మోతీజిల్ 1

మాఊరిలో మొత్తం ఏడుగుళ్ళు ఆరు బళ్ళు ఉన్నాయి. గుళ్ళలో నాలుగు వైష్ణవం, రెండు అమ్మవార్లు మరియు ఒకటి శివాలయం. బళ్ళలో ఐదు ప్రాథమిక( మూడు పరిషత్, రెండు ఎయిడెడ్), ఒక ప్రాథమికోన్నత మరియు ఒక ఉన్నతపాఠశాల. గుళ్ళు, మిగతా బళ్ల సంగతి తర్వాత మాట్లాడుకుందాం (సవివరంగా). ఉన్నతపాఠశాల విషయానికొస్తే అది 1932 లో ప్రారంభించారు. దానిపేరు SALCEF HighSchool (సౌత్ ఆంధ్రా లూథరిన్ చర్చ్ ఎల్లసిరి ఫిర్కా హైస్కూలు). దానికాపేరు ఎందుకొచ్చింది అన్న సంగతికూడా మళ్ళీమాట్లాడుకుందాం. దీనిపేరు ఈమద్యన మార్చారు. NBKRSALCEF High School (నేదురుమల్లి బాలకృష్ణారెడ్డి సౌత్ ఆంధ్రా లూథరిన్ చర్చ్ ఎల్లసిరి ఫిర్కాహైస్కూలు). అసలాపేరు ఎందుకుమారిందన్నదికూడా ఇప్పుడూ చెప్పేంత చిన్నదికాదు. కాబట్టి అదికూడా మళ్ళీనే. అదృష్టం బావుండి ఆరోతరగతిలో రాగింగ్ లేదుకాబట్టి సరిపోయిందికానీ లేకుంటే జూనియర్లను ఒక్కోడు నూటెమిదిసార్లు స్కూలుపేరు రాసుకురాండ్రా అని సీనియర్లు చెప్పారనుకో ఇకఅంతే బడిబాట మూసుకుపోతుంది.

ఆబడి ప్రారంభించి ఇప్పటికి దాదాపు డెబ్బైఎనిమిదేళ్ళు. ఇన్నేళ్ళ ఆస్కూలు చరిత్రలో ఎన్నో ఉత్తన్నపతనాలు, ఎందరో హెడ్మాస్తర్లు, డ్రిల్ మాస్టర్లు,పిల్లల్లో కొందరు బాలమేథావులు, మరెందరో గజినీలు. ఒకానొక రోజుల్లో స్కూలుబలం వందకుపైన పంతుళ్లు పదహారొందలమంది పిల్లలు. చెప్పాగా చరిత్రచాలా పెద్దది అని. ఒకటపాలో సరిపోయేదికాదు.

ఒకపేరుంది. ఆస్కూల్లో చదివినవాళ్లకి, పనిచేసినవాళ్ళకి ఆపేరుచెప్పడంతోనే అప్రయత్నంగా చిరునవ్వు ప్రత్యక్షమయ్యి ఆపై వాళ్లవాళ్ల అనుభవాలననుసరించి మిగిలిన హావభావాలు వ్యక్తమవుతాయి. ఆపేరు పీ.వీ. సుబ్రహ్మణ్యం. ఆస్కూల్లో దాదాపు ముప్పైమూడేళ్ళు పనిచేసిన తెలుగుపండితుడు. తెలుగుపండితుడు అనడంతోనే ఆహార్యాన్ని ఊహించేసుకోకండి ఆయన బ్రహ్మానందంలాకాక సుందరకాండలో వెంకటేష్‌బాబులా పాంటుషర్టు వేసుకునేవాడు. సుందరకాండ పేరువిని అనవసరమైనవి ఊహించుకోకండి. కళ్ళుపోతాయ్.

ఆయనకి మంగళవారం భయంకరమైన సెంటిమెంట్. అంటే ఏముఖ్యమైనపనైనా మంగళవారం మొదలుపెడతారన్నమాట. అలా ఆయన ఉద్యోగజీవితాన్ని కూడా మంగళవారమే మొదలుపెట్టాడు.ఆయనకి ఐతే మంగళవారం సెంటిమెంటు అచ్చొచ్చింది, కానీ అందరికీకాదుగా. దానిఫలితం అప్పటిదాకా ఉమ్మడిగా బాలబాలికల్తో కళకళలాడిన బడి ఆవరణం ఒక్కసారిగా ఎడారిగా మారిపోయింది. అంటే అర్థం అయ్యిందిగా. ఆయనచేరిన రోజే అమ్మాయిలకు విడిగా హైస్కూలు మొదలుపెట్టారు. హైస్కూలుజీవితంపై ఎన్నోఆశలతో చేరినవాళ్ళకి శరాఘాతంగా మారిందీ పరిణామం. ఇక ఆరోజునుంచి సుబ్రహ్మణ్యంగారి ఆగ్రహానుగ్రహాలకు హెడ్మాష్టరునుంచి ఆరోతరగతి పిల్లాడిదాకా ఉక్కిరిబిక్కిరవడం నిర్విఘ్నంగా ముప్పైమూడేళ్లపాటు జరిగింది.

నేను చిన్నబడిలో ఉన్నప్పుడే ఆయన తెలుసు. తాతదగ్గరికి పంచాంగంకోసం వచ్చేవాడు. జయచంద్ అని నాఫ్రెండొకడు ఆయన దగ్గరికి నవోదయకోచింగ్ కోసంవెళ్ళేవాడు. వాళ్ళనాన్నకి ఆసారంటే బాగాగురి. అదీగాక ఆయనకి ఇంకొక అలవాటుంది. సాయంత్రం బడి వదిలాక అన్నోళ్ళంతా ఆయనతోపాటు గుంపుగా వచ్చేవాళ్ళు. స్కూలునుంచి ఇంటిదాకా ఈపిల్లగాంగుతో పిచ్చాపాటీ మాట్లాడుతూ వచ్చేవాడు.అది నాకు కొంచెంవింతగా తోచేది.

ఐదోతరగతిదాకా ఆయన తెలుసు కానీ, ఆయనగురించి తెలిసిందిమాత్రం ఆరులో చేరాకే. బాగాచదివేవాళ్ళు, అంటే పరిక్షల్లోబాగా మార్కులొచ్చేవాళ్ళు కాదు పాఠాన్ని చదవరా అంటే పుస్తకం చేతులోపెట్టుకుని గట్టిగా క్లాసంతా వినిపించేలా చదివేవాళ్ళు, అంటె ఆయనకి ఇష్టం. బాగారాసేవాళ్ళు అంటేమాత్రం ప్రాణం. ఆయన పాఠం చెప్పే విథానం ఎలా అంటే- ఒకడు పాఠాన్ని చదువుతూ ఉండాలి, అప్పుడు చదువుతున్న భాగంలో ఎన్నిపాత్రలుంటాయో అంతమంది నిలబడి అంటే అదొకనాటకంలా అన్నమాట, ఒకడు ముఖ్యమైన పదాల్ని బోర్డుపైన రాయాలి. ఆరో తరగతిలో మాత్రం బోర్డుపైన ఆయనే రాస్తాడు, మిగతాక్లాసుల్లో కొన్నిఆయన-మరికొన్ని పిల్లలు. నోట్సివ్వటం వంటివి ఎప్పుడూ ఉండదు ఒక్క పదోతరగతికి తప్ప. పిరిడుగంట కొట్టేవరకు నిలబడే ఉండాలి వీళ్ళంతా. ఇక్కడ సమస్య నిలబడడంకాదు. ఆయనకి బీపీ కొంచెం అంటే కొంచెమే ఎక్కువ. ఆక్షణంలో అతిసమీపంలోని విద్యార్థి వీపుపై కింగ్‌ఫిషర్ విమానం హారను కొట్టేలా అల్గరిథం ఒకటి ఉంటుంది. ఆప్రోగ్రాం పూర్తిగా ఆటొమేటేడ్.

ఆరోతరగతిలో మనపైన మాంచీ ఇదన్నమాట. దాదాపూ రోజూ చదివేపని నాదే. అప్పట్లో జగ్గయ్య అని పిలిచేవాళ్ళు నన్ను. ఇదిబాగానే ఉండేదికానీ అప్పుడప్పుడు వేరేవాళ్ళు చదివేటప్పుడు ఏదోఒకపాత్ర అందులోనూ ఎక్కువగా హీరోయిన్ పాత్ర ఇచ్చేవాడు. కొద్దికొద్దిగా ఊహతెలిసొచ్చే వయసులో ఆడపాత్రకి నిలబడాలి అంటె తెగసిగ్గుగా ఉండేది. మనకంటే తెల్లగా ఉండే అశొగ్గాడు క్లాసులోకి వచ్చింది దసరా తర్వాత. ఆతర్వాత నాకీభారం తగ్గింది.

ఆఇమేజీతో ఆసంవత్సరం అంతా గండపెండేరాలు, గజారోహణలు అబ్బో. ఇక ఏడొతరగతికొచ్చే సరికే బోర్డుపైన రాయాలి. అక్కడే మరి తేడావచ్చేది. నాబ్రహ్మరాత గురించి విడిగా ఓటపా పెడతా. నాకుతెలిసీ ఈవిషయంలో బ్లాగ్మిత్రులలో కొంతమంది తోడున్నారు నెమలికన్ను మురళిగారు, సునీతగారు వగైరా వగైరా. మొదటిరోజు ఓంప్రదంగా ఆయనే రాశారు. హమ్మయ్య తొలిరోజుగండం గడిచింది అనుకున్నా. మొత్తానికి మొదటి రెండుమూడువారాలు అలానే బిక్కుబిక్కుమంటూ గడిపా. మొత్తానికి ఆపిలుపు వచ్చింది. "తనతండ్రియైన వాయుదేవునకు సూర్యచంద్రబ్రహ్మాదిదేవులకు ...వందనములిడే పూర్వాభిముఖుడై.." అని సుందరకాండ చదువుకుని, సర్వమతప్రార్థనలు జరిపుకొని చాక్‌పీసు పట్టుకున్నా. తీరా రాసేసమయానికి ఇటివ్వు అని ఆయనే రాశాడు. "హమ్మయ్య! దేవుడున్నాడు. ఇంట్లో మనంపెట్టే నైవేద్యాలు,అమ్మమ్మ వారంవారంవండే గుగ్గిళ్ళు తిని ఇలాంటి సమయాల్లో మహిమలు చూపిస్తాడు." అనుకొని వచ్చికూర్చున్నా.బహుశా సార్ల దగ్గర దెబ్బలుతినే సమయంలోనే చాలామంది విపరీతమైన ఆస్తికులుగానో, కరడుకట్టిన నాస్తికులుగానో మారుతారనుకుంటా.

ఇలా ఎన్నిరోజులు సాగితాయి. ఒకటారెండా? ఒకసంవత్సరం. అంటే సుమారు రెండొందలపని దినాలు. అందులో నూటయాభై తెలుగుపిరియడ్లు. ఒకానొక సమయంలో చిక్కిపోయా. మనరాత చూసి కళ్ళుతిరిగిపోయాయి. మీకొక అనుమానం రావొచ్చు. ఆరోతరగతిలోనే చేతిరాత చూసుంటాడుగా అని?

నిజానికి ఆరోతరగతి ఆయన క్లాసుకాదు.మాకు ఆరోతరగతిలో తెలుగుకు సారులేడు. టైంటేబుల్లో లెక్కలమేడం మాకు తెలుగుకూడా చెప్పాలి. కానీ ఆమెకి క్లాసులెక్కువవడంతో కర్టసీమీద ఈయనే తీసుకునేవాడూ. పరీక్షలుమాత్రం ఆవిడే చూసుకునేది. లెక్కల్లో నాపైనఉన్న అభిప్రాయం తెలుగులో చేతిరాతను కప్పేసింది. అలా మొదటిసారి బోర్డుపైన 'నా'రాతని చూసి ఆయన బీపీ శిఖరానికెళ్ళి "శృతిశిఖర సంచారా.." అనిపాడింది. ఇక్కడా దైవం మనపక్షానే. ఆసమయంలో ఆస్తికుడనైన నేను అయనకు దూరంగా ఉండడం, ఆదెబ్బలుతిని మరొకడు నాస్తికుడుగా మారిపోవడం క్షణకాలంలో జరిగిపోయాయి.

ఈహఠాత్పరిణామానికి ఆయనహృదయం ముక్కలైంది. నమ్మబుద్ధిగాక నానోట్సునడిగాడు. చూశాడు. బోర్డుపైన రాతే కొద్దిగా నయం అనుకున్నాడు. ఒక్కసారిగా నాప్రతిష్టకి గ్రహణం పట్టింది. నేను చదివేప్పుడు పరిస్థితి అదుపులోనే ఉంటుందిగానీ ఎక్కడైనా రాయాల్సొచ్చినప్పుడు మాత్రం ప్రాథమికహక్కులు పూర్తిగా కాలరాచబడేవి. సైనికచర్యలు చేపట్టేవారు.

కొంతకాలానికి కొట్టడం ఆయన బాగాతగ్గించేశాడు. "ఈమద్యన అయ్యోరు పెద్దగా కొట్టట్లేదన్నా" అని ఎనిమిదోతర్గతివాళ్ళతో అంటే దానికి వాళ్ళు- "మాకూ అలానే అనిపించిందిరా. ఆయనేం తగ్గించలేదు. మనమే అలవాటుపడిపోయాం అని తర్వాత అర్థం అయ్యింది." అని సెలవిచ్చారు. అదీ అనుభవం అంటే. ఎంతైనా సీనియర్లు సీనియర్లే. మనకి తట్టనిసూక్ష్మాలు వాళ్ళు పట్టేస్తారు.


మోతీజిల్ 2

8 comments:

  1. మోతీ జిల్ అంటె.. ఎదో జిల్ జిల్ అనుకుని ఓ తెగ అరాటపడి... సందుచూసుకుని చదివా...!!హ్... నువ్వు ఎప్పుడు అయనగురించి రాయడం మానేస్తావో (సశేషం అన్నావు గా) చెప్పు... అప్పుడే మళ్ళా స్వర్నముఖి లో తొంగి చుస్తా....ఈలొపు నా వీపు ఒక్క సారి చెక్ చేసుకొస్తా....

    ReplyDelete
  2. "ఆసమయంలో ఆస్తికుడనైన నేను అయనకు దూరంగా ఉండడం, ఆదెబ్బలుతిని మరొకడు నాస్తికుడుగా మారిపోవడం క్షణకాలంలో జరిగిపోయాయి"

    "రాయాల్సొచ్చినప్పుడు మాత్రం ప్రాథమికహక్కులు పూర్తిగా కాలరాచబడేది. సైనికచర్యలు చేపట్టేవారు"

    Hillarious..

    ReplyDelete
  3. హహహ!స్కూలు పేరూ, స్కూలూ, అయ్యోరూ, అంతా గొప్పగా బాగుంది!రాత లో తోడున్న వాళ్ళను ఎంత బాగా గుర్తు పెట్టుకున్నారో! btw టెంప్లేటు బాగుంది.ఇంతకీ టైటిలు అర్ధమేంటో!

    ReplyDelete
  4. హహహ :)

    గణేష్ డౌటే నాదీనూ. :))

    ReplyDelete
  5. @శివన్న: భలేవాడివన్నా. ఈవిషయంలో మాకన్నా నాలుగాకులు ఎక్కువ తిన్నోడివి నువ్వులేకుంటే ఎలా? వీపును తడిమిన వెంటనే బాల్యస్మృతులు తన్నుకొవ్వాయనుకుంటా :)

    @కుమర్: ధన్యవాదాలు. నేనురాసినవేవీ అతిశయోక్తికాదు.

    @ సునిత: మనంమనం ఒక‌ఆర్కుట్ కమ్యూనిటీ. అయినా అమ్మాయిల చేతిరాత బావుంటుంది. ముగ్గులెయ్యటంవల్లనో? లేక మాచూపులో దోషమో?

    @గణేష్, నాగ: కొద్దిగా ఓపిక పట్టండి.

    ReplyDelete
  6. స్కూలు కొత్త పేరు సూపర్..:)
    ఫ్యూచర్లో ఇంకొంచెం పెద్దగా అయినా ఆశ్చర్యపడక్కర్లేదేమో. జ్ఞాపకాలు బాగున్నాయి....చేతిరాత అర్ధం కాకుండా ఉన్నవాళ్ళంతా గొప్పవాళ్ళుట..! కాబట్టి బెంగపడొద్దు..

    ReplyDelete