ఈ ప్రపంచంలో తల్లి తండ్రీ లేనివాడు మనకు ఎలాగైతే దొరకడో( వాళ్లెవరో తెలియనివాళ్లుంటారు గానీ లేనివారు ఉండరు.) గురువులేని వాడు దొరకడు. తల్లిదండ్రులు ఎవరికైనా మానవరూపాల్లోనే కనిపిస్తారు. కానీ గురువు మాత్రం అందరికీ ఆరూపంలే ఉండాలి అనిలేదు. ఎక్కువ మందికి లభించేది ఆరూపంలోనే అయినా కొందరికి ఈప్రకృతే గురువు. మరికొందరికి వాళ్ల అనుభవాలే గురువై పాఠాలు నేర్పితే ఇంకొందరికి స్వప్నదర్శనాలు. అతను త్రిగుణాత్మకుడు. సర్వధర్మాలకు, సర్వదేవతలకు, సర్వతీర్ధాలకు మూలం గురుపాదంగా భావించే భారత సంస్కృతి ఆయన గొప్పతనాన్ని ఎంతోఉన్నతంగా నిర్వచించింది.
మనిషి పుట్టిన తరువాత కొంతకాలానికి తల్లిదండ్రులను వదిలి విద్యకోసం ఆపై భుక్తికోసం దూరంగా ఉంటాడు. పెళ్లయి గృహస్థు, అటుపై వానప్రస్థం. లేదా అన్నీ త్యజించి సన్యాసిగా మారవచ్చు. మనిషిదేనినైనా త్యజించవచ్చుగానీ గురుపాదాన్ని మాత్రం కడవరకు స్మరించాలి. అంటే మనజీవితంలో మిగిలిన బంధాలన్నీ తాత్కాలికం. ఒక్క గురుపథం తప్ప.
గురువు నిర్వచనానికి విగ్రహరూపంగా, ఆస్థానానికి అలంకారంగా నిలిచినవాళ్లు మన పురాణాల్లోను, చరిత్రలోను ఎందరో మహానుభావులు. అలానే గురువు సూచించిన మార్గాన్ని పాటించి పునీతులైన మహనీయులు కోకొల్లలు. గురుశిష్యపరంపరకు ఆది మహదేవుడు. ఆయన ద్వారా విష్ణువు, బ్రహ్మ, శక్తి, పరాశరుడు, వ్యాసుడు అలానే శంకరభగవత్పాదులు మొదలైన వారు. వీరిద్వారా వ్యవస్థీకృతమైన గురుశిష్య పరంపర అత్యున్నతం, గంగాజలం, హిమశిఖరం, మహాసముద్రం. మనజాతికి జీవకొమ్మ.
ఆధునిక భారతంలో వారికి ప్రతిరూపంగా నిలిచిన వారిలో అగ్రగణ్యుడు రాధాకృష్ణన్. ఒక ఉపాధ్యాయుడు ప్రధమపౌరునిగా ఎదిగిన పరిణామం ప్రతివ్యక్తికి స్పూర్తిమంతం. విలువలతో కూడిన జీవితం, తర్కంతోనిండిన ఆలోచనలు, దూరదృష్టితో తీసుకొనే నిర్ణయాలు భావితరాలకు ఆయనను ఒక స్పూర్తిప్రదాతను చేశాయి. దేశంలోని ప్రతి ఉపాధ్యాయుడు తనవృత్తిని (బతకలేని బడిపంతులు అని హేళనచేసినా సరే) గర్వంగా చెప్పుకునేలా చేశాయి.
ఆర్ధశాస్త్రంలో పట్టాపుచ్చుకుందామన్న కోరిక. కావలసిన పుస్తకాలు కొనలేనిపేదరికం. విధి తత్వశాస్త్రంవైపు నడిపింది. దూరపు బందువు దగ్గర ఉన్న ఆపుస్తకాలే చదవాల్సి వచ్చింది. తరువాత కొంతకాలం బందరులో, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పనిచేసి తత్వవేత్తలకు పుట్టినిల్లైన బెంగాలుకి వెళ్ళారు. కలకత్తాలో ఉత్తరాది అహంభావుల మద్య తన విజ్ఞానాన్నే పెట్టుబడిగా తన సామర్ధ్యాన్ని నిరూపించుకున్నారు.
"మీవంటి మేధావి ఇక్కడకాక మాదేశంలో కనుక చదివి ఉంటే.." అన్న ఒక దొరగారికి "నిజమైన భారతీయుడు అక్కడికి విద్యను దానం చేయడానికి వస్తాడేగానీ బిచ్చమెత్తుకునేందుకు కాదు." అని చెప్పిన ఆయన తరువాతి కాలంలో ఆక్సుఫర్డుకి బోధకునిగా వెళ్లి తనమాటని నిలబెట్టుకున్నాడు. మదనమోహనమళవ్యా తన మానసపుత్రిక అయిన బెనారస్ హిందూవిశ్వవిద్యాలయానికి రూపమిచ్చేందుకు సహాయం కోరడంతో వయోభారాన్ని లెక్కచేయకుండా కలకత్తా విశ్వవిద్యాలయంలో పనిచేస్తూనే వారాంతాల్లో కాశీకి వెళ్ళి అక్కడి బాద్యతలను నెరవేర్చాడు.
స్వాతంత్ర్యానంతరం ఇక్కడి వ్యవస్థలను పునరుద్ధరించడానికి, ముఖ్యంగా విద్యావ్యవస్థ, ఆయన చేసినకృషి మరువలేనిది. ఆయన సూచనలను చాలాభాగం అమలుచేసినప్పటికీ కొన్నింటిని కేవలం రాజకీయ ప్రయోజనాలకోసం పక్కనబెట్టారు. అందులో ముఖ్యమైనది వేదగణితం. దానిలోని అంశాలను పాఠ్యాంశాలుగా పెట్టండి. లేని పక్షంలో ఆవిజ్ఞానం మరుగున పడిపోతుంది. తద్వారా జరిగేనష్టం కేవలం హిందువులకో, భారతీయులకో కాదు సమస్త మానవాళికి. అంటూ ఆయన చేసిన సూచన అరణ్యరోదన అయింది. ఇప్పుడు కొన్ని దశాబ్దాల తరువాత ఈతరానికి దాని మూలాలు లేకుండా పోయాయి. అయినా ఎవరికీ ఆనష్టం పట్టదు.
గురుశిష్యసంబంధాలను మెరుగుపరిచే గురుకుల వ్యవస్థను పునరిద్ధరించండి అన్నారు. అప్పటి ఆర్ధికస్థితి ప్రభుత్వానికి అనుకూలించలేదు. తరువాత కొంతకాలానికి మొదలుపెట్టినా ఆరంభశూరత్వమే అయింది. మతప్రాదికనదేశ విభజనను వ్యతిరేకించిన మేధావులను ఏకంచేసి ఆయన కొనసాగించిన ప్రయత్నాలు దురదృష్టవశాత్తూ సఫలంకాలేదు.
తన తల్లిదండ్రులనుంచి నేర్చుకొని జీవితాంతం ఆచరించిన భారతీయజీవన విధానం ప్రతి వ్యక్తికీ శిరోధార్యం. ఆయన జీవితంలో అనేకప్రాంతాలవారిని, మతధర్మాలను అనుసరించేవారిని, అనేక జాతీయులను కలిశారు. ఎక్కడా తనాచరించే ధర్మంలో ఎదుటివారు వేలుపెట్టి చూపలేని విధంగా జీవించారు. తత్వశాస్త్రంలో ఆయన రచించిన గ్రంధాలు మణిపూసలు. ప్రాశ్చాత్య ప్రపంచాన్ని భారతావనివైపు చూచేలాచేశాయి. భారతీయ తత్వశాస్త్రం ఆయన రచించిన గ్రంధాలలో ఉన్నతమైనది. భారతీయ సంస్కృతికి, అందులోని ఔన్నత్యానికి నిజమైన ప్రతినిధి భారతరత్న సర్వేపల్లి రాధాకృష్ణన్.
very well written chainya...abhinamdanalu.
ReplyDeleteఅమోఘం....భలే రాసారు!
ReplyDeletevery well written!!!
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteరాజకీయాలూ, కుటుంబ బాంధవ్యాలూ వలే గురు-శిష్య ప్రామాణికాలు కూడా దిగజారిపోతున్నాయి. విద్యార్ధులకు ఆదర్శంగా నిలచే గురువులే కరువయిపోతున్నారీ రోజుల్లో...
ReplyDeleteఅందరికీ ధన్యవాదాలు
ReplyDeleteమనకి అన్నీ ఉన్నాయి, అంగట్లో శని ఉంది.
ReplyDeleteమనకి అన్నీ తెలుసు, కానీ అన్నీ మర్చిపోతాం.
మనకి చరిత్ర ఉంది, కానీ కాలితో సిగరెట్టు బట్ లా నులిపేస్తాం.
బాగారాసావ్ బ్రదరూ