మేరునగ తప్పిదం- 10.శత్రువు వాకిలి

సెప్టెంబరు 11, అస్సాంరైఫిల్స్, పంజాబ్ దళాలు ధోలాకి వెళ్తూ ఉన్నారు. తేజ్పూర్లో దాల్వీ, ఇతర సైనికులూ రోజంతా తమ వైర్లెస్ సెట్లలోంచి మాట్లాడి సమాచారం సంపాదించను ప్రయత్నించినా వృధాప్రయాసే అయ్యింది. పురావస్తు శాఖకు అప్పగించాల్సిన సామాగ్రిని సైన్యానికిచ్చి యుధ్దంలో వాడమంటే ఇలాగే జరుగుతుంది. బృందాలు ఎక్కడూన్నాయో? వారి పరిస్థితి ఏమిటో? తెలియక అందరినీ ఉత్కంఠతకు గురిచేసింది. బృందాలు గమ్యానికి చేరుకునేలోగా అక్కడ వారికవసరమైన ఏర్పాట్లు చెయ్యడంలో అందరూ తలమునకలయ్యారు. ధోలానుంచి మరిన్ని ప్రమాదసంకేతాలు వస్తుండటం వారిని మరింత ఆందోళనకు గురిచేసింది.

రక్షణమంత్రి కార్యాలయంలో జరిగిన సమావేశానికి జనరల్ సేన్ హాజరయ్యాడు. 600మంది చైనీయులు ధోలాప్రాంతంలో సంచరిస్తున్నారనీ, వాళ్లను ఎదుర్కోవాల్సిందిగా బ్రిగేడ్ను ఆదేశించామనీ, అందుకు వాళ్ళకి 10రోజులు పడుతుందనీ నివేదించాడు. అయితే సరిహద్దులో 600మంది మాత్రమే ఉన్నారనీ అక్కడివాళ్ళెవరూ సేన్కు చెప్పలేదు. వెనకాల మరెంతమంది చైనీయులు ఉన్నారో? వాళ్ల దగ్గరున్న ఆయుధాలెలాంటివో? ఎవరికీ తెలియదు. కిందివారినెవరినీ సంప్రదించకుండా సేన్ నివేదించిన సమాచారం ప్రాధమిక యుద్ధనియమాలకు విరుద్ధం. సైన్యంలో పైవాళ్ళు ఏది చెబితే అదే శాసనం అని అందరం అనుకుంటూ ఉంటాం. కానీ ఎవరైనా కిందవాళ్ళకి ఆదేశాలు జారీచేసేదానికి ముందు వారి నుంచి వాస్తవపరిస్థితి గురించి సమాచారం తీసుకుంటారు. కిందవాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకే వాళ్ళకి ఆదేశాలు జారీచేస్తారు. అప్పుడే వాటిని అమలుచెయ్యగలమని విశ్వసిస్తారు. ఒకవేళ అక్కడున్నది 600మందే అనుకున్నా అరకొర వనరులతో నెట్టుకొస్తున్న దళం వారిని ఎలా ఎదుర్కోగలదు. దళానికి సారధ్యం వహిస్తున్న అధికారి అక్కడకు చేరుకోక ముందే, వారినుంచి వాస్తవ పరిస్థితి గురించి సమాచారం రాకుండానే, సాధ్యాసాధ్యాలను వారితో చర్చింకుండానే జనరల్ సేన్ డిల్లీలో వాగ్దానం చేసేశాడు. ఇది విపరీతాలకు దారితీసింది.

9పంజాబు దళం ఒకవైపు ఋతుపవనాలు కొనసాగుతున్నప్పటికీ అంత ఎత్తులో ప్రయాణిస్తూ చాలావేగంగా గమ్యానికి చేరుకున్నారు. మరోవైపు అస్సాం రైఫిల్స్ ధోలాపోస్టుతో అనుసంధానాన్ని ఏర్పరచుకున్నారు. వీరు నమ్కాచుకు దగ్గరగా ఉండటమేకాక అక్కడి స్థానిక అంశాలపై అవగాహన ఉన్నవాళ్ళు. అయితే ఈదళం రక్షణశాఖ కిందకు రాదు. దాంతో అది గమ్యానికి చేరుకునేంత వరకు సైన్యాన్ని విమర్శించినవాళ్ళకు చేరుకున్నాక మాత్రం అది విదేశాంగశాఖహు చెందిందని గుర్తొచ్చింది. మద్యలో పంజాబుదళంమీద అవాకులు చెవాకులు పేలడంతో సైన్యం సహనం కోల్పోయింది. కానీ అత్యుత్తమ దళాల్లో ఒకటైన దానిగురించి చేసిన విమర్శలను అందరూ వ్యతిరేకించడంతో మిన్నకుండిపోయారు.

సెప్టెంబరు 13న దాల్వీ తేజ్పూరు నుంచి లుంపుకు బయల్దేరడానికి హెలీపాడ్కు వచ్చాడు. అనుకోని సాంకేతిక కారణాలవల్ల పైలట్ ప్రయాణానికి అభ్యంతరం చెప్పాడు. ఆదారి తనకు కొత్తదవడంవల్ల సాహసం చెయ్యలేనని, మరుసటిరోజు వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. ఈసమాచారాన్ని తవాంగ్ కార్యాలయానికి అందజేశాడు. తొవాంగ్ సెక్టారుకు ఇన్ చార్జిగా బ్రిగేడియర్ కళ్యాణ్ సింగును పంపారు. అయితే అతని బద్యతలేమిటన్నది సరిగా నిర్వచించలేదు! డివిజినల్ మెచీన్ గన్ కమాండర్ను పర్వతపాదాలనుంచి తొవాంగ్ వరకు మార్గానికి ఇన్ చార్జీగీ నియమించారు. అంటే దాదాపుగా 300మైళ్ళ దూరంలోగల అనేక కీలకప్రాంతాలను కాపాడి, చైనీయులతో పోరాడే బాద్యత ఒక్క 4INDIAN DIVISION మీద పెట్టారు. దానికి సరిపడా దళాలుగానీ, వనరులుగానీ, సేవావిభాగాలుగానీ, వ్యవస్థలుగానీ లేవు. ఎక్కడెక్కడి నుంచో కొన్నిగుంపులను, మరికొంతమంది అధికారులను తీసుకొచ్చి దీన్నొక కలగూరగంపగా చేశారు. పేరు మాత్రం 4INDIAN DIVISION! దీనివల్ల అత్యుత్తమదళాల్లో ఒకటిగా ప్రపంచం గుర్తించిన ఒకభారతీయదళం అపకీర్తిని మూటగట్టుకోవాల్సి వచ్చింది. సైన్యంలో దళం అంటే దానికొక సనిర్వచిత కార్యక్రమం ఉంటుంది. దానికనుగుణంగా అందొలో కొన్ని జట్లను ఏర్పాటుచేసుకొని, ప్రతిదానికి నిర్ధిష్టమైన పాత్రను ఇస్తారు. దానికనుగుణంగానే అవి ఏళ్ళతరబడి శిక్షణ తీసుకుంటూ రాటుదేలుతాయి. అందువల్లనే సైన్యం బలాలను సైనికులసంఖ్యతోకాక అందులోని దళాలు, వాటి శక్తిసామర్థ్యాలను బట్టి బేరీజు వేస్తారు. వాటికి సమర్థత, పరస్పర విశ్వాసం, సమిష్టిభావం వచ్చాకనే యుధ్దరంగంలో లక్ష్యాలను చేదించగలవు. కానీ ఇక్కడున్న నానాజాతిగుంపు పోరాటంలో గెలవాలంటే ఇదేమీ రాజకీయ వేదికకాదు. ఇక్కడ జరుగుతున్నది సిద్ధాంతాకోసమో లేక రెండువర్గాలు అధిపత్యంకోసమో జరుగుతున్న పోరాటంకాదు. గణతంత్రరాజ్యాలుగా తమనుతాము ప్రకటంచుకున్న రెండుదేశాలమద్య.

అప్పటికే వాస్తవ పరిస్థితుల మీద అవగాహన ఉన్న జనరల్ ఉమ్రావ్ సైన్యానికి నిర్దేశించిన లక్ష్యం అసాధ్యమని తేల్చి చెప్పాడు. వీటిని విపూలికరిస్తూ జనరల్ సేన్కు ఉత్తరం రాశాడు. సాయంత్రం 5.30కు జనరల్ ప్రసాద్ ఫోన్ చేసి ఉన్నపళంగా తొవాంగుకు బయలుదేరమన్నాడు. ప్రయాణానికి కలిగిన అవాంతరాలను చెప్పబోగా వారించి వెంటనే బయలుదేరమని, ప్రస్తుతానికి ఇంతకన్నా ఏమీ అడగొద్దని చెప్పసాగాడు. అలాగే 9పంజాబు లుంపులో ఆగకుండా నమ్కాచు వరకూ పంపమని ఆదేశాలు వెలువడ్దాయి. బహుశా పంజాబీలను చూపించి చైనీయులను భయపెడదామనుకున్నారేమో! ప్రారంభంలో తీసుకున్న ఇలాంటి నిర్ణయాలకు భారీగా మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. సైన్యంలోని వివిధస్థాయిలమద్య, విభాగాలమద్య సమంవయం దెబ్బతిన్నది.

పైవారి ఆదేశాలను అనుసరించి బయలుదేరాల్సి రావటంతో అక్కడకు చేరుకునే వరకు అవసరమైన కీలక ఆదేశాలను సరిహద్దుకు జారీచేసి, అవసరమైన పోర్టర్లను తీసుకుని మరుసటిరోజు తెల్లవారుఝామున ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. ఇంటెలిజెన్స్ అధికారి కెప్టన్ టీ.కే.గుప్తా తప్ప మిగతా అధికారులెవరూ లేకుండా, సంచార వైర్లెస్ సామాగ్రిని మోసేందుకు పోర్టర్లను వెంటపెట్టుకుని ప్రయాణం సాగించాడు. విపరీతమైన వర్షాల కారణంగా 15గజాలకన్నా ఎక్కువ దూరం కనబడటంలేదు. చీకటిపడే సమయానికి 22మైళ్ళు ప్రయాణించి లుమ్లా చేరుకున్నారు. దారంతా పంజాబ్ దళంతో మాట్లాడేందుకు ప్రయత్నించినా కుదర్లేదు. మరుసటిరోజు మరొక 18మైళ్ళు ప్రయాణించాక శక్తి వచ్చింది. తరువాత రోజు అంటే సెప్టేంబరు 16న లుంపుకు చేరుకున్నారు. విమానాలనుంచి జారవిడిచిన వస్తువుల సేకరించటం, వాటిని గమ్యానికి చేర్చటం, ఇక్కడి అవసరాలను పైవారికి తెలియపరచటం, తొవాంగుతో వైర్లెస్ సమాచారాలు జరపడం ఇక్కడి దళాల విధులు. కానీ సహజంగా ఇవేవీ పదాతిదళాల బాద్యతలు కావు. వాటికి పత్యేకమైన విభాగాలుంటాయి. కానీ ఇక్కడ పదాతిదళం యుద్ధం చెయ్యటమేగాక వాటికవసరమైన ఇతర పనులుకూడా వాళ్ళే చేసుకుంటూన్నారు.

సెప్టెంబరు 13, 14 తేదీలలో డిల్లీలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశాలు గందరగోళానికి వేదికల్య్యాయి. మొదట చైనీయుల సంఖ్య 60కి మించదని అంచనావేస్తూ కొన్నిదుందుడుకు నిర్ణయాలు తీసుకోగా, మెల్లమెల్లగా వాస్తవస్థితి తెలిసొచ్చాక వెనక్కి తగ్గనారంభించారు. అయితే ఈసమావేశాలలో ప్రధానిగానీ, విదేశాంగమంత్రిగానీ, సైన్యాధ్యక్షుడుగానీ, ఆర్థికమంత్రిగానీ హాజరవలేదు. ఇంతమంది లేకుండానే ఆదేశాలు ఎలా వెలువడ్దాయన్నది అర్థంగాని ప్రశ్న. కానీ ఏసందర్భంలోనూ శత్రువుల బలాన్ని, కదలికలను సరిగ్గా అంచనా వెయ్యలేక పోయ్యారన్నది చేదునిజం.

లుంపుకు చేరుకునే సరికే విపరీతంగా అలసిపోవటంతో ఒకరోజు అక్కడ అలసట తీర్చుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆసమయంలో తొవాంగులోని అధికారులతో మాట్లాడే అవకాశం కలిగింది. ఇంకొక రెండు బెటాలియన్లను మైదానాలనుంచి పంపుతున్నట్టు తెలిసింది. అలాగే GOC వీలైనంత త్వరలో ఆప్రాంతాన్ని సందర్శించి, తదనంత కార్యక్రమాలను గురించి చర్చిస్తానని చెప్పగా, దానికి దాల్వీ మరికొంతకాలం ఆగమన్నాడు. ఆకాశంలోంచి జారవిడుస్తున్న సామాగ్రిలో మూడోవంతు పారాచూట్లు తెరుచుకోక వృధా అయిపోతున్నాయి. అప్పటికే వాడివాడి చిరుగులుపడిన వాటినే వాడుతూ ఉండటతో ఈపరిస్థితి తలెత్తింది. అలానే పంపుతున్న వస్తువులన్నీ భారీవి కావడంతో లోయల్లోంచి తీసుకెళ్ళడం శక్తికి మించిన పనైంది. హిమాలయాలకు అనుగుణంగా ఎలాంటి ప్రణాళికలూ మనదగ్గరలేవని దీనిద్వారా స్పష్టంగా తెలుస్తుంది.

సెప్టెంబరు 18 ఉదయాన్నే లుంపు నుంచి బయల్దేరారు. 15మైళ్ళ దూరంలో థాగ్ల వచ్చింది. పర్వతవాలుపై మోకాటిలోతు అడుసులో కాళ్ళీడ్చుకుంటూ ముందుకు పోసాగారు. ముందుకువెళ్ళే కొద్దీ వాలు ఇంకాపెరిగుతోంది. అడుసులో ప్రయాణం చాలాకష్టమైంది. హథూంగ్లా కనుమ 13400అడుగుల ఎత్తులో ఉంటుంది. దీనికే ఇలా ఉంటే మరి 16500అడుగుల ఎత్తులో ఉన్న కర్పోలా కనుమ మాటేంటి. అది మనకు అత్యవసర పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ మార్గం! దళాలు గమ్యం చేరుకోవడంలో ఎందుకాలశ్యమైందంటూ ప్రశ్నించిన వారిచేతిలో ఒకమ్యాపుతప్ప మరే సమాచారమూ లేదు. రాత్రికి సెర్ఖిమ్లో బసచేసి 19 ఉదయాన్నే బయలుదేరి హథూంగ్లా కనుమ దగ్గర బ్రిడ్జి 1 మరియు 2లను చేరుకున్నారు.

బ్రిడ్జి 1 దగ్గర కల్నల్ మిశ్రాను ఎదురొచ్చాడు. దాదాపు ఐదురోజుల తర్వాత కమాండర్ తనదళాన్ని కలిశాడు. మద్యలో ఎలాంటి సమాచారమూ లేదు. 1"=4మైళ్ళు స్కేలుమీద ఉజ్జాయింపుగా గీసిన మ్యాపును ఆధారంగా చేసుకుని చర్చించడం మొదలుపెట్టారు. ముందుగా ఈమ్యాపు గురించి- ఇప్పటి దాకా రాజధానినుంచి తొవాంగువరకు అన్నిస్థాయిల్లోనూ చర్చలకు ఒకేఒక ఆధారం ఈమ్యాపు. పోనీ అదేమైనా క్షుణ్నంగా సర్వేచెయ్యించి గీశారా? అంటే అదీలేదు. బ్రిటిషుకాలంనాటి ఒక అధికారిని సర్వే చెయ్యమని పంపారు. భూటానులోని తనప్రియురాలితో సమయంగడపడానికి ఆయన ఈప్రాంతంలో సర్వే ఎగ్గొట్టేశాడు. నమ్కాచు వైపు రాకుండానే, వేరేమార్గంలో వెళుతూ అక్కడ ఒకనది దక్షిణవాహినిగా ఉండటంతో నమ్కాచును కూడా అలానే చూపించాడు. నిజానికి అది పడమర నుంచి తూర్పుకు వెళ్తుంది. అస్సాం రైఫిల్స్ మొదటిసారి ఇక్కడికి వచ్చినప్పుడు ఒకతను తను వచ్చినదారిని ఉజ్జాయింపుగా చూపెడుతూ ఒకమ్యాపు గీశాడు. ఇందులో ఒకచివర నుంచి మొదలెట్టాక మరొకచివరకు చేరేసరికే మార్గం పూర్తికాలేదు. దాంతో పక్కపక్కనే చూపిస్తూ ఇరికించుకుంటూ గీశాడు. దాన్ని ప్రాతిపదికగా తీసుకుని పైవాళ్ళు లెక్కలుకట్టసాగారు. రెండుమైళ్ళుగా చూపెట్టిన ప్రాంతాలు చేరుకోవడానికి రెండురోజులు పట్టింది! సైనిక కార్యక్రమాల్లో కాలం-దూరం-వేగం ఎంతకీలకమో ప్రతి ఒక్కరికీ తెలిసిందే అయినా ఎవరికీ ఈప్రాధమిక విషయాలను పట్టించుకోలేదు. 

సెప్టెంబరు 15న పంజాబుదళం ఇక్కడికి చేరుకునేసరికే నదికి అవతలిగట్టున చైనాసైన్యం ఉంది. అటువైపునుంచి ఒక పౌరసేవాధికారి హిందీలో మాట్లాడుతూ "ఇది చైనా భూభాగం. భారత్ చైనాలమద్య అవిభాజ్య స్నేహం ఉంది.చిన్నచిన్న విషయాల కారణంగా అది చెడిపోకూడదు. మేము సరిహద్దుకు  కాపలాను మాత్రమే పెట్టాం. మీరు సైన్యాన్ని ఎందుకు దించితున్నారు?" అని అడిగాడు. మిశ్రాకు పైనుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం- ఆత్మరక్షణార్థమే కాల్పులు జరపాలి. ఖాళీచెయ్యడానికి ఒప్పుకోకపోతే వాళ్ళముందు రాస్తారోకోలు, రిలేనిరాహారదీక్షలు చేపట్టొచ్చు. ఇంతకన్నా వేరేదారిలేదు కాబట్టి, వంతెనల దగ్గరా దారికి కాపుకాస్తున్నారు. కొంతమందిని త్సాంగధర్కు పంపారు. ఇక్కడ మొత్తం నాలుగు బ్రిడ్జిలున్నాయి.మూడవ బ్రిడ్జి వద్ద ధోలాపోస్టు ఉంది. చైనీయులు వారినేమీ చెయ్యకపోయినా మద్యాహ్నానికి మూడవ బ్రిడ్జి కూల్చేశారు. బ్రిడ్జి అంటే అదేదో హౌరా బ్రిడ్జి అనుకునేరు. అంతలేదు. నాలుగు దుంగలను పక్కపక్కన పెట్టి తాళ్లతో కట్టేసి నదిమీద ఉంచారు. అదొక 24 అడుగుల వెడల్పున్న నది! రక్షణపరంగా అక్కడ బలగాలను ఉంచాల్సిన అవసరంలేదు. అయినా పైవాళ్ళ ఆదేశం.దీంతో ప్రభుత్వం సైన్యం మీద ఉంచిన మొదటిదశ పూర్తయ్యింది. ఈప్రాంతం సైనిక సరిహద్దుగా మారింది. పంజాబీలు 9మైళ్ల దూరంలో పలుచగా, పెద్దగా వనరులూ, పరస్పర సమాచారమూ లేకుండా పరుచుకున్నారు.

అక్కడి నుంచి రెండవ బ్రిడ్జికి వెళ్లారు. అక్కడ చైనీయులు కాపలా ఉన్నారు. వారు అత్యాధునిక ఆటోమేటిక్ తుపాకులు, చలికి ప్రత్యేకమైన బట్టలు ధరించి సరిహద్దు కాపలాదారులుగా పిలవబడుతున్నారు! వాస్తవానికి విరుద్ధంగా భారత సైన్యాధికారులు చైనా యుద్ధసామాగ్రి, నైపుణ్యాన్ని తక్కువగా అంచనావేస్తున్నారు. దానికనుగుణంగానే లెక్కలుకట్టి, ప్రకటనలిస్తున్నారు. అంతవరకు గైడుగా తమనతోకూడా వచ్చిన పశువులకాపరి చైనీయులకి దాల్వీరాకను చేరవేశాడు. మనవద్దమాత్రం ఎలాంటి సమాచారమూలేదు. ఇదేవ్యక్తి అంతకుముందు జనరల్ కౌల్ వచ్చినప్పుడూ తోడు తీసుకెళ్ళారు! అక్కడ సుబేదార్ ప్రతాప్ సింగ్ ఎదురయ్యాడు. ఇతను కొద్దిరోజుల ముందు మిసిమారి రైల్వేస్టేషన్లో మీరఠ్ బండి ఎక్కడానికి ఎదురుచూస్తున్నాడు. 28ఏళ్ళు సైన్యంలో సేవలందించాక రిటైరయ్యి పెన్షన్ మీద వెళ్తున్నాడు. అక్కడున్నప్పుడు యుద్ధానికి పిలుపొచ్చేసరికే వెనక్కు తిరిగి ఇన్నిమైళ్ళూ నడుచుకుంటూ యుద్ధభూమికి చేరుకున్నాడు. ఇంటికెందుకు వెళ్ళలేదు అన్నప్రశ్నకు "సాబ్! బెటాలియన్కు ఇంత అవసరమొచ్చినప్పుడా నేను ఇంటికెళ్ళేది?" అని ఎదురు ప్రశ్న వేశాడు. దానికి మనప్రభుత్వం దగ్గర జవాబుందా? ఆదేశభక్తుడు యుద్ధభూమిలోనే వీరమరణం పొందాడు. మరొక పోస్టు దగ్గర చాలాకాలంనుంచి పంచదారలేక ఉప్పును కలుపుకొని టీ తాగుతున్నారు. ఉత్తరాదివాళ్ళైనా వరి అన్నాన్నే తింటూన్నారు. రోటీపిండి లేదా? అని అడిగితే "దానికి పెనం తెచ్చుకోవాలి సాబ్. దానిబదులు వేరేదైనా సామాగ్రి మొయ్యొచ్చుకదా అని అన్నం తెచ్చుకున్నాం." అని బదులిచ్చారు. ఎక్కడా ఒక్కపిర్యాదులేదు. ఒక్క పితూరీలేదు. అందరి లక్ష్యం ఒక్కటే. మూడురంగుల ఝెండా పరువు కాపాడటమే. పంజాబీల దేశభక్తికి హిమాలయాలే సరైన ఉపమానం. ఇక్కడ ఇలా ఉంటే రాజధానిలో ఒక అధికారి "చైనీయులను సరిహద్దునుంచి తరిమివెయ్యమని సైన్యాన్ని ఆదేశించాం." అని ప్రకటన ఇచ్చాడు.

అక్కడి నుంచి మూడవ బ్రిడ్జికి చేరుకోని ఒకరోజు పట్టింది. ఇక్కడ మేజర్ చౌదరీని కలిశాడు. చైనీయుల దాడి గురించి సమాచారం అందించింది ఇతనే. ఇక్కడితో మొత్తం ప్రాంతం తిరిగినట్లైంది. మొత్తానికి ధోలాప్రాంతం సైనికచర్యలకు పూర్తిగా ప్రతికూలమన్న సంగతి అర్థమైంది. హథూంగ్లా, కర్పోలా కనుమలను ఒకబెటాలియన్ ఎట్టిపరిస్థితుల్లోనూ రక్షించలేదు. అక్కడ దళాల మద్య పరస్పర సహకారం, సమాచార మార్పిడి కష్టం. దాడుల సమయంలో కదలికలకు ఏమాత్రం అనువుగా లేదు. సన్నాహాల గోప్యత అస్సలు కుదిరేదికాదు. అయినా రాజకీయ కారణాలవల్ల అది ప్రతిష్టాత్మకమై కూర్చుంది. సైనికుడు ప్రాణాన్ని పణంగా పెట్టడంకన్నా చెయ్యగలిగింది ఏమీలేదు.

5 comments:

 1. "...సాబ్! బెటాలియన్కు ఇంత అవసరమొచ్చినప్పుడా నేను ఇంటికెళ్ళేది?" అని ఎదురు ప్రశ్న వేశాడు. దానికి మనప్రభుత్వం దగ్గర జవాబుందా? ఆదేశభక్తుడు యుద్ధభూమిలోనే వీరమరణం పొందాడు...."

  Whether the Clerks in the Government had recognised the sacrifice of this great Soldier Subedar Prathap Singh. Please verify and write the human angle of Shri Prathap Singh.

  ReplyDelete
 2. your writing is too good! Very gripping translation.

  ReplyDelete
 3. అక్కడ సుబేదార్ ప్రతాప్ సింగ్ ఎదురయ్యాడు. ఇతను కొద్దిరోజుల ముందు మిసిమారి రైల్వేస్టేషన్లో మీరఠ్ బండి ఎక్కడానికి ఎదురుచూస్తున్నాడు. 28ఏళ్ళు సైన్యంలో సేవలందించాక రిటైరయ్యి పెన్షన్ మీద వెళ్తున్నాడు. అక్కడున్నప్పుడు యుద్ధానికి పిలుపొచ్చేసరికే వెనక్కు తిరిగి ఇన్నిమైళ్ళూ నడుచుకుంటూ యుద్ధభూమికి చేరుకున్నాడు.
  ------------------------
  హ్మ్ ! ఇది చదివాక మాటలు లేవండి . Salute to సుబేదార్ ప్రతాప్ సింగ్!
  బాగా రాస్తున్నారు అండి !

  ReplyDelete
 4. @శివరామప్రసాదు: వెతికాను కానీ ఆయన గురించి సమాచారమేమీ దొరకలేదు
  కృష్ణ పాలకొల్లు: థాంక్సన్నోయ్
  శ్రావ్య వట్టికూటి: థాంక్సో

  ReplyDelete
 5. I too tried but in vain. This is unfortunate position in our Country-the real Patriots are not recognised at all.

  ReplyDelete