మోతీజిల్ 2

మొదటిభాగం మోతీజిల్1

ఏడోతరగతిలో మదర్‌థెరిస్సా అనేపాఠం ఉండేది. ఆపాఠం, అందులో మోతీజీల్ గురించిన ప్రశ్న కామన్ పరీక్షల్లో చాలాఇంపార్టెంట్. సుకుమార్ క్వశ్చన్ బాంకులోనూ, రాఘవేంద్రగోల్డెన్ గైడులోనూ చాలాముఖ్యం అని రాసున్నారు. అన్నట్టు ఇంకోవిషయం- రాఘవేంద్ర గైడు బీ.ఏ. చదివిన దర్శకేంద్రుడిదే అనుకునేవాడిని. అప్పట్లోనే మేజర్ చంద్రకాంత్ రిలీజయి ఆఅభిప్రాయానికి బాగాబలం చేకూర్చింది.


ఇక అసలు విషయానికొస్తే, మోతీజిల్ అనేది కలకత్తాలోని మురికివాడ. ఆగ్నస్ థెరిసాగా సేవలు మొదలుపెట్టింది అక్కడినుంచే. ముందురోజు మోతీజిల్ గురించి చెప్పి నాకొక బలవంతుడైన పహిల్వాన్ కారక్టరు, ఇంకోడికి కుష్టురోగిపాత్ర, మరొకడు థెరిసాపాత్ర. అదీసీన్. తర్వాతరోజు ముఖ్యమైన ప్రశ్నకావడంతో వచ్చీరావడంతోనే పాఠంలోకి వెళ్ళిపోయాడు.
కొంతసేపాగి "మోతీజిల్ పరిస్థితులు ఎలా ఉంటాయి? ఎవరెవరికి సమాథానాలు వచ్చో చేతులెత్తండి." అన్నాడు. నాకు ఎడమకన్ను కొట్టుకుంది. ఇదేదో రాబోయేకీడుకి ఇది పైలట్ అనుకొని చెయ్యెత్తకుండా గుట్టుగా కూర్చున్నా. అందరూ చేతులెత్తారు. అందులోంచి రాజేష్ గాడిని లేపాడు. చెప్పరా అన్నాడు.


వాడు వెంటనే చేతులుకట్టేసుకుని బిర్రబిగుసుకుని నిలబడ్డాడు. " మోతీజిల్ కలకత్తాలోని ఒకమురికివాడ. అక్కడిప్రజలు ఎంతో అపరిశుభ్రంగా ఉండేవారు. (నాకర్థం అయిపోయింది ఇది రాఘవేంద్రలోది. సుకుమార్లొ అయితే మొదటిలైను వేరేగా ఉంటుంది.) అక్కడ సామాజిక పరిస్థితులు ఎంతో దుర్భరంగా ఉండేవి. (అయ్యోరుకి బీపీ జుయ్య్ మంటూ పెరిగిపోయింది.)
"చీ! ఆపు." వాడి పిర్రమీద బెత్తంతో ఒక్కటిచ్చాడు. కట్టేసుకున్న చేతుల్లోంచి ఒకదాన్ని తీసి 'ఉస్సూ..ఆబ్బా..' అంటూ తడుముకుంటూ నిలబడ్డాడు.ఎక్కడినుంచి పుట్టుకొస్తార్రా.


"అప్పజెప్పే బుద్దులూ మీరూనూ. అడక్కతిన్నా సిగ్గన్నాలేక. ఇలా అప్పజెప్పుకుంటూపోతే రేపు బస్టాండులో టాయిలెట్లు కడుక్కోనుతప్ప దేనికీపనికిరారు. 'కాకికి రెండుకాళ్ళుండును' అన్నదికూడా గైడుచూసే నేర్చుకుంటారా. రేపుపెళ్ళాయ్యాక ఆఫీసునుంచి వచ్చి "ఓసీభార్యామణీ! నేను కార్యాలయమునుమ్చి వచ్చుచుండగా మార్గమద్యమున శునకములు వెంటబడినవి. వాటిని తప్పించుకొనుటకు పురవీథులన్నింటినీ సంచరించి గృహమునకు చేరేసరికే ఈసమయమైనది. నాకు కొద్దిగా జలముతెమ్ము." అన్నావనుకో నీపెళ్లాం జలముకాదు చీపరకట్ట ఎత్తుకొస్తాది..."  ఇలాసాగిపోతూ ఉంది.

ఎప్పుడైనా సారుచేతిలో దెబ్బలు తప్పిపోతే ఆనందంగా ఉంటుంది. అది లౌకికానందం. అదేదెబ్బలు మనఫ్రెండెవడైనా తింటే అప్పుడుకలిగే ఆనందం ఉందే అదే అలౌకికానందం. ఆక్షణంలో నేననుభవిస్తున్నది అదే. "హమ్మయ్య! నేనుచెయ్యెత్తలేదు అనుకున్నా." ఇలా ఆలోచిస్తూ ఉంటే ఉన్నట్టుండి నాపక్క తిరిగి నువ్వుచెప్పరా అన్నాడు. చెయ్యెత్తలేదన్న సంగతి నాకు తెలుసుగానీ ఆయనకి తెలీదు. ఇప్పుడావిషయాన్ని చర్చిస్తే ఏమవుతుందో నాకేకాదు మీకూ తెలుసు. పరిస్థితిని అర్థం చేసుకుని జవాబెలా చెప్పాలి అని ఆలోచించే దానికి ఓఅరనిముషం పట్టింది.


చేతులుకట్టుకున్నా. " మోతీజిల్ అనే వీథి కలకత్తాలో ఉంది. అక్కడంతా పేదోళ్ళు. తినేదానికి మంచిఅన్నం దొరకదు.." ఇలా చెప్పుకుంటూపోతున్నా. ఆయననాకు దగ్గరగా వస్తున్నాడు. సగంబుర్ర మోతీజిల్ గురించి, మిగతాసగంబుర్ర ఇప్పుడు ఏదేవుణ్ణి వేడుకోవాలి? అయ్యప్పస్వామి? సీజన్‌కాదు. రాముడు? మొన్నఓసారి అడ్డుపడ్డాడు. శివుడు? వీరభద్రుడు?అమ్మో. విష్ణువు? గజేంద్రమోక్షంరాదే. సుబ్రహ్మణ్యస్వామి? నాపేరులో సగమే ఆయనది. కానీ సారుది మొత్తంపేరు అదే. కాబట్టి పెద్దగా సపోర్ట్ ఇవ్వడేమో? ఇలా సాగుతుంది మల్టీటాస్కింగ్. నెమ్మదిగా పక్కకొచ్చేశాడు. బెత్తంకూడా అవసరంలేదు చెయ్యెత్తాడంటే చెంప పేళ్‌మని పేలిపోతుంది. నెమ్మదిగా చెయ్యెత్తి భుజంపైన వేశాడు. ఎంతచెప్పానో? ఎంవదిలేశానో? తెలీదు. ఆయనపక్క తిరిగిచూశా. కొంచెం ప్రశాంతంగానే ఉన్నాడు. హమ్మయ్య అనుకుని ఎలాగోలా పూర్తిచేశా.


అలా నాపక్క చూసి పేళ్‌మని ఓచెంపపై పీకాడు. "నీకు జవాబు తెలిసినా ఇందాక చెయ్యెందుకు ఎత్తలేదు?" అప్పుడర్థమైంది నాకు ఎడమకన్ను ఎందుకు కొట్టుకుందో. కూర్చో అని ఓఅరుపు అరిచి మొదలుపెట్టాడు.

" భాష అనేది రెండురకాలు. ఒకటి మాట్లాడేభాష. ఇంకోటి రాసేభాష. నేను జవాబు అడిగినప్పుడు మీకేమి తెలుసోదాన్ని మీకొచ్చినమాటల్లోనే చెప్పాలి. రాసేభాషవేరే. ఎందుకంటే దాన్నిచదివేవాడూ నీకెదురుగా ఉండడు. అతనికి నువ్వు తెలిసుండొచ్చు. తెలియకపోవచ్చు. నువ్వుచెప్పలనుకున్న విషయంలో ఏమాత్రం గందరగోళం ఉన్నా చాలాఇబ్బందులొస్తాయి. మాట్లాడేటప్పుడు ప్రశ్న అర్థంకాకపోతే మరొకసారి అడగొచ్చు. రాసేప్పుడు ఆవకాశం ఉండదు. ఏమాత్రం తప్పుగా అర్థంచేసుకున్నా పరీక్షల్లో అయితే మార్కులుపోతాయి. బయటైతే ఇంకాచాలా ఇబ్బందులొస్తాయి. ఎప్పుడు ఏభాషను ఉపయోగించాలో తెలుసుకొని మసలాలి."


ఆతర్వాత చాలాసార్లు ఆయనమాట నిజమేమనిపించింది. బ్లాగు మొదలెట్టాక ఆమాటలు నిత్యసత్యం అన్న సంగతి తెలిసొచ్చింది. చాలాసార్లు ముందు కొంతరాయడం ఆపై ఇలారాస్తే మీరు వేరేరకంగా అర్థంచేసుకుంటే అనుకొని మార్చడం. చాలాసార్లు ఇక్కడ చోటుచేసుకున్న వివాదాలకు మూలం అదే అనుకుంటా. ఇప్పటిదాకా **లేఖలు రాసే అవసరం రాలేదుకాబట్టి సరిపోయింది. ఆఅవసరం పడితే? అమ్మో. తలుచుకుంటేనే భయమేస్తుంది.

పక్కన జారుడుబద్దపైన ఎలచ్చన్లు నిర్వహిస్తున్నాం. పాఠకులు మీవిలువైన ఓటుహక్కును 'వావ్'పైన గుద్ది ఆనందింపచెయ్య ప్రార్థన

7 comments:

  1. __________________________________
    " భాష అనేది రెండురకాలు. ఒకటి మాట్లాడేభాష. ఇంకోటి రాసేభాష. నేను జవాబు అడిగినప్పుడు మీకేమి తెలుసోదాన్ని మీకొచ్చినమాటల్లోనే చెప్పాలి. రాసేభాషవేరే. ఎందుకంటే దాన్నిచదివేవాడూ నీకెదురుగా ఉండడు. అతనికి నువ్వు తెలిసుండొచ్చు. తెలియకపోవచ్చు. నువ్వుచెప్పలనుకున్న విషయంలో ఏమాత్రం గందరగోళం ఉన్నా చాలాఇబ్బందులొస్తాయి. మాట్లాడేటప్పుడు ప్రశ్న అర్థంకాకపోతే మరొకసారి అడగొచ్చు. రాసేప్పుడు ఆవకాశం ఉండదు. ఏమాత్రం తప్పుగా అర్థంచేసుకున్నా పరీక్షల్లో అయితే మార్కులుపోతాయి. బయటైతే ఇంకాచాలా ఇబ్బందులొస్తాయి. ఎప్పుడు ఏభాషను ఉపయోగించాలో తెలుసుకొని మసలాలి."


    ఆతర్వాత చాలాసార్లు ఆయనమాట నిజమేమనిపించింది. బ్లాగు మొదలెట్టాక ఆమాటలు నిత్యసత్యం అన్న సంగతి తెలిసొచ్చింది. చాలాసార్లు ముందు కొంతరాయడం ఆపై ఇలారాస్తే మీరు వేరేరకంగా అర్థంచేసుకుంటే అనుకొని మార్చడం. చాలాసార్లు ఇక్కడ చోటుచేసుకున్న వివాదాలకు మూలం అదే అనుకుంటా. ఇప్పటిదాకా **లేఖలు రాసే అవసరం రాలేదుకాబట్టి సరిపోయింది. ఆఅవసరం పడితే? అమ్మో. తలుచుకుంటేనే భయమేస్తుంది.
    __________________________________

    సోదరా, చివర్లో ఈ సందేశం ఇవ్వడానికి రెండు టపాలు తీసుకుంటావా? నువ్వు చెప్పిన తీపిబిళ్ళ ఉపమానం అర్థం అయ్యింది కాని....

    ReplyDelete
  2. కొత్త టెంప్లేట్ బాగుందండీ.. మీరు కొంచం తరచూ రాస్తూ ఉండాలి.. ఆఫీసు పనులు ఉంటూనే ఉంటాయి.. మనమే ఏదోలా కొంచం చెయ్యి ఖాళీ చేసుకోవాలి :):)
    'జగ్గయ్య' నన్నెక్కడికో తీసుకెళ్ళి పోయారు.. ఎప్పుడో ఓ టపా వస్తుంది, కాసుకోండి..
    మీకు పహిల్వాన్ వేషం ఇచ్చారా? ప్రొఫైల్ లో పెట్టిన ఫోటో చా..లా... దూరం నుంచి తీసినట్టున్నారు ఐతే:):)
    తెలుగు మేష్టారి సందేశం బాగుందండీ.. కానీ ఆయన కోపమే బాగోలేదు.. ఏ లెక్కల మేష్టారో, సైన్సు మేష్టారో అవ్వాల్సినాయన పొరపాటున తెలుగయ్యోరు (నామిని ని మళ్ళీ చదువుతున్నా లెండి) అయినట్టున్నారు. మా తెలుగు మేష్టారికి నా మీద కోపమొస్తే లేచి నిలబడమనే వారు.. నేను లేచి నిలబడి మిగిలిన పిల్లలెవరూ మాట్లాడకుండా చూసే పని మొదలు పెడితే, ఆయనకి మళ్ళీ కోపం వచ్చేదీ.....అబ్బో పెద్ద కథ..

    ReplyDelete
  3. భలే రాస్తున్నారండి.....మీ రాతలు నాకు తెగ నచ్చేసాయి.

    ReplyDelete
  4. మీ తెలుగు సారు చానా మంచోడన్నమాట. :))

    >>"నువ్వుచెప్పలనుకున్న విషయంలో ఏమాత్రం గందరగోళం ఉన్నా చాలాఇబ్బందులొస్తాయి."

    ఇది నాకు జీవితంలో బాగా అనుభవం. :)). ఇప్పుడు కాదులే, ఒకప్పుడు, అంటే నా టైమ్ బాగోలేనప్పటి కాలంలో, నా మాటల్లోని గందరగోళం వల్ల వేరే ఎవరెవరో గొడవపడేవారు. ;))). వాళ్ళిద్దరూ విడిపోయేవారు. నేను మాత్రం సేఫ్ అన్నమాట. :))

    ReplyDelete
  5. @గణేష్: కానీ... ఏంటిబ్బాయ్.
    @మురళి: నేనూచాలా ప్రయత్నిస్తానండీ. కానీ ప్రతిసారీ కుదరదుగా. కొన్నిసార్లు అవసరాలు అలావస్తాయి. టెంప్లేట్ కోసం ఎలచ్చను ఎట్టున్నాం అండీ..ఆయ్. ఓతూరి గుద్దెయ్యండే.
    పహిల్వాన్కి నేనునప్పను. మిగతారెంటికన్నా అది నయంకదా. నిజానికి ఆయనకు లెక్కలు, ఇంగ్లీషంటే చాలాఇష్టం. ఎప్పుడైనా ఖాళీక్లాసు తీసుకుంటే గ్రామరు, అర్థిమెటిక్స్ చెప్పేవారు. బీఎడ్లో తెలుగు ఒక‌ఆప్షనల్ అనుకుంటా అందుకే తెలుగయ్యోరు అయ్యారు. మరి మీఇషయాలెప్పుడో?
    @ ప్రేరణ: ధన్యవాదాలు
    @ నాగ: టపాచదివి చంకలెగరేసుకుంటే ఆయన మంచితనమే కనిపిస్తుంది. ఆమోతీజిల్ ప్రశ్న నిన్ను అడిగుంటే తెలిసొచ్చుండేది.

    ReplyDelete
  6. అప్పుడే అయిపోయిందా? ఇంకొన్ని కబుర్లు వీలున్నప్పుడు రాస్తూంతే బావుంటుంది...కాలేజీ కన్నా స్కూలు కబుర్లు మరి అపురూపం కదా..పద్యాలు చెప్పకపొతే రెండు దెబ్బలు చేతి మీద వేసేవారు.ఆయనకు మా నాన్నగారు తెలుసు...తప్పులు వస్తే ఏమ్మా నువ్వు వారి అమ్మాయివెనా అని తిడతారని; అంతకన్నా చెప్పకపోవటమే నయం అని అసలుకే చెప్పేదాన్ని కాదు..:) అలా నేనూ తెలుగు మాష్టారితో బెత్తం దెబ్బలు తిన్నాను...!!

    ReplyDelete