మేరునగ తప్పిదం- 3. మిత్రబేధం

చైనాతో స్నేహం, దౌత్యసంబంధాలు, అంతర్జాతీయ సమాజం వంటి అంశాలకు స్థాయికి మించి ప్రాముఖ్యత ఇవ్వడంతో భారతదేశ భద్రత గాలిలో దీపం చందంగా తయారయ్యింది. ఏరోజు సమస్యను ఆరోజు చూసుకోవడం, చెదురుమదురు ఘటనలంటూ సర్దిపుచ్చేసుకోవడం తప్ప భద్రతాపరమైన అంశాల్లో దీర్ఘకాలిక లక్ష్యాలేవీ భారత్ నిర్దేశించుకోలేదు. గతచరిత్ర నేర్పిన పాఠాలు నేర్చుకోకుండా భారత్ తన సరిహద్దును రక్షించుకోవడం అనే మౌలికధర్మాన్ని మరోసారి ఇతరుల దయాదాక్షిణ్యాలకు వదిలేసింది. కొంచెం ఘాటుగా ఉన్నా ఇది నిష్టుర సత్యం. ఐరాస మద్యవర్తిత్వం కాశ్మీరు సమస్యను తీర్చకపోగా మరింత జటిలం చెయ్యడంతో నెహ్రూకు ఇంటిపోరు పెరుగుతూ వచ్చింది. దాయాది నుంచి తరచుగా ఎదురైన సమస్యలను సైన్యం సమర్థవంతంగా అణిచివెయ్యగలిగినా అమెరికా నుంచి దానికి లభిస్తున్న సహాయం ప్రమాదఘంటికలు మోగించసాగింది.

1956నుంచి చైనా నెమ్మదిగా తన నిజస్వరూపాన్ని బయటపెట్టడం ప్రారంభించింది. లఢాఖ్, ఈశాన్య సరిహద్దులను తమవిగా ప్రకటించుకుంటూ చర్చలకు పిలుపునిచ్చింది. భారతభూభాగాలను చైనాలో అంతర్భాగంగా చూపెడుతూ కొన్ని మ్యాపులను విడుదల చేసింది. భారత్ దానికి అభ్యంతరం వ్యక్తం చెయ్యడంతో అవి పాతమ్యాపులని, త్వరలో సవరించి కొత్తవి విడుదల చేస్తామని చెప్పింది. అక్సాయ్ చిన్ ప్రాంతంలో నిర్మించిన రహదారి విషయం చైనా మాద్యమాల ద్వారా బహిర్గతమవ్వడంతో హిందీచీనీ భాయీభాయీ యుగానికి శుభంకార్డు పడింది అని చెప్పవచ్చు. ఆతర్వాత జరిగిన చర్చలు భారత్‌కు చెప్పుకోదగ్గ లాభాలేవీ కలిగించలేకపోయినా చైనా మాత్రం పాతసంధిపేరు చెప్పి వాణిజ్యపరమైన లాభాలు ఆర్జించుకుంటూ వచ్చింది.

చైనా నమ్మదగిన దేశంకాదు అన్న సంగతి నెహ్రూకు నెమ్మదిగా బోధపడసాగింది. కానీ దురదృష్టవశాత్తూ అప్పటికే దాదాపు ఒకదశాబ్దం వృధాగా గడిచిపోయింది. నెహ్రూ దగ్గర రెండు దారులున్నాయి. ఒకటి- అభివృద్ధి పధకాలు, పారిశ్రామికీకరణ ఆపేసి ఉన్నపళంగా రక్షణకు నిధులు మళ్ళించడం. కానీ ఇందులో చాలా సమస్యలున్నాయి. అందులో ముఖ్యమైంది సైనికదళాలకు డబ్బుతోబాటు తగినంత సమయం కావాలి. మన సైన్యంలో సింహభాగం మైదానాల్లో, ఎడారుల్లో యుద్ధంచెయ్యడానికి ( పాకిస్థాన్ సరిహద్దు) తర్పీదు పొంది ఉన్నారు. సైనికసామాగ్రి కూడా అందుకు అనుగుణంగా తయారు చెయ్యబడిందే. కానీ చైనా సరిహద్దు పూర్తిగా పర్వతాల మయం. అందులోనూ హిమాలయాలు.

మరొక ముఖ్యమైన సమస్య- ఉన్నపళంగా అంతసామాగ్రిని సరపరా చేసే దేశమేది? మనకు సామాగ్రిని సరపరా చేసే బ్రిటన్, అమెరికాలకి అప్పటికే పెద్దమొత్తంలో బాకీ పడున్నాం. అందునా అంతర్యుద్ధ పరిస్థితుల దృష్ట్యా ఏదేశమూ ఇంతపెద్దమొత్తంలో సరపరా చెయ్యడానికి ముందుకురాదు. అప్పటికే పాకిస్థాన్ అమెరికా పంచన చేరి లాభపడుతుండగా మనం అలీనవిధానంద్వారా, ఆఫ్రోఏషియన్ కూటమిని నెలకొల్పడంద్వారా ప్రాశ్కాత్య వ్యతిరేకులమన్న ముద్రను ఆపాదించుకున్నాం. అమెరికా తనసామంతరాజ్య విరోధికి ఎంతవరకూ సహాయం చేస్తుందనేది అనుమానమే. ఫ్రాన్స్, స్వీడన్ వంటి దేశాలు యుద్ధసామాగ్రి సరపరాల వ్యాపారంలా చేస్తున్నా వాటినుంచి కొనుగోలుచేసేంత నిల్వలు మనదగ్గర అప్పట్లో లేవు. కాశ్మీరు సమస్య తేలేవరకూ ప్రాశ్చాత్య దేశాలనుంచి ఇలాంటిసహాయాల్ని పొందలేని స్థితిలో భారత్ ఇరుక్కుపోయింది. అదేసమయంలో రష్యా తన వీటోను ఉపయోగించి మరీ ఐరాసలో మనకు మద్దతునిచ్చింది. సాంకేతిక సహకారాలు, ఎగుమతులు వగైరా, వీటన్నింటినీ మించి సోషలిస్ట్ భావజాలం కారణంగా ప్రాశ్చాత్య దేశాలకు భారత్ మరింత దూరమయ్యింది. పోనీ రష్యానుంచే సైనికసహాయాన్ని పొందుదామా అంటే తనసోదరదేశమైన చైనాతో యుధ్ధానికి అది సహాయం చేస్తుందని ఎలా అనుకోగలం?


వీటన్నింటినీ మించి- అప్పటికే అంతర్జాతీయ సమాజంలో శాంతివచనాలను వల్లిస్తున్న భారత్ (అంటే నెహ్రూ) ఉన్నపళంగా సైనికచర్యలకు ఆస్కారమిచ్చేలా ప్రవర్తిస్తే ఇంతకాలం కాపాడుకుంటూ వస్తున్న ప్రతిష్ట మసకబారిపోతుంది.  స్వతంత్ర్యం వచ్చిన దశాబ్ధానికే ఏకూటమికీ చెందని, పెద్దగా సైనికబలంలేని, స్వయంసమృద్ధిని సాధించని భారత్ ముందు సైనికసామాగ్రి ఆధునికీకరణ అన్నదానికి ఆస్కారమే లేకుండా పోయింది.

కాబట్టి సరిహద్దు భద్రత అన్న విషయంలో భారత్ ముందున్న దారల్లా చైనాతో సత్సంబంధాలు జరపడం. కాశ్మీరు విషయాన్ని అమెరికా చేతుల్లో పెట్టడం. రక్షణరంగంలో దుబారా చేసేకన్నా పారిశ్రామికీకరణకు నిధులు కల్పించడం ఉత్తమమన్న భావాన్నే నెహ్రూ ప్రతిసందంర్భంలోనూ బలంగా ప్రకటిస్తూ వచ్చాడు. అయితే ఇక్కడ మనం గమినించాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే- మన సరిహద్దుల్లో సమస్య తలెత్తిన రెండుదేశాలు ప్రపంచంలో రెండు వెరేవేరు కూటములకు చెందినవి. అగ్రరాజ్యాల దీర్ఘకాలిక లక్ష్యాలను నెరవేర్చేవి. అందునా రెండు సరిహద్దుల్లో ఒకటి మైదానం. మరొకటి మహాపర్వతం. కాబట్టి ఎట్టిపరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చెయ్యకూడని అంశం- సరిహద్దు భద్రత. పార్లమెంటులో ఈఅంశంమీద చర్చ జరిగినప్పుడల్లా నెహ్రూ తన అభివృద్ధికార్యక్రమాలకు విఘాతం కలుగకూడదన్న ఆలోచనతో జాతికి ఈవిషయంలో ఎలాంటి దిగులూ వద్దని 
పదేపదే హామీ ఇస్తూ వచ్చాడు.

జాతీయ భద్రతా విధానాన్ని రూపొందించిండంలో భారత్ తడబడుతూ ఉంటే చైనా ఇదే అదునుగా చొరబాట్లను ప్రోత్సహించడం మొదలుపెట్టింది. చర్చలు జరిగే సమయంలో చైనా ప్రతినిథులు కొంతదురుసుగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. భారత ప్రతినిథులు లేవనెత్తే అంశాలకు సరైన సమాధానాలు కూడా ఇవ్వకపోగా వాటిని వలసపాలకులు ఆసియామీద తమసైనికబలంద్వారా రుద్దినవిగా కొట్టిపారేశారు. ఆసమయంలో ఉన్నతస్థాయి రక్షణ నిపుణుల కమిటీ ఒకటి 
భారత్‌ను సందర్శించింది. ఆసందర్భంగా వారికి ప్రతి ఒక్కటీ ఎలాంటి దాపరికమూ లేకుండా చూపించాల్సిందిగా  భారతప్రభుత్వం సైన్యాన్ని ఆదేశించింది. వాళ్ళు అంతా చూసుకుని వెళ్ళారు.

10 మార్చి 1959న టిబెట్లో చెలరేగిన అల్లర్లు కీలకమైన మలుపులకు కారణంగా నిలిచాయి. ల్హాసాలో చైనా సైన్యానికీ టిబెటన్లకూ మద్య ఘర్షణ మొదలైంది. ఇది చైనా అంతర్గత సమస్యగా నెహ్రూ పార్లమెంటునుద్దేశించిన ప్రసంగంలో పేర్కొన్నాడు. ఘర్షణలు తీవ్రస్థాయికి చేరడం, సైన్యానిది పైచెయ్యి అవడంతో దలైలామా మరోసారి టిబెట్ను విడిచిపెట్టాల్సి వచ్చింది. ఏప్రిల్ 3న దలైలామాకు భారత్ ఆశ్రయం ఇచ్చినట్టుగా నెహ్రూ స్పశ్టం చెయ్యడంతో చైనాతో సంబంధాలకు దారులు పూర్తిగా మూసుకుపొయ్యాయి.


టిబెట్ నుంచి భారత్ వస్తున్న దలైలామాబృందం. కర్టసీ: http://www.guardian.co.uk


దలైలామాకు ఉన్న ప్రతిష్ట దృష్ట్యా భారత్ ఆయనకు తగిన సౌకర్యాలు కల్పించింది. ఊహించని ఈపరిణామం 
భారత్‌ను సందిగ్ధంలో పడేసింది. చైనాతో సంబంధాలపై దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందని నెహ్రూ బహిరంగంగా చెప్పాడు. చైనా భారత్ మీద దాడి చెయ్యడానికి ఇదే కారణమైతే ఆయుద్ధంలో నాదేశం ఓడిపోయినా దానికి నేను గర్విస్తాను. బలవంతుడైన వాడు తనకి నచ్చిన వాడికెవడికైనా ఆశ్రయమివ్వగలడు. కానీ పెద్దగా బలంలేని, అందులోనూ దీనివల్ల ఒకబలమైన శత్రువును ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిసీ అందుకు ఒప్పుకున్నందుకు భారతీయులుగా మనందరం గర్వించాలి. ఈగడ్డమీద పుట్టిన ధర్మాన్ని కాపాడుకోవల్సిన భారతీయులుగా మన బాద్యత. ఈప్రాంతంలో బౌద్ధధర్మం బలంగా ఉన్న దేశాలు తమకుతాముగా ముందువాల్సిందిపోయి డ్రాగన్ను చూసి భయపడ్డాయి. దలైలామాకూడా భారతే తనకు రక్షణనివ్వగల ప్రాంతంగా భావించి వచ్చాడు. ఆనమ్మకాన్ని ఎన్నిసమస్యలెదురైనా ఇన్నేళ్ళుగా నిలబెట్టుకుంటూ వచ్చాం. యుద్ధంలో గెలుపోటములను బట్టే బలాబలాల్ని బేరీజు వేసే ప్రపంచానికి ఇలా వ్యవహరించేందుకు ఎంతటి మనోస్థైర్యం కావాలో అర్థం కాకపోవచ్చు. టిబెటన్లకు మాత్రం అర్థమయ్యింది.

అప్పట్నుంచీ చైనా నెమ్మదిగా తన సైనిక సామర్థ్యాన్ని, సరిహద్దువెంబడి కార్యకలాపాల్ని పెంచుకుంటూ పోగా భారత్ మాత్రం కనీస చర్యలు చేపట్టకపోవడం ఆత్మహత్యా సదృశం. సమస్య రోజురోజుకీ పెద్దదవుతూ వస్తున్నప్పుడు కనీస చర్యలు చేపట్టి జాతి గౌరవాన్ని కాపాడుకోవడం అన్నది ఏప్రభుత్వమైనా నిర్వర్తించాల్సిన కనీసధర్మం. మూడేళ్ళలో చైనా ప్రణాళిక ప్రకారం సరిహద్దు వెంబడి పనులు చక్కబెట్టుకుంటూ పోతుంటే భారత్ కనీసం రోడ్లను కూడా మెరుగుపరచుకోలేదు. రక్షణపరంగా ఇదొక ఘోరతప్పిందం.

2 comments: