ఇంక్విలాబ్ జిందాబాద్

అసలే కొత్తప్రాంతం, దానికితోడు పనివత్తిడి. తెలిసినవాళ్ళో, తెలుగువాళ్ళో ఉంటే వసపిట్టడుగా ఉండే నేను ఇక్కడ ఆంజనేయులు తోడులేని అమృతరావులా ఐపోయాను. సెటైర్లులేవు, పంచ్లులేవు. ఇలాకొంతకాలం ఉంటే, సన్యాసినో సన్నాసినో ఐపోయే పరిస్థితి. ఒక ఆదివారం ఈనాడు చదివితే ఎందుకో ఒక బ్లాగుపెడితేపోలా? అనిపించింది. అలా ఏనుగు వెలగపండు మింగిన శుభాముహూర్తాన ఇందులో అడుగుపెట్టాను. కొంచం అక్కడా ఇక్కడా కెలికితే కూడలి, నెమలికన్ను, నవతరంగం మొ చూసేసాను. నాలో ఉత్సాహం కట్టలుతెంచుకుంది. నేనూ ఒక బ్లాగుకు కర్చీఫ్ వేసి (ఇంకా పేరు గట్రా అనుకోలేదు.) అలా నాలుగురోడ్ల కూడలికి వెళ్ళి దారిన పొయ్యే బ్లాగయ్యలను గోకాను. బాగా నచ్చిన ఒకటి రెంటికి వాఖ్యానాలు చేసి నేనుసైతం( చీ వెధవపలక "సైతం" అని కొడితే "సైతాన్" అని వచ్చింది.) అనుకుంటూ బయటకి వచ్చేశాను. తరువాతరోజు ఇక చెయ్యి, బుర్రా ఊరుకుంటాయా. సరే మొదటి రోజు శాసనసభ సమావేశల్లాగా వందనాలు సమర్పించి ఈపూటకి చాలులే అని బయటకి వచ్చేశాను. ముచ్చటగా మూడోరోజు కూడలికి వెళ్తే తెలిసింది అసలు పరిస్థితి. ఏదైనా ఒక విషయం గురించిరాద్దామ్ అంటే అప్పటికే 3 టపాలు వాటికి 36 వ్యాఖ్యానాలు. అప్పుడు అర్ధమైంది ఇక్కడ ఏదో జరుగుతోంది అని. అలా అన్నీ కెలికితే తెలిసిన సంగతి ఏంటి అంటే ఇక్కడ కెలకని విషయంలేదు.
నాలాగా ఇప్పుడే పాకే పాకుడుబ్లాగర్లు ఐతే కనీసం ఒక 10 విషయాలు అనుకొని తీరాతెరిచిచూస్తే అప్పటికే ఒక ఇరవైమంది బ్లాగేసి తాంబూలాలిచ్చేసాం తన్నుకుచావండి అని వెళ్ళిపోయుంటారు. టపారాసే ఉత్సాహం నీరుగారి ఇక మనసు ఒప్పుకోక ఒకవ్యాఖ్యానం వాగి వెళ్ళిపోవాలి. అప్పుడు పుట్టుకొచ్చింది విప్లవాగ్ని. నాలో ఒక ఎర్రసైన్యం నారాయణమూర్తి, నిప్పురవ్వ బాలకృష్ణ, మాదాల రంగారావు ఒకరి తరువాత ఒకరు పరకాయప్రవేశం చేశారు. అగ్నిపర్వతం కృష్ణ అగ్గిపెట్టెకోసం ఎదురుచూస్తున్నాడు. ప్రతిఘటన విజయశాంతి కూడా వస్తుందేమోనని భయపడ్డాను. రాలేదు బతికిపోయా. నా చొక్కా ఎర్రగా మారింది. ఆరంగు రిఫ్లెక్ట్అయ్యి నాబ్లాగుకూడా ఎర్రబడింది. ఇంతలో అమ్మనుంచి పిలుపు. అంటే మా అమ్మగాదు. అమ్మలగన్నయమ్మ పక్కనే ఉన్న యుట్యూబ్ కిటికీలో పూని “ఒరేయ్! ఇకడ జరిగే అన్యాయం ఆపరా” అని పలికింది.


అయ్యా! సీనియర్లూ ఇదేమన్నా భావ్యమా మీకు. ఏదో గ్రహభూమి అన్నారు సరే. శాస్త్ర విజ్ఞానం అన్నారు సరే. అవి ఎలాగూ మేము రాయం... రాయలేం. మాకంటూ కొన్ని వదలరా? భూమిని సరే తొవ్వుకోపోయి తర్వాత తరాలకు లేకుండా చేస్తున్నాం. ఇక్కడ కూడా మాకు రాయడానికి ఏమీమిగల్చకపోతే ఏమీ చెయ్యాలి మేము. ఇక ఏ ఘనా, కాంగో, ఇతీయోపీయోల భాషల్ని నేర్చుకుని అక్కడ రాస్కోవాలి. మరీ దారుణంగా చేతులు ఎలాకడుక్కోవాలి అన్నదానిపై 20 మార్కుల వ్యాసప్రశ్నకి సమాధానం రాశాడు ఒకతను.(దయచేసి తప్పుగా అనుకోవద్దు సర్. ఏదో కొంత బాధ అంతే :))

మొత్తంమీరే రాసేశారు. బ్లాగు మొదలుపెట్టటానికి ఇప్పటికీ తేడా ఎంతో తెలుసా..? రాయటం. చిన్నచిన్నపోస్టులు కూడా వేయలేకపోతున్నాం మీవల్ల. టపా మీరే రాస్తారు. మీరు రాసిందే కారెక్ట్ అని ఒప్పిస్తారు. మాకు ఎలా ఉంటుందో తెలుసా? దాన్ని డెలిట్ చేసిపడేయ్యాలి అనిపిస్తుంది. చివరికి కామెంట్ ఎలా రాయాలో కూడా మీరే చెప్తే ఇక్కడ మౌస్, కీబోర్డు కదలట్లేదు సార్. చిన్నప్పుడుస్కూల్లో చేరితే సైన్సు బాగా నచ్చింది. సరే సైంటిస్ట్ అయ్యి ఏదైనా సాధిద్దాం అనుకొన్నా. కానీ అప్పటికే చాలా కనుగొనేశారు. ఇంకా కనుక్కొనివీ నాకూ అర్ధం కాలేదు. సర్లే ఒక్కసారేకదా అని పట్టించుకోలేదు. ఇప్పటికీ నాకు ఏదీ మిగల్చకుండా అంతా ముందువాళ్లే కానిచ్చేస్తే ఎలా?

డ్రింక్సు బ్రేకులో టవలు, నీళ్ళు మోసుకెళ్లే పిల్లక్రికెటర్లా ఎన్నాళ్లు మేము కామెంట్స్ రాసుకుంటూ గడపాలి? ఎవ్వరికీ కనిపించదు, దూరంగా ఉంటుంది అని ప్లూటో గురించి దానిమీద జీవంతాలూకు గుర్తుల్‌ని తడుముదాం అనుకొంటె అప్పటికే ఎవరో గొకేసి పీకేసి రక్కెసి ఉంటారు. (మనవాళ్ళు అంత దూరం వెళ్ళినందుకు ఆనందంగా ఉన్నా) ఇక మాకు ఏమీ మిగిలింది? మీకంటే ఇంజినియరింగ్ సీనియర్లే నయం. రాగింగ్ చేసినా డ్రాయింగ్ ఎలానో నేర్పేవారు. బట్టలుతికించినా పుస్తకాలు ఇచ్చేవారు. ఒకవిషయం అనుకోని మొదలు పెట్టేసారికే చుక్కలు కనిపిస్తున్నాయి. తరువాత అసలు పలక మీద రాసేసరికి తలప్రాణంతోకమీదకి కాదు దాని తోకమీదకి వచ్చేస్తోంది. దీని దుంపతెగా..! నేను ఏదోరాస్తే ఇంకేదో చూపిస్తోంది. పుట్టి పలక పట్టినప్పటి నుంచి ఎరుగను ఇన్ని ముద్రారాక్షసాలు. దీన్ని నమ్ముకొని ఎవడైనా ప్రేమలేఖలురాస్తే వాడు ఇంట్లో వాజపేయి, వావిలాల (ఆడవాళ్ళు ఐతే జయలలిత, మమత) లాంటి ఆజన్మబ్రహ్మచారుల ఫోటోలు పెట్టుకోవచ్చు. ఇంత కష్టపడి రాసిపోస్ట్ చేసి ఒక అరగంటో గంటన్నారో కూడలిని రెఫ్రెష్ చేసి చేసి చూస్తే చివరికి తలుక్కున మెరుస్తుంది. (ఈ ఒక్కక్షణం మాత్రం కొంచంతృప్తి.) సరే ఉందిలే అలా టీ తాగివద్దాం ఎవరైనా కెలుకుతారేమోనని వెళ్ళివచ్చేసరికి అదిమాయం. జారుడుబల్ల మీద పిల్లాడీలా దేక్కుంటూ కిందకి వెళ్ళిపోతుంది. నేనుపోనని ఉగ్గబట్టి ఏడ్చినా లాభంలేదు. ముక్కుచీదుకుంటూ వీధినపడాలి.

అందుకే ఇక్కడ ఇంకా పాకుతూ ఉన్న మా జూనియర్ బ్లాగర్లు అంతా దీనిమీద సమైక్యంగా పోరాడాలి అని నేను పిలుపు ఇస్తున్నాను. హితులారా ఇక్కడ గర్ఝించింది ఒక పసిహృదయం. ఏకంకండి. మనకోసం 2MBPS వేగంతో కదులుతున్నాయి సర్వర్నాధ రధచక్రాలు. నేను ఇక్కడ ఈంక్వీలాబ్ అంటాను మీరు మీ బ్లాగుల్లో జిందాబాద్ అని టపా పెట్టండి. జూనియర్ డాక్టర్ల సమ్మెకంటే ఉధృతంగా సాగాలి మన పోరాటం. మనకు ప్రత్యేక కూడలి కేటాయించే దాకా ఆగదూ... ఆగదూ..ఆగదు బ్లాగాభిషేకం.
ఇప్పటికే ఈ విషయంపై కూడా ఎవరైనపెద్దలు రాసి ఉంటే ( నా ఖర్మకొద్దీ) మీ మద్దతు కోరుకుంటున్నాం. మీరు మా ఉద్యమానికి జయశంకర్. KCR మాత్రం నేనే. మేమంతా విడివిడిగా కొన్ని నిర్ణయాలుతీసుకొని సమైక్యంగా మాడిమాండ్లను ప్రకటిస్తాం. ఇంక్విలాబ్ జిందాబాద్

గమనిక:- ఇది ఎవరినీ నొప్పించదు అని భావిస్తున్నాను. ఇబ్బందిపెడితే చెప్పండి తీసేసెందుకు ఎలాంటి అభ్యంతరము లేదు

11 comments:

 1. Ha ha nice post.
  Even I too feel the same. Last week I was very excited start my blog in Telugu. But after seeing here my excitement got lost :-(

  ReplyDelete
 2. హ హ హ చాలా బాగా రాశారు. :)

  >>"ప్రత్యేక కూడలి కేటాయించే దాకా ఆగదూ... ఆగదూ..ఆగదు బ్లాగాభిషేకం."

  కూడలిలో "నిర్వహణ" అనే వెసులుబాటు ఉంది. ఈ వెసులుబాటు ద్వారా మీకు నచ్చని బ్లాగులను కూడలిలో కనిపించకుండా చేసుకోవచ్చు.

  పూర్తి వివరాలకు ఇక్కడ చదవండి. http://veeven.wordpress.com/2009/06/10/koodali-new-features/

  ReplyDelete
 3. అయ్యా నాగప్రసాదుగారు నేను ఆ పనిచేస్తే చాలామంది నా బ్లాగుమీద కూడా అదే వెసులుబాటును ఉపయోగిస్తారు. ఇది 364 అధికరణం లాంటిది

  ReplyDelete
 4. @Venkata Ganesh. Veerubhotla :I too feel same సరిపోదన్డి జిందాబాద్ అని టపాపెట్టాలి.

  ReplyDelete
 5. సరే బాధపడుతున్నరు కాబట్టి, మీకు తెలుగ్ బ్లాగ్లలో, ఇంకారాని అవుడియాలు, వాటికి తోడు, రాత్రికి రాత్రె (overnight) బోలెడన్ని హిట్టులు వచ్చె విషయాలు.

  1. నేనెందుకు హిందువును కాదు (కంచె ఐలయ్య బ్లాగ్లలోకి ఇంకా (official) గా enter కాలేదు కాబట్టి), OK, లేకపోతే నేనెందుకు తెలుగువాడిని కాదు
  2. ఈ తెలుగోళ్లు / హిందువులు అందరూ ఇలా ఎందుకు తగలడ్డారు
  3. బట్టతల కప్పిపుచుకోవటానికి మార్గాలు ఎన్ని, వాటి తేడాలు
  4. బాగా దీపావళో, లేక దసరా బిజీ రోజులలో, మీ సుల్తాన్ బజార్ అనుభవాలు (గుద్దిళ్లు)


  చివరగా,
  5." నేను ఎందుకు చిన్నప్పటినుండి పెడ గాడిని", "నా లాంటి పెడ గాళ్లు లేకపోతే (బ్లాగ్)లోకం ఎంత బోసిపోతుంది అని ఓ టపా

  పైన ఉన్న అవుడియాలను, పెట్టేసి, టపాలు వ్రాయటం ద్వారా వచ్చే పాపులారిటీ లో నాకు కూడా కొంత భాగం ఇవ్వల్సిందే మరి!!!

  ReplyDelete
 6. చైతన్య గారూ, ఇవాళే మీ బ్లాగు చూశాను.. మీ ప్రొఫైల్ లోకి రావడం, ఖాళీగా ఉన్న 'భావన' చూసి వెళ్ళడం ఓ నాలుగైదు సార్లు జరిగింది.. 'నా బ్లాగులో రాయాలి' అన్న మీ వ్యాఖ్య చూశాక ఎక్కడో ఏదో పొరపాటు జరిగిందని అర్ధమైంది.. ఇటొచ్చి మొత్తం టపాలన్నీ చదివాను.. మీరు ఎంచుకుంటున్న విషయాలు, రాస్తున్న విధానం బాగున్నాయి. మీరు ఏ 'పలక' మీద రాస్తున్నారో తెలియదు.. గూగుల్ టూల్స్ లో కొంచం తక్కువ తప్పులతో రాసే సౌకర్యం ఉంది.. జిమెయిల్ తెలుగు ప్రయత్నించండి.. http://www.google.co.in/transliterate/indic/telugu సహాయం కూడా తీసుకోవచ్చు. ఇక మీ స్వర్ణముఖితో నాక్కూడా కొంచం అనుబంధం ఉంది.. ఏర్పేడు పక్కన 'వికృతమాల' అన్న ఊరు తెలుసు కదా.. ఆ ఊరిని చూసినప్పుడు మా కోనసీమ గుర్తొచ్చింది. స్వర్ణముఖి ని నీళ్ళతో చూడాలన్న నా కోరిక మాత్రం తీరలేదు.. ఏడేళ్ళ క్రితం సంగతి ఇది. ప్రస్తుత టపా గురించి.. ఒక విషయం గురించి ఒక్కరు మాత్రమే రాయాలని ఏముంది చెప్పండి? ఆమాటకొస్తే ఒకే కథతో మనవాళ్ళు ఎన్నెన్ని సినిమాలు తీయడం లేదు? :-) సాటి జూనియర్ బ్లాగరు గా నా మద్దతు మీకు తెలియజేసుకుంటున్నాను :-) సరే, నా వ్యాఖ్యే ఓ టపా అంత అయ్యేలా ఉంది.. ఇక క్రమంతప్పకుండా ఇటు వస్తూ ఉంటాను.. రాస్తూనే ఉండండి.. శుభాకాంక్షలు.

  ReplyDelete
 7. చైతన్య గారూ ! మీ బ్లాగ్ బావుందండీ ....
  మీ ఇంక్విలాబ్ జిందాబాద్ పోస్ట్ కేక .....
  అని చెప్పాలనిపించినా ...మరీ మాస్ గా ఉంటుందేమో అన్న మొహమాటంతో చాలా బావుందని మాత్రమే చెప్తున్నా :) :)

  ReplyDelete
 8. మంచి ప్రారంభం..
  "చీ వెధవపలక "సైతం" అని కొడితే "సైతాన్" అని వచ్చింది"
  హ హ హ.
  ఇక కానియ్యండి మరి.

  ReplyDelete
 9. @అజ్ఞాతులకు ధన్యవాదాలు. నేను మీకు ముందుగానే తెలుసా? లేకపోతే ఎందుకండీ నామీద ఇంతపగ?
  @మురళి: ముందుతెలీసేనాప్రభూ ఈ థీమునిటులుంచేనా.. నువ్వు కామెంటు మధుర క్షణమేదో కాస్త....
  నెమలికన్ను ఓరకంట చూసిందోచ్. మంచిషాట్ కొట్టావ్ అని సచిన్ భుజం తడితే సెహ్వాగ్ ఎలా ఫీల్ అవుతాడో ఈరోజు తెలిసింది. భావనకి కొంచంవెసులుబాటు కావాలండీ. ఎప్పుడు మొదలుపెడుతానో?
  పరిమళం: ధన్యవాదాలు
  కొత్త పాళీ : ధన్యవాదాలు

  ReplyDelete
 10. హ హ్హ హ.....బాగా చెప్పారు. మీరు ఉద్యమంగాని మొదలు పెడితే చెప్పండి నేను నా బ్లాగులో జిందాబాద్ అనేస్తాను. కాకపోతే ఈ సీనియర్‌ బ్లాగర్లలో కొందరు విప్లవ నారాయణమూర్తులు ఉన్నారు. జూనియర్‌ బ్లాగర్ల సంఘం ‘కెలుకుడు’ మొదలు పెట్టిందని తెలిస్తే ‘ధూం ధాం’లు, ఏకిపారేయడాలు, ‘జూనియరికల్‌ ఆటిట్యూడ్‌’స్టాంపులు వేసేస్తారు....జాగ్రత్త మరి...

  పలకతో సమస్య అనుకుంటే ఇది ప్రయత్నించండి...గీకేసి అతికించే గోల ఉండదు
  బరహ

  ReplyDelete
 11. chAla bAgA rAsAru chaitanyA.super!!

  ReplyDelete