ఒక ఆలోచన

కొంతకాలం క్రితం ఒక ఆలోచన నామనస్సులో మెదిలింది. అన్నిఊర్లలాగే మాఊర్లోనూ జనాలకి శతక పద్యాలు కంఠోపాఠంగా ఉండేవి. అన్ని ఊర్లలాగే మావాళ్ళకీ గత దశాబ్ధకాలంగా అవి మరుపుకు వస్తున్నాయి. వారిలో నేనూ ఒకడిని. నేను స్కూల్లో చదువుకునేటప్పుడు మాతాతయ్యే దానికి హెడ్మాస్టరు. రోజూ సాయంత్రం ఒకపద్యాన్ని తీసుకుని, వివరంగా చెప్పేవాడు. తర్వాతరోజు పిల్లలంతా వాటిని అప్పజెప్పాకే మరొక పద్యానికి వెళ్ళేవాడు. కానీ ఇప్పుడు అలాంటివి ఊహించడమే కష్టం. ఒకరోజు చిన్నప్పుడు బాగా గుర్తున్న ఒకట్రెండు పద్యాలు మనసులో చెప్పుకుంటే సగం తర్వాత తడబడ్డాను. ఎక్కడో తేడాగా అనిపించింది. అప్పుడు ఉన్నది ఉత్తరప్రదేశ్లో. ఉన్నఫళంగా ఒకపుస్తకాన్ని కొనుక్కుని చదువుదామన్నా కుదిరేదికాదు. నెట్ కనెక్షన్ ఇబ్బంది పెట్టి 3,4 రోజులు ఆన్లైన్ మార్గాలుకూడా తెరుచుకోలేదు. నాలాంటి పరిస్థితుల్లోనే చాలామంది ఉన్నారేమోనని ఆరోజు నాకు అనిపించింది. మరి దీనికి పరిష్కారం ఏమిటా అని ఆలోచించాను. మనసుకి ఒక అలోచన వచ్చింది. ఊరికెళ్తే ఆపని చెయ్యాలని అనుకున్నాను.

ఆ ఆలోచనకి ఈరోజు రూపం ఇచ్చాను. ఉదయాన్నే నెల్లూరు వెళ్ళి ఓ పదిహేను సుమతి శతకాలు, పదిహేను వేమన శతకాలు, డజను కాళకస్తీశ్వర శతకాలు పట్టుకొచ్చాను. వాటిని రేపు శివాలయంలో పెట్టేస్తా. ఊరిజనాలు అక్కడ ఎప్పుడూ తిరుగుతూ ఉంటారు. వరండాలో స్టూలు మీద  భజనపాటలు, సద్గురువుల పారాయణ గ్రంధాలవంటి కొన్ని పుస్తకాలు అక్కడ ఎప్పుడూ ఉంటాయి. వాటితో పాటు ఇవీ పెట్టెస్తాను. ఇష్టం ఉన్నవాళ్ళు చదువుతారు. ఖచ్చితంగా జనాలకి ఇష్టం పెరుగుతుంది. అదే శతకాల్లో ఉన్న గొప్పతనం. ఒకసారి పేజీలు తిరగేసినవాళ్ళకి మరిచిపోయిన కొన్ని పద్యాలు గుర్తుకు రావచ్చు. శతకాలు తెలియని పిలకాయలకి ఎవరైనా వివరించి చెప్పొచ్చు. చెప్పేవాళ్ళు ఎవరూలేకపోయినా ఇబ్బంది కలగకుండా టీకాతాత్పర్య సహితంగా ఉన్నవి పట్టుకొచ్చాను. దూరవిద్యల యుగంలో మనమద్యన ఏకలవ్యులు చాలామందే ఉన్నారు. వాళ్ళు మాశివుడి ముందు కూర్చుని రోజూ చదువుకోవచ్చు. ఆయన భోళాశంకరుడే కాబట్టి బొటనవేలడుగుతాడని భయం లేదు. హాయిగా చదువుకుని, నలుగురితో పంచుకుంటే వృద్ధాశ్రమాలకు వెళ్ళిపోయిన శతకకారులు మళ్ళీమన మద్యకు వచ్చి ఇంటిపెద్దలవుతారు. మంచీ చెడ్దా నేర్పుతారు.


వీలైతే మీరూ ఆపని చెయ్యండి. ఒక్కొక్కటీ 10-15 రూపాయల్లో దొరుకుతుంది. పది పుస్తకాలు తీసుకెళ్ళి మీఊరి గుడి దగ్గరో, చెట్టుకిందో, టీకొట్టు దగ్గరో, అంగళ్ళ దగ్గరో నలుగురు మనుషులు కలిసే ఏచోటైనా పెట్టండి. ఎవడైనా వాటిని ఎత్తుకు పోయినా పర్లేదు. వాడినుంచి ఎవరో ఒకడికి అందుతుంది. వాటిపేజీలు చించేసి శనగలు పోసిచ్చినా పర్లేదు. దాన్ని విప్పి ఎవడో ఒకడు చదువుకుంటాడు. కనీసం రెండు పద్యాలు అతనికి గుర్తురావచ్చు. తెలియని వాడైతే నేర్చుకోనూవచ్చు. వాటివల్ల ఆసక్తి కలిగి మరిన్ని శతకాలూ, పద్యాలూ, తెలుగు భాషా నేర్చుకోనూవచ్చు. అందులో ఉన్నవి నిత్యసత్యాలు. ఒకభాషకో, మతానికో, కులానికో, వృత్తికో చెందినవి కావు. పౌరునిగా మనకు కనీస బాద్యతను తెలిపేవి. . సంస్కృతంలో బర్తృహరి సుభాషితాలు, తమిళంలో తిరుక్కురళ్ లాగా అన్నిభాషల్లోనూ ఇలాంటివి ఉన్నాయి.

ఇవన్నీ నాలోని అశావాదికి కలిగిన ఆలోచనలు. ఆశావాదిగా మనంవేసే ఒక్క అడుగు కేవలం భాషనేకాక ఎన్నో సమకాలీన అంశాలను ప్రభావితం చెయ్యనూవచ్చు. ఒకవేళ ఎవరికైనా ఇప్పటికే ఈఆలోచన వచ్చి మొదలుపెట్టి ఉంటే చాలాసంతోషం.

10 comments:

 1. మంచి ఆలోచన అబ్బాయ్
  శుభమ్

  ReplyDelete
 2. వావ్....గుడ్ ఐడియా!

  ReplyDelete
 3. బాగుందండీ ఆలోచన.

  ReplyDelete
 4. మీ ఆలోచనకు గట్టిగా చప్పట్లు.

  ReplyDelete
 5. వావ్.. వాట్ యన్ ఐడియా సర్ జీ! మీ ఐడియా చాలా బావుంది..

  ReplyDelete
 6. superb idea
  hi
  We started our new youtube channel : Garam chai . Please subscribe and support
  https://www.youtube.com/channel/UCBkBuxHWPeV9C-DjAslHrIg

  ReplyDelete
 7. బాగా చెప్పారు సార్ ...!!!

  చాలా బాగున్నాయ్ పోస్టులు ... !!!!

  తెలుగు వారి కోసం నూతనం గా యూ ట్యూబ్ ఛానల్ ప్రారంభించబడింది
  చూసి ఆశీర్వదించండి

  https://www.youtube.com/garamchai

  ReplyDelete