మనమా చాణక్యుడికి నివాళులు అర్పించేది?మౌనమే నీ బాస ఓ మూగ మనసా..... ఎవరు సంస్కరణలు చెప్పినా, ఎంత పొగిడినా, ఎంత తిట్టుకొన్నా చలించని తత్వం ఆయన సొంతం. భాషపై పట్టు ఉన్నా దానికి ప్రాంతీయాభిమానాల కుళ్ళు, భాషాద్వేషాల కంపు అంటుకోని మహోన్నత వ్యక్తిత్వం. నాలుకతో సరస్వతీదేవి 17 అవతారలను ఉపాశించిన ఘనాపాటీ ఐనా ప్రగల్భాలకు ఆమడ దూరం. ఏ శాఖను చేపట్టినా అందులో తనదైన ముద్రను వేసి మనసుల్ని గెలుచుకోగల సమర్ధత. పార్టీకిగాని, ప్రభుత్వానికిగాని తానెప్పుడూ విధేయుడనే అని పలికే నమ్రత...ఇలా రాసుకుంటే పోతే ఆయన గురించి రాసేందుకు నా మిడిమిడి జ్ఞానం సరిపోదేమొ. పాములపర్తి వెంకట నరసింహారావు... ఒక కవి, ఒక రచయిత, ఒక ధీశాలి, ఒక నాయకుడు, ఒక కార్యదక్షుడు. ఆయన పదవుల కోసం ఎప్పుడూ వెంపర్లాడలేదు అని నేను చెప్పను. ఎందుకంటే ఎవరైనా ఒక రంగంలో తన సామర్ధ్యాన్ని నిరూపించుకుంటే సహజంగానే అందులో ఉన్నత స్థానానికి వెళ్ళాలి అనుకుంటారు. అందుకు పీవీ మినహాయింపు కాదు. ఐతే అందుకోసం ఏ స్థాయికైన దిగజారే వారితో పోలిస్తే ఆయన గొప్పతనం కనిపిస్తుంది. రాష్ట్రంలోగాని, కేంద్రంలోగాని, పార్టీలో గానీ ఆయన పొందిన పదవులు ముళ్ళకిరీటాలే గాని పూలపాన్పులు కాదు. ముఖ్యమంత్రి అయ్యేనాటికి వేర్పాటువాద ఉద్యమాలు, విదేశాంగమంత్రి హోదాలో అలీన విధాన బాధ్యతలు, ప్రధానిగా స్వర్ణభారత స్వతంత్రచరిత్రలో మేలిమలుపుగా చెప్పబడే ఆర్ధిక సంస్కరణలు, భద్రతా సమితిలో శాశ్వత సభ్యత్వం కోసం దౌత్యపరమైన విజయాలు, సిటీబిటీ బిల్లుకి వ్యతిరేకంగా అలీనరాజ్యాలను సంఘటిత పరచటం, ఇక పార్టీలో ఆయన ఉన్నత స్థాయి చేరేసరికే కాంగ్రెస్ పై ప్రజలలో సన్నగిల్లుతున్న గౌరవం. దేశమంతటా అధికారమే పరమావధిగా పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన ప్రాంతీయ పార్టీలు. జాతీయ పార్టీగా దేశసమాఖ్య వ్యవస్థను రక్షించాల్సిన పరిస్థితి. అంతవరకు పార్లమెంటరీ వ్యవస్థ రుచిచూడనిసంకీర్ణ రాజకీయాలు, బేరాలు, పొత్తులు, బెదిరింపులు. దేశ ప్రజాస్వామ్య వ్యవస్థనే అపహాస్యం చేసే పరిస్థితి. ఆర్ధికంగా ప్రపంచదేశాల మద్య తరచూ వెకీలింపులూ, వ్యంగ్యపు వ్యాఖ్యానాలు. ఇన్ని సమస్యల్లో మతతత్వపు పార్టీలు( అది బీజేపీ ఐనా మరే మైనార్టీ మతపు వాళ్ళదైనా) బలపడి లౌకిక వాదాన్ని ప్రశ్నిస్తున్నాయి. ఆయన తరువాత ఎందరో సంకీర్ణాలతో ప్రధానులయ్యారు. కానీ అందరూ ఎవరో ఒకరి చేతిలో కీలుబొమ్మలే. స్థిరమైన నిర్ణయాలతో తానుకోరుకున్న అభివృధ్ధికి పునాదులు వేయటంలో సఫలం అయ్యారా? ఇవన్నీ ఆయనలోని ఒక పార్శ్వమ్. ఈయనలోని లోపలి మనిషి అసలు మనీషి ఎవరు? ఒక కవి. ఏ భాషలోనైనా ఆశువుగా స్పందించే సున్నిత హృదయం. మొదటి సారి ఈయన గురించి తిరుపతి వచ్చినపుడు విన్నాను. టీవీలో చూశాను. ప్రదానిగాఒక తెలుగువాడు మాట్లాడుతుంటే అందరికీ ఒకరకమైన ఉద్వేగం. అది నన్ను కూడా తాకింది. తిరుపతిలో దూరదర్శన్ కేంద్రం(ఇప్పుడు సప్తగిరి) ప్రారంభోత్సవానికి వచ్చారు. నిజంగా ఆయన మాట్లాడుతుంటే ఒక రాజకీయ నాయకుడిగా అనిపించలేదు. ఆ ఉపన్యాసం ఎంతో సందర్భోచితంగా, సూటిగా, అనవసరమైన ఆర్భాటాలు లేకుండా సాగింది. చిన్నప్పటి రేడియోగురిచి ఎంతో చమత్కారంగా మాట్లాడుతూనే గతకొన్ని దశాబ్దాలుగా ప్రపంచంలో సమాచార విప్లవం గురించి భవిష్యత్తులో దేశం చేదించాల్సిన లక్షాలను, అందులో మన పాత్రను అద్భుతంగా ఆవిష్కరించారు. తరువాత ఆయనకు 17 భాషలు తెలుసు అంటే నొరెల్లబెట్టాను. విశ్వనాథ వారి వెయ్యిపడగలులాంటి తెలుగు సాహిత్యాలని, రచనల్ని అనేక భాషల్లోకి తర్జుమా చేసి తెలుగుపదంలోని గంభీర్యాన్ని, ఉన్నతవిలువల్ని, మకరందాన్ని రుచిచూపాడు. ఇంతాచేస్తే ఆయనకు మిగిలింది ఏమిటి? ఏ సమయంలో నైనా ఆయన ప్రతిభకు తగ్గ పురస్కారం లభించిందా? పైగా అనవసరపు వివాదాలు. కుళ్ళు రాజకీయాలకు,స్వార్థాప్రయోజనాలకు బలి అయ్యారు.ఏ పార్టీ కోసం, అధిష్టానం కోసం ఆన్నెళ్ళు కష్ట పడ్డాడో అదే పార్టీ ఆయనకు అన్యాయం చేసింది. 1996 తరువాత ఆయనకి ఎలాంటి ప్రాధాన్యతా ఇవ్వకుండా తిరిగి కుటుంబ పాలనలో ముంచేశారు కొంగ్రెస్స్‌ని. దాదాపు 13 ఏళ్లుగా ఒక్కసారీ సరైన మెజారిటీ లేకుండా, ఉత్తరప్రదేశ్, బీహార్ లాంటి రాష్ట్రాల్లో అస్తిత్వాన్ని కోల్పోయే స్థితికి తీసుకొచ్చారు. ఒకానొక సమయంలో అధికారంకోసం వర్తమాన రాజకీయాలలో దిగజారుతున్న విలువలపై ఆయనలో కమ్ముకున్న నైరాశ్యమ్ ఆయన రాసిన లోపలి మనిషి( ద ఇన్సైడర్) లోని ఒక వ్యాఖ్యలో కనిపిస్తుంది." అధికారం వేశ్యల స్థనాల వలె విటుల చేతిలో నలిగి పోతుంది." ఈ ఒక్కమాట చాలు ఆయన వ్యధను వర్ణించేందుకు. ఎమర్జెన్సీకాలం కాంగ్రెస్ చరిత్రలో ఒక మచ్చ. అలాంటి సమయంలో కూడా ఈయన మీద ఎలాంటి ఆరోపాణలు రాలేదు. ఇది ఒక్కటి చాలు ఆయన వ్యక్తిత్వం గురిచి చెప్పడానికి.జగదీష్ టైట్లర్ లాంటి వాళ్ళకు రక్షణగా నిలబడిన వాళ్ళు ఈయనకు ఎందుకు మద్దతునివ్వ లేదు. అంటే నా ఉద్దేశ్యం ఆయన తప్పు చేసినా సమర్ధించాలని కాదు. ఆయన ప్రమేయం లేదు అని న్యాయస్థానంచెప్పిన తరువాత కూడా ఆయనకి గౌరవం లభించలేదు. న్యాయస్థానంలో తీర్పు కాంగ్రెస్ వల్ల జరిగింది అంటే నమ్మను. ఆయన మరణించిన తరువాత గూడా ఆయనను గౌరవించని వాళ్ళు అప్పుడు ఆయనకి ఏదో సహాయం చేసి ఉంటారు అని ఎలా అనుకోగలం? ఇలాంటి మేధావి ఇక్కడ కాకుండా ఏ తమిళదేశంలోనో, మహారాష్ట్రాలోనో, బెంగాల్‌లోనో, యూపీలొనో పుట్టి ఉంటే ఇలా జరిగి ఉండేదా? నేను 8వ తరగతి చదివేటప్పుడు ఆయన మీద ఒక పాఠం ఉండేది. దానిని తరువాత సిలబస్ నుంచి తీసేసారు. మళ్లీ పెట్టలేదు. అదే బీహార్, యూపీలో ఇంకా ఉంది, అంతే కాదు ఆయన రచనలపై యూనివర్సిటీలలో చర్చలు జరుగుతున్నాయి.( నేను BHUలోచూశాను.) మనకి కనీసం ఆ మాత్రం గుర్తులేడా ఆయన. నిన్నటి నుంచి చూస్తున్నాను కూడలిలో ఎవరైనాఆయన మీద వ్యాసం రాస్తారేమోనని.అసలు మనకు ఆయనకు నివాళి అర్పించే హక్కు ఉందా?

10 comments:

 1. sorry, నేను కూదా మీలాగానే (see next brackets) comments రాయదానికి బద్దకం(i mean ఎవరో ఒకరు రాస్త అరిని ఎదురుచూడడం).

  కాని ఇక్కడ ఏమీ కామెంట్లు లేకపోయేప్పటికి
  కామెంటుతున్నా.
  --
  నాకు TV లో matach చూడడం ఇష్టం కానీ గ్రౌండుకు వెళ్ళాలంటే బద్దకం.
  ------

  ----------------
  ఆయన పేరు చెబితే ఓట్లు పడనప్పుదు , ఇక్కడ కనీసం హిట్లు పడనప్పుడు ఏందుకు రాయాలి ??
  ---
  ofcourse ఇక్కడా నా స్వార్ధం కూడా వుంది ఎవ్వరూ పట్టించు కోని దానిని నేను పట్టించుకున్నాను అన్న credit కోసం
  ---------
  ఏమిటి నేను ఇలా నిజాలు(????? నిజంగానా) చెబుతున్నా ??
  ---------

  ఇది కొంచం too much అనిపించిందా...

  ---------

  అంతే... ఈ మనుషుల తీరు
  point పనికొస్తే కుమ్మేస్తారు. లేక పోతే విసిరి అవతల పడేస్తారు.
  -------------
  ఈ లోకం తీరూ అంతే
  ఈ లోకం లో వున్నది మనుషులేగా ..

  ----------

  పి.వి. గారి గురించి నిజాలు కావాలంటే స్వాతీ లో ప్రతీవారం ఒక శీర్షిక వస్తోంది (అది ఆయన గురించి కాదు కానీ ఆయన దగ్గర పనిచేసిన ఒక IAS ది)
  లేదంటే THE INSIDER చదవాలి. (ofcourse నేను చదవలేదు (అమ్మఒడి లో ఆదిలక్ష్మిగారు అన్నారు))
  -----------------
  ఆయన తను నమ్ముకున్న సూత్రాన్నే జీవితాంతం పాటించారు.
  ----
  ఇండియా తలరాతను మార్చారు.(కనీసం నాలాంటి వాళ్ళు నమ్ముతారు. )
  ------
  సరైన టైటిల్ తో ఆత్మ కధ రాసుకున్నారు. 'అంతర్ముఖుడు '

  ReplyDelete
 2. మనాళ్ళకు ‘కీలుబొమ్మను’ ఆడించే వారిని తృప్తిపరచటమో వాళ్ళపైన బురదజల్లటమో చేయమని చెప్తెబాగుంటుందిగాని....నువ్వేంటయ్యా ఎవరికో నివాళులర్పించమటావ్‌.

  నిజంగానే ఆయన ఏ ఉత్తరప్రదేశ్‌‍లోనో,తమిళదేశంలోనో పుడితే బ్రతికున్నప్పుడు కాకపోయినా, పోయినతరువాతైనా గౌరవం లభించుండేది.
  ఆయన చితికి జరిగిన మర్యాద ఏమిటొ ఇంకా కదలాడుతూనే ఉంది.హక్కును పక్కనెబెడితే మనకు అలాంటి వారిని స్మరించుకొనే అర్హతుందా....?

  ReplyDelete
 3. మీ టపా ఆవేదన తో నేను ఏకీభవిస్తున్నా !
  నిజమే తెలుగువాడి గా పుట్టటం ఆయన దురదృష్టం !

  ReplyDelete
 4. బ్రహ్మ దేవుడు సరస్వతీ దేవి వైభవం చూసి కన్ను కుట్టి ...భార్య ఆధిక్యానికి కారణం ఆమె వద్ద వున్నా జ్ఞాన భాండాగారమే అని గ్రహించి .... కొంత తస్కరించి తను చేసే బొమ్మలో ఇమిడ్చినట్లున్నాడు .... ఆ విధం గా చెయ్య బడ్డ బిడ్డడే మన P.V అయి వుండవొచ్చు బహుశా...... కుళ్ళు రాజకీయ నాయకులు గుర్తించనంత మాత్రాన ఏముంది... ?? మన హృదయాలలో చిర స్థాయి గా వుంటాడు గా..ఈ "తెలుగు జాతి ముద్దు బిడ్డడు"..!!! అవును ఇంతకీ మన P.V తెలుగు జాతి కే ముద్దు బిడ్డడా ?---తప్పు చెప్పినట్లున్నాను -----"భరత జాతి ముద్దు బిడ్డడు " ..ఇది బాగుంటుందేమో...

  ReplyDelete
 5. శివన్న: బాగా చెప్పావన్నా

  ReplyDelete
 6. చాలా యాదృశ్చికం మాష్టారూ!

  చలం గారి మ్యూజింగ్స్ చటుక్కున తెరిచి ఒక పేజీ చదవటం నా హాబీ. అలాగే నేను ఇప్పుడే చదివి పుస్తకం అల్లా బోర్లించి, ఆయన చెప్పిన విషయం ఆలోచిస్తూ బ్లాగులు తిప్పుతుంటె, మీ బ్లాగులో ఫి వి గారి గురించి వ్రాసినది నా కంటపడింది. చలం గారు చాలా చెప్పారు కానీ, ఈ కింది విషయం నాకు బాగా నచ్చింది.

  ".....గాంధీగారు కాని, టాగూర్ గారు కాని తెలుగుదేశంలో పుడితే, ఆ పేర్లు కూడా ఎవరూ విని ఉండరేమో అనిపింస్తుంది. చివరకి భగవాన్ ఐనా సరే (రమణ మహర్షి ని చలంగారు అలా పిలుస్తుంటారు)..."

  "...తెలుగు వాళ్ళు చచ్చిన వాళ్ళనీ, కొద్దిమంది చితికి వృధ్ధులైన వాళ్ళనీ, గౌరవించినప్పుడు కూడా, ఏదో జ్ఞాపకం తెచ్చుకుని, బలవంతంగా ఉత్సాహపర్చుకుని, ఆ కాస్త పనీ, ఎలాగో ఓలాగు చేసేసి, చేతులు దులుపుకుంటున్నారపిస్తుంది. అరవై ఏళ్ళు వొచ్చిందాకా అసలు మనిషిలో గొప్పతనం కనిపించదు. ఆ లోపల చావడా అని చూస్తారు. బతికి ఉంటే, తాము ఇంత ప్రయత్నం చేసినా, అతనో, అతని కళో, చావలేదేమా అనే విసుగుతో, ఓ పండగ చేస్తారు....." (269వ పేజీ, చలం మ్యూజింగ్స్ 5వ ప్రచురణ జులై 2005)

  పి వి నరసింహారావు గారికి ఉండవలసిన గౌరవం ఉండవలసిన వాళ్ళదగ్గర ఉందనే నేను అనుకుంటున్నాను. బఠాణీ బుర్రగాళ్ళకీ ఆయన అర్ధం కాడు కాదు కదా మరి.

  ReplyDelete
 7. శివరామప్రసాద్ గారు చెప్పినట్లు చాలా మంది తెలుగు ప్రజలకు కులం, డబ్బులు, అధికారం తప్ప ఇంకేవి కళ్లకానవు. పి వి గారి విలువ,ఆయన పైన గౌరవం రాను రాను పెరుగుతుంది. ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు ఆయన పైన ఎదైనా జాతీయ పేపర్లో వ్యతిరేకంగా రాస్తే దానిని తిప్పి కొడుతూ చాలామంది వ్యాఖ్యలు రాయటం పెరిగింది. వీరిలో ఎక్కువగా 90% నార్త్ ఇండియా వాళ్లే ఉంటారు. వారే కాకుండా చాలా మంది విదేశాలలో పని చేసే పెద్ద ప్రొఫెసర్స్ ఇప్పుడు పి వి అభిమానులుగా మారిపోయారు. కారణం ఆయన అప్పుడు తీసుకొన్న, నిర్ణయాలు పాలసి లో మార్పులు, ఫలితాలు ఇవ్వటంతో వారికి ఇప్పుడు పి వి గారి నిర్ణయాల వెనుక ఉన్న దూరదృష్టి స్పష్ట్టం గా అర్థమైంది. వాళ్లు పి వి ని గుర్తు చేసుకొంట్టు వ్యాసాలు రాస్తూంటారు. ఎదీ ఎమైనా ఇప్పటివరకు మనదేశాన్ని పాలించిన ప్రధానులలో పి వి ఆల్ టైం బెస్ట్ - ప్రధాని నంబర్ 1

  SriRam

  ReplyDelete
 8. పివి గారంటే, ప్రొఫెషనల్స్ అందరికీ గౌరవం ఉంది.
  రాజకీయనాయకులకే గౌరవం లేదు.

  దేశచరిత్రని మలుపు తిప్పే నాయకులు ఎప్పుడో కాని పుట్టరు. పి వి అలాంటి నాయకుల్లో ఒకడు.

  ReplyDelete
 9. దెయ్యాలకి హనుంంతుడంటే భయం. ఆయన పేరపలికేసంగతి దేవుడేరుగు కనీసం తలుచుకున్నా ఝడుసుకుంటాయి. రాజకీయ నాయకులకి పీవీ అన్నా అంతే

  ReplyDelete
 10. నివాళులర్పించే ముందు, ఆయన చేసిన గొప్ప పనులను మౌలికంగా ప్రస్తావించడం ధర్మం. ఆయనకు 14 భాషలు వచ్చు, ఆయన అంతర్ముఖుడు, మౌని, యోగి, ఆర్థిక సంస్కరణలు గావించెను, చెట్లు నాటించెను, బావులు తవ్వించెను టైపులో కాక కొంచెం వివరించాల్సి వుంది.
  ఇప్పుడు మన్మోహనుడు ఆర్థిక డయేరియా కొనసాగిస్తున్నారు. ప్రజల్కు అవసరమో కాదో గాని అమెరికా ఎలక్షన్ల ముందు తలుపులు బార్లా తీయాలనే ఒబామా ఆదేశాన్ని అమలు చేస్తున్నాడంటారు. సంస్కరణలు స్వచ్చందంగా చేశారా, వత్తిడి మీద చేశారా? అన్నది చూడాలి.

  పి.వి.ఎన్.రావు గొప్ప నాయకుడే, కాదనను. నివాళి సమర్పించేముందు భట్రాజు పొగడ్తల్లా కాక ప్రత్యేకతలు ప్రస్తావిస్తే బాగుంటుంది.

  ReplyDelete