సైన్సుకోసం ఒక్కరోజు

శతాబ్దాల బానిసత్వం. కరువుకాటకాలతో నిత్యంపోరాటం. మూఢనమ్మకాల వలలో చిక్కుకున్న సమాజం. అదేసమయంలో ప్రాశ్చాత్యదేశాల్లో సాంప్రదాయక సిద్ధాంతాలను బుట్టదాఖలుచేస్తూ అభివృద్ధిచెందిన ఆధునికసైన్సు. ఆసిద్ధాంతాలకు రూపం ఇచ్చే సాంకేతిక సమాజం. వీటన్నిటినీ మించి పారిశ్రామికవిప్లవ ఫలితాలు. ఇవన్నీ వెరసి సాంప్రదాయకశాస్త్రాలకు పుట్టినిల్లయిన భారతావనికి- సైన్సుల్యాబులకు పర్యాయపదంగా మారిన ప్రాశ్చాత్యదేశాలకు మద్య ఒక అగాధాన్ని సృష్టించాయి.

భారతీయులది రాజకీయబానిసత్వమే తప్ప శాస్త్ర‌అద్యయనంలోనూ, జ్ఞానసముపార్జనలోనూ కాదని నిరూపిస్తూ అగాధాన్ని పూడ్చేందుకు ఉదయించిన జ్ఞానజ్యోతి 'సీవీరామన్‌'.

తమిళ్నాడులోని తిరుచ్చిరాపల్లిలో కావేరిఒడ్డున జన్మించి, గంగఒడ్డున కలకత్తాలో ఐ.ఏ.సీ.ఎస్‌.లో పరిశోథనలు చేసి నోబెల్ పురస్కారాన్ని అందుకొన్న ఈమహనీయుని పేరు వినని భారతీయవిద్యార్థి ఉండడనుకుంటా. చిన్నతనంలోనే విశాఖకు వలసవచ్చారు. తండ్రి గణిత ఉపాద్యాయుడు కావటంతో చిన్నప్పటినుంచి ఇంట్లోవాతావరణం సైన్సుపై ఆసక్తి కలిగించింది. ఆపై మద్రాసు ప్రెసిడెన్సీకళాశాలలో బీఎస్సీలో బంగారుపతకం, ఎమ్మెస్సీలో డిస్టింక్షను సాథించాక ఆర్థికశాఖలో అసిస్టెంట్ అకౌంటెంట్ జెనరల్‌గా చేరారు.

కొద్దికాలానికే దాన్నివదిలేసి కలకత్తా విశ్వవిద్యాలయంలో పలిత్‌ప్రొఫెస్సరుగా చేరారు. అదేసమయంలో ఇండియన్ అసోసియేషన్ ఫర్ ద కల్టివేషన్ ఆఫ్ సైన్స్ (IACS)లో తనపరిశొధనలను కొనసాగించారు. ఈసమయం తనజీవితంలోకెల్లా అత్యుత్తమమైనదిగా, తనపరిశొధనలకు అక్కడివిద్యార్థులు ఇచ్చిన తోడ్పాటు వెలకట్టలేనిదా రామన్ అభిప్రాయపడేవారు.
ఎనభైరెండేళ్ళక్రితం, ఫిబ్రవరి 28, 1928, ఈరోజు ప్రపంచ శాస్త్రసాంకేతిక సమాజం అవాక్కయి భారతావనివైపు చూసినరోజు. ప్రాశ్చాత్యులకు మనమేమి చెయ్యగలమో చేసిచూపించినరోజు. వలసపాలనకింద నలిగిపోతున్న ముప్పైకోట్లమంది ఉపఖండవాసులు గర్వంగా తలెత్తి నిలిచినరోజు. అన్నేళ్ళకృషి ఫలితంగా పురుడుపోసుకున్న 'రామన్ ఎఫెక్ట్‌' ను ప్రపంచానికి అందించినరోజు.

Rs.35/- దాటని ప్రయోగం, ఒకటిన్నరపేజీల నిడవిగల వ్యాసం, అందులోని విశ్లేషణనుంచి ఉద్భవించిన ఒకవాక్యం-" కాంతి ఒకపదార్థం ద్వారా ప్రసారించి వికిరణం చెందినపుడు, కాంతి పౌనఃపున్యంలో మార్పు అదిప్రసరించే మాద్యమంలోని అణూవుల మద్యఉన్న అణుబంధంపై ఆథారాపడి ఉంటుంది." ఆధునిక శాస్త్రసమాజానికి దిక్సూచిలా దిశానిర్దేశం చేసింది. అభినవ బృహస్పతిగా పేరొందిన ఐన్‌స్టీన్ ప్రతిపాదించిన క్వాంటంసిద్ధాంతంలోని అనుమానాలను ఇదిపటాపంచలు చేసింది. రెండుసార్లు ఊరించి చేజారిన భౌతికశాస్త్ర నోబెల్ పురస్కారం ఎట్టకేలకు 1930లో వరించింది. భౌతికశాస్త్రరంగంలో నోబెల్ అందుకున్న మొదటి ఆసియావాసి మరియు శ్వేతేతరుడు రామన్.
ఈయన సిద్ధాంతాన్ని
 • @ అధిక పౌనఃపున్యంగల ఫోనాన్, మాగ్నాన్, ఉత్తేజితస్థితిలోని ఎలక్ట్రాన్లను అద్యయనం చెయ్యడాని
 • @ వాతావరణం అద్యయనానికి
 • @ దహనచర్యలను విశ్లేషించడానికి
 • @ అయాన్ల శక్తిస్థాయిలను కొలిచేందుకు, మొదలైన రంగాల్లో ఉపయోగిస్తారు.
ఆపై కొంతకాలం బెంగుళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్(IISC)కు డైరెక్టరుగా పనిచేశాక ఒకరసాయన కర్మాగారాన్ని నెలకొల్పారు. అటుపై స్వతంత్రభారతావనికి మొదటి జాతీయ ప్రొఫెసరుగా సేవలందించారు.
కొళ్ళాయి బదులుగా తలపాగా ధరించి, చేతికర్రకు బదులుగా కటకాలను ఊతంగా చేసుకుని, భగవద్గీతకు బదులుగా భౌతికశాస్త్రవిజ్ఞానాన్ని పట్టుకుని శాస్త్రసాకేంతికరంగాల్లో భారతావని దాశ్యశృంఖలాలను ఛేదించేందుకు కాంతిసత్యాగ్రహాన్ని జరిపిన 'సైన్సుగాంధీ' సీవీరామన్. ఆయన చేసిన పరిశోధనలు సమాజ అభ్యున్నతికే తప్ప అణూబాంబుల తయారీకో, అసాంఘీకచర్యలకో ఊతమివ్వలేదు. ఏదేశమేగినా తన సంప్రదాయాలను, అలవాట్లను పాటించడంలో ఏమాత్రం రాజీపడలేదు. రాణిగారివిందులో మధువు ముట్టనని తనమాట నెగ్గించుకున్నారు.
రామన్ ఎఫెక్ట్ తర్వాత ఆయన చేసిన పరిశొధనల్లో ముఖ్యమైనవి -
 • @ సంగీతవాయిద్యాల్లో ధ్వనితరంగాల స్వభావాలు, హరాత్మక ప్రకంపనలు
 • @ తీగల్లోని తిర్యక్‌ప్రకంపనలు
 • @ కాంతి తరంగాలు అతిధ్వనుల మద్య సంబంధాలు
 •  @ స్పటికాలలో స్పెక్ట్రోస్కోపీ అద్యయనంద్వారా స్పటిక గతిశాస్త్రంలో(Crystal Dynamics) ప్రాథమికాంశాలపై విశ్లేషణ
 • @ ధూళికణాలలో కాంతిప్రసారం
 • @ మానవదృష్టికి సంబంధించిన అంశాలు
రామన్ ఎఫెక్ట్ ప్రతిపాదించిన రోజును డిపారర్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలోని జాతీయ శాస్త్రసాంకేతిక సమాచార పరిషత్తు(NCTSC) 1986లో జాతీయ సైన్సు దినంగా(NSD) ప్రతిపాదించింది. అప్పటినుంచి ప్రతియేడు ఈసందర్భాన్ని పురస్కరించుకుని దేశంలో సైన్సుపట్ల అవగాహనపెంచే పలుకార్యక్రమాలను చేపడుతుంది. సీనియర్ శాస్త్రవేత్తలచే సెమినార్లు, యువశాస్త్రవేత్తలు, సైన్సు విద్యార్థులకు పోటీలు, ఎక్జిబిషన్లు వంటివి ఏర్పాటుచేస్తారు. సైన్సురంగాల్లో విశేషంగా కృషిచేసిన శాస్త్రవేత్తలకు పురస్కారాలు ఇస్తారు.
ఈఏడు ఆపురస్కారాలకు ఎంపికచేసిన వారు-
 • @ డీడీఓఝా, ఈయన శాస్త్రసాంకేతిక రంగాలకు చెందిన అనేక అంశాలపై పుస్తకాలు రచించారు.
 • @ రామదురై, ఈయన తమిళ వార్తాపత్రికల్లో సైన్సు సంబంధించిన వ్యాసాలు రాస్తారు. కొన్నిపుస్తకాలను కూడా రచించారు
 • @ ఈశాన్యరాష్ట్రాల్లోని స్కూలుపిల్లల్లో సైన్సుపట్ల ఆసక్తిపెంచే కార్యక్రమాలు చేపట్టినందుకు తకేలంబం రబీంద్రోసింగ్ గారికి
 • @ పత్రికామాద్యమంలో సైన్సు ప్రగతికి చేసిన కృషికిగాను దినేష్‌చంద్ర శర్మగారికి
 • @ ఎలక్ట్రానిక్‌ మాద్యమంలోసైన్సువ్యాప్తికి చేసిన కృషికి మానస్‌ప్రతిమ్ దాస్ గారికి
సైన్సుదినోత్సవం సందర్భంగా ఇస్రో, డీఆర్డీఓ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు ఈరోజు ప్రజలందరినీ ఎలాంటిముదస్తు అనుమతీలేకుండానే సందర్శించేందుకు అనుమతిస్తారు. అలాంటి సంస్థలకు మీరెవరైనా దగ్గర్లో ఉంటే మీస్నేహితులతోగానీ, పిల్లలతోగానీ వెళ్ళేందుకు ప్రయత్నించండి. కనీసం ఒకచిన్నక్విజ్ కార్యక్రమం వంటిదాన్ని నిర్వహిచండి.

11 comments:

 1. ఒక గొప్ప విషయం గురించి గుర్తు చేశారు.ధన్యవాదాలు.
  మీ బ్లాగుల్లో ఎప్పుడూ వఠ్ఠి కబుర్లేనా అంటూ మా అబ్బాయి గాలి తీసేవాడు. వాడికి చూపించాలి.
  (మంచి సాహిత్య చర్చలు జరుగుతాయనుకోండి. అందులో వాడికి ఆసక్తి లేదే....)

  ReplyDelete
 2. సోదరా, ఇప్పటికి వరకు, నువ్వు వ్రాసిన వాటిల్లో
  "One of the best".

  ఒక చిన్న సూచన:
  చూడబోతే నువ్వు మార్కులకోసం చదివిన వాడిలా కనపడడం లేదు. Why don't you start another blog on Civil Engineering(at least in English) sharing your experiences so that the upcoming engineers will get benefited.

  ReplyDelete
 3. చక్కగా వివరించారు. ధన్యవాదములు.

  @మందాకిని గారు, మీ అబ్బాయిని scienceintelugu.blogspot.com చూడమని చెప్పండి.

  ReplyDelete
 4. very nice post..!! keep it up..! wishing you many more successful posts.

  ReplyDelete
 5. your slideshow is really wonderful..photos are very nice.

  ReplyDelete
 6. @మందాకినీ: నాగచెప్పినదేకాక మీ అబ్బాయికి నెచ్చేవి ఇంకాచాలా బ్లాగులున్నాయండీ. ఓసారి వెతికివ్వండి లింకులు.
  @గణేష్, సునీత, నాగ్: ధన్యవాదాలు.
  @తృష్ణ: ధన్యవాదాలు. ఆపోటోలు మాఊరివి. మొన్న సంక్రాంతికి ఇంటికెళ్ళినప్పుడు తీశా.

  ReplyDelete
 7. మంచి విషయం. బాగా రాశారు

  ReplyDelete
 8. @ కొత్తపాళీ, శివన్న: ధన్యవాదాలు

  ReplyDelete
 9. మిస్సయ్యానండీ ఈ టపాని.. ఇంకేం మిస్సయ్యానో వెతుక్కోవాలిప్పుడు.. రామన్ జీ జీవితంలో ముఖ్య ఘట్టాలన్నింటినీ స్పృశించడం బాగుంది.. పట్టుదల, కృషి ఉన్నవాళ్ళని ఎవరూ ఆపలేరు.. ఇది మళ్ళీ మళ్ళీ నిరూపింప బడుతున్న నిజం. టపా చాలా బాగుందని మిత్రులు చెప్పేశారు కదండీ, నాదీ అదే మాట..

  ReplyDelete