంటుపడే పరిస్థితి. ప్రతి విషయంలోనూ అన్నిటా తానై కనిపించే జవహర్ ఇప్పుడు తనప్రజలముందు నిలబడలేని పరిస్థితి. ఇన్నేళ్ళూ ఒక్కొక్క ఇటుకా పేర్చుకుంటూ అంతర్జాతీయ సమాజంలో తాను నిర్మించుకున్న కోట బీటలువారడం మింగుడు పడట్లేదు. అయినా సహించక తప్పని పరిస్థితి.
యుద్ధానికి పూర్వం ఆయనకు అతిదగ్గరగా తిరిగిన ప్రతి అధికారిదీదీ, నాయకునిదీ దాదాపూ అవే అనుభవాలు. ఇంతమందిలోనూ ఒక్కడు మాత్రం ధైర్యంగా తలెత్తి నిలుచున్నాడు. తనధర్మం నిర్వర్తించేందుకు ప్రాణాల్ని సైతం ఫణంగా పెట్టిన ఆఒక్కడికే మాత్రమే తలెత్తుకుని జీవించే హక్కు ఉందన్నది దేశం మొత్తానికీ తెలుసు.

ఆఘోర తప్పిదం జరిగి 20 October 2012 కి యాభై ఏళ్ళు. శాంతి సౌబ్రాతృత్వాలే ఆలంబనగా స్వాతంత్ర్యాన్ని అనుభవిస్తున్న ఒకజాతి వెన్నుపోటుకి గురై యాభై ఏళ్ళు. జాతిశ్రేయస్సుకన్నా వ్యక్తిగత ప్రతిష్టకే ప్రాధాన్యమిచ్చాడన్న అపఖ్యాతి ఈదేశ ప్రధమ ప్రధాని మూటగట్టుకుని యాభై ఏళ్ళు. శతాబ్ధాల బానిసత్వం తర్వాత ఎన్నోత్యాగాలకోర్చి సంపాదించుకున్న స్వతంత్ర్యాన్ని అపురూపంగా చూసుకుంటున్న దేశం తనచరిత్రలో మొట్టమొదటి ఆధునిక యుద్దతంత్రంలో తడబడి యాభైఏళ్ళు. సైనికావసరాలకన్నా సామాన్యుడి ప్రగతే ముఖ్యమని నమ్మిన పాలనా వ్యవస్థ నగుబాటుకి గురై యాభై ఏళ్ళు. వెరసి మేరునగమంత తప్పిదానికి యాబై ఏళ్ళు.

ఈతప్పిదానికి దారి తీసిన పరిస్థితులేవి? యుద్ధభూమిలో ఏమి జరిగింది? యంత్రాంగం ఎలా స్పందించింది? ప్రభుత్వం ఎలా వ్యవహరిఁచింది? అన్నింటికన్నా ముఖ్యంగా అసలీ తప్పిదం నుంచి జాతి ఏమి నేర్చుకుంది?  ఈదేశపౌరులుగా మనమందరం ఆలోచింకాల్సిన విషయాలివి. సైనికదళ నాయకునిగా చైనీయులతో పోరాడి, ఓడి ,శత్రువు చేతికి చిక్కి,  యుద్ధఖైదీగా శిక్షను అనుభవించి, తిరిగి స్వదేశానికి చేరుకున్న మహావీరుడు బ్రిగేడియర్ జే.పీ. దాల్వి తన అనుభవాలను HIMALAYAN BLUNDER అన్న పేరుతో పుస్తకంగా ప్రచురించాడు. చైనా యుద్ధానికి సంబంధించి విశ్వసనీయ గ్రంధంగా ఈపుస్తకాన్ని రక్షణరంగ నిపుణులు, విమర్శకులు పేర్కోంటారు.  చైనా యుద్దం జరిగి యాభై ఏళ్ళయిన సందర్భంగా ఈపుస్తకంలోని ముఖ్యమైన అంశాలను ప్రస్తావిస్తూ కొన్నిభాగాలుగా ప్రచురించ దలిచాను.