రిహాంద్

గతంలో నేను సోన్‌నది గురించిరాశాను. రిహాంద్ అనే చిన్ననది, సోన్‌నదికి ఉపనది, గురించి రాద్దాం అనుకున్నా. మొదలుపెట్టాక ముందు సోన్ గురించి చెప్తేకదా ఇది తెలిసేది అని విషయాన్ని అటుపక్కకు తిప్పాను.

ఇక రిహాంద్ విషయానికి వస్తే అది చత్తీస్‌ఘడ్‌లోని సర్గుజా అనేప్రాంతంలో పుడుతుంది. వింధ్యపర్వతసానువుల్లోని మణిపాల్ పీఠభూమి దగ్గర సముద్రమట్టానికి సుమారు 1100మీటర్ల ఎత్తున దీనిజన్మస్థానం ఉంది. అక్కడి నుంచి ఉత్తరదిశగా సోనభద్రజిల్లాగుండా ఉత్తరప్రదేశ్‌లో ప్రవేశించి, చోపన్‌దగ్గర సోన్‌నదిలో కలుస్తుంది. సోన్‌నదిరంగు ఆప్రాంతపు మట్టిరంగులో కలిసిపోయి ఉంటుంది. అందువల్ల ఉపగ్రహచిత్రాలద్వారా దానిమార్గాన్ని గుర్తించడం కష్టం. రిహాంద్‌ నీలిరంగులో, కృష్ణవేణికి డూప్ అన్నమాట, ఉండటంతో ముందుదీన్ని గుర్తించి, ఆతోకతో సోన్‌దగ్గరకి చేరుతారు. దీనికి మహన్, మోర్ని, గగర్, గల్ఫుల్లా మొదలైన పిల్లనదులు ఉన్నాయి.

కేవలం 160కిమీ ప్రవహించి మరోనదిలోకలిసిపోయేనది రిహాంద్. ఇలాంటి నదులు మనదేశంలో కోకొల్లలు. అయినా దానికంటూ ఒకగుర్తింపు దక్కింది అంటే దానివెనుక ఒకమహనీయుని కృషి ఉంది. ఆమహనీయుడు ఎవరంటె అభినవ విశ్వకర్మ, ఆధునికభారత నిర్మాతల్లో ముందువరుసలో నిలబడే ఇంజనీరు మోక్షగుండం విశ్వేశ్వరయ్య.


అతితక్కువ దూరంలోనే అంటే కొన్నిపదుల కిలోమీటర్లలోనే ఈనది సుమారు 750మీటర్లు కిందకి దూకుతుంది. ప్రవాహమార్గం పూర్తిగా కొండల్లోని ఇరుకైన సందుల్లో, ఋతుపవనాల సమయంలో పెద్దపెద్దబండలను సైతం దొర్లించేవేగంతో గమనం ఈనదికి వరం. ఒక జలవిద్యుత్తుప్రాజెక్టు రూపుదిద్దుకునేందుకు దోహదపడింది. సోన్‌నదిలో కలిసేచొటుకి 45కిమీ ముందు పీపరి-రేణుకూట్ అనే గ్రామాలదగ్గర రిహాంద్ బహుళార్థసాథక ప్రాజెక్టు 1966లో రూపుదిద్దుకుంది.934మీ పొడవు, 91మీ ఎత్తు ఉన్న ఈకాంక్రీటుడ్యాం గురుత్వసిద్థాంతాన్ని ఉపయోగించి రూపొందించారు.


నీటిని నిలువ ఉంచడంద్వారా కలిగే ఒత్తిడి డాంవెనుక భాగంపై పడుతుంది. దానివల్ల డాం ముందుకుజరగడమో, లేక దొర్లిపడిపోవడమో జరుగుతుంది. ఈబలాన్ని ఎదుర్కునేందుకు డాంలో వాడి పదర్థపుభారం ఉపయోగపడుతుంది. ఈసూత్రంద్వారా నిర్మించే డాంలను గ్రావిటీడాం అంటారు. నాగార్జునసాగర్‌డాం కట్టేసమయంలో మొదటసిమెంటుకాంక్రీటును ఉపయోగించాలి అనుకున్నారు. అయితే స్థానికంగా లభించే నల్లరాయిని పరీక్షించగా అది నిర్మాణానికి ఉపయోగించవచ్చు అని ధృవీకరించారు. ఆతరువాత డిజైన్‌లలో చేసిన మార్పుల కారణంగా చాలాఖర్చు తగ్గిందట.


ఈడాంకట్టండం ద్వారా ఏర్పడిన జలాశయానికి ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు గోవింద్‌వల్లభ్‌పంత్ పేరిట జీబీపంత్ జలాశయం అని పేరుపెట్టారు. 10625 మిలియన్ల ఘనపుమీటర్ల సామర్థ్యంగల ఈజలాశయంలోకి 13344చదరపు కిమీ ప్రాంతంలో పడ్డ వర్షపునీరు చేరుతుంది. 466చదరపు కిమీ వైశాల్యంలో విస్తరించి ఉన్న ఈజలాశయం మనదేశంలోని మానవనిర్మితజలాశయాల్లో అతిపెద్దది. అంతర్జాతీయ సాంకేతికప్రమాణాలు అందుకోగల అతికొద్ది భారతీయ కంపెనీల్లో ఒకటి అయిన హిందుస్థాన్ కన్‌స్ట్రక్షన్ కంపెనీ ఈనిర్మాణాన్ని అతితక్కువ వ్యవథిలో పూర్తిచేసింది. ఇటీవల ముంబాయిలోని బాంద్రా లింక్‌బ్రిడ్జిని కట్టిందికూడా వీళ్లే.
ఒక్కొక్కటి 50మెగావాట్ల సామర్థ్యంగల ఆరుయూనిట్ల ద్వారా 300మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి జరుగుతోంది. దీనివల్ల ఈప్రాంతంలో అనేక పరిశ్రమలు స్థాపించారు. ప్రత్యక్షంగా రెండులక్షల హెక్టార్లకు, పరోక్షంగా ఐదులక్షల హెక్తార్లకు సాగునీరు లభిస్తుంది. ఈనిర్మాణంద్వారా వరదనియంత్రణ వ్యవస్థ అభివృద్ధి చెయ్యగలిగారు. ఈప్రాంతంలో బొగ్గుగనులు విస్తారంగా ఉండటంతో థర్మల్‌విద్యుత్తుప్లాంటులు జలాశయంనీటిని ఉపయోగించుకుని తమ ఉత్పత్తిని కొనసాగిస్తున్నాయి. ఈఒక్కప్రాంతంలోనే దాదాపు 15000మెగావాట్ల విద్యుదుత్పత్తి జరుగుతోంది. ఈజలాశయం ఒడ్డునే ఎన్‌టీపీసీ తనమొదటిప్లాంటును 1977లో మొదలుపెట్టింది. ఇప్పుడు జలాశయానికి మూడు వైపులా మూడుప్లాంటులలో ఉత్పత్తిని కొనసాగిస్తుంది. రిహాంద్‌నది సోన్‌లో కలిసేముందు మరొకచిన్న ఆనకట్ట ఓబ్రావద్ద ఉంది.
పాత వందరూపాయలనోటుపైన ఒక ప్రాజెక్టుబొమ్మ ఉండేది గుర్తుందా? చాలాకాలం అది నాగార్జునసాగర్ అనుకొనేవాడిని. ఈమద్యనే తెలిసింది అది రిహాంద్‌ప్రాజెక్టుది అని.

2 comments: