మేరునగ తప్పిదం- 8.తుఫాను ముందు ప్రశాంతత

సరిహద్దులోని వాస్తవ పరిస్థితులపై అవగాహనలేమి కారణంగా ప్రజలు సైన్యాన్ని నిందించడం మొదలుపెట్టారు. ఇంకోవైపు చైనా యుధ్దందిశగా ఒక్కొక్కడుగూ నెమ్మదిగా వేస్తూ ముందుకొస్తోంది. భారత్ మాత్రం ఒక జాతీయ లక్ష్యం అంటూ లేకుండా, ఎవరి అవసరాలకు తగ్గట్టు వాళ్ళు మాట్లాడే అవకాశం కల్పిస్తోంది. ప్రజాస్వామ్యం అన్న ముసుగులో నాయకులు ఆడుతున్న ఆట కారణంగా దేశావసరాలు- నాయకుల లక్ష్యాల మద్య అంతరం స్పష్టంగా కనిపించసాగింది.

లఢాఖ్లో చైనా ఆధీనంలోకి వెళ్ళిన ప్రాంతాలు ఆదేశ సైనికావసరాలకు అత్యంత కీలకం కావడంతో భారత్కు తిరిగి దక్కడం అంతసులువు కాదు. ఈసంగతి తెలిసినా నాయకులు మాత్రం "చివరి అంగుళం సొంతమయ్యేదాకా పోరాడుతాం." అంటూ ప్రగల్భాలు పలకసాగారు. 1959 తర్వాత టిబెట్లో పరిస్థితులు పూర్తిగా నియంత్రణలోకి రావడంతో చైనా అక్కడున్న సైన్యాన్ని భారత సరిహద్దు వైపు మళ్ళించసాగింది. రాజకీయ వేదికలపై మన పెద్దన్న పాత్రని పొగుడుతూనే ఇంకోవైపు సైనికచర్యలకు కావలసిన వనరులను క్రోడీకరించసాగింది. వీటికి జవాబుగా భారత్ చర్యలు శూన్యం. మన సన్నాహాలన్నీ వీధిపోరాటాలకు, అల్లర్లను అణగదొక్కడానికి పనికొస్తాయి తప్ప ఒక బలమైన శత్రువును పూర్తిస్థాయి యుద్ధంలో ఎదుర్కోవడానికి కాదన్నది విస్పష్టం. సైనిక సూతాలపై అస్సలు అవగాహనలేని నాయకులు దాన్ని కప్పిపుచ్చుకోను అహింసాసిద్దాంతాన్ని వల్లెవేయనారంభించారు. 1962 నాటికి చైనా వద్ద అత్యాధునిక యుద్ధసామాగ్రి, ప్రధమశ్రేణి యుద్దనైపుణ్యం ఉంటే మనంమాత్రం రెండవ ప్రపంచయుద్ధ కాలంనాటి సామాగ్రితో, అప్పటి యుద్ధతంత్రాలతో కుస్తీపడుతున్నాం.

1962 ఆగస్టులో లఢాఖ్లో చైనాతో ఘర్షణ జరిగింది. ఆతర్వాత చైనా మరొక ముప్పై సైనికపోస్టులను నెలకొల్పింది. అప్పటికే 12000 చదరపుమైళ్ళు ఆక్రమించి ఉన్న చైనా ఈసంఘటన తర్వాత మరొక 2000 చదరపు మైళ్ళు మింగేసింది. దీనిపై భారత్ చర్చలకు పిలవగా ససేమిరా అంది. అయినా భారత్ మాత్రం చర్చలతో విబేధాలన్నీ పరిష్కరించుకుంటాం అంటే శత్రువు దృష్టిలో ఎంత చులకన అయిపోతాం? తరచుగా యుద్దం- చర్చల మద్య దోబూచులాడుతూ భారత్ రెండుదారులనూ మూసేసుకుంది.

మద్యలో ఇంకొక ప్రచారం మొదలైంది. దాని సారాంశం- ప్రముఖ రష్యన్ నాయకుడూ ఖుర్శ్చేవ్- చైనా విదేశాంగ మంత్రి మార్షల్ చేన్ యితో, భారత విదేశాంగ మంత్రి మీనన్తో జెనీవాలో ఒక సదస్సు సందర్భంగా కలిశాడు. అక్కడ ఇద్దరి మద్యనా నెలకొన్న సరిహద్దు వివాదం గురించి మాట్లాడి చీవాట్లు పెట్టాడు. భారత్, చైనా లాంటి సోషలిస్టు దేశాలు తగవులాడితే అది వలసపాలకులకు, పెట్టుబడిదారులకి వరంగా పరిణమిస్తుంది. కాబట్టి నోర్మూసుక్కూర్చోండన్నాడు. మార్షల్ చేన్ యీ శాంతియుత విధానాలద్వారా సమస్యను పరిష్కరించుకుంటామని హామీ ఇచ్చాడు. దీంతో భారత ప్రభుత్వం ఊపిరి పీల్చుక్కుని ఇక యుద్ధంరాదని నిశ్చయించేసుకుంది. ఈసారి భారత సరిహద్దును రక్షించే బాద్యత సోవియట్ తీసుకుంది! ఈహామీ వల్లనే భారతప్రభుత్వం యుద్ధానికి సన్నాహాలు చెయ్యలేదని కొందరు చెబుతూ వచ్చారు. దీని విశ్వసనీయత ఎలా ఉన్నా, భారతప్రభుత్వం సరైన సన్నాహాలు చెయ్యలేదన్నది విస్పష్టం.

తరువాత చైనా లఢాఖ్లోని వివాదాస్పద గల్వన్ లోయను ఎంచుకుంది. 300మంది చైనీయులు అక్కడ కాపలా కాస్తున్న 40మంది గూర్ఖాలపై దాడి చేశారు. వాళ్ళని లొంగదీసుకునేందుకు అనేక జిమ్మిక్కులు వాడారు. చివరికి "భారత్ కోసం నేపాలీలు ప్రాణాలర్పించాల్సిన అవసరంలేదు. నేపాల్- భారత్లు స్నేహితులేంకాదు." అన్న వాదన కూడా మొదలుపెట్టారు. కానీ వాళ్ళు లొంగకపోవడంతో చైనీయులు పాశవికంగా హతమార్చారు. ఒకవైపు భారత నాయకులే సరిహద్దును గురించి పట్టించుకోకుండా రోజువారీ రాజకీయాలతో కాలం గడుపుతుంటే, మనదేశస్థులు కాకపోయినా విధినిర్వహణలో ప్రాణాలర్పించిన గూర్ఖాలు ప్రాతఃస్మరణీయులు. ఏమిచ్చి వాళ్ళ ఋణం తీర్చుకోగలం. కానీ దురదృష్టవశాత్తు మిగతా సైనికులలానే వీళ్ళ త్యాగాన్ని గుర్తించే తీరిక మనకు లేకుండా పోయింది! ఈ సంఘటన ద్వారా చైనా తన ఆలోచనను బయటపెట్టింది. భారత భూభాగాన్ని వశపరచుకునేందుకు ఎంతటి దాడికైనా సిద్ధమని చెప్పకనే చెప్పింది. అయినా మనకే అర్థంకాలేదు. బహుశా అర్థమైనా కానట్టే నటించామనుకుంటా.





రెండు దేశాలు సరిహద్దుకి ఇరువైపులా ఎదురెదురుగా నిలబడే రోజు అతిచేరువగా వచ్చేసింది. అప్పటికి రెండువైపులా సన్నాహాలను బేరీజు వేస్తే-


ముందుగా చైనా వైపున-



  1. అంతకు కొన్ని నెలలు ముందుగానే చైనా కొంతమంది ఏజెంట్లను భారత్లోకి పంపించింది. వీళ్ళు రోడ్డుకార్మికులుగా ఆప్రాంతమంతా జల్లెడపట్టారు.
  2. కొరియా యుద్దంలో నాయకత్వం వహించిన వ్యక్తిని ఆయుద్ధం ముగిశాక ఇక్కడికి పంపారు.
  3. అన్ని ముఖ్యమైన భారతీయ భాషలకూ దుబాసీలను ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళకి భారత ఆచారాల పట్ల, నమ్మకాల పట్ల అవగాహన కల్పించారు. బహుశా వీరినే సాంస్కృతిక బృందాలుగా మనదగ్గరకి పంపి ఉండొచ్చు.
  4. ఫోటోగ్రాఫర్లను, వీడియో కెమెరామెన్లను భారత్లోకి పంపి కావలసినంత సమాచారం తెచ్చుకున్నారు.
  5. కొన్ని వందలమంది గిరిజనులను కార్మికులుగా నియమించుకున్నారు. వీళ్ళకి భారత సైన్యం దుస్తులు కూడా చైనావాళ్ళే ఇచ్చారు!
  6. ఆయుధాగారాలను కీలకప్రాంతాల్లో ఏర్పాటు చేసుకున్నారు. వాటిని నిల్వచేయడానికి, సరఫరాకు కావలసిన పరిపాలనా వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నారు. వేసవికాలమంతా వీటిని నింపుకున్నారు.
  7. 3000 మంది యుద్ధఖైదీలను ఉంచగలిగే క్యాంపులను నిర్మించారు. యుద్ధఖైదీల వరకు ఆలోచించారంటే చైనా యుద్ధానికి ఎన్నేళ్ళముందే నిర్ణయించుకుందో అర్థమవుతుంది. ఇక్కడ 3000 అని చెప్పడం ద్వారా భారత్ అంతకన్నా ఎక్కువమందిని పంపదు అన్న ఖచ్చితమైన అంచనా అక్కడి ఇంటేలిజెన్స్ ఇవ్వగలిగింది.
  8. ఇంతకు ముందే చెప్పుకున్నట్టు రోడ్లు, సమాచార వ్యవస్థలు, ఇతర మౌలికసదుపాయాలు పూర్తిస్థాయిలో నిర్మించారు.
  9. వాళ్ళ బలగాలకు భారత్కు వ్యతిరేకంగా నూరిపోసి అదే ఆలోచనలతో బ్రతికేలా చేశారు. సమస్యను భారత్ మొదలు పెట్టింది కాబట్టి మనం జవాబు చెప్పాలి అన్నది వాళ్ళ భావనైంది.
  10. వాళ్ళ సైనిక లక్ష్యం, రాజకీయ లక్ష్యం ఒకటిగా చేసుకున్నారు. దీనివల్ల ఉన్నతస్థాయి నుంచి  క్షేత్రస్థాయి వరకు ఒకటే విధానమైంది.

ఇటు భారత్ వైపు సన్నాహాలు అత్యంత ప్రమాదకరంగా ఉన్నాయి. మౌలిక సదుపాయాలు లేవు. సమాచార వ్యవస్థలేదు. ఇంటిలిజెన్స్ ఉందో?లేదో? తెలీదు. అవసరమైన యుద్ధసామాగ్రి, ఇతర వనరులు లేవు. ఆ సమయంలో సరిహద్దులో ఉన్న సైన్యానికి అతిదగ్గరగా ఉన్న మరొక దళం పంజాబులో ఉంది! మన భూభాగం అని చెప్పబడే ప్రాంతం గురించి కనీసవగాహన లేదు. అక్కడి భౌగోళిక పరిస్థితులు, వాతవరణం, జాతులు, వాళ్ళ భాష వగైరాలు వీసమెత్తైనా తెలీకుండానే మనవాళ్ళను అక్కడికి పంపారు. అన్నింటికన్నా ప్రమాదకరమైన అంశం- ఇక్కడ రాజకీయ లక్ష్యం, సైనిక లక్ష్యం పరస్పర విరుద్ధంగా ఉండటం. దీనివల్లే సమస్య రోజురోజుకీ ఝటిలమౌతూ వఛ్కింది. సైన్యంలోని మొదటి దళం అక్కడికి ప్రవేశించకముందే నాయకులు గంభీరమైన ప్రకటనలు ఇచ్చేశారు. ప్రజలకు నమ్మకం సడలిపోయాక, గగ్గోలు పెడుతూ ఆప్రభావాన్ని సైన్యంమీదకి తోశారు. అంతేగానీ ప్రజలను మభ్యపెట్టినందువల్లే సమస్య ముదిరిందన్న నిజం మాత్రం ఒప్పుకోలేదు. జాతీయ నాయకునిగా గుర్తింపుపొందిన వ్యక్తి సారధ్యంలోని ప్రభుత్వం దేశసంక్షేమానికన్నా పార్టీ బతకడమే ముఖ్యంగా భావించడం జీర్ణించుకోలేని నిజం.

సరిహద్దులో వాతావరణం వేడెక్కేనాటికి ఉన్నత స్థాయిలోని వ్యక్తులెవరికీ వాస్థవ పరిస్థితిపై అవగాహన లేదన్నది వాస్తవం. సరిహద్దుకవతల చైనా శిబిరంలో ఏమి జరుగుతుందనే సమాచారం ఇవ్వాల్సిన ఇంటేలిజెన్స్ ఏమి చేస్తుందో తెలియట్లేదు. యుధ్ధ సన్నాహాల్లో మిగతా వాటికైతే ఖర్చవుతుంది. మనం అంతఖర్చును భరించలేకున్నాం. మరి ఇంటెలిజెన్స్ అన్నది ఆసాకుతో తోసెయ్యలేం కదా. మరి దాన్ని ఎందుకు పూర్తిస్థాయిలో వాడుకోలేదు?

సెప్టెంబరు మొదటివారంలో కూడా నాయకులంతా నిమ్మకు నీరెత్తినట్టుగానే వ్యవహరించారు. నెహ్రూ లండన్లో జరుగుతున్న కామన్వెల్త్ దేశాల సదస్సులో పాల్గొనేందుకు వెళ్ళాడు. ఆయన అక్కడ్నుంచి నైజీరియాకు వెళ్తాడు. కృష్ణమీనన్ ఐరాస సర్వసభ్య సమావేశంలో తన పలుకుబడిని పెంచుకునేందుకు పరిగెత్తాడు. అప్పట్లో ఈయన అనధికార ఉపప్రధానిగా వ్యవహరిస్తున్నాడు. ఆర్థిక మంత్రి మొరార్జీ దేశాయ్ కూడా ప్రధానితో బాటు లండన్లో ఉన్నాడు. ఆయన అక్కడ్నుంచి వాషింగ్టన్ వెళ్ళి ప్రపంచబ్యాంకు సమావేశంలో పాల్గొంటాడు.  మరొకవైపు సైన్యంలో చూస్తే- జనరల్ కౌల్ సెలవు పెట్టి కాశ్మీరులో విశ్రాంతి తీసుకుంటున్నాడు. "సరిహద్దులో యుద్ధం ఏక్షణానైనా రావచ్చు." అని ప్రకటన ఐతే ఇచ్చాడుగానీ దానికి తగ్గట్టుగా వ్యవహరించలేదు. ఈయన అక్టోబరులో పరిస్థితులు పూర్తిగా చెయ్యిదాటిపోయే వరకు డిల్లీకి రాలేదు. సైన్యంలో కొంతమంది అధికారులు శిక్షణనిమిత్తం వాళ్ళవాళ్ళ దళాలకు దూరంగా ఉన్నారు. ఇంకొంతమంది ఆటలపోటీలకు వెళ్ళారు.దాల్వీ సెలవుమీద బయటకు వెళ్తున్నాడు. పైనుంచి ఇథమిత్ధ్దంగా ఆదేశాలు ఏవీ లేకపోవడంతో అందరూ కులాసాగా ఉన్నారు. యుధ్దం వచ్చే అవకాశాలు ఉన్నాయని ఏమాత్రం అనుమానం కలిగినా సైన్యంలో కిందనుంచి పైదాకా ఇంత బేజారుగా ఉండేవాళ్ళు కాదేమో. మొత్తానికి సరిహద్దులో పరిస్థితి తుఫాను ముందు ప్రశాంతతగా చెప్పుకోవచ్చు.

4 comments:

  1. ఈ విషయాల గురించి క్లుప్తంగా మాత్రమే తెలుసు . పూర్తి అవగాహన వచ్చేలా వ్రాస్తున్నారు. చాలా సంతోషం. ఎలాగూ యువతరానికి పాఠ్యాంశాల్లో కానీ, ప్రసారమాధ్యమల్లో కానీ ఈ విషయాలు, వీటి ప్రాధాన్యత తెలిసే అవకాశం లేదు. దేశ రక్షణ మీద కొంచెం కూడా బాధ్యత లేకుండా తయారవుతున్నాము.(ఎంతో బాధ్యత గలిగి స్వతంత్రం కోసం పోరాడి పేరు గడించినవాళ్ళే ఇలా గుడ్డిగా వ్యవహరిస్తే, మరి దేశం మీద ప్రేమ, దేశం పట్ల బాధ్యత, దేశము దాని పరిసరాలపట్ల సరైన అవగాహన ఉండే అవకాశం లేని ముందుతరంలో దేశం పరిస్థితేమిటో?)
    కనీసం ఇలా బ్లాగ్ ప్రపంచానికైనా సేకరించి తెలుపుతున్నందుకు ధన్యవాదాలు.

    ReplyDelete
  2. సుబ్రహ్మణ్య చైతన్య గారూ,

    మంచి సమాచారాన్ని పోగుచేసి, క్రోడీకరించి మంచి కవనంలో అందచేస్తున్నందుకు ధన్యవాదాలు. మీరు ఈ విషయంలో వ్రాస్తునది అంతా కలిపి ఒక ధారావాహికగా ఏదన్నా పత్రికలో వస్తే ఎంతయినా బాగుంటుంది. చైనా మాయలో మళ్ళి పడి కొట్టుకుపోతున్న లక్షలాది ప్రజలు కొద్దో గొప్పో తెలుసుకుని మసులుకునే అవకాశం ఉన్నది. కాని ఇటువంటి వ్యాసాలు ప్రచురించగల పత్రిక మనకు ఉన్నదా! దాదాపు అన్ని పత్రికలూ మార్క్సిస్ట్ భావ జాలంతో నిండిన వాళ్ళతోనే ఉన్నది. వాళ్ళ యజమానులు, ఈ భావ జాలాలను తమ పత్రికలను ఎక్కువగా అమ్ముడుపోవటానికి వ్రాయటానికి వాడుకుంటూ ఉన్నారు. Freedom of Press JayahO. When we will get freedom of the Reader!!

    ఇంత చేసిన చైనాను మళ్ళి నమ్మి మనం వ్యాపార సంబంధాల పేరిట వాళ్ళను ఇక్కడకు రానిస్తున్నాం. ఈసారి వాళ్ళ అసలు ఉద్దేశ్యాలు ఏమిటో మరి!! ఇదిలా ఉంటె, ఈ చైనా వాళ్ళకు రక్షణ కాంట్రాక్టుల్లో కూడా భాగం పంచుకోనివ్వటం లేదూ అని.మన దేశీ "ఎర్రోళ్ళు" ఊహూ గునుస్తున్నారు. ఎంతటి దేశ భక్తి వీళ్ళది! వీళ్ళకి దేశం కంటె పార్టీ ముఖ్యం. చైన మన శతృ దేశం అని ఒప్పుకోలేని గుడ్డివాళ్ళు/చెవిటి వాళ్ళు (Blind and Deaf by choice brainwashed by their obsession with highly unrealistic and anti human "isms") ఇప్పటికీ లక్షల సంఖ్యలో మన దేశంలో ఉన్నారు. అప్పటి ప్రధాని కూడా అదే పధ్ధతిన దేశ రక్షణ కంటె తన వ్యక్తిగత కీర్తీ, పార్టి గురించి మాత్రమే ఆలోచించటం వల్ల కదా దేశం అంతటి అయోమయ పరిస్థితిని ఎదుర్కొని,ఇప్పటికీ ఆ గందరగోళ స్థితి నుంచి బయటపడలేక ఏది మన, ఏది పరాయి తెలియక కొట్టుకుంటున్నది. ఇవ్వాళ్టికి కొద్దిగా సవ్యంగా ఆలోచించగలవాళ్ళు పై పొజిషన్లలో ఉండి చెయ్యగలిగిన మంచి పనులు చేస్తున్నారు. కాని ఇప్పటికీ మొత్తం మొత్తం దేశ మెషినరీలో ఎంతటి అలక్ష్యం పేరుకుని పోయి ఉన్నది.

    పెరల్ హార్బర్ మీద జపాన్ ఒక్క దాడి చేస్తే, ఆ దేశాన్ని నామరూపాలు లేకుండా చేసింది అమెరికా. చుట్టూ ఉన్న శతృవులున్నా, నిలబడి ఎలా లొంగతీసుకుని వాళ్ళను నియంత్రిస్తూ బతకాలో చూపిస్తున్నది ఇజ్రాయల్. మనం! ఏ దేశమైనా సరే ఎలా ఉండకూడదో సోదాహరణ పూర్వకంగా చూపించటానికి శతాబ్దాల తరువాత అప్పటి వాళ్ళు పాఠాలు చెప్పుకోవటానికి సరిపొయ్యే విధంగా ప్రవర్తిస్తూ, పైగా అదేదో గొప్ప అనుకుంటున్నాము.

    ReplyDelete
  3. @ లక్ష్మీదేవి: దన్యవాదాలండి.

    @శివరామప్రసాదు: నేను రాసింది పూర్తి అనువాదం కూడా కాదండి. ఒకట్రెండు చాప్టర్ల్ చదివాక, క్రోడీకరించి రాశాను. పత్రికల్లో రాయాలంటే ఒక వ్యక్తి అతనివైపు నుంచి అఅలోచిస్తూ రాసిన దాన్ని తీసుకుని అందరిపైనా రుద్దడం భావ్యం కాదు. అతను రాసినవి నిజాలే అయినా, ఇలాంటివి రాసేటప్పుడు సమాచారం మరింత సమగ్రంగా ఉండాలి. ఒక పుస్తకం సరిపోదు. ఏదో బ్లాగులో రాసుకునేందుకైతే పర్లేదుగానీ పత్రికల్లో రాయాలంటే రాసేవాళ్ళు పబ్లిషర్ల పర్మిషన్ తీసుకోవాలి.

    ఏదైనా పత్రికలవాళ్ళొ, వార్తాచానెలో దీనిమీద ప్రోగ్రాం పెడతారనుకున్నా. ఏదో తూతూమంత్రంగా జరిపారు. కొద్దిగా బాధేసింది

    ReplyDelete
  4. "...నేను రాసింది పూర్తి అనువాదం కూడా కాదండి..."
    I never said that you are merely translating. What I wanted was that the entire writing may be published in a News Paper or Weekly which would have wider exposure so that thousands would read and realise the tru face ofour enemy who is again acting as a friend and these thousands are accepting it.

    You are right no news paper worth its weight will publish this kind of realistic articles. What they need is cat on the wall articles which will just sooth every damn fellow, who are living in their individual paradises.

    ReplyDelete