మేరునగ తప్పిదం- 11.తరిమికొట్టండి


సెప్టంబరు 20 రాత్రి 10:30కి రెండవ బ్రిడ్జ్ దగ్గర ఉన్న చైనా కాపలాదారుడొకడు హఠాత్తుగా భారత పోస్టు మీదకి ఒక గ్రెనేడ్ను విసిరడంతో మరొక అంకానికి తెరలేచింది. ఈ హఠాన్పరిణామానికి దిగ్భ్రాంతి చెందిన భారతసైన్యం వెంటనే ఎదురుదాడి చేసింది. ఇరువర్గాలూ పరస్పరం కాల్పులు జరుపుకోన్నాయి. ఇద్దరు చైనీయులు మరణించగా మరొక ఇద్దరు గాయపడ్డారు. ఐదుగురు భారతీయులకి స్వల్పగాయలయ్యాయి. అరకొర సామాగ్రితోనే భారత సైన్యం దాడిని సమర్థవంతంగా తిప్పి కొట్టింది. ఈదాడి అంతకుముందు జరిగిన చెదురుమదురు ఘటనల లాంటిది కాదు. దీనితో ఇక చైనీయులు ఆప్రాంతాన్ని వదిలి వెళ్ళరని స్పష్టంగా తెలిసొచ్చింది. చైనీయులతో మాట్లాడేందుకు భారత పౌరవ్యవహారాల అధికారి మోంగియా ప్రయత్నించగా వాళ్ల ప్రవర్తన కారణంగా అది కుదరలేదు. అలాగే మరొక 500మంది పోర్టర్లను సరఫరా చేసేందుకు ఆయన ముందుకొచ్చాడు. కానీ అప్పటికే సరిహద్దులో యుధ్దవాతావరణం నెలకొని ఉండటంతో గిరిజనులను సరిహద్దు వరకు పంపనని, వారు సెర్ఖిం వరకే తీసుకొస్తారని, అక్కడి నుంచి సైనికులే మోసుకెళ్ళాలని చెప్పాడు.

మైదానాల నుంచి బయలుదేరిన పంజాబ్ దళాలు చిన్నచిన్న బృందాలుగా చేరుకోసాగారు. వాళ్ళు తొడుక్కుని ఉన్న కేన్వాస్ బూట్లు చిరిగిపోయి, రబ్బరు అడుగు బయటకు వచ్చేసి ఉన్నాయి. వాళ్ళు ధరించిన ఆలివ్ గ్రీన్ సమ్మర్ యూనిఫాం చలిని ఏమాత్రం ఆపలేదు. కానీ వాళ్ళదృష్టిలో అవన్నీ చాలా చిన్నవిషయాలు. సైనికుడూ యుద్ధానికి వెళ్ళేటప్పుడు వాటి గురించి ఆలోచించకూడదన్న వాళ్ళ అభిప్రాయం. నిజమే! సైనికుడు ఆలోచించక పోయినా, అధికారులకి, ప్రభుత్వానికి ఆలోచించాల్సిన బాద్యత ఉందికదా. వాళ్ళడిగేవేవీ విలాసాలుకావు.  కనీస అవసరాలు. దేశ ఆర్థికవ్యవస్థ ఎంత బలహీనంగా ఉన్నా మరీ ఇంతహీనంగా అయితే లేదు. ఇలాంటి సదుపాయాలతో చైనా ప్రభుత్వం తనసైనికుల్ని వెళ్ళమంటే సరిహద్దుదాకా వచ్చి ఉంటారా? అన్నది సందేహమే. కానీ ప్రాణాల్ని పణంగా పెట్టి పోరాటానికి సిద్ధమైన దళాల్ని గమ్యానికి చేరుకోవడంలో ఇంత ఆలశ్యం ఎందుకైందని ప్రశ్నించింది మన రాజధాని!
సైన్యం చైనీయుల దాడీని సమర్థంగా తిప్పికొట్టి ఆపోస్టుతో పాటుగా రహదారులన్నీ తమ ఆధీనంలోకి తెచ్చుకుంది. నమ్కాచు నది మీద ఉన్న నాలుగు బ్రిడ్జిల వద్దా పంజాబ్ దళాలను మోహరించారు. 40 అడుగుల వెడల్పున్న నదికి ఇరువైపులా రెండుదేశాల సైనికులు నిల్చుని ఉన్నారు. ఇది చరిత్రలోనే అరుదైన ఘట్టం. చైనీయులు తమ జిత్తులమారి ఎత్తులను సైన్యం మీద ప్రయోగించసాగారు. ఒకవైపు గ్రెనేడ్లు విసురుతూనే, చర్చలకు రమ్మంటూ శాంతిమంత్రాలని వల్లించసాగారు. పైనుంచి వచ్చిన ఆదేశాల్లో స్పష్టత లోపించడంతో సైన్యం గందరగోళానికి గురైంది.  బట్లరు హిందీలో భారత్-చైనాల మద్య స్నేహాన్ని లౌడ్ స్పీకర్ల ద్వారా చెప్పసాగారు. ద్వంద్వ విధానాలద్వారా సైన్యం నైతికస్థైర్యాన్ని దెబ్బతీయడానికి వాళ్ళు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. అయితే దీన్ని ప్రతిఘటించే విధంగా భారత అధికారులు ఎలాంటి చర్యలూ చేపట్టకపోవడంతో చైనీయులు ఇంకొక అడుగు ముందుకేసి "మా భూభాగంలో మీకేం పని?" అని ప్రశ్నించసాగారు. దీనికి మనవైపునుంచి సరైన జవాబు రాకపోవడం సైన్యాన్ని కొంతగందరగోళానికి గురిచేసింది. 40 అడుగుల దూరంలో బలమైన శత్రువును ఎదురుగా ఉంచుకుని, మానసిక స్థార్యాన్ని కోల్పోకుండా, రోజుల తరబడి పోరాడటం అంత సులువైన విషయంకాదు. ఇది వీధుల్లో ఝెండా పట్టుకుని "భారతమాతా కీ జై", "జైహింద్", "వందేమాతరం" అంటూ ర్యాలీలు చేసినంత, ఫేస్బుక్లో షేర్లు, లైకులు కొట్టినంత సులుభం కాదు. అణువణువునా దేశభక్తి నింపుకుని, ఈమట్టికోసం ఆత్మార్పణకు సిద్ధమైన వాడు మాత్రమే చెయ్యగల మహత్కార్యం.
అరువుమీద దళాల్ని తెచ్చి, ఒక అతుకుల బొంత బ్రిగేడును తయారు చెయ్యడంలో అధికారులు ఎట్టకేలకు కిజయం సాధించారు. 1/9 గూర్ఖాల దళాన్ని, 2రాజపుత్రుల దళాన్ని వాడుకోవడానికి అనుమతి లభించింది. వీళ్లందరినీ 7 పదాతిదళ బ్రిగేడుకు అనుసంధానించారు. అలా ఒకజట్టుగా ఉండాల్సిన బ్రిగేడ్ కాస్తా నానాదళాల గుంపుగా అయ్యికూర్చుంది. ఒక్కొక్క దళం బలాబలాలు ఏమిటో? వాటి నైపుణ్యాలేమిటో? పరిమితులేమిటో? తెలియకుండానే వాటికి నాయకత్వం వహించాల్సిన బాద్యత దాల్వీ మీద పెట్టారు. సెప్టెంబరు 26కు ఈదళాలు లుంపుకి చేరుకున్నాయి. మిగతా దళాల మాదిరిగానే వీరి ప్రయాణాలూ జరిగాయి. "మీరు ముందు బయల్దేరండి. మీసామాగ్రి అంతా మీరక్కడికి చేరుకునే సరికే పంపిస్తాం." అని మాటిచ్చిన అధికారులు తరువాత మరిచిపోయినట్టున్నారు. అలా సెప్టెంబరు 10న బయల్దేరిన వాళ్ళు 15రోజుల తరువాత చేరుకున్నారు. దారిలో పర్వతాలు అలవాటులేక అనేకమంది రక్తపువాంతులు చేసుకున్నారు! అయినా లుంపు చేరాక తర్వాతిరోజే బాద్యతలు తీసుకోవాడిని సిద్ధపడ్డారు! చైనీయులను తరిమికొట్టడం మినహా వీరికంటూ సవివరంగా నిర్దేశించిన లక్ష్యాలంటూ ఏమీ లేవు.

రాజపుత్రుల బృందమొకటి తెల్లవారుఝామున శిక్షణ తీసుకుంటున్నారు. కొత్తగా చేరిన కొందరికి గ్రెనేడ్ ఎలా ఉపయోగించాలో తెలియదు! అక్కడ సాధన చేస్తున్నారు. శిక్షణకు సరిపడినన్ని గ్రెనేడ్లు మనదగ్గర లేవు. కాబట్టి సైనికులు యుద్ధభూమిలోనే అన్నీ నేర్చుకొని, శత్రువుతో పోరాడాలి. తొవాంగును రక్షించే బాద్యత కళ్యాణ్ సింగ్ తీసుకున్నాడు. మనకు నిర్దేశించిన లక్ష్యాల్లో తొవాంగును కాపడటం, చైనీయులను థాగ్ల నుంచి తరిమికొట్టడం అన్న పరస్పర విరుద్ధమైనవి ఉండటాన సైనికబలం రెండింటిలో దేనినీ సాధించలేని స్థితిలో ఉంది. అలాగే మిసిమారి నుంచి తొవాంగుకు గల మార్గాన్ని రక్షించే బాద్యత పర్వతపాదాల వద్ద ఉన్న మెచీన్ గన్ దళానిది. 300మైళ్ళ దూరాన్ని ఎన్ని మెచీన్ గన్లతో కాపు కాయాలి?
వాయురవాణా కొద్దిగా ఊపందుకోవడంతో నెమ్మదిగా పంజాబీలకు సరిపడినంత ఆయుధాలు లభించ సాగాయి. వాటిలో మైన్లు, ఫ్యూజుల వంటి సాధారణ సామాగ్రికూడా లేదు. గిడ్డంగుల జాబితాలో ఇవి విలాసాలుగా పరిగణించబడ్డాయి. పంజాబీలు రోజూ చైనీయులతో కాల్పులు ఇచ్చిపుచ్చుకుంటున్నారు. ఆసమయంలో పంజాబీల గుండెనిబ్బరాన్ని చైనీయులు సైతం మెచ్చుకున్నారు. ఒకవీరుడికే మరొకవీరుని గొప్పతనం తెలిస్తుంది కదా! పంజాబీలకు సరిపడినంత సామాగ్రి అందజేశాక, మిగిలిన గూర్ఖా, రాజపుత్రదళాలకు సరఫరా మొదలుపెట్టారు.

హెలికాప్టర్లు జారవిడిచిన వస్తువులను ఏరుకుని తెచ్చేదానికి రోజుకు 400మంది వినియోగించ బడుతున్నారు. ఇలాంతి దృశ్యాలు జనరల్ ఉమ్రావ్ సింగును తీవ్రంగా కలచివేశాయి. వాస్తవ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని మాట్లాడమని, ప్రగల్భాలకు పోవద్దని హెచ్చరించాడు. రాజకీయ కారణాలను సాకుగా చూపించి హిమాలయాలంత పెద్ద అవరోధాన్ని పక్కన పెట్టలేం.

రక్షణమంత్రితో జరిగిన సమావేశంలో "చైనీయులు మూడు కంపెనీలుగా ఉన్నాయి. వారికి వెనకనుంచి మద్దతివ్వడానికి ఇంకొన్ని దళాలు ఉన్నాయి. వారి రహదారులు, ఇతర సదుపాయాల దృష్ట్యా రవాణా కూడా మెరుగ్గా ఉంది." అని ఆర్మీ చీఫ్ వెల్లడించాడు. కానీ ప్రభుత్వం మాత్రం ఇవేవీ పట్టనట్టు "చైనీయులను తరిమికొట్టాల్సిందే" అని ఆదేశించింది. చేసేదిలేక జనరల్ థాపర్ రాతపూర్వక ఉత్తర్వులివ్వమని అడిగాడు. తక్షణం ఒక జాయింట్ సెక్రటరీ స్థాయి అధికారి ఉత్తర్వులను జారీ చేసేశాడు. ఒక ఆర్మీచీఫ్ స్థాయి అధికారికి జాయింట్ సెక్రటరీ ఉత్తర్వులు జారీచెయ్యగలిగినంత అతీతమైన శక్తులు డిల్లీదర్బారులో తిష్టవేసుకుని కూర్చున్నాయి.  పైనుంచి వెలువడిన ఉత్తర్వులు పోస్టుమాస్టరులాగా జనరల్ థాపర్ జనరల్ సేన్కు బట్వాడా చేసేశాడు. అక్కడినుంచి కిందకి, ఇంకొకమెట్టుకిందకి జారుకుంటూ అనేక పోస్టుమాస్టర్ల ముద్రలు వేసుకుంటూ సరిహద్దులోని దళకమాందర్ దగ్గరికొచ్చి పడింది. ఆయన కింద కాగితాలు తీసుకునేవాళ్ళెవరూ లేర్. ప్రాణాలిచ్చే వాళ్ళు తప్ప. అలా ఒకదేశపు సైనికవ్యవహారం ఆదేశపు రాజకీయ అంశాలమీద ఆధారపడి నడిచింది.

ఇక ఆ ఆదేశాన్ని ఆధారంగా చేసుకుని సైన్యం ప్రణాళికను రూపొందించాల్సి వచ్చింది.  ప్రతి దళనాయకుడూ లాంచనంగా నిర్వహించే క్షేత్రస్థాయి అంచనాలను దాల్వీ తయారు చెయ్యనారంభించాడు.  అన్ని ప్రతికూల అనుకూల అంశాలు ఇందులో పొందుపరచాలి. యుద్ధభూమిలో వాతావరణం స్థిరంగా ఉన్నంతకాలమే దీనికి ఆయుష్షు ఉంటుంది. ఒకసారి వేగం పుంజుకుంటే మారుతున్న పరిస్థితులకనుగుణంగా దీన్నీ మారుస్తూ వెళ్ళాలి. మామూలుగా అయితే ఇది తయారుచేసి పైవాళ్లకి పంపితే వాళ్ళు దాన్ని పరిశీలించి, మార్పులు చేసి ఆమోదముద్ర వేస్తారు. దానికనుగుణంగా ఆదేశాలు జారీచేస్తారు. కానీ ఇక్కడ పరిస్థితి తిరగబడింది. ప్రభుత్వమే ఉందుగా ఆదేశాలిచ్చింది. దానిప్రకారం క్షేత్రస్థాయి అంచనాను దళకమాందర్ తయారు చెయ్యాలి. కానీ ఆలక్ష్యానికి అనుగుణంగా ఇక్కడ వనరులు లేవు.

అలా దానిని ఎలా తయారుచెయ్యాలా అని తలబద్దలు కొట్టుకుంటూంటే జనరల్ ప్రసాద్ హఠాత్తుగా ఊడిపడ్డాడు. ప్రధాన కార్యాలయంలో ఉండాల్సినాయన్ని ఉన్నపళంగా యుద్ధభూమికి వెళ్ళి అక్కడ పరిస్థితులు సమీక్షించమని ఆదేశాలొచ్చాయి. దాంతో ఆవయసులో, జనరల్ స్థాయి అధికారి అయ్యుండీ కాళ్ళీడ్చుకుంటూ కొండలనెక్కి లుంపుకు చేరుకున్నాడు. ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న ఆయనపై కనీస దయాదాక్షిణ్యంకూడా చూపకపోవడం ఇదేమి ప్రజాస్వామ్యం? జనరల్ స్థాయి అధికారి మొత్తంవ్యవహారాన్ని సమీక్షించాల్సిందిపోయి ఒకదళాన్ని నడుపుతూ ఇక్కడ ఉండుపోవడం ఎలాంటి యుద్ధవ్యూహం?

జనరల్ సేన్ ప్రభుత్వ నిర్ణయాన్ని తెలియజేస్తూ జనరల్ ఉమ్రావును వీలైనంత త్వరగా పని ముగించాలని ఆదేశించాడు. దాన్ని ప్రతిఘటించలేని జనరల్ ఉమ్రావ్ కిందివాళ్ళని ఒక అంచనా తయారు చేసి ఇవ్వమన్నాడు. ప్రబుత్వ నిర్ణయం దుస్సాధ్యమని అందరికీ తెలిసినా చెప్పి ఒప్పించేవాడే కరువయ్యాడు. ప్రభుత్వం ఈవిషయాన్ని అల్లరిమూకలను చెదరగొట్టి ఓట్లుదండుకునే వ్యవహారంగా చూసిందే తప్ప ఒకదేశసైన్యం మరొకదేశసైన్యంతో జరిపే పోరాటంగా చూడలేదు. ఆస్థాయికి వాళ్ళింకా ఎదగలేదు. అలా ప్రభుత్వం తనరాజకీయ కారణాల దృష్ట్యా తీసుకున్న దుస్సాధ్యమైన నిర్ణయం సైన్యానికి లక్ష్యంగా నిర్దేశించబడింది.
దాల్వీ, జనరల్ ప్రసాద్ ఇద్దరూ అంచనాపత్రంతో కుస్తీ పట్టసాగారు. ప్రసాద్ ముందు రెండు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. ఒకటి- అంచనా తయారు చెయ్యనని చెప్పి ఉన్నతాధికారుల ఆగ్రహానికి గురికావడం. లేదా రెండు- లక్ష్యాలు చేదించడానికి అవసరమైన వనరులను, ఇతర అంశాలను అందులో పొందుపరచడం. ఆయన రెండవ దానికే మొగ్గుచూపాడు. పరిస్థితులను అదుపులో ఉంచడానికి, శత్రువుపై పైచేయి సాధించడానికి అవసరమైన పాలనాపరమైన సౌకర్యాలను కోరుతూ, వాస్తవ పరిస్థితిని, అలాగే లక్ష్యాలను చేదించడంలో మనకున్న పరిమితులను రాజధానికి తెలియపరచటం ద్వారా తనబాద్యతను పూర్తిచేశాడు. దాన్ని చూసిన ఉమ్రావ్ కొన్ని మార్పులుచేసి మరింత అయుధసామాగ్రిని, పాలనా సౌకర్యాలను కల్పించాలని సూచించాడు. లఖ్నో బయలుదేరుతూ అక్కడ జనరల్ సేన్కు అరకొర వనరులను వివరిస్తానని, కానీ ఎక్కువగా ఆశించవద్దనీ చెప్పాడు. అలాగే సరిపడా సమాగ్రి లభించేవరకు లుంపును దాటి ముందుకు వెళ్ళొద్దని హెచ్చరించాడు.
ఆనివేదిక అందడంతోనే బలగాలను సాంగ్లే ప్రాంతంలో ఉంచమని ఆదేశించారు. జరల్ ఉమ్రావ్ అభ్యంతరాలను వినేస్థితిలో అక్కడ ఎవరూ లేకపోవడం సైనికుల పాలిట శాపమైంది. ఆయన తన అభ్యంతరాలను రాతపూర్వకంగా తెలియపరచాడు. వెంటనే చైనా పెద్దసంఖ్యలో సైన్యాన్ని అక్కడకు పంపింది. ఇక అక్కడనుంచి భారత బలగాలు వెనక్కిరాలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయాయి. ఈఒక్కచర్యతో బలగాల మద్య సమాచారం, సమన్వయం పూర్తిగా లోపించాయి. ఇంకా చైనీయులను తరిమికొట్టమనే ప్రభుత్వం చెబుతోంది.  ఇలా సెప్టెంబరు చివరినాటికి రాజధానిలోని వ్యూహకర్తలకు, సరిహద్దులోని సైన్యానికి మద్య అగాధం పూడ్చలేని విధంగా పెరిగిపోయింది.

4 comments:

 1. 40 అడుగుల దూరంలో బలమైన శత్రువును ఎదురుగా ఉంచుకుని, మానసిక స్థార్యాన్ని కోల్పోకుండా, రోజుల తరబడి పోరాడటం అంత సులువైన విషయంకాదు. ఇది వీధుల్లో ఝెండా పట్టుకుని "భారతమాతా కీ జై", "జైహింద్", "వందేమాతరం" అంటూ ర్యాలీలు చేసినంత, ఫేస్బుక్లో షేర్లు, లైకులు కొట్టినంత సులుభం కాదు. అణువణువునా దేశభక్తి నింపుకుని, ఈమట్టికోసం ఆత్మార్పణకు సిద్ధమైన వాడు మాత్రమే చెయ్యగల మహత్కార్యం.

  40 అడుగుల దూరంలో బలమైన శత్రువును ఎదురుగా ఉంచుకుని, మానసిక స్థార్యాన్ని కోల్పోకుండా, రోజుల తరబడి పోరాడటం అంత సులువైన విషయంకాదు. ఇది వీధుల్లో ఝెండా పట్టుకుని "భారతమాతా కీ జై", "జైహింద్", "వందేమాతరం" అంటూ ర్యాలీలు చేసినంత, ఫేస్బుక్లో షేర్లు, లైకులు కొట్టినంత సులుభం కాదు. అణువణువునా దేశభక్తి నింపుకుని, ఈమట్టికోసం ఆత్మార్పణకు సిద్ధమైన వాడు మాత్రమే చెయ్యగల మహత్కార్యం.

  ReplyDelete
 2. సుబ్రమణ్య చైతన్యగారు,

  సరి అయిన సమయం లో,సందర్బోచితం ఈ విషయాన్ని రాయటం చాలా బాగుంది. చైనాతో యుద్దం జరిగి సరిగ్గా 50సం|| అయ్యింది. ఈ మధ్య చైనా యుద్దం మీద పేపర్ లో వచ్చిన రెండు వ్యాసాలు మీకు ఉపయోగపడతాయేమో చూడండి.

  Lesson from 1962: India must never lower its guard

  http://m.timesofindia.com/articleshow/16760000.cms

  Who is India’s real ally?
  http://www.indiandefencereview.com/news/who-is-indias-real-ally/


  SriRam

  ReplyDelete
 3. ఇలాంటి వాళ్ళని అదే హిమాలయాల్లో కాళ్ళకి చేతులకి ఏమి లేకుండా వదిలేయాలి!

  "ప్రభుత్వం ఈవిషయాన్ని అల్లరిమూకలను చెదరగొట్టి ఓట్లుదండుకునే వ్యవహారంగా చూసిందే తప్ప ఒకదేశసైన్యం మరొకదేశసైన్యంతో జరిపే పోరాటంగా చూడలేదు. ఆస్థాయికి వాళ్ళింకా ఎదగలేదు. అలా ప్రభుత్వం తనరాజకీయ కారణాల దృష్ట్యా తీసుకున్న దుస్సాధ్యమైన నిర్ణయం సైన్యానికి లక్ష్యంగా నిర్దేశించబడింది."

  ReplyDelete
 4. @ లక్ష్మీదేవి: దన్యవాదాలు
  @శ్రీరాం: దన్యవాదాలండి. మీరిచ్చిన లింకులో మంచి సమాచారం ఉంది. వీలైతే మీ ఫేస్బుక్లోగానీ, జీ+లోగానీ శేర్ చెయ్యండి.
  @కృష్ణ: మనం అలా ఆవేశపడీపోవడమే తప్ప అక్కడ ఒరిగేదేమీలేదులే అన్నా

  ReplyDelete