మేరునగ తప్పిదం- 13.తేనెతుట్టె కదిలింది


అక్టోబరు 4న జనరల్ కౌల్ తేజ్పూర్ చేరుకున్నాడు. ఆయనకున్న పలుకుబడి దృష్ట్యా ఉన్నతాధికారులు సైతం ఎదురెళ్ళి స్వాగతం పలికారు. ఇది సైనిక నియమావళి ప్రకారమైతే శిక్షార్హం. కానీ అక్కడ జరుగుతున్నది రాజకీయ కార్యకలాపాలేగానీ సైనికచర్యలు కాదు కదా! అప్పటికి అక్కడి సన్నాహాలు ఏమాత్రం సరిపోయేలా లేవు. జనరల్ ఉమ్రావు వైఖరితో ఆయన పై అధికారి జనరల్ సేన్ పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా తయారయ్యింది. అప్పటికే అనేకసార్లు దాడిచెయ్యడానికి గడువును పొడిగించుకుంటూ వెళ్ళటం ప్రభుత్వాన్ని అసహనానికి గురిచేస్తోంది. ఇటువైపు హిమాలయాలే అనుకుంటే అంతకు మించి సమస్యలు. ఇప్పుడు జనరల్ కౌల్ రావటంతో ఆయనమీదున్న బరువంతా దిగిపోయింది. ఇక ఆతలనొప్పులేవో కౌలే చూసుకుంటాడు.

కౌల్ 7Infantry Brigadeను వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నాడు. అంటే ఇప్పుడు అందులో ఒక జనరల్, ఇద్దరు లెఫ్టినెంట్ జనరళ్ళు, ఒక మేజర జనరల్, మరియు ఒక బ్రిగేడియర్ ఉన్నారు! కానీ దళంలో సైన్యం, వాటికి వనరులు మాత్రం లేవు. పిరమిడ్ తిరగబడింది. ఉన్నతస్థాయిలో వ్యూహరచన చెయ్యాల్సినవాళ్ళు గుంపుగా యుద్దరంగంలో తిరుగుతుంటే గందరగోళం మరీ ఎక్కువైంది. అధికార క్రమాన్ని విడిచిపెట్టిమరీ కిందున్న సైనికుణ్ణి అదిలించి, గదమాయించి, బెదిరించి మొత్తానికి ఏదో నెట్టుకొస్తున్నారు.

ఇదిలా ఉండగా జనరల్ కౌల్ సన్నాహాల మీద అసంతృప్తి వ్యక్తం చేస్తూ, "దళాలు బద్దకంగా పనిచేస్తున్నాయి. అసలు ఇలాంటి ప్రాంతాన్ని దాడికి ఎందుకు ఎంచున్నారు? ఇదసలు అనుకూలంకాదు. దాడి సంగతి పక్కన పెడితే కనీసం ఆత్మరక్షణకు సైతం ఇది పనికి రాదు." అని చెప్పుకొచ్చాడు. అదేమాట దళ కమాండర్ చెబుతున్నా వినిపించుకోకుండా ఫార్వార్డ్ పాలసీ పేరుతో అక్కడ పోస్టు పెట్టిందెవరు? బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ వాళ్ళని అడిగి పోర్టర్లను తెప్పిస్తానని మాట ఇచ్చాడు. ఆయన ఆసంస్థ యాజమాన్యంలో జీవితకాల సభ్యుడు.

సైనికచర్య ప్రారంభించే ముందు 580టన్నుల మందుగుండు సిద్ధంగా ఉంచాలని, నమ్కాచులోయలో కదలికలు కష్టమనీ, అలాగే పోర్టర్ల కొరత తీవ్రంగా ఉందనీ జాన్రల్ ఉమ్రావ్ తెలియజేశాడు. అయినా శత్రువుమీద దాడి చెయ్యాలంటే వారికన్నా ముందుండాలి కాబట్టి, మంచుకురిసే దానికి ముందే దాడి చెయ్యాలి కాబట్టి సైనికచర్యలకు అవసరమైన సన్నాహాలు శీఘ్రగతిన చేపట్టాలని జనరల్ కౌల్ ఆదేశించాడు. కానీ శత్రువుకన్నా వేగంగా ఉండడమంటే అతనికన్నా వేగంగా వనరులు సమకూర్చుకోవడమని ఆయనకు తెలియదా? ఇన్నాళ్ళూ సైనికచర్యలు ఎందుకు చేపట్తలేక పోయామో అర్థం కాలేదా? దీనిని బట్టి అర్థం అయ్యేదేమంటే ఆయన ఒక సుశిక్షితుడైన సైనికునిలాగాక రాజకీయ నాయకుల తొత్తుగా వ్యవహరిస్తున్నాడు. తన చర్యలు, ఆదేశాలన్నీ సైనికుల పరిమితులను దృష్టిలో ఉంచుకునిగాక రాజకీయ అవసరాలకు అనుగుణంగా అమలుచేస్తున్నాడు.

దాదాపు వారం తర్వాత జనరల్ ప్రసాద్ కలిశాడు. ఆయన్ని తాము సమర్పించిన నివేదిక గురించి వాకబు చేశాడు. బదులివ్వకుండా గుట్టుగా ఉండటంతో మళ్ళీ అడిగాడు. "ఇక్కడెవరికీ మనబాధలతో, మనప్రాణాలతో పనిలేదయ్యా. నీ నివేదిక చదివే ఓపిక అక్కడెవ్వరికీ లేదు. వాళ్ళు కేవలం చైనీయులను తరిమికొట్టడం గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. రాజకీయ కారణాల వల్ల సైనికచర్య వెంటనే చేపట్టమని ఒత్తిడి తెస్తున్నారు." అని ఆవేదనతో జవాబిచ్చాడు. అలాగే కౌల్ను ఇక్కడకు పంపేందుకు ముందు జరిగిన పరిణామాలన్నీ వివరించాడు. వెంటనే దాల్వీని నమ్కాచు ప్రాంతానికి బయలుదేరమన్నాడు. ఇంకా ఇక్కడె ఉన్నట్టు కౌల్కు తెలిస్తే ఆగ్రహానికి గురవ్వాల్సి వస్తుందని చెప్పాడు. ఇప్పటికే ఆలశ్యమైందనీ, ఇప్పటికిప్పుడు బయలుదేరినా రాత్రికి అక్కడకు చేరుకోలేనని దాల్వీ చెప్పాడు. దానికి ఆయన బదులిస్తూ "కావాలంటే దారిలో ఏదైనా గుడిసెలో నిద్రపో. అంతేగానీ ఇక్కడ మాత్రం ఉండకు." అని బతిమాలాడు. ఇక తప్పనిసరై బయల్దేరుతూ ఇదేవిషయాన్ని దళాలకు సమాచారమందిస్తే వాళ్ళు కలవరపడ్డారు.

అక్టోబర్ 5న జనరల్ కౌల్ అక్కడకు వచ్చాడు. నిజానికి 7న ఆయన ధోలాలో దాల్వీతో సమావేశం అవ్వాల్సి ఉంది. అంటే ముందు రెండురోజులు ఆయన క్షేత్రస్థాయిలో సమీక్షించి ఒకనిర్ణయానికి రావాల్సి ఉంది. కానీ ఇలాంటివేమీ చెయ్యకుండానే వచ్చీ రావడంతోనే కిందివాళ్ళను, పైవాళ్ళనూ బద్దకస్తులన్నట్టు మాట్లాడసాగాడు. అందరిమీద పూర్తి ఆధిక్యత ప్రదర్శించ సాగాడు. అప్పటికే చైనీయుల ఆధిక్యత ఆయనకు అర్థమైంది. పట్టుసాధించడం చాలాకశ్టం అన్న సంగతి తెలిసొచ్చింది. కానీ ఇంకా చైనీయులను తరిమికొట్టాలి అనే మాట్లాడుతున్నాడు.

మద్యాహ్నానికి లుంపు చేరుకున్నాడు. అక్కడున్న వాళ్ళందరినీ ఉన్నపళంగా ధోలాకు వెళ్ళమన్నాడు. వెళ్ళమని చెప్పి ఇంతకాలమైనా ఎందుకువెళ్ళలేదని వాళ్లమీద కసురుకున్నాడు. మిగతా ఉన్నతాధికారులను చులకన చేస్తూ తానొక్కడినే వీరునివలె యుద్ధరంగానికి వచ్చానని చెప్పుకున్నాడు. దళకమాండరుకు కనీస సమాచారం అందించకుండా వాళ్ళందరినీ అక్కడినుంచి సరిహద్దుకు పంపించాడు.  ఆసమయంలో వాళ్ళడిన వాటన్నింటికీ "ముందు మీరెళ్ళండి. అక్కడికి అన్నీ వస్తాయి." అని చెప్పాడు .తరువాత కొంతకాలానికి దాల్వీనే ఈకార్యక్రమానికి ఒప్పుకున్నట్టు గాలిపుకార్లు లేచాయి. అంతకాలం ఎవరూ చెయ్యలేని దాన్ని తాను చేసి చూపించి, దళాలని థాగ్లా శిఖరం వరకు అప్రతిహతంగా నడిపించి గొప్పయోధునిగా కీర్తినార్జించాలని ఆయన పగటికలలు కంటున్నాడు. రాజకీయాలు చేస్తూ వీరునిగా ఎలా గుతింపు పొందుతాడు? ఆసమయంలో అతివిశ్వాసం ఆయన మాటల్లోనూ, చేతల్లోనూ ప్రస్పుటంగా కనిపించసాగింది. ఆకైపులో హిమాలయాలు, చైనాబలము, వాతావరణం, వనరులలేమీ ఇవేవీ కళ్లకు కనిపించలేదు.

ఇటువైపు ఈపనులన్నీ సాగుతూ ఉండగా, సరిహద్దుకు అటువైపు చైనా ఒకడివిజన్ మొత్తాన్నీ రంగంలోకి దించింది. అంతకుముందే మెక్ మోహన్ రేఖను తాము గుర్తించట్లేదని చైనా ప్రకటించింది. అప్పటి వరకు ఆరేఖను గౌరవిస్తూ, అందులో కొన్నిప్రాంతాలపై మాత్రమే అభ్యంతరాలు వ్యక్తం చేసినవాళ్ళు ఇప్పుడు ఏకంగా ఆరేఖే సరిహద్దుకాదంటూ ప్రకటించారు. దాంతో ఇక జరగనున్నది చెదురుమదురు ఘర్షణకాదని దాదాపూ అందరికీ అర్థమయ్యింది.5న బయలుదేరిన దాల్వీ 6కు కర్పోలా1 దగ్గరికి చేరుకున్నాడు. భుజాన 80పౌండ్ల బరువును ఉంచుకుని 16000అడుగుల ఎత్తులో బృందాలు ప్రయాణించాల్సి వచ్చింది. అక్కడ రేడియోలో వార్తలు వింటుంటే అంతకాలం కుదరదన్న ఆల్టిట్యూడ్ అలవెన్సును ఇవ్వడానికి ప్రభుత్వం ఆమోదించింది. కాకపోతే అదివిన్నావాళ్ళలో సింహభాగం అదిఅందేదాకా జీవించిలేరు. అక్కడి నుంచి 14500అడుగుల ఎత్తులోనున్న త్సాంగధరుకు చేరుకునే సరికే సాయంత్రం అయ్యింది. అప్పటికే డస్సిపోయి ఉన్నవాళ్ళు మిగతాదళాలను అక్కడినుంచి నమ్కాచుకు పంపారని తెలిసి దాల్వీతో సహా అందరూ తెల్లమొహం వేశారు.
అక్కడినుంచి కౌల్ను కలవడానికి ధోలాపోస్టుకు బయలుదేరారు.అక్కడున్న పంజాబీలను చూసి కౌల్ వారిని మెచ్చుకున్నాడు. మిగతావారిని పరిచయం చేసుకుంటూ చైనీయులను తరిమికొట్టడానికి ప్రభుత్వం తనను పంపిందని చెప్పుకున్నాడు. ఆప్రాంతపు భౌగోళిక అంశాలను చూసుకున్నాక తూర్పుకమాండరుకు కొన్నిసందేశాలను పంపాడు. అందులో మిగతావారిలాగానే పరిమితులను తెలియపర్చాడు.

అక్టోబర్ 8న థాగ్లావద్ద మోహరించి ఉన్న చైనా బలగాలను చూశారు. మద్యలో ఉన్న ఖాళీప్రాంతాలు, వాటికి వెళ్ళేందుకు దారులూ వాకబు చేశాడు. అలానే కొన్ని యుద్ధగాధలు చెప్పి ఉత్సాహపరచడానికి ప్రయత్నించాడు. రోజూ రాత్రిళ్లు ఆయన ప్రధానికి కొన్నిసందేశాలు పంపేవాడు. అవి డిల్లీకి చేరేందుకు మూడురోజులు పట్టేది. అదీ మన సమాచారవ్యవస్థ. ఆయన నివేదికలో చైనీయులను పూర్తిగా తరిమికొట్టడం అసాధ్యమని తేల్చేశాడు. అయితే అప్పటికే అనేకసార్లు గడువు పొడిగించారు కాబట్టి ఎట్టిపరిస్థితుల్లోనూ అక్టోబరు 10కల్లా దాడి జరగాల్సిందే అని నిశ్చయించుకున్నాడు.

అయితే అప్పటికే చైనాబలాలు భారీగా మోహరించుకుని ఉండటంతో నేరుగా దాడిచెయ్యకుండా థాగ్లాకు పశ్చిమాన ఉన్న యుంత్సోలా ప్రాంతానికి వెళ్ళి, చైనీయులను వెనకనుంచి కొడదామని పథకం వేశాడు. వెంటనే 2రాజపుత్రులను అక్కడికి వెళ్ళాల్సిందిగా ఆదేశించాడు. ఇది తప్పిదాల్లోకెల్లా ఘోరమైన, ఎవరెస్ట్ అంత పెద్దతప్పిదం. రాజపుత్రులు అప్పటికి ఇంకా అలసిపోయి ఉన్నారు. వాళ్ళు నడిచిన దారంతా చైనీయుల నిఘా ఉన్నది. ఇప్పుడు కౌల్ వెళ్లమంటున్నది ఎంతో సున్నితమైనదేకాక, చైనీయుల వశంలో ఉంది. అంతేగాక దళంవెళ్ళే దారిమొత్తం చైనీయుల నిఘాలో ఉంది. ఈఆదేశాలు వినడంతోనే ఒక్కొక్కరు బిత్తరపోయారు. తిరిగి కలుస్తామన్న ఆశ ఒక్కరికీ లేదు. అక్కడకు పంపేముందు కల్పించాల్సిన కనీస అవసరాల గురించి అడిగితే- ఛలికి ప్రత్యేకదుస్తులు 6000 కెనడానుంచి వస్తున్నాయి! ఆశయసిద్ధి కోసం పనిచేసే సైన్యం యుద్ధసామగ్రికోసం ఎదురు చూడదు! అయినా కొన్ని తుపాకులు తెప్పిస్తాను. పోర్టర్లు దారిలో ఉన్నారు. వీలైనంత త్వరగా వచ్చేస్తారు! అన్నాడు. అన్నీ మరెప్పుడొ వస్తాయి. కానీ దళంమాత్రం ఇప్పుడే బలైపోవాలి! ఇక చేసేదిలేక కనీసం ఒకసారి గస్తీ తిరిగి అక్కడీ పరిస్థితి చూసొస్తాం. అప్పటిదాకా ఆగండి. అని ఒప్పించి ఒకబృందాన్ని అందుకు పంపారు. అందరికీ బుర్ర తిరిగిపోతోంది. ఏమి జరుగుతుందో అర్థంకాని పరిస్థితి.

అక్టోబరు 9 సాయంత్రం 9పంజాబ్ గస్తీకి వెళ్ళారు. తెల్లవారుఝామున హఠాత్తుగా ఒకచైనాదళం ఎదురవడంతో కాల్పులు మొదలయ్యాయి. పంజాబీలు సుమారు 50మంది ఉన్నారు. చైనీయులు 800 మంది. చైనీయులు తేరుకునేలోపే మనవాళ్ళు దెబ్బతీయడంతో మొదట మనవారిదే పైచేయి అయింది. కానీ బలగం ఎక్కువవటంతో వెంటనే తేరుకుని మోర్టార్లతో దాడిచెయ్యగలిగారు. మనవాళ్ళు 6మంది చనిపోగా, 11మంది గాయపడ్డారు. అందులో మేజర్ చౌధరీకూడా ఉన్నాడు. చైనీయులు 100మంది చనిపోయారు. చైనీయుల ఎదురుదాడిని చూసి నోరెళ్ళబెట్టిన జనరల్ కౌల్ "Oh My GOD” అంటూ పొలికేక పెట్టి, "వాళ్ళు మోసం చేస్తున్నారు. ఇది తొండి."  అంటూ చిందులెయ్యసాగాడు. వెంటనే దాల్వీ వైపు తిరిగి "ఇది నీదళం. నీయుద్దం. కాబట్టి నువ్వే పోరాడాలి." అన్నాడు! ఒకసారి ఎదురుదెబ్బ తగిలితేకానీ ఎవరేమిటో అర్థం కాలేదు ఆయనకి.

అదృష్టంకొద్దీ నేరుగా రాజపుత్రులను పంపకుండా ఒకబృందాన్ని గస్తీకి పంపాం. అలాకాకుండా మెత్తం దళాన్నే పంపుంటే ఎంత నష్టం జరిగుండేదో? అక్కడికి వెళ్ళడానికి మరొక 5000అడుగులు ఎక్కాలి. వారి దగ్గర 100రౌండ్లకు సరిపడా సామాగ్రి మాత్రమే ఉంది. మొత్తందారి చైనీయుల కళ్ళముందే ఉంటుంది. వాళ్ళు వీరికన్నా ఎత్తులో ఉంటారు. కాబట్టి చాలాసులువుగా హతమార్చగలరు. ఒకవేళ దాడి చెయ్యకపోయినా, దళం అటువైపుకి చేరుకున్నాక వాళ్ళమర్గాన్ని మూసేస్తే ఆకలితో చచ్చిపోతారు. లేదంటే మరోవారంలో పడే మంచు ఆపని పూర్తిచేస్తుంది. ఆలోచించేందుకే భయమేస్తున్న ఈవ్యూహాన్ని జనరల్ కౌల్ గారు తనమేధాశక్తినంతా ఉపయోగించి రచించాడు. ఆరోజు చైనీయుల దాడిలో చనిపోయినవాళ్ళందరినీ జనరల్ కౌల్ హత్యచేసినట్టే పరిగణించాలి.

వెంటనే దాల్వీ ఉన్నపళంగా ఆప్రాంతాన్ని ఖాళీచేసి వెళ్ళిపోవాలని కౌల్, ప్రసాద్లకు చెప్పాడు. దానికి ఇద్దరూ అంగీకరించాడు. అన్ని ప్రాణాలు గాలిలో కలిసిపోతేగానీ ఆయనకు నిజం తెలియలేదు. తదనంతరం తీసుకోవాల్సిన చర్యలకు ప్రధానిని కలిసిగానీ ఏవిషయం చెప్పలేనని తేల్చేశాడు. దళాన్ని అంతటి విపత్కర పరిస్థితుల్లో వదిలేసి డిల్లీకి బయల్దేరాడు. వెళ్తూ వెళ్తూ- తాను తిరిగివచ్చేవరకూ శత్రువును తరిమికొట్టే విషయాన్ని పక్కన పెట్టాలని, బ్రిడ్జిలను రక్షించుకోవాల్ని, లుంపు మార్గాన్ని,హథూంగ్లాలను కాపాడాలని ఆదేశించాడు. ఇప్పుడున్న స్థానాలని యథావిథిగా కొనసాగించాలని కూడా అదేశించాడు.

మరొకవైపు యుద్ధరంగంలో పంజాబీలు వీరోచితంగా పోరాడుతున్నారు. చైనీయుల ఆధిక్యతను సవాలు చేస్తున్నారు. వారికి సహాయాన్ని అందించడానికి చౌదరి, మిశ్రాలు దాల్వీని ఆదేశించమన్నారు. కానీ ఇక్కడ పరిస్థితి మరింత సున్నితంగా ఉంది. మనవద్ద ఉన్న ఆయుధాలు అంతదూరం బాంబులు విసరలేవు. అనవసరంగా వాటిని ఉపయోగించడం వల్ల మొత్తం చైనాబలగాలు వీరిమీదకి వచ్చే అవకాశం ఉంది. అప్పుడు ఒక్కరూ మిగలరు. ఈవిపత్కర పరిస్థితుల్లో దాల్వీ పంజాబీ వీరులు ఒక్కొక్కరూ నేలకొరుగుతుంటే చూస్తూ ఊరుకోవాల్సి వచ్చింది. అప్పటికే చైనీయులు మరొక్క అవకాశం వస్తే మొత్తందళాన్ని చీల్చిచెండాడేలా ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి అవకాశం ఇవ్వడం సబబు కాదు.

నిజానికి ఇక్కడ జరిగింది యుద్ధంకాదు. మన గస్తీమీదకి చైనీయులు దాడి చేశారు. అదీ మన భూభాగంలో. కానీ మన నాయకులు ప్రగల్భాలు పలుకుతూ ఇచ్చిన తప్పుడు ప్రకటనలలో డొల్లతనాన్ని ఉపయోగించుకుని చైనీయులు మనమే వాళ్ల భూభాగంలోకి చొచ్చుకు వెళ్ళినట్టు, వారిపై దాడి చేసినట్టు, ఆత్మరక్షణలోనే చైనీయులు ప్రతిదాడి జరిపినట్టు ప్రపంచాన్ని నమ్మించారు. అది ఉద్దేశ్యపూర్వకంగా జరిగినదాడి కాదు.

రాజకీయ అవసరాల దృష్ట్యా తీసుకున్న నిర్ణయాలను బలవంతంగా సైన్యంమీద రుద్ది, వారిచేత తమ అవసరాలకు అనుగుణంగా చర్యలు చేపట్టించినందుకు ఫలితం- దేశంపరువు పోయింది. సైనికుడు అకారణంగా ప్రాణం కోల్పోయాడు. రాజకీయావసరాలే పరమావధిగా పనిచేసిన ఒక సైనికాధికారి స్వార్థం వీటన్నింటికీ కారణమయ్యీందా? లేక ఆయన్ని పంపకూడని చోటుకి పంపిన నాయకుల నిర్లక్ష్యం వీటన్నిటినీ నడిపిందా? కారణ మేదైతేనేం తేనెతుట్టె కదిలింది.

2 comments:

  1. "ఇది నీదళం. నీయుద్దం. కాబట్టి నువ్వే పోరాడాలి." - sounds so filmy isnt it!

    as said earlier, very good narration.

    ReplyDelete