విన్నానుకమ్మగా

అబ్బబ్బబ్బబ్బా ..పండగంటే ఇదీ. అసలే పాడుతాతీయగా. మిగిలింది చివరి ఆరేడుగురు. అంటే పోటీదారుల్లో 'క్రీమ్'. ఏపాటపాడినా శ్రవణానందమే. ఇక 'మణి‌' (బాలుని ఇంట్లో అలానే పిలుస్తారట.) వ్యాఖ్యానం చెప్పనక్కర్లేదు. ఇవన్నీ ఒకెత్తు ఐతే ఈవారం న్యాయనిర్ణేతలు. బాపు-రమణ. పచ్చటి గున్నమావిచెట్టుకొమ్మలపై కోతికొమ్మచ్చి ఆడుతుంటే, వాళ్ళతోకల్ని పట్టుకుని ఊగుతూ పరవశించాం. ఈమద్యనే చెట్టుదిగారు. ఇంతలో ఇలా కళ్లముందు.

పాడుతాతీయగా రెండోధారావాహికం గురించి కొన్నిచేదునిజాలు చెప్పాలి. దశాబ్దమున్నర క్రితం మొదలైన పాడుతాతీయగాతో పోలిస్తే కొంచెంసందడి తక్కువగానే ఉంది. న్యాయనిర్ణేతలుగా మహదేవన్, పుహళేంది, బాలమురళికృష్ణ... ఇప్పటికిప్పుడు గుర్తురాని పేర్లెన్నో. అలాంటిది ఈమద్యన వస్తున్న 'అ'న్యాయనిర్ణేతల్ని చూస్తే కోపంనషాళానికి అంటేది. పరుచూరిగాళ్ళ 'అన్నగారిభజన' చూస్తుంటే టీవీబద్దలు కొట్టాలనిపించేది. తెలుగుసినిమా ఆత్మను చంపేసి అంపశయ్యపై పండబెట్టినోళ్ళు వాళ్ళ అనుభవాల్నినిస్సిగ్గుగా వర్ణిస్తుంటె, నిర్వేదంతో భరించడం మనవంతైంది. ఇలాంటోళ్లని కూర్చోపెట్టెబదులు ఈబాలసుబ్రహ్మణ్యమే మార్కులెయ్యొచ్చుగా అనుకునెవాణ్ణి. నామాట విన్నడేమో ఆర్పీగాడొచ్చినప్పుడు ఆయనే మార్కులేసుకున్నాడు. రెండువారాలు క్రిష్ వచ్చాడుట. చూళ్ళేకపోయా. ఇంతలో అనుకోని ఈవరం. బాధవెనుక సుఖము సమకూరుధరలోన అని శతకకారుడు ఊరకే అనలేదుమరి.

ఈమద్య అమ్మ నాదగ్గరికి వస్తూ కోతి-(ఇం)కోతి కొమ్మచ్చులను తీసుకొచ్చింది. స్వాతిలో మొదలయినప్పుడు తిరుచిరాపల్లిలో ఉన్నాను. అక్కడ సెంట్రల్ బస్‌స్టేషన్ దగ్గర దొరికేది. అక్కడికెళ్ళి తీసుకొచ్చి అది చదివి అరవోళ్ళకిస్తే మిగతాపేజీల్లోని బొమ్మల్ని చూసుకుంటూ హాయిగా నిద్రపోయేవాళ్ళు. ఆతర్వాత వయా నోయిడా శక్తినగర్‌కొచ్చి పడేసరికే అన్నివారాలు కవర్ చెయ్యలేకపోయా. ఆకొరత హాసం పబ్లికేషన్స్ పుణ్యమాని తీరింది. నెల్లూరు రెడ్డిగారు, మాఊరిరెడ్డిగారికి వియ్యంకుడు 'శాంతాబయోటిక్స్' వరప్రసాదరెడ్డికి వందనాలు. చెట్టుదిగి రెండురోజులుకూడా కాలేదు, అన్నీమనసులో పచ్చిగా పచ్చగా ఉన్నాయి.

ఇక ఈవారం విశేషాలకొస్తే రాధాకళ్యాణం సినిమా పాటతో మొదలుపెట్టారు.
మొదటిపాట "శ్రీరస్తు శుభమస్తు" పాడింది అమ్మఫేవరెట్ గీత. ఎలాంటి ఎక్స్‌ప్రెషన్స్ లేకుండా పాడటం చూస్తే జానకి గుర్తొస్తుందట అమ్మకి.
తర్వాత "రాయినైనా కాకపోతిని" గోరంతదీపం-కొండంతభావం. పాడింది నాఫేవరెట్ సబీహ. నర్తనశాలలో "జననీ శివకామిని" పాడినప్పుడు మొదటిసారి విన్నాను. తర్వాత "అల్లాయే దిగివచ్చి.. నవ్వెరా నాకింక రంజాను పండుగ" పాడినప్పటి నుంచి నామార్కులన్నీ కడప బూబమ్మకే.
లిప్సిక "అలా మండిపడకే జాబిలీ.." ఇప్పటిదాకా వినలేదు ఈపాట. ఈఅమ్మాయిని చూస్తే "ఆంధ్రా శ్రియాగోషల్" అనిపిస్తుంది. రాజన్‌గారొచ్చిన వారం రాజన్-నాగేంద్ర కాంబినేషన్ పాటలు పాడాలి అన్నారు. నామనసులో ఓపాట ఉంది.ఎవరుపాడతారో గానీ లాల్ సలామ్ చెప్పాలనుకున్నా. 'లాల్ సలామ్' వినిపించిందేమో ఈఖమ్మం అమ్మాయికి వెంటనే "మానసవీణా మధుగీతం.." అందుకుంది. ఈపాట ఒకకాంపిటీషన్లో పాడాలంటే ధమ్ముండాలి. ఆర్టిఫిషియల్ ఎఫెక్ట్స్ అన్నీ ఆలవోకగా పాడెయటం చూస్తే గొంతులో ఎన్నితంత్రులున్నాయా అనిపిస్తుంది. షకలకబేబిపాటని కేకకెవ్వు పెటించింది.
కార్తీక్ గాడి దోస్తీ పాట సంగీతం బాపు-రమణ పద్దతిలో లేకపోయినా (చిరుకి ఎలాఉండాలో నర్సాపురం డైరెక్టరుకి తెలుసుగా.) భావంమాత్రం వాళ్లదోస్తీలానే ఉంది. ఈమతిమరుపు మంగబాబు అలవాటు ప్రకారం మళ్ళీ రెండొచరణాన్ని చెగోడీల్లా నమిలేశాడు.
తర్వాత అనంతపురం రాజేష్ "నీవుంటే వేరేకనులెందుకు" మొదలెట్టాడు. వీడుపాడాడంటే నాకు ఒకయాంగిల్లో ఎస్పీబీ ఇంకోయాంగిల్లో పీఎస్పీబీ(కన్నడంకూడా వచ్చట) కనిపిస్తారు. ప్రైజుసంగతి పక్కనపెడితే ప్రొఫెషనల్గా ఎదిగే లక్షణాలు పుష్కలం. దేవుడిచ్చిన గొంతు ఒకవరం.
ఇక గుంటూరమ్మాయి మల్లిక రాంబటుచేత మళ్ళీకోతికొమ్మచ్చి. విన్నంతలోనే కట్టిపడేసే ప్రత్యేకలక్షణాలేవీ లేకపోయినా పెర్ఫార్మెన్స్‌లో కన్సిస్టెన్సీ బావుంటుంది. చూస్తున్నంత సేపు మాలీపిది గుర్తొస్తుంది.
ఇక మౌనిమ (జగదాంబ) సంపూర్ణరామాయణంలో శబరిపాట. ఆగొంతులో ఉండాల్సిన వ..ణ్‌ణు..కు లేదనిపించింది. ఈపిల్ల మిగతావాళ్లకంటే కొంచెంతేడా. చూపులోనే పెళుసుమోత్తనం కనిపిస్తుంది. కాంపిటీషన్ ఎక్సామ్స్ బాగారాస్తుందనుకుంటా. పాటకన్నా నవ్వుబావుంటుంది. (ఇడ్లీకన్నా చట్నీబావుంటుంది.) ఫేస్‌గ్లామర్‌తో గుడ్‌విల్‌మార్క్స్ కొట్టేస్తుంది.
చివరగా శ్రీకాకుళం సాగర్ "శివశివశంకర.." మొదలెట్టాడు. ఈపాట వినగానే చిన్నప్పటి భజనే గుర్తొస్తుంది. "మారేడు నీవని ఏరేరితేనా మారేడు దళములు నీపూజకు" వాహ్! అంతే. పాటంటే ఇంతే. తనగొంతుతో పాడటం ఈఅబ్బాయిలో నాకు బాగానచ్చేది .
అలా అలా చూస్తున్నంతలోనే కోతికొమ్మచి పూర్తయ్యింది. మళ్ళీఇంకోవారంకూడా వీళ్ళేనన్న ఆనందంతో ఇంకోతికొమ్మచ్చి చూసేందుకు ఎదురుచూడాలి.
కోతికొమ్మచ్చి చదివేందుకు తీరికలేదని పవాసాంద్రులకోసం ఎంపీత్ర్రీలు వదిలారట. ప్రోగ్రాం మద్యలో తెలిసింది. దాన్ని చదువుతూ చేతిలో కాఫీగ్లాసునే పట్టుకోవడానికే సర్కస్‌ఫీట్లు చేశాను. ఇక డ్రైవింగ్‌చేస్తూ వింటే స్టీరింగ్‌కంట్రోల్ చెయ్యడం బ్రహ్మతరంకూడా కాదు.
ఇంకో ముఖ్యమైనవిషయం- ప్రకటనల సమయంలో ఒకకొత్తటీవీషో ప్రమో వచ్చింది. చూడగానే ఎందుకో ఎడమకన్ను కొట్టుకుంది. కొంపతీసి 'బాబు‌'దే అయితే మళ్ళీతెలుగుప్రేక్షకుడికి బాడ్‌టైం మొదలయ్యింది. మనబ్లాగర్లలో కొంతమంది అరివీరఫాన్లున్నారు. వాళ్ళు చూసి కూడలికొచ్చి విశేషాలు వివరిస్తారు. అప్పటిదాకా ఈటీవీ మాటీవీ కాదనుకోవడమే.

జ్వరం తగ్గింది

ఈమద్య నెలరోజులుగా డెంగూ, చికున్‌గున్యాలను మించిన జ్వరం ఒకటి ప్రపంచం మొత్తం వ్యాపించింది. మొదట్లో మనదేశంలో అంతప్రభావం చూపదనుకున్నా. ఇక్కడ మనోళ్లకి మరోజ్వరం ఉంది. కొత్తజ్వరం సీజన్ మొదలయినప్పుడొచ్చి అయిపోగానే తగ్గిపోతుంది. కానీ మనకున్న జ్వరం (అన్నట్టు ఈజ్వరం నాకూ ఉంది. స్కూల్లో ఉన్నప్పుడొచ్చింది. ఇన్నేళ్ళయినా తగ్గలా.) అంతతుగ్గా తగ్గదు.

నాఅంచనాలను తారుమారు చేస్తూ నెమ్మదిగా ఇక్కడా బలపడింది. రోగులకేసులు బానే నమోదయ్యాయని మీడీయాగణాంకాలూ చెప్పసాగాయి. ఈజ్వరాన్ని అదుపులోకి తెచ్చేపని వైద్యఆరోగ్యశాఖ చేతిలో ఉండకపోవడం మరోవిడ్డూరం. నాకు మొదట్నుంచీ ఇమ్యునిటీ ఎక్కువ. ఇంటర్ చదివేప్పుడు హాస్టల్లో అందరికీ కోడినక్క(చికెన్‌ఫాక్స్), చెన్నపట్నపుకన్ను(మెడ్రాస్‌ఐ) వచ్చినా నాజోలికి రాలేకపోయాయి. అందులో పాతజ్వరం కొంచెంబలంగా ఉంటే కొత్తజ్వరం పెద్దగా ఎఫక్టు ఇవ్వదుట.

నిన్నరాత్రి ఇస్పాను కప్పు ఎగరేసుకుపోవడంతో ఇకమనకు జ్వరంతగ్గొచ్చు. కానీ ఆదేశపోళ్లకి మరోరెండుమూడేళ్ళు తగ్గడం కష్టమే. ఫుట్‌బాల్ ఫీవర్ అనీ నెలరోజుల్నుంచి ప్రపంచంమీద పడి విచ్చలవిడిగా డాన్సేసింది. మామూలుగా కొత్తరోగమొస్తే డాక్టర్లకి, మందులషాపులోళ్లకి పండగ. కానీ ఈరోగంమాత్రం వ్యాపారవర్గాలకు, మీడియాకి పండగజేస్కోమంది. ఈరోగమొచ్చినోళ్ల ప్రవర్తన దాదాపూ నాబోటి క్రికెట్‌ పిచ్చోడిలానే ఉంటుంది. కాకపోతే చిన్నచిన్నతేడాలు. అన్నింటికన్నా ముఖ్యమైనది- “”నేను చిన్నప్పుట్నుంచి ఫుట్‌బాల్ మేచెస్ వాచ్ చేస్తుంటా. మానాన్న(లేదా తాత, బాబాయ్ వగైరా) చెప్పేవాడురా క్రికెట్ ఓసుత్తిగేమ్ అని.”” ఇలా ఉంటుంది వీళ్ళ యవ్వారం. లాటిన్‌కంట్రీస్, యూరోపియన్స్, అమెరికన్స్... అంటూ వీరసుత్తి ఓవైపు. అరగంటకోసారి ఆక్టోపస్ జ్యోస్యం నెట్లోవెతుక్కుంటూ మదనపడిపోతుంటారు. నోరుతెరిస్తే (మొన్నటిదాకా సచిన్, యువీ, సెహ్వాగ్ తప్ప ఇవేవీ తెలీనోడు.) మెస్సి, ముల్లర్ అంటూ మరోపక్క వాయింపు. ఒరేయ్!నీకు భైచుంగ్ భుటియా తెలుసా? అనడిగితే ఎవురూఊఊ? అనడుతారు.అదీ విషయం.

మొత్తానికీ ఈరోగాన్ని మనదేశంలో విజయవంతంగా వ్యాపింపచేసినందుకు మీడియావాళ్ల తెలివికి జోహార్లు. అబ్బయ్యల్లారా! మీకు ఆఆట నచ్చేస్తే చూసేస్కుని, మందేస్కుని చిందేస్కోండి. మద్యలో క్రికెట్ గురించెందుకు చెప్పు? నాకుమాత్రం నాక్రికెట్ గొప్ప. మేరాక్రికెట్ మహాన్. క్రికెట్ ఏదో నేలబారు ఆటయినట్టు అక్కడికేదో ఫుట్‌బాల్ మాత్రం పిచ్చక్లాస్ అయినట్టు విశ్లేషణలు చిరాకుపుట్టిస్తాయి.

ఎంతఇమ్యూనిటీ ఉన్నా ఇంతపెద్దజ్వరమ్ ఎఫెక్టు మినిమమ్ ఉంటుంది కదా. చిన్నచిన్న తుమ్ములు, దగ్గులు వచ్చాయి. మనోళ్లు ఎలానూ ఆడరుకాబట్టి ఎవరోఒకరికి మద్దతు ఇవ్వకపోతే థ్రిల్ ఉండదుగా. ఎవరెవరు ఆడతారో పట్టీచూశా. పాకిస్థానూ ఆడదట. మనసుకొంచెం స్థిమితపడింది. ఇంతలో ఐక్యరాజ్యసమితి, భారతదేశం విదేశాంగ విథానం వగైరాలు గుర్తొచ్చి రష్యాకే నామద్దతు అని ప్రకటించా. ఊహూ అదీ ఆడదు అన్నారు. ఏవిటీ రష్యా అంతదేశం, ఒలింపిక్సులో డజన్లకొద్దీ పతకాలని గెలిచేసే దేశమే ఆడదంటే మనం ఆడట్లేదని అంత'ఇది‌' కానవసరంలేదని నిశ్చయిమ్చుకున్నా.
మొన్న మూడోస్థానం కోసం జరిగిన మాచ్ చూద్దామని కూర్చున్నా.చుట్టూ వ్యాధిముదిరిన రోగులు. "కామెంట్రీ ఎవర్రా? బాయ్‌కాటా?గవాస్కరా?" ఇది నామొదటిప్రశ్న. "ఇందులో కామెంట్రీ ఉంటుందికానీ అంత ఇంపార్టెంట్ కాదు." అన్నాడొక రోగి. బూఊఊఊ మంటూ బూరలు. ఊదుతూనే ఉన్నారు. ఆగోలలో కామెంట్రీ వినిపిస్తేగా. అదేక్రికెట్తయితే కళ్ళుమూసుకుని కామెంట్రీవిన్నా మాచ్ అర్థమైపోతుంది.

ఇంతలో రెఫరీ ఝెండాచూపాడు. అది అటు పసుపూ ఇటు ఎరుపూకాకుండా రెండూకలిసి చెస్‌బోర్డులా ఉంది. అదేంట్రా? అని అడితే ఆఫ్‌సైడ్ అన్నాడు. "అదేంటి ఆఫ్సైడు, ఆన్సైడుకి సిగ్నల్సు? మాక్రికెట్లో ఇలాంటివేమీ ఉండవు. ఎటైనా కొట్టుకోవచ్చు." అన్నా. ఒకడి చొక్కామీద ఫ్రెడరిక్ అని ఉంది. వాడు జర్మనీవాడు. ఉరుగ్వేజట్టులో వాల్టేర్ అని ఇంకోడున్నాడు. ఆహా 'వోల్టేర్ అండ్ ఫ్రెడరిక్ దిగ్రేట్' ఇద్దరూ ఆడుతారా? అనడిగా. ఎవడో ముల్లర్ గాడుట గోల్ కొట్టాడు. అబ్బో మాక్స్‌ముల్లర్ కూడా ఫుట్‌బాల్ ఆడుతాడా? వాడిని ఫుట్‌బాల్ని కొట్టినట్టు కొట్టాలి అనుకుంటుంటే మావాడు "వాడీపేరు మాక్స్‌ముల్లర్‌కాదురా. థామస్‌ముల్లర్‌" అని చెప్పడంతో ఆలోచన విరమించా. ఇంతలో చిన్నడౌటొచ్చి వాడిపక్క తిరిగా. అప్పటికే నాతో విసిగిపోయాడు. మామూలుగా జ్వరమొచ్చినోడికి సహనం తక్కువకదా. (పేషేంట్స్‌కి పేషెన్స్ తక్కువ.) కానీ చూసేటీవీ నాది. కాబట్టి భరించక తప్పదు. "ఒరేయ్ గ్రీస్ ఆడుతుందా?" అని అడిగా. ఏం అన్నాడు. "ఏంలేదుబే గ్రీస్ టీంలో అయితే ఆర్కిమెడీస్, సోక్రటీస్, హెరిడేటస్, పైథాగరస్‌లను చూడొచ్చని" అన్నా. "నిన్ను తీస్కెళ్ళి శ్రీలంకటీంలో పడేస్తా. అక్కడైతే రావణుడు, కుంభకర్ణుడూ, ఇంద్రజిత్తూ ఉంటారు.” అన్నాడు. ఇంతలో మాచ్ ముగిసింది. నేననుకున్నట్టే జర్మనీ గెలిచింది. నేను మొదట్నుంచి జర్మనీ గెలవాలనుకున్నా. కనీసం ఇదిగెలిచాకయినా ఆనోరులేని ఆక్టోపస్‌ని చంపాలన్న ఆలోచన మారుతుందని. మావాడు వెళ్తూవెళ్తూ "ఆదివారం రాత్రి ఫైనల్. నువ్వు రూంలో ఉండొద్దు. తాళాలిచ్చి ఎక్కడికైనా వెళ్ళిపో." అన్నాడు.

ముందే చెప్పాగా టీవీ నాదని. దాంతో ఫైనల్కి వాడువేరేటీవీని వెతుక్కుని వెళ్ళిపోయాడు. మరో ఇద్దరుముగ్గురొచ్చారు ఫైనల్ చూసేందుకు. నాకూ కొంచెంజిల పుట్టింది. ఎంతైనా ఫైనల్ కదా.  ప్రారంభోత్సవంలో ఎటుచూసిన కనిపిమ్చిన నల్లమొహాలు ఈసారి మాయమయ్యాయి. ఇప్పుడంతా తెల్లపిల్లలే. వార్నీ ఇన్నిరోజులూ సూక్తువల్లిస్తూ వ్యాపారంచేసి ఇప్పుడేమో ఇలా. ఒకపక్క ఇస్పాను మరోపక్క ఆరెంజ్‌ఆర్మీ. ఫైనల్ కొంచెం చిరాకేసింది. వీళ్ళాఫైనలిస్టులు అనిపించింది. హాలెండువాళ్ళు గోల్స్ కోసంకాక యెల్లోకార్డులకోసం ఆడుతున్నారు. ఏదో అనుకున్నా కానీ ఫైనల్ అంత థ్రిల్లింగా లేదు. మూడోస్థానంకోసం జరిగిందే చాలాబెటర్ అనిపించింది. టీవీకట్టేసి పడుకున్నా. ఉదయం లేచిచూస్తే స్పెయిన్ గెల్చిందట. ఏదో ఫైనల్‌కి చేరారు. ఒకగోల్ కొట్టారు. కాబట్టి గెలిచారు. అంతేతప్ప 'విజేత‌' అనిపిమ్చలా. అంతా మనమంచికే జరిగింది. మాచ్ మరీఇంటరెస్టింగా ఉంటే నాక్రికెట్‌కి ద్రోహం చేసెయ్యను. మరోసారి గాట్టిగా మేరా క్రికెట్ మహాన్.

ద్వైతాద్వైతసంగమం 'తుంగభద్ర'

కావేరీ తుంగభద్రాచ కృష్ణవేణీచ గౌతమీ
భాగీరథీతి విఖ్యాతాః పంచగంగాః ప్రకీర్తితాః

పశ్చిమకనుమల్లో పుట్టిన రెండునదులు తమగమనంతోపాటూ కాలగమనంలో పుట్టుకొచ్చిన రెండు ఉన్నతమైన వైదికధర్మాలను మోసుకొచ్చి, తమకలయికతో మరోగొప్పనదికి జీవం పోశాయి.వరాహపర్వతాల్లో అద్వైతధర్మానికి నదీరూపంగా భావించే తుంగానది, అదేప్రాంతానికి దక్షిణభాగంలో ద్వైతధర్మానికి ప్రతీకైన భద్రానది ఉద్భవిస్తాయి. కొండల్లోంచి పరుగులుపెడుతూ, జలపాతాల్లా కిందకి దుముకుతూ, మెలికలు తిరుగుతూ తుంగానది 147km మరియు భద్రానది 171km దూరం ప్రయాణించాక, శివమొగ్గ దగ్గర్లోని కూడలి దగ్గర కలిసి తుంగభద్రకు జీవంపోస్తాయి. ఇక్కడినుంచి దక్కనుపీఠభూమిలో ప్రవహిస్తూ కర్ణాటకలోని శివమొగ్గ, ఉత్తరకన్నడ, చిత్రదుర్గం, బళ్ళారి అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలుజిల్లాల్లో 531km ప్రవహించి కృష్ణమ్మ ఒడిలోకి చేరుకుంటూంది. అటుపై శ్రీశైలంమల్లన్న కాళ్ళుకడిగాక హంసలదీవి వరకు సాగేదారి తెలిసిందే. పశ్చిమకనుమల్లో మొదల్లయే ప్రవాహం ఆపై పీఠభూమిలోని కఠినశిలలపై సాగడంతో కొంచెంవేగం ఎక్కువగా ఉంటుంది. తుంగభద్రలో మొసళ్ళు ఎక్కువని తెనాలిరామకృష్ణుడు చెప్పినట్టు గుర్తు.  


నిజానికి తుంగభద్ర అనేది కేవలం 530km ప్రవహించి మరోనదిలో కలిసిపోయే ఒక ఉపనది. కానీ ఈనది ప్రాముఖ్యత పురాణాల్లోను, మద్యయుగచరిత్రలోనే కాదు, ఆధునికభారతావని సాధించిన పురోగతిలోనూ ఒకవిశిష్టస్థానం ఉంది. ద్వైతాద్వైతధర్మాలవంటి వైదికసిద్ధాంతాలను, ముష్కరమూకలకు తలొగ్గకుండా సుఖశాంతులతో పాలించిన సామ్రాజ్యాన్ని, సాగునీటి ప్రాజెక్టులద్వారా సస్యశ్యామలమైన వ్యవసాయక్షేత్రాల్ని, ఖనిజాల్ని వెలికితీసే పారిశ్రామలను తన ఒడిలోదాచుకుంది తుంగభద్ర.

పురాణాల్లో ఈనదిని పంపానదిగాను, దీని పరీవాహకప్రాంతాన్ని కిష్కింధగాను పేర్కొన్నారు. శృంగేరీలో ఆదిశంకరాచార్యునిచే నెలకొల్పిన దక్షిణామ్నాయ శ్రీశారదాపీఠం తుంగానది ఒడ్డున వెలసిన క్షేత్రాల్లో ప్రముఖమైనది. తుంగాపానం-గంగాస్నానం అని పెద్దలు చెప్పారంటె ఈనది ప్రాముఖ్యతను అర్థం చేసుకోవచ్చు. ఆదిశంకరుడు తనశిష్యబృందంతోబాటుగా ఈప్రాంతంలో వెళ్తుండగా ప్రసవవేదనను అనుభవిస్తున్న కప్పకు నాగుపాము తనపడగను రక్షణగాఉంచి సేవచేయడం చూచి, అక్కడ దక్షిణామ్నాయపీఠం నెలకొల్పారు. తూర్పున పురుషోత్తమపురంలోను, పశ్చిమాన ద్వారకలోను అలాగే ఉత్తరాన బదరీనాథ్ దగ్గరి జ్యోతిర్మఠ్‌లోను పీఠాలను నెలకొల్పారు. ఈపీఠం కృష్ణయజుర్వేదానికి రక్షకునిగా వ్యవహరిస్తుంది. శారదాదేవి ఆలయం, విద్యాశంకరుని ఆలయం శృంగేరిలోని మరికొన్ని ముఖ్యమైనస్థలాలు. భద్రానది ఒడ్డున ఉన్న శైవారామాలు కన్నడరాజ్యంలోని వీరశైవధర్మానికి చిరునామా.

తుంగభద్రానది ఒడ్డున  మనరాష్ట్రంలోని మంత్రాలయం ఎంతోపవిత్రమైనది. ఇక్కడ మద్వధర్మాన్ని ఆచరించే గురురాఘవేంద్రమఠం ప్రాముఖ్యత తెలిసిందే. దక్షిణకాశీగా పేరొందిన మహబూబ్‌నగర్‌జిల్లాలోని ఆలంపూర్ ఈనదితీరంలోని మరొకముఖ్యస్థలం. ఇక్కడి జోగులాంబ, చాళుక్యులకాలంనాటి నవబ్రహ్మమందిరాలు ప్రముఖక్షేత్రాలు. అన్నిటికన్నా ముఖ్యమైనది ఈప్రాంతలో తెలుగు కన్నడిగుల మద్యనున్న స్నేహం. తేటతెనుగు-కస్తూరికన్నడలు పాలునీళ్లలా కలిసి శతాబ్దాలుగా సహజీవనం సాగిస్తున్నారు. కన్నడరాజులు తెలుగుకు చేసినసేవ, అలానే తెలుగువాళ్ళు కన్నడిగులతో పెంచుకున్న బంధం ఒకపరిణితిచెందిన సాంస్కృతికబంధాన్ని నెలకొల్పాయి.


ఈనదిఒడ్డున నిర్మితమైన పట్టణాల్లో అత్యంతముఖ్యమైంది హంపి. ఒకవైపు తుంగభద్ర మరోవైపు ఎత్తైనకొండలతో ఈప్రాంతం శత్రుదుర్భేధ్యంగా ఉండెది. విషసర్పాలవంటి పొరుగురాజ్యలనుంచి ప్రజలను కాపాడుతూ, కళలకు కాణాచిగా పేరొంది, పరిపాలన అన్నపదానికే నిర్వచనం చెప్పిన విజయనగరసామ్రాజ్యపు సాంస్కృతికరాజధానిగా ప్రపంచవారసత్వ సంపదల్లో తలమానికమైన నగరం ఇది. విజయనగరసామ్రాజ్యంకన్నా పురాతనమైనది ఈపట్టణం. ఇక్కడి ఆలయాల్లో విజయనగరశిల్పకళేకాక దానికిముందున్న హొయశాలశైలికూడా కలిసిఉంటుందని నిపుణుల అభిప్రాయం. విరూపాక్షుణిఅలయం ఇక్కడ చూచితీరాల్సిన స్థలం. దానితోపాటుగా పదులసంఖ్యలో ఉండే పర్యాటకస్థలాల్ని చూశాక ఎవడైనా ఈదేశసంస్కృతిని, ఈమట్టిలో పుట్టినశాస్త్రాలను అపహాస్యంచేస్తే ఈడ్చుకుంటూవచ్చి వీటిని చూపెట్టాలని నాస్నేహితుడు అంటుంటాడు.
కర్ణాటక అంటేనే మనకు గుర్తొచ్చేవి ప్రాజెక్టులు. ఈనది అంతర్రాష్ట్రనదికావటంతో రాష్ట్రపతిఉత్తర్వులను అనుసరించి తుంగభద్రబోర్డును నెలకొల్పారు.తుంగభద్రప్రాజెక్టుకు సంబంధించిన జలవిద్యుదుత్పత్తి, సాగునీటిసరపరాను ఈబోర్దూ నియంత్రిస్తుంది. తుంగానదిపైన శివమొగ్గవద్ద, భద్రనదిపైన లక్కవల్లివద్ద ప్రాజెక్టులను నిర్మించారు. బళ్ళారిజిల్లాలోని హోస్పేట్ వద్ద తుంగభద్రనదిపై ఆనకట్ట నిర్మించారు. కర్నూలు దగ్గర్లోని సుంకేసులవద్ద కాటన్‌దొర నిర్మించిన ఆనకట్ట ఒకటి ఉండేదట. దానిస్థానంలో ఇటీవల ఆనకట్టను కట్టి, దానికి మాజీముఖ్యమంత్రి కోట్లవిజయభాస్కరరెడ్డి పేరుపెట్టారు. వీటన్నిటినీ మించి రాయలకాలంనాటీ చెరువులు, సాగునీటిసౌకర్యాలు ఇక్కడ వ్యవసాయానికి ఎంతగానో ఉపయోగపడూతాయి. మట్టికోసుకుపోకుండా రాయలకాలంలో కట్టించిన కొన్నిరాతికట్టడాలు ఇప్పటికీ చెక్కుచెదరలేదు.

ఈనది ప్రవహించే ప్రాంతాల్లో ఖనిజవనరులు పుష్కలంగా ఉన్నాయి. ఇనుము, మాంగనీసువంటి గనులేకాక, గ్రానైట్‌క్వారీలు ఈప్రాంతంలో అధికం. వీటివల్ల జరుగుతున్న పారిశ్రామికాభివృద్ధికన్నా కాలుష్యం, అవినీతి ఎక్కువవడం అనేకవివాదాలకు దారితీస్తుంది. నీటిపారుదల సౌకర్యాలు పుష్కలంగా ఉన్నా వాటిమరమ్మతులు సరిగా జరపకపోవడంతో అనేకజలశయాలతోపాటు రాయలకాలంనాటి చెరువుల సామర్థ్యంసైతం ఏటికేడు తగ్గిపోతుంది. ఇటీవలికాలంలో ఇక్కడ నెలకొల్పుతున్న కర్మాగారాలు, వాటికి అనుబంధంగా నిర్మిస్తున్న రహదారులవల్ల ఇక్కడి జీవవైవిధ్యం దెబ్బతింటుంది. కొన్ని అరుదైనవానరజాతులు నశిస్తున్నాయి.
ఇలా రెండు విశిష్టవైదికధర్మాలనుంచి ఉద్భవించి,తనువెళ్ళేదారిని సస్యశ్యామలం చేస్తూ  పంచగంగల్లో ఒకటిగా స్థానం సంపాదించుకున్న తుంగభద్రనది దాని ఒడ్డున వెలసినక్షేత్రాలకు, నిర్మించిన రాజ్యాలకు, విరాజిల్లిన కళలకు, ఆనీళ్ళతో గొంతుతడుపుకుంతున్న ప్రజలకు మాతృసమానురాలు.