జ్వరం తగ్గింది

ఈమద్య నెలరోజులుగా డెంగూ, చికున్‌గున్యాలను మించిన జ్వరం ఒకటి ప్రపంచం మొత్తం వ్యాపించింది. మొదట్లో మనదేశంలో అంతప్రభావం చూపదనుకున్నా. ఇక్కడ మనోళ్లకి మరోజ్వరం ఉంది. కొత్తజ్వరం సీజన్ మొదలయినప్పుడొచ్చి అయిపోగానే తగ్గిపోతుంది. కానీ మనకున్న జ్వరం (అన్నట్టు ఈజ్వరం నాకూ ఉంది. స్కూల్లో ఉన్నప్పుడొచ్చింది. ఇన్నేళ్ళయినా తగ్గలా.) అంతతుగ్గా తగ్గదు.

నాఅంచనాలను తారుమారు చేస్తూ నెమ్మదిగా ఇక్కడా బలపడింది. రోగులకేసులు బానే నమోదయ్యాయని మీడీయాగణాంకాలూ చెప్పసాగాయి. ఈజ్వరాన్ని అదుపులోకి తెచ్చేపని వైద్యఆరోగ్యశాఖ చేతిలో ఉండకపోవడం మరోవిడ్డూరం. నాకు మొదట్నుంచీ ఇమ్యునిటీ ఎక్కువ. ఇంటర్ చదివేప్పుడు హాస్టల్లో అందరికీ కోడినక్క(చికెన్‌ఫాక్స్), చెన్నపట్నపుకన్ను(మెడ్రాస్‌ఐ) వచ్చినా నాజోలికి రాలేకపోయాయి. అందులో పాతజ్వరం కొంచెంబలంగా ఉంటే కొత్తజ్వరం పెద్దగా ఎఫక్టు ఇవ్వదుట.

నిన్నరాత్రి ఇస్పాను కప్పు ఎగరేసుకుపోవడంతో ఇకమనకు జ్వరంతగ్గొచ్చు. కానీ ఆదేశపోళ్లకి మరోరెండుమూడేళ్ళు తగ్గడం కష్టమే. ఫుట్‌బాల్ ఫీవర్ అనీ నెలరోజుల్నుంచి ప్రపంచంమీద పడి విచ్చలవిడిగా డాన్సేసింది. మామూలుగా కొత్తరోగమొస్తే డాక్టర్లకి, మందులషాపులోళ్లకి పండగ. కానీ ఈరోగంమాత్రం వ్యాపారవర్గాలకు, మీడియాకి పండగజేస్కోమంది. ఈరోగమొచ్చినోళ్ల ప్రవర్తన దాదాపూ నాబోటి క్రికెట్‌ పిచ్చోడిలానే ఉంటుంది. కాకపోతే చిన్నచిన్నతేడాలు. అన్నింటికన్నా ముఖ్యమైనది- “”నేను చిన్నప్పుట్నుంచి ఫుట్‌బాల్ మేచెస్ వాచ్ చేస్తుంటా. మానాన్న(లేదా తాత, బాబాయ్ వగైరా) చెప్పేవాడురా క్రికెట్ ఓసుత్తిగేమ్ అని.”” ఇలా ఉంటుంది వీళ్ళ యవ్వారం. లాటిన్‌కంట్రీస్, యూరోపియన్స్, అమెరికన్స్... అంటూ వీరసుత్తి ఓవైపు. అరగంటకోసారి ఆక్టోపస్ జ్యోస్యం నెట్లోవెతుక్కుంటూ మదనపడిపోతుంటారు. నోరుతెరిస్తే (మొన్నటిదాకా సచిన్, యువీ, సెహ్వాగ్ తప్ప ఇవేవీ తెలీనోడు.) మెస్సి, ముల్లర్ అంటూ మరోపక్క వాయింపు. ఒరేయ్!నీకు భైచుంగ్ భుటియా తెలుసా? అనడిగితే ఎవురూఊఊ? అనడుతారు.అదీ విషయం.

మొత్తానికీ ఈరోగాన్ని మనదేశంలో విజయవంతంగా వ్యాపింపచేసినందుకు మీడియావాళ్ల తెలివికి జోహార్లు. అబ్బయ్యల్లారా! మీకు ఆఆట నచ్చేస్తే చూసేస్కుని, మందేస్కుని చిందేస్కోండి. మద్యలో క్రికెట్ గురించెందుకు చెప్పు? నాకుమాత్రం నాక్రికెట్ గొప్ప. మేరాక్రికెట్ మహాన్. క్రికెట్ ఏదో నేలబారు ఆటయినట్టు అక్కడికేదో ఫుట్‌బాల్ మాత్రం పిచ్చక్లాస్ అయినట్టు విశ్లేషణలు చిరాకుపుట్టిస్తాయి.

ఎంతఇమ్యూనిటీ ఉన్నా ఇంతపెద్దజ్వరమ్ ఎఫెక్టు మినిమమ్ ఉంటుంది కదా. చిన్నచిన్న తుమ్ములు, దగ్గులు వచ్చాయి. మనోళ్లు ఎలానూ ఆడరుకాబట్టి ఎవరోఒకరికి మద్దతు ఇవ్వకపోతే థ్రిల్ ఉండదుగా. ఎవరెవరు ఆడతారో పట్టీచూశా. పాకిస్థానూ ఆడదట. మనసుకొంచెం స్థిమితపడింది. ఇంతలో ఐక్యరాజ్యసమితి, భారతదేశం విదేశాంగ విథానం వగైరాలు గుర్తొచ్చి రష్యాకే నామద్దతు అని ప్రకటించా. ఊహూ అదీ ఆడదు అన్నారు. ఏవిటీ రష్యా అంతదేశం, ఒలింపిక్సులో డజన్లకొద్దీ పతకాలని గెలిచేసే దేశమే ఆడదంటే మనం ఆడట్లేదని అంత'ఇది‌' కానవసరంలేదని నిశ్చయిమ్చుకున్నా.
మొన్న మూడోస్థానం కోసం జరిగిన మాచ్ చూద్దామని కూర్చున్నా.చుట్టూ వ్యాధిముదిరిన రోగులు. "కామెంట్రీ ఎవర్రా? బాయ్‌కాటా?గవాస్కరా?" ఇది నామొదటిప్రశ్న. "ఇందులో కామెంట్రీ ఉంటుందికానీ అంత ఇంపార్టెంట్ కాదు." అన్నాడొక రోగి. బూఊఊఊ మంటూ బూరలు. ఊదుతూనే ఉన్నారు. ఆగోలలో కామెంట్రీ వినిపిస్తేగా. అదేక్రికెట్తయితే కళ్ళుమూసుకుని కామెంట్రీవిన్నా మాచ్ అర్థమైపోతుంది.

ఇంతలో రెఫరీ ఝెండాచూపాడు. అది అటు పసుపూ ఇటు ఎరుపూకాకుండా రెండూకలిసి చెస్‌బోర్డులా ఉంది. అదేంట్రా? అని అడితే ఆఫ్‌సైడ్ అన్నాడు. "అదేంటి ఆఫ్సైడు, ఆన్సైడుకి సిగ్నల్సు? మాక్రికెట్లో ఇలాంటివేమీ ఉండవు. ఎటైనా కొట్టుకోవచ్చు." అన్నా. ఒకడి చొక్కామీద ఫ్రెడరిక్ అని ఉంది. వాడు జర్మనీవాడు. ఉరుగ్వేజట్టులో వాల్టేర్ అని ఇంకోడున్నాడు. ఆహా 'వోల్టేర్ అండ్ ఫ్రెడరిక్ దిగ్రేట్' ఇద్దరూ ఆడుతారా? అనడిగా. ఎవడో ముల్లర్ గాడుట గోల్ కొట్టాడు. అబ్బో మాక్స్‌ముల్లర్ కూడా ఫుట్‌బాల్ ఆడుతాడా? వాడిని ఫుట్‌బాల్ని కొట్టినట్టు కొట్టాలి అనుకుంటుంటే మావాడు "వాడీపేరు మాక్స్‌ముల్లర్‌కాదురా. థామస్‌ముల్లర్‌" అని చెప్పడంతో ఆలోచన విరమించా. ఇంతలో చిన్నడౌటొచ్చి వాడిపక్క తిరిగా. అప్పటికే నాతో విసిగిపోయాడు. మామూలుగా జ్వరమొచ్చినోడికి సహనం తక్కువకదా. (పేషేంట్స్‌కి పేషెన్స్ తక్కువ.) కానీ చూసేటీవీ నాది. కాబట్టి భరించక తప్పదు. "ఒరేయ్ గ్రీస్ ఆడుతుందా?" అని అడిగా. ఏం అన్నాడు. "ఏంలేదుబే గ్రీస్ టీంలో అయితే ఆర్కిమెడీస్, సోక్రటీస్, హెరిడేటస్, పైథాగరస్‌లను చూడొచ్చని" అన్నా. "నిన్ను తీస్కెళ్ళి శ్రీలంకటీంలో పడేస్తా. అక్కడైతే రావణుడు, కుంభకర్ణుడూ, ఇంద్రజిత్తూ ఉంటారు.” అన్నాడు. ఇంతలో మాచ్ ముగిసింది. నేననుకున్నట్టే జర్మనీ గెలిచింది. నేను మొదట్నుంచి జర్మనీ గెలవాలనుకున్నా. కనీసం ఇదిగెలిచాకయినా ఆనోరులేని ఆక్టోపస్‌ని చంపాలన్న ఆలోచన మారుతుందని. మావాడు వెళ్తూవెళ్తూ "ఆదివారం రాత్రి ఫైనల్. నువ్వు రూంలో ఉండొద్దు. తాళాలిచ్చి ఎక్కడికైనా వెళ్ళిపో." అన్నాడు.

ముందే చెప్పాగా టీవీ నాదని. దాంతో ఫైనల్కి వాడువేరేటీవీని వెతుక్కుని వెళ్ళిపోయాడు. మరో ఇద్దరుముగ్గురొచ్చారు ఫైనల్ చూసేందుకు. నాకూ కొంచెంజిల పుట్టింది. ఎంతైనా ఫైనల్ కదా.  ప్రారంభోత్సవంలో ఎటుచూసిన కనిపిమ్చిన నల్లమొహాలు ఈసారి మాయమయ్యాయి. ఇప్పుడంతా తెల్లపిల్లలే. వార్నీ ఇన్నిరోజులూ సూక్తువల్లిస్తూ వ్యాపారంచేసి ఇప్పుడేమో ఇలా. ఒకపక్క ఇస్పాను మరోపక్క ఆరెంజ్‌ఆర్మీ. ఫైనల్ కొంచెం చిరాకేసింది. వీళ్ళాఫైనలిస్టులు అనిపించింది. హాలెండువాళ్ళు గోల్స్ కోసంకాక యెల్లోకార్డులకోసం ఆడుతున్నారు. ఏదో అనుకున్నా కానీ ఫైనల్ అంత థ్రిల్లింగా లేదు. మూడోస్థానంకోసం జరిగిందే చాలాబెటర్ అనిపించింది. టీవీకట్టేసి పడుకున్నా. ఉదయం లేచిచూస్తే స్పెయిన్ గెల్చిందట. ఏదో ఫైనల్‌కి చేరారు. ఒకగోల్ కొట్టారు. కాబట్టి గెలిచారు. అంతేతప్ప 'విజేత‌' అనిపిమ్చలా. అంతా మనమంచికే జరిగింది. మాచ్ మరీఇంటరెస్టింగా ఉంటే నాక్రికెట్‌కి ద్రోహం చేసెయ్యను. మరోసారి గాట్టిగా మేరా క్రికెట్ మహాన్.

12 comments:

  1. తగ్గిందా జ్వరం?
    భలే

    ReplyDelete
  2. బావుంది మీ టపా
    నేను కూడా జ్వరం నుండి ఈరోజే కోలుకున్నాను :)
    extra time action మిస్ అయ్యారు
    రిఫరీ కి మాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇవ్వాలి :)

    ReplyDelete
  3. వాకాడు పోరగాడా...నీకు తెలియదని కాదు కానీ హమారా కిర్కెట్ కాదు అది తెల్లవాడిది.... హమారా చెస్(అదే) చదరంగం మహాన్ అను.... కిర్కెట్ మనది కాదు... అది ఇంకా పెద్ద జబ్బు....త్వరలో బయటపడు....Siva Kumar.Kolanukuduru

    ReplyDelete
  4. కనీసం ఒక నెలైనా, క్రికెట్టు దరిద్రం వదిలినందుకు,ఎంత సంతొషంగా ఉందో! మళ్ళీ, టి.వి.ముందుకూర్చొని, శ్రీలంక తో మ్యాచ్చులు చూడాలి కాబోలు! ఖర్మ!!

    ReplyDelete
  5. @కొత్తపాళీ: నాకు వచ్చింది జ్వరంకాదులేండి. జస్ట్ తుమ్ములు దగ్గులే.:)
    @‌హరేకృష్ణ: ఎక్స్‌ట్రాటైం దాకా చూస్తేకదా.
    @ శివన్న: :)
    @ హరేఫల: శ్రీలంకతో మాచ్ హహహహ

    ReplyDelete
  6. అంత బాధ పడుతూ చూడకపోతే ఎమయ్యింది మాస్టారు?

    ReplyDelete
  7. @ మేడమ్: అదోతుత్తి. నేనూ జనజీవన స్రవంతిలో కలిశానని చూపించుకోవడం. ఉదయాన్నే ఎవడైనా మాచ్ గురించి మాట్లుడుతుంటే మనం ఏమీతెలీనట్టుగా కూర్చుంటే హన్నన్నా! ఎంత సిగ్గుచేటు.

    ReplyDelete
  8. హ హ హ హరేకృష్ణ గారన్నట్లు extra time action miss అయ్యారు మీరు అది కూడా చూసి వుంటే ఈ రోజు పొద్దుటే అందరికి వేదాంతపు నవ్వొకటి విసిరి చెప్పేవారు నవ్వినా ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయి ఏ కనీటెనకాల ఏముందో తెలుసుకో అని (మరి నిన్న ఇద్దరూ ఏడ్చే రు కదా)

    ReplyDelete
  9. ఆయ్...మాక్కూడా తుమ్ములు, దగ్గులేనండి అప్పుడు. కాకపోతే ఇప్పుడు తుమ్ముతే మళ్లి నాలుగేళ్ల వరకు దగ్గే అవసరం ఉండదని అలా పేషంట్‌గా పడి ఉండిపోయాను.... :D

    మేరా క్రికెట్ మహాన్...

    ReplyDelete
  10. "పాకిస్థానూ ఆడదట. మనసుకొంచెం స్థిమితపడింది." - :)
    బజ్జులో రామరాజు భాస్కర్ గారు నాకు అంటించారీ జొరాన్ని.

    ReplyDelete
  11. @రాయబోయే అజ్ఞాతగారు: కనీసం ఇక్కడైనా పేరురాయొచ్చుగదా?

    ReplyDelete