మహారత్న

1975 నవంబరులో భారతప్రభుత్వం తీసుకున్న ఒకనిర్ణయం తాలూకు సారాంశం- "ఇప్పటివరకు రాష్ట్రప్రభుత్వ విద్యుత్తుబోర్డుల కింద జరుగుతున్న ఉత్పత్తికి సమాంతరంగా కేంద్రప్రభుత్వ పర్యవేక్షణలో ఒకప్రభుత్వరంగ సంస్థను నెలకొల్పాలి. ఈసంస్థ బొగ్గు-జలవనరులు సమృద్ధిగా ఉన్నప్రాంతాల్లో విద్యుదుత్పత్తిని చెయ్యాలి." తదనుగుణంగా జాతీయ తాప విద్యుత్తు సంస్థ (నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్) అనే భారత ప్రభుత్వరంగ సంస్థను ఏర్పాటుచేశారు.

విద్యుత్తురంగానికి అత్యున్నత సంస్థ కేంద్ర విద్యుత్తు అథారిటీ ఈవిషయంపై అద్యయనం చేసి మేలో 1976లో 2000MW విద్యుదుత్పత్తికేంద్రాన్ని నెలకొల్పేందుకు ప్రతిపాదించారు. ఉప్పు-నిమ్మకాయ దొరికితే ఊరగాయపెట్టినట్లు బొగ్గు-నీళ్ళు నింపాదిగా ఉన్న సింగ్రౌలీ ప్రాంతాన్ని ఎంచుకున్నారు. డిసెంబరులో కేంద్రం పచ్చజెండా ఊపింది. ముందుగా ఎంచుకున్న ఐదుప్రాంతాల్లో ప్రాథమిక దర్యాప్తు తర్వాత ఖడియా ప్రాంతాన్ని ప్రతిపాదించారు. జయంత్ బొగ్గుగనుల నుంచి బొగ్గు, గోవిందబల్లభ పంత్ జలాశయం (రిహాంద్ జలాశయం) నుంచి నీటిని వాడుకునే దిశగా ప్రతిపాదనలు పూర్తయ్యాయి.

మొదటిదశలో 600MWకు అనుమతి లభించింది. బాలారిష్టాలన్నీ దాటుకుని 1978 ఫిబ్రవరిలో నిర్మాణం మొదలయ్యింది. ఆపై రెండొవిడతకింద మరో 1400MWకు అనుమతి జూలై 1979లో లభించింది. నవంబరు 24, 1987లో ఏడవది, చిట్టచివరిది అయిన 500MW యూనిట్‌ని గ్రిడ్‌కి అనుసంథానం చెయ్యడంతో సింగ్రౌలీ బృహత్ తాపవిద్యుత్తు గృహం (సింగ్రౌలీ సూపర్ థర్మల్ పవర్ స్టేషన్) దేశంలోకెల్లా అతిపెద్ద తాపవిద్యుత్‌గృహంగా అవతరించింది. ఆపై ఫరఖ్ఖా, కోర్బా, రామగుండం మొదలైన చోట్ల ఉత్పత్తికేంద్రాలను నెలకొల్పారు.

1997లో నవరత్న హోదా లభించింది. ఏదైనా ప్రభుత్వరంగసంస్థ నవరత్నహోదా పొందాలి అంటే ఆరు‌అంశాలలో పనితీరు విశ్లేషించాక నూటికి కనీసం అరవైమార్కులు రావాలి. ఇలా నవరత్నహోదాను పొందిన సంస్థ ఏడాదికి వెయ్యికోట్లు లేదా సంస్థ నికరవిలువలో మూడోవంతులలో ఏది తక్కువైతే అంతవరకు పెట్టుబడి పెట్టేందుకు ప్రభుత్వంనుంచి ముందస్తు అనుమతి అవసరంలేదు. నవరత్నహోదాతో లభించిన స్వయంప్రతిపత్తి ఎన్.టీ.పీ.సీకేగాక ఐఓసీఎల్, బీహెచ్‌ఈఎల్‌వంటి సంస్థలకు వరంగా మారింది. చిన్నచిన్నపెట్టుబడులు, ఇతరవిషయాలకు సంబంధించి అధికారగణం చుట్టూతిరుగుతూ అలిసిపోయిన ఈసంస్థలు ఒక్కసారిగా రెక్కలు విప్పుకుని గగనతలంలోకి ఎగరడం ప్రారంభించాయి. దేశవిదేశాల్లో పెట్టుబడులు, సాంకేతికసేవలు, తమరంగానికి తిర్యక్‌దిశలో ఉన్నరంగాల్లో పెట్టుబడులు, మార్కెటింగ్‌రంగం వంటివాటీలోకి ప్రవేశించడంవంటి మార్గాలద్వారా విస్తృతపరచుకున్నాయి.


ఈరోజు 30000MW సామర్థ్యంగల ఎన్.టీ.పీ.సీ. తన మూలరంగమైన తాపవిద్యుదుత్పాదనేగాక జలవిద్యుత్తు, సాంప్రదాయేతర ఇంధనవనరులు, అణువిద్యుత్తుదిశగా అడుగులేస్తుంది. ఈసమయంలో డిసెంబరు 24,2009 సాయంత్రం మూడున్నరకు కేంద్ర సమాచార ప్రసార శాఖమంత్రి అంబికాసోని చేసిన ప్రకటనతో అంతా ఒక్కసారిగా పండగవాతావరణం. నవరత్న నుంచి మహారత్నగా(just like GOOD to GREAT) ఆవిర్భవించింది.
కేంద్ర భారీపరిశ్రమలశాఖ నూరురోజుల ప్రగతిపత్రంలో భాగంగా మొదటిదశలో ఎన్.టీ.పీ.సీతో బాటుగా ఓ.ఎన్.జీ.సీ, సెయిల్ లకు మహారత్నహోదా లభించింది. ఆర్థికాంశాలను విశ్లేషించే మూడుఅంశాలలో పనితీరునిబట్టి మహారత్నహోదాను ఇస్తారు. మొదటిదశలో మూడింటికే లభించినా సమీపభవిష్యత్తులో కోల్‌ఇండియా, ఐఓసీఎల్‌ వంటి ఇతరసంస్థలకు లభించే అవకాశం ఉంది.

ఈహోదా లభించిన సంస్థలకు రూ.5000 వరకు పెట్టుబడి పెట్టేందుకు ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాల్సిన అవసరంలేదు. ఈహోదాతో అంతరంగిక విషయాలలో స్వయంప్రతిపత్తి, పారిశ్రామికరంగంలో ప్రతిష్టను పొందింది. నవరత్నహోదా పొందిన సంస్థలు దేశంలోనీతరసంస్థలతో పోటీపడాలి. దేశీయవిపణిలో ముందున్నసంస్థలు అంతర్జాతీయవేదికపై పోటీపడాలన్నది మహారత్న ముఖ్య ఉద్దేశ్యం.


మూడుదశాబ్దాల క్రితం కనీసంరోడ్డుకూడాలేని నిర్మానుష్యప్రాంతంలో పడ్డ పునాదినుంచి ఎన్నోసమస్యలు. మొదట మానవవనరులు, తర్వాత ఆర్థికసమస్యలు, ఆపై సాంకేతిక సమస్యలు. పెద్దప్రాజెక్టులను నిర్మించేందుకు ఆపై ఉత్పత్తిని చేపట్టేందుదుకు సరిపడే సిబ్బందిలేమి నుంచి మానవవనరులను విదేశీసంస్థలకు అవుట్‌సోర్స్ చేసేస్థాయికి, వారిప్రాజెక్టులను పర్యవేక్షించి సాంకేతికసేవలను అందించే స్థాయికి ఎదిగింది. నిర్మాణానికి కావాల్సిన బడ్జెట్టు ఆపై బొగ్గుకొనుగోలుకు ధనంలేక సతమతమయ్యే స్థితి నుంచి లక్షకోట్ల నికరవిలువదాకా సాగింది. ఉత్పత్తిలో కీలకమైన టర్బైన్, బాయిలర్లేకాదు సహాయక యంత్రాలను సైతం దిగుమతి చేసుకునే పరిస్థితి.

సమాంతరంగా బీహెచ్‌ఈఎల్‌ సాంకేంతికంగా ఎదగడమేగాక సోదరుడిలా ఇచ్చిన స్నేహహస్తం. ప్రాజెక్టులకు కావలసిన టర్బైన్లు హరిద్వార్ ప్లాంటులో, బాయిలర్ తిరుచ్చిరాపల్లిలో, హీటర్లు హైదరాబాదులో, ఇతరయంత్రాలు మిగతాప్లాంటుల్లో లేదా జీ.ఈ., ఏబీబీ వంటి బహుళజాతి సంస్థలనుంచి కొనుగోలు. ఈరోజు ఏదైనా యంత్రాన్ని లేదావిడిభాగాన్ని సంపాదించాలంటే చాలాసులభం. కావలసిందల్లా జేబులోడబ్బే. కానీ ఆర్డరు ఇచ్చిన ఆరునెలలకి కూడా రానిరోజుల్లో మొదటితరం ఎదుర్కున్న సమస్యలు అన్నీఇన్నీ కావు. కనీసం కుటుంబానికి సదుపాయాలు దొరకని ప్రాంతాల్లో పని. ఒకఫోనుకాల్ కోసం వారాలతరబడి నిరీక్షణ. టెంట్లల్లోనే నివాసం.

ఇన్నిసమస్యల్ని దాటుకుని ఒకప్లాంటు కడితే ఆతర్వాత బొగ్గుకొనుగోలు, సరఫరానుంచి విదుదుత్పత్తి వరకు ఎదురయ్యే ఇబ్బందులు ఒక్కొక్కదాన్ని అర్థంచేసుకుంటూ పరిష్కరించుకుంటూ ముందుకువెళ్తే బాకీలవసూళ్ళు ఇంకోసమస్య. ఇవివసూలుకానిదే కొత్తప్లాంటు సంగతి దేవుడెరుగు ఉన్నప్లాంటును నడపలేని స్థితి. సంవత్సరాల తరబడి బిల్లులు చెల్లించని రాష్ట్రప్రభుత్వాలు. నిమ్మకు నీరెత్తిన అధికారగణం.

నిర్మించిన ఏప్రాజెక్టులోనూ స్థానికులకు అన్యాయంచెయ్యలేదు. పునరావాస చర్యలకై తయారుచేసిన ఆర్&అర్ (రిసెటిల్మెంట్ &రిహాబిలిటేషన్) విథానాలను కేవలం కాగితాలకే పరిమితంకాలేదు. ప్రతిప్రాజెక్టులోనూ తు.చ.తప్పక పాటించారు. అనేకసందర్భాల్లో కేంద్రప్రభుత్వ అధికారుల నోటివెంట వచ్చినమాట "ఎన్.టీ.పీ.సీ ఆర్&ఆర్ పాలసీ ప్రభుత్వపాలసీలకన్నా మెరుగైంది." ఆసంస్థవస్తే మాబతుకులేమవుతాయో అన్న భయం ఏనాడూ ప్రజల్లో కలగలేదు. అందుకు ఉదాహరణ మనరాష్ట్రంలో నెలకొల్పిన రామగుండం మరియు సింహాద్రి. వ్యాపారలక్ష్యాలకోసం విలువలను ఏరోజూ పక్కన పెట్టిందిలేదు.


ఉత్పాదకసామర్థ్యం మొత్తం దేశసామర్థ్యంలో ఐదోవంతైనా ఉత్పత్తిలో నాలుగోవంతు ఎన్.టీ.పీ.సీ నుంచే వస్తుంది. దేశంలో ప్రతినాలుగు ఇళ్ళలో ఒక‌ఇంటిలో దీపం ఈసంస్థ ఇచ్చిన విద్యుత్తుతోనే వెలుగుతుంది.


ఆర్థికసంస్కరణలు- ఈపదం మనదేశంలో వినబడడం మొదలయినప్పటినుంచి దానిప్రభావానికి లోనుకాని రంగమంటూలేదు. బయట మార్కెట్టులో వస్తున్న మార్పులకనుగుణంగా తన పంథానుమార్చుకోనిదే ముందుకెళ్ళలేని పరిస్థితి. స్టాక్‌మార్కెట్లో పేరునమోదు, ఆర్థిక అంశాలు, ఉద్యోగుల పనితీరు, అధికార నిర్మాణం వంటి అంతరంగిక అంశాలలో మార్పులు చేసుకుని నవరత్నహోదాను పొందింది. అదేసమయంలో రాష్ట్రప్రభుత్వాల విద్యుత్తుశాఖలలో వచ్చినమార్పులవల్ల బిల్లుచెల్లింపుల సమస్యలు చక్కబడ్డాయి. ఆపై జలవిద్యుత్తులోకి ప్రవేశించింది. ఇప్పటికి మూడుప్రాంతాల్లో సుమారు 2000MW ఉత్పత్తికోసం నిర్మిస్తున్నారు.
ఈరోజు 15 బొగ్గు ఆథారిత, 7గాస్ ఆథారిత ప్లాంట్లు, అనేకప్రాంతాల్లో రాష్ట్రప్రభుత్వాలతోనూ, ఇతరసంస్థలతోనూ సంయుక్తంగా నిర్వహిస్తున్న ముప్పై పైగా ఉత్పత్తిగృహాలతో 30000MW పైగా విద్యుదుత్పత్తి చెయ్యడమేగాక మరో 18000MW పైగా ఉత్పత్తిసామర్థ్యంగల ప్లాంట్లు ఉత్పత్తిదశలో ఉన్నాయి. బీహెచ్‌ఈఎల్, కేంద్ర‌అణుశక్తిసంస్థలవంటి వాటిటొ కుదుర్చుకున్న ఒప్పందాలు, నెలకొల్పుకుంటున్న భాగస్వామ్యాలు భవిష్యత్తులో మరింతప్రగతిని సాధించేందుకు దోహదపడుతాయి.ఒకతరంపూర్తిగా తామునడిచిన బాటలోని ముళ్లను శుబ్రంచేసిపెట్టి మేము వచ్చేసరికే జీతభత్యాల ఫలాల్నేగాక ఉద్యోగభద్రత అనే నీడని ఏర్పరచారు. ఇప్పుడు ఇచ్చినహోదా మాలాంటి కిందిస్థాయి అధికారులకి, బయటివాళ్ళకి హోదాగానే కనిపిస్తుంది. కానీ పైస్థాయి అధికారులకి అదితెచ్చిపెట్టే బాద్యత, దానితాలూకు ఒత్తిడి అనుభవించేవారికే తెలిసేది. ఇప్పటిదాకా ఏకచత్రాధిపత్యాన్ని అనుభవిస్తున్నా ఇకపై రిలయన్స్.లాంకో, టాటాలతో పోటీమరింత పెరిగే అవకాశం ఉంది. పోటీ ఆరోగ్యకరంగా ఉండి, ఆట నియమాలను పాటిస్తూ ఆడేవాళ్ళైతే ఇబ్బందిలేదు.
మహారత్నతో తెరుచుకున్న ద్వారాలు కళ్ళకు భవిష్య ఆశాకిరణాల్ని చూపిస్తున్నాయి. ఇకపై అంతర్జాతీయవేదికపై భారతకీర్తిపతాకను ఎగరవెయ్యాల్సిన బృహత్తరబాద్యత భుజస్కందాలపై ఉంచుకుని, ప్రభుత్వరంగసంస్థగా పాటించాల్సిన నియమాలు, కాపాడుకోవాల్సిన కీర్తిప్రతిష్టలను గుర్తెరిగి ముందుకెళ్ళాలి.

13 comments:

 1. మీ సంస్థ కు "మహారత్న" లభించిన సందర్భంగా అభినందనలు. అలానె ఇలాంటి ఇంఫొ తెలియదు.

  ReplyDelete
 2. ____________________
  1400MWకు అనుమతి జూలై 1879లో లభించింది.
  ____________________
  Above is typo. You need to change it.

  Congratulations!!

  My personal opinion is that This could have been divided into two posts. Post is informative, yet it is bit lengthy.

  ReplyDelete
 3. subham

  jaati ki meelaamti samstahle bhavishayttu

  ReplyDelete
 4. అభినందనలోయీ సుబ్బులూ

  ReplyDelete
 5. అభినందనలు + అభినందనలు.
  మొదటిది మీ సంస్థకు...రెండవది టపాకు. ఎందుకంటే విషయ పరిజ్ఞానం ఉంటే సరికాదు, దాన్ని సమంగా ఇతరులకు అర్ధమయ్యేలా తెలుపగలగటం కూడా అభినందనీయమే.

  ReplyDelete
 6. @సునీత: ధన్యవాదాలు
  @గణేష్: మార్చానబ్బా. తెగ్గొట్టాలనే అనుకున్నా, కుదిరితేగా. నువ్వుచెప్పాక మొత్తం ఓతూరి చీశా కానీ కుదర్లా. ఫ్లో దెబ్బతింటుంది. అండుకే అలాగే పెడుతున్నా.
  @దుర్గేశ్వర: ధన్యవాదాలు
  @శ్రావ్య: ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకింటినమ్మా వ్యాఖ్యను. :)
  @ భాస్కరన్న: థాంక్సో
  @ తృష్ణక్క: ధన్యవాదాలు + ధన్యవాదాలు. ఒకటి నాతరపున ఇంకోటి మాసంస్థ తరపున.

  ReplyDelete
 7. అభినందనలు చైతన్య గారు. మీకు నా హ్రుదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు.

  ReplyDelete
 8. సుబ్రహ్మణ్య చైతన్య గారూ !
  May your New Year ( 2010 ) be full of Happiness and Sunshine

  SRRao
  sirakadambam

  ReplyDelete
 9. అభినందనలు...
  నూతన సంవత్సర శుభాకాంక్షలు.

  ReplyDelete
 10. @ SRRao, జయ, శ్రీనిక: ధన్యవాదములు

  ReplyDelete
 11. Just now, I saw your new template. Change the font color of your profile. In your profile, reading letters on black background is pain for eyes.

  ReplyDelete
 12. The new Picasa photos are good. Upload the photos during your south trip.

  ReplyDelete