సైన్సుకోసం ఒక్కరోజు

శతాబ్దాల బానిసత్వం. కరువుకాటకాలతో నిత్యంపోరాటం. మూఢనమ్మకాల వలలో చిక్కుకున్న సమాజం. అదేసమయంలో ప్రాశ్చాత్యదేశాల్లో సాంప్రదాయక సిద్ధాంతాలను బుట్టదాఖలుచేస్తూ అభివృద్ధిచెందిన ఆధునికసైన్సు. ఆసిద్ధాంతాలకు రూపం ఇచ్చే సాంకేతిక సమాజం. వీటన్నిటినీ మించి పారిశ్రామికవిప్లవ ఫలితాలు. ఇవన్నీ వెరసి సాంప్రదాయకశాస్త్రాలకు పుట్టినిల్లయిన భారతావనికి- సైన్సుల్యాబులకు పర్యాయపదంగా మారిన ప్రాశ్చాత్యదేశాలకు మద్య ఒక అగాధాన్ని సృష్టించాయి.

భారతీయులది రాజకీయబానిసత్వమే తప్ప శాస్త్ర‌అద్యయనంలోనూ, జ్ఞానసముపార్జనలోనూ కాదని నిరూపిస్తూ అగాధాన్ని పూడ్చేందుకు ఉదయించిన జ్ఞానజ్యోతి 'సీవీరామన్‌'.

తమిళ్నాడులోని తిరుచ్చిరాపల్లిలో కావేరిఒడ్డున జన్మించి, గంగఒడ్డున కలకత్తాలో ఐ.ఏ.సీ.ఎస్‌.లో పరిశోథనలు చేసి నోబెల్ పురస్కారాన్ని అందుకొన్న ఈమహనీయుని పేరు వినని భారతీయవిద్యార్థి ఉండడనుకుంటా. చిన్నతనంలోనే విశాఖకు వలసవచ్చారు. తండ్రి గణిత ఉపాద్యాయుడు కావటంతో చిన్నప్పటినుంచి ఇంట్లోవాతావరణం సైన్సుపై ఆసక్తి కలిగించింది. ఆపై మద్రాసు ప్రెసిడెన్సీకళాశాలలో బీఎస్సీలో బంగారుపతకం, ఎమ్మెస్సీలో డిస్టింక్షను సాథించాక ఆర్థికశాఖలో అసిస్టెంట్ అకౌంటెంట్ జెనరల్‌గా చేరారు.

కొద్దికాలానికే దాన్నివదిలేసి కలకత్తా విశ్వవిద్యాలయంలో పలిత్‌ప్రొఫెస్సరుగా చేరారు. అదేసమయంలో ఇండియన్ అసోసియేషన్ ఫర్ ద కల్టివేషన్ ఆఫ్ సైన్స్ (IACS)లో తనపరిశొధనలను కొనసాగించారు. ఈసమయం తనజీవితంలోకెల్లా అత్యుత్తమమైనదిగా, తనపరిశొధనలకు అక్కడివిద్యార్థులు ఇచ్చిన తోడ్పాటు వెలకట్టలేనిదా రామన్ అభిప్రాయపడేవారు.
ఎనభైరెండేళ్ళక్రితం, ఫిబ్రవరి 28, 1928, ఈరోజు ప్రపంచ శాస్త్రసాంకేతిక సమాజం అవాక్కయి భారతావనివైపు చూసినరోజు. ప్రాశ్చాత్యులకు మనమేమి చెయ్యగలమో చేసిచూపించినరోజు. వలసపాలనకింద నలిగిపోతున్న ముప్పైకోట్లమంది ఉపఖండవాసులు గర్వంగా తలెత్తి నిలిచినరోజు. అన్నేళ్ళకృషి ఫలితంగా పురుడుపోసుకున్న 'రామన్ ఎఫెక్ట్‌' ను ప్రపంచానికి అందించినరోజు.

Rs.35/- దాటని ప్రయోగం, ఒకటిన్నరపేజీల నిడవిగల వ్యాసం, అందులోని విశ్లేషణనుంచి ఉద్భవించిన ఒకవాక్యం-" కాంతి ఒకపదార్థం ద్వారా ప్రసారించి వికిరణం చెందినపుడు, కాంతి పౌనఃపున్యంలో మార్పు అదిప్రసరించే మాద్యమంలోని అణూవుల మద్యఉన్న అణుబంధంపై ఆథారాపడి ఉంటుంది." ఆధునిక శాస్త్రసమాజానికి దిక్సూచిలా దిశానిర్దేశం చేసింది. అభినవ బృహస్పతిగా పేరొందిన ఐన్‌స్టీన్ ప్రతిపాదించిన క్వాంటంసిద్ధాంతంలోని అనుమానాలను ఇదిపటాపంచలు చేసింది. రెండుసార్లు ఊరించి చేజారిన భౌతికశాస్త్ర నోబెల్ పురస్కారం ఎట్టకేలకు 1930లో వరించింది. భౌతికశాస్త్రరంగంలో నోబెల్ అందుకున్న మొదటి ఆసియావాసి మరియు శ్వేతేతరుడు రామన్.
ఈయన సిద్ధాంతాన్ని
  • @ అధిక పౌనఃపున్యంగల ఫోనాన్, మాగ్నాన్, ఉత్తేజితస్థితిలోని ఎలక్ట్రాన్లను అద్యయనం చెయ్యడాని
  • @ వాతావరణం అద్యయనానికి
  • @ దహనచర్యలను విశ్లేషించడానికి
  • @ అయాన్ల శక్తిస్థాయిలను కొలిచేందుకు, మొదలైన రంగాల్లో ఉపయోగిస్తారు.
ఆపై కొంతకాలం బెంగుళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్(IISC)కు డైరెక్టరుగా పనిచేశాక ఒకరసాయన కర్మాగారాన్ని నెలకొల్పారు. అటుపై స్వతంత్రభారతావనికి మొదటి జాతీయ ప్రొఫెసరుగా సేవలందించారు.
కొళ్ళాయి బదులుగా తలపాగా ధరించి, చేతికర్రకు బదులుగా కటకాలను ఊతంగా చేసుకుని, భగవద్గీతకు బదులుగా భౌతికశాస్త్రవిజ్ఞానాన్ని పట్టుకుని శాస్త్రసాకేంతికరంగాల్లో భారతావని దాశ్యశృంఖలాలను ఛేదించేందుకు కాంతిసత్యాగ్రహాన్ని జరిపిన 'సైన్సుగాంధీ' సీవీరామన్. ఆయన చేసిన పరిశోధనలు సమాజ అభ్యున్నతికే తప్ప అణూబాంబుల తయారీకో, అసాంఘీకచర్యలకో ఊతమివ్వలేదు. ఏదేశమేగినా తన సంప్రదాయాలను, అలవాట్లను పాటించడంలో ఏమాత్రం రాజీపడలేదు. రాణిగారివిందులో మధువు ముట్టనని తనమాట నెగ్గించుకున్నారు.
రామన్ ఎఫెక్ట్ తర్వాత ఆయన చేసిన పరిశొధనల్లో ముఖ్యమైనవి -
  • @ సంగీతవాయిద్యాల్లో ధ్వనితరంగాల స్వభావాలు, హరాత్మక ప్రకంపనలు
  • @ తీగల్లోని తిర్యక్‌ప్రకంపనలు
  • @ కాంతి తరంగాలు అతిధ్వనుల మద్య సంబంధాలు
  •  @ స్పటికాలలో స్పెక్ట్రోస్కోపీ అద్యయనంద్వారా స్పటిక గతిశాస్త్రంలో(Crystal Dynamics) ప్రాథమికాంశాలపై విశ్లేషణ
  • @ ధూళికణాలలో కాంతిప్రసారం
  • @ మానవదృష్టికి సంబంధించిన అంశాలు
రామన్ ఎఫెక్ట్ ప్రతిపాదించిన రోజును డిపారర్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలోని జాతీయ శాస్త్రసాంకేతిక సమాచార పరిషత్తు(NCTSC) 1986లో జాతీయ సైన్సు దినంగా(NSD) ప్రతిపాదించింది. అప్పటినుంచి ప్రతియేడు ఈసందర్భాన్ని పురస్కరించుకుని దేశంలో సైన్సుపట్ల అవగాహనపెంచే పలుకార్యక్రమాలను చేపడుతుంది. సీనియర్ శాస్త్రవేత్తలచే సెమినార్లు, యువశాస్త్రవేత్తలు, సైన్సు విద్యార్థులకు పోటీలు, ఎక్జిబిషన్లు వంటివి ఏర్పాటుచేస్తారు. సైన్సురంగాల్లో విశేషంగా కృషిచేసిన శాస్త్రవేత్తలకు పురస్కారాలు ఇస్తారు.
ఈఏడు ఆపురస్కారాలకు ఎంపికచేసిన వారు-
  • @ డీడీఓఝా, ఈయన శాస్త్రసాంకేతిక రంగాలకు చెందిన అనేక అంశాలపై పుస్తకాలు రచించారు.
  • @ రామదురై, ఈయన తమిళ వార్తాపత్రికల్లో సైన్సు సంబంధించిన వ్యాసాలు రాస్తారు. కొన్నిపుస్తకాలను కూడా రచించారు
  • @ ఈశాన్యరాష్ట్రాల్లోని స్కూలుపిల్లల్లో సైన్సుపట్ల ఆసక్తిపెంచే కార్యక్రమాలు చేపట్టినందుకు తకేలంబం రబీంద్రోసింగ్ గారికి
  • @ పత్రికామాద్యమంలో సైన్సు ప్రగతికి చేసిన కృషికిగాను దినేష్‌చంద్ర శర్మగారికి
  • @ ఎలక్ట్రానిక్‌ మాద్యమంలోసైన్సువ్యాప్తికి చేసిన కృషికి మానస్‌ప్రతిమ్ దాస్ గారికి
సైన్సుదినోత్సవం సందర్భంగా ఇస్రో, డీఆర్డీఓ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు ఈరోజు ప్రజలందరినీ ఎలాంటిముదస్తు అనుమతీలేకుండానే సందర్శించేందుకు అనుమతిస్తారు. అలాంటి సంస్థలకు మీరెవరైనా దగ్గర్లో ఉంటే మీస్నేహితులతోగానీ, పిల్లలతోగానీ వెళ్ళేందుకు ప్రయత్నించండి. కనీసం ఒకచిన్నక్విజ్ కార్యక్రమం వంటిదాన్ని నిర్వహిచండి.

శుభవార్త 2

మొదటిభాగం

ఆరోజు మద్యాహ్నం ఎందుకో అనుమానం వచ్చి ఆన్‌లైన్ ఫారం తెరిచాను. ఇప్పుడుకాదు రెండురోజులాగు అనింది. ఎందుకో బాగాఇంటెరెస్టింగ్ అనిపించి రెండురోజులాగాక తెరిచా.
వెబ్‌సైట్లో బాగాతరచి చూశాక ఇప్పటిదాకా అభ్యర్థులు ఎదుర్కొంటున్న అనేకసమస్యలకు పరిష్కారం దొరికింది. అవీ
  1. నోటిఫికేషన్ ఒకటాబులో పొందుపరిచారు. ఇది పాతవెబ్‌సైటులోకూడా ఉండేదే. అందులోనే మరొకవిభాగంలో నింపేందుకు సంబంధించిన సూచనలు, నియమాలు పెట్టారు. అభర్థి అవసరమైనంతమేర ముద్రించుకోవచ్చు. సాథారణంగా యూపీఎస్సీ నోటిఫికేషన్ నాటపాలాగా పూర్తిగా చదవాలంటే విసుగొచ్చేంత ఉంటుంది. బహుశా సిలబస్ కన్నా ముందుగా నోటిఫికేషన్ అర్థంచేసుకోవాలేమో. అందులో అభ్యర్థి తనఆప్షనల్‌కు సంబంధించినంత వరకుమాత్రమే ముద్రిమ్చుకోవచ్చు.
  2. మరొక టాబులో- రిజిస్ట్రేషన్ సంబంధించిన వివరాలున్నాయి. రిజిస్ట్రేషన్ రెండుస్థాయిల్లో ఉంటుంది.
    1. మొదటిది- ఇక్కద నొక్కగానే గడువుదాటని నోటిఫికేషన్లన్నీ కనిపిస్తాయి. అందులో మనకు కావల్సినదాన్ని చూసి అక్కడ క్లిక్ చెయ్యాలి. దీనవల్ల సాంప్రదాయక ఫారంలో ఘోషణనింపే పని పూర్తయినట్టె. క్లిక్ చేసినవెంటనే డేటాబేస్‌నుంచి ఆనోటిఫికేషన్ సంబంధించిన అంశాలను తీసుకుంటుంది.
    2. 'కంటిన్యూ' నొక్కాలి.
    3. ఆతర్వాత దరఖాస్తు నింపవలసిన పేజీ తెరుచుకుంటుంది.అక్కడ అభ్యర్థి తనవక్తిగత వివరాలు నింపాలి.
    4. అటుపై వయసుసంబంధించిన సడలింపులు, పరీక్షాకేంద్రం వివరాలు నింపాలి. ( యూపీఎస్సీ నిబంధనలనుసరించి అనేకవర్గాలకు వయసు సడలింపులు ఉన్నాయి. ఆవివరాలు నోటిఫికేషన్లో తెలియజేస్తారు.)
    5. తర్వాత ఆప్షనల్స్ ఎంచుకోవాలి.
    6. ఇప్పుడు, ఇప్పటిదాకా నింపిన వివరాలను చూపెడుతూ ఒకపేజీ ప్రత్యక్షం అవుతుంది. ఏవైనా మార్పులు చేసుకోవాలంటే చేసుకోవచ్చు. కింద ఘోషణలో వివరాలు నింపినచోట ఒకవర్డ్ వెరిఫికేషన్ ఉంటుంది. దాన్ని నింఫి, షరతులకు ఒప్పుకుంటే మొదటిదశ పూర్తయ్యినట్లే.
    7. అప్పుడు లభించిన రిజిస్ట్రేషన్ ఐడీని నోట్‌చేసుకోవాలి.
  3. రెండవదశ- మొదటిదశలో లభించిన రిజిస్ట్రేషన్ ఐడీ, జన్మదినవివరాలు నింపితే రెండవదశలోకి వెళ్తాం.
    1. ఇక్కడ ఫీజుకు సంబంధించిన వివరాలు ఉంటాయి.మొదటిదశలో మీకు ఫీజుమినహాయింపు సూచించినట్లైతే ఇక్కడ ఈపేజీ బైపాస్ అవుతుంది. మొదటిదశలో ఎస్సీ,ఎస్టీ, వికలాంగులు, స్త్రీలు వీటిలో ఏదినింపినా ఫీజుమినహాయింపు ఆటొమేటిగ్గా లభిస్తుంది.
    2. ఫీజు మూడురకాలుగా చెల్లించవచ్చు.
      1. మొదటిది-ఇక్కడ వచ్చే పీడీఎఫ్ పేస్లిప్‌ను బాంకులో జమచేసి, వివరాలునింపి దాన్ని పోస్టుద్వారా పంపడం.
      2. రెండవది- వీసాలేదా మాస్టర్‌కార్డు ద్వారా నింపడం
      3. ఆన్‌లైన్ అకౌంట్ ఉన్న అభ్యర్థులు ఎస్బీఐ ఆన్‌లైన్ ద్వారా నింపడం. ప్రస్తుతానికి మూడు విథానాల్లోనూ కేవలం ఎస్బీఐ ఖాతాదారులకే అవకాశం కల్పించారు. సింహభాగం వాళ్ళే ఉన్నందువల్ల అనుకుంటా. భవిష్యత్తులో మరిన్ని కలిపే అవకాశం ఉంది.
    3. అటుపై, అభ్యర్థి తన పాస్‌పోరర్ట్ సైజు ఫోటోను, సంతకాన్ని స్కాన్ చేసి .png ఫార్మాట్లో 140X110 pixel (not exceeding 40kB) తమవద్ద ఉంచుకుని, వాటిని అప్‌లోడ్ చెయ్యాలి.
  4. అంతటితో మీదరఖాస్తు నింపినట్లే+పంపినట్లే. నిజమే.పంపడం కూడా అయిపోయింది. అటుపై దరఖాస్తు పూర్తిపేజీ ప్రత్యక్షం అవుతుంది. అక్కడి వివరాలు సరిచూసుకుని ఒకప్రింటుతీసి మీదగ్గర పెట్టుకుంటే చాలు. ప్రస్తుతానికి పంపాల్సిన అవసరంలేదు.
  5. అక్నాలెడ్జిమెంట్ మీరు వ్యక్తిగతవివరాలలో నింపిన మైల్‌ఐడీకి వస్తుంది.
ఒక్కసారి సాంప్రదాయకపద్దతిని పోల్చిచూస్తే ఎన్నోసమస్యలకు పరిష్కారం లభిస్తుంది.
  1. అప్లికేషన్లు ఆన్‌లైన్లో ఉంటాయి. ఊరూరావాడవాడల్లో ఇంటర్నెట్‌కేఫ్‌లుంటున్న ఈరోజుల్లో మారుమూల గ్రామంలోని అభ్యర్థికి జిల్లాకేంద్రంలోని పోస్టాఫీసుకన్నా ఇదేదగ్గర.
  2. అప్లికేషన్లు అయిపోయాయి అన్నసమస్యలేదు. స్టాంపులకోసం ఝంఝాటంలేదు.
  3. నింపేప్పుడు ఏదైనా తప్పు జరిగితే సరిదిద్దుకునే అవకాశం ఒక్కసారైనా ఉంది. 
  4. దరఖాస్తును పొస్టుచెయ్యడం, గడువుకుముందే చేరిందోలేదో అన్న భయం ఉండదు.
  5. అక్నాలెడ్జిమెంట్ కొన్నిక్షణాల్లో వస్తుంది.
  6. ఖర్చు చూద్దాం-
    1. సాంప్రదాయకపద్దతిలో-  జిల్లాకేంద్రానికి చార్జీలు 50/- నుంచి 100/- (RTC ఈమద్యలో కన్నెర్ర చెయ్యకుంటే) + అప్లికేషను మామూలుగా అయితే 20/- గిరాకీ ఎక్కువగా ఉంటే 200/-+ జనరల్ అభ్యర్థులకు స్టాంప్ 100/-+ పోస్టలు చార్జీలు 30/-= 100/- నుంచి 380/-
    2. ఆన్‌లైన్‌లో- ఇంటర్నెట్టు సెంటరుకి 20/- + ఫీజు జనరల్ అభ్యర్థులకు 50/- + స్కానింగ్ (ఫోటో+ సంతకం) 15/- (కావాలంటే సెల్‌ఫోన్లోంచే తీసుకోవచ్చు) +  ప్రింటు (మనకోసమే) 3/- = 23/- నుంచి 88/-
ఇంజనీరింగ్ సర్వీసెస్ నోటిఫికేషన్‌లో మార్చి 3 వరకు సమయం ఉన్నప్పటికీ ఆన్‌లైన్ అప్లికేషన్ నింపేందుకు ఫిబ్రవరి22 11:59 pm వరకే అనుమతించారు.

    శుభవార్త 1

    UPSC యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్...దేశంలోకి ప్రవేటురంగం పూర్తిస్థాయిలో ప్రవేశించి అవకాశాలు కల్పించకముందు, జనాలు ప్రవేటూఉద్యోగాల గురించి ఆలోచించకముందు, ఉద్యోగం అంటే సాఫ్ట్వేరే అన్న మేనియా (మాస్‌హిస్టీరియా) రాకముందు ఇదొక కల్పవృక్షం. కామధేనువు. ఒయాసిస్సు. దేశంలోని ప్రతిష్టాత్మక సర్వీసుల్లోకి అత్యుత్తమ మానవవనరులను ఎంపిక చెయ్యడం, శిక్షణ నివ్వడం, అటుపై వారిపదవీవిరమణ వరకు పనితీరుని విశ్లేషించడం. ఇదీ కమీషన్ చేపట్టే ముఖ్యమైన కార్యక్రమాలు. వివిథసర్వీసులకు ప్రవేశపరీక్షల నోటీఫికేషన్లకు సంబంధించి  ప్రతిసంవత్సరం ఒకకాలెండరు వదుల్తారు. దాదాపూ ప్రతిసారీ ఇంజనీరింగ్ సర్వీసెస్ నోటిఫికేషన్తో మొదలై సివిల్ ప్రిలిమ్స్ తో ముగుస్తుంది. కాకపోతే ఈఏడాది సివిల్ ప్రిలిమ్స్ నోటిఫికేషన్న్ కొద్దిగా లేటయ్యిందట. కాబట్టి ఈఏడాదిమాత్రం ప్రిలిమ్స్ తో మొదలై ప్రిలిమ్స్ తో ముగుస్తుంది.

    ఐతే ఏమిటట? ఇక్కడ నాబోటీవాళ్ళకి అంటే -నోటిఫికేషన్ చూశాక ఓయాంగిల్లో కోటేసుకుని, ఫైల్ చేతిలోఉన్న ఐయేఎస్, ఇంకోయాంగిల్లో ఖాకీడ్రస్సు, మూడుసింహాలు, లాఠీతో ఐపీఎస్ ఊహించుకుని చివరికి "అరే!అప్పుడే టైం అయిపోయిందా? బెటర్ లక్ నెక్స్ట్ ఇయర్" అనుకుంటే పెద్దగా నొప్పి తెలీదుగానీ సంవత్సరాల తరబడి ఆప్షనల్స్, జనరల్ స్టడీస్ చదివేవాళ్లకి అంచలంచల మోక్షంలో అగచాట్లు తెలుస్తాయి.
    మొదట నోటిఫికేషన్- ఉద్యోగసమాచారంలో నోటిఫికేషన్ వేస్తాడు. మునుపు అదొక్కటే ఆధారం. అదేమి వింతో తెలీదుగానీ అన్నినెలలూ మనల్ని వెతుక్కుంటూ ఇంటికొచ్చి ఎంప్లాయ్మెంట్ న్యూస్ ఇచ్చే పోస్టాయన ఆవారమే కనిపించడు. పొరబాట్న ఆయన కనిపించినా చేతిలో మనపేపరుండదు. లోగుట్టు పెరుమాళ్లకైనా ఎరుకనా? ఆతర్వాత కమీషన్ వెబ్‌సైట్లో కూడా పెట్టడం మొదలెట్టారు.

    దరఖాస్తు దొరకడం- అసలీ దరఖాస్తు ఎలా ఉంటూంది? ఎక్కడ దొరుకుతుంది? ఎలానింపాలి,పంపాలి? ఇది అంతచిన్నకథకాదు. ఓచెంబుడునీళ్ళు తాగి, టాయిలెట్టుకెళ్ళి వచ్చి చదవండి.


    **********


    ఎలాఉంటుంది?- ఇది ఓఎమ్‌ఆర్ షీటు. "అబ్బో! ఇంతోటిదానికా? ఐదోతరగతి నవోదయ నుంచి అలవాటే" అనొచ్చు. అక్కడే మీరు ఏపీపీఎస్సీలో కాలేశారు. ఈషీటు ఒక్కప్రిలిమ్స్ కోసమేకాదు. ఇంజనీరింగ్ సర్వీసెస్, జియాలజిస్ట్, ఫారెస్ట్ సర్వీస్, డిఫెన్స్ సర్వీస్ వగైరావగైరాలకి ఒకేఫారం. అందులో కొన్నిడబ్బాలు ఉంటాయి. నీపరీక్ష దేనికో చూసుకుని దానిప్రకారం సున్నాలు చుట్టాలి. చూసేందుకు చాలాసులభంగా ఉన్నా చిన్నతప్పుతో మొత్తంతలకిందులయ్యే తంటాలు చాలాఉన్నాయి.
    ఎక్కడ దొరుకుతుంది- నోటిఫికేషన్లోనే అదిదొరికే పోస్టాఫీసుల వివరాలు ఇచ్చుంటారు. ఆపోస్టాఫీసుకెళ్ళి కొనుక్కొచ్చి నింపడం, పంపడం. ( మన అజ్ఞానం ఇక్కడే బయటపడేది.

    నింపడం+పంపడం- సంత్సరానికి డజను నోటిఫికేషన్లు వదిలే కమీషన్ ప్రతిసారీ విడిగా ఫారాలను పంపే ప్రహసనాన్ని భరించలేక అన్నిటికీ కలిపి ఒక ఉమ్మడి ఫారాన్ని తయారుచేసింది. ఆ ఓఎమ్‌ఆర్ షీటు A4 సైజులో రెండుపేజీలుంటుంది.
    మొదటిపేజీలో పరీక్ష వివరాలు, అభ్యర్థి వివరాలు, ఫోటో, స్టాంపు( దీనిగురించి కింద వివరంగా చెప్తా). రెండొపక్క పరీక్షకేంద్రం, అభర్థి ఘోష(ణ). ఈరెండొపేజీలోనే కొన్నిడబ్బాలుంటాయి. అందులో మనందేనికి అభ్యర్థిస్తున్నామో చూసుకుని, దానికి సంబంధించిన డబ్బానింపాలి. ఉదాహరణకు- సివిల్స్ వాళ్ళు 19, ఇంజనీరింగ్ సర్వీస్ వాళ్ళు20 వగైరావగైరా. దానికింద ఘోషణలో నోటిఫికేషన్ వివరాలు నింపి సంతకం చెయ్యాలి.

    ముందుపేజీలోని ముఖ్యమైన అంకం ఏమిటంటే ఒకస్టాంపును అంటించడం. అసలీస్టాంపెందుకు? ముందేచెప్పాగా. అన్నిపరీక్షలకు ఉమ్మడి దరఖాస్తు అని. మరి ఒక్కోపరీక్షకు ఒక్కోఫీజు కట్టాలి. అయితే షెడ్యూల్డ్ కులాలవారు, తెగలవారు, వికలాంగులు, (స్త్రీలుకూడా అనుకుంటా) ఈఫీజుకు మినహాంచారు. జనరల్ భ్యర్థులు ఫీజుకట్టాలి. అందుకే ఈస్టాంపు.

    స్టాంపంటే పోస్టలుస్టాంపుకాదు. అలాగనీ రెవిన్యూస్టాంపూకాదు. మరి ఏమిటది?అంటే.అదొక ప్రత్యేకమైన స్టాంపు. 'సెంట్రల్ రిక్రూట్‌మెంట్ ఫీ' అని అంటారు దాన్ని. జనరల్ అభ్యర్థులు వారు ఏపరీక్షకైతే నింపుతున్నారో దాన్ననుసరించి ఒకవిలువ నిర్థారిస్తారు. ఆవిలువకు సమానమైన స్టాంపును కొని, మొదటిపేజీలో దానికోసం నిర్ణయించిన స్థలంలో అంటించాలి. అంతేగా అంటే అంతేకాదు. ఇక్కడ కొన్ని నియమాలున్నాయి. ఆస్టాంపులు అన్ని పోస్టాఫీసుల్లోనూ ఉండవు. అవి దొరికేచోటికెళ్ళి కొనుక్కుని అంటించాలి. అంటించి పంపిస్తే సరిపోదబ్బాయ్. దాన్ని మళ్ళీ కాన్సిల్ చెయ్యించాలి. డబ్బులుపోసి కొనటమేమిటి? మళ్ళీ కాన్సిలింగ్ ఏమిటీ? అంటే దానికి మళ్ళీకథచెప్పాలి.

    ఇందాకేచెప్పాగా ఉమ్మడిఫారం అని. ఫారం ఒక్కటే. ప్రతిపరీక్షకి ఫీజు స్థిరం. మారదు. మరి నోటిఫికేషన్‌కి ముందె ఎవడైనాకొనేసి, నింపేసి, రెడీగా పెట్టుకుంటే? అది నియమాలకి విరుద్ధం. ఈదేశంలో నేరస్థుడు ఆంటిసిపేటరీబెయిల్ (అంటే నేనేదైనా తప్పుచేస్తానేమో అని ముందుగా బెయిల్ తెచ్చుకోవడం) తెచ్చుకోవచ్చుగానీ, అభ్యర్థి నోటిఫికేషన్‌కి ముందుగా అంటిసిపేటరీ అప్లికేషన్ వెయ్యకూడదు. దీనివల్ల కొన్నిసమస్యలు ఉన్నాయి. కాబట్టి మనం అప్లికేషన్ కొనుక్కొచ్చి, నింపి, స్టాంపు అంటించవచ్చు. కానీ దాన్నిరద్దు చెయ్యించడంమాత్రం నోటిఫికేషన్ పడ్దాకే చెయ్యాలి. అసలీ రద్దుచెయ్యడమేంటీ అని తలపట్టుకుంటున్నారా? ఏమీలేదు. మనం(అంటే మనంకాదు. అభ్యర్థి.) స్టాంపు‌ అంటించినస్థలం పైనే ఒకవలయం ఉంటూంది. దానిపైన పోస్టాఫీసువాళ్ళు ముద్రవేస్తారు. ఆముద్రలో తారీఖు నోటిఫికేషన్ తారీఖు తర్వాతదై ఉండాలి.

    ఆతర్వాత ఒక‌అక్నాలెడ్జిమెంట్ కార్డుముక్క. వీటన్నింటినీ నింపి, వాళ్ళిచ్చిన కవరులో పెట్టి, దానిపై నీచిరునామా రాసి( రాయల్సింది నీ చిరునామానే- ఫ్రం అడ్రస్లో. టూ అడ్రస్ వాళ్ళే అచ్చేసుంటారు) భారత తంతి తపాలాశాఖ వారిసేవలను ఉపయోగించుకుంటూ ( అలాకాక కొరియర్లో పంపితే దాన్ని 'బైహాండ్'గా పరిగణిస్తారు.) చివరితారీఖు సాయంత్రం ఐదులోగా చేరాలి. దీనికి కొన్నిమినహాయింపులున్నాయి. మారుమూలప్రాంతాలు (అంటే ప్రవీణ్ అన్నాయ్ ఉండే ఉత్తరాంధ్ర అడవులుకాదు)- అండమాన్, లక్షదీవులు, కాశ్మీరం మొదలైనవి. అక్కడీనుంచివచ్చే అభ్యర్థనలకు ఒకవారం మినహాయింపు ఉంది. అయితే అది పోస్టలుశాఖద్వారా పంపినవాటికే. కొరియర్లలో పంపితే ఈమినహాయింపు వర్తించదు.
    ఇలాపంపాక ముందు అక్నాలెడ్జిమెంటుకార్డు, తర్వాత హాల్‌టికెట్ వస్తుంది. అదీసంగతి.

    ఈకథంతా నేను రాసినంత, మీరుచదివినంత సులువైతే అంతకన్నా ఏంకావాలి? కానీ అలాగుండదే.
    నోటిఫికేషన్ కోసం గమనిస్తూఉండాలి. ఓస్థాయిలో ప్రిపేర్ అయ్యేవాళ్ళకి ఐడియా ఉంటూంది. ఈమద్యనే వెబ్‌సైట్లో పెడుతున్నారని ముందేచెప్పాగా.కాబట్టి ఇదిపరిష్కారం అయ్యింది.
    ఆనోటిఫికేషన్లో ఎక్కడెక్కడ దొరుకుతాయో జాబితా ఇచ్చుంటాడు. గిరాకీసీజన్లో ఈఫారం దొరకేకంటే రేషన్లో చక్కెర దొరకడం ఈజీ. అదీసంగతి. ఇకతేదీ దగ్గ్రరపడేకొద్దీ ఇరవైరూపాయలుండే ఫారం రెండొందలుకూడా దాటుతుంది. చాలాకొద్దిశాతం అభ్యర్థులు మాత్రమే నోటిఫికేషన్‌కిముందే తెచ్చిపెట్టుకుంటారు.(వీళ్ళు సుమతులు) ఇంకొందరు నోటిఫికేషన్ పడ్డాక గిరాకీపెరిగేలోగా తెచ్చుకునేస్తారు. (వీళ్ళు కాలమతులు) ఇకపోతే నాబ్యాచీ. చివరిక్షణందాకా మీనమేషాలు లెక్కపెట్టి లబోదిబోమంటారు. (మందమతులం)
    ఆతర్వాత స్టాంపులు- స్టాంపులూ అంతే. ఓపట్టాన దొరకవు. ఒకవేళ దొరికినా ఆపరీక్షకి సరిపడే డినామినేషన్ ఉండదు. ఆసమయంలో పోస్టాఫీసులో ముద్రకొట్టే బెంచీకి మనతలకొట్టుకోవాలనిపిస్తుంది.
    అన్నింటినీ మించినది- నింపడం+పంపడం+చేరడం. నింపడంఇందాకచెప్పానుగా. ఏమాత్రం తప్పుడబ్బాలో నింపినా వాళ్ళుచెత్తడబ్బాలోవేసేస్తారు.అయితే ఫారం చాలాసరళంగా ఉండడంతో, ఇక్కడ తప్పుకు అవకాశాలు తక్కువ. నింపేప్పుడు ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏపరీక్షకు నింపుతున్నాం, కేంద్రం కోడ్, ఘోషణలో నోటిఫికేషన్ వివరాలు. ఎక్కువమంది ఘోషనను నింపడం మర్చిపోతారు. సంతకంమాత్రం చేసి వదిలేస్తారు. ఇదికొద్దిగా గమనించుకోవాలి. ఇంకెక్కడైనా తప్పు జరిగితే ఎదుటివాళ్ళపై వెయ్యొచ్చు. నింపేప్పుడే తప్పైతే?

    నింపాక పంపడం.ఇదీదైవాధీనం.మనఊరునుంచి ముద్రెయ్యిమ్చుకుని డిల్లీ చేరేదాకా ఎన్నెన్నిమజిలీలో? ఒక్కొక్కచోటా ఇష్టదైవాన్ని స్మరించుకోవాలి. నువ్వెప్పుడు పంపినా చివరిరోజు సాయంత్రానికి ఇండియాగేటు పక్కనున్న ధోల్‌పూర్‌హౌస్ చేరాలి.
    ఇంతకీ ఏమిటీ శుభవార్త? అంటే ఈసంవత్సరం ఇంజనీరింగ్ సర్వీస్ నోటిఫికేషన్ వదిలారు అని తెలిసి చూస్తున్నా. అక్కడ సహజంగా కనిపించే upsc.gov.in తోబాటుగా మరొక యూఆరెల్ కనిపించింది. అదే http://upsconline.nic.in/ఇంతకీ విషయం ఏమిటయ్యా అంటే ఈసంవత్సరం నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు నింపొచ్చు. ఓహో!అలాగా అనుకున్నా.అసలు విషయం దాన్నిచూసినప్పుడూ తెలీలేదు. తర్వాతరోజు ఆఫీసులో లాల్జీవచ్చి "సాబ్!థోడాసా యూపీఎస్సీకా వెబ్సైట్ ఖులీయే. కామ్‌హై." అన్నాడు. 'ఏమిటిసంగతి' అంటే 'పాప ఏడ్చింది' అన్నాడు. 'సమఝ్‌కాలే' అన్నా. "బేటీకేలీయే ఈఎస్ నోటిఫికేషన్ దేఖ్నా సాబ్" అన్నాడు. సరే నొక్కాను. ఆయనకి వివరాలన్నీ చెప్పాక నోట్ చేసుకున్నాడు వెళ్ళిపోయాడు.

    ...సశేషం

    మోతీజిల్ 2

    మొదటిభాగం మోతీజిల్1

    ఏడోతరగతిలో మదర్‌థెరిస్సా అనేపాఠం ఉండేది. ఆపాఠం, అందులో మోతీజీల్ గురించిన ప్రశ్న కామన్ పరీక్షల్లో చాలాఇంపార్టెంట్. సుకుమార్ క్వశ్చన్ బాంకులోనూ, రాఘవేంద్రగోల్డెన్ గైడులోనూ చాలాముఖ్యం అని రాసున్నారు. అన్నట్టు ఇంకోవిషయం- రాఘవేంద్ర గైడు బీ.ఏ. చదివిన దర్శకేంద్రుడిదే అనుకునేవాడిని. అప్పట్లోనే మేజర్ చంద్రకాంత్ రిలీజయి ఆఅభిప్రాయానికి బాగాబలం చేకూర్చింది.


    ఇక అసలు విషయానికొస్తే, మోతీజిల్ అనేది కలకత్తాలోని మురికివాడ. ఆగ్నస్ థెరిసాగా సేవలు మొదలుపెట్టింది అక్కడినుంచే. ముందురోజు మోతీజిల్ గురించి చెప్పి నాకొక బలవంతుడైన పహిల్వాన్ కారక్టరు, ఇంకోడికి కుష్టురోగిపాత్ర, మరొకడు థెరిసాపాత్ర. అదీసీన్. తర్వాతరోజు ముఖ్యమైన ప్రశ్నకావడంతో వచ్చీరావడంతోనే పాఠంలోకి వెళ్ళిపోయాడు.
    కొంతసేపాగి "మోతీజిల్ పరిస్థితులు ఎలా ఉంటాయి? ఎవరెవరికి సమాథానాలు వచ్చో చేతులెత్తండి." అన్నాడు. నాకు ఎడమకన్ను కొట్టుకుంది. ఇదేదో రాబోయేకీడుకి ఇది పైలట్ అనుకొని చెయ్యెత్తకుండా గుట్టుగా కూర్చున్నా. అందరూ చేతులెత్తారు. అందులోంచి రాజేష్ గాడిని లేపాడు. చెప్పరా అన్నాడు.


    వాడు వెంటనే చేతులుకట్టేసుకుని బిర్రబిగుసుకుని నిలబడ్డాడు. " మోతీజిల్ కలకత్తాలోని ఒకమురికివాడ. అక్కడిప్రజలు ఎంతో అపరిశుభ్రంగా ఉండేవారు. (నాకర్థం అయిపోయింది ఇది రాఘవేంద్రలోది. సుకుమార్లొ అయితే మొదటిలైను వేరేగా ఉంటుంది.) అక్కడ సామాజిక పరిస్థితులు ఎంతో దుర్భరంగా ఉండేవి. (అయ్యోరుకి బీపీ జుయ్య్ మంటూ పెరిగిపోయింది.)
    "చీ! ఆపు." వాడి పిర్రమీద బెత్తంతో ఒక్కటిచ్చాడు. కట్టేసుకున్న చేతుల్లోంచి ఒకదాన్ని తీసి 'ఉస్సూ..ఆబ్బా..' అంటూ తడుముకుంటూ నిలబడ్డాడు.ఎక్కడినుంచి పుట్టుకొస్తార్రా.


    "అప్పజెప్పే బుద్దులూ మీరూనూ. అడక్కతిన్నా సిగ్గన్నాలేక. ఇలా అప్పజెప్పుకుంటూపోతే రేపు బస్టాండులో టాయిలెట్లు కడుక్కోనుతప్ప దేనికీపనికిరారు. 'కాకికి రెండుకాళ్ళుండును' అన్నదికూడా గైడుచూసే నేర్చుకుంటారా. రేపుపెళ్ళాయ్యాక ఆఫీసునుంచి వచ్చి "ఓసీభార్యామణీ! నేను కార్యాలయమునుమ్చి వచ్చుచుండగా మార్గమద్యమున శునకములు వెంటబడినవి. వాటిని తప్పించుకొనుటకు పురవీథులన్నింటినీ సంచరించి గృహమునకు చేరేసరికే ఈసమయమైనది. నాకు కొద్దిగా జలముతెమ్ము." అన్నావనుకో నీపెళ్లాం జలముకాదు చీపరకట్ట ఎత్తుకొస్తాది..."  ఇలాసాగిపోతూ ఉంది.

    ఎప్పుడైనా సారుచేతిలో దెబ్బలు తప్పిపోతే ఆనందంగా ఉంటుంది. అది లౌకికానందం. అదేదెబ్బలు మనఫ్రెండెవడైనా తింటే అప్పుడుకలిగే ఆనందం ఉందే అదే అలౌకికానందం. ఆక్షణంలో నేననుభవిస్తున్నది అదే. "హమ్మయ్య! నేనుచెయ్యెత్తలేదు అనుకున్నా." ఇలా ఆలోచిస్తూ ఉంటే ఉన్నట్టుండి నాపక్క తిరిగి నువ్వుచెప్పరా అన్నాడు. చెయ్యెత్తలేదన్న సంగతి నాకు తెలుసుగానీ ఆయనకి తెలీదు. ఇప్పుడావిషయాన్ని చర్చిస్తే ఏమవుతుందో నాకేకాదు మీకూ తెలుసు. పరిస్థితిని అర్థం చేసుకుని జవాబెలా చెప్పాలి అని ఆలోచించే దానికి ఓఅరనిముషం పట్టింది.


    చేతులుకట్టుకున్నా. " మోతీజిల్ అనే వీథి కలకత్తాలో ఉంది. అక్కడంతా పేదోళ్ళు. తినేదానికి మంచిఅన్నం దొరకదు.." ఇలా చెప్పుకుంటూపోతున్నా. ఆయననాకు దగ్గరగా వస్తున్నాడు. సగంబుర్ర మోతీజిల్ గురించి, మిగతాసగంబుర్ర ఇప్పుడు ఏదేవుణ్ణి వేడుకోవాలి? అయ్యప్పస్వామి? సీజన్‌కాదు. రాముడు? మొన్నఓసారి అడ్డుపడ్డాడు. శివుడు? వీరభద్రుడు?అమ్మో. విష్ణువు? గజేంద్రమోక్షంరాదే. సుబ్రహ్మణ్యస్వామి? నాపేరులో సగమే ఆయనది. కానీ సారుది మొత్తంపేరు అదే. కాబట్టి పెద్దగా సపోర్ట్ ఇవ్వడేమో? ఇలా సాగుతుంది మల్టీటాస్కింగ్. నెమ్మదిగా పక్కకొచ్చేశాడు. బెత్తంకూడా అవసరంలేదు చెయ్యెత్తాడంటే చెంప పేళ్‌మని పేలిపోతుంది. నెమ్మదిగా చెయ్యెత్తి భుజంపైన వేశాడు. ఎంతచెప్పానో? ఎంవదిలేశానో? తెలీదు. ఆయనపక్క తిరిగిచూశా. కొంచెం ప్రశాంతంగానే ఉన్నాడు. హమ్మయ్య అనుకుని ఎలాగోలా పూర్తిచేశా.


    అలా నాపక్క చూసి పేళ్‌మని ఓచెంపపై పీకాడు. "నీకు జవాబు తెలిసినా ఇందాక చెయ్యెందుకు ఎత్తలేదు?" అప్పుడర్థమైంది నాకు ఎడమకన్ను ఎందుకు కొట్టుకుందో. కూర్చో అని ఓఅరుపు అరిచి మొదలుపెట్టాడు.

    " భాష అనేది రెండురకాలు. ఒకటి మాట్లాడేభాష. ఇంకోటి రాసేభాష. నేను జవాబు అడిగినప్పుడు మీకేమి తెలుసోదాన్ని మీకొచ్చినమాటల్లోనే చెప్పాలి. రాసేభాషవేరే. ఎందుకంటే దాన్నిచదివేవాడూ నీకెదురుగా ఉండడు. అతనికి నువ్వు తెలిసుండొచ్చు. తెలియకపోవచ్చు. నువ్వుచెప్పలనుకున్న విషయంలో ఏమాత్రం గందరగోళం ఉన్నా చాలాఇబ్బందులొస్తాయి. మాట్లాడేటప్పుడు ప్రశ్న అర్థంకాకపోతే మరొకసారి అడగొచ్చు. రాసేప్పుడు ఆవకాశం ఉండదు. ఏమాత్రం తప్పుగా అర్థంచేసుకున్నా పరీక్షల్లో అయితే మార్కులుపోతాయి. బయటైతే ఇంకాచాలా ఇబ్బందులొస్తాయి. ఎప్పుడు ఏభాషను ఉపయోగించాలో తెలుసుకొని మసలాలి."


    ఆతర్వాత చాలాసార్లు ఆయనమాట నిజమేమనిపించింది. బ్లాగు మొదలెట్టాక ఆమాటలు నిత్యసత్యం అన్న సంగతి తెలిసొచ్చింది. చాలాసార్లు ముందు కొంతరాయడం ఆపై ఇలారాస్తే మీరు వేరేరకంగా అర్థంచేసుకుంటే అనుకొని మార్చడం. చాలాసార్లు ఇక్కడ చోటుచేసుకున్న వివాదాలకు మూలం అదే అనుకుంటా. ఇప్పటిదాకా **లేఖలు రాసే అవసరం రాలేదుకాబట్టి సరిపోయింది. ఆఅవసరం పడితే? అమ్మో. తలుచుకుంటేనే భయమేస్తుంది.

    పక్కన జారుడుబద్దపైన ఎలచ్చన్లు నిర్వహిస్తున్నాం. పాఠకులు మీవిలువైన ఓటుహక్కును 'వావ్'పైన గుద్ది ఆనందింపచెయ్య ప్రార్థన

    మోతీజిల్ 1

    మాఊరిలో మొత్తం ఏడుగుళ్ళు ఆరు బళ్ళు ఉన్నాయి. గుళ్ళలో నాలుగు వైష్ణవం, రెండు అమ్మవార్లు మరియు ఒకటి శివాలయం. బళ్ళలో ఐదు ప్రాథమిక( మూడు పరిషత్, రెండు ఎయిడెడ్), ఒక ప్రాథమికోన్నత మరియు ఒక ఉన్నతపాఠశాల. గుళ్ళు, మిగతా బళ్ల సంగతి తర్వాత మాట్లాడుకుందాం (సవివరంగా). ఉన్నతపాఠశాల విషయానికొస్తే అది 1932 లో ప్రారంభించారు. దానిపేరు SALCEF HighSchool (సౌత్ ఆంధ్రా లూథరిన్ చర్చ్ ఎల్లసిరి ఫిర్కా హైస్కూలు). దానికాపేరు ఎందుకొచ్చింది అన్న సంగతికూడా మళ్ళీమాట్లాడుకుందాం. దీనిపేరు ఈమద్యన మార్చారు. NBKRSALCEF High School (నేదురుమల్లి బాలకృష్ణారెడ్డి సౌత్ ఆంధ్రా లూథరిన్ చర్చ్ ఎల్లసిరి ఫిర్కాహైస్కూలు). అసలాపేరు ఎందుకుమారిందన్నదికూడా ఇప్పుడూ చెప్పేంత చిన్నదికాదు. కాబట్టి అదికూడా మళ్ళీనే. అదృష్టం బావుండి ఆరోతరగతిలో రాగింగ్ లేదుకాబట్టి సరిపోయిందికానీ లేకుంటే జూనియర్లను ఒక్కోడు నూటెమిదిసార్లు స్కూలుపేరు రాసుకురాండ్రా అని సీనియర్లు చెప్పారనుకో ఇకఅంతే బడిబాట మూసుకుపోతుంది.

    ఆబడి ప్రారంభించి ఇప్పటికి దాదాపు డెబ్బైఎనిమిదేళ్ళు. ఇన్నేళ్ళ ఆస్కూలు చరిత్రలో ఎన్నో ఉత్తన్నపతనాలు, ఎందరో హెడ్మాస్తర్లు, డ్రిల్ మాస్టర్లు,పిల్లల్లో కొందరు బాలమేథావులు, మరెందరో గజినీలు. ఒకానొక రోజుల్లో స్కూలుబలం వందకుపైన పంతుళ్లు పదహారొందలమంది పిల్లలు. చెప్పాగా చరిత్రచాలా పెద్దది అని. ఒకటపాలో సరిపోయేదికాదు.

    ఒకపేరుంది. ఆస్కూల్లో చదివినవాళ్లకి, పనిచేసినవాళ్ళకి ఆపేరుచెప్పడంతోనే అప్రయత్నంగా చిరునవ్వు ప్రత్యక్షమయ్యి ఆపై వాళ్లవాళ్ల అనుభవాలననుసరించి మిగిలిన హావభావాలు వ్యక్తమవుతాయి. ఆపేరు పీ.వీ. సుబ్రహ్మణ్యం. ఆస్కూల్లో దాదాపు ముప్పైమూడేళ్ళు పనిచేసిన తెలుగుపండితుడు. తెలుగుపండితుడు అనడంతోనే ఆహార్యాన్ని ఊహించేసుకోకండి ఆయన బ్రహ్మానందంలాకాక సుందరకాండలో వెంకటేష్‌బాబులా పాంటుషర్టు వేసుకునేవాడు. సుందరకాండ పేరువిని అనవసరమైనవి ఊహించుకోకండి. కళ్ళుపోతాయ్.

    ఆయనకి మంగళవారం భయంకరమైన సెంటిమెంట్. అంటే ఏముఖ్యమైనపనైనా మంగళవారం మొదలుపెడతారన్నమాట. అలా ఆయన ఉద్యోగజీవితాన్ని కూడా మంగళవారమే మొదలుపెట్టాడు.ఆయనకి ఐతే మంగళవారం సెంటిమెంటు అచ్చొచ్చింది, కానీ అందరికీకాదుగా. దానిఫలితం అప్పటిదాకా ఉమ్మడిగా బాలబాలికల్తో కళకళలాడిన బడి ఆవరణం ఒక్కసారిగా ఎడారిగా మారిపోయింది. అంటే అర్థం అయ్యిందిగా. ఆయనచేరిన రోజే అమ్మాయిలకు విడిగా హైస్కూలు మొదలుపెట్టారు. హైస్కూలుజీవితంపై ఎన్నోఆశలతో చేరినవాళ్ళకి శరాఘాతంగా మారిందీ పరిణామం. ఇక ఆరోజునుంచి సుబ్రహ్మణ్యంగారి ఆగ్రహానుగ్రహాలకు హెడ్మాష్టరునుంచి ఆరోతరగతి పిల్లాడిదాకా ఉక్కిరిబిక్కిరవడం నిర్విఘ్నంగా ముప్పైమూడేళ్లపాటు జరిగింది.

    నేను చిన్నబడిలో ఉన్నప్పుడే ఆయన తెలుసు. తాతదగ్గరికి పంచాంగంకోసం వచ్చేవాడు. జయచంద్ అని నాఫ్రెండొకడు ఆయన దగ్గరికి నవోదయకోచింగ్ కోసంవెళ్ళేవాడు. వాళ్ళనాన్నకి ఆసారంటే బాగాగురి. అదీగాక ఆయనకి ఇంకొక అలవాటుంది. సాయంత్రం బడి వదిలాక అన్నోళ్ళంతా ఆయనతోపాటు గుంపుగా వచ్చేవాళ్ళు. స్కూలునుంచి ఇంటిదాకా ఈపిల్లగాంగుతో పిచ్చాపాటీ మాట్లాడుతూ వచ్చేవాడు.అది నాకు కొంచెంవింతగా తోచేది.

    ఐదోతరగతిదాకా ఆయన తెలుసు కానీ, ఆయనగురించి తెలిసిందిమాత్రం ఆరులో చేరాకే. బాగాచదివేవాళ్ళు, అంటే పరిక్షల్లోబాగా మార్కులొచ్చేవాళ్ళు కాదు పాఠాన్ని చదవరా అంటే పుస్తకం చేతులోపెట్టుకుని గట్టిగా క్లాసంతా వినిపించేలా చదివేవాళ్ళు, అంటె ఆయనకి ఇష్టం. బాగారాసేవాళ్ళు అంటేమాత్రం ప్రాణం. ఆయన పాఠం చెప్పే విథానం ఎలా అంటే- ఒకడు పాఠాన్ని చదువుతూ ఉండాలి, అప్పుడు చదువుతున్న భాగంలో ఎన్నిపాత్రలుంటాయో అంతమంది నిలబడి అంటే అదొకనాటకంలా అన్నమాట, ఒకడు ముఖ్యమైన పదాల్ని బోర్డుపైన రాయాలి. ఆరో తరగతిలో మాత్రం బోర్డుపైన ఆయనే రాస్తాడు, మిగతాక్లాసుల్లో కొన్నిఆయన-మరికొన్ని పిల్లలు. నోట్సివ్వటం వంటివి ఎప్పుడూ ఉండదు ఒక్క పదోతరగతికి తప్ప. పిరిడుగంట కొట్టేవరకు నిలబడే ఉండాలి వీళ్ళంతా. ఇక్కడ సమస్య నిలబడడంకాదు. ఆయనకి బీపీ కొంచెం అంటే కొంచెమే ఎక్కువ. ఆక్షణంలో అతిసమీపంలోని విద్యార్థి వీపుపై కింగ్‌ఫిషర్ విమానం హారను కొట్టేలా అల్గరిథం ఒకటి ఉంటుంది. ఆప్రోగ్రాం పూర్తిగా ఆటొమేటేడ్.

    ఆరోతరగతిలో మనపైన మాంచీ ఇదన్నమాట. దాదాపూ రోజూ చదివేపని నాదే. అప్పట్లో జగ్గయ్య అని పిలిచేవాళ్ళు నన్ను. ఇదిబాగానే ఉండేదికానీ అప్పుడప్పుడు వేరేవాళ్ళు చదివేటప్పుడు ఏదోఒకపాత్ర అందులోనూ ఎక్కువగా హీరోయిన్ పాత్ర ఇచ్చేవాడు. కొద్దికొద్దిగా ఊహతెలిసొచ్చే వయసులో ఆడపాత్రకి నిలబడాలి అంటె తెగసిగ్గుగా ఉండేది. మనకంటే తెల్లగా ఉండే అశొగ్గాడు క్లాసులోకి వచ్చింది దసరా తర్వాత. ఆతర్వాత నాకీభారం తగ్గింది.

    ఆఇమేజీతో ఆసంవత్సరం అంతా గండపెండేరాలు, గజారోహణలు అబ్బో. ఇక ఏడొతరగతికొచ్చే సరికే బోర్డుపైన రాయాలి. అక్కడే మరి తేడావచ్చేది. నాబ్రహ్మరాత గురించి విడిగా ఓటపా పెడతా. నాకుతెలిసీ ఈవిషయంలో బ్లాగ్మిత్రులలో కొంతమంది తోడున్నారు నెమలికన్ను మురళిగారు, సునీతగారు వగైరా వగైరా. మొదటిరోజు ఓంప్రదంగా ఆయనే రాశారు. హమ్మయ్య తొలిరోజుగండం గడిచింది అనుకున్నా. మొత్తానికి మొదటి రెండుమూడువారాలు అలానే బిక్కుబిక్కుమంటూ గడిపా. మొత్తానికి ఆపిలుపు వచ్చింది. "తనతండ్రియైన వాయుదేవునకు సూర్యచంద్రబ్రహ్మాదిదేవులకు ...వందనములిడే పూర్వాభిముఖుడై.." అని సుందరకాండ చదువుకుని, సర్వమతప్రార్థనలు జరిపుకొని చాక్‌పీసు పట్టుకున్నా. తీరా రాసేసమయానికి ఇటివ్వు అని ఆయనే రాశాడు. "హమ్మయ్య! దేవుడున్నాడు. ఇంట్లో మనంపెట్టే నైవేద్యాలు,అమ్మమ్మ వారంవారంవండే గుగ్గిళ్ళు తిని ఇలాంటి సమయాల్లో మహిమలు చూపిస్తాడు." అనుకొని వచ్చికూర్చున్నా.బహుశా సార్ల దగ్గర దెబ్బలుతినే సమయంలోనే చాలామంది విపరీతమైన ఆస్తికులుగానో, కరడుకట్టిన నాస్తికులుగానో మారుతారనుకుంటా.

    ఇలా ఎన్నిరోజులు సాగితాయి. ఒకటారెండా? ఒకసంవత్సరం. అంటే సుమారు రెండొందలపని దినాలు. అందులో నూటయాభై తెలుగుపిరియడ్లు. ఒకానొక సమయంలో చిక్కిపోయా. మనరాత చూసి కళ్ళుతిరిగిపోయాయి. మీకొక అనుమానం రావొచ్చు. ఆరోతరగతిలోనే చేతిరాత చూసుంటాడుగా అని?

    నిజానికి ఆరోతరగతి ఆయన క్లాసుకాదు.మాకు ఆరోతరగతిలో తెలుగుకు సారులేడు. టైంటేబుల్లో లెక్కలమేడం మాకు తెలుగుకూడా చెప్పాలి. కానీ ఆమెకి క్లాసులెక్కువవడంతో కర్టసీమీద ఈయనే తీసుకునేవాడూ. పరీక్షలుమాత్రం ఆవిడే చూసుకునేది. లెక్కల్లో నాపైనఉన్న అభిప్రాయం తెలుగులో చేతిరాతను కప్పేసింది. అలా మొదటిసారి బోర్డుపైన 'నా'రాతని చూసి ఆయన బీపీ శిఖరానికెళ్ళి "శృతిశిఖర సంచారా.." అనిపాడింది. ఇక్కడా దైవం మనపక్షానే. ఆసమయంలో ఆస్తికుడనైన నేను అయనకు దూరంగా ఉండడం, ఆదెబ్బలుతిని మరొకడు నాస్తికుడుగా మారిపోవడం క్షణకాలంలో జరిగిపోయాయి.

    ఈహఠాత్పరిణామానికి ఆయనహృదయం ముక్కలైంది. నమ్మబుద్ధిగాక నానోట్సునడిగాడు. చూశాడు. బోర్డుపైన రాతే కొద్దిగా నయం అనుకున్నాడు. ఒక్కసారిగా నాప్రతిష్టకి గ్రహణం పట్టింది. నేను చదివేప్పుడు పరిస్థితి అదుపులోనే ఉంటుందిగానీ ఎక్కడైనా రాయాల్సొచ్చినప్పుడు మాత్రం ప్రాథమికహక్కులు పూర్తిగా కాలరాచబడేవి. సైనికచర్యలు చేపట్టేవారు.

    కొంతకాలానికి కొట్టడం ఆయన బాగాతగ్గించేశాడు. "ఈమద్యన అయ్యోరు పెద్దగా కొట్టట్లేదన్నా" అని ఎనిమిదోతర్గతివాళ్ళతో అంటే దానికి వాళ్ళు- "మాకూ అలానే అనిపించిందిరా. ఆయనేం తగ్గించలేదు. మనమే అలవాటుపడిపోయాం అని తర్వాత అర్థం అయ్యింది." అని సెలవిచ్చారు. అదీ అనుభవం అంటే. ఎంతైనా సీనియర్లు సీనియర్లే. మనకి తట్టనిసూక్ష్మాలు వాళ్ళు పట్టేస్తారు.


    మోతీజిల్ 2