మేరునగ తప్పిదం- 14.పద్మవ్యూహం

సరిహద్దు గందరగోళానికి గురై ఉండగా జనరల్ కౌల్ డీల్లీనుంచి ఎలాంటి ఆదేశాలు పంపలేదు. దళాలు రక్షణ చర్యలలో భాగంగా బంకర్లు నిర్మించడం మొదలుపెట్టాయి. కానీ అందుకు సరిపడా సామాగ్రి లేకపోవడం వారిని ఇబ్బంది పెట్టింది. కౌల్ వెళ్తూ వెళ్తూ అప్పగించిన "ప్రస్తుత స్థానాలను యధాతథంగా కొనసాగించడి." అన్న బాద్యతకు అనుగుణంగా 4మైళ్ళ పొడవున విస్తరించి ఉన్న ప్రధానప్రాంతంతో బాటు 10మైళ్ళ పొడవున విస్తరించి ఉన్న మిగతాప్రాంతాలను కాపాడటం అప్పటి బలానికి చాలాపెద్ద లక్ష్యం.

అక్టోబరు 12న లెఫ్టినెంట్ కల్నల్ హరిహర్ సింగ్ సారధ్యంలోని 4గ్రెనేడర్ బలగాలు ఒక్కొక్కటిగా సరిహద్దుకు చేరుకోవడం ప్రారంభించాయి. మిగతా దళాల మాదిరిగానే వీళ్ళుకూడా ఉన్నపళంగా మైదానాలు విడచి ఇక్కడకు రావడంతో విపరీతంగా అలసిపోయి ఉన్నారు. అంతేకాక కొత్తవాతావరణానికి అలవాటు పడటానికి సమయం పడుతుంది. వీరి రాకతో మొత్తం బలం 2500కు చేరుకుంది. అక్టోబరు 16కు బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ వారి పోర్టర్లు 450మంది సమకూరారు. సంఖ్యపెరిగిపోవడంతో సరకులనిల్వలు 2రోజులకు పడిపోయింది.

అక్టోబరు 11న డిల్లీ చేరుకున్న కౌల్, ఉన్నతస్థాయి సామావేశంలో పాల్గొన్నాడు. అన్నిరకాలుగా చైనీయులు మనకన్నా మెరుగైన స్థానంలో ఉన్నారని చెప్పాడు. అక్కడ చైనీయులను ఎదుర్కోవడం అసాధ్యమని, ధోలానుంచి బలగాలను ఉపసంహరించాలని వాళ్లకు నివేదించాడు. వారికి మూడు ప్రత్యామ్నాయలను ప్రతిపాదించాడు. ఒకటి- సరిహద్దులో బలాన్ని పెంచుకుని చైనాపై దాడి చెయ్యడం. రెండు- దాడి చెయ్యకుండా యదాతథ స్థానాలలో కొనసాగించడం. మూడు- ప్రస్తుత స్థానలకన్నా మెరుగైన ప్రాంతాలకు బలగాలను పంపడం. నిజానికి ప్రస్తుత పరిస్థితుల్లో మూడవది, అంటే అక్కడ్నుంచి బలగాలను వేరేచోటకు పంపడం, తప్ప వేరేవేవీ కుదిరేవి కావు. కానీ మూడింటినీ చెప్పడం కౌల్ చేసిన ఘోరతప్పిదం. దాడి చేసేంత బలం మనకు లేదన్నది సుస్పష్టం. బలమైన శత్రువుకు ఎదురుగా, ఎలాంటి రహస్య కార్యకలాపాలనూ కొనసాగించలేని చోట బలగాలను ఉంచి ఏమిలాభం? వాళ్ళకు రక్షణ ఎలా? రాజకీయ కోణంలోంచి చూస్తే బలగాలను అక్కడే కొనసాగించడ మొక్కటే సరియైనది. అలా చేస్తేనే ప్రభుత్వం ప్రజలకు, పార్టీ ప్రతిపక్షానికి జవాబు చెప్పగలదు. కాబట్టి యదాతథ స్థానాలను కొనసాగించమని ఉత్తర్వులు జారీచేసింది. సైన్యం తనకుతానుగా ఇచ్చిన ప్రత్యామ్నాయలలో ఇది ఉంది కాబట్టే వాళ్ళు దాన్ని ఎంచుకున్నారు.

13న నెహ్రూ కొలంబో బయలుదేరుతూ చైనీయులను తరిమికొట్టమని ప్రభుత్వం సైన్యాన్ని ఆదేశించిందని పత్రికలకు చెప్పాడు. ఇది చైనీయుల గుండెలు భగ్గుమనేలా చేసింది. రేడియోలో ఈవార్తలను విన్న సరిహద్దుదళాలు గందరగోళానికి గురైయ్యాయి. ఎట్టకేలకు కౌల్ నుంచి ఆదేశాలు అందాయి. వాటిననుసరించి- దళాలు యదాతథ స్థితిని కొనసాగించాలి. కానీ అందుకు అవసరమైన అదనపు వనరులు, ప్రణాళిక, పాలనావిషయాలేవీ చర్చించలేదు. అంతకుమునుపు వచ్చిన ఉత్తర్వుల్లానే ఇదికూడా ఒక నినాదంగా మిగిలిపోయింది.

మరోవైపు చైనా నెహ్రూ ప్రకటనను సాకుగా చూపించి, భారీ యెత్తున సన్నాహాలు మొదలుపెట్టింది. కొరియాయుద్దంలో నాయకత్వం వహించిన వ్యక్తికి దీనిబాద్యతలు అప్పగించింది. దళాలన్నీ చురుగ్గా పనులు చెయ్యడం మొదలుపెట్టారు. వారి కదలికలను గమనించడానికి భారతసైన్యం 25 అబ్జర్వేషన్ పోస్టులను నెలకొల్పింది. సరిహద్దుకు అవతల మనలను లక్ష్యంగా చేసుకుని చైనా చేపడుతున్న యుద్దసన్నాహాలను మూగగా చూస్తూ ఉండటం కన్నా భారత జవాను చెయ్యగలిగింది ఏమీలేదు! అరకొర సదుపాయాలు, పనిముట్లతో దాడిసంగతి దేముడెరుగు కనీసం ఆత్మరక్షణకు కూడా ఏర్పాట్లు సరిపోవు. ఆసమయంలో నాలుగు తుపాకులను పంపగా, అందులో రెండు హెలికాప్టర్లు జారవిడిచేటప్పుడు ముక్కలయ్యాయి. మనదగ్గరున్న అతిపెద్ద ఆయుధం సామర్థ్యం చైనీయుల సంచార ఆయుధాల సామర్థ్యంకన్నా తక్కువ. పర్వత ప్రాంతం కావడంతో వాటి పరిమితి మరింతగా పెరిగిపోయింది.

మరొకవైపు వైద్యసదుపాయాలు యుద్దావసరాలకు ఏమాత్రం సరిపోవు. పంజాబీదళం ఎలాంటి వైద్యసదుపాయం లేకుండానే పోరాడుతోంది. ఉన్నపళంగా సైన్యాన్ని సరిహద్దుకు పంపడంతో దానికనుగుణంగా వైద్యశిబిరాలను ఏర్పాటు చెయ్యటం గందరగోళానికి గురైంది. మొదట లుంపులో నెలకొల్పాల్సిన శిబిరాన్ని కౌల్ ఆదేశాలతో సరిహద్దుకు మార్చాల్సి వచ్చింది. ఇన్ని సమస్యల్లోనూ వైద్యబృందం అహర్నిశలూ కృషిచేసి రోజుకు నలభైమందికి వైద్యాన్నిచ్చింది. కేసుల్లో సింహభాగం చలినుంచి సరైన రక్షణలేకపోవడంవల్ల, అలవాటులేని పర్వతప్రాంతంలో ఉండవలసినందువల్ల ఏర్పడినవే. రోగులను తరలించడం తలకుమించిన భారమైంది. రోగులను ఎనిమిదిగంటలపాటు మోసుకుంటూ పర్వతాలను దాటి ఆసుపత్రిలో చేర్చాలి. తిరుగుప్రయాణంలో అక్కడినుంచి సామాగ్రి మోసుకురావాలి.

ఇలాంటి ప్రతికూల సమయాల్లోనూ కెప్టెన్ బీ.బీ.కూలే సారధ్యంలోని వైద్యబృందం రోజుకు 40మందికి పైగా రోగుల్ని చూసేవారు. అందులో కనీసం పదిమంది పరిస్థితి అపాయకరంగా ఉండేది. ఎయిర్ ఫోర్సుకు చెందిన స్కాడ్రన్ లీడర్ విలియమ్స్ ధైర్యసాహసాలతో విమానాన్ని నడిపి రోగులను ప్రధాన కేంద్రానికి చేర్చేవాడు. తెల్లవారుఝామున మొదలైన విమానం పొద్దుగూకే వరకూ తిరుగుతూనే ఉండేది. ఒకరోజు 23 రౌండ్లు తిరిగిన ఈయన సాహసాన్ని గౌరవిస్తూ, వైద్యబృందం యుద్దవీరుల అవార్డుకు ఈయన్ని నామినేట్ చేసి గౌరవించింది. మద్యలో జనరల్ కౌల్ ఉత్తర్వులు వీరిని కొంత అసహనానికి గురిచేశాయి. వైద్యుల సలహాను తీసుకోకుండానే ఆయన ఒకబృందాన్ని సరిహద్దుకు పక్కనే ఏర్పాటు చెయ్యమన్నాడు. దాడిజరిగితే అది ధ్వంసమయ్యే ప్రమాదాన్ని ఆయన గమనించలేదు. అలానే ఇంకొక బృందాన్ని ఎత్తైన ప్రాంతంలో ఏర్పాటు చెయ్యగా ఆక్సిజన్ వసతులు లేకుండా 9000అడుగులకన్నా ఎత్తులో ఆపరేషన్ చెయ్యడం కుదరని కారణంగా దాన్ని విరమించుకున్నారు. విసుగెత్తిన మేజర్ జయరామన్ తన పైఅధికారి కల్నల్ మైత్రాకు పిర్యాదు చేశాడు. ఆయన తనబృందానికే మద్దతునివ్వడంతో వాళ్ళు ఊపిరిపీల్చుకున్నారు.

ఇక వస్తురవాణా పరిస్థితి నానాటికీ తీసుకట్టుగా తయారవసాగింది. ఒకవైపు అవసరాలు పెరిగిపోతుండగా, మరొకవైపు వస్తువులను జారవిడిచేందుకు ఎన్నుకున్న ప్రాంతం ఇరుకైనది కావటాన మూడోవంతు మాత్రమే సైన్యానికి అందసాగింది. మిగతాది అక్కడినుంచి దొర్లి లోయల్లో పడిపోతున్నాయి. అలానే సామాగ్రిని నిల్వచేయను చాలినంత గోదాములూ లేవు. సైన్యానికి అవసరమైన సామాగ్రి ఏమిటీ? వాటి ప్రాధాన్యతా క్రమం ఏమిటీ? అవసరానికి తగినట్టు అందుతున్నాయా? పదాతిదళానికీ వాయుసేనకు మద్య సమాచారం సరిగా అందుతుందా? వంటి కీలకమైన ప్రశ్నలకు జవాబిచ్చే స్థితిలో సైనికాధికారులు లేరు.

ఇక సమాచార వ్యవస్థ- 4డివిజను సిగ్నల్ రెజిమెంట్ వాళ్ళు ఒక టెలిఫోన్ లైనును ఏర్పాటు చేశారు. అది కాస్తా సాధారన యుద్ధనియమాలకు విరుద్ధంగా సరిహద్దుకు సమాంతరంగా, చెనీయుల వాకిట్లో ఏర్పాటుచేస్తారు. సరిహద్దు- ప్రధానకేంద్రం మద్యన సమాచాఅం శత్రువు దయాదాక్షిణ్యాలమీద ఆధారపడినట్లైంది. ఆప్రాంతానికి లైను వెయ్యాలంటే అంతకన్నా వేరేమార్గం లేదు. అలాంటి ప్రాంతాన్ని ఎంచుకున్నాం కాబట్టి అనుభవించక తప్పదు. మనవ్యవస్థలు, సదుపాయాలు అన్నీ శత్రువు కళ్లకెదురుగానే ఉంచాం. దాంతో సైనిక సన్నాహాల్లో కీలకమైన గుట్టు ఇక్కడ రట్టైంది.

ఇన్ని సమస్యల మద్యలో, జనరల్ కౌల్ పానకంలో పుడకలాగా పైనుంచి ఊడిపడ్డాడు. మొత్తం అధికారక్రమంలో ఆయన స్థానమేంటి అన్నది అందరికీ అస్పష్టమే. దాంతో ఆయన తనతోపాటు కొందరు ఉద్యోగులను తనవెంట తీసుకొచ్చి,  వాళ్ళందరికీ తలో హోదా కల్పించి ఖాళీల్లో ఇరికించాడు. ఖాళీలు లేకుంటే సృష్టించాడు. వీళ్లందరికీ పని ఇవ్వాలు. ఫర్నీచర్ ఇవ్వాలి. ఇతర సదుపాయాలు కల్పించాలి. అదొక వింతసమస్య!

ఇంత జరుగుతున్నా మనప్రభుత్వం సైనికులతో చదరంగం ఆడటం ఆపట్లేదు. అన్నివైపులనుంచీ విమర్శలు తారాస్థాయికి చేరుకుంటూ ఉండటంతో దీనికి జవాబిచ్చేలా ఏదైనా చెయ్యాలని ప్రభుత్వం యోచించింది. సాంగ్లే అనే ప్రాంతం ఆయాచితవరంగా మననాయకులకు లభించింది. ఇది భూటాన్ మూలన ఉంటుంది. నమ్కాచు నది అవతల ఉండటంతో ఇది చైనా భూభాగమవుతుంది. అక్కడకు మనసైనికులను పంపి ఆప్రాంతాన్ని మన ఆధీనంలో ఉండేలా చేస్తే అందరికీ జవాబివ్వొచ్చు అని భవైంచింది. అయితే అక్కడకు సైన్యాన్ని పంపడంలో గల పరిమితులను, వస్తురవాణాలోని ఇబ్బందులను, సైన్యం ఆత్మరక్షణకు గల ఇబ్బందులను పట్టించుకోలేదు. ఒకవైపు ఇప్పుడు కాపలాకాస్తున్న ప్రాంతమే తలకుమించిన భారమయింది. ఇక ఈకొత్తప్రాంతాన్ని కూడా కాపలాకాయాలంటే అస్సలు కుదిరేపనే కాదు. ఒకవేళ దాన్ని కాయాలంటే ఇక్కడ కొంతబరువును తగ్గించుకోవాలి. ఇంతా చేసి అక్కడకు వెళ్ళినందువల్ల ఏమైనా ప్రయోజనమా అఁటే అదీలేదు. అక్కడికెళ్ళడే పెద్దతలనొప్పి. సరైన దారిలేదు. మద్యలో ఉన్న పర్వతశిఖరం మంచుతో కప్పబడి, దాటడానికి దుస్సాధ్యంగా ఉంటుంది. రానున్న శీతాకాలంలో పరిస్థితి మరింత విషమిస్తుంది. అక్కడికెళ్ళెవాళ్లకి తప్పనిసరిగా చలికాలపి దుస్తులు ఇవ్వాలి. ఎక్కడి నుంచి వస్తాయి? ఏముంది. అప్పటికే వాటిని వాడుతున్న పంజాబీదళం నుంచి తీసుకుని సరఫరా చెయ్యాల్సి వచ్చింది. ఇది ఎంత దారుణమైన సంఘటన? కనీసం నోరుమెదపని జవానుకు మనం ఏమిస్తే ఋణం తీర్చుకోగలం? సైనికాధుకారులు ఎంత మొత్తుకున్నా మీనన్ ముందు చెవిటివాడి చెవిలో శంఖం పూరించిన చందమే. మరొకవైపు నెహ్రూ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఇస్తున్న ప్రకటనలు చైనీయులను మరింత రెచ్చగొట్ట సాగాయి.

అక్టోబరు 16న జనరల్ ప్రసాద్ ఫోన్లో కలిశాడు. పైవాళ్లను ఒప్పించలేక పోయానని, నవంబరు 1కల్లా చైనీయులను తరిమికొట్టాలన్నది రక్షణమంత్రి ఆదేశమని చెప్పాడు. దీంతో దాల్వీకి అరికాలిమంట నడినెత్తికెక్కింది. అది కుదిరేపని కాదన్నది ఇద్దరి అభిప్రాయం కాబట్టి పైవాళ్లకు దాన్ని తెలియజేయమన్నాడు. ఈపరిస్థితుల్లో రాజీనామా ఇవ్వడమొక్కటే దారి. అయినా పై అధికారులెవరూ ఆయనతో విబేధించట్లేదు. ఆయన అభిప్రాయాన్ని జనరల్ కౌల్ సహా అందరూ ఒప్పుకున్నారు. కానీ రాజకీయ అవసరాలు అన్నింటికన్నా ఎక్కువ ప్రధానమయ్యాయి. దాంతో ఎవరికీ ప్రత్యామ్నాయం లేకుండా పోయింది.

అక్టోబరు 17న ఎట్టిపరిస్థితుల్లోనూ నమ్కాచులో సైన్యాన్ని ఉంచే ప్రశ్నేలేదు. వెంటనే వెనక్కి పిలిపించమని దాల్వీ ప్రసాదును కోరాడు. పైవాళ్లకు తెలియజేస్తానన్ని చెప్పడం మినహా ఆయన చేసిందేమీ లేదు. అక్టోబరు 18నాటికి చైనా సన్నాహాలు వేగంగా జరుగుతున్నాయి. ఆరాత్రి కొందరు చైనీయులు భారత భూభాగంలోకి చొరబడ్డారని గ్రెనేడర్ దళం వారు పిర్యాదు చేశారు. వారిమార్గాన్ని అడ్డుకునేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. సిగ్నల్ కమాండర్ కే.కే.తివారి సమాచార వ్యవస్థను తనిఖీ చెయ్యడానికి వచ్చాడు. త్వరలోనే దళాలను ఇక్కడినుంచి ఉపసంహరించుకోవచ్చు అని తెలియజేశాడు. ఎలాంటి ఆధునిక పరికరాలూ లేకుండానే ఈయన సిగ్నల్స్ నిర్వహణను సమర్థవంతంగా నిర్వహించాడు. తమ సామర్థ్యానికి మించిన కార్యక్రమాలనూ ఎలాంటి విసుగూ ప్రదర్శించకుండా నిర్వహించాడు.

అక్టోబరు 19కల్లా భారత సైన్యం పూర్తిగా చైనీయుల పద్మవ్యూహంలో చిక్కుకుపోయింది. వారి కదలికలను చూసినవారు ఎవరైనా పెద్దదాడికి సిద్దమవుతున్నారని సులువుగా గ్రహించగలరు. ఈసమయంలో జనరల్ ప్రసాద్ ఫోన్ చేసి మిగిలిన గూర్ఖాలను సాంగ్లేకు పంపమని చెప్పాడు. ఈసమయంలో దళాలను అక్కడకు పంపితే మార్గమద్యంలోనే చైనీయులు హతమార్చే ప్రమాదం ఉందని ఆయనకు చెప్పాడు. అడ్డమైన రాజకీయాలకు యుద్దభూమి వేదికగా నిలిచింది. ఎవరెవరో చేసిన పాపాలను కడుక్కునేందుకు సైన్యాన్ని బలిపశువుగా నివేదిస్తున్నారు. నోటిమాటలతో విసిగిపోయానని  ఇకపై ఏఉత్తర్వులనైనా రాతపూర్వకంగా ఇస్తేనే చేస్తానని ఖచ్చితంగా చెప్పాడు. ఇప్పటికే చైనీయులు యుద్దానికి సిద్దమైపోయారని, వాళ్లదాడిని నిలువరించాలంటే వీలైనంత తక్కువ ప్రాంతంలో బలగాలను మోహరించాలని చెప్పాడు. ప్రస్తుతం బలగాలు సన్నగా 10మైళ్ళ దూరంలో విస్తరి6చి ఉన్నాయని, దాడిని నిలువరించే శక్తి వాటికి లేదని చెప్పాడు.

అప్పుడు ప్రసాద్ తీరిగ్గా ఒక నిజాన్ని బయటపెట్టాడు. హిమాలయ వాతావరణం పడక జనరల్ కౌల్ అస్వస్థతకు గురయ్యాడు! దానివల్లే దళాలకు తాజా ఉత్తర్వులేవీ అందట్లేదు. కౌల్ బాద్యతలు నిర్వర్తించలేని సమయంలో జనరల్ ప్రసాద్ ఇన్ చార్జ్ అవుతాడు. కానీ ఆబాద్యత తీసుకునేందుకు ఆయన సిద్దంగా లేడు. అంతేగాక ఇన్నేళ్ళుగా ఆయన పని అటు ప్రధాన కార్యాలయానికీ ఇటు సరిహద్దుకీ మద్యన పోస్టుమాన్ పాత్ర పోషిస్తూ వచ్చాడు. కిందవాళ్ళ నివేదిక పైవాళ్ళకు చేరవేయడం. పైవాళ్ళ ఆదేశాలు కిందకు పంపడం మినహా ఆయన చేసిందేమీలేదు. సర్వీసు ప్రకారం సీనియర్. అలాగని నిర్ణయాలు తీసుకునేంత సీనియర్ కాదు. కిందవాళ్ళతో కలవగలిగినంత జూనియరూ కాదు. ఆయన పరిస్థితి ఇటు ఉట్టికీ అటు స్వర్గానికీ కాకుండా ఉంది. ఆయన నిర్లిప్త ధోరణికి చికాకుపడ్డ దాల్వీ ఫోన్లో కొంచెంఘాటుగానే విమర్శించాడు.సైనికుల పరిస్థితి ఏమిటో తెలిసినందువల్ల ఆయన దాల్వీ మాటలతో ఏకీభవిస్తూ, అవసరమైతే తానూ యుద్దభూమికి వచ్చి సైనికులతోనే ఉంటానని చెప్పాడు.

ఒకవైపు శత్రువు సన్నాహాలు వాయువేగంతో పూర్తవుతుండగా, మనం మాత్రం సైనికుణ్ణి బలిపశువును చేసి, రాజకీయాల్లో మునిగి తేలుతున్నాం. వాటి ఫలితంగా మనసైన్యం శత్రువు పద్మవ్యూహంలో చిక్కుకుంది.

11 comments:

  1. మేరునగ అంటే ఏమిటండి? వేరుశెనగ అనా?

    ReplyDelete
  2. ఎంత వింత ప్రశ్న! మేరునగ అంటే వేరుశనగ అని అడగటం.

    అయితే అడిగిన వారిని ఆక్షేపించటం లేదు. పాఠశాలల్లో గత కొన్ని దశబ్దాలుగా తెలుగు భాషాబోధన యెంత దుర్భరస్థితిలో ఉన్నదో ఈ ప్రశ్నవలన అవగతమై చాలా విచారం కలిగింది.

    మేరువు అనేది ఒక పర్వతం పేరు. ఇది ఊహాజనితమైన పర్వతం. దీని చుట్టు సూర్యచంద్రులు పరిభ్రమిస్తూ‌ఉంటారని పురాణప్రసిధ్ధి. అన్నట్లు నగము అంటే సంస్కృతంలో కొండ అని అర్థం. అందుచేత మేరు నగం అన్న దానికి మేరువు అనే పర్వతం అని అర్థం.
    ఇక్కడ శీర్షికలో మేరునగ తప్పిదం అంటే, మేరు పర్వతం అంత పెద్ద తప్పు అని అర్థం.

    అయ్యా అదీ‌ సంగతి.

    ఇక పోతే, బ్లాగు రచయితగారికి అబినందనలు. మంచి చారిత్రకవిషయం పైన చక్కని అవగాహన కలిగిస్తున్నారు.

    ReplyDelete
  3. అయ్యా, మేరు టాక్సీ వుంది, మేరు పర్వతం కూడా వుందని ఓపిగ్గా చెప్పినందుకు. తప్పు మాది కాదు పాఠశాలది, అయ్యోర్లది, విద్యామంత్రిది చెప్పారు, థాంక్స్.

    ReplyDelete
  4. మేరువు అంటే ఊహాజనిత పర్వతమా?

    మహా మేరు అంటే భుమద్యం(core) నుండి వెళ్ళే రేఖ లాంటిది అని గుర్తు? కాదంటే చెప్పగలరు.

    సంకల్పం లో చెప్పినట్టు (మేరొ దక్షిణ దిఘ్భాగే ..) ..ఈ మేరు అనేది 'axis of the earth' ani edo satsangam lo vinnanu.

    ReplyDelete
  5. మేరుపర్వతం అన్నది ఊహాజనితం కాదు. అది భూమద్య రేఖకు దగ్గరగా భారతదేశాన్ని రెండుగా విభజిస్తూ ఉండే మహాపర్వతం. దాని శిఖరం బంగారువర్ణంతో ధగధగలాడేది. హిమాలయాలు తపోభూమిగా ప్రసిద్దికెక్కితే ఇది కూడా తన ఉనికిని చాటుకోవడానికి పెరగడం ప్రారంభించింది. దాంతో ఉత్తరభారతానికి సూర్యరశ్మి లేక ప్రజలు అవస్థలు పడసాగారు. భూమి తన స్థిరత్వాన్ని కోల్పోసాగింది. ఈఆపదనుంచి గట్టెంక్కిచ్చేందుకు అగస్త్య మహాముని ముందుకొచ్చాడు. తాను రామేశ్వరుని దర్శించుకోవాలని, అందుకు మేరు అడ్డుగా నిలిచిందని చెప్పి, తాను తిరిగి వచ్చే వరకు కిందకు తగ్గమని అడీగాడూ. ఆయన తపోబలం ఎంతటిదో తెలిసిన మేరుపర్వతం కిందకు దిగింది. అలా అగస్త్యుడు దక్షిణాదికి వచ్చాడు. ఇక్కడే స్థిరపడి, ఈఅరణ్యాలలో కొత్త నాగరికతను ప్రారంభించాడు. అదే ద్రవిడ నాగరికత. ఇప్పటికీ తమిళులు ద్రవిడజాతి ఆద్యునిగా అగస్త్యుని పూజిస్తారు. ప్రజలకు కష్టమొచ్చిన ప్రతిసారీ ముందుండి నడీపించిన ఈయన ప్రాతః స్మరణీయుడు.

    ReplyDelete
  6. భూమధ్య రేఖ శ్రీలంకకు కనీసం 500 కిలో మీటర్ల దిగువన వుందండి. కావాలంటే మ్యాప్ చూసుకోండి. భూమధ్య రేఖ వూహాజనితం అంటే నే చెప్పలేను.

    ReplyDelete
  7. క్షమించాలి. పొరబడ్డాను. అది భూమద్యరేఖ కాదు. కర్కటరేఖ. సరిచేసినందుకు ధన్యవాదాలు.

    ReplyDelete
  8. http://www.sushmajee.com/hindupuraan/3vishnu/2-dwiteeya/2-jamboo.htm

    మళ్ళీ పొరబడి కర్కటరేఖ అంటున్నారు. మీరు వింధ్య పర్వతాలను మేరువు అనుకుంటున్నారనిపిస్తోంది.

    ReplyDelete
  9. కాదండీ. మేరువు వేరు. వింధ్య పర్వతాలు వేరు. మేరువు ఇప్పుడు లేదు. వింధ్య- సాత్పూర పర్వతాల మద్య అది ఉండేది. ఆభాగం ఇప్పుడు పీఠభూమిగా ఉన్నది. అగస్త్యుడు మేరువును తగ్గమని చెప్పక ముందు అవి దుర్భేద్యంగా ఉండేవి. మీరు ఇచ్చిన లింకులో మంచి సమాచారమున్నది. కానీ నేను చదివిన కొన్నివిషయాలు అక్కడి వాటితో పొసగట్లేదు. ఏదొ కరక్టో చూడాలి.

    ReplyDelete
  10. అన్నట్టు అన్ననిమస్ గారు: మీరు అనానిమస్గా గాక, గూగుల్లోకి వచ్చి రాయొచ్చుగా. కనీసం మీపేరైన పెడితే బావుంటుంది కదండి. మేరువుగురించి అనుమానం వచ్చినప్పుడు అడిగే పద్దతి ఒకటుంటుంది కదా. వేరు శనగ కాయాలా అంటూ ప్రేలాపనలు ఎందుకు చెప్పండి. ఆవెతికేదేదొ గూగుల్లో ముందే వెతుక్కోవచ్చుగా. ఇతరుల ప్రైవసీని గౌరవించండి. మిమ్మల్ని గౌరవిస్తూ నాబ్లాగులో కామెంట్ మోడరేషన్ పెట్టలేదు. అనానిమస్లకూ అనుమతి నిచ్చాను. కనీస మర్యాద పాటించండి

    ReplyDelete
  11. అన్నానిమస్ రాయడం నా కిష్టం, మీ అనుమతి తీసుకోవాలా? అనానిమస్లంటే ఇష్టం లేనపుడు ఆప్షన్ మూసుకోవచ్చు. ఇందులో మీ ప్రైవసీకొచ్చిన ఇబ్బంది ఏమిటో అర్థం కాలేదు. భూమధ్యరెఖకు కర్కట రేఖకు తేడా తెలియక ఇబ్బంది పడుతుంటే చూసి వెతికి అ లింకు ఇచ్చాను, అదేదో మీ పంచె లాగినట్టు ప్రైవసీ పోయిందంటారేమిటి? భలేవారండి, పబ్లిక్‌గా బ్లాగుదుకాణం తెరచి ప్రైవసీ అంటారేమిటండి? కొత్త బ్లాగుగాడు పొద్దెరగడు అన్నట్టు ఈ ప్రేలాపనలు మీవా ఆ అజ్ఞాతవా?

    ReplyDelete