మేరునగ తప్పిదం- 1. టిబెట్ వివాదం

ప్రంపంచంలో తలెత్తే ప్రతిఒక్క వివాదం వెనుకా ఒక చరిత్ర ఉన్నట్టే టిబెట్ వివాదానికీ ఒకచరిత్ర నిజానికీ పెద్ద చరిత్రే ఉంది. బౌద్ధామారాలకి నెలవైన టిబెట్ భారతదేశంతో ఎన్నోశతాబ్దాలుగా స్నేహపూర్వక సంబంధాలున్నాయి. మత, సాంఘీక, సాంస్కృతిక, వాణిజ్య, మేథోపరమైన అంశాలెన్నో రెండుదేశాల మద్యనా సౌబ్రాతృత్వ వాతావరణాన్ని నెలకొల్పాయి. బౌద్ధధర్మం, హిమాలయాలు, సాధుజన సందోహం రెండింటి మద్యనా వారధులుగా నిలిచాయి. ఈబంధం ఎంతలా పెనవేసుకుపోయిందంటే రెంటిమద్యలో నిర్ధిష్టమైన సరిహద్దును ఏర్పాటు చేసుకోవాలన్న ఆలోచనే ఎవ్వరికీ రాలేదు. ఆ అవసరమే లేదనుకున్నారు. దురదృష్టవశాత్తూ అదే మన కొంపముంచింది.

బౌద్ధమతంలో ప్రధానంగా ఉన్నవి రెండు శాఖలు. ఒకటి హీనయానం మరొకటి మహాయానం. టిబెట్లో ఈరెండూకాక వజ్రయానం అనే మరొకశాఖ ఉంది. వీరికి గురువులుగా లామాలు ఉంటారు. వీరందరికీ పెద్దగా అత్యున్నత పదవిలో దలైలామా ఉటాడు. మిగతాదేశాల్లోలాగాటిబెట్‌లో మతాధిపతిగా ఒకరు, దేశాధిపతిగా మరొకరు ఉండరు. మతాధిపతి అయినా దలైలామానే ప్రభుత్వాధినేతగా పాలనా వ్యవహారాలు చూసుకుంటాడు.  1720లో మొదటిసారిగా చైనా బలగాలు టిబెట్టులోకి ప్రవేశించాయి. ప్రంపంచానికి తెలిసిన చరిత్ర ప్రకారం చూస్తే, పద్దెనిమిదో శతాబ్ధం వరకూ టిబెట్ స్వతంత్రంగానే ఉన్నది. టిబెటన్లు మంగోలులతో కలిసి కూటమిగా ఏర్పడి చైనామీదకి దాడిచెయ్యడానికి ప్రయత్నిస్తున్నాయి అన్నది చైనా కూపిన సాకు.
అయితే 1792 వరకు చైనాకి టిబెట్టుమీద గుత్తాధిపత్యం లభించలేదు. 1792లో చైనా మొదటిసారి అంబన్ అనేహోదాలో తన ప్రతినిధిని నియమించి అతని ద్వారా వ్యవహారాలన్నీ నడపడం మొదలుపెట్టింది. కానీ కొన్నిసంవత్సరాలకే చైనా బలహీన మవ్వడంతో తదుపరి దలైలామాను చైనాకి తెలియజేయకుండానే ఎన్నుకోవడం ద్వారా స్వతంత్రాన్ని ప్రకటించుకున్నట్టయ్యింది.

1904లో దలైలామా రష్యన్లతో చేతులు కలపవచ్చునన్న సందేహంతో లార్డ్ కర్జన్ దలైలామా చేత బలవంతంగా ఆంగ్లో టిబెటన్ ఒప్పందాల మీద సంతకాలు చెయ్యించాడు. తద్వారా టిబెట్ వాణిజ్యరంగంమీదా, విదేశాంగ విధానాలమీద ఆంగ్లేయులకు పట్టు చిక్కింది. టిబెట్ సార్వభౌమత్వాన్ని గుర్తించాల్సిందిగా కర్జన్ బ్రిటిశ్ ప్రభుత్వానికి సూచన చేశాడు. అయితే రవి అస్తమించని సామ్రాజ్యాన్ని పాలిస్తున్న బ్రిటిష్ వారికి బలహీన చైనా పెద్దసమస్యగా కనిపించలేదు.


1910లో చైనా పాలకులు హఠాత్తుగా టిబెట్ మీద దాడి చేసి, దలైలామాను దేశంనుంచి వెళ్ళగొట్టారు. ఆయన భారత్ లో తలదాచుకున్నాడు. అయితే వెనువెంటనే చైనాలో విప్లవం రావటం, మాన్చువంశస్థుల పాలన అంతం కావడంతో 1912లొ దలైలామా తిరిగి అధికారాన్ని కైవసం చేసుకున్నాడు.  అడపాదడపా చైనీయులు దాడి చేసినా ఆంగ్లేయులు తమ వాణిజ్య, సైనిక అవసరాల నిమిత్తం టిబెట్ను కాపాడుతూ వచ్చారు.


1913లో టిబెటన్లు స్వతంత్రాన్ని ప్రకటించుకున్నారు. టిబెట్, చైనా మరియు బ్రిటన్ల మద్య త్రైపాక్షిక చర్చలు సిమ్లాలో జరిగాయి. ఆ ఒప్పందంలో ముఖ్యమైన విషయం- టిబెట్నుఅంతర టిబెట్, బాహ్యటిబెట్లుగా రెండు ప్రాంతాలుగా విభజించారు. భారతదేశంతో సరిహద్దు ఉన్నటువంటి వెలుపలి భాగంనుంచి చైనా పూర్తిగా వైదొలగాలి. ఈప్రాంతం పూర్తిగా స్వయంప్రతిపత్తిని కలిగి ఉండాలి. అయితే చైనా రెండుభాగాలమద్యనా ఒప్పందంలో నిర్దేశించిన సరిహద్దును ఒప్పుకోలేదు. ఒప్పదంమీద సంతకం చెయ్యడానికి నిరాకరించింది. అలాగే టిబెట్కు పొరుగునున్న భారత్, బర్మా, భూటాన్ దేశాలతో సరిహద్దుకూడా పేర్కొన్నారు. ఈసరిహద్దే తదనంతరం మెక్ మహోన్ రేఖగా ప్రాచుర్యం పొందింది. ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే- చైనా ఒప్పందంలో పేర్కొన్న అంతర్గత సరిహద్దుల పట్ల అభ్యంతరం తెలియజేసిందిగానీ టిబెట్టుకు దాని పొరుగుదేశాల మద్యనున్న సరిహద్దు గురించి కాదు. కానీ సరిహద్దు వివాదం మొదలయ్యాక తనసలు దాన్ని గుర్తించనని, ఆనాటి ఒప్పందంలో తన సంతకాలు లేవు కాబట్టి అవి చెల్లవని స్పష్టం చేసింది!!!


ఈఒప్పందం తర్వాత టిబెట్ పూర్తి స్వతంత్రంగా వ్యవహరించింది. రెండవ ప్రపంచయుద్ధంలో చైనా పాల్గొనగా ఇది పూర్తిగా తటస్థవైఖరిని అవలంబించడంద్వారా ఆవిషయాన్ని ప్రపంచానికి స్పష్టంచేసింది. ఈవిషయాలన్నీ గమనిస్తే మనకు అర్థం అయ్యేదేమంటే- చైనాకు బలం ఉన్నప్పుడు యుద్ధంకేసి గెలవడం తప్ప టిబెట్ మీద దానికి ఎలాంటి పట్టూ లేదు. టిబెట్ స్వాతంత్ర్యం అన్నది చైనా బలాబలాలమీద ఆధారపడి ఉన్నది. కొద్దికాలం మినహాయిస్తే టిబెట్ మీద చైనాకు పూర్తిస్థాయి పట్టు ఎన్నడూ లేదు.  1912 నుంచి 1950 వరకు టిబెట్ పూర్తిస్థాయి స్వయంప్రతిపత్తిని అనుభవించింది. టిబెట్ స్వాతంత్ర్యం అన్న విషయానికి బ్రిటిష్ పాలకులు చాలాప్రాముఖ్యతను ఇచ్చారు. అందుకు ముఖ్యమైన కారణం ఈప్రాంతం కమ్యూనిష్ట్ చైనాకు భారత్‌కూ మద్యన ఒక తటస్థప్రాంతంగా అభివృద్ధిచెయ్యడంద్వారా రక్షణపరమైన సమస్యలు చాలావరకూ తగ్గించుకోవచ్చు. 




అయితే 1950లో చైనా టిబెట్ను దురాక్రమించుకోవడం ద్వారా రెంటిమద్యనున్న తటస్థవేదిక మాయం అయ్యింది. 25 అక్టోబర్ 1950న "టిబెట్ ప్రజలకు స్వేచ్చను ప్రసాదించడానికి, అవిభాజ్య చైనాను నెలకొల్పడానికి, వలసపాలనను పూర్తిగా నిరోధించడానికి, సరిహద్దు ప్రాంతాలను కాపాడుకోవడానికి టిబెట్ను చైనాలో విలీనం చేసుకుంటున్నాం." అని కమ్యూనిష్ట్ చైనా ప్రకటించడం ద్వారా ఒకబలమైన శత్రువు మనపెరటి తలుపు దగ్గర వచ్చి నిలబడ్డాడు. ఇది 
భారత్‌కు అత్యంతప్రతికూలాంశం. ఈచర్యతో ఉత్తర, ఈశాన్య సరిహద్ద్దు ప్రాంతాల్లో రాజకీయ సమతాస్థితి దెబ్బతింది. ( ప్రస్తుతం నేపాల్లో కమ్యూనిష్టులు బలపడటం భవిష్యత్తులో మరో ఉపద్రవానికి కారణం కావచ్చు) ఉత్తరాన కొన్నియుగాలుగా పెట్టని కోటలుగా ఉన్న హిమాలయలే నేడు ఒక బలమైన శత్రువుకు సైనిక స్థావరంగా మారే ప్రమాదం సంభవించింది.

రానున్న ఉపద్రవాన్ని ముందుగానే ఊహించిన పటేల్ మహాశయుడు తన మరణానికి నెలరోజులముందు ప్రధానికి ఒక సుదీర్ఘమైన లేఖను రాశాడు. అందులో టిబెట్‌నుచైనా ఆక్రమించడం దేశరక్షణకు ఎంతపెద్దముప్పో సవివరంగా తెలియజేశాడు. ఆయన అందులో అనుమానించినవన్నీకాలక్రమంలో నిజమయ్యాయి. కానీ దురదృష్టవశాత్తూ పటేల్ నిష్కృమణతో దేశరాజకీయాలు ఏకదృవమయ్యాయి. భారత ప్రభుత్వం మొక్కుబడిగా సంభ్రమాశ్చర్యాలను, ప్రగాడ సంతాపాన్ని తెలియజేసింది.

రానున్నది ఎంతగడ్డుకాలమో కొద్దిమందికి తప్ప దేశంలో ఎవరికీ పట్టలేదు. సగటు మానవుడు కొత్తగా వచ్చిన స్వాతంత్ర్యాన్నిచూసుకుంటూ మురిసిపోతున్నాడు. మేథావులంతా కొత్తగా తయారైన రాజ్యాంగాన్ని పరిశోధిస్తున్నారు. అధికారగణమంతా జవహర్ను అంతర్జాతీయ సమాజంలో ధృవతారగా చూపే పనిలోనూ, విదేశాంగశాఖ ఆయన పర్యటనల ఏర్పాట్లలోనూ, ఉపన్యాసాలు తయారు చెయ్యడంలోనూ తలమునకలై ఉన్నారు. 
జయప్రకాష్ నారాయణ్, ఎన్.జీ. రంగా వంటివారు పార్లమెంటులో మనవైఖరిని విమర్శించినా పెద్దగా ఒరిగిందేమీలేదు.

చైనీయులతో సామరస్యంగా సమస్యను పరిష్కరించుకోవడానికే మొగ్గుచూపుతూ హిందూ చీనీ భాయీభాయి అనే నినాదాన్ని తెరపైకి తీసుకొచ్చింది. ఆసమయంలో బలవంతుడు బలవంతుణ్ణే గౌరవిస్తాడు. అతనితోనే స్నేహంచేస్తాడు అన్న మౌలిక విషయాన్ని మనం మర్చిపోయామనుకుంటా. బలమైన చైనా చాలా ప్రమాదకారి. రాజ్యకాంక్షతో విస్తరణ చెయ్యడం దాని నైజం. జరిగిన పరిణామాలతో దానికి బలం, వనరులనేగాక కాంక్షను రెచ్చగొట్టగలిగిన అనేక అంశాలు అనుకూలమయ్యాయి.

నిజానికి సమస్య తీవ్రతను బేరీజు వేసుకున్నాక, టిబెట్ను చైనా కబంధహస్తాల నుంచి కాపాడటానికి మనం దౌత్యపరంగానూ, న్యాయపరంగానూ చెయ్యగలిగిన ప్రయత్నాలన్నీ చేసుండాల్సింది. మనదేశరక్షణావసరాల దృష్ట్యా మనం తప్పక చెయ్యాల్సిన పని అది. జవహర్ అప్పటికే అంతర్జాతీయ సమాజంలో కూడగట్టుకున్న ప్రతిష్టను ఇందుకు వినియోగించాల్సింది. తద్వారా ఒకబలహీన దేశానికి చేయూత నందించిన వాడిగాను, తన దేశప్రయోజనాలను కాపాడుకున్న నాయకుడిగాను ఎంతోపేరొచ్చుండేది. మహాభారతం ఉద్యోగపర్వంలో చెప్పినట్టు పెద్దలు, విజ్ణులైనవారు జరుగుతున్న చెడును నివారించకుంటే దానికి వాళ్ళూ బలైపోతారు. భారతదేశానికి ఈవిషయంలో జరిగిందిదే. వేలసంవత్సరాల చరిత్ర,, సంస్కృతి, ధర్మంపట్ల నమ్మకం కలిగిన జాతిగా మనం కళ్ళముందు జరిగిన దారుణాన్ని నిలువరించలేకపోయాం. నిలువరించేంత బలం లేకపోయినా కనీసం అంతర్జాతీయ సమాజానికి తెలియజెప్పే పనైనా చెయ్యాల్సిన విద్యుక్తధర్మం మనపట్ల ఉంది. కానీ దురదృష్టవశాత్తూ ఐక్యరాజ్యసమితిలో జరిగిన చర్చకు మద్దతిచ్చి టిబెట్ విముక్తికి సహాయపడాల్సిందిపోయి మనమే చర్చను వ్యతిరేకించాం. ఈసమస్యను టిబెట్ చైనాలు చర్చల ద్వారా పరిష్కరించుకుంటాయి అని చెప్పడం ద్వారా మనమే ప్రపంచంనోరు నొక్కేశాం. జరుగుతున్న పరిణామాలతో అందరికన్నా ఎక్కువగా ప్రభావితమయ్యే మనమే చర్చను వద్దనడంతో మిగతాదేశాలకు దీన్నిపట్టించుకొనవలసిన అవసరం కనిపించలేదు.

అలా టిబెట్ సమస్యను భారత్ పరిష్కరించేసింది. అది చైనాలో అంతర్భాగంగా అప్రతిహతంగా కొనసాగుతోంది. ప్రస్తుత ఆర్థిక, రాజకీయ పరిస్థితులను బట్టి చూస్తే ఇప్పట్లో టిబెట్కు స్వేచ్చా స్వాతంత్ర్యాలు లభించే అవకాశాలు కనుచూపుమేరలో లేవు. డ్రాగన్ మనపక్కలోనే బుసలుకొడుతూ రోజురోజుకీ బలపడుతుంది. సైనిక సామర్థ్యాన్ని వందలరెట్లు పెంచుకుంటోంది. మరొకవైపున కాశ్మీర్ రగులుతూనే ఉంది. నేపాల్ కమ్యూనిష్టుల పరమవడంతో ఉత్తరసరిహద్దు పూర్తిగా రావణకాష్టంగా మారింది. ఏహిమాలయాలను చూసుకుంటూ పెట్టనికోటలంటూ మురిసిపోయామో అవేపర్వతాలు శత్రువుల సైనికస్థావరాలుగా, శిక్షణాశిబిరాలుగా, ఆయుధాగారాలుగా మారిపోతే చేష్టలుడిగి చూస్తున్నాం. దేశబడ్జెట్లో సింహభాగం సరిహద్దు రక్శణకే ఖర్చవుతోంది. దేశశ్రేయస్సు దృష్ట్యా రక్శణవ్యయాన్ని విపరీతంగా కుదించేందుకు మొగ్గుచూపినందుకుగాను తదనంతరం ఒకవైపు మనభూభాగాన్ని కోల్పోగా, మరోవైపు రక్షణవ్యయం అంతకంతకు పెరిగింది. ఖర్చయితే అవుతుందిగానీ సమస్యలకు ఒక శాశ్వత పరిష్కారం అయితే దొరకట్లేదు.

8 comments:

  1. " పెద్దలు, విజ్ణులైనవారు జరుగుతున్న చెడును నివారించకుంటే దానికి వాళ్ళూ బలైపోతారు."
    good point!

    ReplyDelete
  2. టిబెట్ విషయంలో 1947లో స్వతంత్రం పొందిన భారత్ ఏమి చేయగలిగి వుండేది? 1962 చైనా యుద్ధానికి పరోక్ష కారణం దలైలామాకు భారత్ ఆశ్రయం ఇవ్వడమే అనంది ఓ పరోక్ష కారణం. వున్నదే( పాకిస్తాన్, బంగ్లా) వూడగొట్టుకున్న భారత్, అప్పుటి పరిస్థితుల్లో టిబెట్ గురించి ఆరాట పడటంలో అర్థం లేదు. ఇప్పుడు చేయగలిగిందీ ఏమీ లేదు. ప్రస్తుతం కాశ్మీర్‌ను పాకీ ముష్కరులకు వదులుకోకుంటే అది చాలు. మింగను మెతుకులేదు మీసాలకు సంపెంగ నూనె లా వుంటుంది.

    ReplyDelete
  3. @SNKR: మనం చైనా యుద్ధంచెయ్యడం అన్నది జరిగేది కాదు. నేనూ ఒప్పుకుంటా. కానీ అంతర్జాతీయ వేదికల్లో చైనాకి వ్యతిరేకంగా ఏదైనా చర్చ జరిగుతుంటే పిల్లిమెడకి గంట కట్టే పనినైనా సక్రమంగా చేసుంటే బావుండేది. ఐ.రా.స.లో ఈవివాదం పూర్తిగా సర్దుమణిగేలా మనం వ్యవహరించాం. దాంతో ఊడగొట్టుకున్నవి సరిపోనట్టు ఇంకా ఊడగొట్టించుకున్నాం

    ReplyDelete
  4. జగడాల మారి చైనా పని పట్టాలంటే ఒక్క ఇండియాతో అయ్యేపని కాదు. వియత్నాం, ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, తైవాన్ లాంటి చిన్న దేశాలతోనే కాక బిలియను పెట్టుబడి పెట్టినజపాంతో కూడా కయ్యానికి కాలు దువ్వడానికి కారణం ప్రపంచ రెండవ ఆర్థికశక్తిగా ఎదగడమే. ఇండియా చైనా దరిదాపుల్లో కూడా లేదు. ఇండియా చైనాతో మంచిగా వుండాలని ట్రై చేసి విఫలమైంది. చైనా, ఇండియా అతిపెద్ద వ్యాపార భాగస్వామి ఊడా. మన ఓబుళాపురం ఇనుము దొంగగా ఎగుమతయ్యింది చైనాకే. బొగ్గు అంతే.
    కాగల కార్యం గంధర్వులు(అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, నాటో) తీర్చేదాకా ఓపిగ్గా అవకాశం కోసం వేచి చూడటమే.

    ReplyDelete


  5. చైనాతో వ్యవహరించడం లో కొన్ని తప్పులు జరిగాయి.అమెరికా కూడా చైనాలో కమ్యూనిస్టు విజయాన్ని ఆపలేకపోయింది.టిబెట్ని కాపాడలేకపోయింది.చైనాతో డీలింగ్స్ విషయంలో చాలా ఓపిక కావాలి.దీఎర్ఘకాలికా ప్రణాలికతో మన రక్షణ,సైనిక బలాన్ని పెంపొందించుకుంటూ పోవాలి.చైనాతో వర్తక వ్యాపారాలను వృద్ధి చేసుకొన్నా మిలిటరీ విషయాల్లో చైనాతో చాలా జాగ్రతగా ఉండాలి.వేరే మార్గం లేదు.అమెరికా రష్యాలతొ వ్యూహాత్మక సంబంధాలు పదిలపర్చుకోవాలి.

    ReplyDelete
  6. "...నేపాల్ కమ్యూనిష్టుల పరమవడంతో ఉత్తరసరిహద్దు పూర్తిగా రావణకాష్టంగా మారింది..."

    I think by this time our Foreign Policy makers kept their eyes wide open and took some required initiatives and now the things have reversed for China in Nepal, our homegrown commies like Yechuri going there and trying to sort out affairs notwithstanding.

    Confronting China may not be wise now but not opposing those scheming to cow down the Dragon should be our wise policy.

    ReplyDelete
  7. నిజానికి నేపాల్ విషయం ఇంకా జటిలంగా తయారవుతుంది. మావోయిస్టులు ఇప్పటికే దేశంలో చత్తీస్గఢ్, ఝార్ఖండ్, బెంగాల్ ద్వారా రెడ్ కారిడార్ ఏర్పాటు చేసుకుంటున్నారు. నేపాల్కి వీటికి మద్య బీహార్ ఒక్కటే అడ్డు. అదేమీ శత్రుదుర్బేధ్యమేమీ కాదు. చైనాతో పొరపొచ్చాలంటారా వాళ్ళ పితృభూమిని కాపాడుకోను, విస్తరించుకోనూ అవకాసం వస్తే ఇవేవీ పెద్దసమస్యలుకావు వాళ్ళకి.

    ReplyDelete