ద్వైతాద్వైతసంగమం 'తుంగభద్ర'

కావేరీ తుంగభద్రాచ కృష్ణవేణీచ గౌతమీ
భాగీరథీతి విఖ్యాతాః పంచగంగాః ప్రకీర్తితాః

పశ్చిమకనుమల్లో పుట్టిన రెండునదులు తమగమనంతోపాటూ కాలగమనంలో పుట్టుకొచ్చిన రెండు ఉన్నతమైన వైదికధర్మాలను మోసుకొచ్చి, తమకలయికతో మరోగొప్పనదికి జీవం పోశాయి.వరాహపర్వతాల్లో అద్వైతధర్మానికి నదీరూపంగా భావించే తుంగానది, అదేప్రాంతానికి దక్షిణభాగంలో ద్వైతధర్మానికి ప్రతీకైన భద్రానది ఉద్భవిస్తాయి. కొండల్లోంచి పరుగులుపెడుతూ, జలపాతాల్లా కిందకి దుముకుతూ, మెలికలు తిరుగుతూ తుంగానది 147km మరియు భద్రానది 171km దూరం ప్రయాణించాక, శివమొగ్గ దగ్గర్లోని కూడలి దగ్గర కలిసి తుంగభద్రకు జీవంపోస్తాయి. ఇక్కడినుంచి దక్కనుపీఠభూమిలో ప్రవహిస్తూ కర్ణాటకలోని శివమొగ్గ, ఉత్తరకన్నడ, చిత్రదుర్గం, బళ్ళారి అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలుజిల్లాల్లో 531km ప్రవహించి కృష్ణమ్మ ఒడిలోకి చేరుకుంటూంది. అటుపై శ్రీశైలంమల్లన్న కాళ్ళుకడిగాక హంసలదీవి వరకు సాగేదారి తెలిసిందే. పశ్చిమకనుమల్లో మొదల్లయే ప్రవాహం ఆపై పీఠభూమిలోని కఠినశిలలపై సాగడంతో కొంచెంవేగం ఎక్కువగా ఉంటుంది. తుంగభద్రలో మొసళ్ళు ఎక్కువని తెనాలిరామకృష్ణుడు చెప్పినట్టు గుర్తు.  


నిజానికి తుంగభద్ర అనేది కేవలం 530km ప్రవహించి మరోనదిలో కలిసిపోయే ఒక ఉపనది. కానీ ఈనది ప్రాముఖ్యత పురాణాల్లోను, మద్యయుగచరిత్రలోనే కాదు, ఆధునికభారతావని సాధించిన పురోగతిలోనూ ఒకవిశిష్టస్థానం ఉంది. ద్వైతాద్వైతధర్మాలవంటి వైదికసిద్ధాంతాలను, ముష్కరమూకలకు తలొగ్గకుండా సుఖశాంతులతో పాలించిన సామ్రాజ్యాన్ని, సాగునీటి ప్రాజెక్టులద్వారా సస్యశ్యామలమైన వ్యవసాయక్షేత్రాల్ని, ఖనిజాల్ని వెలికితీసే పారిశ్రామలను తన ఒడిలోదాచుకుంది తుంగభద్ర.

పురాణాల్లో ఈనదిని పంపానదిగాను, దీని పరీవాహకప్రాంతాన్ని కిష్కింధగాను పేర్కొన్నారు. శృంగేరీలో ఆదిశంకరాచార్యునిచే నెలకొల్పిన దక్షిణామ్నాయ శ్రీశారదాపీఠం తుంగానది ఒడ్డున వెలసిన క్షేత్రాల్లో ప్రముఖమైనది. తుంగాపానం-గంగాస్నానం అని పెద్దలు చెప్పారంటె ఈనది ప్రాముఖ్యతను అర్థం చేసుకోవచ్చు. ఆదిశంకరుడు తనశిష్యబృందంతోబాటుగా ఈప్రాంతంలో వెళ్తుండగా ప్రసవవేదనను అనుభవిస్తున్న కప్పకు నాగుపాము తనపడగను రక్షణగాఉంచి సేవచేయడం చూచి, అక్కడ దక్షిణామ్నాయపీఠం నెలకొల్పారు. తూర్పున పురుషోత్తమపురంలోను, పశ్చిమాన ద్వారకలోను అలాగే ఉత్తరాన బదరీనాథ్ దగ్గరి జ్యోతిర్మఠ్‌లోను పీఠాలను నెలకొల్పారు. ఈపీఠం కృష్ణయజుర్వేదానికి రక్షకునిగా వ్యవహరిస్తుంది. శారదాదేవి ఆలయం, విద్యాశంకరుని ఆలయం శృంగేరిలోని మరికొన్ని ముఖ్యమైనస్థలాలు. భద్రానది ఒడ్డున ఉన్న శైవారామాలు కన్నడరాజ్యంలోని వీరశైవధర్మానికి చిరునామా.

తుంగభద్రానది ఒడ్డున  మనరాష్ట్రంలోని మంత్రాలయం ఎంతోపవిత్రమైనది. ఇక్కడ మద్వధర్మాన్ని ఆచరించే గురురాఘవేంద్రమఠం ప్రాముఖ్యత తెలిసిందే. దక్షిణకాశీగా పేరొందిన మహబూబ్‌నగర్‌జిల్లాలోని ఆలంపూర్ ఈనదితీరంలోని మరొకముఖ్యస్థలం. ఇక్కడి జోగులాంబ, చాళుక్యులకాలంనాటి నవబ్రహ్మమందిరాలు ప్రముఖక్షేత్రాలు. అన్నిటికన్నా ముఖ్యమైనది ఈప్రాంతలో తెలుగు కన్నడిగుల మద్యనున్న స్నేహం. తేటతెనుగు-కస్తూరికన్నడలు పాలునీళ్లలా కలిసి శతాబ్దాలుగా సహజీవనం సాగిస్తున్నారు. కన్నడరాజులు తెలుగుకు చేసినసేవ, అలానే తెలుగువాళ్ళు కన్నడిగులతో పెంచుకున్న బంధం ఒకపరిణితిచెందిన సాంస్కృతికబంధాన్ని నెలకొల్పాయి.


ఈనదిఒడ్డున నిర్మితమైన పట్టణాల్లో అత్యంతముఖ్యమైంది హంపి. ఒకవైపు తుంగభద్ర మరోవైపు ఎత్తైనకొండలతో ఈప్రాంతం శత్రుదుర్భేధ్యంగా ఉండెది. విషసర్పాలవంటి పొరుగురాజ్యలనుంచి ప్రజలను కాపాడుతూ, కళలకు కాణాచిగా పేరొంది, పరిపాలన అన్నపదానికే నిర్వచనం చెప్పిన విజయనగరసామ్రాజ్యపు సాంస్కృతికరాజధానిగా ప్రపంచవారసత్వ సంపదల్లో తలమానికమైన నగరం ఇది. విజయనగరసామ్రాజ్యంకన్నా పురాతనమైనది ఈపట్టణం. ఇక్కడి ఆలయాల్లో విజయనగరశిల్పకళేకాక దానికిముందున్న హొయశాలశైలికూడా కలిసిఉంటుందని నిపుణుల అభిప్రాయం. విరూపాక్షుణిఅలయం ఇక్కడ చూచితీరాల్సిన స్థలం. దానితోపాటుగా పదులసంఖ్యలో ఉండే పర్యాటకస్థలాల్ని చూశాక ఎవడైనా ఈదేశసంస్కృతిని, ఈమట్టిలో పుట్టినశాస్త్రాలను అపహాస్యంచేస్తే ఈడ్చుకుంటూవచ్చి వీటిని చూపెట్టాలని నాస్నేహితుడు అంటుంటాడు.
కర్ణాటక అంటేనే మనకు గుర్తొచ్చేవి ప్రాజెక్టులు. ఈనది అంతర్రాష్ట్రనదికావటంతో రాష్ట్రపతిఉత్తర్వులను అనుసరించి తుంగభద్రబోర్డును నెలకొల్పారు.తుంగభద్రప్రాజెక్టుకు సంబంధించిన జలవిద్యుదుత్పత్తి, సాగునీటిసరపరాను ఈబోర్దూ నియంత్రిస్తుంది. తుంగానదిపైన శివమొగ్గవద్ద, భద్రనదిపైన లక్కవల్లివద్ద ప్రాజెక్టులను నిర్మించారు. బళ్ళారిజిల్లాలోని హోస్పేట్ వద్ద తుంగభద్రనదిపై ఆనకట్ట నిర్మించారు. కర్నూలు దగ్గర్లోని సుంకేసులవద్ద కాటన్‌దొర నిర్మించిన ఆనకట్ట ఒకటి ఉండేదట. దానిస్థానంలో ఇటీవల ఆనకట్టను కట్టి, దానికి మాజీముఖ్యమంత్రి కోట్లవిజయభాస్కరరెడ్డి పేరుపెట్టారు. వీటన్నిటినీ మించి రాయలకాలంనాటీ చెరువులు, సాగునీటిసౌకర్యాలు ఇక్కడ వ్యవసాయానికి ఎంతగానో ఉపయోగపడూతాయి. మట్టికోసుకుపోకుండా రాయలకాలంలో కట్టించిన కొన్నిరాతికట్టడాలు ఇప్పటికీ చెక్కుచెదరలేదు.

ఈనది ప్రవహించే ప్రాంతాల్లో ఖనిజవనరులు పుష్కలంగా ఉన్నాయి. ఇనుము, మాంగనీసువంటి గనులేకాక, గ్రానైట్‌క్వారీలు ఈప్రాంతంలో అధికం. వీటివల్ల జరుగుతున్న పారిశ్రామికాభివృద్ధికన్నా కాలుష్యం, అవినీతి ఎక్కువవడం అనేకవివాదాలకు దారితీస్తుంది. నీటిపారుదల సౌకర్యాలు పుష్కలంగా ఉన్నా వాటిమరమ్మతులు సరిగా జరపకపోవడంతో అనేకజలశయాలతోపాటు రాయలకాలంనాటి చెరువుల సామర్థ్యంసైతం ఏటికేడు తగ్గిపోతుంది. ఇటీవలికాలంలో ఇక్కడ నెలకొల్పుతున్న కర్మాగారాలు, వాటికి అనుబంధంగా నిర్మిస్తున్న రహదారులవల్ల ఇక్కడి జీవవైవిధ్యం దెబ్బతింటుంది. కొన్ని అరుదైనవానరజాతులు నశిస్తున్నాయి.
ఇలా రెండు విశిష్టవైదికధర్మాలనుంచి ఉద్భవించి,తనువెళ్ళేదారిని సస్యశ్యామలం చేస్తూ  పంచగంగల్లో ఒకటిగా స్థానం సంపాదించుకున్న తుంగభద్రనది దాని ఒడ్డున వెలసినక్షేత్రాలకు, నిర్మించిన రాజ్యాలకు, విరాజిల్లిన కళలకు, ఆనీళ్ళతో గొంతుతడుపుకుంతున్న ప్రజలకు మాతృసమానురాలు.


5 comments:

  1. ఈరొజే శ్రింగేరి గురించి మట్లాడుకున్నాం, వెళ్ళాలని ప్లాన్...!! తుంగభద్ర విశేషాలు ఇలా చదవడం కాకతాళీయం కాదేమో...!!!
    నా కోరిక ఏంటంటే... మన నదులైన పెన్నా,కాళింది(కాళంగి) వాటిమీద ... భరతావనిలో చారిత్రకమైన నదులమీద నువ్వు టపా వ్రాయాలని(అన్నీ చరిత్రక గొప్పదనాన్ని కలిగి వున్నవే) .. చిన్న కోరికే తీర్చొచ్చు కదా.....???--Siva Kumar.Kolanukuduru

    ReplyDelete
  2. informative post chaitanya gaaru

    ReplyDelete
  3. చక్కగా రాసావు సోదరా
    అభినందనలు

    ReplyDelete
  4. @ నాగ, శివన్న, నాగార్జున, భాస్కరన్న: ధన్యవాదాలు

    ReplyDelete