శుభవార్త 1

UPSC యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్...దేశంలోకి ప్రవేటురంగం పూర్తిస్థాయిలో ప్రవేశించి అవకాశాలు కల్పించకముందు, జనాలు ప్రవేటూఉద్యోగాల గురించి ఆలోచించకముందు, ఉద్యోగం అంటే సాఫ్ట్వేరే అన్న మేనియా (మాస్‌హిస్టీరియా) రాకముందు ఇదొక కల్పవృక్షం. కామధేనువు. ఒయాసిస్సు. దేశంలోని ప్రతిష్టాత్మక సర్వీసుల్లోకి అత్యుత్తమ మానవవనరులను ఎంపిక చెయ్యడం, శిక్షణ నివ్వడం, అటుపై వారిపదవీవిరమణ వరకు పనితీరుని విశ్లేషించడం. ఇదీ కమీషన్ చేపట్టే ముఖ్యమైన కార్యక్రమాలు. వివిథసర్వీసులకు ప్రవేశపరీక్షల నోటీఫికేషన్లకు సంబంధించి  ప్రతిసంవత్సరం ఒకకాలెండరు వదుల్తారు. దాదాపూ ప్రతిసారీ ఇంజనీరింగ్ సర్వీసెస్ నోటిఫికేషన్తో మొదలై సివిల్ ప్రిలిమ్స్ తో ముగుస్తుంది. కాకపోతే ఈఏడాది సివిల్ ప్రిలిమ్స్ నోటిఫికేషన్న్ కొద్దిగా లేటయ్యిందట. కాబట్టి ఈఏడాదిమాత్రం ప్రిలిమ్స్ తో మొదలై ప్రిలిమ్స్ తో ముగుస్తుంది.

ఐతే ఏమిటట? ఇక్కడ నాబోటీవాళ్ళకి అంటే -నోటిఫికేషన్ చూశాక ఓయాంగిల్లో కోటేసుకుని, ఫైల్ చేతిలోఉన్న ఐయేఎస్, ఇంకోయాంగిల్లో ఖాకీడ్రస్సు, మూడుసింహాలు, లాఠీతో ఐపీఎస్ ఊహించుకుని చివరికి "అరే!అప్పుడే టైం అయిపోయిందా? బెటర్ లక్ నెక్స్ట్ ఇయర్" అనుకుంటే పెద్దగా నొప్పి తెలీదుగానీ సంవత్సరాల తరబడి ఆప్షనల్స్, జనరల్ స్టడీస్ చదివేవాళ్లకి అంచలంచల మోక్షంలో అగచాట్లు తెలుస్తాయి.
మొదట నోటిఫికేషన్- ఉద్యోగసమాచారంలో నోటిఫికేషన్ వేస్తాడు. మునుపు అదొక్కటే ఆధారం. అదేమి వింతో తెలీదుగానీ అన్నినెలలూ మనల్ని వెతుక్కుంటూ ఇంటికొచ్చి ఎంప్లాయ్మెంట్ న్యూస్ ఇచ్చే పోస్టాయన ఆవారమే కనిపించడు. పొరబాట్న ఆయన కనిపించినా చేతిలో మనపేపరుండదు. లోగుట్టు పెరుమాళ్లకైనా ఎరుకనా? ఆతర్వాత కమీషన్ వెబ్‌సైట్లో కూడా పెట్టడం మొదలెట్టారు.

దరఖాస్తు దొరకడం- అసలీ దరఖాస్తు ఎలా ఉంటూంది? ఎక్కడ దొరుకుతుంది? ఎలానింపాలి,పంపాలి? ఇది అంతచిన్నకథకాదు. ఓచెంబుడునీళ్ళు తాగి, టాయిలెట్టుకెళ్ళి వచ్చి చదవండి.


**********


ఎలాఉంటుంది?- ఇది ఓఎమ్‌ఆర్ షీటు. "అబ్బో! ఇంతోటిదానికా? ఐదోతరగతి నవోదయ నుంచి అలవాటే" అనొచ్చు. అక్కడే మీరు ఏపీపీఎస్సీలో కాలేశారు. ఈషీటు ఒక్కప్రిలిమ్స్ కోసమేకాదు. ఇంజనీరింగ్ సర్వీసెస్, జియాలజిస్ట్, ఫారెస్ట్ సర్వీస్, డిఫెన్స్ సర్వీస్ వగైరావగైరాలకి ఒకేఫారం. అందులో కొన్నిడబ్బాలు ఉంటాయి. నీపరీక్ష దేనికో చూసుకుని దానిప్రకారం సున్నాలు చుట్టాలి. చూసేందుకు చాలాసులభంగా ఉన్నా చిన్నతప్పుతో మొత్తంతలకిందులయ్యే తంటాలు చాలాఉన్నాయి.
ఎక్కడ దొరుకుతుంది- నోటిఫికేషన్లోనే అదిదొరికే పోస్టాఫీసుల వివరాలు ఇచ్చుంటారు. ఆపోస్టాఫీసుకెళ్ళి కొనుక్కొచ్చి నింపడం, పంపడం. ( మన అజ్ఞానం ఇక్కడే బయటపడేది.

నింపడం+పంపడం- సంత్సరానికి డజను నోటిఫికేషన్లు వదిలే కమీషన్ ప్రతిసారీ విడిగా ఫారాలను పంపే ప్రహసనాన్ని భరించలేక అన్నిటికీ కలిపి ఒక ఉమ్మడి ఫారాన్ని తయారుచేసింది. ఆ ఓఎమ్‌ఆర్ షీటు A4 సైజులో రెండుపేజీలుంటుంది.
మొదటిపేజీలో పరీక్ష వివరాలు, అభ్యర్థి వివరాలు, ఫోటో, స్టాంపు( దీనిగురించి కింద వివరంగా చెప్తా). రెండొపక్క పరీక్షకేంద్రం, అభర్థి ఘోష(ణ). ఈరెండొపేజీలోనే కొన్నిడబ్బాలుంటాయి. అందులో మనందేనికి అభ్యర్థిస్తున్నామో చూసుకుని, దానికి సంబంధించిన డబ్బానింపాలి. ఉదాహరణకు- సివిల్స్ వాళ్ళు 19, ఇంజనీరింగ్ సర్వీస్ వాళ్ళు20 వగైరావగైరా. దానికింద ఘోషణలో నోటిఫికేషన్ వివరాలు నింపి సంతకం చెయ్యాలి.

ముందుపేజీలోని ముఖ్యమైన అంకం ఏమిటంటే ఒకస్టాంపును అంటించడం. అసలీస్టాంపెందుకు? ముందేచెప్పాగా. అన్నిపరీక్షలకు ఉమ్మడి దరఖాస్తు అని. మరి ఒక్కోపరీక్షకు ఒక్కోఫీజు కట్టాలి. అయితే షెడ్యూల్డ్ కులాలవారు, తెగలవారు, వికలాంగులు, (స్త్రీలుకూడా అనుకుంటా) ఈఫీజుకు మినహాంచారు. జనరల్ భ్యర్థులు ఫీజుకట్టాలి. అందుకే ఈస్టాంపు.

స్టాంపంటే పోస్టలుస్టాంపుకాదు. అలాగనీ రెవిన్యూస్టాంపూకాదు. మరి ఏమిటది?అంటే.అదొక ప్రత్యేకమైన స్టాంపు. 'సెంట్రల్ రిక్రూట్‌మెంట్ ఫీ' అని అంటారు దాన్ని. జనరల్ అభ్యర్థులు వారు ఏపరీక్షకైతే నింపుతున్నారో దాన్ననుసరించి ఒకవిలువ నిర్థారిస్తారు. ఆవిలువకు సమానమైన స్టాంపును కొని, మొదటిపేజీలో దానికోసం నిర్ణయించిన స్థలంలో అంటించాలి. అంతేగా అంటే అంతేకాదు. ఇక్కడ కొన్ని నియమాలున్నాయి. ఆస్టాంపులు అన్ని పోస్టాఫీసుల్లోనూ ఉండవు. అవి దొరికేచోటికెళ్ళి కొనుక్కుని అంటించాలి. అంటించి పంపిస్తే సరిపోదబ్బాయ్. దాన్ని మళ్ళీ కాన్సిల్ చెయ్యించాలి. డబ్బులుపోసి కొనటమేమిటి? మళ్ళీ కాన్సిలింగ్ ఏమిటీ? అంటే దానికి మళ్ళీకథచెప్పాలి.

ఇందాకేచెప్పాగా ఉమ్మడిఫారం అని. ఫారం ఒక్కటే. ప్రతిపరీక్షకి ఫీజు స్థిరం. మారదు. మరి నోటిఫికేషన్‌కి ముందె ఎవడైనాకొనేసి, నింపేసి, రెడీగా పెట్టుకుంటే? అది నియమాలకి విరుద్ధం. ఈదేశంలో నేరస్థుడు ఆంటిసిపేటరీబెయిల్ (అంటే నేనేదైనా తప్పుచేస్తానేమో అని ముందుగా బెయిల్ తెచ్చుకోవడం) తెచ్చుకోవచ్చుగానీ, అభ్యర్థి నోటిఫికేషన్‌కి ముందుగా అంటిసిపేటరీ అప్లికేషన్ వెయ్యకూడదు. దీనివల్ల కొన్నిసమస్యలు ఉన్నాయి. కాబట్టి మనం అప్లికేషన్ కొనుక్కొచ్చి, నింపి, స్టాంపు అంటించవచ్చు. కానీ దాన్నిరద్దు చెయ్యించడంమాత్రం నోటిఫికేషన్ పడ్దాకే చెయ్యాలి. అసలీ రద్దుచెయ్యడమేంటీ అని తలపట్టుకుంటున్నారా? ఏమీలేదు. మనం(అంటే మనంకాదు. అభ్యర్థి.) స్టాంపు‌ అంటించినస్థలం పైనే ఒకవలయం ఉంటూంది. దానిపైన పోస్టాఫీసువాళ్ళు ముద్రవేస్తారు. ఆముద్రలో తారీఖు నోటిఫికేషన్ తారీఖు తర్వాతదై ఉండాలి.

ఆతర్వాత ఒక‌అక్నాలెడ్జిమెంట్ కార్డుముక్క. వీటన్నింటినీ నింపి, వాళ్ళిచ్చిన కవరులో పెట్టి, దానిపై నీచిరునామా రాసి( రాయల్సింది నీ చిరునామానే- ఫ్రం అడ్రస్లో. టూ అడ్రస్ వాళ్ళే అచ్చేసుంటారు) భారత తంతి తపాలాశాఖ వారిసేవలను ఉపయోగించుకుంటూ ( అలాకాక కొరియర్లో పంపితే దాన్ని 'బైహాండ్'గా పరిగణిస్తారు.) చివరితారీఖు సాయంత్రం ఐదులోగా చేరాలి. దీనికి కొన్నిమినహాయింపులున్నాయి. మారుమూలప్రాంతాలు (అంటే ప్రవీణ్ అన్నాయ్ ఉండే ఉత్తరాంధ్ర అడవులుకాదు)- అండమాన్, లక్షదీవులు, కాశ్మీరం మొదలైనవి. అక్కడీనుంచివచ్చే అభ్యర్థనలకు ఒకవారం మినహాయింపు ఉంది. అయితే అది పోస్టలుశాఖద్వారా పంపినవాటికే. కొరియర్లలో పంపితే ఈమినహాయింపు వర్తించదు.
ఇలాపంపాక ముందు అక్నాలెడ్జిమెంటుకార్డు, తర్వాత హాల్‌టికెట్ వస్తుంది. అదీసంగతి.

ఈకథంతా నేను రాసినంత, మీరుచదివినంత సులువైతే అంతకన్నా ఏంకావాలి? కానీ అలాగుండదే.
నోటిఫికేషన్ కోసం గమనిస్తూఉండాలి. ఓస్థాయిలో ప్రిపేర్ అయ్యేవాళ్ళకి ఐడియా ఉంటూంది. ఈమద్యనే వెబ్‌సైట్లో పెడుతున్నారని ముందేచెప్పాగా.కాబట్టి ఇదిపరిష్కారం అయ్యింది.
ఆనోటిఫికేషన్లో ఎక్కడెక్కడ దొరుకుతాయో జాబితా ఇచ్చుంటాడు. గిరాకీసీజన్లో ఈఫారం దొరకేకంటే రేషన్లో చక్కెర దొరకడం ఈజీ. అదీసంగతి. ఇకతేదీ దగ్గ్రరపడేకొద్దీ ఇరవైరూపాయలుండే ఫారం రెండొందలుకూడా దాటుతుంది. చాలాకొద్దిశాతం అభ్యర్థులు మాత్రమే నోటిఫికేషన్‌కిముందే తెచ్చిపెట్టుకుంటారు.(వీళ్ళు సుమతులు) ఇంకొందరు నోటిఫికేషన్ పడ్డాక గిరాకీపెరిగేలోగా తెచ్చుకునేస్తారు. (వీళ్ళు కాలమతులు) ఇకపోతే నాబ్యాచీ. చివరిక్షణందాకా మీనమేషాలు లెక్కపెట్టి లబోదిబోమంటారు. (మందమతులం)
ఆతర్వాత స్టాంపులు- స్టాంపులూ అంతే. ఓపట్టాన దొరకవు. ఒకవేళ దొరికినా ఆపరీక్షకి సరిపడే డినామినేషన్ ఉండదు. ఆసమయంలో పోస్టాఫీసులో ముద్రకొట్టే బెంచీకి మనతలకొట్టుకోవాలనిపిస్తుంది.
అన్నింటినీ మించినది- నింపడం+పంపడం+చేరడం. నింపడంఇందాకచెప్పానుగా. ఏమాత్రం తప్పుడబ్బాలో నింపినా వాళ్ళుచెత్తడబ్బాలోవేసేస్తారు.అయితే ఫారం చాలాసరళంగా ఉండడంతో, ఇక్కడ తప్పుకు అవకాశాలు తక్కువ. నింపేప్పుడు ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏపరీక్షకు నింపుతున్నాం, కేంద్రం కోడ్, ఘోషణలో నోటిఫికేషన్ వివరాలు. ఎక్కువమంది ఘోషనను నింపడం మర్చిపోతారు. సంతకంమాత్రం చేసి వదిలేస్తారు. ఇదికొద్దిగా గమనించుకోవాలి. ఇంకెక్కడైనా తప్పు జరిగితే ఎదుటివాళ్ళపై వెయ్యొచ్చు. నింపేప్పుడే తప్పైతే?

నింపాక పంపడం.ఇదీదైవాధీనం.మనఊరునుంచి ముద్రెయ్యిమ్చుకుని డిల్లీ చేరేదాకా ఎన్నెన్నిమజిలీలో? ఒక్కొక్కచోటా ఇష్టదైవాన్ని స్మరించుకోవాలి. నువ్వెప్పుడు పంపినా చివరిరోజు సాయంత్రానికి ఇండియాగేటు పక్కనున్న ధోల్‌పూర్‌హౌస్ చేరాలి.
ఇంతకీ ఏమిటీ శుభవార్త? అంటే ఈసంవత్సరం ఇంజనీరింగ్ సర్వీస్ నోటిఫికేషన్ వదిలారు అని తెలిసి చూస్తున్నా. అక్కడ సహజంగా కనిపించే upsc.gov.in తోబాటుగా మరొక యూఆరెల్ కనిపించింది. అదే http://upsconline.nic.in/ఇంతకీ విషయం ఏమిటయ్యా అంటే ఈసంవత్సరం నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు నింపొచ్చు. ఓహో!అలాగా అనుకున్నా.అసలు విషయం దాన్నిచూసినప్పుడూ తెలీలేదు. తర్వాతరోజు ఆఫీసులో లాల్జీవచ్చి "సాబ్!థోడాసా యూపీఎస్సీకా వెబ్సైట్ ఖులీయే. కామ్‌హై." అన్నాడు. 'ఏమిటిసంగతి' అంటే 'పాప ఏడ్చింది' అన్నాడు. 'సమఝ్‌కాలే' అన్నా. "బేటీకేలీయే ఈఎస్ నోటిఫికేషన్ దేఖ్నా సాబ్" అన్నాడు. సరే నొక్కాను. ఆయనకి వివరాలన్నీ చెప్పాక నోట్ చేసుకున్నాడు వెళ్ళిపోయాడు.

...సశేషం

2 comments:

  1. పాత జ్ఞాపకాలను తిరగదోడింది మీ పోస్ట్ .

    "ధోల్‌పూర్‌హౌస్" ... ఈ ఒక్కపదం అప్పటి చాలా తీపి,చేదు జ్ఞాపకాలని ఒక్కసారిగా కళ్ళముందు నిలిపింది..

    ఆల్ ద బెస్ట్ అండీ...

    ReplyDelete
  2. మీకు కలిగిన ఆచేదే నాకూ ఎదురైంది. అందుకే రాజాపత్రం దాచిపెట్టుకున్నా.

    ReplyDelete