శరద్ చంద్రికోత్సవం

ఇది మూడువారాల కిందటి సంగతి. అయినా ఈరోజు రాస్తున్నాను అంటే ఇంతకాలం కుదర్లేదు అని అర్థం అయుంటుంది. ఇన్నిరోజుల తరువాత కూడా గుర్తుపెట్టుకుని రాస్తున్నాను అంటే విషయంలో మాంచివిషయం ఉంది అన్నసంగతికూడా అర్థం చేసుకున్నారు కదా. ఇక విషయానికి వస్తే

అది అక్టోబర్ మూడోతేదీ శనివారం ( ఆశ్వయుజ శుద్ధ చతుర్దశి). మద్యాహ్నం మూడుకావస్తోంది. బిపిన్‌చేతిలో ఏదో కరపత్రం. విషయం అడిగితే శరద్‌చంద్రికోత్సవ్ అన్నాడు. విజయదశమి తరువాత వచ్చే పున్నమిరోజు ఈఉత్సవాన్ని చేస్తారట ఈప్రాంతంలో.

ఇక్కడ శరదృతువు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. అందరూ వసంతం అంటారు గానీ నాకుమాత్రం శరదృతువు అంటే చాలా ఇష్టం. వసంతఋతువులో చెట్లుచిగురించును, కోకిల పాడును అని పుస్తకాల్లో చదవటమేగానీ ఎప్పుడూ చైత్రవైశాఖాలు గ్రీష్మంలానే ఉంటాయి. అదేశరదృతువైతే అప్పటికే వానలు కురవడంతో ( ఇదికూడా గతకాలపు జ్ఞాపకాలే) చల్లగా అలాగని మరీ హేమంతశిశిరాల్లా చలీ ఉండదు. పైగా దసరా, దీపావళి మొదలైన కాబినెట్‌ర్యాంకు పండుగలు వచ్చేదీ ఈఋతువులోనే. దసరాకి రిలీజైన కొత్తసినిమాలు క్లిక్ ఐతే సీజనుమొత్తం బిజీ.

ఆరోజు సాయంత్రం నుంచి ఆరుబయట రంగస్థలాలు ఏర్పాటు చేసి సంగీత-సాహిత్య-నాట్యాల ప్రదర్శనలు ఇస్తారు. మాటౌన్‌షిప్‌లో దాదాపు పదిహేనేళ్ల నుంచి నిర్వహిస్తున్నారట. ప్రతిసారిలాగే ఈసారికూడా మాశివాలయమే వేదిక. "నువ్వువస్తావా" అన్నాడు. కొద్దిగా అలోచిస్తుంటే "మద్యలో రెండుసార్లు ప్రసాదాలు" అని అనటం అందుకు ఒకమిల్లీసెకను రియాక్షన్‌టైమ్‌లో సరేననటం జరిగిపోయాయి.

సాయంత్రం భోజనాలు ముగించి త్వరగా వెళ్ళి కూర్చుందాం అంటే ఎప్పటిలాగే చిన్నచిన్న బాతాఖానీలు.

అక్కడికివెళ్లేసరికే

ఇంకాపూర్తిస్థాయిలో మొదలయినట్లులేదు. జనాలు అటుఇటూ కదుల్తూనే ఉన్నారు.
ఇంతలో కేరళసంప్రదాయనృత్యం మోహినీఆట్టం. ఇద్దరుయువతులు 'ఫిలాసఫీఆఫ్‌లైఫ్' అన్న విషయంపై ఒక నృత్యరూపకం ప్రదర్శించారు. ఎందుకో అదిసాగుతున్నంతసేపు మనసులో "మౌనమే నీబాస ఓమూగమనసా" పాడుకుంటూ ఉన్నా. ఇంకో రెండురూపకాల తరువాత వాళ్లకి సన్మానం. ఒక పెద్దాయన (పేరుగుర్తులేదుకానీ 'పద్మశ్రీ'), ఆయనకుమార్తె, వాద్యబృదం మొత్తంకలిపితే పదిమంది ఎక్కడో కేరళనుంచి వచ్చారు.


అప్పటికి జనాల్లో కొంతమంది కార్యక్రమాలు తమ 'అంచనాల'ను చేరకపోవటంతో నెమ్మదిగా వెనుదిరగటం ప్రారంభించారు. పదినిముషాల తరువాత గోల కొద్దిగా సద్దుమణిగింది.


తరువాత హిందుస్తానీ సంగీతం 'పద్మవిభూషణ్ గిరిజాదేవీ' ( ఈమె పేరువినని వాళ్లకి చిన్నమాట. దక్షిణాదిలో ఎమ్మెస్ సుబ్బులక్ష్మి ఎలానో ఉత్తరాదివాళ్లకి ఈమె అలా.) ఆరోజు ఉజ్జయినిలో కచ్చేరీకి పోవల్సినామె అంతదూరం ప్రయాణం కష్టం అనడంతో, మావాళ్లు ఒప్పించి తీసుకొచ్చారు. మా సహోద్యోగుల్లో కొంతమంది చెల్లెల్లు, భార్యలు, పిల్లలు ఆమెకి శిష్యులట. బ్రహ్మాస్త్రంగా వాళ్లని ప్రయోగించారు ఒప్పించేందుకు. ఎనభైఒక్క సంవత్సరాల వయసు తాలూకు అలసట ఆమెగొంతులోగానీ, ఆహార్యంలోగానీ కనిపించలేదు. ఆమెవయసు తెలిశాక పక్కన ఉన్న విజయ్‌గాడు "జాక్సన్‌గాడు కుప్పిగంతులేసి యాభైఏళ్లకే కళ్లుతేలేస్తే ఈమెనిచూడరా!" అన్నాడు. ఇంతలో నిర్వాహకుడు పాండేగారు మైక్‌ అందుకుని "జాక్సన్‌ ఆత్మశాంతికోసం రెండునిముషాలు మౌనం." అనటం కాకతాళీయం.


కొంతసేపటికి శరదృతు కోకిల గొంతు సవరించుకుంది. మహదేవున్ని ధ్యానిస్తూ మొదలుపెట్టిన కొద్దినిముషాలకి జనాల్లో కలిప్రభావం దూరమైంది. ఒకకృతి మాటౌన్‌షిప్‌లోని పాతశిష్యబృదంతో కలిసి పాడిన తరువాత, ఆమెవెంట వచ్చిన వాద్యబృదంతో కొనసాగించింది. ఒక్కటి, ఇంకొక్కటి, మరొక్కటి అలా మేము అడగటం ఆకోకిల కొమ్మలను దాటినంత సులువుగా రాగాలు మార్చటం. ఆరెండుగంటలు ఎలాసాగిందో పున్నమిచంద్రుడికే తెలియాలి. కృతిమద్యలో ఆమె ఆపినప్పుడు (ఉద్దేశ్యపూర్వకంగా) శిష్యులలో ఒకరివైపు చూడటం, వెంటనే వాళ్లు అందుకోవటం. సరిగా కొనసాగిస్తే చిన్న చిరునవ్వుతో ఆశీర్వాదం. తడబడితే చూపుతోనే చిన్నమందలింపు వెంటనే తనే స్వయంగా అందుకోవడం. శిష్యులు నాలుక్కరుచుకుంటూ ఒకరిమొహాలు ఒకరు చూసుకొని నవ్వుకోవడం. చివర్లో ఆమెమాటలు " చిన్నప్పుడు నాగురువు పాడించాడు. తరువాత నాశిష్యులు పాడిస్తున్నారు. నేను నిమిత్తమాత్రురాలిని."

ఇంతలో ఆరతిసమయం అయింది. దానితరువాతే ప్రసాదం అన్నవేగులసమాచారంతో కదనోత్సాహంతో ఉరికి రెండుకప్పుల ఖీర్, నాలుగులడ్లు, దోసెడు నమ్కీన్ ఎత్తుకుని వచ్చికూర్చున్నా.


తరువాత ప్రదర్శన గ్రామీఅవార్డుగ్రహీత, పద్మశ్రీ విశ్వమోహన్‌భట్ గారి 'మోహనవీణ'. గిటార్‌లోని తంత్రులలో మార్పులుచేసి అందులో వీణానాదం వచ్చేలా చెయ్యటం ఆయన ప్రత్యేకత. అలా మార్చినగిటార్‌కి మోహనవీణ అని పేరుపెట్టుకున్నారు. అర్థరాత్రి పన్నెండున్నరపైన మొదలైన స్వరవిలాసం మూడుదాకా సాగింది. ఆయనకు తోడుగా వచ్చిన తబలావిద్వాంసుడు( పేరుగుర్తులేదు. ఉస్తాద్ బిరుదు ఉంది.) కూడా బాగాపేరున్నవాడే. వాళ్లిద్దరూ వాళ్లకి మాత్రమే అర్థమయ్యేభాషను అందరికీ అర్థమయ్యేరీతిలో మాట్లాడుకున్నారు.


ఇంతలో పాండేగారు వచ్చి ప్రేక్షకుల్లోని కొంతమందిని పిలిచారు. వాళ్లది మాటౌన్‌షిప్‌కాదు. ఇక్కడినుంచి దాదాపు యాభైమైళ్లదూరంలోని సీధీఅనే పట్టణం చేరి అక్కడినుంచి ఇంకో పదికిలోమీటర్లు బస్సు ఆపై కొండల్లో నడుచుకుంటూ పోతే వాళ్లగూడెం. అంతదూరం వచ్చిన ఇలాంటి కళాభిమానులచేత సన్మానం చెయ్యించుకుంటేనే మీ కళకి నిజమైన గుర్తింపు అనడం, భట్‌గారు చిరునవ్వుతో ఒప్పుకోవటం జరిగాయి. కొద్దినిముషాలపాటు ఉద్వేగం నింపిన సంఘటన ఇది. చివరగా తనకు గ్రామీని సంపాదించిపెట్టిన రాగాన్ని వాయించాడు.

అప్పటికి మూడయ్యింది. నెమ్మదిగా కళ్లుమూతలు పడుతున్నాయి. ఇంతలో మళ్లీ ఆరతి అన్నారు. అంటే మళ్లీ ప్రసాదం. భల్లేభల్లే అనుకుంటున్న నాదగ్గరికి వేగులు చేదువార్తతో ఎదురొచ్చారు. రెండుసార్లు ఇచ్చేందుకు తెచ్చిన ప్రసాదం మొదటివాయకే ఆవిరైపోయింది. "ఇది దారుణం. ప్రసాదాన్ని సరిగా అంచనా వెయ్యలేక పోతే ఎలా? ఇదిపౌరహక్కులకు భగం. అరవైనాలుగు కళల్లో ఇది ఇరవైనాలుగోది. శరద్‌పూర్ణిమ రోజు కళాకారులకి జరిగిన అన్యాయం. శక్తిరూపమైన జీర్ణశక్తితో ఆటలాడుతారా?" అంటూ ప్రశ్నించబోయిన నేను" ఒక్కసారి నువ్వు ఇందాక తిన్నప్రసాదం కాదుకాదు అర్థరాత్రి నాస్తా గుర్తు తెచ్చుకో?" అన్న మాటలతో మిన్నకుండిపోయా.


ఇంతలో ప్రముఖ హిందుస్తానీ గాయకులు రాజన్-సాజన్‌ సోదరద్వయం గొంతువినడంతో వచ్చి నాస్థలంలో కూర్చున్నా. అప్పుడు మొదలుపెట్టిన లలితసంగీతం ఉదయం ఆరువరకు సాగింది. నేనుమాత్రం ఐదున్నరకే ఇంటిముఖం పట్టాను.
అక్కడకూర్చుని ఎలాంటినొప్పితెలీకుండా ఆస్వాదించాం. ఇంతమంది ప్రముఖులను ఒప్పించడం, వాళ్లకి, తోటిబృందానికి సౌకర్యాలు కల్పించడం, గౌరవాలకి భగంకలుగకుండా చూసుకోవడం ఎంతకష్టం. నిర్వాహకుల అంకితభావానికి నిజంగా నిజంగా చేతులెత్తి నమస్కరించాలి.


ఈజీవితానికి సరిపడా జ్ఞాపకాలతో నిద్రలోకి జారుకున్నా. ఇప్పటికి ఎన్నోరాత్రులు జాగారం ( శివరాత్రికి కాదు.) చేశాను. కొన్నిసార్లు పరీక్షలకి, ఇంకొన్నిసార్లు సినిమాలు చూస్తూ, మరికొన్నిసార్లు ఇంటర్‌నెట్. కానీ ఆరాత్రిమాత్రం ఎక్కడా మనసులో అలసట, కళ్లలో నిద్ర, ఒంట్లో నిస్సత్తువ అన్న మాటేలేదు. ఎనిమిదికి లేచి టిఫిన్ చెయ్యటానికి వెళ్తే నిద్రలేమి లక్షణాలేలేవు. ఏవిటో మాయ.