బెత్తం


బెత్తం... ఈ పదం కనిపించటంతోనే బాల్యస్మృతులు గుర్తొచ్చి టపా చదివేందుకు కూడా భయపడి ఉంటారు. ఎందుకంటే ఈపదం రాయాలంటే నా చెయ్యికూడ వణికింది. పార్లమెంటులో అందరూ పోటా గురించి టాడా గురించి మాట్లాడే వాళ్లే కాని దీనిగురించి మాట్లాడాలి అంటే వాళ్లకికూడా భయమే. ఎవరి గతం వాళ్లది కదా.
సంవత్సరం సరిగా గుర్తులేదు కానీ డల్‌హౌసీ( ఇతనికి లార్డ్ అని మనం ఇప్పుడు పెట్టనవసరం లేదు అనుకొంటా.) అనే పెద్దాయన దేశంలోకి దిగాడు. ఇక్కడ చదువు ఆయనకి, అంటే మహారాణి గారికి, సరిపడలేదు. అంతే రాత్రికి రాత్రి సంస్కరించాడు మన విద్యావ్యవస్థని. భారతవిద్యార్థి అప్పటిదాకా రుచిచూడని నాలుగుగొడల ప్రపంచంలొ ఇరుక్కొని సర్దుకు పోయాడు. అప్పటి సమాజానికి ఇంతకంటే ముఖ్యమైన సమస్యలు మరేవో కనిపించాయి. దాంతో ఇతనిని పట్టించుకొనే నాథుడేలేదు. ఒకరిద్దరు కలుగచేసుకొన్నా ప్రయోజనం శూన్యం. దొరలకు మన అవసరం కేవలం గుమాస్తా నౌకరీలకే కాబట్టి ఆ (కు)సంస్కరణలు అందుకు అనుకూలంగానే జరిగాయి. సిలబస్ అంటూ నాలుగు పుస్తకాలిచ్చి "అది చదివి పరీక్ష రాసెయ్. గట్టెక్కితే వచ్చి రాణీగారి సేవలోతరించు" అంటూ తమ ఉదాత్తహృదయాన్ని చాటుకొన్నాడు.
అప్పుడు వచ్చింది ఒక భూతం. దానిపేరు బెత్తం. గురువుకి శిష్యుడికి మద్యలో నిలుచొంది. అప్పటిదాకా భారత విద్యావ్యవస్థకు గురుశిష్యుల మద్య మరొకరు రావచ్చు అని తెలీదు. వచ్చింది గుట్టుగా లేదు. రొజుకో గజంలెక్కన వాళ్లమద్య దూరాన్ని పెంచేసింది. అయ్యవారు ఆయన ధోరణిలో ఎదో చెబుతుం టాదు. పాపం వీడి పరిస్థితి ఎవరికి చెప్పుకొంటాడు. ఎప్పుడైనా ఒక సందేహం వస్తే అయ్యవారికన్నా ముందు ఇదే ఉరిమేది. దాంతో కొంతకాలానికి వీడి గొంతు పూడిపోయింది. అలా వాడిలోని తర్కానికి, భావప్రకటనకు చెల్లుచీటీ ఇచ్చేశాడు. ఇదిరాక మునుపు మనవిధ్యావ్యవస్థ మచ్చలేనిది అనికాదు కానీ, ఈసంస్కరణతో ఒరిగిన ప్రయోజనం ఏమీలేదు. అగ్రవర్ణాలవారు ఆంగ్లం నేర్చుకొని కొంతమంది విదేశాలకు వెళ్తే, మరికొంత మంది ఇక్కడున్న కొద్దిపాటి ఉన్నత ఉద్యోగాలను సంపాదించారు. మద్యతరగతి వాళ్లు గుమస్తా ఉద్యోగంలో ఎంతో అద్భుతంగా ఒదిగిపోయారు. ఇక మూడొవర్గానికి ఈవ్యవస్థ కూడా చెయ్యిచ్చింది.ఈవ్యవస్థ రాకమునుపు సర్కారుకొలువు కోసం ఎంతమంది ఎదురుచూసేవారు? సమాజంలో సింహభాగం వ్యవసాయం చేసేవాళ్లే. కొత్తగా వచ్చిన వ్యవస్థలో అందుకు ఏమైన ప్రాధాన్యతను ఇచ్చారా? ఆధునిక వ్యవసాయ పద్ధతులను బోధించారా? మరి ఈవ్యవస్థ ఎవరికోసం? వీళ్లు స్వయంఉపాధితో బతికేవాళ్లే. కానీ ఇదివచ్చిన తరువాత ప్రజల ఆలోచనాతీరుని ఎంతగా ప్రభావితం చేసిందో ఒక్కసారి అలోచిస్తే మీకే తెలుస్తుంది.
తమాషా ఏమిటంటే ఈ వ్యవస్థలో చదవలేక ఐన్‌స్టీన్ వంటివాళ్లు పెద్దయ్యాక మన విద్యావ్యవస్థని, అందులోని ఉన్నతవిలువల్ని పొగిడితే మనకు మాత్రం అందులోంచి ఇందులోకి వలస రావల్సిన అగత్యం ఎర్పడింది. అంతటి గొప్పవాళ్ల చేత ఈచదువులు మాకొద్దు బాబొయ్ అనిపించిన ఘనత దాని సొంతం. ఇందులో పరిస్థితులకు అనుగుణంగా సర్దుకొని బతికే వాడికి సర్టిఫికేట్లు వస్తాయి. ఉద్యోగాలు ఉంటాయి. కానీ అలాటి వాళ్లు ఎంత మంది. నూటికి 80 మందికి సరిపడని విధానంలో మనం బోధిస్తున్నాం. అంత మందికి అర్ధం కాకున్నా అది వాళ్లతప్పే కాని బలవంతంగా రుద్దినవాళ్లకి ఏ బాధ్యతా లేదు. ఆ మార్కులు వచ్చిన వాళ్లలోకూడా అందులో పూర్తి స్థాయి పట్టు ఉండేవారు నూటికి ఒకరోఇద్దరో. అయినా ఇదే గొప్పచదువు. ఇలా చదివిన వాడే చదువరి. అప్పటిదాకా విదేశీవిద్యార్ధులకు చదువులతల్లి ఒడిలాఉన్న భరతఖండం, తన బిడ్డలకే జ్ఞానాన్ని పంచలేని స్థితికి వచ్చింది. ఉన్నతచదువులకోసం విదేశాలకు వెళ్లాల్సిన అగత్యం.

ఈ బెత్తం విషయానికి వస్తే ఇది రాకమునుపు కూడా కొన్ని శిక్షలు ఉండేవి. కాని అవి పిల్లవాడిని సంస్కరించేందుకు వీలుపడేలా ఉండేవి. వరుస హత్యలు చేసిన వాడికి, తీవ్రవాదులకు క్షమాభిక్ష ఉంటుంది. కానీ దీనికి అది తెలియదు. అంతే దాన్ని చూసిన ప్రతిసారి తనలోని సందేహాలను చిదిమేసుకొన్నాడు. రోజూ అయ్యవారు రావటం, పాఠాలు వల్లెవేయించటం, యేడాదికి ఒకసారి పరీక్ష. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ, మనలో ప్రతి ఒక్కరం చిన్నప్పుడు ఎక్కాలు బట్టీకొట్టీన వాళ్లమే. రోజూ ఎక్కాలు గుడ్డిగా చదివిందే చదివిపిస్తారు గాని అసలు అవి ఎలా వచ్చాయో అందులో లాజిక్ ఎమిటో ఎంత మంది నేర్పుతారు.ఇలాంటివి ఎన్నో. ఒకరోజు ఎదో తప్పు చేస్తాడు. అందుకు వాడిని సరిదిద్దేందుకు నాలుగు దెబ్బలు వెయ్యటం తప్ప వేరేదారి కనిపించదు. అయ్యవారికి వాడిమీద పగ ఉండదు. కాని ఆదెబ్బలు తిన్నతరువాత వాడికి మళ్లీ బడికివెళ్లాలి అనిపించదు. ఇంట్లో చదువుకొన్నవాళ్లు ఉంటే నయానో భయానో పంపుతారు. మరి మిగిలినవారి పరిస్థితి? ఇది మీకు చిన్న విషయంగా అనిపించినా “చిన్నప్పుడు బడి ఎందుకు మానేశావ్?” అని ఎవరినైన అడిగితే ఎక్కువ సార్లు వచ్చే సమాధానం ఇలాంటిదే. కాకపోతే ఒక్కొక్కరు ఒక్కోవిధంగా చెప్తారు.

ఇక్కడ ఇంకో సమస్య వచ్చింది. ఈమద్యకాలంలో అంటే పెద్దపాలేరుగారు సంస్కరణలని పెట్టిన తరువాత ఇక్కడి ఇతరవ్యవస్థలు పూర్తిగా మార్చేశారు.ఎలాగంటే , అలా చదివితేనే ఉద్యోగాలు, బతుకు తెరువు. ఇక చచ్చినట్టు చదివిచావాలి. కొంతమంది మేధావులు గళంవిప్పారు. వ్యవస్థని మార్చాలి అన్నారు. కానీ వాళ్లది మళ్లీ అరణ్యరోదనే అయింది. ఎదోతెలియక తప్పుజరిగితే మారుస్తారు గానీ ఉద్దెశ్యపూర్వకంగా చేసేదానికి ఎవరుమాత్రం ఏమిచెయ్యగలరు?

అర్థరాత్రి స్వాతంత్ర్యం. ఇక నారాత మారుతుంది అని అనందంతో వీధిలోకి వచ్చి గెంతులేశాడు. మువ్వన్నెలఝండా పట్టుకొని ఆకాశంలో తేలిపోతూ ఏవేవో పిచ్చికలలు కన్నాడు. మరి అది వచ్చింది అర్ధరాత్రి కదా.తెల్లారేసరికి పరిస్థితి యధాతథం. రాత్రి పట్టుకొన్న ఝండాకర్రే ఉదయానికి మళ్లీ బెత్తం అయి కూర్చుంది. ఇప్పుడువంతు ఛాందసులది. ఒకరేమో మతవిద్య అనారు. మరొకరు మా చదువుల్ని అందరూ చదివేస్తారు అన్నారు. మొత్తానికి ఎవరి అవసరాలు వాళ్లవి. బేతాళుడు మళ్లీ చెట్టు ఎక్కేశాడు. ఇంతలో మరో విడ్డూరం కొన్నేళ్లతరువాత జరిగింది. ఎవడైతే మనకు దీన్ని అంటగట్టాడొ వాడే ఆ దొరగాడే” మీ ప్రమాణాలు పెరగాలి అన్నాడు. మీ ఊర్లో పంతుల్లేంటి బెత్తాలు వాడుతున్నారు?” అన్నాడు. దెబ్బకి మతిపోయింది మనవాళ్లకి. మేము డబ్బులిస్తాం బాగుచేసుకోండి అన్నాడు. దొరవారు ధర్మాత్ములు అంటూ పళ్లు ఇకిలించారు. అప్పుడెప్పుడొ అప్పెప్, తరువాత డిపెప్, ఐన వాళ్లు ఇచ్చింది మిగిలిపోతూనే ఉంది. ఫ్లిప్ అన్నారు, ఫ్లప్ అన్నారు. ఇవికూడ చెట్టెక్కాయి. ఇప్పుడు లెవ్ అని కొత్తది. పాపం వాడి పరిస్థితి అలానే ఉంది కానీ ఇక్కడ అందరి జేబులు నిండి పొర్లుతున్నాయి. ఈ బెత్తం మాత్రం పోవట్లేదు. ప్రాక్టికల్గా అలోచిస్తే అదిపోవటం కుదిరేపనికాదు. కనీసం మరో ప్రత్యామ్నాయం చూడని పక్షంలో అక్షరాస్యతను 95శాతానికి పెంచటం వంటి లక్ష్యాలు సాధించటం అయ్యేదేనా అని.

6 comments:

  1. baguMdi.bAgA rAsAru.

    ReplyDelete
  2. చాలా చక్కని టపా! డ్రాపవుట్లు పెరగడం లో బెత్తం చాలా పెద్ద పాత్ర పోషిస్తోంది.. ముఖ్యంగా గ్రామాలలో.. దెబ్బలకి భయపడి బడి మానేసిన పిల్లలు నాకు తెలుసు.. మేష్టర్లేమో కొట్టక తప్పాడు అన్నట్టు మాట్లాడతారు.. చాలా చర్చ జరగాల్సిన అంశం ఇది.. అభినందనలు.

    ReplyDelete
  3. సూటిగా ఉంది.
    ప్రస్తుతం తగ్గింది లెండి. తల్లితండ్రుల, ప్రభుత్వాల జోక్యంతో.

    మీ శైలి బాగుంది.

    బొల్లోజు బాబా

    ReplyDelete
  4. @ తృష్ణ: ధన్యవాదాలు
    @ మురళి: ధన్యవాదాలు
    @ బాబా: ధన్యవాదాలు
    నేను ఇక్కడ బెత్తం అని రాసింది కేవలం పంతులుచేతిలో కనిపించే బెత్తంగురించి కాదు.అయ్యవారు ఏదిచెప్పినా ఊ కొట్టి బట్టీవేసే పరిస్థితిని, పిల్లవాడు ఏదైనా ప్రశ్నించినా వాడు తనకంటే తక్కువ అన్న అనాచారం గురించి. ఇది అర్ధంచేసుకోగలరు అని ఆశిస్తున్నాను.

    ReplyDelete
  5. డళౌసీ కాలంలో ఇలా జరిగిందో లేదో కానీ స్వాతంత్ర్యానంతరం మాత్రం మీర్రాసింది ఫెంటాస్టిక్.

    ReplyDelete
  6. కొత్త పాళీ: ధన్యవాదాలు. మరి ఆయనేకదా ఇక్కడ ఆంగ్లేయవిద్యను ప్రవేశపెట్టింది. ఇక్కడ వృత్తివిద్యా కోర్సులు పెట్టమంటే ఒప్పుకోలేదు. జమ్షెడ్‌జీ టాటా తను నెలకొల్పే కర్మాగారలకు నిపుణులు లేరు అంటే మీకెందుకు అవన్నీ అని హేళనచేసారు. అందుకు ప్రతిగా వాళ్లు జమ్షెడ్‌పూర్‌లో, బెంగుళూరులో సంస్థలను నెలకొల్పారు. ఒకే సమయంలో వలసరాజ్యాలలో, బ్రిటన్‌లో సిలబస్ వేరువేరుగా ఉండేవట. అందుకే అప్పట్లో ఎవరైనా ఉన్నతచదువులు చదవాలి అంటే ఓడ ఎక్కాల్సిందే. ఇక్కడ ఉన్న వనరులు దోచుకెళ్లి, మనపై పన్నులు వేసింది చాలక ఇక్కడ విద్యాలయాలను నెలకొల్పటంలో నిర్లక్ష్యం చూపారు. తరువాత వచ్చిన ఒత్తిడి కారణంగా కొన్ని ఏర్పాటు చేసినా అవి ఇక్కడి అవసరాలకు అటు సంఖ్యాపరంగా, ఇటు నాణ్యతపరంగా తక్కువే.

    ReplyDelete