మేరునగ తప్పిదం-6. వైకుంఠపాళి

ప్రకటనలైతే గంభీరంగా ఇచ్చేస్తున్నారుగానీ సరిహద్దులో వాస్తవ పరిస్థితుల్లో ఎలాంటి మార్పూ రావట్లేదు. ప్రభుత్వ కార్యాలయాలు , సైనిక విభాగాలు గందరగోళానికి గురై ఉన్నాయి. సుహృద్బావ వాతవరణంలో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం ఇంకా ప్రయత్నిస్తూనే ఉంది. ప్రభుత్వ ఉత్తర్వుల్లోని డొల్లతనం, ప్రణాళికాలేమి సైన్యాన్ని మరింత సందిగ్ధంలోకి నెట్టేస్తూ వచ్చింది. ఆపద్ధర్మ నియామకాలు, వనరుల నామమాత్రపు పెంపు తప్ప సైనిక వ్యయంపై విధించిన ఆంక్షలను సడలించలేదు. మూడవ పంచవర్షప్రణాళికకు కేటాయించగా మిగిలన నామమాత్రపు నిధులతో రక్షణచర్యలను చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. సైనిక అవసరాలన్నీ పూర్తిగా ప్రభుత్వరంగ ఉత్పత్తుల మీద ఆధారపడాల్సి వచ్చింది. 1960 ఏప్రిల్లో చౌ ఎన్ లై భారత పర్యటనకు వచ్చాడు. సరిహద్దును మరోసారి పర్యవేక్షించి చర్చలు జరిపేందుకు అంగీకరించాడు. తర్వాత పెకింగ్లో జరిగిన చర్చల్లో రేఖవెంబడి ప్రధానంగా థాగ్ల ప్రాంతంలో భారత్ వాదనతో చైనా విబేధించింది.

1960 అక్టోబరులో జే.పీ.దాల్వీకి బ్రిగేడియరుగా పదోన్నతి లభించింది. ఆయన అప్పటికి లఢాఖ్లో బాద్యతలను నిర్వర్తిస్తున్నారు. అక్కడి XV CORPSకి బ్రిగేడియర్ ఇన్ చార్జ్ అడ్మినిస్ట్రేషన్గా నియమించబడ్డారు. అప్పటికే సైన్యాన్ని లఢాఖ్ పంపి సంవత్సరం కావస్తున్నా వాళ్ళకి నిత్యావసరాలు కూడా కరువైనాయి. అగ్గిపెట్టెలు, కిరోసిన్, గోధుమలు వంటి వాటికి కూడా రేషన్ అమలుపరిచే స్థితిలో అక్కడ సైన్యం పనిచేస్తుంది. అప్పటికే బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేశన్ ఏర్పాటు చేసి ఉన్నా, చెప్పుకోదగ్గ ప్రగతి ఏమీకనిపించలేదు. రవాణా పూర్తిగా హెలికాప్టర్ల ద్వారానే నడుస్తోంది. అటు ఎయిర్ ఫోర్స్ వద్ద తగినన్ని విమానాలు, ఇతరపరికరాలు లేవు. సైన్యం విశాలమైన ప్రాంతాల్లో అక్కడక్కడా బెటాలియన్లుగా విడిపోయి పనిచేస్తుండటంతో సరైన వైద్యసదుపాయాలు కల్పిచడం కష్టమైంది. వైద్యం చెయ్యడానికి హెలికాప్టర్లొక్కటే మార్గం. సమయానికి అవి దొరకనప్పుడు, దొరికినా వాతావరణం అనుకూలించనప్పుడు వైద్యం అందక కొందరు జవాన్లు మరణించడం అధికారులను కలచివేసింది. ఈసమయంలో నెహ్రూ "భారత భూభాగాన్ని పరిరక్షించేందుకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకున్నాం. మరో ఒకట్రెండు సంవత్సరాల్లో పర్వతప్రాంతాలన్నింతికీ రోడ్లు, ఇతర సదుపాయాలు సమకూరుస్తాం." అని ప్రకటించాడు.

సైన్యానికి ఉన్న సమయమంతా ఇటుకలు కాల్చడానికి, చెట్లు నరికడానికి, హెలికాప్తర్లు విడిచిన వస్తువులు తీసుకురావడానికే సరిపోయింది. ఇక శిక్షణకు తీరికేది? నిజానికి ఎవ్వరూ వాళ్ళకు ఇవ్వాల్సిన శిక్షణగురించి దిగులుపడలేదు. అసలు యుద్ధం వస్తేకదా అన్నది వాళ్ళ వాదన.

బ్రిగేడియర్ దాల్వీ అక్కడి బాద్యతలు స్వీకరించేసరికే ఆర్మీకి- ఎయిర్ ఫోర్సుకి మద్య సమంవయలోపం పెద్ద సమస్యగా మారింది. ఆర్మీవాళ్ళు ఎయిర్ ఫోర్సును "అత్యధికంగా ఎంత బరువు మీహెలికాప్టర్లు మొయ్యగలవు?" అని అడిగితే "అసలు మీకు ఎంత బరువు మొయ్యాలి? అది చెప్పండి ముందు."  అంటూ వాళ్ళు ఎదురుప్రశ్న వెయ్యసాగారు. వారంలో ఎన్నిరోజులు హెలికాప్టర్లు పనిచేస్తాయో చెప్పలేని స్థితిలో ఎయిర్ ఫోర్సు వాళ్ళు ఉన్నారు. వాళ్లకి ఇక్కడీ వాతావరణ పరిస్థితుల మీద ముందెన్నడూ అవగాహనలేదు. ఆర్మీ- ఎయిర్ ఫోర్సుల మద్య ఒక ఉమ్మడి కార్యాచరణలాంటిదేదీ తయారుచెయ్యకపోవడం, అలానే రెండింటిమద్యా సమన్వయానికి ఉన్నతస్థాయిలో ఎలాంటి చర్యా తీసుకోకపోవడం ఎన్నోసమస్యలకు దారితీసింది. ఇదేసమయంలో మీనన్ ఎయిర్ ఫోర్సును వాళ్ళ సామర్థ్యాన్ని ఎక్కువచేసి చెప్పమంటూ ఒత్తిడి తేవడంతో చేసేదిలేక వాళ్ళు అలానే చెయ్యల్సి వచ్చింది. ఇవేవీ పట్టని ప్రధాన కార్యాలయం సైన్యాన్ని పోస్టులు ఏర్పాటు చేసి కాపలా కాయమంది.

సరుకు రవాణా గురించి లెక్కలువేసిన అధికారులు డిల్లీలో ఒకసమావేశాన్ని ఏర్పాటు చేశారు. దళాల మద్య సమన్వయం పెంపొందించడానికి లెఫ్టినెంట్ జనరల్ ఎల్.పీ.సేన్ నాయకత్వంలో ఈసమావేశం ఏర్పాటు చెయ్యటం జరిగింది. జనరల్ కౌల్ అప్పటికి ఇంకా చీఫ్ కాలేదు. క్వార్టర్ మాస్టర్ జనరల్ (QMG)గా బాద్యతలు నిర్వర్తిస్తున్నారు. సమావేశానికి కొన్నినిముషాలు ఆలస్యంగా వచ్చిన ఆయన కనీసం క్షమాపణ కూడా చెప్పకుండా, తనలాంటి బిజీమనుషులకి ఇవిమామూలే అన్నట్టుగా ప్రవర్తించడం ఆయనగురించి తెలియనివాళ్ళని నిశ్చేష్టుల్ని చేసింది. వచ్చీరావడంతోనే ఇతరుల అభిప్రాయాలను వినకుండా ఒకసంఖ్య చెప్పి, అంతకన్నా సామాగ్రిని రవాణాచెయ్యడం కుదరదని తేల్చి చెప్పేసి, వేరేదో పనుందంటూ వెళ్ళిపోయాడు. ఉన్నతాధికారులను పలకరించటం, సైనిక కార్యకలాపాలను చర్చించటం వంటి సైనిక ఆచారాలేవీ పాటించకుండా తనొక ప్రత్యేకమైన వ్యక్తిని అన్నట్టు ప్రవర్తించడం అధికారులకు మింగుడుపడలేదు. అప్పటివరకు ఆయన గురించి వినడమేగానీ ఎప్పుడూ చూడని దాల్వీవంటి వాళ్ళకి విచిత్రంగా అనిపించింది. జనరల్ సేన్ నిర్ణయంకోసం అందరూ ఎదురుచూస్తుండగా ఆయన కౌల్ నిర్ణయమే ఆఖరిది అన్నట్టు మాట్లాడాడు. దీంతో నిరాశకెందిన జనరల్ వర్మ తమకు ఈవిషయంలో నిర్ధుష్టమైన ఆదేశాలు ఇవ్వాలని కోరాడు. తరువాత కొంతకాలానికి కౌల్ చీఫ్ అయ్యాక అక్కడే మరొక సమావేశం జరిగింది. ఉన్నత స్థాయి రహస్య సమావేశంగా పేర్కొన్నదాంట్లో రక్షణవ్యవహారాలకు, సరిహద్దులో సైనిక చర్యలకు ఎలాంటి సంబంధంలేని ఎవరెవరెవరో ఆహ్వానితులుగా పిలవబడ్డారు! అందులో ఒకాయన హెలికాప్తర్లలో యాత్రికులను లఢాఖ్ వరకు తీసుకువెళ్ళేందుకు కుదురుతుందా అని అడిగాడు!

సమావేశంనుంచి తిరిగొచ్చాక కౌల్ పేర్కొన్న పరిమితిబట్టి లెక్కవేస్తే రవాణా పూర్తిగా నిర్మాణ పనులకే సరిపోయింది. ఇక యుధ్ధసామాగ్రిని ఎలా తీసుకురావాలి? ఈప్రశ్నకు సమాధానం "చైనాతో యుధ్ధంరాదు. కాబట్టి యుధ్ధసామాగ్రి అవసరంలేదు." !! లఢాఖ్ రాజధాని లేహ్ వరకు రహదారి పూర్తవుతున్నా దాన్ని సైనిక అవసరాలకు వినియోగించేందుకు మరిన్ని సదుపాయాలు కల్పించాలి.

నెహ్రూ లోక్ సభలో మాట్లాడుతూ "పరిస్థితులు పూర్తిగా మనకు అనుకూలంగా మారాయి. సైన్యం ఆధీనంలోకి వచ్చిన ప్రాంతాల్లో మన ఆధిపత్యం పూర్తిగా బలపడింది. చైనీయులతో పోరాడేందుకు మనసైన్యం సన్నద్ధంగా ఉంది." అని ప్రకటించాడు. ఈవార్త తెలియడంతోనే జనరల్ వర్మ వాస్తవ పరిస్థితులను తెలియజేస్తూ తన పై అధికారి అయిన పశ్చిమదళ కమాండర్ జనరల్ థాపర్కు ఘాటైన లేఖ రాశాడు. లేఖలోని విషయాలను వెంటనే ఆర్మీ ప్రధానకార్యాలయానికి తెలియజేయమని కోరాడు. జనరల్ థాపర్ వర్మను సముదాయిస్తూ వాస్తవ పరిస్థితులు తమకు తెలుసునని, కేవలం ప్రజాగ్రహం నుంచి ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి నెహ్రూ ఆప్రకటన చేశాడని చెబుతూ లేఖను ఉపసంహరించుకోవాలని సూచించాడు. అయితే వర్మ ఈవిషయంలో చాలామొండిగా వ్యవహరించాడు. తరువాత కొంతకాలానికి ఆయనకన్నా జూనియర్లైన సేన్ మరియు దౌలత్ సింగ్ లకు పదోన్నతి కల్పించడంతో మనస్తాపానికి గురైన వర్మ రాజీనామా చేశాడు. తరువాత ఆయనను ఎన్నో ఇక్కట్లకు గురిచేశారు. కొంతకాలం పెన్షన్ కూడా అందలేదు. కొన్ని తప్పుడు ఆరోపణలు ఆయనమీద చెయ్యడంతో మనస్తాపానికి గురైన ఆయన తన ప్రాణానికంటే ఎక్కువగా ప్రేమించే తల్లిదండ్రులను, ఇంటిని, మాతృభూమిని వదిలిపెట్టి బ్రిటన్లో నివసించసాగాడు.

అయితే ఈఅంశం రక్షణమంత్రి మీనన్ శత్రువులకు ఒక రాజకీయ అస్త్రంగా మారింది తప్ప సైనిక నియామకాల్లోనూ, పదోన్నతి విధానాల్లోనూ మార్పు తేలేకపోయింది. జనరల్ కౌల్ను ఆర్మీచీఫ్గా నియమించడంతో వాదోపవాదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. దీంతో మీనన్ తరపున నెహ్రూ వకాల్తా పుచ్చుకున్నాడు. "జనరల్ కౌల్ అసాధారణ ప్రతిభా పాటవాలు గలిగిన సైనికుడనీ, యుద్ధభూమిలో ఆయన మహాధీరుడ"ని చెప్పుకొచ్చాడు. కానీ సదరు కౌల్ గారికి అప్పటి వరకు ఒక్క యుధ్ధంలోనూ దళానికి సారథ్యం వహించిన దాఖలాలు లేవు. అంబాలాలో సైనికుల గృహనిర్మాణాలు చెయ్యించడమొక్కటే ఆయన అప్పుడు నిర్వహిస్తున్న అతిపెద్ద కార్యక్రమం. పాతికేళ్ళు పదాతిదళంలో పనిచేశాడని నెహ్రూ చెప్పగా జనరల్ తిమ్మయ్యకూడా దానిని ఖండించాడు.

మొదట కొంతకాలం పదాతిదళంలో పనిచేసినా వ్యక్తిగత కారణాలను సాకుగా చూపి దాన్ని వదిలి వేరే శాఖకు బదిలీ చెయ్యించుకున్నాడు. అప్పిటికి ఎక్కడా యుధ్దం చెయ్యనేలేదు. ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత ఆయన డిల్లీలోని ప్రధాని కార్యాలయం వద్దనే పనిచేస్తూ తన పరిచయాలు పెంచుకున్నాడు. స్వతంత్ర్యం వచ్చాక నెహ్రూ ఆయనని వాషింగ్టన్కు భారత సైనిక ప్రతినిథిగా పంపాడు. 1948లో ఐరాస భద్రతాసమితిలో కాశ్మీరు అంశంపై భారత ప్రతినిధిగా పంపాడు. షేక్ అబ్దుల్లాతో బేధాభిప్రాయాలు రావడంతో ఆయన వెనక్కు రావల్సివచ్చింది. ఇక్కడికే ఆయనకి భారత రాజకీయాలు, లాబీపద్దతులు వగైరాలు బాగా తలకెక్కాయి అనుకుంటా. 1953లో షేక్ అబ్దుల్లా కొరకరానికొయ్యగా మారుతుండటంతో ఆయన్ను అరెస్టు చెయ్యడానికి నెహ్రూ కౌల్ను ఉపయోగించుకున్నాడు. యుద్ధతంత్రంతోపాటు కొద్దిగా రాజకీయ చతురత అవసరమైనప్పుడల్లా నెహ్రూ కౌల్ను ఉపయోగించుకోసాగాడు. అంటే ఒకవిధంగా చెప్పాలంటే సత్తా ఉన్న సైనికుణ్ణి నెహ్రూ తన అవసరాలకోసం కలుషితం చేశాడు. కౌల్ తనొక సైనికాధికారి అన్న సంగతి మర్చిపొయ్యి ఆవిషాన్ని వంటపట్టించుకుని, మత్తులో తేలియాడాడు. వీటన్నిటి ప్రభావంతో కౌల్ తన భవిష్యత్తు గురించి భారీగా కలలు కననారంభించాడు. ఇప్పుడు కౌల్ లక్ష్యం సైనికాధ్యక్షుడో, రక్షణమండలి సభ్యత్వమో, రక్షణమంత్రి కావడమో కాదు. నెహ్రూ తర్వాత ప్రధాని కావడమే! అని అనేకులు సందేహం వెలిబుచ్చేలాగా కౌల్ ప్రవర్తన మారిపోయింది.


కిందిస్థాయినుంచే రాజకీయ పరిచయాలు పెంచుకోవడం, అనేక వివాదాస్పద విషయాల్లో నాయకులు ఇతన్ని ఉపయోగించుకోవడంతో కౌల్ సర్వీసులో అధికభాగం చిల్లర విషయాలను పరిష్కరించడానికే సరిపోయింది. దాంతో క్రమంగా అతనిలోని సైనికుడు అంతర్థానమైపోయాడు. ఒక సైన్యాధ్యక్షునిగా అత్యంత అవసరమైన యుద్ధతంత్రాలను రూపొందించే అనుభవం అతనికి ఎప్పుడూ ఎదురవలేదు. అరేళ్లపాటు జరిగిన రెండవ ప్రపంచయుద్ధంలో పాల్గొని తననుతాను నిరూపించుకునే సువర్ణావకాశాన్ని ఉపయోగించుకోలేదు. సర్వీసులో సింహభాగం ఆయన పనిచేసిన శాఖలు సైన్యంలో కీలకం కావు.

ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నత పదవులకు వ్యక్తులను నియమించేటప్పుడు ప్రధాని నిర్ణయం అత్యంత కీలకం. ఇది ఎవరూ కాదనలేనది. ఎక్కడైతే అధికారం ఉందో అక్కడే అంతకు పదింతల బాద్యత ఉంటుంది. రెండుదేశాల మద్య సంబంధాలు కీలకదశకు చేరుకున్నప్పుడు, జాతి గౌరవం అత్యంతముఖ్యమైనప్పుడు సైనికాధ్యక్షుణ్ణి ఎన్నుకునేవ్యక్తికి అది అధికారంలాగాక బాద్యతగా కనిపించాలి. ఎక్కడైనా ఉన్నతస్థాయిలో నియామకాలు, పదోన్నతులు కల్పించేటప్పుడు ప్రతిసారీ సీనియర్లనే ఎన్నుకోవాలి అన్నది కుదిరేపనికాదు. కొన్నిసార్లు జూనియర్లనూ పదవిలో కూర్చోపెట్టాల్సి వస్తుంది. దీనికి ఏసంస్థా, ఏవ్యవస్థా అతీతంకాదు. కానీ అక్కడ నిబద్ధత, సామర్థ్యం తప్ప మరేవీ కొలమానాలుగా ఉండకూడదు. ఉన్నతస్థాయికి చేరడమనే వైకుంఠపాళిలో కొందరికి నిచ్చెనలు మరికొందరికి పాములూ సహజమే. కానీ ఎవ్వరికి ఎప్పుడు నిచ్చెన ఇవ్వాలి, ఎంతపెద్ద నిచ్చెన ఇవ్వాలి, ఒకసారి నిచ్చెన ఇచ్చాక అతను పాముకు బలికాకుండా ముందుకుపోగలడా అన్నది చూసుకోవడం అధినాయత్వపు ప్రధాన లక్షణమై ఉండాలి. కానీ జనరల్ కౌల్ విషయంలో ప్రాధమిక అంశాలుగా దేశభద్రత, జాతిగౌరవంగాక రాజకీయాలు ప్రధానమవ్వడంతో ఆయనకు అందగూడని నిచ్చెనలు అందించారు. చైనా యుద్ధంలో భారత్ చేసిన తప్పులలోకెళ్ళా ఇది ఎవరెస్ట్ శిఖరమంత తప్పు.

భారతదేశంలో చిన్నపిల్లలనుండి కురువృద్ధుల వరకూ నెహ్రూను మహాయోధునిగా చూస్తారు. దైవాంశసంభూతునిగా పూజిస్తారు. గత రెండుమూడు శతాబ్దాల్లో దేశంలో ఏరాజుకీ లభించని ఆదరణ నెహ్రూకి లభించింది. స్వతంత్ర పోరాటంలో తెల్లవాని జిమ్మిక్కులను తన వాదనలతోనూ, దౌత్యపరమైన కార్యక్రమాలతోనూ ఎదుర్కొన్నతీరు ప్రజలను ఉద్వేగానికి గురిచేసింది. దేశగౌరవంకోసం పదేళ్ళపాటు జైళ్ళలో మగ్గిన ఈనాయకుడంటే పడిచచ్చిపోతారు జనం. ఆయన్ను వ్యతిరేకించేవానికి రాజకీయ భవిష్యత్తు ఉండదన్న స్థాయిలో ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పట్టారు. కానీ సంపన్నకుటుంబంలో పుట్టి, విదేశాల్లో చదువుకుని, దొరల జీవనశైలిని అవలంబించటం అతనికీ- సామాన్య ప్రజలకేకాదు, ఆతనికీ- నాయకులకూ, అధికారులకు మద్యనకూడా పొత్తుకుదరలేదు. తన ఆలోచనలను అర్థంచేసుకునే స్థాయికి వీళ్ళు ఇంకా ఎదగలేదని భావించసాగాడు. నెమ్మదిగా మానసికంగా ఒంటరితనం పెరిగిపోయింది. పటేల్ మరణంతో ఇది మరింత పెరిగిందనే చెప్పొచ్చు. నెమ్మదిగా కీలకమైన అంశాల గురించి కొద్దిమందితో మాత్రమే చర్చించి, ఏకపక్షనిర్ణయాలు తీసుకోవడం మొదలుపెట్టాడు. ఇది దేశభద్రతను తీవ్రంగా ప్రభావితం చేయసాగింది.

4 comments:

 1. "...సమంవయలోపం పెద్ద సమస్యగా మారింది...."

  Yes coordination is a very big problem for us. Every organisation thinks itself as a Kingdom of its own and feels unique. We are argumentative Indians and despite our tall claims of rich heritage of respecting one another, we never care for other's opinion in a discussion nay discussion is something we never do but waste our time in arguments only. Mostly our only communication with other is argument.

  At present we can clearly see such lack of coordination between the domain requirements and computerization. We are thinking that we Indians are great in computers . Yes we are great if we take purchase of computers and keeping them on desks and the greatness just stops there. But when it comes to programming required packages, we are so poor that the domain requirements are limited by the capacity (rather incapacity/ignorance) of the programmers and the Packages and Programmes are replicas of those imported. Rarely any package is programmed taking Indian conditions (great population and thereby varied requirements which are unique by themselves and high level of usage) into consideration.

  The ill effects of such lackadaisical computerization is yet to be felt or is not being felt as the new gadget computer is not allowing us to feel it. We have not learnt any lessons from the past. Past was conveniently forgotten. The above comment is not being made about Defence but about the Civilian part of the Country.

  ReplyDelete
 2. ఆర్మీలో రాజకీయాలు చొప్పించిన నెహ్రూ దిగజారుడు తనన్ని చక్కగా ఎండగట్టారు. ఆ తండ్రి కూతురే ఇందిర, అవే రాజకీయాలు, గాంధీ బ్రాండ్ తస్కరించిన కుటిల నైపుణ్యం.
  ---
  శివరామ ప్రసాద్ గారు, 'సమన్వయలోపం' అనే జనరల్ పదాన్ని పట్టుకుని, కంప్యూటర్ డొమైన్ ప్రాబ్లంస్ మీద ఇంగ్లీషులో దారి మళ్ళించినట్టుంది. :D

  ReplyDelete
 3. సమన్వయ లోపం అన్నది సాధారణ విషయాల్లోనూ, ఇతర రంగాల్లోనూ ఒప్పుకున్నంత తేలికగా సైన్యంలో ఒప్పుకోలేం. వాళ్ళకి దళాల మద్యన సమన్వయం, సమాచార వ్యవస్థ, క్రమశిక్షణ అనేవి చాలాకీలకమైనవి. సంవత్సరాల తరబడి శిక్షణనిస్తారు. సాధారణ పౌరుల వృత్తుల్లో ఇవి చిన్నచిన్నవి. కానీ సైన్యం ఇవే కీలకం.

  ReplyDelete
 4. Yes Sir I agree. But today in our civilian life this lack of coordination has surpassed critical stage and its ill effects will bring us down as a Nation.

  My point was that we might have learnt a lesson or two from the 1962 fiasco. But in the larger perspective of nation, we are now suffering from the lack of coordination in almost all fields. This is to be first recognised as such and there itself, alas! ostrich is taken as an idol.

  ReplyDelete