స్వర్ణముఖిస్వర్ణముఖి ... తూర్పు కనుమల్లో శ్రీనివాసుని పాదాల దగ్గర పుట్టి మా ఊరి మీదుగా సముద్రం లో కలిసే నది ఇది. అసలు జాతి,సంస్కృతి, చరిత్ర ఇలాంటి పదాలు ఎప్పుడు విన్నా అంతర్లీనంగా ప్రతి విషయం ఏదో ఒక నదితో విడదీయరాని బంధాన్ని ఏర్పరచుకుంటాయి. దీనికి మా స్వర్ణముఖి కూడా ఏ మాత్రం మినహాయింపు కాదు. దీని ఒడ్డున మహారాజ్యాలు ఉండక పోవచ్చు, చరిత్రకు ఎరుపును అద్దే యుద్ధాలు జరుగక పోవచ్చు కాని ఈ ప్రాంత ప్రజల జీవనయానానికి ఇది ఒక మూగ సాక్షి

పురాణాల ప్రకారం చూస్తే విష్ణుమూర్తి పై అలిగిన లక్ష్మీదేవి వైకుంటం వదిలి పుట్టినిల్లు ఐన సముద్రంలోకి వెళ్ళిపోయింది. తరువాత నారాయణుడు శ్రీనివాసునిగా అవతరించారని ఆయన పద్మావతిని పెళ్లి చేస్కున్నారని తెలిసి ఆయనను కలిసేందుకు వెళ్ళిన దారిలో బంగారం రాశులుగా ఆమె వెళ్ళిన బాట వెంబడి పడ్డాయి. తరువాత శ్రీవారు పాషాణం అవడం తరువాతి కదా అందరికీ తెలిసిందే.శ్రీవారు లక్షీ సమేతుడై శేషాచలంపై ఉండటంతో బోసిపోయింది. అక్కడ వారిద్దరూ విహరించే క్రీడాద్రి ఇక్కడికే వచ్చింది. అలా అది భూమికి చేరేటప్పుడు దానిపైన జలపాతాలు నదిగా లక్ష్మిదేవి సముద్రం నుంచి వచ్చిన దారిలోనే ప్రవహించాయి. బంగారు రాశులునదిలో ఇసుక బంగారుచాయలో మారిందని అంటారు. చంద్రగిరి కొండల్లో చిన్న సెలయేళ్లుగా ఉండే స్వర్ణముఖి తిరుపతి దాటేసరికి ఒక నదిగా రూపాంతరం చెందుతుంది. దీని ఒడ్డున ఉన్నముఖ్యమైన ప్రదేశాలు
ఏర్పేడు ఆశ్రమం- ఇది మలయాళ స్వామి వారిచే ప్రారంభించబడింది. ఇక్కడ ఎన్నో తరాలుగా వేదాధ్యయనం చేస్తున్నారు. దీని నాకు పెద్ద సమాచారం లేదు. దొరికితే భవిష్యత్తులో టపా వేస్తాను.
శ్రీకాళహస్తి- దీని గురించి తెలియని వారు ఉండరు. దక్షిణ భారతదేశంలోని సుప్రసిద్ధ శైవక్షేత్రాల్లో ఇది ఒకటి. దీని గురించి ఇక్కడ రాయటం మొదలైతే ఈ టపా స్వర్ణముఖి గురించా లేక కాళహస్తి గురించా అని మీకు అనుమానం వస్తుంది.అందుకే ఇక్కడ మీకు లింక్ ఇస్తున్నాను. http://www.srikalahasti.org/

తరువాత నాయుడుపేట, మా ఊరు వాకాడు మీదుగా ప్రవహించి పామంజి అనే ఊరి దగ్గర సాగరంతో సంగమిస్తుంది మా స్వర్ణముఖి. తంజావూరు దగ్గర కావేరి పై ఆనకట్ట కట్టిన తరువాత ధవళేస్వరం వెళుతూ కాటన్ దొర ఇక్కడకి రాత్రి పూట వచ్చి ఉంటాడు. అందుకే మా నదిని గమనించలేదు. లేకుంటే ఆ ఆనకట్ట ఇక్కడే ఉండి ఉండేది. అలా అని ఊరుకోలేము కదా. అందుకే ౨ ఏళ్ళ క్రితం మా ఊరిదగ్గర ఒక బారేజి కట్టారు ప్రభుత్వం వాళ్లు. ఇక నదిలో ఎప్పుడూ నీళ్లు ఉంటాయి అని కలలు కన్నారు మా ఊరి వాళ్లు.కాని అది బారేజి కదా అందులో నీళ్లు తక్కువ వుంటాయి. ఆనకట్ట ఐతే రిజర్వాయర్ లో నీళ్లు ఎక్కువ ఉంటాయి. ఆ సంగతి వాళ్ళకి తెలియదు మరి. ఎన్నో ఏళ్ళ కల మా ఊరి నాయకుడి కారణంగా తీరింది. మా ఊరిలో దాని ఒడ్డున శివాలయం, చెన్నకేశవ స్వామీ ఆలయం ( ఈ మద్యనే కట్టారు) ఉన్నాయి. చెన్నకేశవ స్వామీ ఆలయం తో నాపెద్దగా అనుబంధం లేదు గాని శివాలయం మాత్రం మా ఊరి యూత్ కి చాటింగ్ హబ్. నాకు తెలిసిన ఫ్రెండ్స్ లో చాల మందికి పరీక్షలకి చదువుకోవాలంటే ఇదే బెస్ట్ ప్లేస్.వారిలో ఒకతను ఈ మద్యనే తన బ్లాగ్ లో ఆ గుడి ఫోటోలు పెట్టాడు. http://kolanukudurusiva.blogspot.com/2009/02/sri-nageswara-swami-templevakadu.html. ఈ ఫోటోల్లో గుడి అంత బాగా ఉంది అంటే అందులో నూటికి నూరు శాతం నా స్నేహితుల వల్లే. నిజం చెప్పాలంటే అందులో నా భాగం చాలా తక్కువ. వాళ్లు ప్రతి శివరాత్రికి ఎంతో కష్టపడి శుభ్రం చేస్తారు.
ఈ నదిలో మాకు దానిలోని నీళ్ళకంటే ఇసుకతోనే ఎంతో బంధం. కారణం చాలా చిన్నది... అందులో నీళ్లు కొన్ని వారాలు మాత్రమే ఉంటుంది. మా చిన్నప్పుడు కనీసం మార్చ్ వరకు ఉండేవి నీళ్లు. మా అమ్మ వాళ్లు చిన్నప్పుడు అందులో మాఘ స్నానాలు కూడా చేసే వారట. ఒక్కసారి వరద వస్తే బావులన్నే నిండి పోతాయి. మళ్ళీ వరద వచ్చేవరకు నీళ్లు సరిపోతాయి. చిన్నప్పుడు అది నాకు చాలా ఆశ్చర్యం వేసే విషయం. తరువాత అర్ధం ఐంది ఏమిటంటే కింద ఇసుక చాల లోటు వరకు సుమారు ౪౦ మీటర్ల వరకు ఉంది. వరదనీళ్లు అందులో నిలువ ఉండి ఏడాది మొత్తం బావులకి నీళ్లు ఇస్తాయి.ఇప్పుడు నీటి ప్రవాహం తగ్గింది. కారణం ఏంటి అని ఆలోచిస్తే తెలిసింది చిత్తూరు జిల్లలో చాల చోట్ల ఈ నదిలోకి కలిసే వాగులకు చెక్ డాంలు కట్టారు. అందువల్ల మాకు వచ్చే ఒండ్రు, నీళ్లు తగ్గిపోయాయి. కళ్యాణి డాం అని తిరుపతి దగ్గర మరొక డాం ఉంది. తుఫాను వస్తే దాని గేట్లు ఎత్తేస్తారు. అప్పుడు ఆ వరద నీళ్ళతో గోదారిలా అని పిస్తుంది మాకు. అలాగే ఇంకొంత కాలం నీళ్లు ఉంటే బావున్ను అనిపిస్తుంది మాకు.ఆ వారం రోజులు నీళ్ళమట్టం చూస్కోవడం మా చుట్టూపక్కల గ్రామాల్లో ఒక సంబరం మరి మళ్ళీ చూడాలంటే మరో సంవత్సరం ఆగాలి కదా.
ఇక పొతే ఇసుక.. అటు తెలుపు ఇటు పసుపూ కాని ఒక అందమైన చాయ ఆ ఇసుక సొంతం.కట్టుబడికి ,కాంక్రీట్ పనికీ చెన్నై కి కూడా పంపుతారు. మా ఊరి ఇసుకకి ఇంత డిమాండ్ ఉందంటే కొంచం గర్వంగా ఉన్నా ఇలా తవ్వుకుంటూ పొతే కొంత కాలానికి మనకు ఏమీ మిగలదు ఏమో అనిపిస్తుంది నాకు. మా చిన్నప్పుడు బంధువుల పిల్లలం దాదాపు ౧౫ మందిమి ఉంటాం. వాళ్లు ఏప్రిల్ ౨౪ ఇక్కడికి వస్తే జూన్ ౧౨ వరకు ఉండేవాళ్లు. అందరికి సాయంత్రం ఐతే ఓకటే ఆనందం ఏట్లోకి వెళ్లి ఇసుకలో ఆడుకోవచ్చు. అలా ఇంజనీరింగ్ పూర్తీ అయ్యేవరకు దాదాపు ప్రతి ఎండాకాలం అక్కడ గడిపాం. కుదిరితే ఫొటోస్ టప చేస్తాను.
స్వర్ణముఖి గురించి ఎన్నో రాయాలి అనుకున్నాను. కాని ఇక్కడ పదిశాతం మించి రాయలేక పోతున్నాను. అయినా ఇది నేను నాకోసం రాసుకొనే స్థలం కాబట్టి ఎప్పుడైనా రాసుకోవచ్చు అనే ఆనందం తో ముగిస్తున్నాను. మొదటి టపా లోనే మా స్వర్ణముఖిని గురించి రాయాలి అనుకున్నాను. కాని ఇప్పుడు రాయడం చాలా ఆనందంగా ఉంది.

5 comments:

 1. గుడి ఫొటొలు బాగున్నాయి.

  ReplyDelete
 2. @తృష్ణ :మరి చెప్పాను గదండి మా ఊరి యూత్ గురించి.ధన్యవాదాలు

  ReplyDelete
 3. మన ఊరి గుళ్ల గురించి ఒక సారి ప్రస్తావించు .... వేరే టపా లో ఆయినా... బాగుంది నీ రచానా సరళి...

  ReplyDelete
 4. @శివన్న: మొదలుపెడుతాను. ఉన్నారుగా రోల్‌మోడల్స్. హహహ

  ReplyDelete
 5. nadula history chaalaa baagaa vunde.prakasam jillla loo gundlakamma nadi vunde.ee nadi history kuuda post chaayande.

  ReplyDelete