మేరునగ తప్పిదం- 12.రాజుగారొచ్చారు

సెప్టెంబరు 30న రక్షణమంత్రి కృష్ణమీనన్, ఆతర్వాత అక్టోబరు 2న నెహ్రూ తమతమ విదేశీ పర్యటనలు పూర్తి చేసుకుని డిల్లీ చేరారు. ప్రభుత్వాధినేతగా నెహ్రూ పర్యటనలు చెయ్యాల్సి ఉంటుంది. దాన్నెవరూ కాదనలేం. ఆయన ఈసమస్యను అనేకదేశాల నేతలతో చర్చించి తన పలుకుబడిని ఉపయోగించి దీన్ని పరష్కరించాలని అనుకొని ఉండవచ్చు. కానీ వాటిమీదే ఆధారపడి మరే జాగ్రత్తలూ తీసుకోకపోవడం వ్యూహాత్మక తప్పిదమే. అనేక అంతర్జాతీయ వ్యవహారాలను సమర్థంగా చక్కబెట్టి దూరదృష్టిగల నేతగా మన్ననలందుకున్నాయన ఈవిషయంలో ఆవిధంగా వ్యవహరించకపోవడం పొరపాటే. తిరిగొచ్చే సమయానికి సరిహద్దు భద్రత రక్షణపరంగాకన్నా రాజకీయపరంగా ఎక్కువ సున్నితమై కూర్చుంది. చాలా వరకు సమస్య చెయ్యిదాటిపోతున్న సూచనలున్నా రష్యానాయకుడి వద్ద చైనా జనరల్ ఇచ్చిన మాటను పట్టుకుని నిమ్మళంగా ఉండిపోయారు. అయితే రాజకీయ ప్రత్యర్థులకు జవాబు చెప్పాలంటే దాడిచెయ్యడమే ఏకైక మార్గమని భావించాడు. తప్పిదానికి తొలిమెట్టు ఇక్కడే పడింది. అప్పటి వరకు లాంచనప్రాయంగా సమర్పిస్తున్న నివేదికలు తప్ప సరిహద్దు వద్ద వాస్తవ పరిస్థితి ఆయనకు పూర్తిగా తెలిసిరాలేదు. దాడిచెయ్యడాన్ని జనరల్ థాపర్ సమర్థించక పోయినా నెహ్రూను ఎదిరించేంత శక్తులేక మిన్నకుండి పోయాడు.

సెలవుమీద ఉన్న జనరల్ కౌల్ను వెంటనే పిలిపించారు. ఇప్పుడు దేశరక్షణ, దాని పరువు అతని చేతిలో పెట్టే కార్యక్రమం మొదలయ్యింది. జనరల్ ఉమ్రావుతో విబేధించినప్పటికీ సేన్ కూడా సదిగ్ధంలోనే ఉన్నాడు. లక్ష్యం అసాధ్యమన్న వాస్తవం ఆయనకు నెమ్మదిగా బోధపడసాగింది. ఇదే విషయాన్ని మీనన్కు స్పష్టం చేశాడు. ఒకవేళ దాడి చెయ్యడమే మనకున్న మార్గం అనుకుంటే తరువాత పరిణామాలు ఎదుర్కొనేందుకు సిద్దపడాలని సూచించాడు. కానీ చలికాలం మొదలయ్యే లోపలే దాడిచెయ్యాలి. లేకుంటే కొన్ని నెలలపాటు మొత్తం కార్యక్రమం వాయిదా పడుతుందన్న కారణంతో మీనన్ తొందరపడ్డాడు. సైనికాధికారుల్లోని సందేహాలను ప్రభుత్వం కనీసం పట్టించుకోకపోవడం అనైతికం.

ఇక వీరిని సముదాయించడాని కన్నట్టుగా నెహ్రూ జెనీవాలో రష్యానాయకుని సమక్షంలో చైనా జనరల్ ఇచ్చిన మాటను వారికి చెప్పాడు. "చైనా మనమీద యుద్ధం ప్రకటంచదు. దానికి నాది హామీ." అన్నవిధంగా వాళ్ళకి ధైర్యం నూరిపోశాడు. అలా ఒక సైనికచర్య కాస్తా రాజకీయ ప్రక్రియగా భావిస్తూ నెహ్రూ ఇంకా కలల్లోనే విహరిస్తున్నాడు. పోనీ దాడికి పూనుకున్నప్పుడు అదైనా పూర్తిస్థాయిలో చేస్తున్నారా? అంటే అదీలేదు. కేవలం తూతూమంత్రంగా కొన్నిదళాల్ని సరిహద్దులో పెట్టి, ఒకట్రెండు చోట్ల దాడిచెయ్యించి, చలి పెరిగేలోగా వెనక్కి వచ్చేద్దామన్నది వాళ్లవ్యూహం. చలిపెరిగేదాకా చూస్తూ కూర్చోవడానికి చైనా ఏమైనా పిచ్చిదా? బలహీనమైనదా? ఒకసారి మనం కదిపాక వాళ్ళు అంతటితో ఊరుకునే రకం కాదు. అందరూ మనలాగా ఉండరు కదా! తమలపాకుతో నువ్వు ఒకటిస్తే తలుపుచెక్కతో నేను పదిస్తా అనే రకం. మరి వాళ్ళప్రతిదాడిని సమర్థంగా తిప్పికొట్టే వనరులు, ప్రణాళిక, అనుకూల పరిస్థితులూ ఏమైనా ఉన్నాయా? అంటే వ్యూహకర్తలకు డిల్లీ భవనాల కారిడార్లు తెలుసుగానీ సరిహద్దులో వాస్తవికస్థితిని గురించి ఇసుమంతైనా తెలియదు. చైనా ప్రతిదాడి చేస్తే? అన్న ప్రశ్న మనసులో తలెత్తగానే అధికారులకు వెన్నులోంచి వణుకు పుట్టింది. ప్రత్యర్థుల బలాన్ని చూసికాదు. సైనికుల ప్రాణాలకున్న ముప్పును గురించి. రక్షణపరంగా ఎలాంటి ఉపయోగమూలేని ఒకరాజకీయ చదరంగంలో సైనికుడెందుకు బలవ్వాలి? ఒక సమర్థుడైన యోధుణ్ణి అనవసరమని తెలిసీ చూస్తూచూస్తూ అతని ప్రాణాలతో చెలగాటమెందుకు ఆడాలి? అన్న ఆలోచనలు అధికారుల్ని కలచివేశాయి. కానీ ఏమీ చెయ్యలేని నిస్సహాయత. నెహ్రూ స్థాయి నాయకునికి సరిహద్దు రక్షణకన్నా పార్టీ అధికారంలో ఉండటమే ముఖ్యమైంది.

వెంటనే జనరల్ కౌల్ తెరమీదుకొచ్చాడు. ఆయనకోసం అప్పటికప్పుడూ ఒక దళాన్ని సృష్టించి (4Corps), దానికి కమాండర్ను చేశారు. వెంటనే ప్రభుత్వ సమాచారసాధనాలన్నీ ఊదరగొట్టడం మొదలుపెట్టాయి. కౌల్ బాద్యతలు చేపట్టి, సరిహద్దు వ్యవహారాల సమాచారాన్ని తెలుసుకున్నాడు. చేతిలో అద్భుతదీపం ఉన్నవాడిలా వ్యవహరించసాగాడు. రాజకీయ కారణాలతో హఠాత్తుగా నెలకొల్పిన దళానికి కమాండర్గా ఉన్నపళంగా సైనికచర్యలు చేపట్టి, మిగతా వారికీ తనకూ మద్యన తేడా ఏమిటో చూపి శ్రీవారి మన్ననలు పొందుదామన్న తపన అడుగడుగునా కనిపించసాగింది. ఆక్రమంలో అనాదిగా సైన్యం పాటిస్తున్న విలువలు, నియమాలు, క్రమశిక్షణ వంటివి బుర్రలోంచి తుడిచేశాడు. అయితే అరకొరగా ఉన్న వనరులను మెరుగుపరచడమన్నది మాత్రం ఆదేశాలిచ్చిన ఎవరికీ గుర్తు రాలేదు. చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్ గా ఇది జనరల్ కౌల్ ప్రథమబాద్యత.

ఈ వ్యవహారాలన్నింటినీ మొదట్నుంచీ వ్యతిరేకిస్తున్న జనరల్ ఉమ్రావ్ కంటికింద నలుసులా తయారయ్యాడు. ఆయన  XXXIII Corpsకు నాయకత్వం వహిస్తున్నాడు. అది తూర్పుదళం కింద అంటే జనరల్ సేన్ కింద ఉంటుంది. ఉమ్రావ్ కింద సరిహద్దులో ఉన్న దళాలన్నీ ఉన్నాయి. వాటి ప్రధాన కేంద్రం తేజ్పూర్లో. అక్కడి బాద్యతలు జనరల్ ప్రసాద్ నిర్వహిస్తున్నాడు. ఈదళాలన్నీ ఒకపద్దతి ప్రకారం నెలకొల్పి, శిక్షణ తీసుకుని అక్కడ కార్యక్రమాలు సాగిస్తున్నాయి. అరకొరవనరులైనా, తగినంతమంది సైనికులు లేకపోయినా ఎలాగో నెట్టుకొస్తున్నారు. జనరల్ కౌల్ను సరిహద్దుకు పంపాలనుకుంటే ఆయన్ని వీటిలో దేనికైనా సారధ్యం వహించమని చెప్పవచ్చు. కానీ అవన్నీ ఆయాన స్థాయికి తగినవి కాదు. ఆయన సాక్షాత్తూ జవహర్ లాల్ నెహ్రూద్వారా నియమించబడ్డాడు. ఆయన స్థాయికి తగినది ఏమైనా ఉందంటే అది Corpsకు నాయకత్వం వహించడం. మరి ఆస్థానంలో అప్పటికే జనరల్ ఉమ్రావ్ సింగ్ ఉన్నాడు. ఆయన్ని కదిలిస్తే ప్రజల నుంచి మరింత వ్యతిరేకత వస్తుంది. మరి జనరల్ కౌల్ ఏమి చెయ్యాలి? దానికోసమే రాత్రికి రాత్రి 4Corps అన్నదాన్ని ఏర్పాటు చేసి దానికి నాయకత్వం వహించమన్నారు. మరి అందులో ఎవరైనా సైనికులున్నారా? అంటే అదీలేదు. ఈసంగతి తెలిసి "మీరు మారరురా!" అని ప్రపంచం మనల్ని చూసి నవ్వింది. ఇక మొండిఘటమైన ఉమ్రావును సరిహద్దు వ్యవహారాలనుంచి పక్కకు తప్పించింది. అది ఆయన Corps కిందకు వచ్చే ప్రాంతమే అయినా ఆయనకు సంబంధంలేదు పొమ్మన్నది. ఒకవేళ ఉమ్రావే అక్కడ ఉండి ఉంటే? అన్న ప్రశ్నకు జవాబుగా- ఆయన అద్భుతాలు చేసి చూపించకపోయినా మనసైనికుల ప్రాణాలు గాలిలో కలిసిపోకుండా కాపుడుండేవాడన్న సమాధానం మనందరికీ అనిపిస్తుంది.

జనరల్ ఉమ్రావ్ సింగ్ గురించి కొన్ని విషయాలు-

యోధులకు పుట్టినిల్లైన రాజస్థాన్లోని జైపూరుకు చెందిన రాజపుత్రుడీయన. ఎప్పుడూ నిబ్బరంగా కనిపించే ఈయన యుద్ధభూమిలో తిరుగుతూ ఉంటే సైనికులకు తెలియని ధైర్యం. సరిహద్దు వ్యవహారాల్లో అందరూ గాభరాపడిన సందర్భాల్లోనూ తొణక్కుండా పనిచేశాడు. వాస్తవ పరిస్థితిని అంచనా వెయ్యడానికి ఈయన పర్యటించినన్నిసార్లు మరే ఉన్నతాధికారీ పర్యటించలేదు. పైవాళ్ళ ఆగ్రహానికి గురవతామని తెలిసినా తన అభ్యంతరాలను లిఖితపూర్వకంగా సమర్పించడానికి ఎన్నడూ వెనకాడలేదు. దాడి చెయ్యలనుకున్నప్పుడు ఆయన అన్న మాటలు: " దాడి చేస్తాం. భారతీయులంతా మనగురించి గొప్పగా మాట్లాడుతారు. దండలు వేస్తారు. కానీ అకారణంగా ప్రాణాలు కోల్పోయిన సైనికుల మాటేంటి?" ఇది చాలు ఆయనలోని మనిషిని గురించి చెప్పడానికి. చైనీయులను తరిమివెయ్యాలన్న లక్ష్యాన్ని చూసినప్పుడు కిందవాళ్ళవంక జాలిగా చూశాడు. వాళ్ళను కాపడటానికి చెయ్యగలిగినంతా చేశాడు. ఒకవేళ ఆయన మాట వినుంటే సైనికుల ప్రాణాలతోబాటుగా దేశప్రతిష్ట నిలిచి ఉండేది. ఆస్థాయి వ్యక్తిని యుద్ధంమద్యలో తొలగించడం ఆయన్ని ఉరితీయడంకన్నా ఏరకంగానూ తక్కువకాదు.

3 comments:

 1. "...పైవాళ్ళ ఆగ్రహానికి గురవతామని తెలిసినా తన అభ్యంతరాలను లిఖితపూర్వకంగా సమర్పించడానికి ఎన్నడూ వెనకాడలేదు..."

  That was several decades back! Today career orientation, in every sphere and field is ruling the roost and every action or inaction is conditioned by that malady and nothing else.

  ReplyDelete
 2. @శివరామప్రసాదు: అదొక చేదు నిజం. మాతరంవాళ్ళు భరించాల్సిందే

  ReplyDelete
 3. My point is, decades back, one person's greed for name and his impotency in understanding the reality, brought about the dishonour to the country.

  But today, this career orientation to be more specific, obsession with career progression is killing various organisations and thereby the nations. Decades back 1 person at the helm of affairs bungled and today lakhs of people following suit and result would be same-degradation of the Nation.

  ReplyDelete