మేరునగ తప్పిదం- 4. 1959


చైనా మరింత దురుసుగా ప్రవర్తించసాగింది. 1959 ఆగష్టులో సరిహద్దు వెంబడి మూడు చోట్ల జరిగిన దాడులు సమస్య తీవ్రతను దాచిపెట్టలేనిస్థాయికి తీసుకెళ్ళాయి. రెండుదేశాల మద్య చర్చలు జరిపగలిగే వాతావరణం పూర్తిగా తొలిగిపోయింది. నెహ్రూ పార్లమెంటులో దాడుల గురించి అలానే  అక్సాయ్ చిన్ ప్రాంతంలో నిర్మించిన రహదారిని గురించి, దాన్ని తనిఖీ చెయ్యడానికి వెళ్ళిన భారత అధికారులను నిర్బంధించడం గురించి ప్రస్తావిస్తూ సైనిక సన్నాహల విషయంలో వైఫల్యం చెందామని అంగీకరించాడు. భారత భూభాగంలో చైనాసైన్యం కాంపు ఏర్పాటు చేసుకుంది అని ప్రకటించడంతో సభ ఆందోళన చెందింది. సరిహద్దు పరిస్థితులపై ప్రధాని ప్రకటన చెయ్యాలని పట్టుపట్టడంతో నెహ్రూ కొన్నికఠోరవాస్తవాలు విపులంగా చెప్పాల్సి వచ్చింది. సరిహద్దు వెంబడి చైనా మూడుచోట్ల దాడులకు పాల్పడింది. అవి ఖెంజమెన్, లోగ్జు మరియు అక్సాయ్ చిన్.

ఖెంజమెన్ అనేది థాగ్ల అనే ప్రాంతంలో ఉంది. భారత్ అక్కడ ఉన్న పర్వత శిఖరాన్ని సరిహద్దుగా పేర్కొంటే, చైనా అక్కడినుంచి రెండుమైళ్ళ లోప్ల ఉన్న బ్రిడ్జిని సరిహద్దుగా చూపించసాగింది. అక్కడి దాడిని గురించి సభకు వివరిస్తూ నెహ్రూ, "ఆగష్టు 7న 200మంది చైనీయులు సరిహద్దు దాటి లోపలికి ప్రవేశించారు. మన సైన్యం వారిని వెనక్కి వెళ్ళమని కోరగా వాళ్ళు వినలేదు. మనసైన్యాన్ని బ్రిడ్జివరకు తోసేసారు. మన సంఖ్య చాలా తక్కువగా ఉన్నది. అక్కడ కాల్పులేవీ జరగలేదు. తరువాత చైనీయులు పూర్తి ప్రాంతాన్ని మనకు వదిలేసి వెళ్ళిపోయారు. మనవాళ్ళు తిరిగి యధాస్థానానికి వచ్చేశారు. చైనీయులు మళ్ళీవచ్చి వెనక్కి వెళ్ళాలని, భారత పతకాన్ని దించెయ్యాలని ఆదేశించారు. అయితే సైనికులు వాళ్ళ మాటలను వినలేదు. చైనీయులు బలప్రయోగం చెయ్యబోగా ఫలించలేదు. ఆ తరువాత ఇంకేమీ జరుగలేదు." అన్నాడు.

రెండవ సంఘటన లొంగ్జులో జరిగింది. దాని గురించి ప్రస్తావిస్తూ " 25న చైనా సైన్యం సుబంసిరి ప్రాంతంలో గీత దాటి వచ్చి మన బలగాలపై కాల్పులకు పాల్పడింది. చైనీయులతో పోలిస్తే మనబలం చాలా తక్కువగా ఉంది. లొంగ్జు ప్రాంతం నుంచి సమీప సైనిక పోస్టు అయిన లిమెకింగ్‌కు చేరేందుకు ఐదురోజులు పడుతుంది. లిమెకింగ్ నుంచి రోడ్డుకి 12రోజులు పడుతుంది. అంటే ఘటనా స్థలాన్ని చేరుకునేందుకు కనీసం మూడు వారాలు కావాలి. దీనిని బట్టి సమాచారం, రవాణా, సైనికచర్యలవంటివి ఎంతకష్టమో సభ్యులు అర్థం చేసుకోగలరు. 26న చైనీయులు మరోసారి దాడిచేసి మనవాళ్ళని నిర్బంధించారు. ఇరుపక్షాలూ కాల్పులు జరిగినప్పటికీ ఎవరూ చనిపోలేదు. మాకు సమాచారం అందడంతోనే చైనాప్రభుత్వానికి మా అభ్యంతరాలను తెలియజేశాం."

ఈశాన్య సరిహద్దును పూర్తిగా సైన్యానికి అప్పగించినట్లు నెహ్రూ సభలో ప్రకటిఁచాడు. అస్సాం రైఫిల్స్ ఈవ్యవహారాన్ని చూసుకుంటుందని తెలియజేశాడు. వారు అక్కడీ పరిస్థితి నియంత్రిస్తారని అవసరమైతే ఇతరబలగాలను కూడా అక్కడకు పంపుతామని చెప్పాడు.

ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సిన విషయాలు- నెహ్రూ తన సహజ శైలికి విరుద్ధంగా సభలో చిన్నచిన్న వివరణలు ఇచ్చుకోవడం. సభ్యులకు నచ్చచెప్పేందుకు ప్రయత్నించడం. బహుశా ఇది నాయకులను, అధికారులను కలవరపెట్టి ఉండొచ్చు. సరిహద్దు భద్రతకు సన్నాహాలు చేస్తున్నామని నెహ్రూ చెప్పాక, ఏరకమైన సన్నాహాలు చేస్తున్నారు? అని సభ్యులుగానీ మీడియాగానీ అడగకపోవడం విడ్డూరం. అప్పటి పరిస్థితులకు అవసరమైనంత అదనపు వనరులు రక్షణశాఖ దగ్గరైతే లేదు. కొత్తగా సైనికుల నియామకం చెయ్యటేదు. సామాగ్రిని కొనుగోలు చేసే ప్రతిపాదనలేవీ చెయ్యలేదు. మరి అదనపు బలగాలు ఎక్కడి నుంచి వస్తాయి? మొట్టమొదటిసారిగా ప్రధాని సరిహద్దు రక్షణ గురించి మాట్లాడాక కూడా దీర్ఘకాలిక లక్ష్యాలేవీ పెట్టుకోలేదు. సమస్యతీవ్రతను అధ్యయనం చెయ్యలేదు. 1962 వరకు జరిగిన ప్రతిఒక్కదాడినీ చెదురుమదురు ఘటనలుగా కొట్తిపడేస్తూ వచ్చాడు. ఘటనలను పూర్తిస్థాయి అధ్యయనం చేసి జాతీయ భద్రతా విధానాన్ని తయారు చెయ్యకపోవడం ఆసమయంలో భారత్ చేసిన అతిపెద్దతప్పు.

సెప్టెంబరులో లడాఖ్, ఈశాన్య సరిహద్దు ప్రాంతాల్లో సుమారు యాభైవేల చదరపుమైళ్ళ ప్రాంతాన్ని చైనా ఆక్రమించుకుని తమభూభాగంగా ప్రకటించింది. అయితే 1961 వరకు భారత్ కనీస చర్యలు చేపట్టకపోవడం విడ్డూరం. దీన్నికూడా చెదురుమదురు ఘటనలుగానే భావించి ఉండవచ్చు. ఇదేమీ పెద్దవిషయంకాదనీ, విపరీతాలకేమీ దారితీయదనీ నెహ్రూ చెప్పుకొచ్చాడు. ఒక సందర్భంలో "అది బంజరుభూమి. అక్కడ గడ్డిపోచకూడా మొలవదు." అని పేర్కొనడం దేశవ్యాప్త నిరసనలకు తావిచ్చింది. నెహ్రూ ప్రతిష్ట మసకబారింది. అప్పటివరకూ నాయకుల, మేధావుల నుంచి విమర్శలనెదుర్కొన్న నెహ్రూ తనని దైవాంశసంభూతునిగా భావించి పూజించే సగటుమనిషినుంచి కూడా విమర్శలనెదుర్కోవాల్సి వచ్చింది. సభా సమయమంతా ఈఅంశంతోనే వృధాగా సాగిపోతోంది. అసమ్మతికి, ప్రతిపక్షాలకు నెహ్రూమీద దాడి చెయ్యడానికి సువర్ణావకాశం లభించడంతో సరిహద్దు సమస్య రాజకీయరంగు పులుముకుంది. ఇంతటి విషమ పరిస్థితుల్లోనూ ప్రజలకు నెహ్రూ తప్ప మరొక ప్రత్యామ్నాయం దొరకకపోవడం పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో మిక్కిలి శోచనీయం.

నమ్మదగ్గ మనుషులు పెద్దగా దొరకక పోవటంతో నెహ్రూ తన అభీష్టానుసారంగా నిర్ణయాలు తీసుకోసాగారు. దాంతో ప్రతిదానికి చర్చలద్వారా సానుకూల పరిష్కారాన్ని కనుగొనడమే భారత విధానమైంది. దీనిక్కూడా విపక్షాలనుంచి విమర్శలెదురవడంతో సరిహద్దు రక్షణకు చర్యలు మొదలుపెట్టారు. అయితే ఇవి దేశ అవసరాలను తీర్చేస్థాయిలో చేపట్టలేకపోయాం. సరిహద్దు ప్రాంతాలన్నీ సుదూరంగా ఉండటం, అక్కడికి రవాణాసౌకర్యాలను మెరుగుపరచక పోవడంతో వస్తురవాణా పూర్తిగా హెలికాప్టర్లమీద ఆధారపడి జరపాల్సి వచ్చింది. అయితే హెలికాప్టర్లను అన్నికాలాల్లోనూ వినియోగించలేకపోవడం, పైనుంచి జారవిడిచిన వస్తువుల్లో ఎక్కువభాగం వృధాగా పోవడం సైన్యానికి పెద్ద సమస్యగా మారింది. సరిహద్దును సైన్యానికి అప్పగించాక చేపట్టాల్సిన ఇతరపనులు, సైనిక వనరులు పెంచడం వంటివి జరగకపోవడంతో ఆకార్యక్రమం పెద్దగా ఏమీ సాధించలేకపోయింది. చైనా తనసైన్యానికి అత్యాధునిక ఆయుధాలు, సౌకర్యాలు కల్పించి పెద్దసంఖ్యలో బలగాల్ని మోహరించినా వారిని సరిహద్దు కాపలాదారులుగానే పేర్కొనింది. మనంమాత్రం ఎలాంటి సౌకర్యాలుగానీ, ఆయుధసామాగ్రికానీ ఇవ్వకుండానే ఓడజనుమందిని కాపలాకు పెట్టి సైన్యం అని పిలిచాం.

అక్టోబరులో హవిల్దార్ కరం సింగ్ నేతృత్వంలోని పోలీసుబృందమ్ మీద చైనీయులు దాడి చేశారు. 9మంది చనిపోగా 10మందిని నిర్బంధించారు. ప్రతిసారీ భారతసైన్యానికే ఎదురుదెబ్బలు తగులుతూ రావడంతో ఈఘటని విపరీతమైన ప్రజాగ్రహానికి కారణమైంది. ఇక చర్చలకు ఆస్కారంలేదనీ, యుధ్ధానికి సమయం దగ్గర పడుతుందనీ ప్రతి ఒక్కరికీ అర్థమయ్యింది.

ఇంతలో రక్షణశాఖలో పెద్ద దుమారం లేచింది. రక్షణమంత్రి కృష్ణమీనన్‌కు ఆర్మీచీఫ్ జనరల్ తిమ్మయ్యకు మద్య విబేధాలు తారాస్థాయికి చేరాయి. తిమ్మయ్య చాలాక్రితమే చైనాతో పొంచి ఉన్న ముప్పుని వివరిస్తూ సైన్యానికి కావల్సిన అదనపు వనరుల్ని కోరాడు. ఈసమయంలో మీనన్ కొంచెం దురుసుగా ప్రవర్తించడంతో నిబద్ధత కలిగిన అధికారిగా తిమ్మయ్య మనస్తాపానికి గురయ్యాడు. ఆయన జనరల్ అయ్యేందుకు ముందే సైన్యం వద్ద వనరులు తగినంతలేవని భావించి చైనాసరిహద్దు రక్షణ నిమిత్తం మరింత బలోపేతం చెయ్యాలని భావించాడు. అయితే ఆయన సూచనలేవీ అమలుకాకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో తిమ్మయ్య తనరాజీనామాను సమర్పించాడు. ప్రజాస్వామయ వ్యవస్థలో సర్వీసులో ఉన్న సైనిక అధికారికి ఇతకన్నా చెయ్యగలిగింది ఏమీలేదు. కీలక సమయంలో ఈదుమారం దేశాన్ని కలవరపరిచింది. మద్యలో నెహ్రూ కలుగజేసుకుని రాజీనామానైతే ఉపసంహరింపజేశాడుగానీ తిమ్మయ్యకు లభించాల్సినంత నైతికమద్దతు లభించలేదు.



తిమ్మయ్య గురించి కొన్నివిషయాలు క్లుప్తంగా- ఈయనది కర్ణాటకలోని కుడిగి జిల్లా. ఫీల్డ్ మార్షల్ కరియప్పకు దగ్గరి బంధువు. బంధువుల్లో చాలామంది సైన్యంలో పనిచేస్తుండటంతో చిన్నప్పటినుంచీ సైన్యంలో చేరటమే ఆశయంగా పెరిగాడు. సైన్యంలో చేరాక అత్యంత ప్రతిభావంతుడిగా గుర్తింపు పొందాడు. రెండవ ప్రపంచ యుద్ధంలో దళానికి కమాండర్గా నాయకత్వం వహించిన ఒకేఒక భారతీయుడీయన. బ్రిటిష్ ప్రభుత్వం నుంచి అవార్డు కూడా తీసుకున్నాడు. దేశవిభజన అనంతరం తెలెత్తిన ఉద్రిక్తత అల్లర్లకు దారితీసినప్పుడు పంజాబ్ ప్రాంతంలో చేసిన కృషికి ఇరువర్గాలనుంచి ప్రశంసలందుకున్నాడు. తరువాత కాశ్మీరులోయలో అనేక విజయాలకు నాయకత్వం వహించాడు. అక్కడి నుంచి రక్షణశాఖ ప్రధానకార్యాలయానికి బదిలీ అయ్యాడు. సర్వీసుమొత్తం నిజాయితీకి, నిబద్దతకు, క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచిన ఈయనంటే సైన్యంలో అందరికీ ఎంతో గౌరవం ఉండేది. సైన్యంలో ఉన్నన్నాళ్ళూ ఎవరిమీదా దురుసుగా వ్యవహరించిన సందర్భాలు లేవు. సహచరులంతా టిమ్మీ అని ముద్దుగా పిలుచుకునేవాళ్ళు. ఉత్తరాదివాళ్ళ ఆధిపత్యం ఎక్కువగా ఉండే సైన్యంలో దక్షిణాదివాడైనా అందరి గౌరవానికీ పాత్రుడయ్యాడు. ఇంతటి ఉన్నత విలువలు, ప్రతిభాపాటవాలు,  దేశభక్తి ఉన్నవ్యక్తి ఆర్మీచీఫ్ అయినరోజు భారతసైన్యం పులకించిపోయింది. సహజంగా ఇంతటి ఉన్నతస్థాయిలో ఎవరైనా రిటైర్ అయితే వాళ్ళకి తగుహోదా కల్పిస్తూ ఏదేశానికైనా రాయబారిగానో, సలహాదారుగానో నియమిస్తారు. కానీ ఈయనకి అలాంటివేమీ దక్కలేదు. కొన్నేళ్ళ తర్వాత ఐరాస సైప్రస్లో శాంతిని పునరుద్దరించేందుకు అక్కడికి పంపగా గుండేపోటుతో మరణించారు.

దేశం యుద్ధం వాకిట్లో నిలుచునే సమయానికి తగిన సన్నద్ధత లేదు. అంగబలం ఆర్థికబలం లేదు. కష్టకాలంలో తోడొచ్చే మిత్రులెవరూ లేరు. చైనా వాదనలకు సమానంగా ప్రవాదనలు వినిపించే అంశాలు లేవు. అదే సమయంలో మేజర్ జనరల్ బీ.ఎం. కౌల్ ను పదోన్నతిని కల్పిస్తూ రక్షణశాఖ డిల్లీకి బదిలీ చేసింది. ఈయన మీనన్కు సన్నిహితుడవడం ఇక్కడ కీలకమైన విషయం.

2 comments: