హఠాత్తుగా జనరల్ కౌల్ అస్వస్థతకు గురవ్వడం భారత శిబిరాలను ఆందోళనకు గురిచేసింది. చొరవ తీసుకుని ఆదేశాలు ఇవ్వగల వ్యక్తి ఎవరూ సైన్యానికి లేరు. జరుగుతున్నది సాంప్రదాయక యుద్ధమైతే అతని స్థానంలో జనరల్ ప్రసాద్ బాద్యతలు తీసుకోవాలి. యుద్ధభూమిలో నాయకుడు మరణించడం, లేదా తీవ్రంగా గాయపడి సార్ధ్యం వహించలేక పోవడం, నాయకునికి మిగిలిన బృందాలకు సంబంధాలు తెగిపోవడం అన్నది చరిత్రలో ఎన్నోసార్లు జరిగింది. ఆపద్ధర్మ నాయకునిగా ఎవరుండాలి అన్నది సైన్యం యుద్ధానికి ముందే చర్చించాలి. అధికార రహస్యాలు, యుద్ధవ్యూహాల పట్ల అతనికి పూర్తి అవగాహన ఉండాలి. యుద్దం అంటే ఏమైనా జరగొచ్చు. కానీ ఇక్కడ అలాంటి ఏర్పాట్లేవీ లేవు. నిజానికి రాజకీయ నాయకులు, సైన్యంలోని వారి అనుయూయులు తప్ప మరెవరూ సరిహద్దు వ్యవహారాల పట్ల ఆసక్తితో లేరు. ఇక వీళ్ళేమో అసలు యుద్దమే రాదన్న ఆలోచనలతో వ్యూహాలు పన్నుతున్నారు. ఈపరిస్థితిల్లో చైనా అనుకోని దెబ్బ తీసింది. సరిగ్గా ఆతర్వాతే జనరల్ కౌల్ అనారోగ్యానికి గురవ్వటం అనేక విమర్శలకు తావిచ్చింది. ప్రతిపక్షాలకు, పత్రికలకు, విమర్శకులకు, మేధావి వర్గానికి, రక్షణరంగ నిపుణూలకు, అంతర్జాతీయ వ్యవహారాల పరిశీలకులకు, అన్నిటికన్నా మిన్నగా నెహ్రూ ప్రత్యర్థులకు ఇదొక ఆయుధమైంది. దురదృష్తవశాత్తూ వీరికెవరికీ వాళ్ళ చేష్టలు సైన్యం నైతికస్థైర్యాన్ని, ప్రజల స్వాభిమానాన్ని ఎంతగా ప్రభావితం చేస్తాయో స్పురించట్లేదు. ఒకవేళ స్పురించినా వారివారి అవసరాలు ఈవిషయాలను వెనక్కి నెట్టేశాయి.
ఇక్కడ వ్యవహారాలు కేవలం సైనిక చర్యలకే పరిమితం కాకుండా రాజకీయ అవసరాలు తోడవ్వడంతో ఎవరూ ఈ బాద్యతను భుజానికి వేసుకోను ముందుకురాలేదనే చెప్పాలి. ఓడిపోతున్న గుర్రం మీద ఎవరు పందెం కాస్తారు? ఈపరిస్థితుల్లో అనవసర వివాదాల్లో ఇరుక్కుంటామని అందరూ గుట్టుగా ఉండిపోయారు. ఈపరిస్థితుల్లో అక్టోబరు 19న, రాజపుత్రుల దళం నాయకుడు లెఫ్టినెంట్ కల్నల్ రిఖ్ దాల్వీని కలిశాడు. చైనీయుల బలం, వాటి కదలికలను విపులంగా చర్చించాడు. తన ప్రాంతంలో గస్తీని పెంచినట్టు తెలియజేశాడు. చివరగా " సార్! మీరు దిగులు పడొద్దు. వారి బలం ఎంతున్నా సరే, రాజపుత్రులం సరిహద్దులో ఉన్నంత సేపూ దేశాన్ని తలదించుకోనివ్వం. మా తుదిశ్వాస విడిచే వరకూ శత్రువుకు ఈభూమిమీద నిలబడే అవకాశం ఇవ్వం. ఒకవేళ మీరు వెనక్కి వెళితే, మనల్ని ఇలా మద్యలో వదిలేసి, దేశం పరువుతో రాజకీయాలు చేస్తున్న వారిని విడిచిపెట్టనని మాటివ్వండి చాలు." అని వెళ్ళిపోయాడు. ఇంకొందరు వచ్చి, "అందరూ తలోదారి చూసుకుని వెళ్ళిపోతుంటే ఇక్కడున్న అధికారులకు మాత్రం ఏందుకు ఈతలనెప్పులన్నీ? మీరు రాజీనామా ఇచ్చేసి వెళ్ళిపోండి." అని తమ అధికారులకు సలహా ఇచ్చారు. కానీ ఈ పరిస్థితుల్లో సహచరులను వదిలి ఎలా వెళ్ళగలమని అందరూ పోరాడడానికే నిశ్చయించుకున్నారు.
ఇక సరిహద్దులో బలగాల పరిస్థితి చూస్తే, 12మైళ్ల దూరంలో సన్నగా విస్తరించి ఉంది. ఈ చివరి నుంచి ఆ చివరకు వెళ్ళడానికి కనీసం 5రోజులు పడుతుంది. అందరికీ కలిపి 2 పారాఫీల్డ్ తుపాకులు, 4 మోర్టార్లు, అరకొర మందుగుండు. ఆత్మరక్షణకు కనీసం కంచెకూడా లేదు! ఇక బంకర్ల సంగతి సరేసరి. యుద్ధశాస్త్రంలోని ప్రాధమిక నియమాలను పాటిస్తూ ఒక్క సదుపాయంగానీ, ఒక్క వ్యూహంగానీ, ఒక్క ఆదేశంగానీ లేదు. కౌల్ రాకతో గందరగోళానికి గురైన అధికార క్రమం తాజా పరిణామాలతో పూర్తిగా కుప్పకూలింది.
1962 అక్టోబరు 20 తెల్లవారుఝామున 5గంటలకు, మూడవ బ్రిడ్జి వద్ద ఉన్న చైనీయులు ఉన్నపళంగా భారతదళాలపై దాడి చేశాయి. కొన్ని అడుగుల దూరంలోనే ఇరుపక్షాల దాడి-ప్రతిదాడులతో హిమాలయాలు ఉలిక్కిపడ్దాయి. భారతదేశ విదేశీ, రక్షణ, ఆర్థిక వ్యవహారాల డొల్లతనానికి సాక్షులుగా నిలిచాయి. ఆ సమయంలో భారత సైన్యంలో మొత్తం 4లక్షల మంది పనిచేస్తున్నారు. కానీ శత్రువుతో పోరాడడానికి 600మంది మాత్రమే ఉన్నారు. వీరికి అతి దగ్గరలో ఉన్నదళం 1000మైళ్ళ దూరంలో ఉంది.
చైనా దళాలు వ్యూహాత్మకంగా ముందుకువెళుతూ మొత్తం ప్రాంతాన్ని కబళించసాగాయి. కానీ అందరికన్నా ముందుగా ఉండే పంజాబీదళంపై దాడి చెయ్యలేదు. వారిని దాటుకుంటూ ముందుకెళ్ళసాగాయి. లుంపు వైపుగా శత్రువు కదలుతున్నారు. ఇక మిగిలింది మూడు బృందాల రాజపుత్రులు, ఒక గూర్ఖా బృందం. ఎవరి దగ్గరా సరిపడినంత బలం లేదు. రెండవ ప్రపంచ యుద్ధంలో తమవీరత్వంతో ప్రపంచాన్ని మైమరపించిన ఈరెండు దళాల భవిష్యత్తు ఈరోజు ఒకబలమైన శత్రువు చేతిలో ఇరుక్కుంది. ఈసమయంలో జనరల్ ప్రసాద్ ఫోన్ చేసి హీనపక్షం ఒక బృందాన్నైనా సాంగ్లేకు పంపమని, ఇది పైవాళ్ల ఆదేశమని చెప్పాడు. సైన్యాని ఏమి చెయ్యాలో పాలుపోలేదు. ఒకవేళ ఈఆదేశాలను పాటిస్తే వాళ్ళు అక్కడికి వెళ్ళెముందే శత్రువు చేతిలొ హతమవ్వడం ఖాయం.
చైనీయులు ముందుగా రాజపుత్రులు గూర్ఖాలను వేరు చేస్తూ ఒకదళాన్ని వారిరువురి మద్యనా పంపారు. మిగిలిన రెండు దళాలను ఒక్కొక్కరి మీదకు పంపారు. ఇంతటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా వీరిరువురూ శత్రువును మూడుగంటల పాటు నిలువరించారు. సిగ్నల్ బంకర్ మీద దాడిచెయ్యడంతో అందులోని వారంతా మరణించారు. నాలుగవ బ్రిడ్జి దగ్గరున్న బృందం రెండుదాడులను సమర్థవంతంగా తిప్పికొట్టగా, చైనాదళాలన్నీ కలిసి సునామీలాగా విరుచుకుపడటంతో తుడిచిపెట్టుకుపోయింది. ఒక్క పోస్టు ఎన్నివేలమందినని నిలువరించగలదు? జెమదర్ బిశ్వాస్ సారధ్యంలోని బెంగాలీదళం, మేజర్ గురుదయాళ్ సింగ్ సారథ్యంలోని పదాతిదళం దాడులతో ఉక్కిరిబిక్కిరి అయ్యాయి. వీరులందరూ నేలకొరగ సాగారు. చివరకు మిగిలిన రిఖ్ ను లొంగిపొమ్మని కోరగా, అతను ఒప్పుకోలేదు. ఆయనతోపాటుగా కెప్టన్ భాటియా, భూప్ సింగ్, ఇతర సహాయకులు బంకర్లలోనే ఉండిపోయారు. చైనీయులు తమ మెచీన్ గన్లతొ బంకర్లపై గుండ్లవర్షం కురిపించారు. దాంతో భాటియా అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రగాయాలతో బతికిన కొందరు బందీలయ్యారు. భాటియా సామర్థ్యాన్ని గుర్తించిన సైన్యం అతన్ని పూణేలోని శిక్షణాకేంద్రానికి బదిలీచేసింది. 20న తనబృందానికి వీడ్కోలు చెప్పి బయల్దేరాల్సిన వ్య్కతి ఈలోకానికే వీడ్కోలు చెప్పాడు.
ఈసంఘటన సైనికులను తీవ్ర ఉద్వేగానికి గురిచేసింది. తుదిశ్వాస విడిచే వరకూ తలవంచకూడదని నిశ్చయించుకున్నారు. మరోవైపు సుబేదార్ దశరథ్ సింగ్ బృందం అప్పటికే మూడుసార్లు దాడులను ఎదొర్కొన్నది. చివరికి ఏడుగురే మిగిలారు. వారివద్ద సామాగ్రి నిండుకుంది. అయినా తలొంచని రాజపుత్రులు బాకులతో ద్వంద్వయుద్దానికి దిగారు. ఈపోరాటంలో నలుగురు మరణించగా, మిగిలిన ముగ్గురూ బందీలయ్యారు. జెమదర్ బోస్ సారధ్యంలోని బెంగాలీలు మూడుదాడుల తర్వాత 10మంది మిగిలారు. అయినా పోరాడి అమరులయ్యారు.
మేజర్ బీ.కే.పంత్ సారథ్యంలోని రాజపుత్రుల బృందం అసాధ్యమని తెలిసినా శత్రువును నిలువరించేందుకు ప్రాణాలను పణంగా పెట్టడానికి వెనుకాడలేదు. సహచరులను ఉద్దేశించి "రాజపుత్రదళం చరిత్రలో ఈరోజు మనమొక నూతన అధ్యాయాన్ని లిఖించబోతున్నాం. రాజపుత్రులను సాహసానికి, వీరత్వానికి చిరునామాగా ఎందుకు పేర్కొంతారో శత్రువుకు తెలియజేద్దాం." అంటూ కాలికి తగిలిన గాయాన్ని కూడా లెక్కచెయ్యకుండా కదనరంగంలోకి ఉరికాడు. మొదటి మూడు దాడులని ఎదుర్కొనేసరికే చాలామంది గాయపడ్డారు. నాలుగవ దాడికి ఆయన పొట్టకి, రెండుకాళ్ళకి తీవ్రగాయాలయ్యాయి. అయినా లెక్కచేయకుండా వీరులభూమిలో మృత్యువుకు చోటులేదంటూ నినదించసాగాడు. "రాజపుత్రులు ఈదేశంకోసం చావడానికే పుడతారు. దేవుడు ఈరోజు ఈప్రాంతాన్ని మీకు నిర్నయించాడు. దీనికోసం పోరాడండి." అంటూ గర్జిస్తున్న ఈయన్ని చూసిన చైనీయులు ముందుకెళ్ళడానికి ఈయనే ప్రధాన అవరోధం అని కనుగొన్నారు. వెంటనే తమ వనరులన్నింటినీ అక్కడికే మళ్ళించారు. ఒక మెచీన్ గన్ పంత్ శరీరాన్ని తూట్లుతూట్లు చేసింది. విపరీతమైన రక్తస్రావంతో అపస్మారక స్థితిలోకి వెళ్తూ, పిడికిలి పైకిత్తి "జై బజరంగ్ బలి" అంటూ నినాదంచేస్తూ తుదిశ్వాస విడిచాడు. వీరమరణం పొందిన ఆయన ఆత్మ స్వర్గానికన్నా వెయ్యిరెట్లు ఆనందాన్నిచ్చే భరతమాత ఒడిలోకి చేరింది. రాజపుత్రుల సాహసాలకు శత్రువు సైతం అచ్చెరువొందాడు. వారివల్ల జరిగినంత నష్టం మరెక్కడా జరగలేదని, అస్లు రాజపుత్రుల వంటి శత్రువును చైనీయులు ఇదివరకు చూడలేదని కొనియాడారు.
మరోవైపు పంజాబీలు వ్యూహాత్మకంగా దాడులు చేస్తూ శత్రువును ముప్పతిప్పలు పెట్టసాగాయి. వనరులు, సమయం, సామాగ్రి, భౌగోళికాంశాలు- ఇన్ని పరిమితుల మద్య వారు మొదటి నుంచి శత్రువును ఎదుర్కొంటూనే ఉన్నారు. వాళ్ళ నైపుణ్యానికి జోహార్లర్పిస్తూనేమో చైనీయులు ఎక్కడా వారితో నేరుగా పోరాడలేదు. వారిని మిగతాదళాలను వేరుచేసుకుంటూ, ఒంటరిగా ఉండేలా వ్యూహాలు పన్నారు. వీరు అందరికన్నా ముందు ఉండటంతో, దాడికి స్పందించే సమయం లేకపోయింది. ఎక్కువమంది ఆసమయంలోనే మరణించారు. సాంగ్లేలో ఉన్న దళాలు అదృష్టవశాత్తూ భూటాన్ వైపు మళ్ళిపోయాయి. మిగతావారికి అలాంటి దారికూడా లేకుండా పోయింది. ఉన్నా వారు పోరాటానికే దిగేవారన్నది అందరి విశ్వాసం.
ఉదయం 7:30కల్లా ధాగ్ల ప్రాంతం పూర్తిగా చైనీయుల ఆధీనంలోకి వచ్చేసింది. మూడుగంటల్లో మొత్తం తుడిచిపెట్టుకు పోయింది. దానికి చైనీయుల వ్యూహాలేవీ అంత ఆధునికమైనవీ, చేదించ సాద్యం కానివీ కాదు. అయితే వారి దగ్గర సామాగ్రి ఉత్తమనైనది. బలం ఎక్కువ. స్థానికంగా అనుకూలాంశాలు ఎక్కువ. ఉన్నతస్థాయిలో తీసుకున్న నిర్ణయాలు ప్రభావ వంతమైనవి. తమ సామాగ్రి నిండుకునేదాకా భారత సైనికుడూ శత్రువుకు లొంగలేదు. వెన్నుచూపలేదు. మృత్యువును కౌగిలించుకున్నాడు. ఇక్కడ ఆసైనికుణ్ణీ చంపింది శత్రువా? లేక అరకొర వనరులు, అస్థవ్యస్థ నిర్ణయాలు, కుళ్ళు రాజకీయాలు నిండిన అధికార వ్యవస్థా? అన్నది వారివారి విచక్షణను బట్టి నిర్ణయానికి రావచ్చు.
అక్కడి నుంచి చైనాబలగాలు సాంగధర్ లోని హెలిపాడ్ వైపు కదిలాయి. మద్యలో కొన్నిబృందాలను వ్యూహాత్మకంగా పక్కకు పెట్టాయి. అక్కడ వస్తుసరఫరా కోసం వచ్చిన హెలికాప్టర్ను కూల్చివేశారు. యుద్దం గురించి ఎయిర్ ఫోర్సుకు సమాచారం ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు బలయ్యారు. మొదట్నుంచీ ఆర్మీ- ఎయిర్ ఫోర్సులోని కీలకవిభాగాల మద్య సమంవయం లేదు. ఇది అనేకసార్లు తేటతెల్లమయ్యింది. ముందురోజు జనరల్ ప్రసాద్ తాను సరిహద్దుకు వచ్చి, అక్కడి సైనికుల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటానని మాటిచ్చాడు. అమాటప్రకారం ఆయన బయలుదేరబోగా, కిందవాళ్ళు వారించారు. ముందు తామెళ్ళి పరిస్థితిని చూసి వస్తామని, తర్వాత వెళ్ళమని చెప్పి బయల్దేరారు. ఆహెలికాప్టర్నూ కూల్చివెయ్యడంతో ఆయువకులిద్దరూ బలయ్యారు. అప్పటికే సిగ్నల్ అధికారి బందీగా మారాడు. అతని తర్వాతి వ్యక్తి ఈఘటనలో మృతి చెండాడు. దాంతో సమాచారం పూర్తిగా స్తంభించింది.
దాల్వీ కొన్ని రహస్య పత్రాలను తగలబెట్టాక, మిగిలిన సహచరులతో కలిసి సాంగధర్ వైపు కదిలాడు. అక్కడికి చేరుకునే సరికే చైనీయులు భారీ యెత్తున దాడులు నిర్వహిస్తున్నాయి. భారత సైన్యం తమతమ శక్తిమేరా వారిని నిలువరించేందుకు యత్నిస్తున్నాయి. దూరం నుంచి వారి సాహసాన్ని చూస్తున్న దాల్వీబృందానికి రోమాలు నిక్కబొడుచుకున్నాయి. దాదాపు 4గంటలు పోరాడాక, వీరి దగ్గర కూడా నిల్వలు నిండుకోవడంతో ప్రాణాలు విడిచారు. ఇక మిగిలింది హథుంగ్లా వద్ద ఉన్న పంజాబీలు, గ్రెనేడర్లు.
సెర్ఖిమ్ వైపు వెళ్ళి వారిని కలుసుకోవడానికి నిర్ణయించుకున్నారు. అక్కడికి చేరుకోవాలంటే 18500 అడుగుల ఎత్తులో ఉన్న శిఖరాలను దాటాలి. నిట్టనిలువుగా ఉన్న పర్వతాన్ని ఎక్కడం ప్రారంభించారు. అత్యంత ప్రమాదకరంగా ఉన్న ఈదారిలో 17000 అడుగుల ఎత్తున చిన్నగుహలో రాత్రికి తలదాచుకున్నారు. అప్పటికి 24గంటలుగా ఎవ్వరికీ అన్నం లేదు. నిద్రలేదు. నీళ్ళు తాగాలన్నా మంచువల్ల గొంతు పట్టేస్తోంది. అలానే రాత్రంతా గడిపారు. ఇంతటి కష్ట సమయంలోనూ సైనికుడు తన విశ్వాసాన్ని కోల్పోలేదు. తమ అధికారి పట్ల వారుచూపిస్తున్న గౌరవం దాల్వీని కట్టిపడేసింది.
మార్గంలో ఒక్కొక్కరుగా అస్వస్థతకు గురవుతూ వస్తుండటంతో వారిని వదిలి వెళ్ళక తప్పలేదు. మద్యాహ్నం 1:30కు కర్పోలా మార్గానికి చేరుకునేసరికి 12మంది మిగిలారు. కాళ్ళీడ్చుకుంటూ బండరాళ్ళు, కాలువలూ, పొదలు దాటి వెళ్తూ ఎక్కడొ దారి తప్పిపోయారు. కానీ ముందుకు పోవడం తప్ప మరొక మార్గం లేదు. కాబట్టి వెళ్తూ ఉన్నారు. అప్పటికే తిండితినీ, నిద్రపోయి 60గంటలయ్యింది! చైనీయులు ఒకదాని తర్వాత మరొకటి ఆక్రమించుకుంటూ మొత్తంప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకుంటున్నారు. సరిహద్దు పోస్టుల్లో భారత త్రివర్న పతాకాన్ని అవనతం చేశారు. ఇక మళ్ళీ ఎప్పటికి మనఝెండా ఎగురుతుంది అన్నది కాలమే జవాబు చెప్పాలి. ఒక దట్టమైన అడవిని చీల్చుకుంటూ ముందుకు వెళ్ళగా మొత్తం దళం చైనాబలగాల మద్యలో ఇరుక్కుంది. వారంతా అక్కడే సేదతీరుతున్నారు. మొత్తం విజయం ఒక ఎత్తైతే దళనాయకుడు బందీగా దొరకడం ఎవడికైనా అమితానందాన్ని కలిగించేది. ఆక్షణం దాన్నే చైనీయులు అనుభవించారు.
అలా ఈమట్టికోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టేందుకు వెనకాడకుండా సైనికుడు సాగించిన పోరాటం ముగిసింది.
ఇక మళ్ళీ ఎప్పటికి మనఝెండా ఎగురుతుంది అన్నది కాలమే జవాబు చెప్పాలి - sadly, I dont think this will happen in future.
ReplyDeletekind of consolling thing is, all the 320 odd indian prisoners of war captured by China were treated well in the camps. They were not humiliated/tortured as in Kargil War.
ఈమట్టికోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టేందుకు వెనకాడకుండా సైనికుడు సాగించిన పోరాటం ముగిసింది.
ReplyDelete-------------------------
హ్మ్! మొత్తం సిరీస్ అంతా చాలా బాగా రాసారండి !
@కృష్ణ: పాకిస్తాన్ తో మనకు జరిగినవి పూర్తిస్థాయి యుద్దాలుకాదు. మనం మనసైన్యాన్ని అధికారికంగానే దింపాం. వాళ్ళు కొంతమంది సైనికుల్ని, మరికొంతమంది జీహాదీల్ని వాడుకున్నారు. అలాంటివి అల్లరిమూకల దాడులవుతాయేగానీ యుద్దంకాదు. అలాంటప్పుడు బంధీలను గౌరవంగా చూసుకుంటారని ఎలా అనుకోగలం? కానీ చైనా అధికారికంగా సైన్యాన్ని దించింది. ఇలాంటి తేడాలను సూచిస్తూనే ముందు పోస్టుల్లో గణతంత్రరాజ్యాల మద్య యుద్దనికీ, అల్లరిమూకలను ఎదుర్కోవడానికీ తేడా ప్రస్తావించాను.
ReplyDelete@శ్రావ్య వట్టికూటి: థాంక్సండి.
మొదట్నుంచి చివరిదాకా చదివిన అందరికీ దన్యవాదాలు. నలుగురికీ కొన్నినిజాలు తెలిస్తే అదేపదివేలు.
పాకిస్తాన్ తో మనకు జరిగినవి పూర్తిస్థాయి యుద్దాలుకాదు
ReplyDeletehaaaa.. haaa...haaaa. then what? cold wars or fake wars?
చైతన్య గారూ,
ReplyDeleteమీరు వ్రాసిన మేరునగ తప్పిదం వ్యాస పరంపరకు నా కొత్త బ్లాగు "ఊమెన్ కార్టూన్లలో" చైనా యుధ్ధం గురించివేసిన కార్టూన్లపై నేను వ్రాసిన సమీక్షా వ్యాసంలో లింకు ఇచ్చాను. చూడ గలరు. మంచి వ్యాసాలను బ్లాగు ప్రపంచానికి అందించినందుకు మరొకసారి ధన్యవాదాలు.
Wonderful and insightful series. Thanks Chaitanya garu.
ReplyDeleteఅరసవెల్లిలో అద్భుతం జరిగింది. సూర్యనారాయణుడి ఆలయంలో మూల విరాట్ పాదాలను భానుడి కిరణాలు తాకాయి. more updates
ReplyDeletegood evening
ReplyDeleteits a nice information blog...
The one and only news website portal INS media.
please visit our website for more news update..
https://www.ins.media/