గంగమ్మ చెలికత్తె 'సోన్ '

మనం చిన్నప్పుడు అనేకనదులగురించి, దాని మీద కట్టిన ఆనకట్టలగురించి చదువుకొన్నాం. మనకు బాగా పరిచయముండే నదులు గంగ, యమున, గోదావరి, కృష్ణ, పెన్న, కావేరి మొదలైనవి. నాబ్లాగు చూసేవాళ్లకి స్వర్ణముఖి అనేనదిగురించి కూడా కొద్దిగా అవగాహన ఏర్పడి ఉంటుంది. ఇక ఆనకట్టల విషయానికివస్తే ముందు గుర్తొచ్చేవి నాగర్జునసాగర్, శ్రీశైలం, మైసూరుదగ్గర కావేరిడాం( బృందావన్ గార్డెన్స్ దీనికిందే ఉండేది.), ప్రకాశం బారేజి, ధవళేస్వరం. ఇప్పుడు జలయజ్ఞం పుణ్యమా అని భవిష్యత్తులో మరికొన్ని మనరాష్ట్రంలొ మరిన్ని ఆనకట్టలూ భవిష్యత్తులో చూస్తాం. ఇప్పుడు మీకు ఒకనదిని, దానిపై ఉన్న ఒక ఆనకట్ట గురించి చెప్పాలి అనుకొంటున్నాను.

ఆనదిపేరు 'సోన్ '. ఈనది ఛత్తీస్‌గడ్‌లో జన్మిస్తుంది.దీని జన్మస్థానం నర్మదానది జన్మస్థానికి(అమరకంటక్) దగ్గర్లోనే. నాకు నర్మదానది, సోన్ నది దాయాదులు అనిపిస్తాయి. ఎందుకంటే ఇవిరెండు ఒకేప్రాంతంలో పడేవర్షపాతాన్ని పంచుకొంటాయి. అంటే నర్మదా పర్వతసానువుల్లోని వర్షపు నీరు అవిపడ్డ ప్రాంతంలొని వాలును అనుసరించి నర్మదానదిలోగాని, సోన్ నదిలోగాని కలుస్తాయి. అలా అక్కడి వర్షాన్ని పంచుకొంటాయి అన్నమాట. అలా జన్మించిన రెండునదుల్లో నర్మద పశ్చిమంగా ప్రవహిస్తే, సోన్ నది కొంతదూరం నర్మదకు సమాంతరంగా కొద్దిగా ఉత్తరపుదిక్కులో ప్రవహిస్తుంది. కైమూర్ పర్వతశ్రేణులు చెరుకొనేసరికే ఉన్నట్టుండి తనగమ్యం తెలిసిదానిలా దిశనుమార్చుకొని, ఈశాన్యదిశలో తనగమనాన్ని కొనసాగిస్తుంది. అక్కడినుంచి ఉత్తరప్రదేశ్ మీదుగా బీహార్లోకి ప్రవేశించి, పాట్నాదగ్గర గంగానదిలో కలుస్తింది. అంటే ఇది గంగకు ఉపనది అన్నమాట. ఇప్పుడు అర్ధమైందికదా సోన్ తనగమనాన్ని ఎందుకు మార్చుకుందో. అలా దానిపుట్టుకకు పాట్నాదగ్గర సార్థకత లభించింది.

గంగానదికి ఉన్న అతిముఖ్యమైన ఉపనదులు సోన్, గండకి, గోమతి మొదలైనవి. వీటిలో గంగకు దక్షిణ భాగంనుంచి నుంచి కలిసే నదుల్లో అతిపెద్దది సోన్. ఈనది మొత్తం 784కిలోమీటర్లు అంటే 487మైళ్లు( ఐ కిలోమీటర్లు తిరగేస్తే మైళ్లు వచ్చింది. భలేభలే. గుర్తుంచుకోండి.) ప్రవహిస్తుంది. భౌగోళికంగా చెప్పాలంటే, దిగువ సోన్ లోయ నర్మదాలోయకు కొనసాగింపు ఐతే, కైముర్ శ్రేణులు వింధ్యశ్రేణులకు పొడిగింపు. మొదటకొంతదూరం, అంటే ఉత్తరప్రదేశ్లోకి ప్రవేశించక ముందు, దీనివాలు మాములునదులకంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఋతుపవనాల సమయంలో బాగా ఉధృతంగా ప్రవహిస్తే, మిగిలిన సమయాల్లొ అక్కడక్కడా నిలువనీళ్లు కనిపిస్తాయి. ఈప్రాంతంలో భౌగోళికంగా కొన్ని బలహీనమైన ప్రాంతాలు ఉండటం వల్ల( వీటిని సాంకేతికంగా ఫాల్ట్ అంటారు.) ,వాలువల్ల ప్రవాహవేగం ఎక్కువయ్యి , గతంలో భూమి విపరీతంగా కోతకు గురయ్యి చాలా సార్లు తన గమనాన్ని మార్చుకొంది. తరువాత వాలు తగ్గి వేగం మందగించటంతో లోతు తగ్గి, బాగా విశాలంగా అవుతుంది.

దేరి అనే ప్రాంతం( పాట్న దగ్గర,బీహార్) వద్ద దాదాపు 5కి.మి. వెడల్పు ఉంటుంది. కానీ మునకప్రాంతం మాత్రం 3-4కి.మి. మాత్రమే. ఈనదికి దేరి వద్ద ఆనకట్ట 1873లో ఈస్ట్ ఇండియా కంపెనీవాళ్లు నిర్మించారు. దేశంలోని అత్యంత పురాతన నీటిపారుదల వ్యవస్థల్లో ఇది ఒకటి. మనకు స్వాతంత్ర్యం వచ్చిన తరువాత, ప్రభుత్వంవాళ్లు 1960లో దేరికి ఎగువన ఇంద్రపురి అనే ప్రాంతంలో ఒక బారేజి నిర్మించి, దానిని ఆనకట్ట కాలువలకు ఒక ఎగువస్థాయి పారుదల వ్యవస్థ ద్వారా అనుసంధానం చేశారు.
దేరి ఆనకట్టను( దీనిని దిగువ సోన్ నీటిపారుదల వ్యవస్థ అంటారు.) రబీసాగుకు మాత్రమే రూపొందించారు. కాని తదనంతరం సేద్యంలో వచ్చిన మార్పులతో ఖరీఫ్‌కు నీటిని అందచేయాల్సి వచ్చింది. లేనిపక్షంలో సన్నకారు రైతులు సేద్యానికి దూరమయ్యి సమాజంలో ఆర్ధిక సమతూకం దెబ్బతినే పరిస్థితి తలెత్తింది. ఇంద్రపురి బారేజిని నిర్మించి, దాన్ని దేరి అన్నకట్టకు అనుసంధానం చెయ్యల్సిందిగా నిపుణులు సూచించారు. అందుకు అనుగుణంగా రెండవ ప్రాజెక్టును నిర్మించారు. కొత్త వ్యవస్థను పాతవ్యవస్థకు కలిపేచోట కొన్ని చిన్నతరహా జలవిద్యుత్తు కేంద్రాలను నెలకొల్పారు.

మరొక బహుళార్ధకసాధక ప్రాజెక్టు మద్యప్రదేశ్లోని షాదోల్ జిల్లాలో అంతర్రాష్ట్ర జలఒప్పందాలను అనుసరించి మద్యప్రదేశ్, ఊతరప్రదేశ్ మరియు బీహార్ రాష్ట్ర్రాలు నిర్మించాయి. 7వ శతాబ్దానికి చెందిన గొప్పశాస్త్రజ్ఞుడు బాణభట్టు ఈప్రాంతానికి చెందినవాడు కావటంతో బాణ్ సాగర్ అనిపేరు పెట్టారు.( కనీసం ఒకప్రాజెక్టుకైనా ఇలాంటివాళ్లను గుర్తుంచుకొన్నందుకు సంతోషిద్దాం.) 1956లో కేంద్రజలవనరుల సంఘం(ఇది డేశంలో జలవనరులు, నీటిపారుదల ప్ర్రజెక్టులకు అత్యున్నతవిభాగం. అన్నిముఖ్యమైన, జాతీయస్థాయి ప్రాజెక్టులను ఇది పర్యవేక్షిస్తుంది. మిగిలిన వాటికి అవసరమైన సూచనలు ఇస్తుంది.) సోన్ నదికి ఉపనదైన బాణనది కలిసేచోట 'డింబప్రాజెక్టూ అనే పేరుతొ ప్రతిపాదించారు. ఐతె 1973 వరకు ఆప్రతిపాదనలు ముందుకు సాగలేదు. 1973లో కుదిరిన అంతర్రాష్ట్ర ఒప్పందం ప్రకారం ముందుగా పేర్కొన్న చోటకాక దానికి 30కి.మీ. దిగువన ఉన్న దేవభూమివద్ద నిర్మించ తలపెట్టారు. 1978లో 91.3కోట్లుగా ప్రతిపాదించిన వ్యయం 1998నాటికి 1054.96కోట్లకు పెరిగింది. చివరికి 2006లో పూర్తిచేశారు. అలా 1978లో మొరార్జీదేశాయ్ ప్రధానిగా టెంకాయకొట్టిన దానికి వాజపేయి మాజీప్రధాని హోదాలో 2006లో గేట్లు ఎత్తారు.
ఈడాం ఎత్తు 67మీటర్లు, పొడవు 1020మీటర్లు. 4జిల్లాలలోని 336గ్రామాలు ముంపుకు గురయ్యాయి. ఖర్చు మ.ప్ర., యుపి, బీహార్లు 2:1:1 నిష్పత్తిలో పంచుకొన్నాయి. దీనిద్వారా మద్యప్రదేశ్‌లో 2,490చదరపు కిమీ., యుపీలో 1500చదరపు కిమీ., బీహార్లో 940కిమీ సాగులోకి వచ్చాయి. మద్యప్రదేశ్‌కు 425మెగావాట్ల విద్యుత్తు లభిస్తుంది.

పాట్నా దగ్గర క్విల్వార్ అనేచోట రోడ్ కం రైలుబ్రిడ్జ్ (రాజమండ్రి దగ్గర గోదావరిపై కట్టినట్లు) నిర్మించారు. ఐతె గోదావరి బ్రిడ్జికి దీనికి తేడా ఏమిటంటే, దీనిలో పైన రైలుమార్గం, కింద రోడ్డుమార్గం ఉంటుంది. దీనికి ఉన్న ముఖ్యమైన ఉపనదులు రిహాంద్, కోయెల్. ఇవి ఉత్తరప్రదేశ్లో కలుస్తాయి. రిహాంద్- సోన్‌లో కలిసే చోట ఒక బహుళార్ధక సాధక నిర్మాణం ఉంది. ఉత్తరప్రదేశ్లో అలహాబాదు బెనారస్(కాశీ)మద్య మీర్జాపూర్ అనే ఊరు ఉంది. అది ఒక జిల్లాకు ముఖ్యపట్టణం. గతంలో ఇది ఆసియాలోకెల్లా అతిపెద్దజిల్లా. దీనికి సరిహద్దులో మద్యప్రదేశ్, బిహార్ ఉండేవి. ఐతె ఇటీవల ఛత్తీస్గడ్, ఝార్కండ్ ఏర్పడటంతో, ఇది 4 రాష్ట్రాలకు సరిహద్దు జిల్లా అయ్యింది. పాలనాపరమైన ఇబ్బందులు తలెత్తడంతో రేండుముక్కలు చేశారు. సంబంధం లేకుండా ఈసోది ఎందుకు చెబుతున్నాను అనుకొంటున్నారా. అలా ఏర్పడ్డ కొత్తజిల్లాకి ముఖ్యపట్టణం రాబర్ట్స్ గంజ్, ఆకొత్తజిల్లా పేరు సోనభద్ర.

6 comments:

  1. చక్కని సమాచారం.. చెప్పిన విధానం బాగుంది. చిన్న సందేహం.. సివిల్ సర్వీసెస్ కి ప్రిపేర్ అవుతున్నారా? ఇప్పటి వరకు ఆ ఆలోచన లేకపోయినా ఒక్కసారి ఆలోచించండి.. సీరియస్లీ..

    ReplyDelete
  2. బావుంది టపా ! జీ.కే. ని గమ్మత్తు గా చెప్తున్నారు !

    ReplyDelete
  3. @ మురళి: సివిల్స్ పెద్దగా ఇంటరెస్ట్ లేదండి. నాకు ఇంజినీరింగ్ అంటేనే ఇష్టం. కాకపోతే IES ఇంటర్వ్యూలొ మిస్స్ ఐంది.
    @ sujata,పద్మర్పిత: ధన్యవాదాలు

    ReplyDelete
  4. bAgundi infortmation.

    ReplyDelete
  5. bagundi inkosari IES ki try chei raaaaa
    nakenduko esari vastundhanipistondhi

    ReplyDelete