సాలగ్రామ భాండాగారం 'గండకి'

విష్ణుపాదాల వద్ద జననంతో గంగకి పవిత్రత దక్కితే అవిష్ణుమూర్తినే తనలో నింపుకుని, తనఒడ్డున ఆదికావ్యానికి పురుడుపోసి పునీతమయిన నది గండకి.

హిమాలయాల్లోని నేపాల్-టిబెట్ సరిహద్దుల్లో ముస్తాంగ్ వద్ద సముద్రమట్టానికి 3900m ఎత్తులో రెండు సెలయేళ్ళ కలయికతో జన్మించిన తర్వాత సోనేపూర్ వద్ద గంగలో కలిసేవరకూ ప్రతిమలుపులో ఓనదితో స్నేహం, కొత్తస్నేహం మొదలైన ప్రతిసారీ కొత్తపేరు. ఇదీ గండకీనది గమనం.

ఓంనమఃశివాయ సీరియల్ చూసిన వాళ్లందరికీ బృందాదేవికథ గుర్తుండే ఉంటుంది. అసురరాజు నేమికి కుమార్తెగా జన్మించిన లక్ష్మీదేవి అంశ ఈమె. జలంధరుని వివాహమాడి పాతివ్రత్య ప్రమాణాలను తు.చ.తప్పక పాటించేది. జలంధరుడు బ్రహ్మవరంతో గర్వితుడై ముల్లోకాలను పీడించుకుతినడం మొదలుపెడతాడు. బృంద పాతివ్రత్యంలోనే జలంధరుని ప్రాణం ఉంటుంది. అతని దారుణాలు సహించలేని రుద్రుడు అతనితో యుద్ధానికి దిగుతాడు. అది నిజానికి పార్వతీదేవి పాతివ్రత్యానికి, బృంద పాతివ్రత్యానికి మద్య పోరాటం. జలంధరుడు తనుగెలవాలంటే గిరితనయ పాతివ్రత్యాన్ని చెడగొట్టడం ఒక్కటే మార్గమని కొన్నిదుశ్చర్యయలకు పాల్పడుతాడు. అది సహించలేని ఆమె విష్ణువును శరణువేడగా ఆయన అభయమిచ్చి "అతను తప్పుచేశాడు గనుక యుద్ధధర్మాన్ని అనుసరించి మనకు ఆస్కారమిచ్చాడు." అని చెప్పి మాయారూపంలో బృంద దగ్గరకు వెళ్ళి పాతివ్రత్యాన్ని చెడగొట్టడంతో జలంధరుడు అంతమవుతాడు. తనభార్య లక్ష్మీఅంశకు తనద్వారా పాతివ్రత్యం పోవడమేమిటో అంతా విష్ణుమాయ. ఆపై బృందకు నిజం తెలియడంతో పాషాణం కమ్మని శపిస్తుంది. బృంద గండకీనదిగా, ఆమె శిరోజాలు తులసిగా రూపాంతరం చెందాయి. ఆమె శాపాన్ననుసరించి విష్ణుమూర్తి సాలగ్రామరూపంలో పాషాణంగానూ, రావిచెట్టులో అశ్వత్థనారాయణుడిగానూ, కృష్ణతులసిగానూ, దర్భగానూ నివశిస్తున్నాడు

ఇక ప్రస్తుత భౌగోళికాంశాలను ట్టి ఆనది ప్రవాహం-

ముస్తాంగ్ వద్ద నుప్‌చ్చు-షర్‌చ్చు అనే నదులు కలవడంతో ముస్తాంగ్‌ఖోలా అనేపేరుతో ఈనది పుడుతుంది. అక్కడినుంచి వాయువ్యదిశగా ప్రవహించి కగ్బేణి వద్ద ముక్తిథామంనుంచి వచ్చే కక్‌ఖోలాను కలడంద్వారా కాలిగండకిగా పేరుమార్చుకుంటుంది.

అక్కడినుంచి దక్షిణదిశగా ప్రవహించి ధవళగిరి-అన్నపూర్ణ శిఖరాలను దాటుతుంది. ఈరెండుశిఖరాలద్యనున్న ద్రోణి ప్రపంచంలోకెల్లా అత్యంత లోతైనది. శిఖరాలకు , నది అడుగుకు మద్యనున్న వ్యత్యాసం దాదాపూ ఆరువేలమీటర్లు.
ఇక్కడినుంచి అడుగడుగునా కొత్తస్నేహాలు కలిసినప్పుడు పలకరింపులు, కొండలు అడ్డొచ్చి పాయలుగా చీలినపుడు నిట్టూర్పులు. గళేశ్వర్ వద్ద రహుత్‌ఖోలా, బేణీవద్ద మ్యాగ్దిఖోలా, కుష్మవద్ద మోడిఖోలా, రుద్రబేణివద్ద బడిగాద్ అలాఅలా.


ఆపై తూర్పుకి తనదిశను మళ్ళించి మహాభారత పర్వతశ్రేణులకు సమాంతరంగా కొంతదూరం వెళ్తుంది. ఆపర్వతాల కనుమల్లోంచి దక్షిణంగా ఉరికి దేవఘాట్ వద్ద తనప్రియసఖి త్రిశూలిని కలుస్తుంది. ఇక్కడ నారాయణిగా మళ్లీ పేరుమారిపోతుంది. అందరిలోకి తనకు ప్రియమైనవి ఏడునదులు. అందువల్ల సప్తగండకిగా కూడా పిలుస్తారు.
ఆపై హిమాలయ పర్వతపాదంగా భావించే శివాలిక్‌పర్వతాలగుండా భారతదేశంలోకి ప్రవేశిస్తుంది. ఉత్తరప్రదేశ్-బీహార్ సరిహద్దుల్లోని పచ్నద్, సోన్‌ నదులతో కలిసే త్రివేణి అనేప్రాంతంవద్ద మనదేశంలోకి ప్రవేశించడం ద్వారా గండకిగా పేరు మార్చుకుంటుంది. హిమాలయాల్లోంచి తనతోడు తీసుకొచ్చిన ఒండ్రును ఇక్కడ జారవిడవడంద్వారా అత్యంతసారవంతమైన భూములు ఏర్పడ్దాయి. బీహార్లోని చాంపరన్, సారంగ్, ముజఫర్‌పూర్ జిల్లాలద్వారా ప్రవహించి పాట్నా సమీపంలోని సోనేపూర్ వద్ద గంగతో సంగమిస్తుంది.

హిమాలయాల్లోని వెయ్యికిపైగా హిమానీనదాల్లోచి, ఇతరసరస్సుల్లోంచి లభించేనీటితో ఈనది ప్రవహిస్తుంది. ప్రవాహమంతా అత్యంతవాలైన పర్వతసానువుల్లోంచి కావడంతో హోరున ఉరకల పరుగులతో సాగుతుంది. అందువల్ల ఈనది వర్తక-వాణిజ్యాలకుగానీ, జలరవాణాకుగానీ పెద్దగా సహకరించదు. ఈరకమైన ప్రవాహం జలవిద్యుత్తుకు ఎంతో అనుకూలమైనది. అయినప్పటికీ మహాభారతశ్రేణుల్లోని ఒకప్రాజెక్టుతప్ప పూర్తిస్థాయిలో ఈనదిని ఉపయోగించుకునే దిశగా ప్రణాళికలు చెయ్యలేదు. మొత్తం 21000MW విద్యుదుత్పత్తికి అవకాశం ఉండగా ఇప్పటివరకు నెలకొల్పింది కేవలం 600MW. బహుశా నేపాల్ ఆర్థికస్ఠితి అందుకు కారణం అయ్యుండొచ్చు. అంతర్జాతీయ నదీజలాల ఒప్పందాలను అనుసరిమ్చి భారత్- నేపాల్ ప్రభుత్వాలు కొన్ని ఉమ్మడిప్రణాళికలు రూపొందించాయి.

నదుల అనుసంధానం ప్రాజెక్టులో ఈనది ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. గంగ-బ్రహ్మపుత్ర్రనదుల మద్యభాగంలోని నదులను కలిపేప్రక్రియలొ మొదట కోసినదిని గండకీనదికి అనుసంధానం చెయ్యడం, ఆపై గండకీనదిని భారతదేశంలో ప్రవేశించేచోట బారేజిని నిర్మించి ప్రస్తుతం గంగతోకలిసే చోటుకు ఎగువన ఉత్తరప్రదేశ్లో కలిసేలా ఏర్పాటుచెయ్యలని ప్రణాళికలు చేశారు.

గండకీ ప్రవహించే హిమాలయప్రాంతం ఉపఖండామంతా విస్తరించి ఉన్నభారత టెక్టోనిక్ ప్లేటుకు, మిగతా ఆసియా మరియు యూరోపులో విస్తరించి ఉన్న యురేసియాప్లేటుకు మద్యన ఉంటుంది. వీటి కదలికల మూలంగా ఇక్కడి భూమిపొరల్లో విపరీతమైన ఒత్తిడి ఉంటుంది. ఆఒత్తిడే హిమాలయాలు ఉద్భవించేందుకు దోహదపడ్డాయి. అందువల్ల భూస్థిరత్వం తక్కువ. అన్నపూర్ణ-ధవళగిరి మద్యన ఉన్న అత్యంతలోతైన అగాధానికి కారణంకూడా అదే. ఒత్తిడివల్ల హిమాలయాలు పెరిగినప్పటికీ వాటిపొరలు ధృడంగా లేకపోవడంతో నదిప్రవాహానికి కోసుకుపోయి అగాధాలు ఏర్పడ్డాయి. (ఒకచిన్న ఇసుకగుట్టను చేసి, దానిపైనుంచి నీటిని పోస్తే నీరు ప్రవహించే మార్గంలో ఇసుకంతా కోసుకుపోయి దారులేర్పడతాయి. అదేవిధంగా) అస్థిరమైన భూగర్భం, ప్రవాహవేగాన్ని తట్టుకునేందుకు కావల్సినంత దృడత్వంలేని పైపొరలవల్ల నదీగమనం విపరీతమైన మార్పులకు గురవుతూ వచ్చింది. గండకీమార్గం దాదాపూ ఎనభైకిలోమీటర్లు తూర్పుదిశలో జరిగింది.


ఈనదిలో దొరికే సాలగ్రామశిలలు అత్యంత పవిత్రమైనవి. వజ్రకీటమనే జీవి తనపంటితో తొలుస్తూ అందులోచేరి నివశిస్తుంది. ఆక్రమంలో వాటిపై శంకుచక్రాలు ఏర్పడుతాయి. ఈశిలలు నిజానికి సముద్రం అడుగున ఉంటాయి. మరి అంతెత్తున ఉన్న ముక్తిథామానికి ఎలా చేరుకున్నాయంటే- హిమాలయాలు ఏర్పడకముందే ఈశిలలు(అమ్మోనైట్ శిలలు) ఏర్పడ్డాయి. అప్పట్లో సముద్రమట్టానికన్నా లోతుగా ఉండేది ఈప్రాంతం. హిమాలయాలు ఎదగడంతో వాటితోపాటు ఇవీకొండెక్కాయి. ఈనది, సాలగ్రామాలు ఎంతపురాతనమో దాన్నిబట్టి అంచనావేసుకోవచ్చు. సాలగ్రామశిలలను హిందువులేగాక బౌద్ధులు సైతం పవిత్రమైనవిగా భావిస్తారు. వాళ్ళు చుమిగ్గ్యస్త (అంటే నూరుతీర్థాలు కలది అని అర్థం) అని పిలుస్తారు. ముక్తిధామం కేవలం హిందువులకేకాక బౌద్ధులకూ అత్యంతపవిత్రమైనది.

ఈనది ఒడ్డునే వాల్మీకిముని ఆశ్రమం ఉంది. ఆయన ఇక్కడే రామాయణాన్ని రచింఛాడని నమ్మకం. (తెలుగువాళ్ళు అక్కడికెళ్తే "ఇది మనఆశ్రమము ఇచట నీవు వశింపుము లోకపావనీ.." అని నాగయ్య శైలిలో పాడుకోవచ్చు.) చితావనం అనేప్రాంతంలో వన్యప్రాణి సంరక్షణకేంద్రం ఉంది. ఆర్యులు చాలాకాలం గండకీనదిని దాటి అవతలకు పోలేకపొయ్యేవాళ్ళు. ఆప్రవాహ ఉదృతికి తట్టుకుని అవతలకు చేరాలంటే అగ్నిని ఆవాహనం చేసుకోవడమే మార్గమని తలచి ఈప్రాంతాన్ని అగ్నికి సమర్పించారట. ఇవేగాక అనేక పర్యాటకస్థలాలు, వనాలు, పుణ్యక్షేత్రాలతొ ఈనది పరీవాహక ప్రాంతమంతా జీవంనింపుకుని ఉంటుంది. అనేకసాహసక్రీడలకు ఇది మంచిప్రదేశం.

విష్ణుమూర్తినే తనలో దాచుకున్న గండకి చివరకు ఆవిష్ణు పాదాలవద్ద పుట్టిన గంగలో మమేకమవడం విష్ణుమాయగాక ఇంకేమిటి?

ధనుర్మాసం సందర్భంగా ఈనది గురించి నాకు తెలిసిన విషయాలు రాశాను. ఇందులో తప్పులున్న తెలుపగలరు.
ఈరోజు మాఇంట్లో రెండు పండగలు. ఒకటి ధనుర్మాసం ఆరంభం. రెండు మాచెల్లి పుట్టినరోజు. పెళ్లయ్యాక మాబావ గరుడవాహనమెక్కించుకుని అమెరికాకి వెళ్ళడంతో ఇక్కడనుంచే పుట్టినరోజు జేజేలు బుజ్జిపాపాయి అని పాడేశా స్కైపులో. ఈటపా మాచెల్లి (మామిడిపూడి) ఉడాలి లక్ష్మిస్రవంతి కోసం.

7 comments:

 1. మీ పోస్ట్ బావుంది. పాతివ్రత్యం కథలు అలాగే గందరగోళం గా వుంటాయి.వాటిని పక్కన పెడితే మీరు గండకి గురించి వివరం గా నదీ ప్రవాహం గుర్తులతో సహా ఇచ్చాక ఇక చెప్పేదేముంది? అన్నింటి కంటే నాకు నచ్చింది మీ చెల్లికి మీరు పుట్టినరోజు బహుమతి గా ఈ టపా ఇవ్వడం. అబ్బో! ఈ లోకంలో ఎంత తెలివిగల అన్నలు వున్నారో కదా...మీ చెల్లికి పుట్టినరోజు శుభాకాంక్షాలు.

  ReplyDelete
 2. చక్కటి పోస్ట్ .సమయోచితంగా ఉంది . మీ చెల్లెలికి మా శుభాకాంక్షలు కూడా అందజేయండి.

  ReplyDelete
 3. Convey my birthday wishes to Sravanti.
  why dont you divide your paragraphs..? It gives a good look.

  ReplyDelete
 4. excellent of your final lines .you compare your sister with srimahalakshmi. may god bless her

  ReplyDelete
 5. చాలా బాగుంది.... కొనసాగించు,ఇలానే...!!

  ReplyDelete
 6. @ కల్పనరెంటాల: నాతెలివికి జనాలు తరచూ జుట్టుపీక్కుంటూ ఉంటారు. ఇక్కడ తపాలుచదివేవాళ్లకి ఆసంగతి తెలీదులెండి. ధన్యవాదాలు.
  @ దుర్గేశ్వర: తప్పకుండా అందచేస్తాను. ధన్యవాదాలు
  @ తృష్ణ: మీరు చెప్పిందినిజమే. రాత్రి పన్నెండుకు మొదలుపెట్టి పూర్తయ్యేసరికే రెండయ్యింది. అందుకే కొన్నిమార్పులు చెయ్యాలనుకున్నా కుదర్లేదు.
  @ రమేష్: ధన్యవాదాలు.
  @ శివన్న: తప్పకుండా. నావంతుగా ప్రయత్నిస్తా.
  @ గణేష్: మీఅంచనాలను చేరుకునేందుకు ప్రయత్నిస్తా. ధన్యవాదాలు.

  ReplyDelete