మేరునగ తప్పిదం- 15. డ్రాగన్ బుసకొట్టింది


హఠాత్తుగా జనరల్ కౌల్ అస్వస్థతకు గురవ్వడం భారత శిబిరాలను ఆందోళనకు గురిచేసింది. చొరవ తీసుకుని ఆదేశాలు ఇవ్వగల వ్యక్తి ఎవరూ సైన్యానికి లేరు. జరుగుతున్నది సాంప్రదాయక యుద్ధమైతే అతని స్థానంలో జనరల్ ప్రసాద్ బాద్యతలు తీసుకోవాలి. యుద్ధభూమిలో నాయకుడు మరణించడం, లేదా తీవ్రంగా గాయపడి సార్ధ్యం వహించలేక పోవడం, నాయకునికి మిగిలిన బృందాలకు సంబంధాలు తెగిపోవడం అన్నది చరిత్రలో ఎన్నోసార్లు జరిగింది. ఆపద్ధర్మ నాయకునిగా ఎవరుండాలి అన్నది సైన్యం యుద్ధానికి ముందే చర్చించాలి. అధికార రహస్యాలు, యుద్ధవ్యూహాల పట్ల అతనికి పూర్తి అవగాహన ఉండాలి. యుద్దం అంటే ఏమైనా జరగొచ్చు. కానీ ఇక్కడ అలాంటి ఏర్పాట్లేవీ లేవు. నిజానికి రాజకీయ నాయకులు, సైన్యంలోని వారి అనుయూయులు తప్ప మరెవరూ సరిహద్దు వ్యవహారాల పట్ల ఆసక్తితో లేరు. ఇక వీళ్ళేమో అసలు యుద్దమే రాదన్న ఆలోచనలతో వ్యూహాలు పన్నుతున్నారు. ఈపరిస్థితిల్లో చైనా అనుకోని దెబ్బ తీసింది. సరిగ్గా ఆతర్వాతే జనరల్ కౌల్ అనారోగ్యానికి గురవ్వటం అనేక విమర్శలకు తావిచ్చింది. ప్రతిపక్షాలకు, పత్రికలకు, విమర్శకులకు, మేధావి వర్గానికి, రక్షణరంగ నిపుణూలకు, అంతర్జాతీయ వ్యవహారాల పరిశీలకులకు, అన్నిటికన్నా మిన్నగా నెహ్రూ ప్రత్యర్థులకు ఇదొక ఆయుధమైంది. దురదృష్తవశాత్తూ వీరికెవరికీ వాళ్ళ చేష్టలు సైన్యం నైతికస్థైర్యాన్ని, ప్రజల స్వాభిమానాన్ని ఎంతగా ప్రభావితం చేస్తాయో స్పురించట్లేదు. ఒకవేళ స్పురించినా వారివారి అవసరాలు ఈవిషయాలను వెనక్కి నెట్టేశాయి.

ఇక్కడ వ్యవహారాలు కేవలం సైనిక చర్యలకే పరిమితం కాకుండా రాజకీయ అవసరాలు తోడవ్వడంతో ఎవరూ ఈ బాద్యతను భుజానికి వేసుకోను ముందుకురాలేదనే చెప్పాలి. ఓడిపోతున్న గుర్రం మీద ఎవరు పందెం కాస్తారు? ఈపరిస్థితుల్లో అనవసర వివాదాల్లో ఇరుక్కుంటామని అందరూ గుట్టుగా ఉండిపోయారు. ఈపరిస్థితుల్లో అక్టోబరు 19న, రాజపుత్రుల దళం నాయకుడు లెఫ్టినెంట్ కల్నల్ రిఖ్ దాల్వీని కలిశాడు. చైనీయుల బలం, వాటి కదలికలను విపులంగా చర్చించాడు. తన ప్రాంతంలో గస్తీని పెంచినట్టు తెలియజేశాడు. చివరగా " సార్! మీరు దిగులు పడొద్దు. వారి బలం ఎంతున్నా సరే, రాజపుత్రులం సరిహద్దులో ఉన్నంత సేపూ దేశాన్ని తలదించుకోనివ్వం. మా తుదిశ్వాస విడిచే వరకూ శత్రువుకు ఈభూమిమీద నిలబడే అవకాశం ఇవ్వం. ఒకవేళ మీరు వెనక్కి వెళితే, మనల్ని ఇలా మద్యలో వదిలేసి, దేశం పరువుతో రాజకీయాలు చేస్తున్న వారిని విడిచిపెట్టనని మాటివ్వండి చాలు." అని వెళ్ళిపోయాడు. ఇంకొందరు వచ్చి, "అందరూ తలోదారి చూసుకుని వెళ్ళిపోతుంటే ఇక్కడున్న అధికారులకు మాత్రం ఏందుకు ఈతలనెప్పులన్నీ? మీరు రాజీనామా ఇచ్చేసి వెళ్ళిపోండి." అని తమ అధికారులకు సలహా ఇచ్చారు. కానీ ఈ పరిస్థితుల్లో సహచరులను వదిలి ఎలా వెళ్ళగలమని అందరూ పోరాడడానికే నిశ్చయించుకున్నారు.

ఇక సరిహద్దులో బలగాల పరిస్థితి చూస్తే, 12మైళ్ల దూరంలో సన్నగా విస్తరించి ఉంది. ఈ చివరి నుంచి ఆ చివరకు వెళ్ళడానికి కనీసం 5రోజులు పడుతుంది. అందరికీ కలిపి 2 పారాఫీల్డ్ తుపాకులు, 4 మోర్టార్లు, అరకొర మందుగుండు. ఆత్మరక్షణకు కనీసం కంచెకూడా లేదు! ఇక బంకర్ల సంగతి సరేసరి. యుద్ధశాస్త్రంలోని ప్రాధమిక నియమాలను పాటిస్తూ ఒక్క సదుపాయంగానీ, ఒక్క వ్యూహంగానీ, ఒక్క ఆదేశంగానీ లేదు. కౌల్ రాకతో గందరగోళానికి గురైన అధికార క్రమం తాజా పరిణామాలతో పూర్తిగా కుప్పకూలింది.
1962 అక్టోబరు 20 తెల్లవారుఝామున 5గంటలకు, మూడవ బ్రిడ్జి వద్ద ఉన్న చైనీయులు ఉన్నపళంగా భారతదళాలపై దాడి చేశాయి. కొన్ని అడుగుల దూరంలోనే ఇరుపక్షాల దాడి-ప్రతిదాడులతో హిమాలయాలు ఉలిక్కిపడ్దాయి. భారతదేశ విదేశీ, రక్షణ, ఆర్థిక వ్యవహారాల డొల్లతనానికి సాక్షులుగా నిలిచాయి. ఆ సమయంలో భారత సైన్యంలో మొత్తం 4లక్షల మంది పనిచేస్తున్నారు. కానీ శత్రువుతో పోరాడడానికి 600మంది మాత్రమే ఉన్నారు. వీరికి అతి దగ్గరలో ఉన్నదళం 1000మైళ్ళ దూరంలో ఉంది.
చైనా దళాలు వ్యూహాత్మకంగా ముందుకువెళుతూ మొత్తం ప్రాంతాన్ని కబళించసాగాయి. కానీ అందరికన్నా ముందుగా ఉండే పంజాబీదళంపై దాడి చెయ్యలేదు. వారిని దాటుకుంటూ ముందుకెళ్ళసాగాయి. లుంపు వైపుగా శత్రువు కదలుతున్నారు. ఇక మిగిలింది మూడు బృందాల రాజపుత్రులు, ఒక గూర్ఖా బృందం. ఎవరి దగ్గరా సరిపడినంత బలం లేదు. రెండవ ప్రపంచ యుద్ధంలో తమవీరత్వంతో ప్రపంచాన్ని మైమరపించిన ఈరెండు దళాల భవిష్యత్తు ఈరోజు ఒకబలమైన శత్రువు చేతిలో ఇరుక్కుంది. ఈసమయంలో జనరల్ ప్రసాద్ ఫోన్ చేసి హీనపక్షం ఒక బృందాన్నైనా సాంగ్లేకు పంపమని, ఇది పైవాళ్ల ఆదేశమని చెప్పాడు. సైన్యాని ఏమి చెయ్యాలో పాలుపోలేదు. ఒకవేళ ఈఆదేశాలను పాటిస్తే వాళ్ళు అక్కడికి వెళ్ళెముందే శత్రువు చేతిలొ హతమవ్వడం ఖాయం.
చైనీయులు ముందుగా రాజపుత్రులు గూర్ఖాలను వేరు చేస్తూ ఒకదళాన్ని వారిరువురి మద్యనా పంపారు. మిగిలిన రెండు దళాలను ఒక్కొక్కరి మీదకు పంపారు. ఇంతటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా వీరిరువురూ శత్రువును మూడుగంటల పాటు నిలువరించారు. సిగ్నల్ బంకర్ మీద దాడిచెయ్యడంతో అందులోని వారంతా మరణించారు. నాలుగవ బ్రిడ్జి దగ్గరున్న బృందం రెండుదాడులను సమర్థవంతంగా తిప్పికొట్టగా, చైనాదళాలన్నీ కలిసి సునామీలాగా విరుచుకుపడటంతో తుడిచిపెట్టుకుపోయింది. ఒక్క పోస్టు ఎన్నివేలమందినని నిలువరించగలదు? జెమదర్ బిశ్వాస్ సారధ్యంలోని బెంగాలీదళం, మేజర్ గురుదయాళ్ సింగ్ సారథ్యంలోని పదాతిదళం దాడులతో ఉక్కిరిబిక్కిరి అయ్యాయి. వీరులందరూ నేలకొరగ సాగారు. చివరకు మిగిలిన రిఖ్ ను లొంగిపొమ్మని కోరగా, అతను ఒప్పుకోలేదు. ఆయనతోపాటుగా కెప్టన్ భాటియా, భూప్ సింగ్, ఇతర సహాయకులు బంకర్లలోనే ఉండిపోయారు. చైనీయులు తమ మెచీన్ గన్లతొ బంకర్లపై గుండ్లవర్షం కురిపించారు. దాంతో భాటియా అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రగాయాలతో బతికిన కొందరు బందీలయ్యారు. భాటియా సామర్థ్యాన్ని గుర్తించిన సైన్యం అతన్ని పూణేలోని శిక్షణాకేంద్రానికి బదిలీచేసింది. 20న తనబృందానికి వీడ్కోలు చెప్పి బయల్దేరాల్సిన వ్య్కతి ఈలోకానికే వీడ్కోలు చెప్పాడు.



ఈసంఘటన సైనికులను తీవ్ర ఉద్వేగానికి గురిచేసింది. తుదిశ్వాస విడిచే వరకూ తలవంచకూడదని నిశ్చయించుకున్నారు. మరోవైపు సుబేదార్ దశరథ్ సింగ్ బృందం అప్పటికే మూడుసార్లు దాడులను ఎదొర్కొన్నది. చివరికి ఏడుగురే మిగిలారు. వారివద్ద సామాగ్రి నిండుకుంది. అయినా తలొంచని రాజపుత్రులు బాకులతో ద్వంద్వయుద్దానికి దిగారు. ఈపోరాటంలో నలుగురు మరణించగా, మిగిలిన ముగ్గురూ బందీలయ్యారు. జెమదర్ బోస్ సారధ్యంలోని బెంగాలీలు మూడుదాడుల తర్వాత 10మంది మిగిలారు. అయినా పోరాడి అమరులయ్యారు.

మేజర్ బీ.కే.పంత్ సారథ్యంలోని రాజపుత్రుల బృందం అసాధ్యమని తెలిసినా శత్రువును నిలువరించేందుకు ప్రాణాలను పణంగా పెట్టడానికి వెనుకాడలేదు. సహచరులను ఉద్దేశించి "రాజపుత్రదళం చరిత్రలో ఈరోజు మనమొక నూతన అధ్యాయాన్ని లిఖించబోతున్నాం. రాజపుత్రులను సాహసానికి, వీరత్వానికి చిరునామాగా ఎందుకు పేర్కొంతారో శత్రువుకు తెలియజేద్దాం." అంటూ కాలికి తగిలిన గాయాన్ని కూడా లెక్కచెయ్యకుండా కదనరంగంలోకి ఉరికాడు. మొదటి మూడు దాడులని ఎదుర్కొనేసరికే చాలామంది గాయపడ్డారు. నాలుగవ దాడికి ఆయన పొట్టకి, రెండుకాళ్ళకి తీవ్రగాయాలయ్యాయి. అయినా లెక్కచేయకుండా వీరులభూమిలో మృత్యువుకు చోటులేదంటూ నినదించసాగాడు. "రాజపుత్రులు ఈదేశంకోసం చావడానికే పుడతారు. దేవుడు ఈరోజు ఈప్రాంతాన్ని మీకు నిర్నయించాడు. దీనికోసం పోరాడండి." అంటూ గర్జిస్తున్న ఈయన్ని చూసిన చైనీయులు ముందుకెళ్ళడానికి ఈయనే ప్రధాన అవరోధం అని కనుగొన్నారు. వెంటనే తమ వనరులన్నింటినీ అక్కడికే మళ్ళించారు. ఒక మెచీన్ గన్ పంత్ శరీరాన్ని తూట్లుతూట్లు చేసింది. విపరీతమైన రక్తస్రావంతో అపస్మారక స్థితిలోకి వెళ్తూ, పిడికిలి పైకిత్తి "జై బజరంగ్ బలి" అంటూ నినాదంచేస్తూ తుదిశ్వాస విడిచాడు. వీరమరణం పొందిన ఆయన ఆత్మ స్వర్గానికన్నా వెయ్యిరెట్లు ఆనందాన్నిచ్చే భరతమాత ఒడిలోకి చేరింది. రాజపుత్రుల సాహసాలకు శత్రువు సైతం అచ్చెరువొందాడు. వారివల్ల జరిగినంత నష్టం మరెక్కడా జరగలేదని, అస్లు రాజపుత్రుల వంటి శత్రువును చైనీయులు ఇదివరకు చూడలేదని కొనియాడారు.

మరోవైపు పంజాబీలు వ్యూహాత్మకంగా దాడులు చేస్తూ శత్రువును ముప్పతిప్పలు పెట్టసాగాయి. వనరులు, సమయం, సామాగ్రి, భౌగోళికాంశాలు- ఇన్ని పరిమితుల మద్య వారు మొదటి నుంచి శత్రువును ఎదుర్కొంటూనే ఉన్నారు. వాళ్ళ నైపుణ్యానికి జోహార్లర్పిస్తూనేమో చైనీయులు ఎక్కడా వారితో నేరుగా పోరాడలేదు. వారిని మిగతాదళాలను వేరుచేసుకుంటూ, ఒంటరిగా ఉండేలా వ్యూహాలు పన్నారు. వీరు అందరికన్నా ముందు ఉండటంతో, దాడికి స్పందించే సమయం లేకపోయింది. ఎక్కువమంది ఆసమయంలోనే మరణించారు. సాంగ్లేలో ఉన్న దళాలు అదృష్టవశాత్తూ భూటాన్ వైపు మళ్ళిపోయాయి. మిగతావారికి అలాంటి దారికూడా లేకుండా పోయింది. ఉన్నా వారు పోరాటానికే దిగేవారన్నది అందరి విశ్వాసం.



ఉదయం 7:30కల్లా ధాగ్ల ప్రాంతం పూర్తిగా చైనీయుల ఆధీనంలోకి వచ్చేసింది. మూడుగంటల్లో మొత్తం తుడిచిపెట్టుకు పోయింది. దానికి చైనీయుల వ్యూహాలేవీ అంత ఆధునికమైనవీ, చేదించ సాద్యం కానివీ కాదు. అయితే వారి దగ్గర సామాగ్రి ఉత్తమనైనది. బలం ఎక్కువ. స్థానికంగా అనుకూలాంశాలు ఎక్కువ. ఉన్నతస్థాయిలో తీసుకున్న నిర్ణయాలు ప్రభావ వంతమైనవి. తమ సామాగ్రి నిండుకునేదాకా భారత సైనికుడూ శత్రువుకు లొంగలేదు. వెన్నుచూపలేదు. మృత్యువును కౌగిలించుకున్నాడు. ఇక్కడ ఆసైనికుణ్ణీ చంపింది శత్రువా? లేక అరకొర వనరులు, అస్థవ్యస్థ నిర్ణయాలు, కుళ్ళు రాజకీయాలు నిండిన అధికార వ్యవస్థా? అన్నది వారివారి విచక్షణను బట్టి నిర్ణయానికి రావచ్చు.

అక్కడి నుంచి చైనాబలగాలు సాంగధర్ లోని హెలిపాడ్ వైపు కదిలాయి. మద్యలో కొన్నిబృందాలను వ్యూహాత్మకంగా పక్కకు పెట్టాయి. అక్కడ వస్తుసరఫరా కోసం వచ్చిన హెలికాప్టర్ను కూల్చివేశారు. యుద్దం గురించి ఎయిర్ ఫోర్సుకు సమాచారం ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు బలయ్యారు. మొదట్నుంచీ ఆర్మీ- ఎయిర్ ఫోర్సులోని కీలకవిభాగాల మద్య సమంవయం లేదు. ఇది అనేకసార్లు తేటతెల్లమయ్యింది. ముందురోజు జనరల్ ప్రసాద్ తాను సరిహద్దుకు వచ్చి, అక్కడి సైనికుల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటానని మాటిచ్చాడు.  అమాటప్రకారం ఆయన బయలుదేరబోగా, కిందవాళ్ళు వారించారు. ముందు తామెళ్ళి పరిస్థితిని చూసి వస్తామని, తర్వాత వెళ్ళమని చెప్పి బయల్దేరారు. ఆహెలికాప్టర్నూ కూల్చివెయ్యడంతో ఆయువకులిద్దరూ బలయ్యారు. అప్పటికే సిగ్నల్ అధికారి బందీగా మారాడు. అతని తర్వాతి వ్యక్తి ఈఘటనలో మృతి చెండాడు. దాంతో సమాచారం పూర్తిగా స్తంభించింది.

దాల్వీ కొన్ని రహస్య పత్రాలను తగలబెట్టాక, మిగిలిన సహచరులతో కలిసి సాంగధర్ వైపు కదిలాడు. అక్కడికి చేరుకునే సరికే చైనీయులు భారీ యెత్తున దాడులు నిర్వహిస్తున్నాయి. భారత సైన్యం తమతమ శక్తిమేరా వారిని నిలువరించేందుకు యత్నిస్తున్నాయి. దూరం నుంచి వారి సాహసాన్ని చూస్తున్న దాల్వీబృందానికి రోమాలు నిక్కబొడుచుకున్నాయి. దాదాపు 4గంటలు పోరాడాక, వీరి దగ్గర కూడా నిల్వలు నిండుకోవడంతో ప్రాణాలు విడిచారు. ఇక మిగిలింది హథుంగ్లా వద్ద ఉన్న పంజాబీలు, గ్రెనేడర్లు.
సెర్ఖిమ్ వైపు వెళ్ళి వారిని కలుసుకోవడానికి నిర్ణయించుకున్నారు. అక్కడికి చేరుకోవాలంటే 18500 అడుగుల ఎత్తులో ఉన్న శిఖరాలను దాటాలి. నిట్టనిలువుగా ఉన్న పర్వతాన్ని ఎక్కడం ప్రారంభించారు. అత్యంత ప్రమాదకరంగా ఉన్న ఈదారిలో 17000 అడుగుల ఎత్తున చిన్నగుహలో రాత్రికి తలదాచుకున్నారు. అప్పటికి 24గంటలుగా ఎవ్వరికీ అన్నం లేదు. నిద్రలేదు. నీళ్ళు తాగాలన్నా మంచువల్ల గొంతు పట్టేస్తోంది. అలానే రాత్రంతా గడిపారు. ఇంతటి కష్ట సమయంలోనూ సైనికుడు తన విశ్వాసాన్ని కోల్పోలేదు. తమ అధికారి పట్ల వారుచూపిస్తున్న గౌరవం దాల్వీని కట్టిపడేసింది.

మార్గంలో ఒక్కొక్కరుగా అస్వస్థతకు గురవుతూ వస్తుండటంతో వారిని వదిలి వెళ్ళక తప్పలేదు. మద్యాహ్నం 1:30కు కర్పోలా మార్గానికి చేరుకునేసరికి 12మంది మిగిలారు. కాళ్ళీడ్చుకుంటూ బండరాళ్ళు, కాలువలూ, పొదలు దాటి వెళ్తూ ఎక్కడొ దారి తప్పిపోయారు. కానీ ముందుకు పోవడం తప్ప మరొక మార్గం లేదు. కాబట్టి వెళ్తూ ఉన్నారు. అప్పటికే తిండితినీ, నిద్రపోయి 60గంటలయ్యింది! చైనీయులు ఒకదాని తర్వాత మరొకటి ఆక్రమించుకుంటూ మొత్తంప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకుంటున్నారు. సరిహద్దు పోస్టుల్లో భారత త్రివర్న పతాకాన్ని అవనతం చేశారు. ఇక మళ్ళీ ఎప్పటికి మనఝెండా ఎగురుతుంది అన్నది కాలమే జవాబు చెప్పాలి. ఒక దట్టమైన అడవిని చీల్చుకుంటూ ముందుకు వెళ్ళగా మొత్తం దళం చైనాబలగాల మద్యలో ఇరుక్కుంది. వారంతా అక్కడే సేదతీరుతున్నారు. మొత్తం విజయం ఒక ఎత్తైతే దళనాయకుడు బందీగా దొరకడం ఎవడికైనా అమితానందాన్ని కలిగించేది. ఆక్షణం దాన్నే చైనీయులు అనుభవించారు.

అలా ఈమట్టికోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టేందుకు వెనకాడకుండా సైనికుడు సాగించిన పోరాటం ముగిసింది.

మేరునగ తప్పిదం- 14.పద్మవ్యూహం

సరిహద్దు గందరగోళానికి గురై ఉండగా జనరల్ కౌల్ డీల్లీనుంచి ఎలాంటి ఆదేశాలు పంపలేదు. దళాలు రక్షణ చర్యలలో భాగంగా బంకర్లు నిర్మించడం మొదలుపెట్టాయి. కానీ అందుకు సరిపడా సామాగ్రి లేకపోవడం వారిని ఇబ్బంది పెట్టింది. కౌల్ వెళ్తూ వెళ్తూ అప్పగించిన "ప్రస్తుత స్థానాలను యధాతథంగా కొనసాగించడి." అన్న బాద్యతకు అనుగుణంగా 4మైళ్ళ పొడవున విస్తరించి ఉన్న ప్రధానప్రాంతంతో బాటు 10మైళ్ళ పొడవున విస్తరించి ఉన్న మిగతాప్రాంతాలను కాపాడటం అప్పటి బలానికి చాలాపెద్ద లక్ష్యం.

అక్టోబరు 12న లెఫ్టినెంట్ కల్నల్ హరిహర్ సింగ్ సారధ్యంలోని 4గ్రెనేడర్ బలగాలు ఒక్కొక్కటిగా సరిహద్దుకు చేరుకోవడం ప్రారంభించాయి. మిగతా దళాల మాదిరిగానే వీళ్ళుకూడా ఉన్నపళంగా మైదానాలు విడచి ఇక్కడకు రావడంతో విపరీతంగా అలసిపోయి ఉన్నారు. అంతేకాక కొత్తవాతావరణానికి అలవాటు పడటానికి సమయం పడుతుంది. వీరి రాకతో మొత్తం బలం 2500కు చేరుకుంది. అక్టోబరు 16కు బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ వారి పోర్టర్లు 450మంది సమకూరారు. సంఖ్యపెరిగిపోవడంతో సరకులనిల్వలు 2రోజులకు పడిపోయింది.

అక్టోబరు 11న డిల్లీ చేరుకున్న కౌల్, ఉన్నతస్థాయి సామావేశంలో పాల్గొన్నాడు. అన్నిరకాలుగా చైనీయులు మనకన్నా మెరుగైన స్థానంలో ఉన్నారని చెప్పాడు. అక్కడ చైనీయులను ఎదుర్కోవడం అసాధ్యమని, ధోలానుంచి బలగాలను ఉపసంహరించాలని వాళ్లకు నివేదించాడు. వారికి మూడు ప్రత్యామ్నాయలను ప్రతిపాదించాడు. ఒకటి- సరిహద్దులో బలాన్ని పెంచుకుని చైనాపై దాడి చెయ్యడం. రెండు- దాడి చెయ్యకుండా యదాతథ స్థానాలలో కొనసాగించడం. మూడు- ప్రస్తుత స్థానలకన్నా మెరుగైన ప్రాంతాలకు బలగాలను పంపడం. నిజానికి ప్రస్తుత పరిస్థితుల్లో మూడవది, అంటే అక్కడ్నుంచి బలగాలను వేరేచోటకు పంపడం, తప్ప వేరేవేవీ కుదిరేవి కావు. కానీ మూడింటినీ చెప్పడం కౌల్ చేసిన ఘోరతప్పిదం. దాడి చేసేంత బలం మనకు లేదన్నది సుస్పష్టం. బలమైన శత్రువుకు ఎదురుగా, ఎలాంటి రహస్య కార్యకలాపాలనూ కొనసాగించలేని చోట బలగాలను ఉంచి ఏమిలాభం? వాళ్ళకు రక్షణ ఎలా? రాజకీయ కోణంలోంచి చూస్తే బలగాలను అక్కడే కొనసాగించడ మొక్కటే సరియైనది. అలా చేస్తేనే ప్రభుత్వం ప్రజలకు, పార్టీ ప్రతిపక్షానికి జవాబు చెప్పగలదు. కాబట్టి యదాతథ స్థానాలను కొనసాగించమని ఉత్తర్వులు జారీచేసింది. సైన్యం తనకుతానుగా ఇచ్చిన ప్రత్యామ్నాయలలో ఇది ఉంది కాబట్టే వాళ్ళు దాన్ని ఎంచుకున్నారు.

13న నెహ్రూ కొలంబో బయలుదేరుతూ చైనీయులను తరిమికొట్టమని ప్రభుత్వం సైన్యాన్ని ఆదేశించిందని పత్రికలకు చెప్పాడు. ఇది చైనీయుల గుండెలు భగ్గుమనేలా చేసింది. రేడియోలో ఈవార్తలను విన్న సరిహద్దుదళాలు గందరగోళానికి గురైయ్యాయి. ఎట్టకేలకు కౌల్ నుంచి ఆదేశాలు అందాయి. వాటిననుసరించి- దళాలు యదాతథ స్థితిని కొనసాగించాలి. కానీ అందుకు అవసరమైన అదనపు వనరులు, ప్రణాళిక, పాలనావిషయాలేవీ చర్చించలేదు. అంతకుమునుపు వచ్చిన ఉత్తర్వుల్లానే ఇదికూడా ఒక నినాదంగా మిగిలిపోయింది.

మరోవైపు చైనా నెహ్రూ ప్రకటనను సాకుగా చూపించి, భారీ యెత్తున సన్నాహాలు మొదలుపెట్టింది. కొరియాయుద్దంలో నాయకత్వం వహించిన వ్యక్తికి దీనిబాద్యతలు అప్పగించింది. దళాలన్నీ చురుగ్గా పనులు చెయ్యడం మొదలుపెట్టారు. వారి కదలికలను గమనించడానికి భారతసైన్యం 25 అబ్జర్వేషన్ పోస్టులను నెలకొల్పింది. సరిహద్దుకు అవతల మనలను లక్ష్యంగా చేసుకుని చైనా చేపడుతున్న యుద్దసన్నాహాలను మూగగా చూస్తూ ఉండటం కన్నా భారత జవాను చెయ్యగలిగింది ఏమీలేదు! అరకొర సదుపాయాలు, పనిముట్లతో దాడిసంగతి దేముడెరుగు కనీసం ఆత్మరక్షణకు కూడా ఏర్పాట్లు సరిపోవు. ఆసమయంలో నాలుగు తుపాకులను పంపగా, అందులో రెండు హెలికాప్టర్లు జారవిడిచేటప్పుడు ముక్కలయ్యాయి. మనదగ్గరున్న అతిపెద్ద ఆయుధం సామర్థ్యం చైనీయుల సంచార ఆయుధాల సామర్థ్యంకన్నా తక్కువ. పర్వత ప్రాంతం కావడంతో వాటి పరిమితి మరింతగా పెరిగిపోయింది.

మరొకవైపు వైద్యసదుపాయాలు యుద్దావసరాలకు ఏమాత్రం సరిపోవు. పంజాబీదళం ఎలాంటి వైద్యసదుపాయం లేకుండానే పోరాడుతోంది. ఉన్నపళంగా సైన్యాన్ని సరిహద్దుకు పంపడంతో దానికనుగుణంగా వైద్యశిబిరాలను ఏర్పాటు చెయ్యటం గందరగోళానికి గురైంది. మొదట లుంపులో నెలకొల్పాల్సిన శిబిరాన్ని కౌల్ ఆదేశాలతో సరిహద్దుకు మార్చాల్సి వచ్చింది. ఇన్ని సమస్యల్లోనూ వైద్యబృందం అహర్నిశలూ కృషిచేసి రోజుకు నలభైమందికి వైద్యాన్నిచ్చింది. కేసుల్లో సింహభాగం చలినుంచి సరైన రక్షణలేకపోవడంవల్ల, అలవాటులేని పర్వతప్రాంతంలో ఉండవలసినందువల్ల ఏర్పడినవే. రోగులను తరలించడం తలకుమించిన భారమైంది. రోగులను ఎనిమిదిగంటలపాటు మోసుకుంటూ పర్వతాలను దాటి ఆసుపత్రిలో చేర్చాలి. తిరుగుప్రయాణంలో అక్కడినుంచి సామాగ్రి మోసుకురావాలి.

ఇలాంటి ప్రతికూల సమయాల్లోనూ కెప్టెన్ బీ.బీ.కూలే సారధ్యంలోని వైద్యబృందం రోజుకు 40మందికి పైగా రోగుల్ని చూసేవారు. అందులో కనీసం పదిమంది పరిస్థితి అపాయకరంగా ఉండేది. ఎయిర్ ఫోర్సుకు చెందిన స్కాడ్రన్ లీడర్ విలియమ్స్ ధైర్యసాహసాలతో విమానాన్ని నడిపి రోగులను ప్రధాన కేంద్రానికి చేర్చేవాడు. తెల్లవారుఝామున మొదలైన విమానం పొద్దుగూకే వరకూ తిరుగుతూనే ఉండేది. ఒకరోజు 23 రౌండ్లు తిరిగిన ఈయన సాహసాన్ని గౌరవిస్తూ, వైద్యబృందం యుద్దవీరుల అవార్డుకు ఈయన్ని నామినేట్ చేసి గౌరవించింది. మద్యలో జనరల్ కౌల్ ఉత్తర్వులు వీరిని కొంత అసహనానికి గురిచేశాయి. వైద్యుల సలహాను తీసుకోకుండానే ఆయన ఒకబృందాన్ని సరిహద్దుకు పక్కనే ఏర్పాటు చెయ్యమన్నాడు. దాడిజరిగితే అది ధ్వంసమయ్యే ప్రమాదాన్ని ఆయన గమనించలేదు. అలానే ఇంకొక బృందాన్ని ఎత్తైన ప్రాంతంలో ఏర్పాటు చెయ్యగా ఆక్సిజన్ వసతులు లేకుండా 9000అడుగులకన్నా ఎత్తులో ఆపరేషన్ చెయ్యడం కుదరని కారణంగా దాన్ని విరమించుకున్నారు. విసుగెత్తిన మేజర్ జయరామన్ తన పైఅధికారి కల్నల్ మైత్రాకు పిర్యాదు చేశాడు. ఆయన తనబృందానికే మద్దతునివ్వడంతో వాళ్ళు ఊపిరిపీల్చుకున్నారు.

ఇక వస్తురవాణా పరిస్థితి నానాటికీ తీసుకట్టుగా తయారవసాగింది. ఒకవైపు అవసరాలు పెరిగిపోతుండగా, మరొకవైపు వస్తువులను జారవిడిచేందుకు ఎన్నుకున్న ప్రాంతం ఇరుకైనది కావటాన మూడోవంతు మాత్రమే సైన్యానికి అందసాగింది. మిగతాది అక్కడినుంచి దొర్లి లోయల్లో పడిపోతున్నాయి. అలానే సామాగ్రిని నిల్వచేయను చాలినంత గోదాములూ లేవు. సైన్యానికి అవసరమైన సామాగ్రి ఏమిటీ? వాటి ప్రాధాన్యతా క్రమం ఏమిటీ? అవసరానికి తగినట్టు అందుతున్నాయా? పదాతిదళానికీ వాయుసేనకు మద్య సమాచారం సరిగా అందుతుందా? వంటి కీలకమైన ప్రశ్నలకు జవాబిచ్చే స్థితిలో సైనికాధికారులు లేరు.

ఇక సమాచార వ్యవస్థ- 4డివిజను సిగ్నల్ రెజిమెంట్ వాళ్ళు ఒక టెలిఫోన్ లైనును ఏర్పాటు చేశారు. అది కాస్తా సాధారన యుద్ధనియమాలకు విరుద్ధంగా సరిహద్దుకు సమాంతరంగా, చెనీయుల వాకిట్లో ఏర్పాటుచేస్తారు. సరిహద్దు- ప్రధానకేంద్రం మద్యన సమాచాఅం శత్రువు దయాదాక్షిణ్యాలమీద ఆధారపడినట్లైంది. ఆప్రాంతానికి లైను వెయ్యాలంటే అంతకన్నా వేరేమార్గం లేదు. అలాంటి ప్రాంతాన్ని ఎంచుకున్నాం కాబట్టి అనుభవించక తప్పదు. మనవ్యవస్థలు, సదుపాయాలు అన్నీ శత్రువు కళ్లకెదురుగానే ఉంచాం. దాంతో సైనిక సన్నాహాల్లో కీలకమైన గుట్టు ఇక్కడ రట్టైంది.

ఇన్ని సమస్యల మద్యలో, జనరల్ కౌల్ పానకంలో పుడకలాగా పైనుంచి ఊడిపడ్డాడు. మొత్తం అధికారక్రమంలో ఆయన స్థానమేంటి అన్నది అందరికీ అస్పష్టమే. దాంతో ఆయన తనతోపాటు కొందరు ఉద్యోగులను తనవెంట తీసుకొచ్చి,  వాళ్ళందరికీ తలో హోదా కల్పించి ఖాళీల్లో ఇరికించాడు. ఖాళీలు లేకుంటే సృష్టించాడు. వీళ్లందరికీ పని ఇవ్వాలు. ఫర్నీచర్ ఇవ్వాలి. ఇతర సదుపాయాలు కల్పించాలి. అదొక వింతసమస్య!

ఇంత జరుగుతున్నా మనప్రభుత్వం సైనికులతో చదరంగం ఆడటం ఆపట్లేదు. అన్నివైపులనుంచీ విమర్శలు తారాస్థాయికి చేరుకుంటూ ఉండటంతో దీనికి జవాబిచ్చేలా ఏదైనా చెయ్యాలని ప్రభుత్వం యోచించింది. సాంగ్లే అనే ప్రాంతం ఆయాచితవరంగా మననాయకులకు లభించింది. ఇది భూటాన్ మూలన ఉంటుంది. నమ్కాచు నది అవతల ఉండటంతో ఇది చైనా భూభాగమవుతుంది. అక్కడకు మనసైనికులను పంపి ఆప్రాంతాన్ని మన ఆధీనంలో ఉండేలా చేస్తే అందరికీ జవాబివ్వొచ్చు అని భవైంచింది. అయితే అక్కడకు సైన్యాన్ని పంపడంలో గల పరిమితులను, వస్తురవాణాలోని ఇబ్బందులను, సైన్యం ఆత్మరక్షణకు గల ఇబ్బందులను పట్టించుకోలేదు. ఒకవైపు ఇప్పుడు కాపలాకాస్తున్న ప్రాంతమే తలకుమించిన భారమయింది. ఇక ఈకొత్తప్రాంతాన్ని కూడా కాపలాకాయాలంటే అస్సలు కుదిరేపనే కాదు. ఒకవేళ దాన్ని కాయాలంటే ఇక్కడ కొంతబరువును తగ్గించుకోవాలి. ఇంతా చేసి అక్కడకు వెళ్ళినందువల్ల ఏమైనా ప్రయోజనమా అఁటే అదీలేదు. అక్కడికెళ్ళడే పెద్దతలనొప్పి. సరైన దారిలేదు. మద్యలో ఉన్న పర్వతశిఖరం మంచుతో కప్పబడి, దాటడానికి దుస్సాధ్యంగా ఉంటుంది. రానున్న శీతాకాలంలో పరిస్థితి మరింత విషమిస్తుంది. అక్కడికెళ్ళెవాళ్లకి తప్పనిసరిగా చలికాలపి దుస్తులు ఇవ్వాలి. ఎక్కడి నుంచి వస్తాయి? ఏముంది. అప్పటికే వాటిని వాడుతున్న పంజాబీదళం నుంచి తీసుకుని సరఫరా చెయ్యాల్సి వచ్చింది. ఇది ఎంత దారుణమైన సంఘటన? కనీసం నోరుమెదపని జవానుకు మనం ఏమిస్తే ఋణం తీర్చుకోగలం? సైనికాధుకారులు ఎంత మొత్తుకున్నా మీనన్ ముందు చెవిటివాడి చెవిలో శంఖం పూరించిన చందమే. మరొకవైపు నెహ్రూ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఇస్తున్న ప్రకటనలు చైనీయులను మరింత రెచ్చగొట్ట సాగాయి.

అక్టోబరు 16న జనరల్ ప్రసాద్ ఫోన్లో కలిశాడు. పైవాళ్లను ఒప్పించలేక పోయానని, నవంబరు 1కల్లా చైనీయులను తరిమికొట్టాలన్నది రక్షణమంత్రి ఆదేశమని చెప్పాడు. దీంతో దాల్వీకి అరికాలిమంట నడినెత్తికెక్కింది. అది కుదిరేపని కాదన్నది ఇద్దరి అభిప్రాయం కాబట్టి పైవాళ్లకు దాన్ని తెలియజేయమన్నాడు. ఈపరిస్థితుల్లో రాజీనామా ఇవ్వడమొక్కటే దారి. అయినా పై అధికారులెవరూ ఆయనతో విబేధించట్లేదు. ఆయన అభిప్రాయాన్ని జనరల్ కౌల్ సహా అందరూ ఒప్పుకున్నారు. కానీ రాజకీయ అవసరాలు అన్నింటికన్నా ఎక్కువ ప్రధానమయ్యాయి. దాంతో ఎవరికీ ప్రత్యామ్నాయం లేకుండా పోయింది.

అక్టోబరు 17న ఎట్టిపరిస్థితుల్లోనూ నమ్కాచులో సైన్యాన్ని ఉంచే ప్రశ్నేలేదు. వెంటనే వెనక్కి పిలిపించమని దాల్వీ ప్రసాదును కోరాడు. పైవాళ్లకు తెలియజేస్తానన్ని చెప్పడం మినహా ఆయన చేసిందేమీ లేదు. అక్టోబరు 18నాటికి చైనా సన్నాహాలు వేగంగా జరుగుతున్నాయి. ఆరాత్రి కొందరు చైనీయులు భారత భూభాగంలోకి చొరబడ్డారని గ్రెనేడర్ దళం వారు పిర్యాదు చేశారు. వారిమార్గాన్ని అడ్డుకునేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. సిగ్నల్ కమాండర్ కే.కే.తివారి సమాచార వ్యవస్థను తనిఖీ చెయ్యడానికి వచ్చాడు. త్వరలోనే దళాలను ఇక్కడినుంచి ఉపసంహరించుకోవచ్చు అని తెలియజేశాడు. ఎలాంటి ఆధునిక పరికరాలూ లేకుండానే ఈయన సిగ్నల్స్ నిర్వహణను సమర్థవంతంగా నిర్వహించాడు. తమ సామర్థ్యానికి మించిన కార్యక్రమాలనూ ఎలాంటి విసుగూ ప్రదర్శించకుండా నిర్వహించాడు.

అక్టోబరు 19కల్లా భారత సైన్యం పూర్తిగా చైనీయుల పద్మవ్యూహంలో చిక్కుకుపోయింది. వారి కదలికలను చూసినవారు ఎవరైనా పెద్దదాడికి సిద్దమవుతున్నారని సులువుగా గ్రహించగలరు. ఈసమయంలో జనరల్ ప్రసాద్ ఫోన్ చేసి మిగిలిన గూర్ఖాలను సాంగ్లేకు పంపమని చెప్పాడు. ఈసమయంలో దళాలను అక్కడకు పంపితే మార్గమద్యంలోనే చైనీయులు హతమార్చే ప్రమాదం ఉందని ఆయనకు చెప్పాడు. అడ్డమైన రాజకీయాలకు యుద్దభూమి వేదికగా నిలిచింది. ఎవరెవరో చేసిన పాపాలను కడుక్కునేందుకు సైన్యాన్ని బలిపశువుగా నివేదిస్తున్నారు. నోటిమాటలతో విసిగిపోయానని  ఇకపై ఏఉత్తర్వులనైనా రాతపూర్వకంగా ఇస్తేనే చేస్తానని ఖచ్చితంగా చెప్పాడు. ఇప్పటికే చైనీయులు యుద్దానికి సిద్దమైపోయారని, వాళ్లదాడిని నిలువరించాలంటే వీలైనంత తక్కువ ప్రాంతంలో బలగాలను మోహరించాలని చెప్పాడు. ప్రస్తుతం బలగాలు సన్నగా 10మైళ్ళ దూరంలో విస్తరి6చి ఉన్నాయని, దాడిని నిలువరించే శక్తి వాటికి లేదని చెప్పాడు.

అప్పుడు ప్రసాద్ తీరిగ్గా ఒక నిజాన్ని బయటపెట్టాడు. హిమాలయ వాతావరణం పడక జనరల్ కౌల్ అస్వస్థతకు గురయ్యాడు! దానివల్లే దళాలకు తాజా ఉత్తర్వులేవీ అందట్లేదు. కౌల్ బాద్యతలు నిర్వర్తించలేని సమయంలో జనరల్ ప్రసాద్ ఇన్ చార్జ్ అవుతాడు. కానీ ఆబాద్యత తీసుకునేందుకు ఆయన సిద్దంగా లేడు. అంతేగాక ఇన్నేళ్ళుగా ఆయన పని అటు ప్రధాన కార్యాలయానికీ ఇటు సరిహద్దుకీ మద్యన పోస్టుమాన్ పాత్ర పోషిస్తూ వచ్చాడు. కిందవాళ్ళ నివేదిక పైవాళ్ళకు చేరవేయడం. పైవాళ్ళ ఆదేశాలు కిందకు పంపడం మినహా ఆయన చేసిందేమీలేదు. సర్వీసు ప్రకారం సీనియర్. అలాగని నిర్ణయాలు తీసుకునేంత సీనియర్ కాదు. కిందవాళ్ళతో కలవగలిగినంత జూనియరూ కాదు. ఆయన పరిస్థితి ఇటు ఉట్టికీ అటు స్వర్గానికీ కాకుండా ఉంది. ఆయన నిర్లిప్త ధోరణికి చికాకుపడ్డ దాల్వీ ఫోన్లో కొంచెంఘాటుగానే విమర్శించాడు.సైనికుల పరిస్థితి ఏమిటో తెలిసినందువల్ల ఆయన దాల్వీ మాటలతో ఏకీభవిస్తూ, అవసరమైతే తానూ యుద్దభూమికి వచ్చి సైనికులతోనే ఉంటానని చెప్పాడు.

ఒకవైపు శత్రువు సన్నాహాలు వాయువేగంతో పూర్తవుతుండగా, మనం మాత్రం సైనికుణ్ణి బలిపశువును చేసి, రాజకీయాల్లో మునిగి తేలుతున్నాం. వాటి ఫలితంగా మనసైన్యం శత్రువు పద్మవ్యూహంలో చిక్కుకుంది.

మేరునగ తప్పిదం- 13.తేనెతుట్టె కదిలింది


అక్టోబరు 4న జనరల్ కౌల్ తేజ్పూర్ చేరుకున్నాడు. ఆయనకున్న పలుకుబడి దృష్ట్యా ఉన్నతాధికారులు సైతం ఎదురెళ్ళి స్వాగతం పలికారు. ఇది సైనిక నియమావళి ప్రకారమైతే శిక్షార్హం. కానీ అక్కడ జరుగుతున్నది రాజకీయ కార్యకలాపాలేగానీ సైనికచర్యలు కాదు కదా! అప్పటికి అక్కడి సన్నాహాలు ఏమాత్రం సరిపోయేలా లేవు. జనరల్ ఉమ్రావు వైఖరితో ఆయన పై అధికారి జనరల్ సేన్ పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా తయారయ్యింది. అప్పటికే అనేకసార్లు దాడిచెయ్యడానికి గడువును పొడిగించుకుంటూ వెళ్ళటం ప్రభుత్వాన్ని అసహనానికి గురిచేస్తోంది. ఇటువైపు హిమాలయాలే అనుకుంటే అంతకు మించి సమస్యలు. ఇప్పుడు జనరల్ కౌల్ రావటంతో ఆయనమీదున్న బరువంతా దిగిపోయింది. ఇక ఆతలనొప్పులేవో కౌలే చూసుకుంటాడు.

కౌల్ 7Infantry Brigadeను వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నాడు. అంటే ఇప్పుడు అందులో ఒక జనరల్, ఇద్దరు లెఫ్టినెంట్ జనరళ్ళు, ఒక మేజర జనరల్, మరియు ఒక బ్రిగేడియర్ ఉన్నారు! కానీ దళంలో సైన్యం, వాటికి వనరులు మాత్రం లేవు. పిరమిడ్ తిరగబడింది. ఉన్నతస్థాయిలో వ్యూహరచన చెయ్యాల్సినవాళ్ళు గుంపుగా యుద్దరంగంలో తిరుగుతుంటే గందరగోళం మరీ ఎక్కువైంది. అధికార క్రమాన్ని విడిచిపెట్టిమరీ కిందున్న సైనికుణ్ణి అదిలించి, గదమాయించి, బెదిరించి మొత్తానికి ఏదో నెట్టుకొస్తున్నారు.

ఇదిలా ఉండగా జనరల్ కౌల్ సన్నాహాల మీద అసంతృప్తి వ్యక్తం చేస్తూ, "దళాలు బద్దకంగా పనిచేస్తున్నాయి. అసలు ఇలాంటి ప్రాంతాన్ని దాడికి ఎందుకు ఎంచున్నారు? ఇదసలు అనుకూలంకాదు. దాడి సంగతి పక్కన పెడితే కనీసం ఆత్మరక్షణకు సైతం ఇది పనికి రాదు." అని చెప్పుకొచ్చాడు. అదేమాట దళ కమాండర్ చెబుతున్నా వినిపించుకోకుండా ఫార్వార్డ్ పాలసీ పేరుతో అక్కడ పోస్టు పెట్టిందెవరు? బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ వాళ్ళని అడిగి పోర్టర్లను తెప్పిస్తానని మాట ఇచ్చాడు. ఆయన ఆసంస్థ యాజమాన్యంలో జీవితకాల సభ్యుడు.

సైనికచర్య ప్రారంభించే ముందు 580టన్నుల మందుగుండు సిద్ధంగా ఉంచాలని, నమ్కాచులోయలో కదలికలు కష్టమనీ, అలాగే పోర్టర్ల కొరత తీవ్రంగా ఉందనీ జాన్రల్ ఉమ్రావ్ తెలియజేశాడు. అయినా శత్రువుమీద దాడి చెయ్యాలంటే వారికన్నా ముందుండాలి కాబట్టి, మంచుకురిసే దానికి ముందే దాడి చెయ్యాలి కాబట్టి సైనికచర్యలకు అవసరమైన సన్నాహాలు శీఘ్రగతిన చేపట్టాలని జనరల్ కౌల్ ఆదేశించాడు. కానీ శత్రువుకన్నా వేగంగా ఉండడమంటే అతనికన్నా వేగంగా వనరులు సమకూర్చుకోవడమని ఆయనకు తెలియదా? ఇన్నాళ్ళూ సైనికచర్యలు ఎందుకు చేపట్తలేక పోయామో అర్థం కాలేదా? దీనిని బట్టి అర్థం అయ్యేదేమంటే ఆయన ఒక సుశిక్షితుడైన సైనికునిలాగాక రాజకీయ నాయకుల తొత్తుగా వ్యవహరిస్తున్నాడు. తన చర్యలు, ఆదేశాలన్నీ సైనికుల పరిమితులను దృష్టిలో ఉంచుకునిగాక రాజకీయ అవసరాలకు అనుగుణంగా అమలుచేస్తున్నాడు.

దాదాపు వారం తర్వాత జనరల్ ప్రసాద్ కలిశాడు. ఆయన్ని తాము సమర్పించిన నివేదిక గురించి వాకబు చేశాడు. బదులివ్వకుండా గుట్టుగా ఉండటంతో మళ్ళీ అడిగాడు. "ఇక్కడెవరికీ మనబాధలతో, మనప్రాణాలతో పనిలేదయ్యా. నీ నివేదిక చదివే ఓపిక అక్కడెవ్వరికీ లేదు. వాళ్ళు కేవలం చైనీయులను తరిమికొట్టడం గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. రాజకీయ కారణాల వల్ల సైనికచర్య వెంటనే చేపట్టమని ఒత్తిడి తెస్తున్నారు." అని ఆవేదనతో జవాబిచ్చాడు. అలాగే కౌల్ను ఇక్కడకు పంపేందుకు ముందు జరిగిన పరిణామాలన్నీ వివరించాడు. వెంటనే దాల్వీని నమ్కాచు ప్రాంతానికి బయలుదేరమన్నాడు. ఇంకా ఇక్కడె ఉన్నట్టు కౌల్కు తెలిస్తే ఆగ్రహానికి గురవ్వాల్సి వస్తుందని చెప్పాడు. ఇప్పటికే ఆలశ్యమైందనీ, ఇప్పటికిప్పుడు బయలుదేరినా రాత్రికి అక్కడకు చేరుకోలేనని దాల్వీ చెప్పాడు. దానికి ఆయన బదులిస్తూ "కావాలంటే దారిలో ఏదైనా గుడిసెలో నిద్రపో. అంతేగానీ ఇక్కడ మాత్రం ఉండకు." అని బతిమాలాడు. ఇక తప్పనిసరై బయల్దేరుతూ ఇదేవిషయాన్ని దళాలకు సమాచారమందిస్తే వాళ్ళు కలవరపడ్డారు.

అక్టోబర్ 5న జనరల్ కౌల్ అక్కడకు వచ్చాడు. నిజానికి 7న ఆయన ధోలాలో దాల్వీతో సమావేశం అవ్వాల్సి ఉంది. అంటే ముందు రెండురోజులు ఆయన క్షేత్రస్థాయిలో సమీక్షించి ఒకనిర్ణయానికి రావాల్సి ఉంది. కానీ ఇలాంటివేమీ చెయ్యకుండానే వచ్చీ రావడంతోనే కిందివాళ్ళను, పైవాళ్ళనూ బద్దకస్తులన్నట్టు మాట్లాడసాగాడు. అందరిమీద పూర్తి ఆధిక్యత ప్రదర్శించ సాగాడు. అప్పటికే చైనీయుల ఆధిక్యత ఆయనకు అర్థమైంది. పట్టుసాధించడం చాలాకశ్టం అన్న సంగతి తెలిసొచ్చింది. కానీ ఇంకా చైనీయులను తరిమికొట్టాలి అనే మాట్లాడుతున్నాడు.

మద్యాహ్నానికి లుంపు చేరుకున్నాడు. అక్కడున్న వాళ్ళందరినీ ఉన్నపళంగా ధోలాకు వెళ్ళమన్నాడు. వెళ్ళమని చెప్పి ఇంతకాలమైనా ఎందుకువెళ్ళలేదని వాళ్లమీద కసురుకున్నాడు. మిగతా ఉన్నతాధికారులను చులకన చేస్తూ తానొక్కడినే వీరునివలె యుద్ధరంగానికి వచ్చానని చెప్పుకున్నాడు. దళకమాండరుకు కనీస సమాచారం అందించకుండా వాళ్ళందరినీ అక్కడినుంచి సరిహద్దుకు పంపించాడు.  ఆసమయంలో వాళ్ళడిన వాటన్నింటికీ "ముందు మీరెళ్ళండి. అక్కడికి అన్నీ వస్తాయి." అని చెప్పాడు .తరువాత కొంతకాలానికి దాల్వీనే ఈకార్యక్రమానికి ఒప్పుకున్నట్టు గాలిపుకార్లు లేచాయి. అంతకాలం ఎవరూ చెయ్యలేని దాన్ని తాను చేసి చూపించి, దళాలని థాగ్లా శిఖరం వరకు అప్రతిహతంగా నడిపించి గొప్పయోధునిగా కీర్తినార్జించాలని ఆయన పగటికలలు కంటున్నాడు. రాజకీయాలు చేస్తూ వీరునిగా ఎలా గుతింపు పొందుతాడు? ఆసమయంలో అతివిశ్వాసం ఆయన మాటల్లోనూ, చేతల్లోనూ ప్రస్పుటంగా కనిపించసాగింది. ఆకైపులో హిమాలయాలు, చైనాబలము, వాతావరణం, వనరులలేమీ ఇవేవీ కళ్లకు కనిపించలేదు.

ఇటువైపు ఈపనులన్నీ సాగుతూ ఉండగా, సరిహద్దుకు అటువైపు చైనా ఒకడివిజన్ మొత్తాన్నీ రంగంలోకి దించింది. అంతకుముందే మెక్ మోహన్ రేఖను తాము గుర్తించట్లేదని చైనా ప్రకటించింది. అప్పటి వరకు ఆరేఖను గౌరవిస్తూ, అందులో కొన్నిప్రాంతాలపై మాత్రమే అభ్యంతరాలు వ్యక్తం చేసినవాళ్ళు ఇప్పుడు ఏకంగా ఆరేఖే సరిహద్దుకాదంటూ ప్రకటించారు. దాంతో ఇక జరగనున్నది చెదురుమదురు ఘర్షణకాదని దాదాపూ అందరికీ అర్థమయ్యింది.



5న బయలుదేరిన దాల్వీ 6కు కర్పోలా1 దగ్గరికి చేరుకున్నాడు. భుజాన 80పౌండ్ల బరువును ఉంచుకుని 16000అడుగుల ఎత్తులో బృందాలు ప్రయాణించాల్సి వచ్చింది. అక్కడ రేడియోలో వార్తలు వింటుంటే అంతకాలం కుదరదన్న ఆల్టిట్యూడ్ అలవెన్సును ఇవ్వడానికి ప్రభుత్వం ఆమోదించింది. కాకపోతే అదివిన్నావాళ్ళలో సింహభాగం అదిఅందేదాకా జీవించిలేరు. అక్కడి నుంచి 14500అడుగుల ఎత్తులోనున్న త్సాంగధరుకు చేరుకునే సరికే సాయంత్రం అయ్యింది. అప్పటికే డస్సిపోయి ఉన్నవాళ్ళు మిగతాదళాలను అక్కడినుంచి నమ్కాచుకు పంపారని తెలిసి దాల్వీతో సహా అందరూ తెల్లమొహం వేశారు.
అక్కడినుంచి కౌల్ను కలవడానికి ధోలాపోస్టుకు బయలుదేరారు.అక్కడున్న పంజాబీలను చూసి కౌల్ వారిని మెచ్చుకున్నాడు. మిగతావారిని పరిచయం చేసుకుంటూ చైనీయులను తరిమికొట్టడానికి ప్రభుత్వం తనను పంపిందని చెప్పుకున్నాడు. ఆప్రాంతపు భౌగోళిక అంశాలను చూసుకున్నాక తూర్పుకమాండరుకు కొన్నిసందేశాలను పంపాడు. అందులో మిగతావారిలాగానే పరిమితులను తెలియపర్చాడు.

అక్టోబర్ 8న థాగ్లావద్ద మోహరించి ఉన్న చైనా బలగాలను చూశారు. మద్యలో ఉన్న ఖాళీప్రాంతాలు, వాటికి వెళ్ళేందుకు దారులూ వాకబు చేశాడు. అలానే కొన్ని యుద్ధగాధలు చెప్పి ఉత్సాహపరచడానికి ప్రయత్నించాడు. రోజూ రాత్రిళ్లు ఆయన ప్రధానికి కొన్నిసందేశాలు పంపేవాడు. అవి డిల్లీకి చేరేందుకు మూడురోజులు పట్టేది. అదీ మన సమాచారవ్యవస్థ. ఆయన నివేదికలో చైనీయులను పూర్తిగా తరిమికొట్టడం అసాధ్యమని తేల్చేశాడు. అయితే అప్పటికే అనేకసార్లు గడువు పొడిగించారు కాబట్టి ఎట్టిపరిస్థితుల్లోనూ అక్టోబరు 10కల్లా దాడి జరగాల్సిందే అని నిశ్చయించుకున్నాడు.

అయితే అప్పటికే చైనాబలాలు భారీగా మోహరించుకుని ఉండటంతో నేరుగా దాడిచెయ్యకుండా థాగ్లాకు పశ్చిమాన ఉన్న యుంత్సోలా ప్రాంతానికి వెళ్ళి, చైనీయులను వెనకనుంచి కొడదామని పథకం వేశాడు. వెంటనే 2రాజపుత్రులను అక్కడికి వెళ్ళాల్సిందిగా ఆదేశించాడు. ఇది తప్పిదాల్లోకెల్లా ఘోరమైన, ఎవరెస్ట్ అంత పెద్దతప్పిదం. రాజపుత్రులు అప్పటికి ఇంకా అలసిపోయి ఉన్నారు. వాళ్ళు నడిచిన దారంతా చైనీయుల నిఘా ఉన్నది. ఇప్పుడు కౌల్ వెళ్లమంటున్నది ఎంతో సున్నితమైనదేకాక, చైనీయుల వశంలో ఉంది. అంతేగాక దళంవెళ్ళే దారిమొత్తం చైనీయుల నిఘాలో ఉంది. ఈఆదేశాలు వినడంతోనే ఒక్కొక్కరు బిత్తరపోయారు. తిరిగి కలుస్తామన్న ఆశ ఒక్కరికీ లేదు. అక్కడకు పంపేముందు కల్పించాల్సిన కనీస అవసరాల గురించి అడిగితే- ఛలికి ప్రత్యేకదుస్తులు 6000 కెనడానుంచి వస్తున్నాయి! ఆశయసిద్ధి కోసం పనిచేసే సైన్యం యుద్ధసామగ్రికోసం ఎదురు చూడదు! అయినా కొన్ని తుపాకులు తెప్పిస్తాను. పోర్టర్లు దారిలో ఉన్నారు. వీలైనంత త్వరగా వచ్చేస్తారు! అన్నాడు. అన్నీ మరెప్పుడొ వస్తాయి. కానీ దళంమాత్రం ఇప్పుడే బలైపోవాలి! ఇక చేసేదిలేక కనీసం ఒకసారి గస్తీ తిరిగి అక్కడీ పరిస్థితి చూసొస్తాం. అప్పటిదాకా ఆగండి. అని ఒప్పించి ఒకబృందాన్ని అందుకు పంపారు. అందరికీ బుర్ర తిరిగిపోతోంది. ఏమి జరుగుతుందో అర్థంకాని పరిస్థితి.

అక్టోబరు 9 సాయంత్రం 9పంజాబ్ గస్తీకి వెళ్ళారు. తెల్లవారుఝామున హఠాత్తుగా ఒకచైనాదళం ఎదురవడంతో కాల్పులు మొదలయ్యాయి. పంజాబీలు సుమారు 50మంది ఉన్నారు. చైనీయులు 800 మంది. చైనీయులు తేరుకునేలోపే మనవాళ్ళు దెబ్బతీయడంతో మొదట మనవారిదే పైచేయి అయింది. కానీ బలగం ఎక్కువవటంతో వెంటనే తేరుకుని మోర్టార్లతో దాడిచెయ్యగలిగారు. మనవాళ్ళు 6మంది చనిపోగా, 11మంది గాయపడ్డారు. అందులో మేజర్ చౌధరీకూడా ఉన్నాడు. చైనీయులు 100మంది చనిపోయారు. చైనీయుల ఎదురుదాడిని చూసి నోరెళ్ళబెట్టిన జనరల్ కౌల్ "Oh My GOD” అంటూ పొలికేక పెట్టి, "వాళ్ళు మోసం చేస్తున్నారు. ఇది తొండి."  అంటూ చిందులెయ్యసాగాడు. వెంటనే దాల్వీ వైపు తిరిగి "ఇది నీదళం. నీయుద్దం. కాబట్టి నువ్వే పోరాడాలి." అన్నాడు! ఒకసారి ఎదురుదెబ్బ తగిలితేకానీ ఎవరేమిటో అర్థం కాలేదు ఆయనకి.

అదృష్టంకొద్దీ నేరుగా రాజపుత్రులను పంపకుండా ఒకబృందాన్ని గస్తీకి పంపాం. అలాకాకుండా మెత్తం దళాన్నే పంపుంటే ఎంత నష్టం జరిగుండేదో? అక్కడికి వెళ్ళడానికి మరొక 5000అడుగులు ఎక్కాలి. వారి దగ్గర 100రౌండ్లకు సరిపడా సామాగ్రి మాత్రమే ఉంది. మొత్తందారి చైనీయుల కళ్ళముందే ఉంటుంది. వాళ్ళు వీరికన్నా ఎత్తులో ఉంటారు. కాబట్టి చాలాసులువుగా హతమార్చగలరు. ఒకవేళ దాడి చెయ్యకపోయినా, దళం అటువైపుకి చేరుకున్నాక వాళ్ళమర్గాన్ని మూసేస్తే ఆకలితో చచ్చిపోతారు. లేదంటే మరోవారంలో పడే మంచు ఆపని పూర్తిచేస్తుంది. ఆలోచించేందుకే భయమేస్తున్న ఈవ్యూహాన్ని జనరల్ కౌల్ గారు తనమేధాశక్తినంతా ఉపయోగించి రచించాడు. ఆరోజు చైనీయుల దాడిలో చనిపోయినవాళ్ళందరినీ జనరల్ కౌల్ హత్యచేసినట్టే పరిగణించాలి.

వెంటనే దాల్వీ ఉన్నపళంగా ఆప్రాంతాన్ని ఖాళీచేసి వెళ్ళిపోవాలని కౌల్, ప్రసాద్లకు చెప్పాడు. దానికి ఇద్దరూ అంగీకరించాడు. అన్ని ప్రాణాలు గాలిలో కలిసిపోతేగానీ ఆయనకు నిజం తెలియలేదు. తదనంతరం తీసుకోవాల్సిన చర్యలకు ప్రధానిని కలిసిగానీ ఏవిషయం చెప్పలేనని తేల్చేశాడు. దళాన్ని అంతటి విపత్కర పరిస్థితుల్లో వదిలేసి డిల్లీకి బయల్దేరాడు. వెళ్తూ వెళ్తూ- తాను తిరిగివచ్చేవరకూ శత్రువును తరిమికొట్టే విషయాన్ని పక్కన పెట్టాలని, బ్రిడ్జిలను రక్షించుకోవాల్ని, లుంపు మార్గాన్ని,హథూంగ్లాలను కాపాడాలని ఆదేశించాడు. ఇప్పుడున్న స్థానాలని యథావిథిగా కొనసాగించాలని కూడా అదేశించాడు.

మరొకవైపు యుద్ధరంగంలో పంజాబీలు వీరోచితంగా పోరాడుతున్నారు. చైనీయుల ఆధిక్యతను సవాలు చేస్తున్నారు. వారికి సహాయాన్ని అందించడానికి చౌదరి, మిశ్రాలు దాల్వీని ఆదేశించమన్నారు. కానీ ఇక్కడ పరిస్థితి మరింత సున్నితంగా ఉంది. మనవద్ద ఉన్న ఆయుధాలు అంతదూరం బాంబులు విసరలేవు. అనవసరంగా వాటిని ఉపయోగించడం వల్ల మొత్తం చైనాబలగాలు వీరిమీదకి వచ్చే అవకాశం ఉంది. అప్పుడు ఒక్కరూ మిగలరు. ఈవిపత్కర పరిస్థితుల్లో దాల్వీ పంజాబీ వీరులు ఒక్కొక్కరూ నేలకొరుగుతుంటే చూస్తూ ఊరుకోవాల్సి వచ్చింది. అప్పటికే చైనీయులు మరొక్క అవకాశం వస్తే మొత్తందళాన్ని చీల్చిచెండాడేలా ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి అవకాశం ఇవ్వడం సబబు కాదు.

నిజానికి ఇక్కడ జరిగింది యుద్ధంకాదు. మన గస్తీమీదకి చైనీయులు దాడి చేశారు. అదీ మన భూభాగంలో. కానీ మన నాయకులు ప్రగల్భాలు పలుకుతూ ఇచ్చిన తప్పుడు ప్రకటనలలో డొల్లతనాన్ని ఉపయోగించుకుని చైనీయులు మనమే వాళ్ల భూభాగంలోకి చొచ్చుకు వెళ్ళినట్టు, వారిపై దాడి చేసినట్టు, ఆత్మరక్షణలోనే చైనీయులు ప్రతిదాడి జరిపినట్టు ప్రపంచాన్ని నమ్మించారు. అది ఉద్దేశ్యపూర్వకంగా జరిగినదాడి కాదు.

రాజకీయ అవసరాల దృష్ట్యా తీసుకున్న నిర్ణయాలను బలవంతంగా సైన్యంమీద రుద్ది, వారిచేత తమ అవసరాలకు అనుగుణంగా చర్యలు చేపట్టించినందుకు ఫలితం- దేశంపరువు పోయింది. సైనికుడు అకారణంగా ప్రాణం కోల్పోయాడు. రాజకీయావసరాలే పరమావధిగా పనిచేసిన ఒక సైనికాధికారి స్వార్థం వీటన్నింటికీ కారణమయ్యీందా? లేక ఆయన్ని పంపకూడని చోటుకి పంపిన నాయకుల నిర్లక్ష్యం వీటన్నిటినీ నడిపిందా? కారణ మేదైతేనేం తేనెతుట్టె కదిలింది.

మేరునగ తప్పిదం- 12.రాజుగారొచ్చారు

సెప్టెంబరు 30న రక్షణమంత్రి కృష్ణమీనన్, ఆతర్వాత అక్టోబరు 2న నెహ్రూ తమతమ విదేశీ పర్యటనలు పూర్తి చేసుకుని డిల్లీ చేరారు. ప్రభుత్వాధినేతగా నెహ్రూ పర్యటనలు చెయ్యాల్సి ఉంటుంది. దాన్నెవరూ కాదనలేం. ఆయన ఈసమస్యను అనేకదేశాల నేతలతో చర్చించి తన పలుకుబడిని ఉపయోగించి దీన్ని పరష్కరించాలని అనుకొని ఉండవచ్చు. కానీ వాటిమీదే ఆధారపడి మరే జాగ్రత్తలూ తీసుకోకపోవడం వ్యూహాత్మక తప్పిదమే. అనేక అంతర్జాతీయ వ్యవహారాలను సమర్థంగా చక్కబెట్టి దూరదృష్టిగల నేతగా మన్ననలందుకున్నాయన ఈవిషయంలో ఆవిధంగా వ్యవహరించకపోవడం పొరపాటే. తిరిగొచ్చే సమయానికి సరిహద్దు భద్రత రక్షణపరంగాకన్నా రాజకీయపరంగా ఎక్కువ సున్నితమై కూర్చుంది. చాలా వరకు సమస్య చెయ్యిదాటిపోతున్న సూచనలున్నా రష్యానాయకుడి వద్ద చైనా జనరల్ ఇచ్చిన మాటను పట్టుకుని నిమ్మళంగా ఉండిపోయారు. అయితే రాజకీయ ప్రత్యర్థులకు జవాబు చెప్పాలంటే దాడిచెయ్యడమే ఏకైక మార్గమని భావించాడు. తప్పిదానికి తొలిమెట్టు ఇక్కడే పడింది. అప్పటి వరకు లాంచనప్రాయంగా సమర్పిస్తున్న నివేదికలు తప్ప సరిహద్దు వద్ద వాస్తవ పరిస్థితి ఆయనకు పూర్తిగా తెలిసిరాలేదు. దాడిచెయ్యడాన్ని జనరల్ థాపర్ సమర్థించక పోయినా నెహ్రూను ఎదిరించేంత శక్తులేక మిన్నకుండి పోయాడు.

సెలవుమీద ఉన్న జనరల్ కౌల్ను వెంటనే పిలిపించారు. ఇప్పుడు దేశరక్షణ, దాని పరువు అతని చేతిలో పెట్టే కార్యక్రమం మొదలయ్యింది. జనరల్ ఉమ్రావుతో విబేధించినప్పటికీ సేన్ కూడా సదిగ్ధంలోనే ఉన్నాడు. లక్ష్యం అసాధ్యమన్న వాస్తవం ఆయనకు నెమ్మదిగా బోధపడసాగింది. ఇదే విషయాన్ని మీనన్కు స్పష్టం చేశాడు. ఒకవేళ దాడి చెయ్యడమే మనకున్న మార్గం అనుకుంటే తరువాత పరిణామాలు ఎదుర్కొనేందుకు సిద్దపడాలని సూచించాడు. కానీ చలికాలం మొదలయ్యే లోపలే దాడిచెయ్యాలి. లేకుంటే కొన్ని నెలలపాటు మొత్తం కార్యక్రమం వాయిదా పడుతుందన్న కారణంతో మీనన్ తొందరపడ్డాడు. సైనికాధికారుల్లోని సందేహాలను ప్రభుత్వం కనీసం పట్టించుకోకపోవడం అనైతికం.

ఇక వీరిని సముదాయించడాని కన్నట్టుగా నెహ్రూ జెనీవాలో రష్యానాయకుని సమక్షంలో చైనా జనరల్ ఇచ్చిన మాటను వారికి చెప్పాడు. "చైనా మనమీద యుద్ధం ప్రకటంచదు. దానికి నాది హామీ." అన్నవిధంగా వాళ్ళకి ధైర్యం నూరిపోశాడు. అలా ఒక సైనికచర్య కాస్తా రాజకీయ ప్రక్రియగా భావిస్తూ నెహ్రూ ఇంకా కలల్లోనే విహరిస్తున్నాడు. పోనీ దాడికి పూనుకున్నప్పుడు అదైనా పూర్తిస్థాయిలో చేస్తున్నారా? అంటే అదీలేదు. కేవలం తూతూమంత్రంగా కొన్నిదళాల్ని సరిహద్దులో పెట్టి, ఒకట్రెండు చోట్ల దాడిచెయ్యించి, చలి పెరిగేలోగా వెనక్కి వచ్చేద్దామన్నది వాళ్లవ్యూహం. చలిపెరిగేదాకా చూస్తూ కూర్చోవడానికి చైనా ఏమైనా పిచ్చిదా? బలహీనమైనదా? ఒకసారి మనం కదిపాక వాళ్ళు అంతటితో ఊరుకునే రకం కాదు. అందరూ మనలాగా ఉండరు కదా! తమలపాకుతో నువ్వు ఒకటిస్తే తలుపుచెక్కతో నేను పదిస్తా అనే రకం. మరి వాళ్ళప్రతిదాడిని సమర్థంగా తిప్పికొట్టే వనరులు, ప్రణాళిక, అనుకూల పరిస్థితులూ ఏమైనా ఉన్నాయా? అంటే వ్యూహకర్తలకు డిల్లీ భవనాల కారిడార్లు తెలుసుగానీ సరిహద్దులో వాస్తవికస్థితిని గురించి ఇసుమంతైనా తెలియదు. చైనా ప్రతిదాడి చేస్తే? అన్న ప్రశ్న మనసులో తలెత్తగానే అధికారులకు వెన్నులోంచి వణుకు పుట్టింది. ప్రత్యర్థుల బలాన్ని చూసికాదు. సైనికుల ప్రాణాలకున్న ముప్పును గురించి. రక్షణపరంగా ఎలాంటి ఉపయోగమూలేని ఒకరాజకీయ చదరంగంలో సైనికుడెందుకు బలవ్వాలి? ఒక సమర్థుడైన యోధుణ్ణి అనవసరమని తెలిసీ చూస్తూచూస్తూ అతని ప్రాణాలతో చెలగాటమెందుకు ఆడాలి? అన్న ఆలోచనలు అధికారుల్ని కలచివేశాయి. కానీ ఏమీ చెయ్యలేని నిస్సహాయత. నెహ్రూ స్థాయి నాయకునికి సరిహద్దు రక్షణకన్నా పార్టీ అధికారంలో ఉండటమే ముఖ్యమైంది.

వెంటనే జనరల్ కౌల్ తెరమీదుకొచ్చాడు. ఆయనకోసం అప్పటికప్పుడూ ఒక దళాన్ని సృష్టించి (4Corps), దానికి కమాండర్ను చేశారు. వెంటనే ప్రభుత్వ సమాచారసాధనాలన్నీ ఊదరగొట్టడం మొదలుపెట్టాయి. కౌల్ బాద్యతలు చేపట్టి, సరిహద్దు వ్యవహారాల సమాచారాన్ని తెలుసుకున్నాడు. చేతిలో అద్భుతదీపం ఉన్నవాడిలా వ్యవహరించసాగాడు. రాజకీయ కారణాలతో హఠాత్తుగా నెలకొల్పిన దళానికి కమాండర్గా ఉన్నపళంగా సైనికచర్యలు చేపట్టి, మిగతా వారికీ తనకూ మద్యన తేడా ఏమిటో చూపి శ్రీవారి మన్ననలు పొందుదామన్న తపన అడుగడుగునా కనిపించసాగింది. ఆక్రమంలో అనాదిగా సైన్యం పాటిస్తున్న విలువలు, నియమాలు, క్రమశిక్షణ వంటివి బుర్రలోంచి తుడిచేశాడు. అయితే అరకొరగా ఉన్న వనరులను మెరుగుపరచడమన్నది మాత్రం ఆదేశాలిచ్చిన ఎవరికీ గుర్తు రాలేదు. చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్ గా ఇది జనరల్ కౌల్ ప్రథమబాద్యత.

ఈ వ్యవహారాలన్నింటినీ మొదట్నుంచీ వ్యతిరేకిస్తున్న జనరల్ ఉమ్రావ్ కంటికింద నలుసులా తయారయ్యాడు. ఆయన  XXXIII Corpsకు నాయకత్వం వహిస్తున్నాడు. అది తూర్పుదళం కింద అంటే జనరల్ సేన్ కింద ఉంటుంది. ఉమ్రావ్ కింద సరిహద్దులో ఉన్న దళాలన్నీ ఉన్నాయి. వాటి ప్రధాన కేంద్రం తేజ్పూర్లో. అక్కడి బాద్యతలు జనరల్ ప్రసాద్ నిర్వహిస్తున్నాడు. ఈదళాలన్నీ ఒకపద్దతి ప్రకారం నెలకొల్పి, శిక్షణ తీసుకుని అక్కడ కార్యక్రమాలు సాగిస్తున్నాయి. అరకొరవనరులైనా, తగినంతమంది సైనికులు లేకపోయినా ఎలాగో నెట్టుకొస్తున్నారు. జనరల్ కౌల్ను సరిహద్దుకు పంపాలనుకుంటే ఆయన్ని వీటిలో దేనికైనా సారధ్యం వహించమని చెప్పవచ్చు. కానీ అవన్నీ ఆయాన స్థాయికి తగినవి కాదు. ఆయన సాక్షాత్తూ జవహర్ లాల్ నెహ్రూద్వారా నియమించబడ్డాడు. ఆయన స్థాయికి తగినది ఏమైనా ఉందంటే అది Corpsకు నాయకత్వం వహించడం. మరి ఆస్థానంలో అప్పటికే జనరల్ ఉమ్రావ్ సింగ్ ఉన్నాడు. ఆయన్ని కదిలిస్తే ప్రజల నుంచి మరింత వ్యతిరేకత వస్తుంది. మరి జనరల్ కౌల్ ఏమి చెయ్యాలి? దానికోసమే రాత్రికి రాత్రి 4Corps అన్నదాన్ని ఏర్పాటు చేసి దానికి నాయకత్వం వహించమన్నారు. మరి అందులో ఎవరైనా సైనికులున్నారా? అంటే అదీలేదు. ఈసంగతి తెలిసి "మీరు మారరురా!" అని ప్రపంచం మనల్ని చూసి నవ్వింది. ఇక మొండిఘటమైన ఉమ్రావును సరిహద్దు వ్యవహారాలనుంచి పక్కకు తప్పించింది. అది ఆయన Corps కిందకు వచ్చే ప్రాంతమే అయినా ఆయనకు సంబంధంలేదు పొమ్మన్నది. ఒకవేళ ఉమ్రావే అక్కడ ఉండి ఉంటే? అన్న ప్రశ్నకు జవాబుగా- ఆయన అద్భుతాలు చేసి చూపించకపోయినా మనసైనికుల ప్రాణాలు గాలిలో కలిసిపోకుండా కాపుడుండేవాడన్న సమాధానం మనందరికీ అనిపిస్తుంది.

జనరల్ ఉమ్రావ్ సింగ్ గురించి కొన్ని విషయాలు-

యోధులకు పుట్టినిల్లైన రాజస్థాన్లోని జైపూరుకు చెందిన రాజపుత్రుడీయన. ఎప్పుడూ నిబ్బరంగా కనిపించే ఈయన యుద్ధభూమిలో తిరుగుతూ ఉంటే సైనికులకు తెలియని ధైర్యం. సరిహద్దు వ్యవహారాల్లో అందరూ గాభరాపడిన సందర్భాల్లోనూ తొణక్కుండా పనిచేశాడు. వాస్తవ పరిస్థితిని అంచనా వెయ్యడానికి ఈయన పర్యటించినన్నిసార్లు మరే ఉన్నతాధికారీ పర్యటించలేదు. పైవాళ్ళ ఆగ్రహానికి గురవతామని తెలిసినా తన అభ్యంతరాలను లిఖితపూర్వకంగా సమర్పించడానికి ఎన్నడూ వెనకాడలేదు. దాడి చెయ్యలనుకున్నప్పుడు ఆయన అన్న మాటలు: " దాడి చేస్తాం. భారతీయులంతా మనగురించి గొప్పగా మాట్లాడుతారు. దండలు వేస్తారు. కానీ అకారణంగా ప్రాణాలు కోల్పోయిన సైనికుల మాటేంటి?" ఇది చాలు ఆయనలోని మనిషిని గురించి చెప్పడానికి. చైనీయులను తరిమివెయ్యాలన్న లక్ష్యాన్ని చూసినప్పుడు కిందవాళ్ళవంక జాలిగా చూశాడు. వాళ్ళను కాపడటానికి చెయ్యగలిగినంతా చేశాడు. ఒకవేళ ఆయన మాట వినుంటే సైనికుల ప్రాణాలతోబాటుగా దేశప్రతిష్ట నిలిచి ఉండేది. ఆస్థాయి వ్యక్తిని యుద్ధంమద్యలో తొలగించడం ఆయన్ని ఉరితీయడంకన్నా ఏరకంగానూ తక్కువకాదు.

మేరునగ తప్పిదం- 11.తరిమికొట్టండి


సెప్టంబరు 20 రాత్రి 10:30కి రెండవ బ్రిడ్జ్ దగ్గర ఉన్న చైనా కాపలాదారుడొకడు హఠాత్తుగా భారత పోస్టు మీదకి ఒక గ్రెనేడ్ను విసిరడంతో మరొక అంకానికి తెరలేచింది. ఈ హఠాన్పరిణామానికి దిగ్భ్రాంతి చెందిన భారతసైన్యం వెంటనే ఎదురుదాడి చేసింది. ఇరువర్గాలూ పరస్పరం కాల్పులు జరుపుకోన్నాయి. ఇద్దరు చైనీయులు మరణించగా మరొక ఇద్దరు గాయపడ్డారు. ఐదుగురు భారతీయులకి స్వల్పగాయలయ్యాయి. అరకొర సామాగ్రితోనే భారత సైన్యం దాడిని సమర్థవంతంగా తిప్పి కొట్టింది. ఈదాడి అంతకుముందు జరిగిన చెదురుమదురు ఘటనల లాంటిది కాదు. దీనితో ఇక చైనీయులు ఆప్రాంతాన్ని వదిలి వెళ్ళరని స్పష్టంగా తెలిసొచ్చింది. చైనీయులతో మాట్లాడేందుకు భారత పౌరవ్యవహారాల అధికారి మోంగియా ప్రయత్నించగా వాళ్ల ప్రవర్తన కారణంగా అది కుదరలేదు. అలాగే మరొక 500మంది పోర్టర్లను సరఫరా చేసేందుకు ఆయన ముందుకొచ్చాడు. కానీ అప్పటికే సరిహద్దులో యుధ్దవాతావరణం నెలకొని ఉండటంతో గిరిజనులను సరిహద్దు వరకు పంపనని, వారు సెర్ఖిం వరకే తీసుకొస్తారని, అక్కడి నుంచి సైనికులే మోసుకెళ్ళాలని చెప్పాడు.

మైదానాల నుంచి బయలుదేరిన పంజాబ్ దళాలు చిన్నచిన్న బృందాలుగా చేరుకోసాగారు. వాళ్ళు తొడుక్కుని ఉన్న కేన్వాస్ బూట్లు చిరిగిపోయి, రబ్బరు అడుగు బయటకు వచ్చేసి ఉన్నాయి. వాళ్ళు ధరించిన ఆలివ్ గ్రీన్ సమ్మర్ యూనిఫాం చలిని ఏమాత్రం ఆపలేదు. కానీ వాళ్ళదృష్టిలో అవన్నీ చాలా చిన్నవిషయాలు. సైనికుడూ యుద్ధానికి వెళ్ళేటప్పుడు వాటి గురించి ఆలోచించకూడదన్న వాళ్ళ అభిప్రాయం. నిజమే! సైనికుడు ఆలోచించక పోయినా, అధికారులకి, ప్రభుత్వానికి ఆలోచించాల్సిన బాద్యత ఉందికదా. వాళ్ళడిగేవేవీ విలాసాలుకావు.  కనీస అవసరాలు. దేశ ఆర్థికవ్యవస్థ ఎంత బలహీనంగా ఉన్నా మరీ ఇంతహీనంగా అయితే లేదు. ఇలాంటి సదుపాయాలతో చైనా ప్రభుత్వం తనసైనికుల్ని వెళ్ళమంటే సరిహద్దుదాకా వచ్చి ఉంటారా? అన్నది సందేహమే. కానీ ప్రాణాల్ని పణంగా పెట్టి పోరాటానికి సిద్ధమైన దళాల్ని గమ్యానికి చేరుకోవడంలో ఇంత ఆలశ్యం ఎందుకైందని ప్రశ్నించింది మన రాజధాని!
సైన్యం చైనీయుల దాడీని సమర్థంగా తిప్పికొట్టి ఆపోస్టుతో పాటుగా రహదారులన్నీ తమ ఆధీనంలోకి తెచ్చుకుంది. నమ్కాచు నది మీద ఉన్న నాలుగు బ్రిడ్జిల వద్దా పంజాబ్ దళాలను మోహరించారు. 40 అడుగుల వెడల్పున్న నదికి ఇరువైపులా రెండుదేశాల సైనికులు నిల్చుని ఉన్నారు. ఇది చరిత్రలోనే అరుదైన ఘట్టం. చైనీయులు తమ జిత్తులమారి ఎత్తులను సైన్యం మీద ప్రయోగించసాగారు. ఒకవైపు గ్రెనేడ్లు విసురుతూనే, చర్చలకు రమ్మంటూ శాంతిమంత్రాలని వల్లించసాగారు. పైనుంచి వచ్చిన ఆదేశాల్లో స్పష్టత లోపించడంతో సైన్యం గందరగోళానికి గురైంది.  బట్లరు హిందీలో భారత్-చైనాల మద్య స్నేహాన్ని లౌడ్ స్పీకర్ల ద్వారా చెప్పసాగారు. ద్వంద్వ విధానాలద్వారా సైన్యం నైతికస్థైర్యాన్ని దెబ్బతీయడానికి వాళ్ళు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. అయితే దీన్ని ప్రతిఘటించే విధంగా భారత అధికారులు ఎలాంటి చర్యలూ చేపట్టకపోవడంతో చైనీయులు ఇంకొక అడుగు ముందుకేసి "మా భూభాగంలో మీకేం పని?" అని ప్రశ్నించసాగారు. దీనికి మనవైపునుంచి సరైన జవాబు రాకపోవడం సైన్యాన్ని కొంతగందరగోళానికి గురిచేసింది. 40 అడుగుల దూరంలో బలమైన శత్రువును ఎదురుగా ఉంచుకుని, మానసిక స్థార్యాన్ని కోల్పోకుండా, రోజుల తరబడి పోరాడటం అంత సులువైన విషయంకాదు. ఇది వీధుల్లో ఝెండా పట్టుకుని "భారతమాతా కీ జై", "జైహింద్", "వందేమాతరం" అంటూ ర్యాలీలు చేసినంత, ఫేస్బుక్లో షేర్లు, లైకులు కొట్టినంత సులుభం కాదు. అణువణువునా దేశభక్తి నింపుకుని, ఈమట్టికోసం ఆత్మార్పణకు సిద్ధమైన వాడు మాత్రమే చెయ్యగల మహత్కార్యం.
అరువుమీద దళాల్ని తెచ్చి, ఒక అతుకుల బొంత బ్రిగేడును తయారు చెయ్యడంలో అధికారులు ఎట్టకేలకు కిజయం సాధించారు. 1/9 గూర్ఖాల దళాన్ని, 2రాజపుత్రుల దళాన్ని వాడుకోవడానికి అనుమతి లభించింది. వీళ్లందరినీ 7 పదాతిదళ బ్రిగేడుకు అనుసంధానించారు. అలా ఒకజట్టుగా ఉండాల్సిన బ్రిగేడ్ కాస్తా నానాదళాల గుంపుగా అయ్యికూర్చుంది. ఒక్కొక్క దళం బలాబలాలు ఏమిటో? వాటి నైపుణ్యాలేమిటో? పరిమితులేమిటో? తెలియకుండానే వాటికి నాయకత్వం వహించాల్సిన బాద్యత దాల్వీ మీద పెట్టారు. సెప్టెంబరు 26కు ఈదళాలు లుంపుకి చేరుకున్నాయి. మిగతా దళాల మాదిరిగానే వీరి ప్రయాణాలూ జరిగాయి. "మీరు ముందు బయల్దేరండి. మీసామాగ్రి అంతా మీరక్కడికి చేరుకునే సరికే పంపిస్తాం." అని మాటిచ్చిన అధికారులు తరువాత మరిచిపోయినట్టున్నారు. అలా సెప్టెంబరు 10న బయల్దేరిన వాళ్ళు 15రోజుల తరువాత చేరుకున్నారు. దారిలో పర్వతాలు అలవాటులేక అనేకమంది రక్తపువాంతులు చేసుకున్నారు! అయినా లుంపు చేరాక తర్వాతిరోజే బాద్యతలు తీసుకోవాడిని సిద్ధపడ్డారు! చైనీయులను తరిమికొట్టడం మినహా వీరికంటూ సవివరంగా నిర్దేశించిన లక్ష్యాలంటూ ఏమీ లేవు.

రాజపుత్రుల బృందమొకటి తెల్లవారుఝామున శిక్షణ తీసుకుంటున్నారు. కొత్తగా చేరిన కొందరికి గ్రెనేడ్ ఎలా ఉపయోగించాలో తెలియదు! అక్కడ సాధన చేస్తున్నారు. శిక్షణకు సరిపడినన్ని గ్రెనేడ్లు మనదగ్గర లేవు. కాబట్టి సైనికులు యుద్ధభూమిలోనే అన్నీ నేర్చుకొని, శత్రువుతో పోరాడాలి. తొవాంగును రక్షించే బాద్యత కళ్యాణ్ సింగ్ తీసుకున్నాడు. మనకు నిర్దేశించిన లక్ష్యాల్లో తొవాంగును కాపడటం, చైనీయులను థాగ్ల నుంచి తరిమికొట్టడం అన్న పరస్పర విరుద్ధమైనవి ఉండటాన సైనికబలం రెండింటిలో దేనినీ సాధించలేని స్థితిలో ఉంది. అలాగే మిసిమారి నుంచి తొవాంగుకు గల మార్గాన్ని రక్షించే బాద్యత పర్వతపాదాల వద్ద ఉన్న మెచీన్ గన్ దళానిది. 300మైళ్ళ దూరాన్ని ఎన్ని మెచీన్ గన్లతో కాపు కాయాలి?
వాయురవాణా కొద్దిగా ఊపందుకోవడంతో నెమ్మదిగా పంజాబీలకు సరిపడినంత ఆయుధాలు లభించ సాగాయి. వాటిలో మైన్లు, ఫ్యూజుల వంటి సాధారణ సామాగ్రికూడా లేదు. గిడ్డంగుల జాబితాలో ఇవి విలాసాలుగా పరిగణించబడ్డాయి. పంజాబీలు రోజూ చైనీయులతో కాల్పులు ఇచ్చిపుచ్చుకుంటున్నారు. ఆసమయంలో పంజాబీల గుండెనిబ్బరాన్ని చైనీయులు సైతం మెచ్చుకున్నారు. ఒకవీరుడికే మరొకవీరుని గొప్పతనం తెలిస్తుంది కదా! పంజాబీలకు సరిపడినంత సామాగ్రి అందజేశాక, మిగిలిన గూర్ఖా, రాజపుత్రదళాలకు సరఫరా మొదలుపెట్టారు.

హెలికాప్టర్లు జారవిడిచిన వస్తువులను ఏరుకుని తెచ్చేదానికి రోజుకు 400మంది వినియోగించ బడుతున్నారు. ఇలాంతి దృశ్యాలు జనరల్ ఉమ్రావ్ సింగును తీవ్రంగా కలచివేశాయి. వాస్తవ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని మాట్లాడమని, ప్రగల్భాలకు పోవద్దని హెచ్చరించాడు. రాజకీయ కారణాలను సాకుగా చూపించి హిమాలయాలంత పెద్ద అవరోధాన్ని పక్కన పెట్టలేం.

రక్షణమంత్రితో జరిగిన సమావేశంలో "చైనీయులు మూడు కంపెనీలుగా ఉన్నాయి. వారికి వెనకనుంచి మద్దతివ్వడానికి ఇంకొన్ని దళాలు ఉన్నాయి. వారి రహదారులు, ఇతర సదుపాయాల దృష్ట్యా రవాణా కూడా మెరుగ్గా ఉంది." అని ఆర్మీ చీఫ్ వెల్లడించాడు. కానీ ప్రభుత్వం మాత్రం ఇవేవీ పట్టనట్టు "చైనీయులను తరిమికొట్టాల్సిందే" అని ఆదేశించింది. చేసేదిలేక జనరల్ థాపర్ రాతపూర్వక ఉత్తర్వులివ్వమని అడిగాడు. తక్షణం ఒక జాయింట్ సెక్రటరీ స్థాయి అధికారి ఉత్తర్వులను జారీ చేసేశాడు. ఒక ఆర్మీచీఫ్ స్థాయి అధికారికి జాయింట్ సెక్రటరీ ఉత్తర్వులు జారీచెయ్యగలిగినంత అతీతమైన శక్తులు డిల్లీదర్బారులో తిష్టవేసుకుని కూర్చున్నాయి.  పైనుంచి వెలువడిన ఉత్తర్వులు పోస్టుమాస్టరులాగా జనరల్ థాపర్ జనరల్ సేన్కు బట్వాడా చేసేశాడు. అక్కడినుంచి కిందకి, ఇంకొకమెట్టుకిందకి జారుకుంటూ అనేక పోస్టుమాస్టర్ల ముద్రలు వేసుకుంటూ సరిహద్దులోని దళకమాందర్ దగ్గరికొచ్చి పడింది. ఆయన కింద కాగితాలు తీసుకునేవాళ్ళెవరూ లేర్. ప్రాణాలిచ్చే వాళ్ళు తప్ప. అలా ఒకదేశపు సైనికవ్యవహారం ఆదేశపు రాజకీయ అంశాలమీద ఆధారపడి నడిచింది.

ఇక ఆ ఆదేశాన్ని ఆధారంగా చేసుకుని సైన్యం ప్రణాళికను రూపొందించాల్సి వచ్చింది.  ప్రతి దళనాయకుడూ లాంచనంగా నిర్వహించే క్షేత్రస్థాయి అంచనాలను దాల్వీ తయారు చెయ్యనారంభించాడు.  అన్ని ప్రతికూల అనుకూల అంశాలు ఇందులో పొందుపరచాలి. యుద్ధభూమిలో వాతావరణం స్థిరంగా ఉన్నంతకాలమే దీనికి ఆయుష్షు ఉంటుంది. ఒకసారి వేగం పుంజుకుంటే మారుతున్న పరిస్థితులకనుగుణంగా దీన్నీ మారుస్తూ వెళ్ళాలి. మామూలుగా అయితే ఇది తయారుచేసి పైవాళ్లకి పంపితే వాళ్ళు దాన్ని పరిశీలించి, మార్పులు చేసి ఆమోదముద్ర వేస్తారు. దానికనుగుణంగా ఆదేశాలు జారీచేస్తారు. కానీ ఇక్కడ పరిస్థితి తిరగబడింది. ప్రభుత్వమే ఉందుగా ఆదేశాలిచ్చింది. దానిప్రకారం క్షేత్రస్థాయి అంచనాను దళకమాందర్ తయారు చెయ్యాలి. కానీ ఆలక్ష్యానికి అనుగుణంగా ఇక్కడ వనరులు లేవు.

అలా దానిని ఎలా తయారుచెయ్యాలా అని తలబద్దలు కొట్టుకుంటూంటే జనరల్ ప్రసాద్ హఠాత్తుగా ఊడిపడ్డాడు. ప్రధాన కార్యాలయంలో ఉండాల్సినాయన్ని ఉన్నపళంగా యుద్ధభూమికి వెళ్ళి అక్కడ పరిస్థితులు సమీక్షించమని ఆదేశాలొచ్చాయి. దాంతో ఆవయసులో, జనరల్ స్థాయి అధికారి అయ్యుండీ కాళ్ళీడ్చుకుంటూ కొండలనెక్కి లుంపుకు చేరుకున్నాడు. ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న ఆయనపై కనీస దయాదాక్షిణ్యంకూడా చూపకపోవడం ఇదేమి ప్రజాస్వామ్యం? జనరల్ స్థాయి అధికారి మొత్తంవ్యవహారాన్ని సమీక్షించాల్సిందిపోయి ఒకదళాన్ని నడుపుతూ ఇక్కడ ఉండుపోవడం ఎలాంటి యుద్ధవ్యూహం?

జనరల్ సేన్ ప్రభుత్వ నిర్ణయాన్ని తెలియజేస్తూ జనరల్ ఉమ్రావును వీలైనంత త్వరగా పని ముగించాలని ఆదేశించాడు. దాన్ని ప్రతిఘటించలేని జనరల్ ఉమ్రావ్ కిందివాళ్ళని ఒక అంచనా తయారు చేసి ఇవ్వమన్నాడు. ప్రబుత్వ నిర్ణయం దుస్సాధ్యమని అందరికీ తెలిసినా చెప్పి ఒప్పించేవాడే కరువయ్యాడు. ప్రభుత్వం ఈవిషయాన్ని అల్లరిమూకలను చెదరగొట్టి ఓట్లుదండుకునే వ్యవహారంగా చూసిందే తప్ప ఒకదేశసైన్యం మరొకదేశసైన్యంతో జరిపే పోరాటంగా చూడలేదు. ఆస్థాయికి వాళ్ళింకా ఎదగలేదు. అలా ప్రభుత్వం తనరాజకీయ కారణాల దృష్ట్యా తీసుకున్న దుస్సాధ్యమైన నిర్ణయం సైన్యానికి లక్ష్యంగా నిర్దేశించబడింది.
దాల్వీ, జనరల్ ప్రసాద్ ఇద్దరూ అంచనాపత్రంతో కుస్తీ పట్టసాగారు. ప్రసాద్ ముందు రెండు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. ఒకటి- అంచనా తయారు చెయ్యనని చెప్పి ఉన్నతాధికారుల ఆగ్రహానికి గురికావడం. లేదా రెండు- లక్ష్యాలు చేదించడానికి అవసరమైన వనరులను, ఇతర అంశాలను అందులో పొందుపరచడం. ఆయన రెండవ దానికే మొగ్గుచూపాడు. పరిస్థితులను అదుపులో ఉంచడానికి, శత్రువుపై పైచేయి సాధించడానికి అవసరమైన పాలనాపరమైన సౌకర్యాలను కోరుతూ, వాస్తవ పరిస్థితిని, అలాగే లక్ష్యాలను చేదించడంలో మనకున్న పరిమితులను రాజధానికి తెలియపరచటం ద్వారా తనబాద్యతను పూర్తిచేశాడు. దాన్ని చూసిన ఉమ్రావ్ కొన్ని మార్పులుచేసి మరింత అయుధసామాగ్రిని, పాలనా సౌకర్యాలను కల్పించాలని సూచించాడు. లఖ్నో బయలుదేరుతూ అక్కడ జనరల్ సేన్కు అరకొర వనరులను వివరిస్తానని, కానీ ఎక్కువగా ఆశించవద్దనీ చెప్పాడు. అలాగే సరిపడా సమాగ్రి లభించేవరకు లుంపును దాటి ముందుకు వెళ్ళొద్దని హెచ్చరించాడు.
ఆనివేదిక అందడంతోనే బలగాలను సాంగ్లే ప్రాంతంలో ఉంచమని ఆదేశించారు. జరల్ ఉమ్రావ్ అభ్యంతరాలను వినేస్థితిలో అక్కడ ఎవరూ లేకపోవడం సైనికుల పాలిట శాపమైంది. ఆయన తన అభ్యంతరాలను రాతపూర్వకంగా తెలియపరచాడు. వెంటనే చైనా పెద్దసంఖ్యలో సైన్యాన్ని అక్కడకు పంపింది. ఇక అక్కడనుంచి భారత బలగాలు వెనక్కిరాలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయాయి. ఈఒక్కచర్యతో బలగాల మద్య సమాచారం, సమన్వయం పూర్తిగా లోపించాయి. ఇంకా చైనీయులను తరిమికొట్టమనే ప్రభుత్వం చెబుతోంది.  ఇలా సెప్టెంబరు చివరినాటికి రాజధానిలోని వ్యూహకర్తలకు, సరిహద్దులోని సైన్యానికి మద్య అగాధం పూడ్చలేని విధంగా పెరిగిపోయింది.

మేరునగ తప్పిదం- 10.శత్రువు వాకిలి

సెప్టెంబరు 11, అస్సాంరైఫిల్స్, పంజాబ్ దళాలు ధోలాకి వెళ్తూ ఉన్నారు. తేజ్పూర్లో దాల్వీ, ఇతర సైనికులూ రోజంతా తమ వైర్లెస్ సెట్లలోంచి మాట్లాడి సమాచారం సంపాదించను ప్రయత్నించినా వృధాప్రయాసే అయ్యింది. పురావస్తు శాఖకు అప్పగించాల్సిన సామాగ్రిని సైన్యానికిచ్చి యుధ్దంలో వాడమంటే ఇలాగే జరుగుతుంది. బృందాలు ఎక్కడూన్నాయో? వారి పరిస్థితి ఏమిటో? తెలియక అందరినీ ఉత్కంఠతకు గురిచేసింది. బృందాలు గమ్యానికి చేరుకునేలోగా అక్కడ వారికవసరమైన ఏర్పాట్లు చెయ్యడంలో అందరూ తలమునకలయ్యారు. ధోలానుంచి మరిన్ని ప్రమాదసంకేతాలు వస్తుండటం వారిని మరింత ఆందోళనకు గురిచేసింది.

రక్షణమంత్రి కార్యాలయంలో జరిగిన సమావేశానికి జనరల్ సేన్ హాజరయ్యాడు. 600మంది చైనీయులు ధోలాప్రాంతంలో సంచరిస్తున్నారనీ, వాళ్లను ఎదుర్కోవాల్సిందిగా బ్రిగేడ్ను ఆదేశించామనీ, అందుకు వాళ్ళకి 10రోజులు పడుతుందనీ నివేదించాడు. అయితే సరిహద్దులో 600మంది మాత్రమే ఉన్నారనీ అక్కడివాళ్ళెవరూ సేన్కు చెప్పలేదు. వెనకాల మరెంతమంది చైనీయులు ఉన్నారో? వాళ్ల దగ్గరున్న ఆయుధాలెలాంటివో? ఎవరికీ తెలియదు. కిందివారినెవరినీ సంప్రదించకుండా సేన్ నివేదించిన సమాచారం ప్రాధమిక యుద్ధనియమాలకు విరుద్ధం. సైన్యంలో పైవాళ్ళు ఏది చెబితే అదే శాసనం అని అందరం అనుకుంటూ ఉంటాం. కానీ ఎవరైనా కిందవాళ్ళకి ఆదేశాలు జారీచేసేదానికి ముందు వారి నుంచి వాస్తవపరిస్థితి గురించి సమాచారం తీసుకుంటారు. కిందవాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకే వాళ్ళకి ఆదేశాలు జారీచేస్తారు. అప్పుడే వాటిని అమలుచెయ్యగలమని విశ్వసిస్తారు. ఒకవేళ అక్కడున్నది 600మందే అనుకున్నా అరకొర వనరులతో నెట్టుకొస్తున్న దళం వారిని ఎలా ఎదుర్కోగలదు. దళానికి సారధ్యం వహిస్తున్న అధికారి అక్కడకు చేరుకోక ముందే, వారినుంచి వాస్తవ పరిస్థితి గురించి సమాచారం రాకుండానే, సాధ్యాసాధ్యాలను వారితో చర్చింకుండానే జనరల్ సేన్ డిల్లీలో వాగ్దానం చేసేశాడు. ఇది విపరీతాలకు దారితీసింది.

9పంజాబు దళం ఒకవైపు ఋతుపవనాలు కొనసాగుతున్నప్పటికీ అంత ఎత్తులో ప్రయాణిస్తూ చాలావేగంగా గమ్యానికి చేరుకున్నారు. మరోవైపు అస్సాం రైఫిల్స్ ధోలాపోస్టుతో అనుసంధానాన్ని ఏర్పరచుకున్నారు. వీరు నమ్కాచుకు దగ్గరగా ఉండటమేకాక అక్కడి స్థానిక అంశాలపై అవగాహన ఉన్నవాళ్ళు. అయితే ఈదళం రక్షణశాఖ కిందకు రాదు. దాంతో అది గమ్యానికి చేరుకునేంత వరకు సైన్యాన్ని విమర్శించినవాళ్ళకు చేరుకున్నాక మాత్రం అది విదేశాంగశాఖహు చెందిందని గుర్తొచ్చింది. మద్యలో పంజాబుదళంమీద అవాకులు చెవాకులు పేలడంతో సైన్యం సహనం కోల్పోయింది. కానీ అత్యుత్తమ దళాల్లో ఒకటైన దానిగురించి చేసిన విమర్శలను అందరూ వ్యతిరేకించడంతో మిన్నకుండిపోయారు.

సెప్టెంబరు 13న దాల్వీ తేజ్పూరు నుంచి లుంపుకు బయల్దేరడానికి హెలీపాడ్కు వచ్చాడు. అనుకోని సాంకేతిక కారణాలవల్ల పైలట్ ప్రయాణానికి అభ్యంతరం చెప్పాడు. ఆదారి తనకు కొత్తదవడంవల్ల సాహసం చెయ్యలేనని, మరుసటిరోజు వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. ఈసమాచారాన్ని తవాంగ్ కార్యాలయానికి అందజేశాడు. తొవాంగ్ సెక్టారుకు ఇన్ చార్జిగా బ్రిగేడియర్ కళ్యాణ్ సింగును పంపారు. అయితే అతని బద్యతలేమిటన్నది సరిగా నిర్వచించలేదు! డివిజినల్ మెచీన్ గన్ కమాండర్ను పర్వతపాదాలనుంచి తొవాంగ్ వరకు మార్గానికి ఇన్ చార్జీగీ నియమించారు. అంటే దాదాపుగా 300మైళ్ళ దూరంలోగల అనేక కీలకప్రాంతాలను కాపాడి, చైనీయులతో పోరాడే బాద్యత ఒక్క 4INDIAN DIVISION మీద పెట్టారు. దానికి సరిపడా దళాలుగానీ, వనరులుగానీ, సేవావిభాగాలుగానీ, వ్యవస్థలుగానీ లేవు. ఎక్కడెక్కడి నుంచో కొన్నిగుంపులను, మరికొంతమంది అధికారులను తీసుకొచ్చి దీన్నొక కలగూరగంపగా చేశారు. పేరు మాత్రం 4INDIAN DIVISION! దీనివల్ల అత్యుత్తమదళాల్లో ఒకటిగా ప్రపంచం గుర్తించిన ఒకభారతీయదళం అపకీర్తిని మూటగట్టుకోవాల్సి వచ్చింది. సైన్యంలో దళం అంటే దానికొక సనిర్వచిత కార్యక్రమం ఉంటుంది. దానికనుగుణంగా అందొలో కొన్ని జట్లను ఏర్పాటుచేసుకొని, ప్రతిదానికి నిర్ధిష్టమైన పాత్రను ఇస్తారు. దానికనుగుణంగానే అవి ఏళ్ళతరబడి శిక్షణ తీసుకుంటూ రాటుదేలుతాయి. అందువల్లనే సైన్యం బలాలను సైనికులసంఖ్యతోకాక అందులోని దళాలు, వాటి శక్తిసామర్థ్యాలను బట్టి బేరీజు వేస్తారు. వాటికి సమర్థత, పరస్పర విశ్వాసం, సమిష్టిభావం వచ్చాకనే యుధ్దరంగంలో లక్ష్యాలను చేదించగలవు. కానీ ఇక్కడున్న నానాజాతిగుంపు పోరాటంలో గెలవాలంటే ఇదేమీ రాజకీయ వేదికకాదు. ఇక్కడ జరుగుతున్నది సిద్ధాంతాకోసమో లేక రెండువర్గాలు అధిపత్యంకోసమో జరుగుతున్న పోరాటంకాదు. గణతంత్రరాజ్యాలుగా తమనుతాము ప్రకటంచుకున్న రెండుదేశాలమద్య.

అప్పటికే వాస్తవ పరిస్థితుల మీద అవగాహన ఉన్న జనరల్ ఉమ్రావ్ సైన్యానికి నిర్దేశించిన లక్ష్యం అసాధ్యమని తేల్చి చెప్పాడు. వీటిని విపూలికరిస్తూ జనరల్ సేన్కు ఉత్తరం రాశాడు. సాయంత్రం 5.30కు జనరల్ ప్రసాద్ ఫోన్ చేసి ఉన్నపళంగా తొవాంగుకు బయలుదేరమన్నాడు. ప్రయాణానికి కలిగిన అవాంతరాలను చెప్పబోగా వారించి వెంటనే బయలుదేరమని, ప్రస్తుతానికి ఇంతకన్నా ఏమీ అడగొద్దని చెప్పసాగాడు. అలాగే 9పంజాబు లుంపులో ఆగకుండా నమ్కాచు వరకూ పంపమని ఆదేశాలు వెలువడ్దాయి. బహుశా పంజాబీలను చూపించి చైనీయులను భయపెడదామనుకున్నారేమో! ప్రారంభంలో తీసుకున్న ఇలాంటి నిర్ణయాలకు భారీగా మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. సైన్యంలోని వివిధస్థాయిలమద్య, విభాగాలమద్య సమంవయం దెబ్బతిన్నది.

పైవారి ఆదేశాలను అనుసరించి బయలుదేరాల్సి రావటంతో అక్కడకు చేరుకునే వరకు అవసరమైన కీలక ఆదేశాలను సరిహద్దుకు జారీచేసి, అవసరమైన పోర్టర్లను తీసుకుని మరుసటిరోజు తెల్లవారుఝామున ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. ఇంటెలిజెన్స్ అధికారి కెప్టన్ టీ.కే.గుప్తా తప్ప మిగతా అధికారులెవరూ లేకుండా, సంచార వైర్లెస్ సామాగ్రిని మోసేందుకు పోర్టర్లను వెంటపెట్టుకుని ప్రయాణం సాగించాడు. విపరీతమైన వర్షాల కారణంగా 15గజాలకన్నా ఎక్కువ దూరం కనబడటంలేదు. చీకటిపడే సమయానికి 22మైళ్ళు ప్రయాణించి లుమ్లా చేరుకున్నారు. దారంతా పంజాబ్ దళంతో మాట్లాడేందుకు ప్రయత్నించినా కుదర్లేదు. మరుసటిరోజు మరొక 18మైళ్ళు ప్రయాణించాక శక్తి వచ్చింది. తరువాత రోజు అంటే సెప్టేంబరు 16న లుంపుకు చేరుకున్నారు. విమానాలనుంచి జారవిడిచిన వస్తువుల సేకరించటం, వాటిని గమ్యానికి చేర్చటం, ఇక్కడి అవసరాలను పైవారికి తెలియపరచటం, తొవాంగుతో వైర్లెస్ సమాచారాలు జరపడం ఇక్కడి దళాల విధులు. కానీ సహజంగా ఇవేవీ పదాతిదళాల బాద్యతలు కావు. వాటికి పత్యేకమైన విభాగాలుంటాయి. కానీ ఇక్కడ పదాతిదళం యుద్ధం చెయ్యటమేగాక వాటికవసరమైన ఇతర పనులుకూడా వాళ్ళే చేసుకుంటూన్నారు.

సెప్టెంబరు 13, 14 తేదీలలో డిల్లీలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశాలు గందరగోళానికి వేదికల్య్యాయి. మొదట చైనీయుల సంఖ్య 60కి మించదని అంచనావేస్తూ కొన్నిదుందుడుకు నిర్ణయాలు తీసుకోగా, మెల్లమెల్లగా వాస్తవస్థితి తెలిసొచ్చాక వెనక్కి తగ్గనారంభించారు. అయితే ఈసమావేశాలలో ప్రధానిగానీ, విదేశాంగమంత్రిగానీ, సైన్యాధ్యక్షుడుగానీ, ఆర్థికమంత్రిగానీ హాజరవలేదు. ఇంతమంది లేకుండానే ఆదేశాలు ఎలా వెలువడ్దాయన్నది అర్థంగాని ప్రశ్న. కానీ ఏసందర్భంలోనూ శత్రువుల బలాన్ని, కదలికలను సరిగ్గా అంచనా వెయ్యలేక పోయ్యారన్నది చేదునిజం.

లుంపుకు చేరుకునే సరికే విపరీతంగా అలసిపోవటంతో ఒకరోజు అక్కడ అలసట తీర్చుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆసమయంలో తొవాంగులోని అధికారులతో మాట్లాడే అవకాశం కలిగింది. ఇంకొక రెండు బెటాలియన్లను మైదానాలనుంచి పంపుతున్నట్టు తెలిసింది. అలాగే GOC వీలైనంత త్వరలో ఆప్రాంతాన్ని సందర్శించి, తదనంత కార్యక్రమాలను గురించి చర్చిస్తానని చెప్పగా, దానికి దాల్వీ మరికొంతకాలం ఆగమన్నాడు. ఆకాశంలోంచి జారవిడుస్తున్న సామాగ్రిలో మూడోవంతు పారాచూట్లు తెరుచుకోక వృధా అయిపోతున్నాయి. అప్పటికే వాడివాడి చిరుగులుపడిన వాటినే వాడుతూ ఉండటతో ఈపరిస్థితి తలెత్తింది. అలానే పంపుతున్న వస్తువులన్నీ భారీవి కావడంతో లోయల్లోంచి తీసుకెళ్ళడం శక్తికి మించిన పనైంది. హిమాలయాలకు అనుగుణంగా ఎలాంటి ప్రణాళికలూ మనదగ్గరలేవని దీనిద్వారా స్పష్టంగా తెలుస్తుంది.

సెప్టెంబరు 18 ఉదయాన్నే లుంపు నుంచి బయల్దేరారు. 15మైళ్ళ దూరంలో థాగ్ల వచ్చింది. పర్వతవాలుపై మోకాటిలోతు అడుసులో కాళ్ళీడ్చుకుంటూ ముందుకు పోసాగారు. ముందుకువెళ్ళే కొద్దీ వాలు ఇంకాపెరిగుతోంది. అడుసులో ప్రయాణం చాలాకష్టమైంది. హథూంగ్లా కనుమ 13400అడుగుల ఎత్తులో ఉంటుంది. దీనికే ఇలా ఉంటే మరి 16500అడుగుల ఎత్తులో ఉన్న కర్పోలా కనుమ మాటేంటి. అది మనకు అత్యవసర పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ మార్గం! దళాలు గమ్యం చేరుకోవడంలో ఎందుకాలశ్యమైందంటూ ప్రశ్నించిన వారిచేతిలో ఒకమ్యాపుతప్ప మరే సమాచారమూ లేదు. రాత్రికి సెర్ఖిమ్లో బసచేసి 19 ఉదయాన్నే బయలుదేరి హథూంగ్లా కనుమ దగ్గర బ్రిడ్జి 1 మరియు 2లను చేరుకున్నారు.

బ్రిడ్జి 1 దగ్గర కల్నల్ మిశ్రాను ఎదురొచ్చాడు. దాదాపు ఐదురోజుల తర్వాత కమాండర్ తనదళాన్ని కలిశాడు. మద్యలో ఎలాంటి సమాచారమూ లేదు. 1"=4మైళ్ళు స్కేలుమీద ఉజ్జాయింపుగా గీసిన మ్యాపును ఆధారంగా చేసుకుని చర్చించడం మొదలుపెట్టారు. ముందుగా ఈమ్యాపు గురించి- ఇప్పటి దాకా రాజధానినుంచి తొవాంగువరకు అన్నిస్థాయిల్లోనూ చర్చలకు ఒకేఒక ఆధారం ఈమ్యాపు. పోనీ అదేమైనా క్షుణ్నంగా సర్వేచెయ్యించి గీశారా? అంటే అదీలేదు. బ్రిటిషుకాలంనాటి ఒక అధికారిని సర్వే చెయ్యమని పంపారు. భూటానులోని తనప్రియురాలితో సమయంగడపడానికి ఆయన ఈప్రాంతంలో సర్వే ఎగ్గొట్టేశాడు. నమ్కాచు వైపు రాకుండానే, వేరేమార్గంలో వెళుతూ అక్కడ ఒకనది దక్షిణవాహినిగా ఉండటంతో నమ్కాచును కూడా అలానే చూపించాడు. నిజానికి అది పడమర నుంచి తూర్పుకు వెళ్తుంది. అస్సాం రైఫిల్స్ మొదటిసారి ఇక్కడికి వచ్చినప్పుడు ఒకతను తను వచ్చినదారిని ఉజ్జాయింపుగా చూపెడుతూ ఒకమ్యాపు గీశాడు. ఇందులో ఒకచివర నుంచి మొదలెట్టాక మరొకచివరకు చేరేసరికే మార్గం పూర్తికాలేదు. దాంతో పక్కపక్కనే చూపిస్తూ ఇరికించుకుంటూ గీశాడు. దాన్ని ప్రాతిపదికగా తీసుకుని పైవాళ్ళు లెక్కలుకట్టసాగారు. రెండుమైళ్ళుగా చూపెట్టిన ప్రాంతాలు చేరుకోవడానికి రెండురోజులు పట్టింది! సైనిక కార్యక్రమాల్లో కాలం-దూరం-వేగం ఎంతకీలకమో ప్రతి ఒక్కరికీ తెలిసిందే అయినా ఎవరికీ ఈప్రాధమిక విషయాలను పట్టించుకోలేదు. 





సెప్టెంబరు 15న పంజాబుదళం ఇక్కడికి చేరుకునేసరికే నదికి అవతలిగట్టున చైనాసైన్యం ఉంది. అటువైపునుంచి ఒక పౌరసేవాధికారి హిందీలో మాట్లాడుతూ "ఇది చైనా భూభాగం. భారత్ చైనాలమద్య అవిభాజ్య స్నేహం ఉంది.చిన్నచిన్న విషయాల కారణంగా అది చెడిపోకూడదు. మేము సరిహద్దుకు  కాపలాను మాత్రమే పెట్టాం. మీరు సైన్యాన్ని ఎందుకు దించితున్నారు?" అని అడిగాడు. మిశ్రాకు పైనుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం- ఆత్మరక్షణార్థమే కాల్పులు జరపాలి. ఖాళీచెయ్యడానికి ఒప్పుకోకపోతే వాళ్ళముందు రాస్తారోకోలు, రిలేనిరాహారదీక్షలు చేపట్టొచ్చు. ఇంతకన్నా వేరేదారిలేదు కాబట్టి, వంతెనల దగ్గరా దారికి కాపుకాస్తున్నారు. కొంతమందిని త్సాంగధర్కు పంపారు. ఇక్కడ మొత్తం నాలుగు బ్రిడ్జిలున్నాయి.మూడవ బ్రిడ్జి వద్ద ధోలాపోస్టు ఉంది. చైనీయులు వారినేమీ చెయ్యకపోయినా మద్యాహ్నానికి మూడవ బ్రిడ్జి కూల్చేశారు. బ్రిడ్జి అంటే అదేదో హౌరా బ్రిడ్జి అనుకునేరు. అంతలేదు. నాలుగు దుంగలను పక్కపక్కన పెట్టి తాళ్లతో కట్టేసి నదిమీద ఉంచారు. అదొక 24 అడుగుల వెడల్పున్న నది! రక్షణపరంగా అక్కడ బలగాలను ఉంచాల్సిన అవసరంలేదు. అయినా పైవాళ్ళ ఆదేశం.దీంతో ప్రభుత్వం సైన్యం మీద ఉంచిన మొదటిదశ పూర్తయ్యింది. ఈప్రాంతం సైనిక సరిహద్దుగా మారింది. పంజాబీలు 9మైళ్ల దూరంలో పలుచగా, పెద్దగా వనరులూ, పరస్పర సమాచారమూ లేకుండా పరుచుకున్నారు.

అక్కడి నుంచి రెండవ బ్రిడ్జికి వెళ్లారు. అక్కడ చైనీయులు కాపలా ఉన్నారు. వారు అత్యాధునిక ఆటోమేటిక్ తుపాకులు, చలికి ప్రత్యేకమైన బట్టలు ధరించి సరిహద్దు కాపలాదారులుగా పిలవబడుతున్నారు! వాస్తవానికి విరుద్ధంగా భారత సైన్యాధికారులు చైనా యుద్ధసామాగ్రి, నైపుణ్యాన్ని తక్కువగా అంచనావేస్తున్నారు. దానికనుగుణంగానే లెక్కలుకట్టి, ప్రకటనలిస్తున్నారు. అంతవరకు గైడుగా తమనతోకూడా వచ్చిన పశువులకాపరి చైనీయులకి దాల్వీరాకను చేరవేశాడు. మనవద్దమాత్రం ఎలాంటి సమాచారమూలేదు. ఇదేవ్యక్తి అంతకుముందు జనరల్ కౌల్ వచ్చినప్పుడూ తోడు తీసుకెళ్ళారు! అక్కడ సుబేదార్ ప్రతాప్ సింగ్ ఎదురయ్యాడు. ఇతను కొద్దిరోజుల ముందు మిసిమారి రైల్వేస్టేషన్లో మీరఠ్ బండి ఎక్కడానికి ఎదురుచూస్తున్నాడు. 28ఏళ్ళు సైన్యంలో సేవలందించాక రిటైరయ్యి పెన్షన్ మీద వెళ్తున్నాడు. అక్కడున్నప్పుడు యుద్ధానికి పిలుపొచ్చేసరికే వెనక్కు తిరిగి ఇన్నిమైళ్ళూ నడుచుకుంటూ యుద్ధభూమికి చేరుకున్నాడు. ఇంటికెందుకు వెళ్ళలేదు అన్నప్రశ్నకు "సాబ్! బెటాలియన్కు ఇంత అవసరమొచ్చినప్పుడా నేను ఇంటికెళ్ళేది?" అని ఎదురు ప్రశ్న వేశాడు. దానికి మనప్రభుత్వం దగ్గర జవాబుందా? ఆదేశభక్తుడు యుద్ధభూమిలోనే వీరమరణం పొందాడు. మరొక పోస్టు దగ్గర చాలాకాలంనుంచి పంచదారలేక ఉప్పును కలుపుకొని టీ తాగుతున్నారు. ఉత్తరాదివాళ్ళైనా వరి అన్నాన్నే తింటూన్నారు. రోటీపిండి లేదా? అని అడిగితే "దానికి పెనం తెచ్చుకోవాలి సాబ్. దానిబదులు వేరేదైనా సామాగ్రి మొయ్యొచ్చుకదా అని అన్నం తెచ్చుకున్నాం." అని బదులిచ్చారు. ఎక్కడా ఒక్కపిర్యాదులేదు. ఒక్క పితూరీలేదు. అందరి లక్ష్యం ఒక్కటే. మూడురంగుల ఝెండా పరువు కాపాడటమే. పంజాబీల దేశభక్తికి హిమాలయాలే సరైన ఉపమానం. ఇక్కడ ఇలా ఉంటే రాజధానిలో ఒక అధికారి "చైనీయులను సరిహద్దునుంచి తరిమివెయ్యమని సైన్యాన్ని ఆదేశించాం." అని ప్రకటన ఇచ్చాడు.

అక్కడి నుంచి మూడవ బ్రిడ్జికి చేరుకోని ఒకరోజు పట్టింది. ఇక్కడ మేజర్ చౌదరీని కలిశాడు. చైనీయుల దాడి గురించి సమాచారం అందించింది ఇతనే. ఇక్కడితో మొత్తం ప్రాంతం తిరిగినట్లైంది. మొత్తానికి ధోలాప్రాంతం సైనికచర్యలకు పూర్తిగా ప్రతికూలమన్న సంగతి అర్థమైంది. హథూంగ్లా, కర్పోలా కనుమలను ఒకబెటాలియన్ ఎట్టిపరిస్థితుల్లోనూ రక్షించలేదు. అక్కడ దళాల మద్య పరస్పర సహకారం, సమాచార మార్పిడి కష్టం. దాడుల సమయంలో కదలికలకు ఏమాత్రం అనువుగా లేదు. సన్నాహాల గోప్యత అస్సలు కుదిరేదికాదు. అయినా రాజకీయ కారణాలవల్ల అది ప్రతిష్టాత్మకమై కూర్చుంది. సైనికుడు ప్రాణాన్ని పణంగా పెట్టడంకన్నా చెయ్యగలిగింది ఏమీలేదు.

మేరునగ తప్పిదం- 9.గీత దాటాడు


సెప్టెంబరు మొదటివారం- జనరల్ నిరంజన్ ప్రసాద్  తొవాంగ్ రక్షణకు అహర్నిశలు శ్రమించినందుకుగాను బెటాలియన్ను అభినందిస్తూ ప్రాసంగించాడు. గూర్ఖాలను ఉద్దేశిస్తూ సరిహద్దుకు ఉన్నపళంగా ముప్పేమీలేదు కాబట్టి హాయిగా దసరాను జరుపుకోమన్నాడు. గతమూడేళ్ళుగా గూర్ఖాలు వాళ్ళకుటుంబాలకు దూరంగా గడుపుతున్నారు. విపరీతమైన పని ఒత్తిడి కారణంగా అలసిపోయున్నారు. వారిని కొంతకాలం సైనిక కార్యకలాపాలకు దూరంగా ఉంచుతామని, స్వస్థలమైన యోల్కు వెళ్ళి కుటుంబసభ్యులతో దసరా జరుపుకోవత్సని హామీ ఇచ్చారు. ఆరోజు మద్యాహ్నం బ్రిగేడియర్ దాల్వి మండల ప్రధాన కార్యాలయమైన తేజ్పూర్కు బయలుదేరివెళ్ళాడు.

తరువాత రోజు సాయంత్రం దాల్వీకి తొవాంగ్ నుంచి ఫోన్ వచ్చింది. మేజర్ పెరీరా మాట్లాడుతూ " ధోలా పోస్టు నుంచి అక్కడీ కమాండర్ ప్రమాద సంకేతాల్ని పంపుతున్నాడు. సుమారు 600మంది చైనీయులు గీతదాటి లోపలికి వచ్చారు. అక్కడి ఒక వంతెనను కూల్చివేశారు. నీటిసరఫరాను కూడా నిలిపివేస్తామని హెచ్చరిస్తున్నారు. వెంటనే సహాయం కావాలని కమాండర్ అర్థిస్తున్నాడు." అని చెప్పాడు. వెంటనే లుమ్లా, లుంపులలోని అస్సాంరైఫిల్సును అప్రమత్తం చెయ్యమని పెరీరాను ఆదేశించాడు.ఉదయం 8గంటలకు దాడి జరిగితే సాయంత్రం 6:30 వరకు మండలకేంద్రానికి సమాచారం రాలేదు. ఇంతకుమించి అటువైపునుంచి మరే సమాచారంలేదు. వెంటనే పై అధికారికి విషయం తెలియజేయడానికి ప్రయత్నించగా ఆయన దొరకలేదు. రహస్య మ్యాపులు ఆయన ఆధీనంలోనే ఉన్నాయి. రాత్రి ఆయన, ఎయిర్ ఫోర్స్ లైసనింగ్ ఆఫీసర్ దొరికారు. అది వారాంతం కావడంతో సమాచారం చేరడం మరింత ఆలశ్యమైంది. ఆర్మీ ప్రధాన కార్యాలయంలో సోమవారం వరకు ఎవరైనా ఉంటారా? అన్నది అనుమానాస్పదమే. ప్రభుత్వం ముంచి ఆదేశాలు పొందకుండా భారతసిపాయీ ఏమీ చెయ్యలేడని చైనీయులకు తెలుసు. బహుశా అందుకే వారాంతాన్ని ఎంచుకుని ఉంటాడన్నది దాల్వీ అభిప్రాయం. రెండవ ప్రపంచ యుద్ధంలో ఇలాంటి ఘటనలు అనేకం ఉన్నాయి.

చైనీయులు దాడిచేసిన థాగ్ల ప్రాంతం నుంచి తొవాంగ్లోని బ్రిగేడ్ ప్రధాన కార్యాలయం చేరడానికి 5రోజులు పడుతుంది. అక్కడి నుంచి మండలకేంద్రం 200మైళ్ళ దూరంలో ఉంది. కార్ప్స్ ప్రధానకార్యాలయం ఇంకొక 200మైళ్ళ దూరంలోని షిల్లాంగ్లో ఉంది. అక్కడి నుంచి కమాంద్ ప్రధాన కార్యాలయం లక్నోలో ఉంది. ఇక అన్నింటికీ అగ్రభాగాన మేరునగమంత తప్పిదాన్ని ఎలాంటి ఇబ్బందీలేకుండా చెయ్యడానికి డిల్లీ ఉంది. అక్కడ సైనిక కార్యకలాపాలను పర్యవేక్షించేంత తీరిక ఎవ్వరికీ ఉండదు. ఎవరి రాజకీయ అవసరాలు వారివి. కేంద్రకార్యాలయాల్లో పనంటే- గంటకొట్టినప్పుడు రావడం. ఇంకో గంట కొడితే ఇంటికెళ్ళిపోవడం. కొంతకాలం బయట పనిచేశాం అనిపించుకున్నాక కొందరు ఆరోగ్య కారణాలతోనూ, ఇంకొందరు కుటుంబ కారణాలమీద, మరికొందరు పలుకుబడిని ఉపయోగించీ ఇక్కడకు చేరుకుని రిటైర్మెంట్ ముందు జీవితాన్ని కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. యుద్ధం వచ్చినప్పుడు సరిహద్దులోని దళాలకు దిశానిర్ధేశం చెయ్యల్సిన బాద్యత వీరిది. కానీ యుద్ధభూమిలో ఏమి జరుగుతుందో? అసలు యుద్దమెలా చేస్తారో? తెలియని వాళ్ళు ఏమిదారి చూపుతారు?

షిల్లాంగ్లోని XXXIII CORPS బ్రిగేడియర్ జనరల్ స్టాఫ్ కొన్ని ఆదేశాలు ఇచ్చాడు. అవి 


  1. ధోలా పోస్టు కామాండర్ అక్కడే ఉండాలి. వెంటనే అక్కడికి మరిన్ని దళాలను పంపాలి. అక్కడి సమాచార బాద్యతలు అస్సాం రైఫిల్స్ చూసుకోవాలి. 
  2. శక్తి, లుంపు ప్రాంతాల్లోని 9 పంజాబ్ బృందాలు ధోలాకు పంపి అక్కడి దారులను ఆధీనంలో ఉంచుకోవాలి. తొవాంగులోని మిగిలిన బలగాలను లుంపుకి వెళ్ళేందుకు సిద్ధం చెయ్యాలి.
  3. సెలవు మీద వెళ్ళిన వారెవరూ రానవసరంలేదు. కానీ మార్గమద్యంలో ఉన్నవారు తదుపరి ఉత్తర్వులు అందేవరకూ ఎక్కడివారు అక్కడే ఉండాలి.
ఇదే సమయంలో దాల్వి తొవాంగ్ ఎంతకీలకప్రాంతమో వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాడు. దానిని రక్షించుకునేందుకు సేలా కనుమ రక్షణ బాద్యతలను తమనుంచి మరొకరికి బదిలీ చెయ్యమని కోరాడు. ఆపోస్టు వివాదాస్పద స్థలంలో సైన్యం అభిప్రాయాన్ని తీసుకోకుండానే నెలకొల్పారని, ఆప్రాంతంలో పోరడటానికి చైనీయులకు గల అనుకూలాంశాలను వివరించాడు.

మరుసటి రోజు తొవాంగ్ చేరుకోగానే అక్కడి అధికారులకు పైవాళ్ల ఆదేశాలను వివరించాడు. సిక్కుల దళానికి నాయకత్వం వహిస్తున్న లెఫ్టినంట్ కల్నల్  మాస్టర్ శిక్షణను ఇచ్చేందుకు పదాతిదళ శిక్షణా కేంద్రానికి వెళ్ళడంతో ఆయన స్థానంలో మిశ్రా కొద్దిరోజులముందే బాద్యతలు స్వీకరించాడు. ఆయన ముందురోజే థాగ్లా ప్రాంతమంతా కలియ తిరిగి అన్ని విషయాలనూ సేకరించి ఉంచుకున్నాడు. సైన్యం యుద్దానికి ముందు లాంచనంగా తయారు చెయ్యాల్సిన స్టాఫ్ పేపరును తయారు చేశారు. అందులోని ముఖ్యమైన అంశాలు


  1. భౌగోళిక అంశాలు
  1. థాగ్లాకు వెళ్ళాల్సిన ప్రధాన మార్గం న్యాంగాంగ్చు లోయ- లుంపు- హథూంగ్లా కనుమ( 13400 అడుగులు)- నంకాచు నది మీదుగా వెళ్తుంది. మొత్తం దూరం 60మైళ్ళు. సైన్యం ఐదు విడతల్లో మార్చ్ చేసుకుంటూ వెళ్ళగలరు.
  1. ప్రత్యామ్నాయ మార్గం లుంపు నుంచి కర్పోలా 1 కనుమ ( 16500 అడుగులు) మీదుగా వెళ్ళొచ్చు. ఈమార్గంలో వెళ్ళటం చాలాకష్టం. కానీ ఇలా వెళ్తే చైనీయుల కంటపడే అవకాశం తక్కువ.

కీలక ప్రాంతాలు
  1. త్సాంగధర్ మరియు హథూంగ్లా ముఖ్యమైన ప్రాంతం. ధోలా ప్రాంతం వృధా. ఇక్కడ వనరులు ఉపయోగించడం అనవసరం.
లుంపు - చుక్సెన్ మార్గం అనుకూలమైనది. వాయుసరఫారాకు కీలకమైన లుంపును రక్షించుకోవడానికి ఇది చాలా ముఖ్యం. శక్తి ఇరుకైన కనుమ. కాబట్టి దీన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ వదలకూడదు.

  1. మార్గాల పరిస్థితులు
  1. తొవాంగ్ నుంచి థాగ్లాకు వెళ్ళేదారిలో మనుషులు కాలినడకన మాత్రమే రాగలరు. కోతల సమయం కావడంతో పోర్టర్ల కొరత తీవ్రంగా ఉంది.

  1. బలాబలాలు
  1. చైనీయుల బలం గురించి ఖచ్చితమైన సమాచారం లేకపోయినా వాళ్ళు మనకన్నా ఎక్కువే ఉంటారు. 
  2.  
  1. మనదగ్గర రెండు బెటాలియన్లు ఉన్నా వాటి సామర్థ్యం ఒక్కబెటాలియన్కు సమానం. ఎలాంటి సాధనాలు మనవద్ద లేవు.
  1. తొవాంగ్ రక్షణ ప్రధమ కర్తవ్యం. 
  1. పర్వత పాదాల నుంచి తొవాంగుకు రాను 10-12 రోజులు పడుతుంది. దారి పూర్తిగా దెబ్బతి ఉంది. కాబట్టి సత్వరం మరమ్మతులు చెయ్యాలి. 
  1. అక్కడినుంచి థాగ్ల చేఉకోను 4-5 రోజులు పడుతుంది. వారు అలసట తీర్చుకోను కనీస సమయమివ్వాలి.
  1. సమాచార వ్యవస్థ, యుద్ధ సామాగ్రి మనకన్నా చెనా దగ్గర మెరుగ్గా ఉంది.


  1. పరిపాలన
  1. అదనపు బలగాలు చేరుకొనేసరికే వారికవసరమైన దుస్తులు, యుద్దసామాగ్రి, వైర్లెస్ పరికరాలు, ఇతర సామాగ్రి చేరవెయ్యాలి. గిడ్డంగులు పధిలపరచుకోవాలి.
  2.  
  1. లుంపు ఒక్కటే వాయుసరఫరాకు ఆధారం.
  2.  
  1. పోర్టర్ల కొరత తీవ్రంగా ఉంది.
  2.  
  1. గతకొంతకాలంగా వాయురవాణా కుదరకపోవటంతో థాగ్లాకు వెళుతున్న బలగాలకు సరిపడినంత యుద్ధసామాగ్రి లేదు. తొవాంగులోని బలగాలకేగాక మార్గమద్యంలో ఉన్నవారికి, అంటే పర్వతపాదం నుంచి తొవాంగ వచ్కేవారు, తొవాంగ్ నుంచి థాగ్లా వెళ్ళేవాళ్ళు, అవసరమైన సామాగ్రి సరఫరా చెయ్యాలి.
  2.  
  1. పర్వతపాదం నుంచి థాగ్లా వరకుగల 220మైళ్ల దారిలో గిడ్డంగులు ఏర్పాటు చెయ్యాలి.
  2.  

  1. వాతావరణం
  2.  
  1. ఋతుపవనాల కారణంగా విపరీతమైన వర్షాలు కురుస్తున్నాయి. విపరీతమైన వాలు మీద ప్రయాణం బృందాలకు చాలా కష్టం.
  1. బృందాలకు మార్గమద్యంలో ఎక్కడా షెల్టర్లు లేవు. సరైన దుస్తులులేక సైనికుల ఆరోగ్యం క్షీణించే ప్రమాదముంది.

చైనీయుల బలాన్ని, వాళ్ళప్రాంతాలను అంచనావేసేందుకు 9పంజాబ్ బృందాన్ని హథూంగ్లా కనుమ మీదుగా ధోలాకు పంపారు. వీరు ఆమార్గాన్ని తమ ఆధీనంలో ఉంచుకుంటారు. ఒక అస్సాంరైఫిల్స్ బృందాన్ని కర్పొలా కనుమ గుండా ధోలాకు పంపారు. మిగిలిన పంజాబీలను సమాచారం అందిన 4గంటల్లో గమ్యానికి చేరుకోవాలని ఆదేశించారు.. మద్యాహ్నానికల్లా వాళ్ళు సిద్దమయ్యారు. తరువాత రోజు జనరల్ ప్రసాద్ చేరుకుని పరిస్థితిని సమీక్షించాడు. ఆయన కొన్ని ఆదేశాలను ఇచ్చాడు. 
  1. 7 Infantfy Brigade 48గంటల్లోగా ధోలా ప్రాంతానికి చేరుకోవాలి.
  1. XXXIII Corps 1/9 గూర్ఖాల సేవలను ఉపయోగించుకోను పైవాళ్ళని అభ్యర్థించింది. 2Rajputsను ఇక్కడికి పంపుతున్నారు.
  1. తొవాంగులో కనీస సైన్యం ఎట్టిపరిస్థితుల్లో ఉండాలి.
  1. 9పంజాబ్ వెంటనే లుంపుకు చేరుకోవాలి
  1. సెలవుమీద వెళ్ళేందుకు మిసమారిలో ఉన్న బృందాలు తిరిగి వారి బాద్యతలు స్వీకరించాలి. 
  1. చైనీయులు ఎదురైతే
  1. వాళ్ళని వెనుదిరిగి వెళ్ళమని చెప్పండి.
  1. వాళ్ళు వెళ్ళకపోతే ముందుకు రానియ్యకుండా నిరోధించండి.
  1. ఆత్మరక్షణార్థం మాత్రమే కాల్పులు జరపాలి.
ఈఆదేశాలతో భారత ఆర్మీకి నిర్ధిష్టమైన లక్ష్యాలుగానీ, జాతీయ విధానంగానీ లేవని తేటతెల్లమయ్యింది. రాజకీయ నాయకులను నిందిస్తూ దీర్ఘకాలిక రక్షణాచర్యలపైన కనీస అవగాహన లేకుండా ఉండటం ఆమోదనీయం కాదు.

సైన్యంలో పదాతి దళం తప్ప మరేబలగమూ లేదు. వాళ్ళు ఒక స్థానంనుంచి మరొక స్థానం చేరుకునేంతవరకూ మద్యలో ఎలాంటి సమాచారమూ లభించదు. కనీసం కొనిగంటలపాటు అలాంటి పరిస్థితుల్లో ప్రయాణం చెయ్యాల్సి వస్తుంది. ఒకేసారి దళమూ, దాని వెనకే అధికారులూ ప్రయాణిస్తే ఇద్దరిమద్యనా సమాచారం చాలా ఇబ్బందౌతుంది. ఇది పర్వతప్రాంతాల్లో చాలాకీలకమైన విషయం. అలా రోజుల తరబడి ప్రయణించాలి. ఈకారణాలవల్ల దళం గమ్యానికి చేరుకునేదాకా తను తొవాంగులోనే ఉంటానని దాల్వీ తన పైఅధికారికి తెలియజేశాడు. గైడుల సహాయం లేకపోవడంతో హథూంగ్లా కనుమకు వెళ్ళాల్సిన పంజాబ్ బృందం దారితప్పింది. ఆరాత్రి జనరల్తో మాట్లాడుతూ కొన్ని వాస్తవాలను తెలియపరిచాడు. మనకున్న పరిమితుల దృశ్ట్యా ఎన్ని రాజకీయ ఒత్తిడులు వచ్చినా తలొగ్గొద్దని మనవి చేసుకున్నాడు.

పైనుంచి వచ్చిన ఆదేశాల్లోని డొల్లతనం దాల్వీని మరింత అసహనానికి గురిచేసింది. తూర్పుదళ ప్రధాన కార్యాలయం ఇచ్చిన ఆదేశాల్లో 7Infantry Brigadeను థాగ్లాకు వెళ్ళమంది. ఇది అక్కడివారి సమర్థతపై ఎన్నో సందేహాలను రేకెత్తించింది. వాస్తవ పరిస్థితులు, మన బలాబలాలు, పరిమితుల గురించి కనీస అవగాహన ఉందా? అనిపించింది. ఎదురుగా చైనా సైన్యం అంతా నిలబడి ఉంటే ఇటువైపు ఒకదళాన్ని ఉంచి పోరాడమని చెప్పడం ఎంతవరకు సబబు? సైనిక ఆదేశాలన్నీ ఒక నిర్ధిష్టమైన పద్దతిలో ఒక్కొక్క విషయాన్ని వివరిస్తూ వెలువడతాయి. అలాగాక కేవలం ఒకద్ళాన్ని థాగ్లాకు పంపండి. అని చెప్పడం కేవలం రాజకీయ నినాదంకన్నా పెద్దగా పనికిరాలేదు. మనకు అనుకూలమైన, వివాదరహితమైన తొవాంగ్ ప్రాంతాన్ని వదలి ముందుకెళ్ళినందుకు తగిన మూల్యం చెల్లించుకుంది.

మేరునగ తప్పిదం- 8.తుఫాను ముందు ప్రశాంతత

సరిహద్దులోని వాస్తవ పరిస్థితులపై అవగాహనలేమి కారణంగా ప్రజలు సైన్యాన్ని నిందించడం మొదలుపెట్టారు. ఇంకోవైపు చైనా యుధ్దందిశగా ఒక్కొక్కడుగూ నెమ్మదిగా వేస్తూ ముందుకొస్తోంది. భారత్ మాత్రం ఒక జాతీయ లక్ష్యం అంటూ లేకుండా, ఎవరి అవసరాలకు తగ్గట్టు వాళ్ళు మాట్లాడే అవకాశం కల్పిస్తోంది. ప్రజాస్వామ్యం అన్న ముసుగులో నాయకులు ఆడుతున్న ఆట కారణంగా దేశావసరాలు- నాయకుల లక్ష్యాల మద్య అంతరం స్పష్టంగా కనిపించసాగింది.

లఢాఖ్లో చైనా ఆధీనంలోకి వెళ్ళిన ప్రాంతాలు ఆదేశ సైనికావసరాలకు అత్యంత కీలకం కావడంతో భారత్కు తిరిగి దక్కడం అంతసులువు కాదు. ఈసంగతి తెలిసినా నాయకులు మాత్రం "చివరి అంగుళం సొంతమయ్యేదాకా పోరాడుతాం." అంటూ ప్రగల్భాలు పలకసాగారు. 1959 తర్వాత టిబెట్లో పరిస్థితులు పూర్తిగా నియంత్రణలోకి రావడంతో చైనా అక్కడున్న సైన్యాన్ని భారత సరిహద్దు వైపు మళ్ళించసాగింది. రాజకీయ వేదికలపై మన పెద్దన్న పాత్రని పొగుడుతూనే ఇంకోవైపు సైనికచర్యలకు కావలసిన వనరులను క్రోడీకరించసాగింది. వీటికి జవాబుగా భారత్ చర్యలు శూన్యం. మన సన్నాహాలన్నీ వీధిపోరాటాలకు, అల్లర్లను అణగదొక్కడానికి పనికొస్తాయి తప్ప ఒక బలమైన శత్రువును పూర్తిస్థాయి యుద్ధంలో ఎదుర్కోవడానికి కాదన్నది విస్పష్టం. సైనిక సూతాలపై అస్సలు అవగాహనలేని నాయకులు దాన్ని కప్పిపుచ్చుకోను అహింసాసిద్దాంతాన్ని వల్లెవేయనారంభించారు. 1962 నాటికి చైనా వద్ద అత్యాధునిక యుద్ధసామాగ్రి, ప్రధమశ్రేణి యుద్దనైపుణ్యం ఉంటే మనంమాత్రం రెండవ ప్రపంచయుద్ధ కాలంనాటి సామాగ్రితో, అప్పటి యుద్ధతంత్రాలతో కుస్తీపడుతున్నాం.

1962 ఆగస్టులో లఢాఖ్లో చైనాతో ఘర్షణ జరిగింది. ఆతర్వాత చైనా మరొక ముప్పై సైనికపోస్టులను నెలకొల్పింది. అప్పటికే 12000 చదరపుమైళ్ళు ఆక్రమించి ఉన్న చైనా ఈసంఘటన తర్వాత మరొక 2000 చదరపు మైళ్ళు మింగేసింది. దీనిపై భారత్ చర్చలకు పిలవగా ససేమిరా అంది. అయినా భారత్ మాత్రం చర్చలతో విబేధాలన్నీ పరిష్కరించుకుంటాం అంటే శత్రువు దృష్టిలో ఎంత చులకన అయిపోతాం? తరచుగా యుద్దం- చర్చల మద్య దోబూచులాడుతూ భారత్ రెండుదారులనూ మూసేసుకుంది.

మద్యలో ఇంకొక ప్రచారం మొదలైంది. దాని సారాంశం- ప్రముఖ రష్యన్ నాయకుడూ ఖుర్శ్చేవ్- చైనా విదేశాంగ మంత్రి మార్షల్ చేన్ యితో, భారత విదేశాంగ మంత్రి మీనన్తో జెనీవాలో ఒక సదస్సు సందర్భంగా కలిశాడు. అక్కడ ఇద్దరి మద్యనా నెలకొన్న సరిహద్దు వివాదం గురించి మాట్లాడి చీవాట్లు పెట్టాడు. భారత్, చైనా లాంటి సోషలిస్టు దేశాలు తగవులాడితే అది వలసపాలకులకు, పెట్టుబడిదారులకి వరంగా పరిణమిస్తుంది. కాబట్టి నోర్మూసుక్కూర్చోండన్నాడు. మార్షల్ చేన్ యీ శాంతియుత విధానాలద్వారా సమస్యను పరిష్కరించుకుంటామని హామీ ఇచ్చాడు. దీంతో భారత ప్రభుత్వం ఊపిరి పీల్చుక్కుని ఇక యుద్ధంరాదని నిశ్చయించేసుకుంది. ఈసారి భారత సరిహద్దును రక్షించే బాద్యత సోవియట్ తీసుకుంది! ఈహామీ వల్లనే భారతప్రభుత్వం యుద్ధానికి సన్నాహాలు చెయ్యలేదని కొందరు చెబుతూ వచ్చారు. దీని విశ్వసనీయత ఎలా ఉన్నా, భారతప్రభుత్వం సరైన సన్నాహాలు చెయ్యలేదన్నది విస్పష్టం.

తరువాత చైనా లఢాఖ్లోని వివాదాస్పద గల్వన్ లోయను ఎంచుకుంది. 300మంది చైనీయులు అక్కడ కాపలా కాస్తున్న 40మంది గూర్ఖాలపై దాడి చేశారు. వాళ్ళని లొంగదీసుకునేందుకు అనేక జిమ్మిక్కులు వాడారు. చివరికి "భారత్ కోసం నేపాలీలు ప్రాణాలర్పించాల్సిన అవసరంలేదు. నేపాల్- భారత్లు స్నేహితులేంకాదు." అన్న వాదన కూడా మొదలుపెట్టారు. కానీ వాళ్ళు లొంగకపోవడంతో చైనీయులు పాశవికంగా హతమార్చారు. ఒకవైపు భారత నాయకులే సరిహద్దును గురించి పట్టించుకోకుండా రోజువారీ రాజకీయాలతో కాలం గడుపుతుంటే, మనదేశస్థులు కాకపోయినా విధినిర్వహణలో ప్రాణాలర్పించిన గూర్ఖాలు ప్రాతఃస్మరణీయులు. ఏమిచ్చి వాళ్ళ ఋణం తీర్చుకోగలం. కానీ దురదృష్టవశాత్తు మిగతా సైనికులలానే వీళ్ళ త్యాగాన్ని గుర్తించే తీరిక మనకు లేకుండా పోయింది! ఈ సంఘటన ద్వారా చైనా తన ఆలోచనను బయటపెట్టింది. భారత భూభాగాన్ని వశపరచుకునేందుకు ఎంతటి దాడికైనా సిద్ధమని చెప్పకనే చెప్పింది. అయినా మనకే అర్థంకాలేదు. బహుశా అర్థమైనా కానట్టే నటించామనుకుంటా.





రెండు దేశాలు సరిహద్దుకి ఇరువైపులా ఎదురెదురుగా నిలబడే రోజు అతిచేరువగా వచ్చేసింది. అప్పటికి రెండువైపులా సన్నాహాలను బేరీజు వేస్తే-


ముందుగా చైనా వైపున-



  1. అంతకు కొన్ని నెలలు ముందుగానే చైనా కొంతమంది ఏజెంట్లను భారత్లోకి పంపించింది. వీళ్ళు రోడ్డుకార్మికులుగా ఆప్రాంతమంతా జల్లెడపట్టారు.
  2. కొరియా యుద్దంలో నాయకత్వం వహించిన వ్యక్తిని ఆయుద్ధం ముగిశాక ఇక్కడికి పంపారు.
  3. అన్ని ముఖ్యమైన భారతీయ భాషలకూ దుబాసీలను ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళకి భారత ఆచారాల పట్ల, నమ్మకాల పట్ల అవగాహన కల్పించారు. బహుశా వీరినే సాంస్కృతిక బృందాలుగా మనదగ్గరకి పంపి ఉండొచ్చు.
  4. ఫోటోగ్రాఫర్లను, వీడియో కెమెరామెన్లను భారత్లోకి పంపి కావలసినంత సమాచారం తెచ్చుకున్నారు.
  5. కొన్ని వందలమంది గిరిజనులను కార్మికులుగా నియమించుకున్నారు. వీళ్ళకి భారత సైన్యం దుస్తులు కూడా చైనావాళ్ళే ఇచ్చారు!
  6. ఆయుధాగారాలను కీలకప్రాంతాల్లో ఏర్పాటు చేసుకున్నారు. వాటిని నిల్వచేయడానికి, సరఫరాకు కావలసిన పరిపాలనా వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నారు. వేసవికాలమంతా వీటిని నింపుకున్నారు.
  7. 3000 మంది యుద్ధఖైదీలను ఉంచగలిగే క్యాంపులను నిర్మించారు. యుద్ధఖైదీల వరకు ఆలోచించారంటే చైనా యుద్ధానికి ఎన్నేళ్ళముందే నిర్ణయించుకుందో అర్థమవుతుంది. ఇక్కడ 3000 అని చెప్పడం ద్వారా భారత్ అంతకన్నా ఎక్కువమందిని పంపదు అన్న ఖచ్చితమైన అంచనా అక్కడి ఇంటేలిజెన్స్ ఇవ్వగలిగింది.
  8. ఇంతకు ముందే చెప్పుకున్నట్టు రోడ్లు, సమాచార వ్యవస్థలు, ఇతర మౌలికసదుపాయాలు పూర్తిస్థాయిలో నిర్మించారు.
  9. వాళ్ళ బలగాలకు భారత్కు వ్యతిరేకంగా నూరిపోసి అదే ఆలోచనలతో బ్రతికేలా చేశారు. సమస్యను భారత్ మొదలు పెట్టింది కాబట్టి మనం జవాబు చెప్పాలి అన్నది వాళ్ళ భావనైంది.
  10. వాళ్ళ సైనిక లక్ష్యం, రాజకీయ లక్ష్యం ఒకటిగా చేసుకున్నారు. దీనివల్ల ఉన్నతస్థాయి నుంచి  క్షేత్రస్థాయి వరకు ఒకటే విధానమైంది.

ఇటు భారత్ వైపు సన్నాహాలు అత్యంత ప్రమాదకరంగా ఉన్నాయి. మౌలిక సదుపాయాలు లేవు. సమాచార వ్యవస్థలేదు. ఇంటిలిజెన్స్ ఉందో?లేదో? తెలీదు. అవసరమైన యుద్ధసామాగ్రి, ఇతర వనరులు లేవు. ఆ సమయంలో సరిహద్దులో ఉన్న సైన్యానికి అతిదగ్గరగా ఉన్న మరొక దళం పంజాబులో ఉంది! మన భూభాగం అని చెప్పబడే ప్రాంతం గురించి కనీసవగాహన లేదు. అక్కడి భౌగోళిక పరిస్థితులు, వాతవరణం, జాతులు, వాళ్ళ భాష వగైరాలు వీసమెత్తైనా తెలీకుండానే మనవాళ్ళను అక్కడికి పంపారు. అన్నింటికన్నా ప్రమాదకరమైన అంశం- ఇక్కడ రాజకీయ లక్ష్యం, సైనిక లక్ష్యం పరస్పర విరుద్ధంగా ఉండటం. దీనివల్లే సమస్య రోజురోజుకీ ఝటిలమౌతూ వఛ్కింది. సైన్యంలోని మొదటి దళం అక్కడికి ప్రవేశించకముందే నాయకులు గంభీరమైన ప్రకటనలు ఇచ్చేశారు. ప్రజలకు నమ్మకం సడలిపోయాక, గగ్గోలు పెడుతూ ఆప్రభావాన్ని సైన్యంమీదకి తోశారు. అంతేగానీ ప్రజలను మభ్యపెట్టినందువల్లే సమస్య ముదిరిందన్న నిజం మాత్రం ఒప్పుకోలేదు. జాతీయ నాయకునిగా గుర్తింపుపొందిన వ్యక్తి సారధ్యంలోని ప్రభుత్వం దేశసంక్షేమానికన్నా పార్టీ బతకడమే ముఖ్యంగా భావించడం జీర్ణించుకోలేని నిజం.

సరిహద్దులో వాతావరణం వేడెక్కేనాటికి ఉన్నత స్థాయిలోని వ్యక్తులెవరికీ వాస్థవ పరిస్థితిపై అవగాహన లేదన్నది వాస్తవం. సరిహద్దుకవతల చైనా శిబిరంలో ఏమి జరుగుతుందనే సమాచారం ఇవ్వాల్సిన ఇంటేలిజెన్స్ ఏమి చేస్తుందో తెలియట్లేదు. యుధ్ధ సన్నాహాల్లో మిగతా వాటికైతే ఖర్చవుతుంది. మనం అంతఖర్చును భరించలేకున్నాం. మరి ఇంటెలిజెన్స్ అన్నది ఆసాకుతో తోసెయ్యలేం కదా. మరి దాన్ని ఎందుకు పూర్తిస్థాయిలో వాడుకోలేదు?

సెప్టెంబరు మొదటివారంలో కూడా నాయకులంతా నిమ్మకు నీరెత్తినట్టుగానే వ్యవహరించారు. నెహ్రూ లండన్లో జరుగుతున్న కామన్వెల్త్ దేశాల సదస్సులో పాల్గొనేందుకు వెళ్ళాడు. ఆయన అక్కడ్నుంచి నైజీరియాకు వెళ్తాడు. కృష్ణమీనన్ ఐరాస సర్వసభ్య సమావేశంలో తన పలుకుబడిని పెంచుకునేందుకు పరిగెత్తాడు. అప్పట్లో ఈయన అనధికార ఉపప్రధానిగా వ్యవహరిస్తున్నాడు. ఆర్థిక మంత్రి మొరార్జీ దేశాయ్ కూడా ప్రధానితో బాటు లండన్లో ఉన్నాడు. ఆయన అక్కడ్నుంచి వాషింగ్టన్ వెళ్ళి ప్రపంచబ్యాంకు సమావేశంలో పాల్గొంటాడు.  మరొకవైపు సైన్యంలో చూస్తే- జనరల్ కౌల్ సెలవు పెట్టి కాశ్మీరులో విశ్రాంతి తీసుకుంటున్నాడు. "సరిహద్దులో యుద్ధం ఏక్షణానైనా రావచ్చు." అని ప్రకటన ఐతే ఇచ్చాడుగానీ దానికి తగ్గట్టుగా వ్యవహరించలేదు. ఈయన అక్టోబరులో పరిస్థితులు పూర్తిగా చెయ్యిదాటిపోయే వరకు డిల్లీకి రాలేదు. సైన్యంలో కొంతమంది అధికారులు శిక్షణనిమిత్తం వాళ్ళవాళ్ళ దళాలకు దూరంగా ఉన్నారు. ఇంకొంతమంది ఆటలపోటీలకు వెళ్ళారు.దాల్వీ సెలవుమీద బయటకు వెళ్తున్నాడు. పైనుంచి ఇథమిత్ధ్దంగా ఆదేశాలు ఏవీ లేకపోవడంతో అందరూ కులాసాగా ఉన్నారు. యుధ్దం వచ్చే అవకాశాలు ఉన్నాయని ఏమాత్రం అనుమానం కలిగినా సైన్యంలో కిందనుంచి పైదాకా ఇంత బేజారుగా ఉండేవాళ్ళు కాదేమో. మొత్తానికి సరిహద్దులో పరిస్థితి తుఫాను ముందు ప్రశాంతతగా చెప్పుకోవచ్చు.