పుట్టాక పాతికేళ్ళు వచ్చేదాకా నిన్నుచూడలేదు. మొదటిసారి నిన్ను చూసినప్పుడు కలిగిన ఉద్వేగం దాదాపూ ప్రతిఒక్కరి జీవితంలో కలిగేదే. లోకం తెలిశాక ప్రతి ఒక్కరికీ ఎదురయ్యే నిరీక్షణే. కాకపోతే ఎదురొచ్చాక ఎవరికి వాళ్ళకి అదొక ప్రత్యేకమైన క్షణం. అది ఫలానా అని చెప్పగలిగే స్థితిలో కొద్దిమంది ఉంటారు. కానీ వాళ్ళు ఎంత విడమరచినా పదోవంతుకూడా ఉండదు.
నాజీవితానికొక గౌరవం, నామీద నాకు నమ్మకం వచ్చిందంటే అది నువ్వు నాపక్క నిలబడ్డాకనే. నిన్ను అలా అరచేతిలోకి తీసుకుని ఎప్పటికీ ఉంచేసుకొవాలని నేను పడే తపన నీకుకూడా తెలుసు. నువ్వు ముద్దుగా బొద్దుగా రెండుచేతులా సరిపోయేంతగా ఉంటే చూడాలని కలలుగనే నాకు ఎప్పుడూ నిరాశే. డైటింగులు, జీరోసైజులంటూ బక్కచిక్కిన నిన్నుచూస్తే నీమీదకన్నా నామీద జాలేస్తూ ఉంటుంది. సరే అలాగైనా నిన్ను ఏలుకుందాం, కలకాలం దాచుకుందా అనుకుంటే నువ్వేమో వేళ్ళసందుల్లోంచి జారిపోతావు.
తాతకి, నాన్నకి, మావలకి కూడా ఆవయసులో ఎదురైన అనుభవమే ఇది. అప్పుడప్పుడూ వాళ్ళజ్ఞాపకాలను తడిమిచూసుకుంటుంటే వినేవాడిని. నాకు అర్థమయ్యేంత వయసు రాలేదని అనుకునేవాళ్ళు. అదినిజమేననుకో. కాకపోతే నువ్వు జీవితానికి చాలా ముఖ్యమైన దానివని మాత్రం అర్థమయ్యింది. అప్పట్లో నీగురించి ఎన్నోఫాంటసీలు ... రంగురంగుల్లో ఈస్ట్‌మన్ కలర్లో, టెక్నికలర్లో, డిజిటల్ ఎఫక్ట్స్‌తో అబ్బబ్బా... ఆరంగులే వేరు. కానీ మొదటిసారి నువ్వు నాదగ్గరకి వచ్చిన క్షణం అర్థం అయ్యింది నువ్వు నేను ఊహించుకున్న దానికన్నా భిన్నమైన దానివని. కొన్ని ఎంతోగొప్పగా, మరికొన్ని అసహనం కలిగించేవిగా, ఇంకొన్ని చిత్రవిచిత్రంగా... నీమీదనేకాదు ఈప్రపంచం మీద నాకున్న కొన్ని అభిప్రాయాల్ని క్షణాల్లో తుడిచేసి నన్ను మార్చేసిన ఘనత నీదే.
ఇంతకముందు విన్నదానికి, ఊహించుకున్నదానికి భిన్నంగా ఎదురొచ్చి నిల్చున్న నిన్ను చూస్తే ఒక్కసారి నన్నునేను అద్దంలో చూసుకున్నట్టు అనిపించింది. పెద్దోళ్ళు వయసులో ఉన్నప్పుడు మొదటిసారి చూసేటప్పుడు ఎదురెదురుగా చూస్కునే వాళ్ళంట. వాళ్ళపెద్దవాళ్లకీ చూపించి సంబరపడే వాళ్ళంట. రోజులు మారిపోయాయి. లోకం మారిపోతుంది. బంధాలూ మారుతాయి. అంతే. మనం వద్దన్నా..ఒప్పుకోకున్నా మనమూ మారతాం. కాకపోతే మారామన్నది తెలుసుకునేదానికి సమయం పడుతుంది. మన విషయంలోనూ అదేజరిగింది. నిన్ను ఎదురుగా చూడలేక, అరచేతుల్లోకి తీసుకుని ముద్దాడలేక తెరమీద ఉన్న నిన్ను తడుముకుని మురిసిపోయినప్పుడు తెలిసొచ్చింది జీవితం ఎంతయాంత్రికమైపోయిందో.
ఎప్పుడూ ఒంటరిగానే వచ్చేదానివి అప్పుడప్పుడూ చెలికత్తెలని, తోబుట్టువుల్ని వెంటబెట్టుకొస్తావు. అదేవిటొ నీమీద ఉన్న మమకారంవల్లనో, వాళ్ళతో ఉన్న బంధుత్వం వల్లనో నాకు ఇరుకైనట్టుగా గానీ ఇబ్బందిగాగానీ అనిపించదు. కానీ వాళ్ళు నన్నొదిలి వెళ్ళేటప్పుడు కూడా బాధకలగడం ఒకింత నవ్వొచ్చే విషయం.
నాకున్న ఒకేఒక్క కోరిక నువ్వు నాదగ్గరే కలకాలం ఉండిపోవాలి. కానీ నువ్వేమో నాచేతుల్లో కరిగిపోతావు, వేళ్ళసందుల్లోంచి జారిపోతావు, నామీద అలిగి వెళ్ళిపోతావు. వెళ్ళొద్దని నీచెయ్యిపట్టుకుని బ్రతిమాలితే "నిన్ను ఉద్ధరించడానికే...నిన్ను సుఖపెట్టడానికే..నిన్ను సంతోషపెట్టడానికే..." అంటూన్న నిన్నుచూస్తే నాలోని స్వార్థం వెయ్యిపడగలతో బుసకొడుతుంది. నువ్వు ఎక్కడికీ వెళ్ళకుండానే నాకు అన్నీ జరిగిపోవాలని శతవిధాలా ప్రయత్నించినా ఒకవెర్రినవ్వు నవ్వేసి నీపని నువ్వు చేసుకుంటానంటావు. వెళ్ళిపోయావని తెలిశాక కలిగేబాధ అనుభవించేవాడికొక్కడికే తెలుసు. "ఎక్కడికెళూతుందిరా? మళ్ళీ వస్తాదిలే" అని మనసుకు నచ్చజెప్పటం,నామాట విని తల ఊపెయ్యటం నాకూ మనసుకూ అలవాటైపోయింది. అలా రోజుల తరబడి, వారాల తరబడి ఎదురుచూస్తే వరదబాధితులకోసం హెలికాప్టర్ వచ్చినట్టు ఒక్కసారి చెయ్యూపి వెళ్ళిపోతావు. ఇనప్పెట్టెలో బంధించి నాదగ్గరే ఉంచుకోవాలని నాకున్నా నిన్ను విశాలప్రపంచంలోకి షికారు చెయ్యించాలనుకునే సూచీల బలం ముందు చేతగాని వాణ్ణవుతాను. ఆక్షణం నువ్వు చూసేచూపుకి తలదించుకుని నిలబడటం కన్నా ఏమీచెయ్యలేను.
నెలల్లోకెల్లా ఉత్తమమైన నెల ఫిబ్రవరి. దీనికి ఇరవైఎనిమిదింపావు రోజులే ఉంటాయి. మిగతా నెలకంటె జీతండబ్బులు రెండురోజులు ముందేపడిపోతుంది. మరో ఐదురోజుల్లో మనఒళ్ళో వాలిపోయే నెచ్చెలి ఇచ్చే వెచ్చటికౌగిలికోసం ఎదురుచూస్తూ మరో నాలుగు ఒంటరిరాత్రులు సాగదీయాలి. ఈసారైనా ఎక్కడికీ పోనీకుండా కట్టిపడేద్దామంటే ఆదయపుపన్ను వాళ్ళు సేవింగ్స్ అడుగుతున్నారు. దాచిపెట్టుకోవడం సేవింగ్ కాదుట! వీళ్ళకి అర్థమయ్యేలా చెప్పేదెలా? బేతాళుడు మళ్ళీ ఎక్కేస్తాడు.